మనస్విని 002

0
8

[dropcap]స[/dropcap]మీప భవిష్యత్తులో ఒక రోజు.

నగరంలో ఒక పెద్ద హాస్పిటల్…

“నేను లేక నీవు లేవు. నీవు లేక నేను లేను.”

ప్రేమంటే ప్రేమించిన వ్యక్తిని ఎప్పటికీ వదిలిపెట్టి ఉండలేకపోవడం.

అనుక్షణం ఆ కళ్లల్లోకి చూస్తూ… అనంతమైన నీలాకాశం లోకో, అంతరిక్షంలోకో అలౌకికంగా వెళ్లిపోయిన భావన కలగడం.

ప్రేమంటే ఇద్దరు విడిపోకుండా రెండు మనసులు రెండు శరీరాలు రెండు ఆత్మలు కలిసి అవిభక్తంగా శాశ్వతంగా ఉండిపోవడం…

శాశ్వతత్వం, దగ్గరితనం, మనసులు ఏకం కావడం…

మనస్వినీ…

అతనికి తట్టుకోలేని దుఃఖం కమ్ముకు వచ్చింది.

నిశ్శబ్దంగా ఉన్న విశాలమైన హాలు. ఏసీ కంప్రెసర్‌లో చల్లదనంలో, పాలరాతి నేలలో తెల్లని గోడలలో

మృత్యు శైతల్యం…

దూరాన స్ట్రెచర్ మీద తెల్లని దుప్పటి కప్పిన ఆమె. నిశ్శబ్దంగా నిశ్చలంగా నిద్రపోతున్నట్టు ఉంది.

ఇదేనా శాశ్వతత్వం!

ఇంతేనా మనిషి భావనకి విలువ!

ఇంత క్షణికమేనా,

చిరునవ్వులు,కన్నుల తళుకులు, కురుల నల్లదనం లోని మెరుపు, మాటలలోని కవ్వింపు, నవ్వుల లోని ఆత్మవిశ్వాసం, ఎప్పటికీ తనతోనే ఉంటుందన్న ఆసరా…

ఒక ఆరు నెలల్లో అంతా అయిపోయింది.

ఎక్కడో ఒక మూల మెదడులో ఫ్రాంటల్ లోబ్‌లో కణాలు విశృంఖలంగా పెరగటం ప్రారంభమవుతాయి.

ఆ పెరుగుదలను నియంత్రించే శక్తి ఆమె శరీరానికి వుండదు.

అటానమీ… అంటే స్వయం పాలన నియో ప్లాసియా… అంటే మానవ సాధారణ పరిభాషలో చెప్పాలంటే కేన్సర్!

మెదడు క్యాన్సర్!

“గ్లయో బ్లాస్ట్ మా మల్టీ ఫార్ మీ. హైలీ మాలిగ్నెంట్… చాలా తీవ్రమైన కేన్సర్. ఒక సంవత్సరం కంటే జీవిత ప్రమాణం లేదు.” డాక్టర్ మాటలు.

ఆపరేషన్.

ఆ భయంకరంగా పెరిగిపోతున్న కణితి కత్తితో తీసేసినా సరే కణాలని సమూలంగా నాశనం చేసినా సరే, రేడియో కిరణాలని పంపినా సరే…

మళ్లీ ఎక్కడో చోట పెరుగుతూనే ఉంటుంది.

చివరికి మెదడును అంతా ఆక్రమించుకుంటుంది.

మనస్విని… తన మనస్విని… జలపాతం లాంటి అనురాగ ఝరి… ఆగిపోతుంది.

ఆగిపోయింది.

అతను ఒక్కడే స్ట్రెచర్ వైపు నడవసాగాడు. విశాలమైన హాలులోతన పాదాల చప్పుడు తనకే వెయ్యిరెట్లు శబ్దంతో వినబడసాగింది.

చివరికి తెల్లని దుప్పటి మెల్లగా వణుకుతున్న చేతులతో తొలగించాడు.

అతని దుఃఖాన్ని అతనే ఒంటరిగా అనుభవించాలని చూస్తున్న డాక్టర్లు దూరాన కళ్ళు తుడుచుకున్నారు‌.

“మనస్వినీ… మనస్వినీ… ” అనురాగ్‌లో ఉన్న నిశ్శబ్దపు అగ్నిపర్వతం అప్పుడు బద్దలై ఏడవసాగాడు.

కీమోథెరపీతో పూర్తిగా నున్నగా అయిన తల, అయినా తీర్చిదిద్దినట్లున్న ముఖం, ఒక తెల్లని పాలరాతి శిల్పాన్ని పడుకోబెట్టినట్లు మనస్విని చలనం లేని శయనంలో ఉంది.

అంతర్లీనమైన దుఃఖానికి చివరి పరిష్కారం అంతులేని రోదనమే. డాక్టర్లు కొంచెం నిట్టూర్చి అతని శోకంలో అతనిని కొంచెంసేపు వదిలి వెనక్కి వెళ్లిపోయారు.

ఉధృతమైన తుఫాన్‌కి పెట్టే సముద్రపు హోరులా కొంత సేపు అతను ఏడుస్తూనే ఉన్నాడు.

“నువ్వు నిజం, శాశ్వతం అనుకున్నాను. ఏదీ నిజం కాదు. అంతా నీటి బుడగ లాంటిది జీవితమే. కానీ నువ్వు కావాలి. నువ్వే కావాలి. మళ్లీ కావాలి. ఎలాగైనా సరే.”

అతను ఏడుస్తూనే ఉన్నాడు. అంతఃచేతన మెల్లగా తేలిక పడసాగింది.

***

అనురాగ్…!

అనురాగ్…!

కాలింగ్ బెల్ పెద్ద చప్పుడుతో ప్రతిధ్వనిస్తూ, తలుపు మీద కూడా కూడా ఎవరో దబదబా కొడుతూ పిలుస్తున్నారు.

చివాల్న లేచి కూర్చున్నాడు.

గడియారం ఉదయం 10:00 చూపిస్తుంది.

తెల్లవార్లు విస్కీ తాగుతూ వుండి నాలుగు గంటలకి నిద్రపోయాడు.

గబగబా డ్రెస్సింగ్ గౌన్ సర్దుకుని హాల్లోకి వెళ్ళి తలుపు తెరిచాడు.

నరేన్ ముఖర్జీ అతనిభార్య బిందు ముఖర్జీ! తను

పని చేసే ఆఫీసులో కొలీగ్స్. చాలా సంవత్సరాల నుంచి తన మంచి కోరే స్నేహితులు.

“అనురాగ్! ఏమిటిది? ఆఫీసుకు రావు! తెల్లవార్లు తాగి పగలు పడుకుంటున్నావని అందరూ చెప్పుకుంటున్నారు. అందుకే చూద్దామని వచ్చాము.”

అలాగే నిలబడిపోయాడు.

“లోపలికి రాకూడదా?”

‘సారీ!’ త్రుళ్ళిపడ్డాడు. “నరేన్,బిందు, నైస్ టు సి యు. లోపలికి రండి ప్లీజ్!”

అతనికి పరామర్శలు ఇష్టం లేదు. గతం గురించి చర్చించడం బి పాజిటివ్ అని చెప్పించుకోవడం, మళ్లీ కొత్త జీవితం మొదలు పెట్టమని చెప్పే ఉపన్యాసాలు వద్దు. తన దుఃఖంలో తనని గడపనియ్యాలి. కానీ వాళ్లు తన మేలు కోరే ప్రియ స్నేహితులు. వారిని ఎలా కాదంటాడు?

లోపలికి వెళ్లి కిచెన్‌లో పనిచేస్తున్న హెల్పర్ మోహన్‌కి మూడు కాఫీ తీసుకురా అని చెప్పాడు.

ముగ్గురూ కాఫీలు తాగుతుంటే నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ బిందు అన్నది.

 “అనురాగ్! డిప్రెషన్ నుంచి బయటపడాలి! బయటకు రా!అందరితో మాట్లాడాలి!గతం మర్చిపోవాలి!”

 “ఉహు, లాభం లేదు బిందూ,మనస్వినే మాటిమాటికి గుర్తుకొస్తోంది. ఆమె కనబడాలి. మాట్లాడాలి. నాకు ఈ ప్రపంచంలో వేరెవరూ లేరు.”

నవీన్ బిందు ఇద్దరూ ఒకరి వైపు మరొకరు చూసుకున్నారు. బిందూ తన అక్క లాంటిది.

నవీన్ హుందాతనానికి ప్రతిరూపం.

“ఒకటి చెపుతా వింటావా? ఒక అడ్రస్ ఇస్తాను. కాల్ చెయ్యి. రిజువినేషన్ సర్వీసెస్ అని కొత్తగా మొదలు పెట్టారు. మనస్విని ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు, పాటలు అభిరుచులు ఏమన్నా ఉంటే అన్నీ పంపించు. లేదా సింపుల్‌గా ఆమె ఐడి వాళ్ళకి ఫార్వర్డ్ చెయ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ సైన్సెస్ ఎంతో వృద్ధి చెందాయి. నీ మనస్విని మరో రూపంలో మళ్ళీ ఇంటికి వస్తుంది. ఈ త్రాగుడు,విషాదం బదులు ఆమె రూపంతో మాట్లాడే అయినా మర్చిపోగలం కదా.”

ఓ మై గాడ్ తల పట్టుకున్నాడు ఎలా! మనస్విని మళ్లీ క్రియేట్ చేయగలరా. ఇంపాసిబుల్!

“నా ఫ్రెండు ఒకామె ట్రై చేసింది. చాలా హాయిగా ఉంది భర్త రూపంతో. బాధ మరిచిపోవడానికి ఆధునిక సాంకేతికత వాడుకో. తప్పేమిటి? ఫోటోలు చూసినట్లు గానే,అయి పోయిన సంఘటనల వీడియోలు చూసినట్లు గానే, నువ్వు వాడే alexa లాగానే చెప్పినట్లు విని సమాధానం చెప్పి నిన్ను పాత జ్ఞాపకాలని మరిపించే కొత్త మనస్విని… నువ్వు ఎఫోర్డ్ చేయగలవు.”

కంపెనీ పేరు నంబరు టారిఫ్ వివరాలు ఉన్న కార్డు ఇచ్చింది.

వాళ్లు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారే. కానీ ఇలాంటివి అతనికి ఇంకా అనుభవంలోకి రాలేదు.

వణుకుతున్న చేతులతో కార్డు తీసుకున్నాడు.

“బై అనురాగ్! అంతా అయినాక నీకు బాగా లేకపోతే క్యాన్సల్ చేసుకోవచ్చు. you will be better off with that అని నా నమ్మకం.”

వాళ్ళు తలుపు వేసి వెళ్ళిపోయారు.

దుస్సహమైన నిశ్శబ్దం ఆ ఇంట్లో మళ్లీ ఆవరించింది.

ఫోన్ తీసి నంబర్ డయల్ చేశాడు.

***

రిజువినేషన్ సర్వీసెస్ లిమిటెడ్ వారి ఫ్రంట్ ఆఫీసు విశాలంగా ఏసీ చల్లదనంతో, తళతళ మెరిసే పాలరాతి నేల పరిచిన చల్లదనంతో మెరిసిపోతోంది.

 “మే ఐ హెల్ప్ యు?”

అనురాగ్ తన మొబైల్ ఫోన్‌లో చూసి చెప్పాడు. “ఐ డినెంబర్ నైన్ నైన్ వన్. డెలివరీ తీసుకోవడానికి వచ్చాను.”

“వన్ మినిట్” రిసెప్షనిస్ట్ కీబోర్డు మీద నంబర్ డయల్ చేసి మానిటర్ తెర వంక చూసి చెప్పింది.

“మీ ఆర్డర్ రెడీ. ట్రయల్ పీరియడ్ ఒక వారం ఉంటుంది. నచ్చకపోతే మని రిఫండ్ చేస్తాం. కానీ ఇప్పుడే మొత్తం అమౌంట్ పే చేయాలి.”

“ఓకే నా పేమెంట్ తీసుకోండి.” మొబైల్ కీబోర్డ్ నెంబర్ నొక్కాడు. ఎకౌంట్‌లో నుంచి పది లక్షలు ఖాళీ అయింది.

పేమెంట్ డన్.

“కొంచెం సేపు కూర్చోండి. మీరు డెలివరీ ఇక్కడే తీసుకుంటారా?”

“ఎస్!”

“ఆమెకు ఇష్టమైన డ్రెస్?’

అనురాగ్ త్రుళ్ళి పడ్డాడు.

మరో క్షణంలో మనస్విని రూపంలో మరబొమ్మ రాబోతోంది. మరబొమ్మా లేక తన ప్రేమకు ప్రతి రూపమా? బహుశా యాంత్రిక శరీరానికి బట్టలు వేసి తీసుకొస్తారేమో!

బాటిల్ గ్రీన్ కలర్ లో చీర, పింక్ కలర్ లో బ్లౌజ్.

తనకు గుర్తొచ్చింది చెప్పాడు.

యాక్టివేట్ చేయటానికి అరగంట పడుతుంది. దయచేసి కూర్చోండి!

అతనికి మనసు వివశం అవుతోంది. తప్పు చేస్తున్నాడా! జీవితం నుంచి అదృశ్యమైన సహచరి తిరిగి వస్తే తను తట్టుకోగలడా?

సంతోషమా లేక బాధనా?

మనస్విని… ఏ రూపంలో ఉన్నా ఆమె ఉండాలి తన జీవితంలో. కళ్ళు మూసుకున్నాడు.

“హాయ్ అనూ”

తుళ్ళి పడి కళ్ళు తెరిచి చూశాడు.

ఆకుపచ్చ రంగు చీర, పింక్ రంగు బ్లౌజ్, మెరిసే కళ్ళు… అనూ అని తనని పిలవ కలిగే స్వరం ఒక్కటే!

5 అడుగుల 6 అంగుళాల పొడవు, నల్లటి కళ్ళు, పోనీ టైల్ లా కట్టుకుని వదిలేసిన జుట్టు, నుదిటిన ఎర్రటి కుంకుమబొట్టు, మెరిసే కళ్ళు, నవ్వేఎర్రని పెదాలు…

మనస్వినీ…

“అవును అనురాగ్! ఇంటికి వెళదామా? కారు తెచ్చావా?”

ఆమె వెనుకనుంచి… ఉద్యోగస్తులు కావచ్చు. “ఆర్డర్ ఆక్టివేటెడ్ సార్! కానీ 2 రోజులకు ఒకసారి ఛార్జ్ చేయవలసి ఉంటుంది. సాధారణంగా మీరు అడిగే కమాండ్స్ అన్ని వింటుంది. వంట చేస్తుంది. సంభాషణ చేస్తుంది. కానీ…”

“కానీ ఏమిటి?”

“మీ ఇంటికి వందగజాల దూరం లోనే ఉండటం మంచిది. అంతకంటే దూరం సిగ్నల్ రావు.”

అతనికి ఆశ్చర్యంగా ఉంది.

మనస్విని మళ్లీ వచ్చింది! భయంకరమైన క్యాన్సర్తో మరణించిన మనస్విని కాదు. యవ్వనంలో తనని మురిపించిన భార్య.

తిరిగి అదే రూపం!

మార్వెల్. టెక్నలాజికల్ మార్వెల్! “అద్భుతంగా సృష్టించారు!”

“థాంక్యూ సార్! రిజువినేషన్ సర్వీసెస్ సదా మీ సేవలో… ఏదైనా సాంకేతిక సమస్య వస్తే ఈ నెంబర్ డయల్ చేయండి. మీ ఇంటి దగ్గరకి వచ్చి చేసే సర్వీసెస్ కూడా ఉన్నాయి.

“అనురాగ్ వెళ్దాం!”

 ఆమె కంఠస్వరంలో మాడ్యులేషన్ కూడా డిజైన్ చేశారు!

“ఓకే మనస్విని! వెళ్దాం!”

***

నిర్మానుష్యమైన ఇల్లుమళ్లీ కళకళలాడుతోంది.

మనస్విని గబగబా ఇల్లు సర్దుతోంది.

అది ఎప్పుడూ ఆమెకు అలవాటే. శుభ్రత ఆమెకు ఆబ్సెషన్.

“డిన్నర్ చేయమంటావా?”

అదే మృదువైన స్వరం.

కిచెన్ ఈజ్ ఎంప్టీ. వంటింట్లో ఏమీలేవు.

“మోహన్‌కి చెప్పి గ్రోసరీ లు కూరగాయలు అన్నీ తెప్పించు. నన్ను వంటకి కూడా ప్రోగ్రాం చేశారు.”

గతుక్కుమన్నాడు.

ప్రోగ్రాం, యాక్టివేషన్, ఛార్జింగ్…!!! హఠాత్తుగా ఆమె ఒక యాంత్రికవ్యక్తి అని గుర్తుకు వస్తోంది.

హెల్పర్ మోహన్ లోపలికి వచ్చాడు. ఆమెను చూసి షాక్ తిని అలాగే నిలబడి పోయా డు.

మనస్విని సూపర్ మార్కెట్ నుంచి తీసుకు రావాల్సిన వస్తువులు లిస్ట్ చెప్పసాగింది.

మోహన్ తేరుకుని “సరే! అమ్మ గారూ!” అని అతనితో “బాబూ! డబ్బులు ఇవ్వండి! తీసుకు వస్తా.” అన్నాడు

“మంచిగా చూసుకుని, కూరలు తీసుకురా! నేను రాలేను కదా!” మనస్విని అంటోంది.

అవును గుర్తుకు వచ్చింది‌ ఇంటికి వంద గజాల పెరిమీటర్ దాకనే సిగ్నల్ వస్తుంది.మనస్విని సోషల్ మీడియాలో, యూట్యూబ్‌లో ఇతరత్రా సైట్లలో చేసిన రికార్డింగులు పోస్టింగులు, ఆమె కంఠస్వరం అభిరుచులు ఆధారంగా ఆమెని డిజైన్ చేశారు. కానీ దూరం రాలేదు.

లంచ్. ఆమె లాగానే కూరలు కోయటం వంట చేయటం… పక్కన మోహన్ అందిస్తూనే ఉన్నాడు అన్ని వస్తువులు.

వేడి వేడి చపాతీలూ, అన్నం, ఆలూ ఫ్రై సాంబార్ పెరుగు పచ్చడి…

“నీకు ఆవడలు ఇష్టంగా! కానీ ఈరోజు చేయలేదు.”

ఆమె అలా హాల్‌లో కూర్చుంటే ఆమెనే చూస్తూ కూర్చున్నాడు.

ఒక్కసారి మనసు తేలికగా ఉంది. ఆమెకు క్యాన్సర్ రావడం ఆరునెలలు హాస్పిటల్లో ఉండటం భారమైన చివరి రోజులూ అన్నింటినీ మర్చిపోయాడు.

టీ టైం. ఇలాచీ టీ,ఉస్మానియా బిస్కెట్లూ, ప్లేట్లో పెట్టుకుని వచ్చింది.

“నీకు ఇష్టమైన క్రికెట్ మ్యాచ్ వస్తోంది, టీవీ పెట్టు!”అంది.

సాయంత్రం 6:00 అయ్యింది. నిజానికి ఆ సమయానికి వాళ్ళిద్దరూ రోజూ వాకింగ్‌కి పార్కు కి వెళ్ళే వారు.

ఇప్పుడు ఆమెకు రావటానికి వీలు పడదు అని తెలుసు. “నువ్వు టీ తాగావా?” అడిగాడు…

“లేదు. నా ప్రోగ్రాంలో అది లేదు.”

 “బిస్కెట్లు తినవా?” మనసులో అనుకున్నాడు. నీకు ఎలక్ట్రిసిటీ కావాలి అంతే.

“పాట పాడగలవా?”

“ఓకే. పాడగలను. నీకు ఇష్టమైన పాట” రాగమయీ రావే…పాడుతోంది అద్భుతంగా. పాటలకి ప్రోగ్రాం చేయడం తేలిక.

ఆమె స్వరం చాలా ఛానల్‌లలో నిక్షిప్తం అయింది కాబట్టి.

డిన్నర్.

రెడ్ వైన్, బిర్యానీ, ఫిష్ కర్రీ, చాక్లెట్ ఐస్ క్రీం. అతను తింటూ ఉంటే వడ్డిస్తూ చూస్తోంది.

అది పదేళ్ల క్రితం తమ వివాహ వార్షికోత్సవ డిన్నర్ మెనూ.

ఆడియో సిస్టం లో నుంచి ఏ జిందగీ ఉసీకి హై పాత హిందీ పాట వస్తోంది.

అన్నీ జ్ఞాపకాలే!

ఆ తర్వాత న్యూస్,టీవీ, స్టార్ ఫ్లీట్ సైఫీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లో సగం ఎపిసోడ్ మాత్రమే చూసి టీవీ ఆపివేయడం…

ఇక బెడ్ రూమ్.

లేచి కొంచెం పర్ఫ్యూమ్ కొట్టుకునివచ్చింది.

ఆ తర్వాత, మెత్తని ఒళ్ళు, ఇంకా సహజంగా తయారు చేసిన సాఫ్ట్ అవయవాలు, సింథటిక్ రబ్బరేమో. మతి పోతోంది.

పదేళ్ళు కాలంలో వెనక్కి ప్రయాణించినట్లు అయ్యింది.

ఒక గంట క్షణం గా గడిచిపోయింది. అలసటతో ఆమె మీదనుంచి పక్కకి ఒత్తిగిల్లాడు.

“గుడ్ నైట్ మై స్వీటీ! ” అదే ముద్దుగా స్వరం.

“ఇప్పుడే వస్తాను”అని లేచి బాత్ రూం లోకి వెళ్లింది.

ఇది కూడా ప్రోగ్రామ్ ఏనా!

మరమనిషికి ఇది అవసరమా. పరిపూర్ణత కోసం అలా అనిపించారా…

అతనికి ఒళ్లు తెలియని, అలవాటు తప్పిన సుఖానికి వైన్ తోడై నిద్రపట్టేసింది.

***

కలలు లేని గాఢనిద్ర.

హఠాత్తుగా మెలుకువ వచ్చింది. డిజిటల్ గడియారం నీలం అంకెలలో 3:30 a.m. అని చూపిస్తోంది.

పక్కన ఎవరో మనిషి!

ఇంతలో హఠాత్తుగా గుర్తు వచ్చింది. మనస్విని, పడుకుని ఉంది.

కళ్ళు తెరిచి రూఫ్ కేసి తదేకంగా చూస్తూ ఉంది.

ఎలక్ట్రిక్ పవర్ ఉన్నట్లు సూచనగా కంటిపాపలు మెరుస్తూ ఉన్నాయి.

మై గాడ్! ఆమె మెలకువగానే ఉంది. నిద్ర పోవడం లేదు. కళ్ళు తెరుచుకుని ఉంది.

“మనస్వినీ! నిద్రపో!” అరిచాడు. “ఎందుకు అలా చూస్తున్నావు?”

“అనురాగ్ నేనంతే! నేను నిద్రపోను. పోలేను. నీకు నేను కళ్ళు మూసుకుని వుండటం ఇష్టమైతే నా ప్రోగ్రాం మారిస్తే అలానే కళ్ళు మూసుకుంటాను.” కొద్దిగా యాంత్రికంగా వున్న స్వరం మాట్లాడుతోంది.

అతనికి మత్తు దిగినట్లు అయిపోయింది.

 “నో! నో… యు ఆర్ ఓన్లీ ఎ టాయ్! ఒక బొమ్మ వి. నీకు నిద్ర రాదు. ఇవన్నీ ప్రోగ్రాం లే! వెళ్ళిపో!

వెళ్ళిపో…! బయటికి పో!”

అతను గట్టిగా ఆమెని మంచం మీది నుంచి తోసి వెయ్య సాగాడు.

“అనురాగ్ నువ్వు ఎలా చెప్తే అలా చేయటానికే నేనున్నది. బయటికి వెళ్ళిపోవాలని, కిందనే పడుకోమంటావా? ఎలాగైనా ఓకే!”

లేచి నిలుచున్నాడు.అతనికి ఎందుకో కోపం క్రోధం మిన్ను ముట్టింది.

నా మనస్విని అయితే ఇలా తోసేస్తే ఒప్పుకోదు ఎంత మంచిదో అంత కోపం తనకి‌. మాట పడదు‌. ఒక్కసారి తన చెంప ఫెళ్ళుమని పించేది.

“గెటవుట్! రూమ్ బయటికి పో!ప్రాణం లేని కరంట్ బొమ్మవి నువ్వు. బయటికి పో” అని అరిచాడు.

మనస్విని మరబొమ్మ “ఓకే మాస్టర్!” అన్నది. అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఆమె పాదాల చప్పుళ్లు క్రమంగా ధ్వని తగ్గి నిశ్శబ్దం అయిపోయాయి.

అతనికి ఏడుపు వచ్చింది

ఎందుకు తను బాధ పడుతున్నాడు? ఎందుకు తనకి తృప్తి లేదు? అది మనస్విని రూపమే కదా‌. అచ్చు అలానే ఉంది కదా. కాదు కాదు.

ఇది పచ్చి అబద్ధం.

లేచి అల్మైరా లో నిద్ర మాత్రలు తీసుకుని మింగి గ్లాసు నీళ్లు తాగి పడుకున్నాడు.

***

లేటుగా మెలుకువ వచ్చింది. కాలింగ్ బెల్ మోగుతోంది ఆగకుండా.

నైట్ గౌన్ సర్దుకుని కిందకి పరిగెత్తాడు.

మోహన్. పాల ప్యాకెట్లు, న్యూస్ పేపరు పట్టుకొని.

“పది గంటలు అయింది సారూ… ఇంకా నిద్ర లేవ లేదా!” అంటూనే మళ్లీ ఆశ్చర్యపోయాడు.

“అమ్మగారు అలా నిలబడిపోయి ఉన్నారూ!”

డూప్లెక్స్ ఇల్లు. మెట్ల మీదుగా వెళ్లి కారిడార్లో పక్కకు తిరిగితే బెడ్ రూమ్.

ఆ తలుపు పక్కన నిల్చుని మనస్విని, కాదు ఆమె రూపంలో ఉన్న బొమ్మ… కళ్ళు తెరుచుకుని అలాగే నిలబడి ఉంది. పైకి పరిగెత్తాడు.

“ఏమిటి ఇక్కడ నిలబడి ఉన్నావ్ నిద్ర పోలేదా?”

“అనురాగ్ మాస్టర్ బయటకి పొమ్మన్నావు కదా! నీ కమాండ్‌నే ఫాలో అవుతాను. బయటికి పొమ్మన్నా వినకుండా మళ్ళీ లోపలే ఉండాలంటే అడ్మిన్‌తో మాట్లాడు. ప్రోగ్రాం మారుస్తారు.”

ఆమె కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి. అనురాగ్ తల పట్టుకున్నాడు.

“మోహన్ కాఫీ తీసుకురా! తల పగిలిపోతోంది.”

“ఒకటా రెండా సార్?”

మళ్లీ అతనికి తిక్క పుట్టింది.

“ఒక్కటే! ఈమె తాగదు!”

మనస్విని క్షీణ స్వరంతో అంటోంది.

“నన్ను మళ్లీ చార్జ్ చేయాలి మాస్టర్!

“ఏ వాల్ ప్యానెల్‌లో ఉన్న త్రీఫేస్ ప్లగ్ అయినా సరే. నీకు కాఫీ కావాలా? తీసుకు వస్తాను.ఈరోజు మంగళవారం 25 నవంబర్ 2020 ఉదయం 10:00 అయింది. న్యూస్ చదివావా, లేక వినిపించ మంటావా?”

“షట్ అప్!” అరిచాడు అతను.

అతనిలో ఏదో కృంగిపోతున్న భావం!

బెడ్ రూమ్ లోకి పరిగెత్తాడు.

మనస్విని నోరు మూసుకుని నిశ్శబ్దంగా ఉంది.

***

రెజువినేషన్ సర్వీసెస్. లాబీ. విశాలమైన హాలు. ఏసీ చల్లదనం. పాలరాతి నేల తెల్లదనం.

రిసెప్షనిస్టు అమ్మాయి ఆశ్చర్యంగా చూస్తోంది.

“యు ఆర్ షూర్?”

“షూర్ “అన్నాడు అనురాగ్.

 అతని పక్కన హెల్పర్ మోహన్ ఒక పెద్ద అట్ట పెట్టె నేలమీద పరిచాడు.

 ఆరడుగుల పొడుగు నాలుగు అడుగుల వెడల్పు ఉన్న అట్ట పెట్టె.

“వారం రోజులు దాటింది. మీ అమౌంట్ అంతా పోతుంది. ట్రయల్ పీరియడ్ అయిపోయింది. సార్! ఆలోచించుకోండి!”

ఈ సారి అతని అసహనం ఒక్క సారి పేట్రేగి పోయింది.

“ఐ డోంట్ కేర్! డబ్బులు అన్నీ తీసుకోండి! ఈ బొమ్మని తీసుకోండి! నాకు ఈ మనసులేని మనస్విని వద్దు! వద్దు వద్దు! ఇది ఒక పిచ్చివాడి ఊహ. నాకీ బొమ్మతో మనసుని పీడించే జ్ఞాపకాలు వద్దు! ప్లీజ్ టేక్ ఇట్!”

“సారీ సర్! మీరు ఆ బొమ్మని ఎప్పుడూ ఉంచేసుకోవచ్చు. ఎందుకంటే మీ మనీ తిరిగి వచ్చినాక మాకు దాని అవసరం లేదు.”

“నో! నో! నో!”… అరిచాడు అతను. అతని గొంతు హాలులో ప్రతిధ్వనించింది.

“ఇది వద్దు. ఆ జ్ఞాపకాలలోకి రోజూ ప్రయాణించ లేను. ఒక్క క్షణం ఆనందానికి జీవితమంతా గుర్తు ఉండాల్సిన ప్రేమని మరిచిపోలేను.మర్చిపోలేను. మర్చిపోలేను.” ఏడుస్తున్నాడు. సోఫాలో కూలబడి.

“బాబు గారూ… బాబు గారూ…” మోహన్ అతనిని ఓదార్చాడు.

“ఓకే సార్. మేము ఆర్డర్ క్యాన్సిల్ చేసి రోబోట్ ని తిరిగి తీసుకుంటాం. డోంట్ వర్రీ. calm down!”

కారు కదిలింది. మిట్టమధ్యాహ్నం ట్రాఫిక్‌లో డజన్ల కొద్ది కార్లూ, మనుషులూ, ఆటోలూ, దుమ్మూ,ధూళీ కలిసి నగరం అంతా కోలాహలంగా ఉంది.

కారు ఇంటి ముందు ఆగింది.

నీరసంగా ఉద్విగ్నంగా అనురాగ్ ఇంట్లోకి ప్రవేశించాడు.

హెల్పర్ మోహన్ నిశ్శబ్దంగా నిలబడి పోయాడు.

“సృష్టికి ప్రతి సృష్టి చేయలేము మోహన్. ఆమె మీ అమ్మగారు కాదు! నా మనస్విని కాదు. ఆమె ఒక రోబోట్. కరెంట్‌తో నడిచే ఒక ప్రోగ్రాం మాత్రమే. నాకు ప్రోగ్రాం వద్దు. మనస్విని కావాలి. లేకపోతే ఈ ఒంటరితనం చాలు.”

ఆ ఒంటరి ఇంట్లో అతని మాటలు రోదనతో కలిసి అనంతమైన నిశ్శబ్దంలో కలిసిపోయాయి.

~ ~

(భవిష్యత్తులో టెక్నాలజీ మన జీవితాలతో ఎలా ఆడుకుంటుందో భయం వేసేట్లు చూపించిన నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన బ్లాక్ మిర్రర్ అనే ఆంగ్ల టివీ సిరిస్‌లో ఒక ఎపిసోడ్ ఈ కథారచనకి స్ఫూర్తి. అదే కథ కాదు. అలాంటి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాలలో ప్రవేశిస్తే… ఎలా అని వూహించిన ఒక వూహ – మధు చిత్తర్వు.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here