మనసులోని మనసా-47

1
10

[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారదమనసులోని మనసా” శీర్షిక. [/box]

[dropcap]గొ[/dropcap]ప్పవారు ఎంత నిరాడంబరంగా వుంటారో, ఎంత నిర్మలంగా వుంటారో చెప్పడానికి మాత్రమే ఇది రాస్తున్నాను.

నా చిన్నతనంలో నాకు చెన్నైలో జాబ్ చేయాలని, అక్కడే వుండాలని కోరికగా వుండేది. కారణం అక్కయ్యలు అక్కడ సెటిలయ్యేరు – తరచు వాళ్ళింటికి శెలవులకి వెళ్తుండే వాళ్ళం.

అప్పట్లో ఆ నగరం తీర్చిదిద్దినట్టు విశాలమైన రోడ్లు, పెద్ద పెద్ద కాంపౌండ్స్‌తో వున్న విశాలమైన భవంతులు, సముద్రం, బీచ్‌లు – చాలా బాగా అనిపించేది.

రైలు దిగగానే ఎటువంటి ఫ్లయ్ ఓవర్లు లేని సెంట్రల్ స్టేషన్ నన్ను ఆకర్షించింది. ఎర్రటి గోపురాలతో అలాంటి రూపంలోనే పక్కనే వున్న మూర్ మార్కెట్, మౌంట్ రోడ్డు, దూరం నుండే ఆకర్షించే బ్రిటానియా వారి బ్రెడ్ అండ్ బిస్కట్ హోర్డింగ్ బ్లాక్ కలర్ లైట్లు వెలుగుతూ, ఆరుతూ – అటు తిరిగితే నుంగంబాకం హై రోడ్డు – ఇటు తిరిగితే అమెరికన్ కాన్సులేట్, తాజ్ కోరమాండల్, సవేరే తదితర స్టార్ హోటల్స్ – తిన్నగా వెళితే బీచ్ రోడ్డు – ఇలా చాలా థ్రిల్‌గా అనిపించేది.

మొదట అక్కయ్యవాళ్ళు నుంగంబాకంలో వుండేవారు. దగ్గరే వాణిశ్రీ గారిల్లు, జెమిని గణేశన్ ఇల్లు వుండేవి. తర్వాత హబీబుల్లా రోడ్డులో నడిగర సంగం ముందు ఇళ్ళు కట్టుకుని వెళ్ళిపోయేరు. వాళ్ళతో బీచ్ షికార్లు, మౌంట్ రోడ్డులో షాపింగులు, ముఖ్యంగా పూంగ్ పుహార్‌లో పేపర్ మెష్‌డ్ బొమ్మలు నన్ను చాలా ఆకర్షించేవి.

మొదటిసారి తాజ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంటులో కారులోనే కూర్చుని టిఫిన్స్ చెయ్యడం యమా థ్రిల్‍గా అనిపించేది. కారు విండోకి ట్రే బిగించి సర్వ్ చేస్తుంటే తమాషాగా అనిపించేది. ఎర్రటి గోపురాలతో స్పెన్సర్‌లో షాపింగు బాగుండేది. అక్కడ దొరకని వస్తువు వుండేది కాదు. బుహారిలో డిన్నర్ చేస్తున్నప్పుడు అక్కడ చిన్న ఔన్స్ గ్లాసులో పైనాపిల్ సిరప్ ఇచ్చేవారు. అది చాలా రుచిగా వుండేది. అక్కడే జయలలితని, షీలాని చూశాను.

సెఫైర్ థియేటర్‌లో సినిమాకి వెళ్ళినప్పుడు చాలామంది సినిమా నటుల్ని చూశాను. అందులో మూడు థియేటర్స్ ఉండేవి. సైఫైర్, బ్లూ డైమండ్, ఎమరాల్డ్. అక్కడ కాంచన గారిని చూశాను. ఆమె రూపం నాకిప్పటికీ గుర్తుంది. రాయల్ బ్లూ చిఫాన్ సేరీలో మెరిసిపోతున్న దేవకన్యలా వున్నారామె. పైన బ్యూటీ పార్లర్‍కి వెళ్తూ మమ్మల్ని చూసి నవ్వి చెయ్యి వూపేరు. ఆనంట్, విటెల్ ఆనంద్‌లో సినిమాల్, గాంధీ బీచ్‍లో షికార్లు అలా చాలా సరదగా వుండేది. మా యింటి ముందు నుండి సావిత్రి గారు కారు నడుపుకుంటూ వెళ్ళడం ఎన్నిసార్లు చూశానో! ఒకసారి మేమంతా ఆమెను చూడడానికి వెళ్ళాం. ఆమె తన ఇంట్లోనే కారు గరేజ్‌లోకి షిఫ్టయి దాన్ని రీమోడల్ చేసుకుంటున్నారు.

అయినా మమ్మల్ని ఆహ్వానించి, ఎక్కడి నుంచి వచ్చాం, ఏం చదువుకుంటున్నామో అడిగి మాకు టీ, బిస్కట్స్ యిచ్చి ఆదరంగా మాట్లాడేరు.

అలా ఆ నగరమంటే ఏర్పడిన ప్రేమతో నేను అక్కడే జాబ్ చేస్తానని చదువయిపోయాక మా అక్కతో, బావగారితో చెప్పాను. “మీ అమ్మ ఒప్పుకోదే!” అంది అక్కయ్య.

నేను గట్టిగా పట్టుపట్టేసరికి మా బావగారు “బి.ఎన్. రెడ్డి గారిని కలిసి అడుగు” అని నవ్వారు.

ఇంకేముంది ఆయన ఫోను నెంబరు సంపాదించి ఫోన్ చేసేసాను.

ఆయన తనే స్వయంగా మాట్లాడేరు.

“రేపొద్దుట రామ్మా” అన్నారాయన సౌమ్యంగా.

ఎగిరి గంతేసి నేను అక్కయ్యని తోడు తీసుకుని వెళ్ళాను. బావగారు అప్పటికి తిరుపతిలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీరుగా పని చేస్తున్నారు.

మేం ఇద్దరం వెళ్ళేసరికి ఆయన తన ఇంటి ఆవరణలో వున్న గులాబీ తోటలో వాకింగ్ చేస్తున్నారు.

మమ్మల్ని చూడగానే “రండి, రండి” అని తీసుకెళ్ళి డ్రాయింగ్ రూమ్‌లో కూర్చోబెట్టుకుని మా వివరాలన్నీ అడిగారు.

మేం భయం భయంగా ఆయన్ని చూస్తున్నాం.

ఆయన తీసిన సినిమాలన్నీ కళ్ళముందు కదలాడి మనసున మల్లెలు వూగిస్తున్నాయి.

మొదట కొంచెం ఆయన సినిమాల గురించి మాట్లాడేం.

ఆయన కాసేపు ఆ ప్రపంచంలో ఓలలాడేరు. ఆనాటి నిర్మాణం, క్రమశిక్షణ, ఒకరిపట్ల ఒకరికున్న గౌరవ మర్యాదలు, నటులు దర్శకుడి చేతిలో ఒదిగి వుండడం గురించి అనర్గళంగా చెపుకొచ్చేరు.

ముఖ్యంగా ఆయన వాణిశ్రీ గారి గురించి చాలా పొగుడుతూ చెప్పడం పెద్ద విశేషం!

“ఎంత గొప్ప నటమ్మా ఆ అమ్మాయి!” అంటూ తన ‘బంగారు పంజరం’ సినిమా గురించి చెప్పుకొచ్చేరు.

“సర్! మీరెందుకిప్పుడు సినిమలు తియ్యడం లేదు?” అని అడిగాం మేము.

ఆయన నిస్పృహగా నవ్వేరు.

“ఇప్పటి జనం మధ్య ఇమడలేనమ్మా నేను! ప్రతివాడూ డైరక్టరే ఇప్పుడు! అక్షరాలు వచ్చిన ప్రతివాడూ కథ చెప్పేస్తాడు. అంటే వాళ్ళలో ప్రతిభ వుండదని కాదు. కాని ప్రతిభ వున్నవాళ్ళని పక్కకి నెట్టేసి ముందుకొచ్చిన డబుల్ మీనింగ్ మనుషులతో పని చెయ్యడం కష్టం. మన గౌరవం మనం కాపాడుకోవాలంటే పక్కకి తప్పుకోవడమే ఉత్తమం. హీరోలు శాసించే దశకి సినిమా వెళ్ళినప్పుడే సినిమా నాశనమయినట్టు లెక్క” అంటూ ఆయన ఒక చిన్నపిల్లవాడిలా ప్రతి విషయాన్ని ఎంతో చిన్నవాళ్ళమైన మాకు చెప్పడం ఒక పెద్ద విశేషం.

తర్వాత ఆయన నా రెస్యూమ్ తీసుకున్నారు.

గేటు దాకా వచ్చి మమ్మల్ని సాగనంపేరు.

మర్నాడు ఆయన ఫోను వచ్చింది.

“రేపు ప్రొద్దుట మౌంట్ రోడ్డులో వున్న రాఘవ అండ్ వీరా కంపెని రండమ్మా” అని.

నేను ఎగిరి గంతేసేను.

అక్కని తీసుకుని నేను ఆ కంపెనీకి వెళ్ళాను.

నగరంలో ఒక ప్రముఖ బిల్డర్స్ ఆఫీసు అది!

అన్నిటికన్నా విశేషం ఏమిటంటే బి.ఎన్.రెడ్ది గారు ఆ వయసులో మా కోసం ఆఫీసు ముందు పేవ్‌మెంట్ మీద అటూ యిటూ పచార్లు చేస్తున్నారు.

ఈ విషయం పచ్చి నిజం! నేను నిజంగా చాలా తెల్లబోయాను.

చిన్న చిన్న విషయాలకి మిడిసిపడి మంచీ మర్యాదలు మరచి ప్రవర్తించే చాలామందిని చూసినప్పుడు నాకాయన వెంటనే గుర్తొస్తారు.

ఆయన వెంటనే “రండి, రండి. మీ కోసమే చూస్తున్నాను” అంటూ మమ్మల్ని పై ఫ్లోర్‌కి తీసుకెళ్ళారు.

అక్కడ మమ్మల్ని కంపెని ఎం.డి. వీరారెడ్డిగారికి పరిచయం చేసారు.

ఆయన నాకొక ఎస్టిమేట్ ఇచ్చి వర్కు చేయమన్నారు.

ఇక ఆయన, అక్క తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు.

నేను ఆ డీటైల్డ్ ఎస్టిమేట్, డేటా, ఏబ్రాస్టార్ట్ తదితర పని ముగించేడప్పటికి సాయంత్ర మయ్యింది.

వీరారెడ్ది గారు నా పని చూసి తల పంకించి పోస్టింగ్ ఇచ్చారు.

అప్పటి వరకు బిగుసుకుపోయి టెన్షన్‌గా వున్న నాకు పెద్ద రిలీఫ్ దొరికింది.

ఎగిరి గంతేసి టాక్సీలో ఇంటి కొచ్చేసేను.

నా ఆనందానికి అవధులు లేవు.

కాని… అది ఎంతో సేపు నిలబడలేదు.

మా అమ్మగారు వెంటనే వచ్చేయమని అక్కడ ఎంత మాత్రం జాబ్ చెయ్యడానికి వీల్లేదని అల్టిమేటం జారీ చేసారు.

బి.ఎన్.రెడ్డి గారి లాంటి ప్రముఖ వ్యక్తి నా కోసం వచ్చి అంత నిరాడంబరంగా సహాయపడితే నేను ఉపయోగించుకోలేకపోయానని చాలా సిగ్గు పడి వెళ్ళి క్షమాపణ చెప్పుకొన్నాను.

అప్పుడు కూడ ఆయన నవ్వి “ఇందులో ఏముందమ్మా, ఫర్వాలేదు. పెద్దవాళ్ళంతే!” అన్నారు తేలికగా.

గర్విస్టులని, అహంభావులని చూసినపుడల్లా నాకాయన గుర్తొస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here