మనిషివా? కణుసువా?

0
12

[గిరిజనుల సామెత ఆధారంగా ఈ కథని అందిస్తున్నారు శ్రీ వేలమూరి నాగేశ్వరరావు.]

[dropcap]రం[/dropcap]గశీల రంగమ్మ పుట్టిన ఊరు. ఆమె ఆ గ్రామ పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకుంది. నీతి కథలు, సామెతలు, పొడుపు కథలు బాగా వచ్చును రంగమ్మకు. గ్రామంలో అందరితో కలుపుగోలుగా వుంటుంది. ప్రతి నెలా పౌర్ణమి రోజున తన గ్రామంలోని పాఠశాల వద్ద తోటి గిరిజన స్త్రీలతో సాంప్రదాయ ధింసా నృత్యం చేస్తుంది. వారంతా ఆ నృత్యం ఆనందంగా చేస్తుంటే చూసే వారికి రెండు కళ్లు చాలవంటే నమ్మండి. ఆ నృత్యం చేసిన స్త్రీలకు మగవారు తోచిన డబ్బులిచ్చి వారిని అభినందిస్తుంటారు.

రంగమ్మ మొగుడు రాజన్న. అతడు బడి ముఖం చూడలేదు. గంపెడు సంతానముంటే సుఖంగా బ్రతుకుతామన్న గుడ్డి నమ్మకంతో వుంటూ కలల లోకంలో విహరిస్తుంటాడు. పిల్లల్ని పెంచడం పెళ్లాల బాధ్యత. పండించేందుకు పిల్లలు లేకపోయినా పందిలా పదిమంది పిల్లల్ని కంటే చాలునన్నది అతని వాదన. రంగమ్మ ఇద్దరు పిల్లలు ముద్దు అని మొగుడికి నచ్చ చెప్పబోయి విఫలమయింది. ఆమె అభిప్రాయానికి గ్రామంలోని తన ఈడు వారంతా మద్దతు యివ్వడంతో ఆమె ‘అధిక సంతానం అనర్థదాయకం’ అని వారి భర్తలకు చెప్పండని, ఏదో ఉపాయంతో వారిని రాత్రులు దగ్గరకు రాకుండా జాగ్రత్త పడమని చెప్పడంతో వారంతా అందుకు తలూపారు.

రంగశీల గ్రామానికి దగ్గరలో అడవి వుంది. అందులో రకరకాల జంతువులున్నాయి. కణుసు అనే జంతువులు మందలు మందలుగా తిరుగుతుంటాయి. మగ కణుసులకు నెత్తిన పెద్ద కొమ్ములుంటాయి. ఎంతో బలంగా వుంటాయి మగకణుసులు. ఆడ కణుసుల వెంట అదే పనిగా తిరుగుతుంటాయి. ఈ కణుసులను గిరిజనులు వేటాడి వాటి మాంసం ఎంతో ఇష్టంగా తింటారు. రంగమ్మ గ్రామానికి దగ్గర్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వుంది. అందులో ఆడ, మగ వైద్యులు వి.ఎన్.ఎం.లు, హెల్త్ సూపర్‌వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లున్నారు. వారిలో లలితమ్మ అనే ఆమె వారానికోమారు రంగశీల గ్రామానికి వస్తుంది. రంగమ్మతో కలసి గ్రామంలో తిరిగి కుటుంబ నియంత్రణ ప్రాముఖ్యాన్ని అందరికీ వివరిస్తుంటుంది. అది ఆమె విధుల్లో ఒకటి. రాజన్న లాంటి సోమరిపోతులకు గుణపాఠం చెప్పమని రంగమ్మకు సలహా యిచ్చింది. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స మగవారు చేయించుకుంటే ప్రభుత్వం అందుకు డబ్బులిస్తుందని చెప్పింది.

రంగశీల గ్రామంలోని మహిళంతా చైతన్యవంతులయ్యారు. మేమంతా పిల్లల్ని కనే యంత్రాలం కామని తమ మొగుళ్లకు తెలియ జెప్పాలనుకున్నారు. రాత్రులు భర్తలు దగ్గరకొసత్తే ‘నువ్వు మనిషివా? కణుసువా?’ అని అడగండని, కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకోమని చెవిలో జోరిగలాగా వారిని నిద్రలేకుండా చేయండని రంగమ్మ చెప్పి కృతకృత్యురాలయ్యింది. ప్రాథమిక వైద్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది రంగశాల గ్రామం వచ్చి పురుషులకు సామూహికంగా శస్త్రచికిత్సలు చేసి డబ్బులు ఇవ్వడంతో వారంతా తమ భార్యలను పొగిడారు. చేతి కొచ్చిన డబ్బులతో మాంసాహార భోజనం తిన్నారు. తాము కణుసులు (జంతువులు) కామని, బుద్ధి కలిగిన మానవులమని నిరూపించారు. అందరూ ‘రంగమ్మ’ ముందుచూపుకు పదివేల దండాలు పెట్టారు. కొన్నాళ్లకు ఆమెను తమ పంచాయితీకి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here