మనసులోని మనసా… 4

2
8

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఒ[/dropcap]క్కోసారి కొన్ని ప్రదేశాలకి అందరితో కలిసి వెళ్ళనే కూడదు. దేన్ని ఆశించి మనం వెళ్తున్నామో ఆ ఆనందాన్ని కోల్పోవడమే కాకుండా మరింత దుఃఖాన్ని మోసుకొచ్చుకున్న వాళ్ళ మవుతాం.

మౌనంగా ఆస్వాదించాలనుకున్న అందాలు, ఆనందాలు ‘హరీ’మంటాయి. అసలెందుకు ఆయా ప్రదేశాలకి వెళ్తున్నాం అని ముందు మనల్ని మనం ప్రశ్నించుకుని బయల్దేరాలి. ముఖ్యంగా ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడానికి వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత మౌనంగా వుండాలని, ఎవరికి వారు ఆ అందాన్ని జుర్రుకోవాలన్న జ్ఞానం వుండదు. ఏ షాపింగ్ మాల్‌కో, సంతకో వెళ్ళినట్టుగా వచ్చేస్తారు. అక్కడి వాతావరణాన్ని కలుషితం చేసేస్తారు.

వైజాగ్‌లో సర్వీసులో చేరిన కొత్తలో నేను మొదటిసారి అరకు వేలీ చూశాను. ముందు అనంతగిరి వెళ్ళాము. అది నిజానికి కార్తీక మాసం. ఆఫీసు వారు ఎరేంజ్ చేసిన ట్రిప్. అప్పుడు మా అమ్మగారు వచ్చారు. ఆవిడ చూస్తారని తీసుకెళ్ళాను. అక్కడ భోజనాలు, కబుర్లు, కొందరు పేకాటరాయుళ్ళ పేకాటలు ముగిసాక అరకు వెళ్ళాం. బస్సు ప్రయాణం. ఘాట్ రోడ్డు ప్రయాణం బాగానే జరిగింది కానీ నాకంత సంతృప్తి యివ్వలేదు. ఆఫీసువాళ్ళ ట్రిక్ కాబట్టి అంతా ఆఫీసు కంపు కొట్టింది. జీవోల గురించి, ఎమెండ్‍మెంట్స్ గురించి, రోడ్ల గురించి (మేం వేసినవే కాబట్టి) మాటలతో నాకు చిరాకెత్తింది.

అందుకని విడిగా అరకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదీ వెళ్ళేడప్పుడు ట్రెయిన్‌లో. నిజంగా చూసి తీరాల్సిన ప్రయాణం. నేను ఇతర రాష్ట్రాలలో అంతగా తిరగలేదు. అన్నీ ఆంధ్రాలోనే చూశాను. అందుకని రైల్లో అరకు ప్రయాణం నాకు అమితానందం యిచ్చింది. ఆ కొండ కొసకు ఈ కొండ కొసకు ముడివేసినట్లుగా సస్పెన్షన్ బ్రిడ్జ్‌ల మీద రైలు నడక సాగిస్తుంటే క్రింద అగాధమైన లోయలు, సరాసరి కంపార్ట్‌మెంట్‌లోకి వచ్చి సరసమాడే మబ్బులు, చుట్టూ తివాచీలు పరిచిన పచ్చదనం – దూరాఅన నీలిరంగులో మెరిసే కొండలు, చల్లని గాలులు – మనసు పరవశించిపోతుంది. ఆ టైమ్‌లో మాట్లాడిస్తే నాకు చాలా చిరాకుగా ఉంటుంది. అయితే నేను మళ్ళీ చేసిన పొరపాటేమిటంటే నాతో పాటు కొంతమంది స్నేహితులు వాళ్ళ కుటుంబాలతో వస్తామంటే ‘సరే’ననడం. అవకాశమున్నప్పుడు నాతో పాటూ మరికొంత మంది చూడడం నాకు సంతోషం కలిగించే విషయం. అలా చాలాసార్లు కొంతమందిని కొన్ని చోట్లకి తీసుకెళ్ళాను.

అలాగే ఈ ట్రిప్ కూడా.

నేను ఆర్ అండ్ బి లో పని చేస్తున్నాను కాబట్టి నాకు అక్కడ మా గెస్ట్‌హౌస్ ఇచ్చారు.

దారి పొడుగునా ఎన్నో అంచాలు చూస్తూ అడుగడుగునా వస్తున్న టన్నెల్స్‌లో కంపార్ట్‌మెంట్‌లో చీకటి అలముకోగానే కేరింతలతో రైలు సాగుతోంది. ఇండియన్ రైల్వేస్‌లో ఎత్తయిన శిమిలిగూడ స్టేషన్ దగ్గర ‘U’ షేప్‍లో వెళ్ళే రైలు ఎంతగానో థ్రిల్ కలిగించింది. సాయంత్రం చిరుజల్లులలో రైలు దిగేం.

డిపార్టుమెంటువారు ఔదార్యంతో పంపిన వెహికల్స్‌లో అందరం గెస్ట్‌హౌస్ చేరుకున్నాం.

ఇప్పుడిక మొదలయ్యింది అసలు సందడి.

గెస్ట్‌హౌస్ వి.ఐ.పి.ల కోసం నిర్మించినది. చాలా అందంగా వుంది. అందమైన కర్టెన్స్, ఖరీదైన సోఫాలు, మూల కార్నర్ టేబుల్స్ మీద పెట్టిన గిరిజనులు తయారు చేసిన అందమైన బొమ్మలు, గ్లాసు కిటికీల్లోంచి కనిపిస్తున్న కదిలిపోతున్న మేఘాలూ – పరవశిస్తున్న మనసు కింద పంటి కింద రాళ్ళలా నా తోటి వారు చేస్తున్న ఆగడాలు!

ఒక్క నిముషంలో బయట వర్షంలో తిరిగిన చెప్పులతో లోపలికి వచ్చేసి అప్పటిదాక మెరుస్తున్న అందమైన ఫ్లోరింగ్‌ని బురదమయం చేసేశారు. టవల్స్ తెచ్చుకోకుండా విండో కర్టెన్స్ లాగేసి పిల్లలకి స్నానం చేయించి ఒళ్ళు తుడిచేశారు.

గోల గోల చేస్తూ అక్కడ పెట్టిన బొమ్మల్ని తీసేసి ఇష్టం వచ్చినట్టు ఆడేస్తున్న పిల్లల్ని వారించలేదు.

ఇంతలో నాకు మా డిపార్టుమెంటు వారు మర్యాదపూర్వకంగా పంపించిన భోజనం క్యారియర్ చూసి, ‘మాకేది?’ అని ఆయన్ని అడగడంతో నేను “దయ చేసి భోజనం పంపద్దు. హోటల్లో భోం చేస్తాము” అని చెప్పాను. కానీ… వాళ్ళు నా బాధ అర్థం చేసుకుని మరలా ఇంకో క్యారియర్ పంపించారు. ఇక తిన్న ప్లేట్ల గురించి చెప్పలేను.

నేను అప్పటికే ఆ లోయల్లో పడిపోయాను.

మర్నాడు నిరుత్సాహంగానే బొటానికల్ పార్క్‌కి బయల్దేరాను వాళ్ళతో పాటుగా.

చలికాలం కావడంతో గార్డెనంతా గులాబీలు విచ్చుకుని తలలూపుతున్నాయి. ఎన్ని రంగులో! ఎంత అందమో!

చప్పబడిన మనసు గాలి వూదిన బెలూన్లా అయ్యింది. కాని ఆ పరవశం ఎంతోసేపు వుండలేదు.

వీళ్ళు తోటల్లో ముష్కరుల్లా ఎగబడి, పూలు కోయకూడదన్న నియమాన్ని ఉల్లంఘించి, మాలి హెచ్చరిస్తున్నా పెడచెవిన పెట్టి పూలు ఇష్టానుసారం కోసి తలనిండా అనేక పాయలు తీసి కిరీటాల్లా పెట్టుకోవడమే కాకుండా, వీలయినన్ని సంచుల్లో తోసేశారు. అందుకు వాళ్ళ భర్తలు, పిల్లలు ఎంతగానో సహకరించారు.

ఇక మిగతా ప్రయాణం గురించి చెప్పడం అనవసరం.

గెస్ట్‌హౌస్‌లో గిరిజనులు తయారుచేసిన ఒక చెట్టు బొమ్మ నన్ను ఎంతగానో ఆకర్షించింది. పూసలతో తయారుచేశారా చెట్టుని. దాని పూసలన్నీ లాగేసారు.

గెస్ట్‌హౌస్‌ని తలవంచుకుని హ్యాండోవర్ చేశాను.

తిరుగు ప్రయాణంలో వాళ్ళ తలల్లో వాడిపోయిన పూలని, వాళ్ళ సంచుల్లో నలిగిపోయిన పూలని చూసి ఉసూరుమన్నాను.

అన్నట్టు గెస్ట్‌హౌస్‌లోని పూల చెట్టుని నేను తయారు చేశాను.

చాలా రోజులు ఎలా తయారు చెయ్యాలా అన్న ఆలోచనలో గడిపాను. హైద్రాబాద్ వచ్చాకా, ఒక ఇంట్లోకి మేము అద్దెకు వెళ్ళాము. అది అప్పటి అసెంబ్లీ సెక్రటరీగా చేసిన వేంకటేశన్ గారిది. వాళ్ళు గృహప్రవేశం చేసి యింకా రాలేదు. ఇంట్లో వుడ్ వర్క్ జరుగుతున్నది. అక్కడ కట్ చేసిన చెక్కముక్కలు, లప్పం చూసి నాకు వెంటనే అయిడియా వచ్చింది. వాటి సాయంతో ట్రంక్ చేసి రంగులు వేశాను. పూసలు తెచ్చి సన్నని వైరుతో గుత్తులుగా చేసి కొమ్మలకి అమర్చేను. ఇంకేమిటి, అందమైన చెట్టు నా షో కేస్‌లో కొచ్చేసింది. అప్పట్లో ఎలా తయారు చెయ్యాలో ఫోటో తీసి మహళ మాగజైన్‌కి పంపించాను. వాళ్ళు ప్రచురించారు.

ఇప్పుడవేమీ లేవు. అందుకే బొమ్మ వేశాను మీకు చూపించడానికి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here