మంచీ – చెడు

0
6

[box type=’note’ fontsize=’16’] “ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా అనేది మన కంట్రోల్లో లేని విషయం. కానీ మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మన ఆధీనంలో ఉంటుంది” అంటున్నారు సలీంమంచీ – చెడు” అనే ఈ కల్పికలో. [/box]

రాగిణికి పెళ్ళయి రెణెల్లు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే చరణ్‌తో ప్రేమలో పడింది. డిగ్రీ పూర్తయి క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చాక ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్ళి చేసుకుంది. చరణ్‌కి ఆమె తోడిదే లోకం.. అతని శ్వాస, ధ్యాస అంతా రాగిణే… ఆఫీస్‌లో ఉన్నా ఆమెనే కలవరిస్తుంటాడు… నిద్రలో ఉన్నా ఆమెనే పలవరిస్తుంటాడు. రాగిణికి సంసారజీవితం వెన్నెట్లో గోదావరి నదిలో లాహిరి లాహిరి లాహిరిలో అని డ్యూయెట్ పాడుకుంటూ చేసే పడవ ప్రయాణంలా హాయిగా మధురంగా మనోహరంగా ఉంది. ఎటొచ్చీ సమస్యంతా అత్తగారితోనే.

సమస్యంటే అత్త సూర్యకాంతంలా ఆరళ్ళు పెట్టే టైపని కాదు. రాగిణికి అత్త అర్థం కావడం లేదు. అదీ సమస్య. పెళ్ళయిన వారానికి రాగిణి వాళ్ళమ్మ అడిగింది “మీ అత్త మంచిదేనా? నిన్ను బాగా చూసు కుంటుందా?” అని. “పెళ్ళయి వారమే కదమ్మా. అప్పుడే ఏమర్థమవుతుంది? ఇంకొన్ని రోజులు అబ్జర్వేషన్‌లో పెట్టనీ. చెప్తాను” అంటూ నవ్వింది. అప్పటినుంచీ అత్తగార్ని బేరీజు వేసే పనిలో పడింది. అత్త మంచిదా కాదా అనే విషయం తొందరగా తేల్చేసి ఈ సారి అమ్మ అడిగినపుడు ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పాలని ఆమె తాపత్రయం. కానీ ఈ విషయం ఓ పట్టాన తేలేలా కన్పించడం లేదు.

వారంలో ఐదు రోజులూ వంట అత్తే చేస్తుంది. శనాదివారాలు మాత్రం తను కూడా కొంత సాయం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా కాఫీ మాత్రం ఆ రెండు రోజులూ తను పెట్టాల్సిందే. ‘నా కోడలి చేతి కాఫీ అమృతంలా ఉంటుంది తెలుసా’ అని అత్త చుట్టుపక్కల అమ్మలక్కల్లో చెప్పటంతో అది తనక్కూడా ఇష్టమైన పనిగా మారిపోయింది. అత్త తనని అలా పొగిడినపుడు ‘మా అత్త మంచిదే’ అనుకుంటుంది. సెలవ రోజుల్లో కూడా తనని కష్టపెట్టకుండా అత్తయ్యే వంట చేస్తున్నందుకు మా అత్త చాలా మంచిదే అని నిర్ధారణకు వస్తుంది. ‘ఆఫీస్‌లో ఐదు రోజులూ చేసిన చాకిరీ చాలదా? హాయిగా రెండ్రోజులు విశ్రాంతి తీసుకో. నువ్వసలు కిచెన్‌లోకే రాకు. నేనున్నానుగా చేసి పెట్టడానికి. నీకేమేం తినాలనిపిస్తుందో చెప్పు. చేసి పెడ్తాను’ అనే అత్తయ్యంటే ఎవరికిష్టం ఉండదు?

ఆ రోజు ఆదివారం… రాగిణి కాఫీ చేయడం కోసం పాలు స్టవ్ మీద పెట్టింది. పాలు వేడవుతున్నాయి. ఆమెకు ఆఫీస్‌లో టీమ్ మేనేజర్‌తో అయిన గొడవ గుర్తొచ్చింది. మనసు వ్యాకులపాటుకు లోనవుతోంది. అసలే వాడు మంచివాడు కాదు. మనసులో కక్ష పెట్టుకుని సతాయిస్తాడేమోనని భయంగా ఉంది. అయినా తన తప్పేం ఉందని? ఇద్దరు మనుషులు చేసే పనిని తనొక్కతే ఎలా చేయగలుగుతుంది? అప్పటికీ సిస్టమ్ ముందు కూచున్న క్షణం నుంచి సాయంత్రం లాగ్ అవుట్ అయ్యేవరకు పక్కనేం జరుగుతుందో పట్టించుకోకుండా పని చేస్తూనే ఉందిగా. అంత చేశాక కూడా మాట పడాల్సి వస్తే ఎంత బాధగా ఉంటుందో.. అలాగని నెలకు నలభై వేలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకోగలదా? ఖర్చులెలా పెరిగిపోయాయో… భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి.. రేపు పిల్లలు పుట్టాక ఖర్చులు ఇంకా పెరుగుతాయిగా. వాటికోసం ఇప్పటినుంచే సంపాయించి దాచిపెట్టాల్సిన అగత్యం..

“అయ్యో అయ్యో.. ఏంటే ఆ పరధ్యానం? స్టవ్ ఆరిపోయిన విషయం కూడా చూసుకోవా? అందుకే నిన్ను వంటగదిలోకి రావద్దని చెప్తాను” అంటూ అత్త పరుగెత్తుకుంటూ రావడంతో సృహలోకొచ్చి చూసింది. పాలు పొంగి కిందంతా కారిపోయి ఉన్నాయి. స్టవ్ ఆరిపోయింది. గదంతా గ్యాస్ వాసన వేస్తోంది.

“ఎంతలో ఎంత ప్రమాదం తప్పిందో చూశావా? గ్యాస్ వాసన కూడా తెలీనంతగా ముక్కులు దిబ్బళ్ళు వేశాయా? పొరపాటున అంటుకుంటే ఏమయ్యేది? అందుకే అంటారు గుర్రం పని గుర్రం చేయాలి గాడిద పని గాడిద చేయాలి అని” అత్త కోపంతో అరుస్తూనే ఉంది.

రాగిణికి ఏడుపు వచ్చింది. తన గదిలోకి దూరి దిండులో తల పెట్టి ఏడ్చింది. భర్త ఎంత బుజ్జగించి నా అత్త తిట్టిందన్న బాధ తగ్గలేదు.

“నీకేమీ ప్రమాదం జరక్కూడదన్న బలమైన కోరికలోంచి పుట్టిన కోపం అది రాగిణీ. నీమీద ఇష్టం వల్లే అమ్మ తిట్టింది తప్ప నువ్వంటే తనకు ఇష్టం లేదని ఎందుకనుకుంటావు?” అన్నాడు.

“మనం ప్రేమించి పెళ్ళి చేసుకోవడం వల్ల మీకు రావల్సిన కట్నం రాలేదన్న కోపం తప్పకుండా ఉంటుందండి. కోడల్ని ఎన్నుకోవడంలో తన ప్రమేయం లేకుండా పోయిందన్న లోటు కూడా గుచ్చుకుంటూ ఉంటుంది” అంది రాగిణి.

“నీవన్నీ అపోహలే. అమ్మ కొద్దిగా విసుక్కున్నా నువ్వు కట్నం ఇవ్వనందువల్ల మనసులో పెట్టుకుని అంటోందని వూహించుకుంటావు. ఎందుకలా గిల్ట్ ఫీలవుతావు? నేను అరేంజెడ్ మేరేజ్ చేసుకున్నా కట్నం తీసుకునే వాడిని కాదు. అమ్మ కూడా కట్నాలకు విముఖురాలే”

“నన్నెవరూ ఇప్పటివరకూ గాడిద అని తిట్టలేదండీ” రోషంగా అంది.

“అది సామెత రాగిణీ. ఎవరికి నిర్దేశించిన పని వాళ్ళు మాత్రమే చేయటం అన్ని విధాలా మంచిది అని చెప్పడం కోసం వాడే సామెత. అమ్మ గుర్రమనీ నువ్వు గాడిదనీ కాదు”

రాగిణికి తన భర్త వాళ్ళమ్మని సమర్థిస్తున్నాడనిపించింది. అత్త మీద కోపం వచ్చింది. ఇంట్లో ఉండి వంట చేసుకునే ఆవిడకేం తెలుస్తాయి ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ కష్టాలేమిటో అనుకుంది. దాంతో పాటు ‘అత్త మంచిది కాదు’ అని కూడా అనుకుంది.

ఇది జరిగిన కొన్ని రోజులకి పూనేనుంచి వచ్చిన అత్తగారి ఆడపడుచు ఆమె కోసం రెండు పట్టు చీరలు, తన కోసం రెండు పార్టీవేర్ డ్రెస్సులూ తెచ్చింది. ఆమెతో తన గురించి చెప్తూ “నా కోడలు బంగారం. ఈ రోజుల్లో ఇంత మంచి అమ్మాయి నా కోడలు కావటం నా అదృష్టం” అన్నప్పుడు పొంగిపోతూ ‘నేనే అపార్థం చేసుకున్నాను. మా అత్త చాలా మంచిది. నేనంటే తనకు చాలా ఇష్టం’ అనుకుంది. ఆమె ఆడపడుచు వెళ్ళిపోయాక రెండు పట్టుచీరలూ తనకిచ్చేస్తూ “నాకెందుకు ఇంత ఖరీదైన చీరలు? పండగలప్పుడు పట్టుచీర కట్టుకుంటేనే ఆడపిల్లకందం. ఈ రంగులు నీకు బాగా నప్పుతాయి. కట్టుకుంటే లక్ష్మీదేవిలా ఉంటావు” అన్నప్పుడు కూడా ‘నా అత్త మంచిదే’ అనుకుంది.

శనివారం సాయంత్రం రాగిణి భర్తతో కలిసి షాపింగ్‌కి బయల్దేరింది.

స్కూటర్ నడుపుతున్న భర్తతో “ఎప్పుడూ మీరు నడపటమేనా? ఈ రోజు నేను నడుపుతాను” అంది.

“నీకు బాగా వచ్చా?” అని అనుమానంగా అడిగాడతను.

“నేను కాలేజీకి స్కూటీ మీదే వెళ్ళేదాన్నిగా” అంది.

“ఐనా కొన్నాళ్ళు ఈ స్కూటర్ మీద ప్రాక్టీస్ చేయకుండా నేరుగా ట్రాఫిక్‌లో నడపటం మంచిది కాదు” అన్నాడు.

రాగిణికి స్కూటర్ నడపటంలో తన ప్రతిభ భర్తకు చూపాలన్న ఆరాటం… కాదనలేక అతను వెనక కూచున్నాడు. కొంత దూరం బాగానే నడిపింది. సడన్‌గా రోడ్డు మధ్యలో గుంత చూసి దాన్ని తప్పించబోయి కింద పడిపోయింది. ఆమెకేమీ కాలేదు. కానీ వెనుక కూచుని ఉన్న ఆమె భర్త రోడ్డు పక్కన వేసి ఉన్న కోసైన గులకరాళ్ళ మీద పడటం వల్ల చేతుల దగ్గర చీరుకుపోయింది. ఆస్పత్రికెళ్ళి కట్టు కట్టించుకుని ఇంటికి రావడంతోటే అత్త ఆడపులిలా రాగిణిమీద విరుచుకు పడింది.

“అసలు స్కూటర్ నిన్నెవడు ముట్టుకోమన్నాడు? చిన్న దెబ్బలే కాబట్టి సరిపోయింది. ఏ తలకో గాయమై ఉంటే ఎంత కష్టం? వాడు పడగానే వెనకనుంచి వస్తున్న ఏ బండో తగిల్తే ప్రాణాలు పోయేవి కదా… అసలు నీకు బుద్దుందా? చదువుకోగానే సరికాదు ఇంగితం ఉండొద్దా” అంటూ తిట్ల దండకం…

అసలే తన వల్ల భర్తకు దెబ్బలు తగిలాయని బాధగా ఉంటే పుండు మీద కారం చల్లినట్టు అత్త తిట్టడంతో వెక్కి వెక్కి ఏడ్చింది.

“అదంతా నీ మీద కోపం కాదు. తన కొడుకు మీద ప్రేమ” అని భర్త ఎంత నచ్చచెప్పినా ఆమె ఏడుపు ఆపలేదు. తనకు బుద్ధి లేదంటుందా? ఇంగితం లేదంటుందా? ఎన్నెన్ని మాటలంది? అని తల్చుకో గానే ‘నా అత్త మంచిది కాదు’ అని నిర్ణయించుకుంది.

ఆర్నెల్ల తర్వాత పండక్కి పుట్టింటికొచ్చిన రాగిణిని వాళ్ళమ్మ మరోసారి అడిగింది “మీ అత్త మంచి దేనా? నిన్ను బాగా చూసుకుంటుందా?” అని.

“అదే అర్థం కావటం లేదమ్మా ఒక్కోసారి మంచిదనిపిస్తుంది. ఒక్కోసారి చెడ్డదనిపిస్తుంది” అంది రాగిణి.

వాళ్ళ మాటలు వింటున్న రాగిణి వాళ్ళ నాన్న కల్పించుకుని “మనుషుల్లో నూరు శాతం మంచివాళ్ళో వందశాతం చెడ్డవాళ్ళో ఉండరు. మనం మంచివాళ్ళనుకున్నవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో మరోలా ప్రవర్తిస్తారు. మనం చెడ్డవాడనుకున్న వ్యక్తి కొంతమంది విషయంలో చాలా దయగా ప్రవర్తించి ఉండొచ్చు. అసలు ఏది మంచి ఏది చెడు? మనకు అనుకూలంగా ప్రవర్తిస్తే, మనల్ని సమర్థిస్తూ మాట్లాడితే, మనకు నచ్చినట్టు ఉంటే మంచివాడనుకుంటాం. అంటే మన వ్యక్తిగతమైన ఇష్టాఇష్టాల రంగు కళ్ళద్దాల్లోంచి మనుషుల్ని చూసి వాళ్ళు మంచివాళ్ళనో కాదనో ముద్రలు వేస్తాం. ఒక వ్యక్తిని ఒకట్రెండు సంఘటనల ఆధారంగా బేరీజు వేయటం తప్పు. అసలు మీ అత్త మంచిదో కాదో నిర్ధారించి ఆమెనో చట్రంలో బిగించాలని ఎందుకనుకుంటున్నావు? మనిషి మనస్తత్వం, ప్రవర్తనా అన్ని సందర్భాల్లో అందరి దగ్గరా ఒకేలా ఉండవు. మారుతూ ఉంటాయి. ఎదుటి వ్యక్తి మంచివాడా కాదా అనేది మన కంట్రోల్లో లేని విషయం. కానీ మనం మంచిగా ప్రవర్తిస్తున్నామా లేదా అనేది మన ఆధీనంలో ఉంటుంది. మొదట నువ్వు మంచిగా ఉన్నావా లేదా అనే విషయం ఆలోచించుకో. అన్నిటికంటే అదే ముఖ్యం” అన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here