మందస వాసుదేవ పెరుమాళ్ ఆలయం

0
11

[dropcap]అ[/dropcap]ది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం. కళింగ శైలిలో నిర్మించబడిన ఆలయం. ఆలయంలోని మూర్తి మాత్రం తిరుమల శ్రీనివాసుని పోలి ఉంటుంది. ఆలయంలోని మూర్తి కంచి క్షేత్రంలో తయారు చేయించి తెచ్చిన మూలమూర్తి. ఈ ఆలయం కొన్ని కోణాల్లో ఒరిస్సా రాష్ట్రంలోని పూరీ జగన్నాధ ఆలయాన్ని గుర్తు చేస్తే కొన్ని కోణాల్లో కోణార్క్ దేవాలయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆలయం నిర్మాణం శిల్పకళ ఒరిస్సా సంప్రదాయాన్ని గుర్తు చేస్తే, ఇక ఆలయం పేరు వింటే ఎక్కడో తమిళ దేశంలోని ఈ అనుకుంటాం. కాని ఈ ఆలయం ఉన్నది మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్రలో ఒకటయిన శ్రీకాకుళం జిల్లాలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న గ్రామంలో.

పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట. ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించే రామానుజులు అనే ఆచార్యులు కాశీ వరకు పర్యటించి పండిత చర్చలలో ఎంతోమంది విద్వాంసులను ఓడించి ఉత్తరాదిలో కూడా ఈ ప్రాంత కీర్తిపతాకాన్ని ఎగరవేసినట్టు చరిత్ర చెప్తోంది.

పెద్ద జియ్యర్ స్వామి కూడా ఇక్కడ వేదం విద్యాభ్యాసం చేసారు. పూర్వం ఈ ప్రాంతం వైష్ణవానికి పెట్టింది పేరుగా ఉండేదని చెప్తారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలితాన్నిస్తుందని చెప్తారు. ఇంతఘన చరిత్ర కలిగిన ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీకాకుళం నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉంది మందస గ్రామం. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు ప్రశాంతమైన వాతావరణం… వీటి మధ్యలో ఉంది మందస గ్రామం. పూర్వం ఈ మందస గ్రామాన్ని ‘మంజూష’ అని పిలిచేవారు. ‘మంజూష’ అంటే నగలపెట్టె అని అర్ధం. అలాంటి నగలపెట్టె లాంటి మందస గ్రామంలో కొలువుతీరాడు వాసుదేవ పెరుమాళ్ స్వామి.

ఈ స్వామి ఇక్కడ కొలువుతీరడానికి ఒక కథనాన్ని చెప్తారు. పూర్వం ఇక్కడి సంస్థానాధీశులు కొన్ని కారణాల వాళ్ళ బ్రహ్మహత్యా దోషానికి గురయ్యారు. ఆ బ్రహ్మహత్యా పాతకం నుంచి బయటపడటం కోసం, ఒక దేవాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కాంచీపురంలో వాసుదేవ పెరుమాళ్ విగ్రహాన్ని తయారుచేయించి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు. అలా ఈ ఆలయం ఇక్కడ ఏర్పడినట్టు ఓ కథనం ఉంది.

ఒకప్పుడు ఎక్కడో దక్షిణాది రాష్ట్రమయిన ఆంధ్రప్రదేశ్‌లో ఒక చివరి జిల్లాలో ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో ఉన్న ఈ మందస గ్రామం ఉత్తరాదిలో అప్పటి పండిత నగరంగా ప్రసిద్ధి చెందినా కాశీవరకు ప్రసిద్ధి చెందింది. ఆచార్యుల వారు తన వేదవిద్యా పాటవంతో కాశీక్షేత్రం వరకు వెళ్లి అక్కడ విద్వాంసులను ఓడించి ఎన్నో ప్రశంసా పత్రాలు, బహుమతులు పొందినట్టు కథనాలున్నాయి. అప్పట్లో ఈ ఆలయ ప్రాంగణంలోనే రామానుజులు అనే ఆచార్యులు వేదవిద్యను నేర్పుతూ ఉండేవారు. వీరి ప్రసిద్ధిని గురించి విన్న చినజియ్యర్ స్వామి వారి గురువు గారైన పెదజియ్యర్ స్వామివారు ఇక్కడే ఉండి ఆచార్యుల దగ్గర శ్రీభాష్యం అభ్యసించారట. రెండు సంవత్సరాల కాలంలో నేర్చుకోవలసిన విద్యను ఆరునెలల్లోనే నేర్చుకున్నారట జియ్యరు స్వామివారు.

ఇలా ఏంతో ప్రాభవాన్ని, వైభవాన్ని పొందిన ఈ వాసుదేవ పెరుమాళ్ ఆలయం తరువాత కాలంలో గతకాల వైభవంగానే మిగిలిపోయింది. ఆలయం బాగా మరుగున పడిపోయింది. ఆలయ గోడలమీద పిచ్చిమొక్కలు పెరిగి విషజంతువుల సంచారంతో సుమారు 50 సంవత్సరాల కాలం ఈ అపురూప ఆలయం మరుగున పడిపోయింది.

ఆ తరువాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న చినజియ్యర్ స్వామివారు 1988లో ఈ ఆలయానికి వచ్చి ఆలయానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసి ఆలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు. తన గురువూ ఆధ్యాత్మిక మార్గదర్శీ అయిన పెద్దజియ్యర్ స్వామివారు స్వయంగా విద్య అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీయర్‌ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగుచేయించారు చినజీయరు స్వామి. వందల ఏళ్లనాటి ప్రాచీనతకూ, శిల్పకళా చాతుర్యమ్ ఎక్కడా చెడకుండా ఆలయ పునర్నిర్మాణం జరిగింది. శిధిలమయిన ఆలయాన్ని పూర్తిగా పునరుద్ధరించి 2009 ఫిబ్రవరి నెలలో ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది.

ఈ క్షేత్రానికి హనుమంతుడు క్షేత్ర పాలకుడు. ప్రతియేటా ఫిబ్రవరి మార్చి నెలల్లో వచ్చే మాఘమాసం మొదటి వారంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ బ్రహ్మోత్సవాలకు సమీప గ్రామాల నుంచే కాకుండా ఒరిస్సా లాంటి పొరుగు దేశాలనుంచి కూడా వేలాదిమంది భక్తులు వస్తారు. ఈ వాసుదేవ పెరుమాళ్ స్వామిని దర్శించడం వలన జ్ఞానం… ఆరోగ్యం… సంపద లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం.

శ్రీకాకుళం జిల్లా కేంద్రం విశాఖపట్నం నుండి 200 కి.మీ. శ్రీకాకుళం నుండి 100 కి.మీ. దూరంలో ఉంది మందస గ్రామం. మందసకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను పలాస. పలాస వరకు రైల్లో చేరుకొని అక్కడి నుంచి ప్రయివేట్ వాహనాల్లో మందస చేరుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here