మనసులోని మనసా-41

2
9

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]కొ[/dropcap]న్ని రోజుల క్రితం నా చిన్ననాటి స్నేహితురాలు నన్ను వెదుక్కుంటూ మా యింటికి వచ్చింది. ఎన్నాళ్ళకో చూడటం వలన నాకు నిజంగానే చాలా సంతోషమేసింది.

మధ్యలో మమ్మల్ని ఎడం చేసిన కాలం మా అనుబంధాన్ని ఏ మాత్రం సడలించలేదు. ఇద్దరం ఒక గదిలో చేరి గతాన్ని కలబోసుకుని ఆనందపడ్డాం. చిన్న పిల్లల్లా తుళ్ళిపడ్డాం.

కాని…. నాకు ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తున్నది.

అందుకు కారణం ఆమె తయారు!

నుదుటి మీద రకరకాల బొట్లు పెట్టింది.

ఆంజనేయస్వామి, సాయిబాబా, శివుడి విబూధి, ఇంకా చాలా నొసలంతా వడియాలు పెట్టినట్లు ఒకటే బొట్లు – ఎక్కడా ఖాళీ లేకుండా.

చేతికేవో తాళ్ళు, మెడలో ఏవేవో తాయెత్తులు.

సరే! ఆమెని ప్రశ్నించి ఇబ్బంది పెట్టకూడదని నేను ఆమెతో బాగానే వున్నాను.

కాసేపటికి ఆమె వచ్చిన అసలు కారణం చెప్పింది. ఎవరో బాబా ఎక్కణ్ణించో హైద్రాబాదు వస్తున్నాడుట. ఆయన ఈవిడకేదో మంత్రం చెబుతాడట. అందుకు రమ్మన్నాడట. ఇంకా తెలిసిందేమింటే ఇప్పటికే ఈమె సదరు బాబాకి చాలా డబ్బు (లక్షల్లో) సమర్పించింది.

నిజానికి ఆమెకే కష్టాలూ లేవు. ఆర్థిక ఇబ్బందులసలే లేవు. పిల్లలు ఫారిన్‌లో సెటిలయ్యేరు. ఇక్కడ బోల్డంత ఆస్తి!

ఆమె ఎంతో తన్మయత్వంగా ఆయన మహిమల గురించి వర్ణించి వర్ణించి చెప్పింది. అందులో వున్న మాయ, మోసం చిన్న పిల్లాడికి కూడ అర్థమవుతుంది. అయినా అలా నమ్మేవారిని మనం నిస్సహయంగా చూడటం తప్ప మరేమీ చేయలేం కదా!

వెంటనే నేను నా చిన్నతనంలోకి జారిపోయాను.

అప్పుడు మా పెద్దనాన్నగారు అమలాపురంలో పోలీసాఫీసరుగా పని చేస్తున్నారు. నేను చాలా చిన్నపిల్లను. అయిదు సంవత్సరాలు దాటి వుండదు నా వయసు!

శివరాత్రికి ఆయన ముమ్మిడివరం తీసుకెళ్ళారు. అక్కడ ముమ్మిడివరం బాలయోగి ఆరోజు దర్శనమిస్తారట! ఒకటే తండోపతండాలుగా జనం! పెద్దనాన్నకి బాలయోగిగారు తలుపులు తెరవగానే స్పెషల్ దర్శనమిప్పించారు.

నేను పెద్దనాన్నని పట్టుకుని లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి ఉలిక్కిపడ్డాను.

భయపడ్డాను కూడ.

ఆయన జుట్టంతా జడలు కట్టి కొబ్బరి తాళ్ళలా వేలాడుతున్నది.

గడ్డం పొడుగ్గా పెరిగి అదీ అదే పరిస్థితిలో వుంది.

ఇక శరీరం చూస్తే అస్థిపంజరానికి ఒక చర్మపు మలామా చేసినట్లుంది.

గోళ్ళు విపరీతంగా పెరిగిపోయి బూడిదరంగుకి మారిపోయి పొడుంలా రాలుతున్నాయి. కాళ్ళు మడతేసుకుని (పద్మాసనం కాబోలు) ఒక జీవం లేని మనిషిలా ఆయన కూర్చుని వున్నారు.

నేనాయన్ని చూసి సన్నగా వణికి పెదనాన్నని గట్టిగా పట్టుకున్నాను. “మరేం భయం లేదు. దణ్ణం పెట్టు” అన్నారు పెదనాన్న.

నేను పెట్టలేదు. నాకసలాయన నచ్చలేదు.

చాలా రోజుల ఆయన రూపం నన్ను వెంటాడి ఒళ్ళు గగుర్పొడిచేది. తర్వాత కాలంలో మా పెద్దమామయ్య ద్రాక్షారామం తాసిల్దారు చేస్తూ ద్రాక్షారామం బాలయోగిని కూడా చూపించారు.

అక్కడా నాకదే అనుభవం!

ఎందుకు వీళ్ళిలా తలుపులు మూసుకుని ఒక గదిలో అలా జీవచ్ఛవాల్లా కూర్చోవడం! అందువలన సమాజనికేం ఉపయోగం! దేవుడిచ్చిన పంచేంద్రియాల్ని, మేధస్సుని వాడి ఈ ప్రపంచానికి ఏదైనా వుపయోగపడే పని చేయెచ్చుకదా… అన్న ప్రశ్న నన్ను వేధించేది.

“నాకు శివుణ్ణి చూపించాడే” అని మా పెద్దమామయ్య చెప్పినప్పుడు నేను పడీ పడీ నవ్వేను.

ఆయనంటే ఇంట్లో అందరికీ హడల్! కాని …. నేను లెక్కపెట్టేదాన్ని కాదు.

“పెద్ద రోకళ్ళలా వున్న కాళ్ళు పట్టించుకుని పావలా యిస్తానని నన్నే బోల్డు మోసం చేసేవ్! నీకు శివుడు కనిపించాడా?” అని నేను వెక్కిరించి నవ్వి పారిపోయి వస్తుంటే మా అత్త బుగ్గలు నొక్కుకుని “ఓసి… దీని అసాధ్యం కూల!” అని మా అమ్మగారికి చెప్పింది.

“అవును. మేమంటే అన్నీ తెలిసినా మర్యాదా కోసం ఏమీ అనం వదినా… దానికేం తెలుసు? ఉన్న మాట అనేసింది” అంది అమ్మ నన్నే వెనకేసుకొచ్చి.

చెల్లెలని పిలిచి ఏనాడూ ఒక చీర పెట్టలేదని అమ్మకి అక్కసు.

నిజానికి మామయ్య యింట్లో ఆ బాలయోగి గారి పట్ల భక్తి విపరీతంగా పెరిగిపోయి ఆయన పిల్లలకి కూడ ఆ జాడ్యం అంటుకుపోయింది. ఆరడుగుల ఎత్తు, అందమైన వర్చస్సు వుండి బాగా చదువుకుని పెద్ద ఇంజనీరయిన అతని మనుమడు అలాగే మెడిసెన్ చదివి డాక్టరయిన మనవరాలు, పెళ్ళి వదిలేసి ఎవరితో మాట్లాడకుంటా మంచి వుద్యోగాలు వదిలేసి బెంగళురులో మకాం పెట్టిన ఆ బాలయోగిగారి ఆశ్రమానికి అంకితమైపోయి, చదివిన చదువుని నిరర్ధకం చేసుకుని అక్కడే వుండిపోయారు. ఇంతకీ ఆ యోగి గారు సమాజానికి ఏం చేసారో ప్రశ్నార్థకమే!

నాస్తికత్వాన్ని అణువణువూ నింపుకుని పుంఖానుపుంఖాలు కవిత్వం రాసిన ఒక ప్రముఖ సంపాదకులు ఒకసారి ఒక బాబాగారి దగ్గర కెళ్ళి ఆయనిచ్చిన ఉంగరం చూసి మురిసి బాబాకి అపర భక్తుడు కావడం చూసి నేను ఆశ్చర్యపోయాను.

నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక బాబాగారు కాకినాడ వచ్చారు. ఆయన అక్కడికి రావడం ఆ వూరు చేసుకున్న అదృష్టం అని జనం తండోపతండాలు వెళ్ళారు. ఎలా వెళ్ళానో ఎవరు తీసుకెళ్ళారో తెలియదు కాని…. నేనూ వెళ్ళాను.

ఆయన వూరించి వూరించి ఒక ఏపిల్ తీసుకుని ఎగరేస్తూ టెర్రస్ మీదకి వచ్చారు. జనాలు వెరెత్తి అరిచి దణ్ణాలు పెట్టారు. నేను ఆయన్ని పరిశీలనగా చూశాను. ఆయన మొహంలో నాకెలాంటి కాంతి కాని, దైవత్వం కాని అసలు కనపడలేదు. మరీ జనం ఎందుకంత సాష్టాంగపడుతున్నారో నాకు అర్థం కాలేదు.

రోజూ ఈ బాబాలు, యోగులు చేసే గారడీలు, మోసాలు, అకృత్యాలు తెలిసి కూడ మనుషులెందుకింత మాయాజాలంలో పడి పడీ పడీ మొక్కుతారో నాకు అర్థమే కాదు.

నా చిన్న తనంలో కాకినాడలో ఒక మహా పురుషుడు వెలిసాడని సంసారాలూ, వంటలూ ఇల్లూ వాకిలీ వదలి పదిగంటల కల్లా అందరూ ఆయన దగ్గరకి వెళ్ళిపోయేవారు.

మా అమ్మగారు ఇలాంటి వసలు నమ్మరు.

అందుకని మా దొడ్డమ్మ మా అమ్మని తిట్టేది కూడ.

చివరకాయన అన్నీ మూటగట్టుకుని ఒక కాలేజీ లెక్చరర్ గారి భార్యని కూడ తీసుకుని వెళ్ళిపోయారు.

ఇలాంటివి ఎన్ని తెలిసినా జనం నమ్ముతూనే వున్నారు. వెళ్తూనే వున్నారు. మోసపోతూనే వున్నారు. అసలు దేవుడికీ మనకీ మధ్య మధ్యవర్తులెందుకు. దేవుడు మనలోనే వున్నడని ఒక పక్కన చెబుతూనే అలా భయంకంరంగా తయారయి భీకరంగా వుండే వ్యక్తుల దగ్గర కెళ్ళి సాష్టంగపడి అన్ని విధాల దగా పడుతునే వున్నారు. అదీ ఈ రోజుల్లో! ఏం చేస్తాం! ‘చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు’ అని భర్తృహరి ఏనాడో చెప్పారు కదా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here