మనసులు కలవని చోట!

0
14

[భండారు విజయ గారు రచించిన ‘మనసులు కలవని చోట!’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]భో[/dropcap]జనానికి కూర్చున్న వసంత సెల్ మోగడం వినిపించి, డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేవబోయింది.

“నేను తెస్తాలే అమ్మా! నువ్వు భోజనం చెయ్యి..” అంటూ తన భోజనం ముగించిన అచ్యుత రామారావుగారు లేచి, ఛార్జింగ్ పెట్టిన కోడలు ఫోను అందుకున్నారు.

“ఎవరు మామయ్యా, కాల్ చేసింది?”

సెల్‌ను వసంత చేతులో పెట్టి “ఇంకెవరమ్మా! వాడే నీ పాలిట మొగుడు. నా దొంగ కొడుకు” అంటూ హాల్లో హోంవర్కు చేసుకుంటున్న మనవరాళ్ళ దగ్గరికి వెళ్లి కూర్చున్నాడు .

భర్తకు ఏం సమాధానం చెప్పాలో వసంతకు అర్థం కాలేదు. రింగు టోను ఆఫ్ అయ్యేంత వరకు వేచిచూసి, ఫోను టేబుల్ మీద పెట్టి భోజనం ముగించింది.

చంద్రమోహన్ ఆమె భర్త. మధ్యాహ్నం హంపీకి వెళ్తున్నానని, తను తిరిగి రావడానికి నాలుగు రోజులు పడుతుందని చెప్పి వెళ్ళాడు. అంతలోనే అతని నుండి ఫోను. ఆమె బుర్ర నిండా అతని ఆలోచనలు ముసురుతుండగా తిరిగి ఫోను మోగింది. మళ్ళీ అతనే.

ఫోన్ కాల్ ఎత్తి “ఆ! చెప్పండి” అంది. అటువైపు నుండి మౌనం. “అప్పుడే హంపి చేరారా?” సాధ్యమైనంత సౌమ్యంగా అడిగింది.

“ఏం భార్యామణి? పెందలాడే పక్క ఎక్కేసావా? మొగుడు ఎలాగూ ఊళ్ళో లేడు. ఖుషీగా ఉండి వుంటావులే! ఫోను ఎత్తడానికి తమరికి టైం లేనట్లుంది. ప్రియుడి ఊహల్లో తేలుతున్నట్లు వున్నావు. లేదంటే ఎవరైనా కొత్త రంకు మగడు వస్తే, వాడితో కులుకుతున్నావా?” ముళ్ళలాంటి అతని మాటలకు ఆమె దగ్గర ఎప్పుడు సమాధానాలు వుండవు. చెప్పినా జరగబోయేది ఆమెకు తెలుసు. ఏం మాట్లాడినా అతనితో ప్రమాదమే! మౌన౦గా వింటోంది..

“ఏం నోరు పడిపోయిందా? లేక పక్కలో వున్నవాడి ముద్దుల్లో తేలిపోతున్నావా? ‘పండగ పూట పాత మొగుడు’ ఎందుకని అనుకుంటున్నావా?” అవతలి నుంచి భర్త వెకిలి నవ్వు. “నేను ఇంట్లో ఎలాగూ లేను. ఇక హాయిగా వాడితో ఎంజాయ్ చెయ్యి.” మళ్ళీ బిగ్గరగా నవ్వు. పొరలు, పొరలుగా దగ్గుతో మిళితమైన భయంకరమైన ఘీంకారం.

ఛీ! ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నడు? ఒక భార్యతో భర్త మాట్లాడే మాటలా? సిగ్గు,శరం లేదు. పదేళ్లు సంసారం చేసిన మొగడు. ఇద్దరు పిల్లలకు తండ్రి. అతనిలా భ్రమల్లో బతికే మగవాళ్ళకు ఎన్ని జన్మలెత్తినా, భార్యల నిజాయితీ అర్థం కాదు. కోపంతో ఫోను పెట్టేసింది వసంత.

పిల్లలిద్దరూ హోంవర్కు పూర్తి చేసి తల్లి దగ్గరికి వచ్చారు. “అమ్మా! కాసేపు మేం టీవి చూడచ్చా?” చిన్న కూతురు విన్ను వచ్చి అడిగింది. పెద్ద కూతురు వర్ణ తల్లి మెడ చుట్టూ చేతులు వేసి “అమ్మా! కాసేపు నీ ఫోను ఇవ్వవా! గేము ఆడుకుంటా..” మారాం చేసింది.

వసంత చేతిలో ఫోను వైపు చూసింది. శరీరంపై జెర్రులు పాకుతున్నట్లుగా భీకరంగా మోగుతోంది. మళ్ళీ అనుమానపు మొగుడే. తన చేతిలో వున్న ఫోనును చటక్కున వర్ణ చేతిలో పెడుతూ “నాన్నతో మాట్లాడి ఆడుకో తల్లీ!” అంటూ కూతురుకి ఫోనిచ్చి ఎవ్వరో తరుము తున్నట్లుగా వంటింట్లోకి నడిచింది.

***

చంద్రమోహన్‌తో పెండ్లై పదేండ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు, ఏ రోజు ఆమెను అతడు గౌరవించింది లేదు. సంతోషంగా ఆమె పక్కన కూర్చొని మాట్లాడింది లేదు. నిత్యం అవమానాలతో, అనుమానాలతో మనఃశాంతి లేకుండా బతకడంలోనే గడిచి పోయాయి ఇన్నిరోజులు..

అల్లారు ముద్దుగా ఇద్దరన్నదమ్ముల మధ్య పెరిగిన వసంతకు, తల్లికి దూరపు బంధువైన చంద్రమోహన్ పెండ్లి చేసుకుంటానని అడగ్గానే ఆమె తండ్రి సంబరపడి ఒప్పుకున్నాడు. వసంత ఇష్టాన్ని, మనసును తెలుసుకోవాలన్నఅవసరం కూడా వాళ్ళకు లేకుండా పోయింది. దాంతో డిగ్రీ పూర్తి కాకుండానే ఆమెకు మేనబావ వరసైన చంద్రమోహన్‌తో పెండ్లి జరిగిపోయింది.

మొదట్లో ఆమె పట్ల అతను ప్రేమగానే వున్నా, మెల్లమెల్లగా అతని సైకో స్వరూపం బయట పడడం వసంతను కలచివేసింది. అత్త, మామలకు చంద్రమోహన్ ఒక్కడే కొడుకు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో భయం, భయంగానే ఆమె జీవితం గడిచింది. వెంటవెంటనే పుట్టిన పిల్లల పెంపకంలో పడి, ఆమె తనను తాను మరచిపోయి చాలా సంవత్సరాలే రాలిపడ్డాయి. ఎదిరించి గెలవలేని స్థితి నుండి ఆమె మెల్లమెల్లగా కుంచించుకుపోతూ కుటుంబంలో అణుకువగా మెలగడం నేర్చుకుంది.

భర్త మీద కోపం వచ్చి, తన బాధను, దుఃఖాన్ని అన్నదమ్ములకు చెప్పాలని ప్రయత్నించి, విరమించుకుంది. తన తల్లిని, వారి భార్యలను వాళ్లెంత అన్‌పార్లమెంటరీ లాంగ్వేజెస్‌లో తిడుతారో తెలిసి మిన్నకుండిపోయింది. వాళ్ళకామె బాధ అర్థమైనా, అర్దం కానట్టే వుండేవారు. ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకుంది. పిల్లలు అనాథలై పోతారని, ఇష్టంలేకపోయినా, ఇక చేసేదేం లేక, తప్పని పరిస్థితిలో అన్నింటికి అడ్జెస్ట్ అయ్యేది. వస్తోంది.

చంద్రమోహన్ ఒక ప్రభుత్వ ఉద్యోగి. అందంతో పాటు అహంభావం పాలు కూడా అతనిలో ఎక్కువే. అతను తల్లిచాటు కొడుకు కావడంతో ఆమె మాట అతనికి వేదవాక్కు. తండ్రి ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి. ఆఫీస్ నుండి పనిచేసి వచ్చిన కొడుకుకు ఇష్టమైన వంటలు చేసి పెట్టేది. బ్యాంకు నుంచి మామగారు వచ్చేనా అర్ధరాత్రులు దాకా, అత్తగారు కొడుకును పక్కన కూర్చోబెట్టుకుని ఎప్పుడూ, ఏవో ముచ్చట్లు చెబుతునో, లేక టీవీ చానల్స్‌ను మార్చుతూ, చెత్త సీరియల్సన్నీ చూపించేది. తల్లి కూర్చున్న సోఫాలోనే చంద్రం నిద్ర పోయేవాడు. పగటి పూట భర్తతో మాట్లాడాలని ఎంత అనుకున్నా, తల్లిని వదిలి చంద్రమోహన్ వసంత వైపు చూసేవాడే కాదు. వసంత ఎన్ని సేవలు చేసినా, ఇద్దరూ ఏదో ఒక ఒంక చూపుతూ, చేసిన పనులనే తిరిగి చేయించేవారు. ఎవరితోనో ఒకరికి వసంతకు లైంగిక సంబంధాలు అంటగడుతూ అసభ్యంగా తిట్టేవారు. ఏకాంత సమయాల్లో కూడా అతనికి పరిచయం వున్న అమ్మాయిలను ఉహించుకుంటూ ఫాంటసీలో తేలుతూ వసంతను విసిగించేవాడు. ఒక్కోసారి అతని తల్లిదండ్రుల రహస్య విషయాలను సైతం చెబుతూ వెకిలిగా నవ్వేవాడు. భర్తతో కాపురమంటేనే వసంతకు ఒక రకమైన భయం పుట్టేది. అతని సహచర్యం ఆమెకు నచ్చేది కాదు. అయినా అన్నీ మౌనంగా భరించడం అలవాటు చేసుకుంది.

అత్తగారికి క్యాన్సర్ చివరి దశలో బయటపడి ఆరునెలలు తిరగకుండానే చనిపోయింది. ఆమె చనిపోయాకైనా, భర్త మారుతాడని ఊహించింది. చంద్రమోహన్ మారకపోగా, అంతకన్నా ఘోరంగా తయారయ్యాడు. ఎవరెవరినో ఊహించుకుంటూ వారితో లైంగిక కోరికలు కలల్లోనే తీర్చుకునేవాడు. ఇంట్లో వున్నంతసేపు ఈటల్లాంటి మాటలతో మరింతగా వేధించేవాడు. ఏవేవో భంగిమలు చెప్పి, అలా చెయ్యకపోతే మానసికంగా, శారీరకంగా హింసించేవాడు.

***

నాలుగు నెలల క్రితం కోణార్క్ టెంపుల్ చూసి వస్తానని చెప్పి వెళ్లి అక్కడే నెల రోజులు రూము తీసుకుని ఉండి వచ్చాడు. అక్కడికెళ్లి వచ్చినప్పటి నుండి స్త్రీల పట్ల అతని దృష్టి మరింత ఎక్కువగా మారిపోయాడు. శాడిస్టికల్ బిహేవియర్‌తో ఒంటిపై గాయాలు చేయడం మొదలుపెట్టాడు.

రెండు నెలల క్రితం ఆఫీసులో తన కొలీగ్ సృజనతో గొడవ పడి ఆమెను లైంగికంగా వేధిస్తుంటే, ఆమె పోలీసు కేసు పెట్టింది. చివరికి ఆఫీసులోవారు తనను ఆమెతో మాట్లాడించారు. భర్త ప్రవర్తన తెలిసి వసంతకు సిగ్గుతో చచ్చిపోయినంత పనైంది. ఏవేవో ఇల్యూషన్లను ఊహించుకుంటూ ఈమధ్య తననే కాదు.. కడుపున పుట్టిన ఇద్దరాడ పిల్లల్ని సైతం అనుమానిస్తు, అవమానించడం మొదలెట్టాడు.

అన్నయ్య స్నేహితుడు డా. రాఘవ కలిసినప్పుడు చంద్రమోహన్ ప్రవర్తన చెప్పి వసంత బావురుమంది. అతను సైకియాట్రిస్టు కావడం వల్ల ఏవేవో మందులు రాసిచ్చి అతనికి తెలియకుండా వాడమని చెప్పాడు.

నిన్న ఎవరో స్నేహితుని ద్వారా హంపిలో ఉన్న విరుపాక్ష దేవాలయం శిల్పకళతో ఉట్టి పడుతుందని విని, హడావిడిగా ప్రయాణమై వెళ్ళిపోయాడు.

వసంత భర్త ఆలోచనలు కట్టబెట్టి, మంచంపై భారంగా ఒరిగింది. పిల్లలెప్పుడు వచ్చి తన పక్కన పడుకున్నారో తెలియనంత గాఢనిద్రలోకి జారిపోయింది.

***

తెల్లవారు ఝామున నిరంతరంగా మొగుతున్న సెల్‌ను తీసి బద్ధకంగా లిఫ్ట్ చేసింది. అవతలి నుంచి చంద్రమోహన్. రాత్రి బస్సులో తన పక్కన కూర్చున్న ఒక స్త్రీ తనను ఎలా టెంప్ట్ చేసిందో ఏకరువు పెడుతున్నాడు. అంతమంది ప్రయాణిస్తున్న బస్సులో ఆమెతో జరిపిన శృంగార జీవితాన్ని వివరిస్తున్నాడు.

వసంతకు కడుపులో దేవినట్లైంది. ఫోను మంచంపై విసిరి గొట్టి, వాష్ రూములోకి వెళ్లి వాష్ బేసిన్‌లో భళ్ళున వాంతి చేసుకుంది. ఒక్కసారిగా కళ్ళముందు చీకట్లు కమ్ముకున్నట్లైంది. మెదడంతా మొద్దుబారి, కళ్ళు బైర్లు కమ్మి, మొహాన్ని చీరకొంగుతో తుడుచుకుంటూ గదిలోకి వచ్చి మంచంపై తల పట్టుకుని కూలబడింది.

ఫోనులో చంద్రమోహన్ వాయిస్ కట్ అయినట్లుగా ఉంది. ఫోను స్విచ్ ఆఫ్ చేసి కళ్ళు మూసుకుని మంచం మీద వాలిపోయింది. అనంత దుఃఖాన్ని మోస్తున్నట్లుగా గుండెల్లో నుంచి బాధ తన్నుకొచ్చి వెక్కివెక్కి ఎంత సేపు ఏడ్చిండో ఆమెకు గుర్తుకేలేదు.

“అమ్మా! అమ్మా! లేవమ్మా” అంటూ పిలుస్తున్న వర్ణ కుదుపులకు మెలుకువ వచ్చి కూర్చుంది. ఎదురుగా మామగారు నిలబడి వున్నారు.

“ఏమైందిరా వసంతా! పిల్లల్ని ఎంత గాబరా పెట్టావో చూడూ? పాపం మామయ్య ఎంత భయపడిపోయాడో! మామయ్య కాల్ చేశాడు కాబట్టి సరిపోయింది” పల్స్‌ను చెక్ చేస్తూ అన్నాడు రాఘవ.

రాఘవ వైపు, మామగారి వైపు చూస్తూ.. “అసలు నాకేమైందన్నయ్యా? మిమ్మల్ని ఈ వయసులో చాలా ఇబ్బంది పెడుతున్నా మామయ్యా..” అంటూ వసంత అతని చేతులు పట్టుకుంది.

అచ్యుత రామరావు మౌనంగా వంటింట్లోకి వెళ్లి ట్రేలో మూడు టీ కప్పులతో వచ్చాడు. ఒక కప్పు రాఘవకిచ్చి, మరొకటి వసంతకు ఇచ్చాడు. వసంత మౌనంగా టీ కప్పు అందుకుంది. పిల్లలిద్దరూ తల్లిని గట్టిగా పట్టుకుని ఆమె పక్కనే కూర్చున్నారు.

రెండు రోజుల తర్వాత కానీ, వసంత మామూలు మనిషి కాలేక పోయింది.

వారం రోజులైనా భర్త జాడ లేదు. ఇంట్లో పిల్లలూ, మామయ్య కూడా తన భర్త పేరు ఎత్తకపోవడం మరింత ఆశ్చర్యమేసింది. అదే విషయాన్ని మామగారిని అడిగింది. అతన్నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మౌనం వహించింది,

ఇంటికి వస్తున్నానని ఫోను చేసిన కొడుకు, రెండు రోజులైనా రాకపోవడంతో, అచ్యుతరామారావు కొడుకు చెప్పిన విషయం కోడలికి ఎలా చెప్పాలో అర్థం కాక మిన్నకుండి పోయాడు. వసంతకు మనసు లోపలెక్కడో ఆదుర్ధా వున్నా, భర్త ఏ క్షణాన వచ్చి ఏం గొడవ చేస్తాడో? అన్న దిగులు ఆమెను వేధిస్తూనే వుంది.

***

వారం రోజుల తర్వాత, ఓరోజు వసంత పిల్లల్ని స్కూలుకు పంపి వచ్చి, మామగారికి భోజనం పెడుతోంది. ఎవరో లోపలికి వస్తున్న అడుగుల చప్పుడు విని అచ్యుత రామారావు అటువైపుగా చూశాడు. ఎదురుగా చంద్రమోహన్. కొడుకు పక్కన మరో స్త్రీ. ఇద్దరు కొత్త దంపతుల్లా మెడలో పూలదండలతో నిలబడి వున్నారు. ఆ దృశ్యానికి ఆయన కళ్ళు నిప్పులై పోయాయి.

పట్టరాని కోపంతో కంచంలో చెయ్యి కడుక్కుని బయటకు వెళ్ళాడు. ఏం జరిగిందోనని వసంత మామగారి వెంట బయటకు నడిచింది. అత్యుతరామారావు బిగ్గరగా అరుస్తున్నాడు – “సిగ్గు, ఎగ్గు లేకుండా కట్టుకున్న భార్య దగ్గరికే ఇంకో ఆడదాన్ని తెచ్చావంటే, నువ్వేంత దుర్మార్గుడివో అర్థం అవుతోందిరా.. పాపిష్టివాడా! నిన్ను ఇన్నాళ్ళు భరించి కాపురం చేసిన ఆ పిచ్చి తల్లిని ఏం చేద్దామని అనుకున్నావురా అప్రాచ్యుడా!” అంటూ తిట్లు లంకించుకున్నాడు. ఎదురుగా కనబడిన దృశ్యం చూస్తూ వసంత నిశ్చేష్టురాలై మాట, పలుకు లేకుండా నిలబడిపోయింది.

ఇవేమీ పట్టనట్లుగా చంద్రమోహన్, తండ్రి కాళ్ళకు దండం పెట్టమని పక్కనునున్న అమ్మాయికి సైగ చేశాడు.

ఆ అమ్మాయి అచ్యుతరామారావు పాదాల దగ్గర ఒంగి తాకబోయింది. అచ్యుత రామారావుగారు నిరసనగా తన కాళ్ళను వెనక్కు లాక్కున్నాడు. ఆయన బిగ్గరగా అరుస్తూ.. “నీకన్నా సిగ్గులేదా? సాటి ఆడదాని కాపురంలో నిప్పులు పోసి, అన్యాయం చేయడానికి మనసేలా వచ్చింది?” విసుక్కున్నాడు.

ఆమె తలవంచుకుని మౌనంగా దిక్కులు చూస్తూ నిలబడిపోయింది.

“ఛీ! వాడికి సిగ్గు, ఎగ్గు ఎలాగూ లేదు. కనీసం నీక్కూడా లేనట్లున్నాయి. అసలు నువ్వు ఆడదానివేగా? మరో ఆడదానికి అన్యాయం చేయడానికి నీకు మనసేలా వచ్చింది?” అంటూ రొప్పుతున్నాడు..

“అయినా.. ఆ త్రాష్టుడితో కాపురం ఎంత మురికి కూపమో! నువ్వు అనుభవిస్తేనే నీకు తెలుస్తుందిలే..” ఇంక ఏం తిట్లు తిట్టాలో అర్థం కాక ఆయన తలపట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడిపోయాడు.

అప్పటిదాకా వీళ్ళ సంభాషణలు విన్న వసంతకు మరేం మాట్లాడాలని అనిపించలేదు. అచ్యుత రామారావు వైపు చూస్తూ “మామాయ్య! మీరు ఇక ఏమి మాట్లాడినా వేస్ట్. ఇన్నిరోజులు మీ కొడుకును భరించి చాలా తప్పు చేశాను. దిక్కుమాలిన ఈ పనితో, ఇప్పటి దాకా మా మధ్యన వున్నఆ కాస్త బంధం కూడా తెగిపోయింది. ఆయన జీవితం ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించనీయండి. నాకు నా పిల్లలు వున్నారు. నాకు వాళ్ళు చాలు” అంది.

“అది కాదమ్మా!” అచ్యుతరామారావు కోడలికి ఏదో చెప్పబోయాడు

“ఇంకేం చెప్పకండి మామయ్యా! మీరు కన్నతండ్రి కంటే నాకు ఎక్కువ. ఇకనుంచి మీ కోడలుగా కాక మీ బిడ్డగా నన్ను స్వీకరించండి. అతను అతని దారి చూసుకున్న ప్పుడు, నేను ఈ నిర్ణయం తీసుకోవడంలో తప్పులేదు” అంది సావధానంగా..

“అది కాదమ్మా!” ఆయన మాటను మద్యలోనే తుంచుతూ.. “వద్దు మామాయ్య! ఇక డిస్కషన్స్ వద్దు. నేనూ ఆయనతో విసిగిపోయాను. ఆయనలో ఇక మార్పురాదు. మీరు, నేను పిల్లలం అందరం కలిసి తిండి లేకపోయినా, ఇన్ని గంజినీళ్ళు తాగైనా బతుకవచ్చు. అంతేగానీ, అతనితో ఇక నావల్ల కాదు..” అంటూ పరుగులాంటి నడకతో బెడ్ రూములోకి వెళ్ళి , చంద్రమోహన్ బట్టలను ఒక పెట్టెలో కుక్కి, తెచ్చి మామగారి కాళ్ళ దగ్గర పెట్టింది.

“మామయ్యా! మనకు దూరంగా ఇక ఆయనను ఎక్కడికైనా వెళ్లిపొమ్మని చెప్పండి” అంది వణుకుతున్న గొంతుతో..

ఇవన్నీ గమనిస్తున్న చంద్రమోహన్ వికటంగా నవ్వుతూ.. “ఏమే! మొగుడిని వదిలి మామగారితో ఏకంగా కాపురం పెట్టె ప్లాను బాగానే వేసావు.. మీ బాగోతం తెలిసే, నేను దీన్ని పెండ్లి చేసుకుని తెచ్చింది” అంటూ తన అహంభావాన్ని ఏమాత్రం తగ్గకుండా ఎదురు దాడికి సిద్దపడ్డాడు చంద్రమోహన్.

“ఛీ! పాపిష్టి వెధవా! నీ నోరు పాయఖానా లేక మరేదైనానా? కూతురు లాంటి పిల్లతో తండ్రికి సంబంధం అంటగడుతున్నావా? నా కడుపున చెడబుట్టావు గదరా!” వణుకుతున్న కంఠం, మాటలు రాక అచ్యుత రామారావు గొంతు దుఖంతో పూడుక పోయింది.

“మామయ్యా! ‘అశుద్ధం మీద రాయి విసిరితే, మన ముఖం మీదే చిందుతుంది’. ఆయనతో మనకు మాటలు అనవసరం. తండ్రిలా మీరు నాకు ఈ ఆశ్రయం ఇస్తే చాలు. పిచ్చి కుక్కలు ఎన్ని మాట్లాడుకున్నా నాకు లెక్కలేదు” అంది.

“అది కాదమ్మా!” ఆయన ఏదో చెప్పబోయాడు.

“ఇంకా మీరు ఏ ఒక్క మాట మాట్లాడినా.. మీ మనవరాళ్ళ మీదే ఒట్టే!” అంది.

వసంత మాటలకు ఆయన ఇంకా ఏమీ మాట్లాడలేక, మౌనంగా కూర్చుండి పోయాడు.

వసంత చంద్రమోహన్‌కు దగ్గరగా వచ్చి తన చేతుల్లో వున్న సూట్ కేసును ఆ అమ్మాయి చేతిలో పెట్టి, “నీ పేరు ఏంటో నాకు తెలియదు. నువ్వు అతనిలో ఏమి చూసి పెండ్లి చేసుకున్నావో.. ఏమో?. ఇప్పుడు తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. దయచేసి ఇక్కడ గొడవలు చేయకుండా, ఆయనను దూరంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లిపో! నువ్వు మా నెత్తిన పాలు పోసిన దానివి అవుతావు” అంది.

ఆవిడ విస్తుపోతూ వసంత వైపు, చంద్రమోహన్ వైపు మార్చి మార్చి చూసి, కదలకుండా తలవంచుకుంది.

చంద్రమోహన్ ముందుకు ఉరికినట్లుగా వేగంగా కదిలి, వసంత చేతులను పట్టుకుని, లకారాలతో ఆమెను దూషిస్తూ.. ఆమె రెండు చెంపలు వాయించడం మొదలుపెట్టాడు.

“ఏమే! మా నాన్నాను వలలో వేసుకోవడమే కాదు, నా ఆస్తిని కూడా కొట్టేయాలని ఎన్ని పన్నాగాలు పన్నావే! వగలాడి” అన్నాడు.

“దుర్మార్గుడా! రంకుతనం నువు చేస్తూ దేవత లాంటి నా కోడలికి రంకు అంటగడతావా? నువ్వు అసలు మనిషి పుటక పుట్టావా? ఇంకోసారి ఆ పిల్లమీద చెయ్యి వేస్తే చూడూ.. నిన్ను ఇప్పుడే పోలీసులకు పట్టించకపోతే!” ఆవేశంగా వసంతను కొడుకు చేతుల్లో నుంచి విడిపిస్తూ అన్నాడు.

వసంత అవమాన భారంతో లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది.

అచ్యుతరామారావు కోడలు వెళ్ళిన వైపు కంగారుగా చూసాడు. కొడుకును చూస్తూ.. “నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా? లేక పోలీసులను పిలవనా?” గద్దించాడు.

***

వర్ణ, విన్ను స్కూలు ఆవరణలోకి పోయాక అచ్యుతరామారావు కోడలు వైపు చూస్తూ “పిల్లలు ఈ ఏడు సంవత్సరాలలో ఎంత ఎదిగారమ్మా! టెన్త్ పరీక్షలు అయిపోతున్నాయి. నెక్స్ట్ వాళ్ళు ఏం చదివినా చదివిద్దాం?” అన్నాడు తృప్తిగా.

“మామయ్యా! మీకో విషయం చెప్పాలి.”

“ఏంటో చెప్పమ్మా!”

“ఈరోజు మనం కోర్టుకు వెళ్ళాలి.”

“అవునమ్మా! మరచేపోయా! ఈ రోజే కదా! విడాకులు వచ్చేది..” అన్నాడు.

“అవును మామయ్యా! ఈ రోజు నుండి నేను స్వేచ్చాజీవిని” అంది నిట్టూర్చుతూ..

“అదేంటమ్మా! అలా బాధపడుతున్నావ్? ఇన్నిరోజులు విడాకులు ఎప్పుడొస్తాయో అని ఆలోచించాం. తీరా ఇప్పుడు బాధపడుతున్నావా?”

“అదేం లేదు మామయ్యా! నా పిల్లలను తండ్రిలేని వారిగా చేస్తున్నానేమో అన్న అభద్రత నన్ను వేధిస్తుందంతే!”

“ఎందుకు అలా అనుకుంటున్నావ్? ఆ త్రాష్టుడు, తండ్రిగా వాళ్లకు ఎప్పుడైనా బాధ్యత వహించాడా? ముత్యాల్లాంటి పిల్లలను ఏనాడైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడా? నీ బాధలో అర్థమే లేదు తల్లీ! పిచ్చి ఆలోచనలు మానేయమ్మా! అయినా నీ వయసేం ముదిరిందని? నీ జీవితంలో మరో వ్యక్తి వచ్చినప్పుడు, పిల్లల బాధ్యతను నేను తీసుకుంటాను. వాళ్ళ గురించి నువ్విక దిగులు మానేసేయ్. ఇన్నాళ్ళు ఎలా పెరిగారో రేపూ అలాగే జీవిస్తారు.. నువ్వు జాగ్రత్త తల్లీ! కోర్టుకు వెళ్ళి ఆ పేపర్లేవో తీసుకునిరా! పిల్లల్ని నేను చూసుకుంటాను” అన్నాడు కోడలివైపు ఆత్మీయంగా చూస్తూ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here