మనవడి పెళ్ళి-1

0
10

[శ్రీమతి నారుమంచి వాణీ ప్రభాకరి రచించిన ‘మనవడి పెళ్ళి’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

ప్రారంభం:

[dropcap]సూ[/dropcap]ర్యుడితో పాటు నిద్ర లేచే కాంతమ్మ ల్యాప్‌టాప్ పట్టుకుని మనవడి కోసం పెళ్ళి సంబంధాలు గేలం వేసి వెతుకుతోంది. ముందు ‘మా శాఖ పిల్ల కావాలి, మాకు చదువు గొప్పలు, డబ్బు గొప్పలు వద్దు. ఇంటి పట్టున బుద్ధిగా ఉండి వంట వార్పు చేసి వాడికి రెండు ముద్దలు పెడితే చాలు’ అన్నది. సరే అలాగే అంటే ఎక్కడా ఇంటర్ చదివిన పిల్ల దొరకలేదు. ఈ రోజుల్లో వ్యక్తిత్వం లేకుండా వంట వండి పెట్టి, ఇంట్లో ఉండి ఇంటి పనులు చూడు అంటే ఏ పిల్ల పెళ్ళి చేసుకోదు. ఆఖరికి ఐదు చదివిన చిన్న కుటుంబంలో పిల్ల కూడా ఏదో డిపార్ట్‌మెంట్ స్టోర్స్ లోనో, ఫ్యాన్సీ కొట్టులోనో ఒక దానిలో చేరి నెలకి ఐదు ఆరువేలు సంపాదించుకుంటుంది.

ఇంకా కొంచెం వయసు పెరిగాక ‘వేరే శాఖ అయినా పర్వాలేదు. ఇంట్లో ఉండకపోయినా, వంట వండకపోయినా పర్వాలేదు. పెళ్ళి చేసుకొని దర్జాగా కూర్చుని అత్తనీ మామని బామ్మని, తాతని – తిన్నారా! మందు వేసుకున్నారా అంటే చాలు’ అన్నది. అలా అన్నా కూడా పిల్ల దొరకలేదు. ఇంకా ‘పిల్ల ఉద్యోగస్థురాలు అయినా, పిల్లాడిని భర్తగా చూస్తే చాలు, మంచి పిల్ల కావాలి’ అన్నది. సెర్చ్ లైట్ వేసిన ఎవరూ దొరకలేదు. చివరికి ‘ఏ రాష్ట్రంలో పిల్ల అయినా పర్వాలేదు, వెజిటేరియన్ అయితే చాలు’ అన్నారు.

అప్పుడు కూడా వేరే కులం పిల్లలు ఉన్నారు, వాళ్ళు నాన్‌వెజ్ తినరు, అని చెప్పారు.

అయినా చూస్తూ చూస్తూ అలాంటి వాళ్ళు ఎలా? – పిల్లాడు శోత్రియుడు. పట్టు పంచె కట్టి భోజనం చేస్తాడు. ఎలా? ఎక్కడా పిల్ల దొరకలేదు.

దానికి కారణం వెతికితే అర్థం అయ్యింది.

పాతికయేళ్ళ క్రితం రెండు సార్లు ఆడపిల్ల వద్దు అని తనే దగ్గర ఉండి కోడలికి అడ్డు గోడ పెట్టింది. చివరకు మూడో కాన్పులో మగపిల్లాడు శ్రీనివాస్ సత్యసుబ్రహ్మణ్య కిరణ్ పుట్టాడు. ఇంకా నయం మా అత్తగారు ఇప్పుడు కొంచెం శాంతి పొందింది అని అనుకుంది కోడలు.

మనవడు అంటే కాంతమ్మకి గారం. చంకన వేసుకుని తిరిగేది. వెన్న మీగడ పాలు పట్టించేది. ఇంకేమి బొద్దుగా ముద్దుగా అందంగా బాలకృష్ణ వేషంలో ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉండేవాడు.

పిల్లలంతా చేరి ఆడేవారు. చిన్నప్పుడు చాలామంది ఆడపిల్లలు ఎత్తుకునేవారు. వాళ్ళ దిష్టి తగిలింది. ఇప్పటికీ ఒక్క పిల్ల దొరకలేదు అని బామ్మ బాధపడేది. కళ్యాణ ఘడియలు వస్తే అదే అవుతుంది అనేవారు అంతా కూడా. కానీ తను పాపం చేసింది, ఆడపిల్ల వద్దు అని రెండుసార్లు కోడలి వెంటపడి పిల్లని కననివ్వలేదు.

పోనీ పై అత్తగారు కూడా కాదు, సొంత అమ్మమ్మ. కానీ ఆడపిల్ల వద్దు అనుకున్నది. ఇప్పుడు మనవడికి ఆడపిల్ల దొరకలేదు. పెద్ద వాళ్ళ ఆలోచనలో ఎన్నో అర్థాలు ఉంటాయి, కానీ అన్ని విజయం అవ్వాలి అని లేదు. ఇప్పుడు అదే జరిగింది.

మనవడి పెళ్ళి కోసం కాంతమ్మ ఎన్నో పూజలు చేస్తూ, ఎంతో మందికి మనవడి జాతకం చూపిస్తూ ఉన్నది. వాడికి కళ్యాణ ఘడియలు రాలేదు. అలాగే వాడు ప్రేమించ లేడు, వేరే కులం అమ్మాయిని పెళ్ళి చేసుకోనులేడు.

అప్పటికి కాంతమ్మ “నీతో చదివిన ఉద్యోగం చేసే పిల్లలు ఉంటే చేసుకోరా! ఏమీ అనను. నీకు నలభై యేళ్ళు వచ్చేశాయి. మీ నాన్నకి నువ్వు ఈ వయసుకి ఇంటర్ చదువుతున్నావు.” అనేది మనవడితో.

“ఎందుకమ్మా పెళ్ళి బెంగ? ఎప్పుడో ఒకప్పుడు అవుతుంది” అని ఆమె కొడుకు ఊరుకుంటాడు.

“పోనీ మన పల్లెల్లో ఎవరైనా ఉన్నారేమో పంతుల్ని పిలిచి అడుగుతాను, సరేనా!”

“ఇప్పుడు పల్లెటూరు పిల్ల సహితం పోజు కొడుతోంది.”

“రెండు ఏళ్ళకి మించి వయోబేధం ఉండకూడదు. ఇంతకన్నా పెద్దపిల్లలు దొరికితే సరి. దాన్ని కట్టబెడతాను.

వయసులోనే మంచి వికాసం ఉంటుంది. కుటుంబము, కుటుంబ జీవితము, సంసారం, పిల్లల పెంపకంలో మెళుకువలు బాగా తెలుసుకుని ఉంటారు. పూర్వకాలం అందుకే పాతికయేళ్ళ తేడాలో కూడా పెళ్ళిళ్ళు చేసేవారు ఎనిమిది వయసులో మొదలు పెట్టి పన్నెండేళ్ళు వచ్చేలోగా పెళ్ళి అయిపోవాలి.

చిన్న పిల్లలని రాజుల వంశం జమీందారు వంశములో పెళ్ళిళ్ళు చేస్తే ఆరోగ్యవంతమైన మేధావంతులు అయిన బిడ్డలు పుట్టి వంశాన్ని బాగా పాలిస్తారని నమ్మకము వుండేది” అంది కాంతమ్మ.

కోడలు కోమలి నిజానికి అక్క మనుమరాలు. పై ఆఫీసర్ కొడుకులకి చేసుకోమంటే కట్నం చాలదు అని చేసుకోలేదు. చివరి కొడుకు కూడా బిజినెస్ చేసేవాడు. వాడు వృత్తిరీత్యా బయట క్యాంపులకి వెళ్ళేవాడు. తల్లితండ్రి ఉండే సంబంధం అయితే మంచిది అని కోమలిని మాటల్లో పెట్టి “నీ పేర అరఎకరం రాస్తాను, నావంతు వాటాలో” అన్నాడు.

కానీ నమ్మకం లేదు, సీలింగ్‌లో కొంత పొలం పోతుంది. అది మిగతా వాళ్ళు పిల్లల పేర పెట్టారు. కానీ వెంకట సత్యసుబ్బారావుకి పెళ్ళి కాలేదు, అందుకని ఇలా చెప్పాడు.

అయితే కాంతమ్మ వప్పుకోలేదు.

కోమలి అక్కను సొంత బావ చేసుకున్నాడు.

అతనితో మాట్లాడి కోమలి మంచి పిల్ల అని కోమలికి కన్నెధార అక్కబావ పోసి పెళ్ళి చేసారు.

కాంతమ్మ కోమలి అక్కకూతురి కూతురు అయినా కాపురానికి రానివ్వలేదు. సుబ్బారావు అదే వాళ్ళ వల్లే నెమ్మదిగా సర్దుకుంటాయి అని కమలినీ అక్క బావ ప్రక్క వాటాలో పెట్టి వచ్చి పోతూ బిజినెస్ వల్ల అటు ఇటు తిరుగుతున్నా – పెళ్ళాం మంచి చెడులు చూస్తూ తల్లి కాంతమ్మను వప్పించచూసాడు.

మహా గయ్యాళి కాంతమ్మ అంత త్వరగా వప్పుకోలేదు. ఇంకా బ్రహ్మాస్త్రం ఏమిటి? అంటే నీ పెళ్ళాం మగపిల్లాడిని కంటే అప్పుడు ఊరుకుంటాను అన్నది.

వదిన గారికి ఇద్దరు కూతుళ్ళు. అన్నయ్యతో పోట్లాడి మూడో కాన్పులో మగపిల్లాడు కోసం చూస్తే మళ్ళీ ఆడపిల్ల పుట్టిందని వాళ్ళని దూరంగా పెట్టింది. ఆస్తి పంచి ఇచ్చేసింది. సుబ్బారావు తండ్రి బాధపడ్డారు. రెండో కొడుక్కి ఇద్దరు మగపిల్లలు ఇంక మూడో కొడుకు సుబ్బారావు వాడి జాతకం చూపించి మగ సంతానం ఉన్న పిల్లని చెయ్యాలి, అంటూ మొదలు పెట్టింది.

కానీ సుబ్బారావు మెదలడు. రెండు, మూడు సంబంధాలు వచ్చాయి. వాళ్ళ జాతకంలో మగ సంతానం లేదు.

ఒకప్రక్క నక్షత్రం కలవడం కష్టం అంటే పుత్ర సంతానం ఉన్న పిల్ల ఎక్కడ దొరుకుతుందో ఏమిటో!

ఎంత వెదకినా కుదరలేదు.

చివరికి వయస్సు పెరిగిపోతుంది, అని కమలినీ అడిగి వొప్పించి మరీ చేసుకున్నాడు. లేదంటే పెళ్ళాం, వెళ్ళిపోతే అప్రతిష్ఠ కానీ తల్లి కాంతమ్మ దాటికి ఎవరూ పిల్లలు ఇచ్చే సాహసం చెయ్యలేదు.

అలా కమలినీ పెళ్ళి చేసుకుని పెళ్ళికి రమ్మంటే రాను పొమ్మన్నది. చేసేది లేక పెళ్ళి చేసుకుని వచ్చి తల్లిని అక్షింతలు వెయ్యమంటే వెయ్యను పొమ్మన్నది. ఇంక తన జీవితం తనది అని ఊరుకున్నప్పటికి ఇంటికి వస్తే సాధిస్తూ ఉండేది.

కాలం మార్పు తేవాలి అనేవాడు తండ్రి బుద్ధ భగవానుడు.

అధ్యాయం-1

కోమలి విషయం ఇక్కడ చెప్పాలి. కోమలి కాంతమ్మకి అక్క మనుమరాలు. అక్క రెండో కూతురు కూతురు, అక్క కూతురు వెంకట సుబ్బలక్ష్మీ కూతురు సుబ్బలక్ష్మి మొగుడా! మళ్ళీ కావాల్సిన వాడే; అయితే ఏమీ పెళ్ళాన్ని చూసే వాడు కాదు, అలాగని అది చదువుకుంది వుద్యోగం చెయ్యనివ్వడు. నేను వ్యవసాయం చేస్తున్నా ఉద్యోగం నువ్వు చెయ్యద్దు అనేవాడు, కాలక్రమంలో ఓ పిల్ల పుట్టింది. అదే కోమలి. తండ్రి చూడక ఇంగ్లీష్ చదువు వుద్దు అంటూ గొడవ చేసేవాడు.

సంస్కృతం నేర్పించాలి అనేవాడు. ఈ రోజుల్లో భాష నేర్చుకోవచ్చు కానీ ఉద్యోగం చేయడానికి పనికిరాదు అని బి.కామ్ చెప్పించారు. కంప్యూటర్ నేర్పించారు.

అమ్మమ్మ, తాతయ్య ప్రాణంగా చూసేవారు. మీ అమ్మకి ఈ రాక్షసుడు మొగుడు అయ్యాడు, నీకు మంచి ఉద్యోగస్థులు ఎవరైనా వస్తే బాగుండును అనేవాడు, అలా కాంతమ్మ డబ్బు మనిషి అయిన వాళ్ళు పనికిరారు, మంచి పిల్లాడిని చూసి చెయ్యాలని ఆలోచించారు. అయినను నలుగురి తండ్రి చూడడు.

పిల్లని దగ్గర వాళ్ళకు చేసి తల్లిని పిల్లని చూసేలా ఏర్పాటు చేసుకోండి అన్నారు.

పట్టుదల వల్ల జరిగింది, పై పిల్ల అయితే తల్లి గయ్యాళితనానికి పెళ్ళాం వదిలిపోతుంది, అని ఆలోచించి అడిగి మరి ఎదురు డబ్బు పెట్టి వదిన గారు దగ్గరే పెళ్ళి చేసుకొని అక్కడ మకాము పెట్టాడు. సుబ్బలక్ష్మిని దుయ్య బట్టించి పెద్దల చేత చెప్పించింది.

“నా గడప తొక్కే స్తోమత లేక పిల్లని పిల్లాడి మీదకు ప్రేమ కబురులు చెప్పించి పెళ్ళి చేసింది” అన్నది కాంతమ్మ.

అప్పుడు సుబ్బలక్ష్మి “నా మొగుడుతో పడుతున్నది, చాలదా! నీ ఇంటికి కూతుర్ని పంపాలంటే భయమే కదా! పిన్ని” అన్నది.

“చాల్లే చెప్పావు మొగుడిని చూసి నువ్వు ఇచ్చే కట్నం చూసి ఎవరు చేసేకుంటారు. అందుకే పొగిడి వాడికి పెళ్ళి చేసావు” అంటుంది.

జీవితంలో మూడు ఏళ్ళు ఇట్టే చక్కగా వచ్చాయి. కోమలి గర్భవతి అని తెలియగానే గుట్టుగా స్కానింగ్ చేయించి ఆడపిల్ల అనగానే వద్దు, అంటూ డాక్టర్‌కి చెప్పి అబార్షన్ చేయించింది. తల్లి బాధపడింది.

ఇలా రెండు సార్లు చేసింది, ఇంకా కోమలి భర్త కలిసి నిర్ణయించుకున్నారు.

కానీ కోమలి తల్లి నా కోసం నా పిల్ల జీవితంలో మానసిక ఒత్తిడి పడకూడదు దాన్ని పై సంబంధానికి చేద్దాము అన్నారు.

“సరే అయిన చెప్పి చూద్దాము, అని పదేళ్ళ వయసు తేడా ఉన్న సరే చెప్పారు, నువ్వు ఏమి ఇస్తావు నీ మొగడు పంట పడింది, ఎండింది అంటాడు కాని శిస్తు ఇంతవరకు ఇవ్వలేదు, అని అన్నగారు చెపుతాడు. వీడు పిల్లని చేసుకుంటే వాడి ఖద్దరు సంచి తప్ప ఏమీ ఇవ్వగలడు. పిల్లను చేసినా ఇంట్లో ఉండి తింటారు. ఇంకా పిల్లలు పుడితే నా కొడుకే బావమరుదుల్ని పెంచాలి” అంటూ సాగదీసింది కాంతమ్మ.

అలా ఆగాయి పెళ్ళి కష్టాలు!

మహారాజులు పుంశవనం ద్వారా మహారాజు లక్షణాల బిడ్డ పుట్టడానికి సంగీతంలో వీణపై ఋక్కు వాయించే ప్రయత్నంలో రికార్డ్స్ తెచ్చిపెట్టాడు సుబ్బారావు.

అలా ఎలాగో తిప్పలు పడి రాగి పిండి లడ్డు చేసి పెట్టి రోజు రాత్రి రెండు గంటలు, పగలు రెండు గంటలు ఋక్కు వినిపించి మగపిల్లాడిని కన్నాడు.

ఇది రాజుల కుటుంబాల్లో పరాక్రమవంతుడు అయిన బిడ్డ కోసం ఏర్పాటు చేసేవారు.

మూడోసారి అయితే పుట్టింట కాన్పు చెయ్యరు. అత్తింటి వారు చెయ్యాలి. అందుకు చాలా కష్టాలు తిప్పలు. మగపిల్లాడు అయితేనే కాన్పు చేస్తాము అని ఖచ్చితంగా చెప్పింది.

యోగం బాగుంది మగపిల్లాడు పుట్టాడు. కోడల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంది కాంతమ్మ.

దీని వెనుక కష్టం సుబ్బారావుకు, కోమలికి మాత్రమే తెలుసు. మిగిలిన వాళ్ళకి ఎప్పటికి తెలీదు కూడా. మగపిల్లాడు కనుక కాంతమ్మ గారంగా ముద్దు చేసి పెంచింది.

మనవడి పెళ్ళి విషయం మాత్రం సమస్య అయ్యింది.

ఆవిడ తరంలో చాలా మంది అత్తలు భ్రూణ హత్యలకు వెనుదీయలేదు. అసలు పిల్లలు పుట్టినట్లు ఎవరికి అజాపజా లేదు.

మగపిల్లలు పుడితే విజయ గర్వముగా ఉంటున్నారు. అది ఇప్పుడు మారింది ఆడపిల్లలు కుటుంబాన్ని చూస్తున్నారు. మరి మగపిల్లలు వుద్యోగం అంటూ దూరంగా ఉంటున్నారు.

అంతెందుకు మన కోమలి దగ్గర పిల్ల కనుక కాంతమ్మ దగ్గర నిలబడింది. ఈ ప్రపంచంలో ఎంతో గయ్యాళి మనుష్యులు ఉన్నారు.

వాళ్ళల్లో కాంతమ్మ ఒకరు. ఎన్నో రకాల అత్తల్లో గయ్యాళి అత్తగా సన్మానం చెయ్యాలి. కాంతమ్మ ఇద్దరు మనుమరాళ్ళు వద్దు అనుకున్నది. మిగతా వాళ్ళు అంతే కదా! అని అంటూ ఉంటారు.

అధ్యాయం 2

కిరణ్‌ని కాంతమ్మ బాగా అల్లారు ముద్దుగా పెంచింది. ఉదయమే వెన్నపూస వేసి వేడి ఇడ్లీ కారప్పొడి వేసి కొబ్బరి చట్నీ చేసి పెట్టేది. ఇంట్లో కొబ్బరి చెట్ల ఫల సాయం ఉన్నది.

ఎప్పుడు కావాలంటే అప్పుడు కాయలు దింపేస్తారు. కొబ్బరి ఏమి అడ్డు లేదు. కొబ్బరి ఉండలు, కొబ్బరి కోవా డబ్బాల నిండా కజ్జికాయలు ఎప్పుడు ఉంటాయి.

కొబ్బరి నిల్వ వాసన రాకుండా ఏలకులు సుంగంధ ద్రవ్యాలు వేసి మరీ చేస్తుంది. కొన్ని ఎండు కొబ్బరితో చేస్తుంది. కొబ్బరి నీళ్ళ పాయసం వండి వడ్డించింది.

పిల్లాడు పుట్టిన రోజు చాలా ఘనంగా చేస్తుంది. పూజలు అయితే కొబ్బరి బొండాలు అందరికి పంచుతుంది.

మంచి గుణాలే కానీ, పాత తరం ఆలోచనలు. కోడల్ని అదుపులో ఉంచాలి, ఆడపిల్లలు మనుమరాళ్ళుగా వద్దు అని అంటుంది కాంతమ్మ. కిరణ్‌ని అతి గారంగా పెంచింది. అయితే బుద్ధిమంతుడు గానే పెంచింది. కిరణ్‌కి అసలు కోపం లేదు. అన్నీ వింటాడు. ఆచరిస్తాడు. అదే ఆనందము.

కిరణ్ పెళ్ళి వాయిదా పడుతూ వచ్చింది.

వయసు ఊరుకుంటుందా పెరుగుతూ వచ్చింది. దానితో పాటు చిరుబొజ్జ వచ్చి అది పెద్ద బొజ్జగా మారింది.

ఆకలికి ఉండలేడు. చిరుచిరు వంటలు తిండి ఎక్కువ. గంటకి ఒకసారి ఆఫీస్‌లో టీ వస్తుంది.

కాంతమ్మ మనుమడు ఆరోగ్య రీత్యా ఆలోచించి ప్లాస్క్‌లో బూస్ట్ పోసి ఇచ్చి గంటకి ఒకసారి తాగమన్నది. మరి ఇంకేమి? మార్కెట్‌కి స్కూటర్ పై వెడతాడు. శరీరానికి ఎక్సర్‌సైజ్ లేదు. అంతా స్కూటర్‍పైనే. సుబ్బారావు ఒక కొడుకుతో ఫుల్‌స్టాపు పెట్టి తన క్యాంపులు, బిజినెస్‌లో బిజీ అయిపోయాడు. “నువ్వు పడు మా అమ్మ గోల” అని కోమలితో అంటాడు.

అలాగే కోమలి కాంతమ్మతో పడుతోంది.

కిరణ్‌కి బామ్మ అంటే ప్రాణం, చిన్నప్పటి నుంచి సున్నిఉండలు, పూతరేకులు, లడ్డూలు, గారెలు, వండి పెట్టి పిల్లాడిని బొద్దుగా పెంచింది.

ఇప్పుడు స్థూలకాయము. ఎవరికి, ఏ పెళ్ళి కూతుళ్ళకు నచ్చడు. అందంగా స్లిమ్‌గా హిందీ హీరోలా ఉండాలి. తెలుగు వాళ్ళు కూడా ఇష్టం ఉండటం లేదు.

వాళ్ళు మోడర్న్ డ్రెస్‌లు వేసుకుంటారు. ప్రక్కన మొగుడు, హిందీ హీరోలా హ్యాడ్సమ్ ఉండాలి, ముందు ఫ్రెండ్స్‌కి నచ్చాలి.

ఇది ఈరోజు యువత అభిరుచి.

అందుకే అబ్బాయిలు గతంలో అమ్మాయిలకి వంకలు పెట్టేవారు. ఇప్పుడు అమ్మాయి తల్లితండ్రి వంకలు పెడుతున్నారు.

ఆ పిల్ల కంటే ముదు తల్లి పెడుతోంది. ఆ మధ్య ఓ బ్యాంక్ ఆఫీసర్ సంబంధం వచ్చింది.

“పిల్లాడు చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. అయితే కొంచెం చామన చాయ. బొద్దుగా ఉన్నాడు” అంటూ పిల్ల తండ్రికి సంబంధం చెపితే ఫోటో చూసి “పచ్చడిబండలా మొద్దుగా వున్నాడు. నా పిల్ల తెల్లగా జాజిమొగ్గలా వుంటుంది, అని మీకు తెలుసుగా” అన్నాడు.

“అదికాదు, మీకు కావల్సిన శాలరీ పేకేజ్ ఉన్నది, ఒక్కడే కొడుకు. బాధ్యతలు లేవు, ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి. అమ్మ నాన్న విడిగా ఉంటారు. నీ కూతురు వుద్యోగం చేసి కోవచ్చు. అతని విదేశాలక వెళ్ళి వస్తు వుంటాడు. ఇంటర్నేషనల్ బ్యాంక్ అది” అంటూ వివరాలు చెప్పాడు పెళ్ళిళ్ళ పేరయ్య.

“వద్దు సర్ మా పిల్లకి కుదరదు” అన్నాడు ఆ తండ్రి.

ఆడపిల్లల తల్లిదండ్రులు పిల్లకి నలభైఏళ్ళు వచ్చినా పెళ్ళికి వప్పుకోవడం లేదు ఏమిటి? విచిత్రంగా ఉంది!

ఇంకా కిరణ్ పెళ్ళికి ఎన్నో అవరోధాలు!

ఇంకా కోమలి ఆలోచించింది. ‘వీడిని జిమ్‌కి వెళ్ళమనాలి, లేకపోతే అత్తగారు పెట్టే ఆహారం మరీ ఎక్కువ ఉన్నది.

వీడు నామాట వినడు!

బామ్మ మాట బంగారు మాట అంటాడు.

కానీ జీవితం అంతా బంగారు బాటగా జీవితం మారాలి అంటే వీడు స్లిమ్‌గా అవ్వాలి’ అనుకున్నది.

ఒకరోజు “షాపింగ్‌కి వెళ్ళాలి” అంటూ కొడుకుతో బయలుదేరింది. అత్తగారు “ఎక్కడికి?” అన్నది. “ఇప్పుడు షాపింగ్‌కి నువ్వు ఎందుకు? లిస్ట్ ఇచ్చి పంపు, వాడు తెస్తాడు. అలవాటు అవుతుంది. రేపు పెళ్ళానికి తేవాలి కదా” అన్నది కాంతమ్మ.

“ఇంకా పెళ్ళాం వచ్చాక కూడా వాడే తేవాలా? ఇద్దరు కలిసి బయటకు వెళ్ళి షాపింగ్ చేసి హోటల్‌కి వెళ్ళి భోజనం చేసి వస్తారు.”

“ఓహో ఇదా నువ్వు చెప్పే సలహా? ఆ చీకటి హోటల్లో బొద్దింకలు, పురుగులు పడినా ఏమి తెలియవు. అస్తమానం రెస్టారెంట్ అని వాళ్ళని పంపకు, నీకు జరుగలేదు కాదని కోడల్ని వుసిగొల్పకు. మా ఇంటా వంటా లేదు రెస్టారెంట్ భోజనం” అని ఉరిమింది కాంతమ్మ.

కానీ కోమలి “మీరు నాకు నా మొగుడుకి న్యాయం చెయ్యలేదు. నా పిల్లాడికి అయినా న్యాయం చెయ్యండి” అని బ్రతిమిలాడింది.

“బామ్మా, నేను ఎప్పుడూ నీ మాట వింటాను కదా! ఎందుకు? నీ తరువాతే అంతా. ఒకసారి పాపం అమ్మ షాపింగ్ అన్నది, వెళ్ళి వస్తాము” అని నచ్చచెప్పి వెళ్ళాడు కిరణ్.

కిరణ్ స్వభావాన్ని మెచ్చుకోవాలని కోమలి అనుకున్నా వాడు వేసే వేషం, ఆ పిచ్చి తిండి చూసి వీడికి జీవితంలో పెళ్ళి అవదు అనుకున్నది.

ఓ పెద్ద మాల్‌కి తీసుకెళ్ళి వాడికి సరిపడా మంచి డ్రస్‌లు కొనాలి అనుకున్నది. కానీ వాడికి సరిపడా డ్రస్సు డబుల్ ఎక్సెల్ సైజ్ దొరకలేదు. చివరకి కొలతలు ఇచ్చి డ్రెస్ పురమాయించి వచ్చింది.

దార్లో “కిరణ్ నువ్వు జిమ్‌కి వెళ్ళి స్లిమ్ అవ్వాలి. లేదా మేడ మీద ఎక్సర్‌సైజ్ చెయ్యాలి, తెలిసిందా! పెళ్ళి కావాలి అంటే నీ వేషభాషలు మార్చాలి. ఎంత పెద్ద మంచి వుద్యోగం చేసినా పెళ్ళి కాదు కావడం లేదు. మీ బామ్మ చాదస్తం కొంత, నీ వేషం కొంత సరి. ఊబ ఒళ్ళు తగ్గి స్లిమ్ అవు. నేను అడిగి అయినా పెళ్ళి చేస్తాను” అన్నది కోమలి.

“అంతే అంటావా? నేను చిక్కాలా? మరి తిండి తగ్గించాలి కదా! ఎలా? తిండి తగ్గించాలి అంటే బెంగ వస్తుంది, అమ్మా” అన్నాడు కిరణ్.

“మంచి పెళ్ళాం వస్తే అన్నీ అవే బాగుంటాయి” అని హితబోధ చేసి ఇంటికి తెచ్చింది.

మనవడు పెళ్ళి కోసం కాంతమ్మ ఎదురు చూస్తూ ఉన్నా కోడలు తన కొడుక్కి ఏమి చెప్పి పెట్టిందో ఏమిటో అనే ఆలోచనా, అనుమానం వస్తూనే వుంటాయి.

మొగుడు పెళ్ళాన్ని కలిసి మాట్లాడుకోనివ్వదు, కొడుకు తల్లిని కలిసి మాట్లాడుకోనివ్వదు. వింత విచిత్ర మనస్తత్వం కాంతమ్మది.

కోమలికి తల్లి ప్రాణం విలవిలలాడింది, ఓ సరదా లేదు, ముచ్చటా లేదు, ఎంతసేపు ఆవిడ వెనకాల తిరుగుతూ ఆవిడ చెప్పినట్లు వినాలి. మనవడిని చేతిలో పెట్టుకుని తనకి దక్కకుండా చేసింది.

‘ఏది ఏమైనా ఈ ఏడు వీడికి పెళ్ళి చెయ్యాలి, నాకు మాత్రం కొడుకు కోడల్ని ముచ్చటగా చూసుకోవాలని ఉండదా!’ అనుకుంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here