మనిషితనం

1
6

[dropcap]ఒ[/dropcap]క మనిషి సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించడానికి వారితో మనకి ఏ రకమైన సంబంధమూ ఉండనవసరం లేదు. మనలో మనిషితనం ఉంటే చాలు. అలానే ప్రతి అమ్మాయి లోనూ అమ్మ ఉంటుంది. దానికి ధనిక, పేద తేడా లేదు. అమ్మతనం మాత్రమే ఉంటుంది. అలాంటి ఒక అమ్మ కథ.

***

శిశిర మధ్యతరగతి కుటుంబం లోని అమ్మాయి. అందరు అమ్మాయిల్లానే బాగా చదువుకోవాలి, మంచి జాబ్ చేయాలి అని ఉన్నా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్‌తో చదువు ఆపవలసి వచ్చింది.

ఇక తర్వాత ఏముంది సంబంధాల వెతుకులాట.. మన మధ్యతరగతి తల్లిదండ్రులు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టయినా పెళ్ళి చేస్తారు కానీ, పెళ్ళికి పెట్టే ఖర్చులో సగం అమ్మాయి చదువుకి వాడమంటే ఒప్పుకోరు. అది వారి బలహీనతో, తరతరాలుగా జీర్ణించుకున్న వంశపారంపర్య లక్షణమో, లేక ఒక్కసారి ఖర్చు పెట్టేస్తే ఇక గుండెల మీద బరువు దిగిపోతుంది అనే భావమో… ఏమో మరి… (అందరూ కాదండీ, కొంతమంది ఇలానే ఆలోచిస్తున్నారు ఇప్పటికీ).

ఒక మంచి సంబంధం వచ్చింది శిశిరకి. అబ్బాయి మంచివాడు, మంచి జాబ్, మంచి కుటుంబం. కాకపోతే కొంచెం పొదుపరి అబ్బాయి. అదేం పెద్ద విషయంగా అనిపించలేదు, పైగా భవిష్యత్తు పట్ల అతని జాగ్రత్తగా అభివర్ణించారు. అన్ని విషయాల్లోనూ,అన్ని రకాలుగా ఇరు కుటుంబాలకు ఏకనిర్ణయాలకు రావడంతో వారి వివాహం ఘనంగా జరిగింది.

ఇంతకీ అబ్బాయి పేరు చెప్పలేదు కదూ…. విరాజ్ అతని పేరు.

నూతన దంపతులు ఇద్దరూ కొత్త కాపురం మొదలు పెట్టారు. శిశిర అణకువ కల అమ్మాయి కావడంతో రోజులు సంతోషంగా గడిచిపోతున్నాయి. అప్పుడప్పుడు విరాజ్ పొదుపుతో కొంత ఇబ్బంది ఎదురవుతున్నా శిశిర ఓర్పుగా నెట్టుకొస్తుంది.

విరాజ్ పొదుపుతనం ఎలా ఉంటుందంటే…. కూరగాయల మార్కెట్ మూడు కిలోమీటర్లు వీళ్ళ ఇంటికి. “సరదాగా వాకింగ్ చేద్దాం” అంటూ నడుచుకుంటూ వెళ్ళి కూరగాయలు తెచ్చుకునేవారు. ఆ కూరగాయలు కూడా ఏవి తక్కువ ధర ఉంటే వాటినే,అవి కొంచెం బాగా లేకున్న అవే తెచ్చుకునేది, ఎక్కువ ధర ఉన్న వాటి మొహం పొరపాటున కూడా చూడకపోవడం ఇలాంటివి.

ప్రతి విషయంలోనూ ఇదే పద్దతి. పోనీ నిజంగా డబ్బుకి ఇబ్బంది పడే కుటుంబం అయితే అలా వ్యవహరించడంలో తప్పలేదు. కానీ మరో కుటుంబాన్ని కూడా పోషించగల స్థాయిలో ఉండి కూడా ఇలా ప్రవర్తిస్తే ఎలా ఓర్చుకోవాలో అర్థం అయ్యేది కాదు శిశిరకి. వినే వారికి చిన్న విషయం అనిపించినా రోజూ భరించేవారికి అదే పెద్ద విషయంగా అనిపిస్తుంది.

పెళ్ళైన రెండేళ్ళకి శిశిర నెల తప్పింది. ఊరికి దూరంగా ఉన్న చిన్న క్లినిక్‌లో అన్ని రకాల ఫీజులూ తక్కువ అని అక్కడికే తీసుకెళ్ళాడు. అంతా బాగుంది అని చెప్పారు డాక్టర్. అన్ని పనులూ చేసుకుంటూ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుందని చెప్పడంతో తన పనులు ఏమీ మానేది కాదు. పురిటికి పుట్టింటికి పంపించలేదు, తనని వదిలి నేనుండలేను అంటూ.

చాలా బాగా చూసుకునేవాడు భార్యను. బరువు పనులన్నీ తనే చేసేవాడు. నెలలు నిండాయి. తొమ్మిదో నెల వచ్చింది. డాక్టర్ ఇచ్చిన డేట్ ఇంకా ఇరవై రోజులుంది.

“ఒక పది రోజులు ఆగి వస్తాం” అన్నారు పెద్దవాళ్ళు. ఎందుకంటే విరాజ్‌కి ఎవరైనా సరే తమింటికి రావటాన్ని ఇష్టపడడు. అది తెలిసే లేట్‌గా వస్తాం అన్నారు. అమ్మాయిని బాగా చూసుకోవడం వల్ల పెద్దలకి కంగారు అనిపించలేదు.

ఇంకా ఇరవై రోజులు డేట్ ఉన్నా సడెన్‌గా నొప్పులు మొదలయ్యాయి. విరాజ్ ఇంటి దగ్గరే ఉన్నాడు ఆ సమయానికి. ఆ సమయంలో కూడా తన పొదుపుతనం వదల్లేదు. బైక్‌పై కూర్చోపెట్టుకుని తీసుకు వెళుతున్నాడు. సగం దూరం వెళ్ళాకా బైక్ ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా అవ్వలేదు. ఇక కంగారు మొదలయింది విరాజ్‌లో… శిశిరకి నొప్పులు కొంచెం కొంచెం ఎక్కువ అవుతున్నాయి. నిలబడలేకపోతుంది.

చుట్టుపక్కల ఏ వాహనం కనిపించట్లేదు. వచ్చిన ఒకటి, రెండు వాహనాలు ఆపలేదు. పది నిమిషాల తర్వాత ఒక ఆటో వచ్చింది. ఆటో అతను పరిస్థితి గమనించి తొందరగా ఎక్కమన్నాడు. విరాజ్ హాస్పిటల్ అడ్రస్ చెప్పాడు. వీలైనంత త్వరగా తీసుకుని వెళ్ళాడు. ఆటో దిగి డబ్బులు ఇద్దామంటే పర్స్ కనిపించలేదు. ఈ హడావిడిలో ఇంటి దగ్గర మర్చిపోయాడు. భయంభయంగా ఆటో అతన్ని చూశాడు. ఆటో అతను అర్థం చేసుకున్నట్లుగా నవ్వి “ఫర్వాలేదు సార్ ఫస్ట్ మేడమ్‌ని లోపలికి తీసుకు వెళ్ళండి” అన్నాడు. ఆటో అతనికి కృతజ్ఞతలు చెప్పి లోపలికి తీసుకుని వెళ్ళాడు.

ఉండటానికి చిన్న క్లినిక్ అయినా డబ్బు విషయంలో ఖచ్చితంగా ఉంటారు వాళ్ళు. డబ్బులు కడితే కానీ జాయిన్ చేసుకోం అన్నారు.

ఏం చేయాలో అర్థం కాక ఏడుపు వచ్చేస్తుంది. శిశిరకి నొప్పులు ఎక్కువ అయ్యాయి. ఇంతలో ఆటో అతనే వచ్చి “డబ్బులు నేను కడతాను, మీరు ఆమెను తీసుకు వెళ్ళండి” అన్నాడు. వెంటనే సిస్టర్ తీసుకుని వెళ్ళపోయింది లేబర్ రూమ్‌కి. ఆటో అతను డబ్బులు కట్టేసాడు.

విరాజ్ ఆటో అతన్ని హత్తుకుని ఏడ్చేసాడు… “మీరే లేకపోతే నా భార్య పరిస్థితి ఏంటం”టూ…

ఆటో అతను “ఊరుకోండి సాబ్, బెహన్‌కి ఏం కాదు. నా పేరు సలీం. సమయానికి నా దగ్గర డబ్బు ఉండబట్టి కట్టగలిగా. పది రోజుల్లో మా బెహన్ షాదీ ఉంది సాబ్. అందుకే ఆ డబ్బు వేరేవాళ్ళ దగ్గర తీసుకున్నా.. అది ఈ విధంగా ఉపయోగపడింది. అంతా అల్లా దయ సాబ్. మీరేం ఫికర్ చేయకండి, అంతా మంచే జరుగుతుంది” అన్నాడు.

“థాంక్యూ భాయ్, మీ డబ్బులు సాయంత్రానికి ఇచ్చేస్తా” అన్నాడు విరాజ్.

“అయ్యో ఫర్వాలేదు సాబ్” అన్నాడు అతను.

సిస్టర్ వచ్చి “నార్మల్ డెలివరీ అయింది అనీ, పండంటి పాప పుట్టింది” అని చెప్పి వెళ్ళిపోయింది.

విరాజ్, సలీం ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు సంతోషంతో…

తర్వాత తన వివరాలు విరాజ్‌కి తెలియచేసి వెళ్ళపోయాడు సలీం.

శిశిరని రూమ్‌కి షిఫ్ట్ చేశారు. ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పాడు. వాళ్ళందరూ హడావిడిగా బయల్దేరారు. పాప చాలా ముద్దుగా ఉంది. కొంచెం సేపు అయ్యాకా పాప ఏడవడం మొదలుపెట్టింది. ఎంతసేపు అయినా ఏడుపు ఆపట్లేదు. శిశిరకి ఇంకా పాలు పడలేదు. చుట్టుపక్కల ఏమీ తెరిచి లేవు ఆరోజు పాలు తీసుకు రావడానికి…

ఇంతలో పాప ఏడుపు విని ఒక సిస్టర్ దగ్గరకు వచ్చి “మీరు ఏమీ అనుకోకపోతే పాపకి నేను పాలు ఇవ్వనా, నాకు పది నెలల బాబు ఉన్నాడు. పాప ఆకలికి ఏడుస్తుంది” అంది.

“తప్పకుండా అమ్మా తీసుకోండి” అంటూ బిడ్డను ఇచ్చాడు. పాప ఆకలి తీరేసరికి హాయిగా నిద్రపోయింది.

“అమ్మా ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం, చెప్పకుండానే నా బిడ్డ ఆకలి తెలుసుకుని తీర్చారు” అంటూ భార్యాభర్తలు ఇద్దరూ ఏడ్చేసారు.

“అయ్యో, దీనిలో ఏముంది అండీ. నేనూ ఒక అమ్మనే. బిడ్డ ఆకలి అర్థం అయ్యింది, చూస్తూ ఉండలేక నాకు చేతనయింది చేశాను, అంతే” అంటూ సెలవు తీసుకుంది.

ఆ రోజు జరిగిన సంఘటనలతో మనిషి విలువ తెలుసుకున్నాడు విరాజ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here