మనసున మనసై

8
7

[dropcap]నా[/dropcap] మనసంతా నిండిపోయింది శశి. నాకన్నా నాకు ఇష్టమైనది తన మనసు. చుట్టూ ఎందరున్నా నా కళ్ళు ఎప్పుడూ నా శశిని వెదుకుతూనే ఉంటాయి. తను కనిపిస్తే నా చూపులు తడుముతూనే ఉంటాయి. తన కళ్ళలో నాపై వున్న ప్రేమను చదవటం నాకు ఇష్టం. ఆ పెదవులపై మెరిసే చిన్న చిరునవ్వులో నాపై వున్న అనురాగం చవిచూడటం నాకు మరీ ఇష్టం.

శశి పెదవులు విచ్చుకోకుండా చిన్నగా ముద్దుగా ఓ చిన్న నవ్వు నవ్వుతుంది. ఆ పెదవులు నాతో దూరం నుంచే ఎన్నో మాటలు నిశ్శబ్దంగా మాట్లాడతాయి. ఒక్కోసారి ‘బావా ఇంతదూరం ఉన్నావేం’ అని ముడుచుకుంటాయి. ఎంతమంది మధ్యలో ఉన్నా నాకోసం వెతికే నా శశి చూపు, నేను కనబడక ఆ లేడికళ్ళలోని తత్తరపాటు నా కన్నులకు విందు. ఒకవైపు నన్ను చూడాలని తాపత్రయం, మరోవైపు పదిమంది ఉన్న ఇంట్లో ఎవరైనా గమనించి ఆటపట్టిస్తారేమో అని బెరుకు. నా శశి నా మదిలో వున్న చెలగాటం తన కళ్ళలో చూడటం అంటే అదో వేడుక. కొంతసేపు తనతో దోబూచులాడాక నేను కనిపిస్తే, నా శశి కళ్ళలో కనిపించే వెలుగు, వెంటనే ఓ సిగ్గు దొంతర, అంతలోనే ఇంతసేపటికా కనిపించేది అంటూ ఓ అలక, ఆపైన తన తనువంతా నా చూపులు తడిమేస్తున్నాయని గమనించగానే ఆ కళ్ళలో ఓ ఉలికిపాటు. అంతలోనే నా ప్రేమకు కట్టుబడిపోయి రెప్పవేయడం మరిచిపోయిన ఆల్చిప్పలవంటి నా శశి కళ్ళు.

నేను శశికి కొత్త కాదు. నా శశి నాకు కొత్త కాదు. ఇద్దరూ బావామరదళ్ళం. తను మా మేనత్త కూతురు. ఎదురుబొదురు ఇళ్ళు. మా చిన్నతనంలోనే మా ఇద్దరికీ పెళ్ళి అని పెద్దలు నిర్ణయించారు. నా శశి నాకన్న రెండేళ్ళు చిన్నది. తనని నేను చిట్టిపొట్టీ గౌనుల్లో, తరువాత పరికిణీలో చూశాను. పరికిణీ నుంచి ఓణీలలోకి ఒదిగి ఎదుగుతున్న నా శశి సొగసులతో ప్రేమలో పడిపోతూనే ఉన్నాను.

మాది పెద్ద ఉమ్మడి కుటుంబం. ఊరిలో మా తాతయ్య కట్టించిన మండువా ఇల్లు. మా నాన్న, పెదనాన్న, బాబాయి అందరూ భార్యపిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉంటాము. సినిమాల్లో, నాటకాల్లో చూపించినట్లు అందంగా సాగిపోయే జీవితాలు మావి. సర్దుబాటు కష్టపడి పనిచేయటం, ఒకరినొకరు ఆటపట్టించుకోవడం అన్నీ మా జీవితాలలో భాగమే. మా ఎదురింటిలోనే వుంటుంది మా చిన్న మేనత్త రాధ. వాళ్ళదీ పెద్ద కుటుంబం. వాళ్ళ రెండో కూతురే నా శశి.

ఇంతమంది మధ్యలో ఉన్నా నాది నా శశిది వేరే ప్రపంచం. శశి తన చూపులతోనే నన్ను పలకరిస్తుంది. తను బావా అని పిలిచిన ప్రతిసారీ ఆ పిలుపులో మాటల్లో చెప్పలేని మధురమైన అనుభూతి. ఆ పిలుపులోనే తన ప్రేమంతా నాపై కురిపిస్తుంది. ఆ పిలుపుకే నా మనసు కట్టుబడిపోతుంది. నా శశి నన్ను నోరు తెరిచి ఏదీ అడుగకపోయినా తను బావా అని పిలిస్తే చాలు, తనకి ఏం కావాలో నాకు తెలిసిపోతుంది. నా ఇష్టాయిష్టాలు, నాకు ఎప్పుడు ఏది అవసరమో నా శశికి పూర్తిగా తెలుసు. మా ఇంట్లో నాకు నచ్చని కాకరకాయ కూర చేస్తే, సరిగ్గా నేను కంచం ముందు కూర్చునే వేళ, “పద్మత్తా! అమ్మ బంగాళాదుంప వేపుడు చేసింది. నీకు ఇష్టమని తెచ్చానత్తా” అంటూ చటుక్కున వచ్చి గిన్నెలో కూరంతా నా కంచంలో వేసేసి, ఓ ముక్క మా అమ్మ నోట్లో పెట్టి, “బావుందా అత్తా?” అని నావంక ఓరకంట చూస్తూ, సిగ్గుని పెదవుల మధ్య నలిపేస్తూ వెళ్ళిపోతుంది. మా ఇంట్లోవాళ్ళు నన్నెక్కడ ఆటపట్టిస్తారో అని నేలచూపులు చూస్తూ, వచ్చే నవ్వుని పెదవులతో ఆపేసి అన్నం కలుపుతాను. మా ఇద్దరినీ చూసి ఇంట్లో అందరూ మురిపెంగా నవ్వుకుంటారు.

నేను శశి ఎప్పుడూ ఒకరినొకరు ఒకమాట పరుషంగా అనుకోవటం నాకు గుర్తులేదు. అలా అని మా మధ్య అభిప్రాయ భేదాలు లేవని కాదు. కానీ అందంగా సర్దుకుపోవటం మా ఇద్దరి నైజం. ఒకరోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి అమ్మ మరుసటి ఆదివారం నాడు ద్వారకా తిరుమల వెళ్ళాలి పొద్దునే లేవమని చెప్పింది. “అబ్బా సెలవురోజు కదమ్మా, నేను కాస్త ఎక్కువసేపు పడుకుంటా. ఈ ఒక్కసారికీ మీరే వెళ్ళండి” అన్నాను. అది శశి పెట్టిన ప్రయాణం అని నాకు తెలీదు. ద్వారకా తిరుమల ప్రయాణానికి శశి ఎంతో పట్టుబట్టి ఇంట్లో అందరినీ ఒప్పించిందట. కానీ నేను రాను అనేసరికి, వెంటనే తను పోనీలే అత్తా, అందరూ ఈ ఆదివారం హాయిగా విశ్రాంతి తీసుకోండి ఇంకోసారి వెళ్ళచ్చులే, ఇప్పుడేమంత తొందర, అని చల్లగా జారుకుంది. ‘హారి పిడుగా, ఇప్పటిదాకా మా అందరి దుంప తెంచి, వస్తారా రారా అని హఠం చేసిన పిల్ల, బావకి ఇబ్బంది అనగానే ఎంత నాజూకుగా విషయం సర్దేసింది’ అని అందరూ ముక్కున వేలేసుకున్నారు. శశి వెళ్ళాక ఈ విషయం మా చెల్లెలు సీత చెప్పింది. భోజనానికి కూర్చున్న నేను, కాసేపు పడుకుంటే ఈ అలసట తీరిపోతుంది లేమ్మా, దేవుడి దగ్గరికి వెళ్దాం అనుకుని మానేయటం ఎందుకు వెళ్దాం లేమ్మా అన్నాను. మా అన్యోన్యతకు పెద్దవాళ్ళు ముచ్చటపడ్డారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో.

నాకు జ్వరం వస్తే నా శశి గుళ్ళో పొర్లుదండాలు పెట్టేది. తనకు జలుబు చేస్తే నేను కూడా తనతో పాటు కషాయం తాగేవాడిని. నేను ఎంచిన పట్టులంగా ఓణీనే తను వేసుకునేది. నేను చిరాకుగావున్నా, కోపంగా వున్నా, అలసిపోయి వున్నా, ఒత్తిడిలో వున్నా, నా ఎదురుగా నా శశి వుంటే చాలు, మనసు తేలికపడుతుంది. భర్తకి భార్య విశ్రాంతి స్థానం అంటే ఇంతకన్న ఏముంది. పెళ్ళికాలేదు కానీ అభి – శశి ఒక్కటే అని ఇంట్లోవాళ్ళు చాటుగా అనుకుని మురిసిపోవటం ఎన్నోసార్లు నా చెవిన పడింది.

ఇలా అందానికి అందం, హృదయానికి హృదయం, నా ప్రాణానికి ప్రాణం అయిన నా శశి కాసేపటిలో నా అర్థాంగి కాబోతుంది. అవును – ఇప్పుడు నేను పెళ్ళికొడుకుని. పచ్చని పట్టుబట్టల్లో కళ్యాణవేదికపైన వున్నాను. మరికొద్ది క్షణాలలో నా బంగారు బొమ్మ శశిరేఖను బుట్టలో కూర్చోబెట్టి, నా ఎదురుగా తెరకి అవతల వైపున తెస్తారు. ఆ వెలకట్టలేని పెన్నిధిని నేను కన్యాదానంగా అందుకుంటాను. మా ఇరువురి జీవితాలు మరికొద్దిసేపట్లో వేదమంత్రాల సాక్షిగా ఒకటికాబోతున్నాయి. మంగళ వాయిద్యాల ఘోషలో బంధుమిత్రుల ఆశీర్వాదాలతో నిండు పున్నమి లాంటి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here