మనసున మనసై…

0
7

[dropcap]“హా[/dropcap]య్ సిద్ధూ! నీకో గుడ్ న్యూసోయ్!…”

అప్పుడే స్కూటీ పార్కు చేస్తూ అంది ఆపేక్ష తన బాయ్ ఫ్రెండ్‌తో.

“వెల్‌కమ్ అపూ; ఏంటో ఆ గుడ్ న్యూస్. ఈ రోజు చాలా హుషారుగా వున్నావ్; చెప్పు… చెప్పు…. ఆ గుడ్ న్యూసేంటో?” బండి లాక్ చేస్తూ అన్నాడు సిద్ధార్థ.

“అవునోయ్! మరి హుషారు కాక? మొన్న యిచ్చిన ఎగ్జామ్ పాసయి ప్రమోషన్ వచ్చిందోచ్!” అంది చిన్న పిల్లలా నవ్వుతూ.

“రియల్లీ? యీజిట్? కంగ్రాట్స్! అయితే పద! పద! ఈ రోజు నీకు మాంఛి పార్టీ యిస్తాను! మనం ఈ రోజు హే…. పీగా సెలబ్రేట్ చేసుకుందాం” అన్నాడు ఆపేక్షను అభినందిస్తూ.

అలా సాయంకాలాలు పార్కు దగ్గర కల్సుకోడం యిద్దరికీ అలవాటు.

“ఓ…కే… బై ఆల్ మీన్స్! పద పద!”

యిద్దరూ రెస్టారంటుకి బయల్దేరారు.

“అవునూ ఏం ఆర్డర్ చేయ్యమన్నావ్?” అన్నాడు సిద్ధూ కుర్చీలో కూర్చుంటూ.

“నా యిష్టాలు నీకు తెలీవా?” అందామె కిల కిలా నవ్వుతూ.

“ఎందుకు తెలీదు?” అన్నాడు సర్వరుకి ఆర్డరిస్తూ.

“అవునూ! వుత్త పార్టీ ఏనా ఏంటమ్మా! అంత మంచి న్యూస్ చెపితే?” అంది ఆపేక్ష కళ్లు చెక్రాల్లా తిప్పుతూ.

“అడగవయ్! యింకా నీకేం కావాలో?… కోహినూరు వజ్రం కావాలి, మైసూర్ పేలస్ లాంటి మహల్ కావాలి అనకుండా మరేవైనా నా మీన్స్‌లో కోరుకో. తప్పకుండా యిస్తాను నా తాహతుకు తగ్గట్టు” అన్నాడు సిద్ధర్ధ నవ్వుతూ.

“అంతంత ఆశలు లేవు బాబూ! నీ స్నేహమే నాకవన్నీనూ! అది చాల్లే! అది సరే కాని ఈ రోజు వర్క్ తొందరగా అయిపోయిందా? రమ్మనగానే బయల్దేరావ్?” కాఫీ సిప్ చేస్తూ అంది.

“అదేం కాదు! తొందరగా రమ్మని ఆర్డర్ జారీ చేసావుగా అందుకని.”

“ఓ అదా… చాల థాంక్స్!”

“కాక! మరి లేట్ చేస్తే అలకపాన్పు ఎక్కి సత్యభామ అవతారం ఎత్తవూ?” టీజ్ చేస్తూ అన్నాడు.

“యూ నాటీ!” అందామ కిలకిలా నవ్వుతూ.

ఆపేక్ష శ్రీమంతుల బిడ్డ. ఒక్కతే కూతురవడం వల్ల అల్లారు ముద్దుగా పెరిగింది. అందమైంది. తెలివైంది. చదువు పూర్తి చేసి ఉద్యగంలో చేరి కొన్నాళ్లు ఎంజాయ్ చేసాక పెళ్లి చేసుకుంటానంది. కాదనలేకపోయారు తల్లి,తండ్రులు. ఆమె అనుకున్న విధంగానే ఉద్యగంలో చేరింది. తల్లి, తండ్రులున్న ఊళ్లోనే బేంకిలో ఉద్యోగం దొరికింది. అక్కడే ఏదో మంచి పేరున్న కంపెనీలో స్టాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నాడు సిద్ధార్థ. తరచు బేంకికి వచ్చి వెళేవాడు పని మీద. ఆపేక్షతో అతనికి పరిచయమైంది. యిద్దరి అభిరుచులు, అభిప్రాయాలు కలవడం వల్ల వారి పరిచయం ప్రేమగా మారి ఒకరికి ఒకరు అకర్షితులయ్యారు. వారి పరిచయం, ప్రేమ పెళ్లి వరకూ దారి తీసింది.

ఈ రోజు యువత మనుషులతోనే కాక, మనసులు యిట్టే కల్సిపోతాయి. అది ఎంత వరకు స్థిరంగా వుంటుదన్నది వేరే విషయం. ఆపేక్ష తల్లి తండ్రులు పెళ్లికి ఒప్పుకున్నారు. సిద్ధార్థ ఒప్పించాడు. ఆపేక్ష తల్లి పెళ్లికి ఒప్పుకున్నా, కూతుర్ని హెచ్చరించింది. ఎందుకంటే సిద్ధార్థ మనిషి మంచి వాడయినా, మంచి ఉద్యగంలో వున్నా బాధ్యతల బరువు ఆయన నెత్తి మీద వుంది. ఆపేక్ష అల్లారు ముద్దుగా పెరిగింది. అక్కడి వాతావరణంలో సరిగ్గా అడ్జస్టు కాగలదో, లేదో అని భయం. ముందున్న ఆకర్షణ తరవాత వుండదు. ప్రేమ మైకంలో బాధ్యతలు, బరువులు గుర్తుకురావు. అదీ ఆమె భయం. అదే అంది కూతురుతో.

“అపూ! నువ్ బాగా ఆలోచించు. మీ నాన్నగారిని ఒప్పించడం అదేం పెద్ద పని కాదు. పెళ్లి ముందున్న ఆకర్షణ, ఆతృత, పెళ్లి తరవాత కూడ నిలబెట్టుకోవాలి. ప్రేమంచుకుంటున్నప్పుడు అన్నీ అందంగా, ఆకర్షణీయంగానే వుంటాయి. బరువు బాధ్యతలు, తెలీని జీవితం అది. ఒకరిపై మరొకరికి ఆకర్షణ, కోరిక, వుంటుంది కాని ఆలోచన వుండదు. నది పైకి ఎంత అందంగా కనబడుతుంది! కాని దిగితే కాని లోతు తెలీదు. జీవితం అంతే! నిన్ను భయ పెట్టాలనీ, మభ్య పెట్టాలనీ యివన్నీ చెప్పడంలేదురా! చదువుకున్నదానివీ, తెలివైనదానివీ, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో!, నీ నిర్ణయాన్ని కోరికనీ మేమెప్పుడూ అంగీకరిస్తాం!” అంది కూతురు తల తడుముతూ.

“అదేంటమ్మా! నేనేం చిన్న పిల్లనా యిన్నిజాగ్రత్తలు చెపుతున్వావ్?” తల్లి వైపు చూసి నవ్వుతూ అంది ఆపేక్ష.

“తల్లికి బిడ్డలెప్పుటూ పసివారే. నీకూ బిడ్డ పుడితే అప్పుడు తెలుస్తుందిలే! అయినా అపూ! ఈనాటి తరానికి కోరికే కాని కృషి తెలీదు. ఒకటి పొందాలంటే ఎన్నో వదులుకోవాలి అందుకే అన్నాడో కవి. ‘ఏదీ తనంత తానై నీదరికి రాదు…సాధించి శోధించాలి… అదియే ధీరగుణం’ అని తెల్సిందా?” ఆపేక్షని ముద్దాడుతూ అంది తల్లి.

“ఓకే అమ్మా! నీ కొటేషన్ చాల బాగుంది సుమీ. అయితే అమ్మా! నాన్నగారు నీ మాట వింటున్నట్లుగానే సిద్దూ కూడా నా మాట వినాలని దీవించమ్మా” తల్లిని గట్టిగా వాటేసుకుని అంది ఆపేక్ష.

“తప్పకుండా! మీ నాన్నకి నా మాటే కాదు రా! నేనన్నా ప్రాణమే! కాని ఆ అర్హత ఆ యోగ్యత సంపాదించుకోడానికి, దాని వెనుకున్న నా కృషి, ఓరిమి, సాధన నీకు తెలివు అపూ! యిందాకే చెప్పాను కదా! ఏదీ తనంత తాను మన్ని వరించదు. ఒక మనిషి మనసు గెలవాలి. వాని మనసులో సుస్థిర స్థానం సంపాదించాలంటే, దానికి తగిన కృషి, నేర్పు, ఓర్పు కావాలి. సిద్ధార్థ మంచి కుర్రాడే కాని అతని వెనుక చాల బాధ్యతలున్నాయి. అవన్నీ తెల్సుకుని, అతనికి సహకరించాలి. మనస్సు గెలిచి మసలుకోవాలి. అదీ నీ బాధ్యత. నువ్వేమో అల్లారు ముద్దుగా పెరిగావ్. లేదు కాదు అన్న పదం నువ్వు ఎరగవు. పెళ్లి కాక ముందు వున్న ఆకర్షణ మరే ఆలోచనలని మదిలోకి రానివ్వదు. ఆ జీవితం ఓ రంగుల కల. ప్రేమలో పడ్డ వారికి అదే హరివిల్లులా అనిపిస్తుంది. అదో మైకం. ఇద్దరిదీ ఒకే లోకమై ఊహల్లో తేలిపోతారు. పెళ్లి రెండు మనసులకే కాదు. రెండు కుటుంబాలకి చెందింది. పెళ్లయ్యాక తెలుస్తాయి ఒకరిలోపాలు మరొకరికి. అప్పుడే బాధ్యతలు మొదలవుతాయి. ఆనాటి నుండే అసలైన జీవితం ఆరంభం అవుతుంది. అప్పుడే ఆడది ఓర్పు, సహనం వహించి, భర్తకి అన్ని విధాల సహకరిస్తే సంసారం సాఫీగా సాగిపోతుంది. కార్యేషు దాసి. కరణేషు మంత్రి అన్న విధంగా నడుచుకోవాలి!…”

“అమ్మా తల్లీ!… నీ సుదీర్ఘ ఉపన్యాసం విన్నాను. నా మీద నీకు నమ్మకం లేదా!”

“నా నమ్మకం కాదు… యిక్కడ కావలసింది. నీ ఆలోచన.”

“సరి! సరి! మరి అన్నీ భార్యకేనా మరి భర్త ఏం సర్దుకో అక్కర్లేదా?” అప్పుడే ఆమె అహం దెబ్బతింది.

“అదిగో! అదే మరి ‘ఇగో’ అంటే? భర్తకి బాధ్యత ఎందుకుండదు. కాని ఎక్కువ సర్దుకోవలసింది ఆడదే. భర్తకి అన్ని విధాల అనుకూలంగా వుంటే భార్య పట్ల భర్త తప్పక అనుకూలంగా వుంటాడు.మనసు తెలిసి మసలుకోని మనసులో స్థానం ఏర్పరుచుకోవాలి తెల్సిందా.”

మౌనంగా ఆలోచిస్తుంది ఆపేక్ష.

“ఓర్పుతో, నేర్పుతో ప్రవర్తించి, అణుకువగా వుంటూ, భర్తనీ సరైన మూడ్లో వుంచి ప్రవర్తిస్తే ఆ తరవాత భర్త భార్యకు దాసుడవుతాడు. అప్పుడు భార్యాభర్తల దాంపత్య జీవితంలో పొరపొచ్చాలుండవు. అన్నీ మబ్బుల్లా తొలగిపోయి యిద్దరూ ఒకటవుతారు. అదే నే వడ్లగింజలో బియ్యంగిజ అంటే!”

“ఆడది సహనం వహించాలి. అందికే ఆడదాన్ని “క్షమయా ధరిత్రీ” అని భూదేవితో పోల్చారు. భార్య అనుకూలవతి అయితే భర్త ఎప్పుడూ ఆమెకు దాసుడే! అంటే ఆమెకు దాస్యం చేస్తాడని కాదు. ఆమె ప్రేమకు, జీవితానికి దాసుడవుతాడు. ఈ రహస్యం తెల్సుకుని ఆడది మెలగాలి. పెళ్లి స్త్రీకి సంఘంలో ఓ గౌరవం స్థిరత్వం కలిగిస్తుంది. కట్టుబాట్లుకులోనై వుండాలి స్త్రీ. ఇవి ఏ పుస్తకాల్లోనూ దొరకవురా పెద్దల నుండి నేర్చుకోవాలి! తెల్సిందా?” బుజ్జగిస్తున్నట్టుగా అంది కూతురుతో.

“ఏంటోయ్! కూతురు ధ్యాసలో ఈ దీనుడ్ని మర్చిపోయావా? ఇక ఆ సుదీర్ఘ ఉపన్యాసం ఆపి నన్ను కరుణించు దేవీ.”

“ఓ… అయామ్ వెరీ… వెరీ సారీ… సర్. ఇదిగో క్షణంలో తెస్తా!” అపరాధిలా వంటగది వైపు పరుగుతీసింది రాధ.

“అమ్మకి నాన్నంటే ఎంత భయం. ఈ చిన్న విషయానికే ఎంత పెద్ద అరపాధిలా అలా పరుగు పెట్టిందీ అమ్మ. మారు పలక్కుండా. ఫెంటాస్టిక్!” పైకే అనేసిందా మాట ఆపేక్ష.

“అవును అపూ! ఇదే కాదు నా ప్రతి కదలిక ఆమె నిశితంగా పరిశీలిస్తుంది. ఏ చిన్న విషయంలోనూ నా పట్ల ఆశ్రద్ధ చూపించదు. నాకేది సకాలంలో అందకపోయినా ఆమె బాధపడుతుంది. ఇన్నెందుకు ఆమె నా కళ్లతోనే చూస్తుంది. నా మనసుతోనే ఆలోచిస్తుంది. పెళ్లయిన్నేళ్లయినా ఆదే ఆమె తత్వం. అదే సహనం. అదే ఓర్పు. ఆ ప్రేమ నన్ను ఆమెకు దగ్గరగా కట్టి పడేసింది!” అతని కళ్లు తృప్తితో మెరిసాయి మిలమిలా.

“అవును నాన్నా! ఆమె ఎప్పుడూ నీకు షాడోనే.”

“అవున్రా! నా ప్రతి కదలికలో ఆమెది ముఖ్యపాత్ర. ఆమె సహకారమే లేకపోతే నేనోక సిటీలో నెంబర్ వన్ పొజీషన్లో వుండేవానిని కాదురా?”

“ఈజిట్?” కళ్లు పెద్దవి చేసి అడిగింది ఆపేక్ష.

“ఎస్ బేబీ! ఆమె తల్లి తండ్రులకి ఒకే సంతానం కావడం వల్ల. ఆమె పుట్టింటి నుండి తెచ్చిన ధనం తోనే నేను వ్యాపారంలో నిలదొక్కుకుని నాకంటూ ఉన్నతమైన స్థానం సంపాదించుకోగలిగాను. నా కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకురాగలిగాను. ఇదంతాను అమ్మ అండదండలతో ప్రాప్తించిందే.”

తండ్రి వంక ఆశ్చర్యంగా చూసింది ఆపేక్ష. “ఆ ఇగో అమ్మలో ఎప్పుడూ చూడలేదు నాన్నా.”

“అదేరా ఆమె గొప్పతనం. నాకున్న కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకుని, నాకు సహకరించి సంతానం కూడ కొన్నాళ్లు వద్దనుకుంది. అందుకే నువ్వు లేటుగా పుట్టావ్. ఒకరు చాలనుకుంది. నా బాధ్యతలు, బరువులు స్వీకరించిన దేవతరా ఆమె. అందుకే నువ్వుంటే మాకు ప్రాణం” కూతురు తల నిమురుతూ అన్నాడు.

“ఏంటండోయ్ ప్రాణం అంటున్నారు? ఏం నాతో చెప్పకూడదా?” భర్తకి కాఫీ అందిస్తూ అంది రాధ.

“అదేనోయ్ నువ్వంటే నాకు ప్రాణం అన్నా” భార్య భుజం మీద చెయ్యి వేసి అన్నాడు కాఫీ అందుకుంటూ.

తల్లీ కూతుళ్లు నవ్వుకున్నారు. వారి నవ్వుతో తనూ శృతి కలిపాడు.

“నా తల్లికి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది” అంటూ కూతుర్ని అక్కున చేర్చుకుంది రాధ. సిగ్గుల మగ్గే అయింది ఆపేక్ష.

***

అంగరంగ వైభవంగా జరిగిపోయింది పెళ్ళి. ఆపేక్ష, సిద్ధార్థ దంపతులయ్యారు.

అల్లుడు కట్నం కోరలేదని, తన అంతస్తుకి తగ్గట్టుగా అన్నీయిచ్చేడు అల్లుడికి. ఆపేక్ష పేరున యిల్లు కొనియిచ్చేడు. సిద్ధార్థ ఆఫీసుకి దగ్గర్లో బాడుగకు యిల్లు తీసుకుని వుంటున్నారు కొత్త దంపతులు. స్వంత యిల్లు అద్దెకిచ్చారు. ఆపేక్ష స్కూటీ మీద బేంకుకి వెళ్తుంది. కొత్త దంపతులకి కాలం తేలీని జీవితం ఆనందంగా సాగిపోతోంది.

ఆఫీసులో లోను తీసుకుని చెల్లికి పెళ్లి చేసాడు. యింకా తమ్ముడు చదువు పూర్తి కాలేదు. బాధ్యతల బరువు సిద్ధార్థ నెత్తిని వుంది. అయినా చేతనయినంతలో భార్యను బాగానే చూసుకుంటాడు. ఎవరినీ యాచించే స్వభావం కాదు అతనిది. ఆత్మ గౌరవం ఎక్కువ. ఉద్యగంలో చాల ఆనెస్టు. మంచి పేరు సంపాదించుకున్నాడు ఆఫీసులో.

సిద్ధార్థకన్నా అరగంట ముందుగా వచ్చి భర్త రాక కోసం ఎదురు చూస్తుంది ఆపేక్ష.

“హాయ్ అపూ! ఏంటీ ఈ రోజు మేడమ్ గారు తొందరగా దయ చేసారు” సోఫాలో కూర్చుని బూట్లు విప్పుకుంటూ అన్నాడు సిద్ధార్థ.

“అవునోయ్ మగడా! ఆ నీకో గుడ్ న్యూస్ చెప్పాలోయ్ అందుకే ఈ ఎదురు చూపులు!” కాఫీ కప్పు అందిస్తూ అంది ఆపేక్ష.

“ ఏంటో అది? ఏం! మళ్లా మరో ప్రమోషనా?” కాఫీ అందుకుంటూ అన్నాడు.

“ఆ!… ఆశ… దోశ…. అదే పనా?” ప్రక్కనే కూర్చుంటూ అంది ఆపేక్ష కిలకిలా నవ్వుతూ.

“మరింకేం పని?” అన్నాడు ఆమెను గట్టిగా వాటేసుకుంటూ.

“అబ్భ వదులవోయ్! ఏంటా దూకుడు?” అంది గోముగా పట్టు వదలించుకోకుండానే.

“వదలడానికా నిన్నింత కష్టపడి కట్టుకిందీ… పట్టుకుందీ?” అన్నాడు మరింత గట్టిగా కౌగిట్లో బంధిస్తూ.

అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది కిలకిలా నవ్వుతూ.

“ఈ నవ్వుల కోసమే… నేను కాచుకున్నను. ఈ కౌగలి కోసమే నిన్ను కట్టుకున్నాను!….” రాగ యుక్తంగా అంటూ ఆమె చెక్కిళ్లు ముద్దాడాడు.

“ఏంటో ఈ రోజు అయ్యగారిలో వున్న ‘కవి గాడు’ బైటకి తన్నుకొస్తున్నాడు. పర్లేదు ‘లిరిక్స్’ తప్పయినా పాట బ్రహ్మండంగా వుంది!” అంది అల్లరిగా అతని క్రాపు చిందరవందర చేస్తూ.

“అవునయ్ భామామణీ! ఎదురగా నువ్వుంటే ఎన్నెన్ని రాగాల… చల్లని నీ మదిలో ఏ శ్రావణ మేఘాల!…” ఆమె ముఖాన్నిరెండు చేతుల్లోకి తీసుకంటూ అన్నాడు.

అతని కళ్లల్లోకి ఆరాధన పూర్వంగా చూసింది ఆపేక్ష. ఆమె బుగ్గలు గులాబి రేకులే అయ్యాయి. కించిత్ గర్వం కూడ కలిగింది తన అదృష్టానికి.

“అయితే మరి విషయమేమిటో చెప్పనియ్యవా” గారాలుపోతూ అంది అతని లతలా అల్లుకుపోతూ.

“వైనాట్ చెప్పువోయ్… చెప్పు… చెప్పు….”

“అయితే మరి బుద్దిగా కూర్చో… చెప్తా!” అంది సర్దుకుని కూర్చూటూ

“ఓ..కే…!”

“మరేం లేదోయ్! నా బెస్ట్ ఫ్రెండ్ మేరేజ్ ఫిక్సయింది. మెసేజ్ పంపింది. మనం రెండు రోజులు ముందుగానే వెళ్లాలి. ఎప్పుడో నా దగ్గర ప్రామిస్ తీసుకుంది. మరీ… మరీ చెప్పింది మనిద్దర్ని రమ్మని.”

“ఓ… అలాగా?” ఎప్పుడుట పెళ్లి?”

“ఎప్పుడంటే నెక్స్ట్ వీక్. అంతే!””

“అయ్య బాబోయ్! నెక్స్ట్ వీక!ే ఈ నెల అస్సలు లీవు దొరకదోయ్. నాకు బోలెడు ప్రాజెక్టు వర్కుంది డియర్.”

“అదేం కుదర్దు. మనం వెళ్లి తీరాల్సిందే! ఇద్దరం వెళ్తున్నాం…. అంతే!” అంది లేచి నిల్చుని.

“చెపుతున్నాకదరా! మా అమ్మవి కదూ! కావాలంటే రెండ్రోజులు లేంటి నాలుగు రోజులు ముందుగా నువ్వెళ్లు. నేనడ్జస్టయిపోతా!”

“ఏం… టీ నువ్వు రాకుండా నీనొక్కత్తనూ పెళ్లికి వెళ్లాలా? అలా ఏం కుదర్దు! మీరూ రావలిసిందే!”

“చెపుతున్నాకదరా! నా మాట విను! ఈ వర్కు టైములో పూర్తి చేస్తే మంచి ప్రమోషన్ వస్తుంది. శాలరీ కూడ ఎక్కువ వవుతుంది! తెల్సా?” బోధపరచే ధోరణిలో అన్నాడు కూలుగా.

“నువ్వు రాకుండా నేవెళ్లడం జరగదు సిద్దూ. మనిద్దరం పెళ్లాయ్యాక కలిసి అటెండు అయే మొదటి ఫంక్షన్ యిది. ఒక్కర్తినీ వెళ్తే నాకేం బాగుంటుంది చెప్పు?”

“మరి నాకు కుదరదు కదమ్మా!”

“ఏం? ఏందుక్కుదరదు? ఎప్పుడూ శాలరీ…. శాలరీ డబ్బు… డబ్బు… అనేనా జీవితం? మరేం సరదాలూ ఆనందాలూ అక్కర్లేదా?” మొండి పట్టు వదల్లేదామె.

ఒప్పించడానికి చాల ప్రయత్నించాడు సిద్ధార్థ. ఆమె కన్విన్స్ కాలేదు.

“ఛీ!…. ఛీ!… ఏం జీవితం? ఓ అచ్చటా ముచ్చటా లేదు… ఎప్పుడూ డబ్బు యావే” రుస రుసలాడుతూ కాఫీ కప్పు నేలకేసి కొట్టింది. మాటా… మాటా పెరిగింది. సిద్ధార్థలో సహనం నశించింది.

“ఆపేక్షా! ఏంటా పొగరు?” విసురుగా అన్నాడు.

అతను పూర్తి పేరు పెట్టి పిలిచేసరికి ఆమె అహం దెబ్బతింది.

“ఛా!… ఛా!… నేనేం మేడలు మిద్దెలు అడిగానా? కార్లు బంగ్లాలు అడిగానా? సింపుల్‌గా ఫంక్షన్‌కి రమ్మన్నా… దానికింత రాద్ధాంతం చెయ్యాలా? ఛీ… ఏం మనిషో? మా అమ్మ చెప్పనే చెప్పింది నువ్వెప్పుడూ బాధ్యతల బరువుతో తలమునకలవుతావనీ, నేనే వినలేదు. ప్రేమే పెన్నిధి నీ సన్నిధే నా పెన్నిధి అంటూ అల్లాడిపోయను! అందుకే అనుభవిస్తున్నా” పశ్చాత్తాపం ఆమె మాటల్లో ధ్వనించింది.

“ఏం నన్ను చేసుకున్నందుకు యిప్పుడు బాధపడుతున్నావా?”

“ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి?” ఆమె ముక్కుపుటాలు అదురుతున్నాయి.

“ఛా!…. ఛా!… యింత చిన్న విషయానికి యిల్లు నరకం చేస్తున్నావ్!”

“ఇది చిన్న విషయమా? యిల్లు నరకం చేస్తున్నానా? అయితే హాయిగా స్వర్గం వెతుక్కో! అక్కడ రంభ, ఊర్వశి, మేనక వుంటారు హేపీగా ఎంజాయ్ చెయ్యి!”

“నాన్‌సెన్స్! మరీ అంత చీపుగా మాట్లాడకు!”

“ఏం నీ వ్యవహారం చీపుగా లేదూ? భార్య ముద్దు ముచ్చట తీర్చాల్సిన బాధ్యత నీకు లేదు?”

“ఏం నా బరువు బాధ్యతలు నీవి కావా?”

“ఏందుక్కావు? అందుకే యిన్నాళ్లూ నిన్నే అడగలేదు. ఈ అడిగిందానికి తీర్చే అవకాశం నీకు లేదు. పొందే అదృష్టం నాకు లేదు. దేనికైనా పుట్టి పెట్టాలి. అంతా నా ఖర్మ!”

“తేగే వరకూ సాగదీయకు అపూ! కాస్త నోరు సంబాళించుకో.”

అతని హెచ్చరిక ఆమెకు అవమానంగా అనిపించింది.

“ఏం బెదిరిస్తున్నావా? తెగేదే అయితే తెగిపోవడం మంచిదే” ఆమె మనసు భగ్గుమంది. విసురుగా వెళ్లి తలుపేసుకుంది. ఆ రోజు పుడ్డు, బెడ్డు యిద్దరికీ లేవు.

***

రోజులు గడుస్తున్నాయి. తండ్రి యిచ్చిన యింట్లకి మకాం మార్చింది. ఒంటరి జీవితం యిద్దరికీ యిరుగ్గానే వుంది. ‘చిన్న విషయానికే యింత రాద్ధాంతం చేసానా? ఎందుకంత మోరటుగా ప్రవర్తించేను? నేను వెళ్లనంత మాత్రాన నా ఫ్రెండుకి ఒరిగిపోయిందేంటి? పెళ్లి చేసుకుని అది హాయగా భర్తతో హనీమూన్‌కి వెళ్లింది. యిక్కడ నేను పెళ్లికి వెళ్లలేకపోయానని చింతిస్తూ భర్తకి దూరం అయ్యాను! ఛీ!… ఛీ!… ఎంత పొరపాటు చేసాను! నా తల్లి, తండ్రులకి తెలిస్తే ఎంత బాధపడతారు’ ఆమెలో అంతర్మధనం ఆరంభం అయింది.

ఇక్కడ సిద్ధార్థ పరిస్థితీ అలాగే వుంది. ఎప్పుడూ కోరనిది కోరిక కోరింది. దాన్ని తీర్చలేకపోయాను. “పాపం, ఆపేక్ష! ఎంత బాధ పడిందో?…” అతని మనసు విలవిల్లాడింది.

“నేనే నోరు జారేను ఎంత తొంతర పడ్డాను! సిద్ధూ నా ప్రాణం. నా యింటికి నేను వెళ్లడానికి ఎందుకాలోచించాలి”.

మనసు ప్రక్షాళన అయింది. మంచులో తడిసిన మల్లెలా వుందామ మనసిప్పుడు.

సిద్ధూలోను అదే అంతర్మధనం. ఇంటికి తొందరగా వెళ్లి అపూకి యిష్టం వచ్చినవి కొని ఆమెను ఆనందంగా ఆహ్వనించి తీసుకురావాలి. ఇవీ అతని ఆలోచనలు. తోవలో కొన్ని స్వీట్లు, మల్లెపువ్వులు కొని తొందరగా యింటికి చేరుకున్నాడు. తలుపులు తీసే వున్నాయి. “ఇదేంటి ‘లాక్’ చెయ్యడం మర్చిపోయానా?” ఆలోచిస్తూనే యింట్లో అడుగు పెట్టాడు. ఆలోచిస్తూ అలసటగా సోఫలో కాస్త రిలాక్స్ అయ్యాడు.

కళ్లకి చల్లని స్పర్శ సోకింది. అది ఒళ్లంతా పులకరింప చేసింది. “ఎస్ యిది అపూ స్పర్శ. యింకవరికుంటుంది యింత ఆకర్షించే శక్తి.”

మెల్లగా చేతులు తీసి చూసాడు. ఎదురుగా అప్సరసలా ఆపేక్ష.

“అపూ!” కళ్లు తెరుస్తూనే ఆశ్చర్యంతో వాటేసుకున్నాడు.

“నన్ను క్షమించు సిద్ధూ!” అంటూ కన్నీళ్లతో అతని కౌగిట్లో బందీ అయిందామె గువ్వలా ఒదిగిపోతూ.

“ఛీ… ఛీ… మనలో మనకి క్షమాపణలేంటి… రియల్లీ అయామ్ వెరీ సారీరా, నువ్వు నన్ను క్షమించు.”

“నేనే తొందరపడ్డా నేను మీ సమస్యలు అర్థం చేసుకోక!”

“అదేం కాదు కాని యిదిగో నీ కిష్టం అని ఏం స్వీట్ తెచ్చానో చూడు!” అన్నాడు పాకెట్ చూపిస్తూ.

“ఈ స్వీటు కన్నా నాకు మరే స్వీటు అక్కర్లేదు!” అందామె అతన్ని గట్టిగా వాటేసుకుని.

“అయితే తినిపిస్తాను పద!” అంటూ ఆమెను అమాంత ఎత్తుకుని బెడ్ రూం వైపు దారి తీసాడు. అతని మెడ చుట్టూ చేయి వేసి కిలా కిలా నవ్విందామె.

“విరహము కూడా సుఖమే కాదా… నిరతము చింతన మధురము కా…దా… వియోగవేళల విరిసే ప్రేమల విలువను కనలేదా…”

దూరంగా మధుర మనోహరంగా వినపడుతోంది ఆ స్వరం.

ఆ యిద్దరి మధుర సంగమమే వారికా రాత్రి విందు భోజనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here