మనసులోని మనసా-45

1
7

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]”చె[/dropcap]ల్లీ కన్నీరు పెట్టిందో… ఆ సున్నలు జూసి…”

‘ఏంటీ చెల్లేమిటి… కన్నీళ్ళేమిటి… సున్నాలేమిటి…?’ అనుకుంటున్నారా?

ఇది మా ఆఫీసులో నా కొలీగ్ రాసిన ప్రముఖ జానపద కవి గోరెటి వెంకన్న గారి పాట పేరడి.

పాట మొత్తం వింటే నవ్వలేక కడుపు చెక్కలయి పోతుంది.

నాకు గుర్తు లేక ఇక్కడ వ్రాయలేకపోతున్నాను.

ఇది మా అటెండెన్స్ రిజిస్టర్ మీద వ్రాసిన పాట!

అటెండెన్స్ రిజిస్టర్ అంటే ఉద్యోగం చేసిన వారందరికీ తెలుసు.

ముఖ్యంగా మా టైములో ఆఫీసుకి రాగానే అందులో సంతకం చేసేవాళ్ళం. సహజంగా ప్రభుత్వ ఆఫీసులన్నీ పదిన్నరకి మొదలయ్యేవి. పదీ నలభయి వరకు గ్రేస్ పీరియడ్ ఇచ్చేవారు. అంటే పది నిముషాలు ఆలస్యంగా రావడాన్ని అంగీకరించేవారు. అది దాటితే రిజిస్టర్ క్లోజవుతుంది. తర్వాత ఆలస్యంగా వచ్చిన వారు లేట్ రిజిస్టర్‌లో సంతకం చేయాలి. నెలలో మూడు ‘లేట్‌’లు దాటితే ఒక క్యాజువల్ లీవ్ పోతుంది. అవుండేవే సంవత్సరానికి పన్నెండు. అలా పోతే సంవత్సరం పొడవునా వచ్చే అవసరాలకి చాలా కష్టపడాలి. ముఖ్యంగా స్త్రీలకి. తమకి బాగోకపోయినా… పిల్లలకి బాగోకపోయినా ఇంకే అవసరాలు వచ్చినా వాడుకోవాల్సింది అవే కాబట్టి ఒక సి.ఎల్. పోయినా విలవిల లాడేవాళ్ళం.

మా ఆఫీసు సంగతే చూద్దాం. మా హెడ్డాఫీసు ఎర్రమంజిల్ కొండ మీద ఉండేది. బస్సులన్నీ క్రింద పెద్ద కాంపౌండ్‌లో ఆపేవారు. అక్కడ నుండి స్టాప్ ఆదరాబాదరా కొండెక్కి పైకి రావాలి. ఇంట్లో నానా చాకిరీ చేసి పిల్లలకి, భర్తకి టిఫిన్ బాక్స్ యిచ్చి, వాళ్ళని తయారు చేసి వాళ్ళింత పెట్టుకుని పరుగులెత్తి బస్సెక్కి చేరుకునేసరికే అలసిపోతారు. ఇక దిగగానే ఆఫీసులోకి వెళ్ళడానికి లేదు. చచ్చినట్టు కొండ ఎక్కాలి. ఆయాసపడుతూ అటెండెన్స్ రిజిస్టర్‍ని తలచుకుంటూ పరిగెత్తుకొచ్చేసరికి అది వెళ్ళిపోతే చెప్పలేని ఏడుపొస్తుంది.

అది కాస్తా మినిస్టీరియల్ సెక్షన్‌కి వెళ్తుంది. దానికి సంబంధించిన గుమాస్తా దాన్ని క్లోజ్ చేసి రాని వాళ్ళకి సున్నాలు చుట్టి సూపర్నెంటుకి పంపిస్తాడు. అక్కడతను సైన్ చేసి సదరు సెక్షన్ హెడ్‌కి పంపుతాడు. ఇంక చేసేదేం లేదు. కొందరు మహానుభావులు చిన్న వార్నింగిచ్చి సంతకం పెట్టిస్తారు. మరికొందరు ‘సరేమిరా’ అంటారు.

నిజానికి పాపం ఈ ఎన్.జి.ఓ. కాలనీలన్నీ ఊరి చివర అటు వనస్థలిపురంలో గాని ఇటు కుకట్‍పల్లిలో గాని వున్నాయి. అక్కడి నుండి ట్రాఫిక్ తప్పుకుని రావడానికి చాలా టైమ్ పడుతుంది.

అందుకే అందరూ అక్కడ ఇళ్ళు కొంటున్నా నేను కొనలేదు. ఎప్పుడూ ఎక్కడ పనిచేసినా ఆఫీసుకు అతి దగ్గరగా అద్దెకు తీసుకునే వున్నాను. నా దృష్టిలో కాలానికే విలువ. ఆఫీసు దగ్గరయితే పిల్లల్ని త్వరగా వెళ్ళి చూసుకోవచ్చని నా ఉద్దేశం.

సరే!

కొందరు ముదుర్లుంటారు. వాళ్ళు ఎంత టైమిచ్చినా ఆఫీసుకి ఆలస్యంగానే వస్తారు. వాళ్ళు రోజూ సిగ్గు విడిచి సెక్షన్ హెడ్స్‌ని ప్రాధేయపడుతూనే వుంటారు.

మరో రకం వున్నారు. వాళ్ళు క్రిమినల్ బ్రెయిన్డ్. ఎవరూ చూడకుండా అటెండెన్స్ రిజిస్టర్ మీద ఇంక్ పోయడం, లేదా చించేయడం లేదా అసలు అటెండెన్స్ రిజిస్టర్‌నే గల్లంతు చేయడం చేస్తుండేవారు. దీని వలన మిగతావారు నష్టపోతుంటారు.

ఒకసారి ఆఫీసులో తెలుగు భాషనే వాడాలని జీ.వో. వచ్చింది. ఇక దాని గురించి మేమందరం జోక్స్. మేం రాసే డ్రాఫ్టింగ్‌ని తెలుగులో వూహించుకుని ఒకటే నవ్వులు!  కారణం మాకు దానికి సంబంధించిన ఒక డిక్షనరి వచ్చింది. అందులో ఒక్కోపదానికి చాంతాడంత అర్థాలు ఇచ్చారు.

ఉదాహరణకి రైలు బండి అంటే ‘ధూమశకటం’ అని, ప్లాట్‌ఫామ్ అంటే ‘ధూమశకటం ఆగు అరుగు’ అని, లావెట్రీ అంటే బహిర్భూమి అని చదివి నవ్వలేక చచ్చాం. నిజానికి మా టెక్నికల్ సైడ్ అయితే ఒక్క మాటకి సరైన తర్జుమా లేదు. నిజజీవితంలో ధూమశకటం అనగలమా! అసలు ధూమశకటాలెక్కడున్నాయి?

అందుకే తెలుగే మాట్లాడాలని చాదస్తం పోవడం నాకు నచ్చదు. తెలుగుని అభిమానిస్తాం. తెలుగు నేర్చుకుంటాం. తెలుగుని ఆస్వాదిస్తాం. కాని అన్ని చోట్లా అది మాత్రమే వుండాలంటే కుదరదు. అది పిడివాదమని నా నమ్మకం.

ఇక అటెండెన్స్ రిజిస్టర్‌లో కూడా తెలుగులో సంతకం చెయ్యాలని నిబంధన పెట్టారు. ఇక ఎలా పెట్టాలని అందరూ చర్చ.

ఉదాహరణకి నా పేరు మన్నెం శారద కాబట్టి నేను MS అని పొడి సంతకం చేసేదాన్ని. ఇప్పుదు ‘మశా’ అని చెయ్యాలంటే నాకు మనసొప్పలేదు. ఏంటి తెల్లవారగానే వచ్చి ‘మశా’, ‘మసి’ అంటూ సంతకం చెయ్యడమని నేను నా పేరు తిరగేసి ‘శామ’ అని పెట్టడం మొదలుపెట్టాను. చాలామంది తమ పేర్ల పొడి సంతకాలు చూసుకుని బిక్కమొగాలు వేసారు.

ఇంకా ఘోరం ఏమిటంటే కొందరి పొడి సంతకాలు చెడ్డ అర్థాలకి దారి తీసి వాళ్ళు ఏడవటం ఒకటే తక్కువ. వాళ్ళని చూసి అందరూ ముసి ముసి నవ్వులూ, వేళాకోళాలూ!

ప్రొద్దుటే కొంత టైము మాకు ఈ గొడవతోనే సరిపోయేది.

ప్రముఖ రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తిగారు ఈ సంతకాల మీద పెద్ద సెటైరే రాశారు.

చివరికి ఎలాగో ఆ ప్రొపోజల్ ఎత్తేసి ఇంగ్లీషునే అమలు చేశారు.

అందుకని నా ఫ్రెండ్ అటెండెన్స్ రిజిస్టర్‌ని దృష్టిలో పెట్టుకుని “చెల్లీ కన్నీరు పెట్టిందో… ఆ సున్నలు జూసి…” అనే పాట రాసింది. ఆఫీసు ఫంక్షన్‌లో ఆ స్కిట్ ప్రదర్శించారు.

అది చూసిన మా ఇంజనీర్-ఇన్-చీఫ్ గారు తెల్లబోయి సదరు డెప్యూటి చీఫ్ ఇంజనీరుగారి వైపు చూశారు. ఆయన గిల్టీగా తలదించుకుని, “ఏంటి మేం మిమ్మల్ని ఇంత వేధించేస్తున్నామా?” అని నవ్వి, మరో పది నిముషాలు అదనంగా రిజిస్టర్ వదిలేయండని శెలవిచ్చారట.

ఇది నిజంగా మంచి పరిణామం.

ఒకప్పుడు ఆఫీసు ఫంక్షన్స్‌లో మగవారు నాటకాలు వేస్తుంటే ఒక మూలకి కూర్చున్న మేం, నేను రిటైర్‌మెంట్ తీసుకున్నాక మగవార్ని ఓ పక్కకి కూర్చోబెట్టి మా లేడీ స్టాఫ్ డ్రామాలు, స్కిట్స్ ప్రదర్శిస్తుంతే నాకు చెప్పలేని ఆనందం కల్గింది! మాకెన్ని తెలివితేటలున్నా భయం కొద్దీ ప్రదర్శించలేకపోయాం!

ఆ రోజు నేను చీఫ్ గెస్టుని.

నా ఆనందానికి అవధులు లేవు!

రోజులు మారేయ్! రోజులు మారేయ్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here