మనసులోని మనసా-40

1
8

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]ఎ[/dropcap]లాగూ నా ఉద్యోగ ప్రహసనం మొదలు పెట్టి చెప్పాను కాబట్టి నా సర్వీసు మొదట్లో చేసిన ఘనకార్యం కూడా చెబుతాను.

నేను పని నేర్చుకోవడమన్నది నిజానికి విశాఖపట్నంలోనే మొదలైంది. మాకన్నా క్వాలిఫికేషన్ తక్కువగా వున్న ఒక సెక్షన్ హెడ్ క్రింద మేము చాలామంది పని చేసేవాళ్ళం. ఆయనకి వయసు యాభయి దాకా వుంటాయి. కాని అతని ప్రవర్తన బాగుండేది కాదు. మిగతా సెక్షన్‌లో ఇంజనీర్స్ అంతా చాలా మంచివారు. పరస్పర సహకారంగా ఒకరి నుండి మరొకరం వర్కు తెలుసుకుని నేర్చుకునే వాళ్ళం.

మా సూపర్నింటెండింగ్ ఇంజనీరుగారు చాలా సాత్వికులు. అలాగే మానేజర్, పి.ఏ అందరూ ఔదార్యంగానే మమ్మల్ని పిల్లల్లా చూసేవారు. నేను పార్వతీపురం డివిజన్ వర్క్సు చూసేదాన్ని. అన్నీ ఫార్మేషన్ రోడ్స్. అడవి దారులు. ఫస్టుక్లాసు ఏజెన్సీ. ఆ నామిన్‌క్లేచర్ పేర్లే గమ్మత్తుగా వుండేవి. అవిరి, పెదగొత్తల, మిగడ – ఇలా ట్రైబల్ పేర్లు. అప్పుడే అడవిలోకి దార్లు బి.టితో వేయడం మొదలైంది.

నాకు అర్థం కాకపోతే రామ్మెహనరావు గారనే ఇంజనీరు చాలా ఓపికగా ఎస్టిమేట్స్ ఎలా తయారు చేయాలో, డిటైల్డ్ ఎస్టిమేట్స్ చేయడం, డేటా కట్టడం అన్నీ నేర్పించారు.

అయినప్పటికీ వర్కు చాలా వుండేది. ప్రొద్దుట ఎనిమిది గంటలకెళ్తే రాత్రి అయిపోయేది తిరిగి రావడం. వస్తూ కొన్ని ఫైల్స్ కూడ తెచ్చి ఇంటి పని అయ్యేక అర్థరాత్రి దాకా పని చేసేదాన్ని.

ఒకసారి నా సీట్లో ఒక పనికి టెండర్లు పిలిచేం. నిర్ణీత తారీఖున టెండర్లు వేసారు కాంట్రాక్టర్లు. టెండర్లు పి.ఏ.గారి ముందు ఓపెన్ చేయాలి. కాంట్రాక్టర్స్ అందరూ పి.ఏ.గారి చుట్టూ కూర్చుంటారు. నేను పి.ఏ.గారు వాళ్ళు కోట్ చేసిన రేట్లు చదువుతుంటే కంపేరిటివ్ స్టేట్‌మెంట్‌లో నోటు చెయ్యాలి. టెండరు ప్రతి పేజికి పి.ఏ.గారు సైన్ చేస్తారు. ఆ రాత్రికి రాత్రి కంపారిటివ్ స్టేట్‌మెంటు చెక్ చేసి, పర్సెంటేజి కట్టి ఎవరిది లోయస్టు టెండరో తేల్చి మర్నాడు నోటు రాసి సబ్‌మిట్ చేయాలి. ఆ పనంతా చేసి మర్నాడు సబ్‌మిట్ చేసాను.

మా హెడ్ నన్ను పిలిచి నోటు చదివి, “ఏంటి మీరు హార్డు బ్రోకెన్ గ్రానైట్ మెటల్‌కి హార్డ్ గ్రానైట్ మెటలని రాసారు. సరి చేయండి” అన్నారు. నిజానికి ఆ స్టేజిలో టెండరులో కరెక్షన్ చేయకూడదు. రోడ్డు వేసేటప్పుడు మెటల్ వేస్తాం. హార్డ్ బ్రోకెన్ మెటల్ రేటు గ్రానైటుకన్నా తక్కువ. కాంట్రాక్టర్ అందువలన రేటు తక్కువ కోట్ చేసాడు. గ్రానైట్ మెటల్‌కి ఆ రేటు కిట్టుబాటు కాదు.

ఆ నాలెడ్జి ఎంత మాత్రం లేని నేను అది టైపోగ్రాఫికల్ ఎర్రర్ అనుకుని కరెక్టు చేసేసాను.

టెండరు ఒక రాజుగారికి వచ్చింది. ఆయన చాలా సాత్వికులు. నన్నొక డాటర్‌లా చూసేవారు. ఆయన మేం పిలిచిన రోజు ఎగ్రిమెంటు రాయడానికి వచ్చి ఎగ్రిమెంటు పరిశీలిస్తూ “శారదగారూ ఈ కరెక్షన్ ఎవరు చేసారు” అనడిగారు. నేను హెచ్.డి వైపు చూశాను. ఆయన చెప్పొద్దని నాకు సైగ చేసి స్కూటర్ తాళాలు తీసుకుని వెళ్ళిపోయారు.

నాకేం చేయాలో తోచలేదు.

“నేనే చేసాను” అన్నాను భయంగా.

“దీని వలన నా కెంత నష్టం వస్తుందో తెలుసా మీకు. పైగా టెండర్‌ని దిద్దడం తప్పు కదా” అన్నారాయన చాలా అసహనంగా.

“నేను టైపు తప్పు పడిందనుకుని దిద్దాను” అన్నాను బిక్క మొహం వేసి.

“ఈ పని మీ చేత ఎవరో చేయించారు, చెప్పండి” అన్నరాయన.

నాకేం పాలు పోలేదు. అలా చూస్తుండిపోయాను.

ఆయన వెంటనే లెటర్ రాసి పి.ఏ దగ్గర కెళ్ళారు.

పి.ఏ క్షణాల మీద మేజర్‌ని, హెడ్ క్లర్కుని పిలిచేరు.

ఈలోపున మా సెక్షన్‌లో నా కొలీగ్స్ అంతా నేనెంత తప్పు చేసానో చెప్పి ‘అయ్యో’ అని విచారిస్తున్నారు.

నా తల తిరిగిపోతున్నది.

నన్ను పి.ఏ పిలిచారు. బలి పశువులా వెళ్ళాను.

ఆ రోజు చాలామంది ఎగ్జిక్యూటెవ్ ఇంజనీర్స్ పి.ఏ గారి దగ్గర కూర్చుని వున్నారు. అందరూ నా వైపు జాలిగా చూస్తున్నారు.

“ఎందుకు దిద్దారు మీరు?” అనడిగేరు పి.ఏ.

“హెచ్.డి.గారు దిద్దమన్నారు” అని చెప్పాను వస్తున్న ఏడుపు ఆపుకుని.

“హెచ్.డిని పిలవండి” అన్నారు.

“అతను పర్మిషన్ పెట్టి వెళ్ళిపోయారు” అని మానేజరుగారు చెప్పారు.

“ఈ అమ్మాయికేం తెలియదు షి యీజ్ ఇన్నోసెంట్” అన్నారు మానేజరుగారు.

అందరూ మొహమొహాలు చూసుకున్నారు.

ఇంతలో ఎస్.ఇ. గారు వచ్చి తన ఛాంబర్‌లోకి వెళ్ళారు.

కాంట్రాక్టరు పి.ఏ కలిసి ఆయన రూంలోకి వెళ్ళి జరిగినదంతా చెప్పారు.

ఎస్.ఇ.గారు నన్ను పిలిపించారు.

నేను వెళ్ళాను.

అప్పటికే ఏడుపు ఆగడం లేదు. చాలా భయపడిపోతున్నాను.

“ఎందుకిలా చేసారు?” అన్నారాయన సౌమ్యంగానే.

జవాబు చెప్పాలనుకున్నాను. కాని…. మాట రాలేదు. బదులుగా ఏడుస్తున్నాను. కళ్ళు ముక్కు ధారలు కడుతున్నాయి, కళ్ళు తుడుస్తుంటే ముక్కు వినడం లేదు. చీరంతా తడిసి పోతున్నది.

ఆయన “కూర్చోండి” అన్నారు.

కూర్చున్నాను. ఏడుపు మాత్రం ఆగడం లేదు.

ఎస్.ఇ.గారు మానేజర్‌గారిని “ఏం చేద్దాం” అనడిగారు.

“ఇదంతా హెచ్.డి పని సార్. అతనెందుకో ఈ అమ్మాయిని ఇరికించాలని ఈ పని చేయించాడు” అన్నారు మానేజరు.

హెచ్.డిని పిలవమన్నారు. లేడని చెప్పారు.

“సరే టెండర్సన్నీ సీల్ చేసి నా రూంలో పెట్టండి. హెచ్.డి వచ్చాక చూద్దాం” అన్నారాయన.

“మీరు ఏడవకండి. ఇంటెకెళ్ళండి” అన్నారు ఎస్.ఇ.గారు .

నేను సెక్షన్‌లోకి రాగానే స్టాఫంతా నా వైపు విచారంగా చూస్తూన్నారు. వాళ్ళ చూపులు చూస్తుంటే వాళ్ళు నా సమాధి మీద పెట్టడానికి పూలు పట్టుకొచ్చినట్లు కనపడింది నాకు.

మళ్ళీ వెక్కెక్కి ఏడ్చాను.

“అయ్యో శారదగారూ ఎంత పని చేసారు” అని అంటున్నారు సానుభూతిగా.

ఇంటికొచ్చి గట్టిగా ఏడ్చాను.

రెండు రోజులు హెచ్.డి రాలేదు. మూడవ రోజు రాగానే ఎస్.ఇ.గారు మళ్ళీ ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

నన్ను, హెచ్.డి.ని, పి.ఏని, మానేజర్‌ని కాంట్రాక్టర్‌ని కూర్చోబెట్టారు. జరిగింది మళ్ళీ నన్ను చెప్పమన్నారు.

నేను నిజం జరిగింది జరిగినట్లు చెప్పాను.

నాకు హార్డ్ మెటల్‌కి, హార్డ్ గ్రానైట్ మెటల్‌కి వున్న వ్యత్యాసం తెలియదని చెప్పాను.

“నేనేం దిద్దమనలేదు” అని హెచ్.డి అబద్దం చెప్పాడు.

ఎన్నడూ కోపమెరగని మా ఎస్.ఇ.గారు హెచ్.డి.ని “యూ స్కౌండ్రల్” అంటూ తిట్టి “షి యీజ్ ఇన్నోసెంట్. ఆమెకేం తెలుసు! నీ రికార్డంతా ఫ్రాడే. ఏం ఆశించి ఈ పని చేసావ్! ఇప్పుడే నిన్ను సస్పెండ్ చేయగలను. కాని మొదట కేస్ వర్కర్‌ని చేయాల్సి వస్తుంది” అని హెచ్.డి ని ‘గెటవుట్’ అన్నారు.

హెచ్.డి బయటకి వెళ్ళాక అందరూ తర్జన భర్జన పడి ఈ అమ్మాయిని సేవ్ చేయాలంటే ఆ పేజి రిమూవ్ చేసి పాత సంతకాలతో మరో పేజీ పెట్టి కుట్టేద్దాం అని నిర్ణయించుకున్నారు.

తర్వాత మానేజరుగారు ఆ పని చేయించి కాంట్రాక్టరు పి,ఏ.గారి సంతకాలు తీసుకున్నారు.

మళ్ళీ నేను పర్సంటేజ్ కట్టి రాజుగారి చేత ఎగ్రిమెంటు రాయించాం. కథ అలా సుఖాంతమైంది.

చాలా కాలం ఎస్.ఇ గారు ఎప్పుడయినా నేను కనిపిస్తే “వాట్ శారదా ఇప్పుడయినా హార్డ్ బ్రోకెన్ మెటల్‌కి హార్డ్ బ్రోకెన్ గ్రానైట్ మెటల్‌కి తేడా తెలిసిందా” అని నవ్వేవారు.

కాని…. చాలా రోజులు ఆ సంఘటన నా మనసు మీద ముద్ర వేసి నిరుత్సాహానికి గురిచేసింది. చాలా జాగ్రత్తగా ప్రతి కాగితాన్ని చూసుకోవడం మొదలు పెట్టాను.

ఆ హెచ్.డి.ని లీవ్ పెట్టి వెళ్ళిపొమ్మన్నారు ఎస్.ఇ.గారు. తర్వాత అతను మరో విషయంలో సస్పెండయి డిస్‌మిస్ అయ్యాడు. అదీ నా బిట్టర్ ఎక్స్‌పీరియన్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here