[box type=’note’ fontsize=’16’] తమ పనులు తాము చేసుకోలేక మంచానికే పరిమితమైన వృద్ధుల మనోభావాలు హృదయం కదిలేలా ప్రదర్శించే కథ జె. శ్యామల కథ మనో’భ్రమ’ణం . [/box]
సంజె చీకట్లు చిక్కబడుతున్నవేళ… మాగన్నుగా పడుకున్న అనసూయమ్మకు మెలకువ వచ్చింది. అలికిడి ఏమీ వినిపించలేదు. ‘అబ్బాయి లైబ్రరీకో, గుడికో వెళ్ళుంటాడు. అయినా నా చెవులు పనిచేస్తేగా ఏదైనా వినిపించఛానికి’ అని మనసులోనే అనుకుంటూ, పక్కకు తిరిగి అతి కష్టమ్మీద పక్క గూడు నుంచి అద్దం అందుకుని తన ముఖాన్ని చూసుకుంది. అంతా అలుముకున్నట్టుగా ఉండి అద్దం మసకబారిందో, తన చూపే మరింత మసకేసిందో… పక్క మీదున్న పాతచీరె ముక్కతో అద్దాన్ని తుడిచి మళ్ళీ ముఖం చూసుకొంది. తన ముఖం తనకే వికారంగా అనిపించింది.
‘ఎలా ఉండే తను ఎలా అయిపోయింది!’ చీరె అనుకూలం కాదని తనకి గౌను తగిలించారు. దువ్వటం, తలస్నానం… ఇవన్నీ తంటా అని జుట్టు కత్తిరించి క్రాఫ్ చేశారు. ఎక్కడ చూసినా దొంగల భయంగా ఉందని, నగల కోసం చంపడానిక్కూడా వెనుకాడట్లేదని తన ఒంటి మీద నగలన్నీ తీసేసి మెళ్ళో పిచ్చి పూసల దండ వేసి, చేతులకు రాగి కడియాలు వేశారు. ‘నా అవతారం, నేనూ…’ అనుకుంది. ఎదురుగా పెట్టెనిండా జరీ చీరెలు, పట్టు చీరలు. కానీ కట్టుకునే రాతేదీ? దేనికన్నా పెట్టి పుట్టాలి. తన భర్తలాగా దేవుడి ముందు కూర్చుని గంటల తరబడి పూజలు చేయకపోయినా, పని చేసుకుంటూనే పాడుకునేది. భక్తి పాటలు, మంగళహారలుతు, కీర్తనలు, తత్వాలు… ఆఁ ఆ పాట ‘పాట పాడుమా కృష్ణా పలుకు తేనెలొలుకు నటుల, మాటలాడుమా ముకుందా మనసు తీరగా’ తనకెంతో ఇష్టమని పాడబోయింది. గొంతు బొంగురుపోయింది. ‘తన పాట పరిసమాప్తే’ అనుకుంటూ ఆ ప్రయత్నం విరమించింది.
మళ్ళీ ఆలోచన… ఇంతకూ ఇది ఏ మాసమో, ఏ వారమో, ఏ తిథో… ఏమీ తెలియడం లేదు. ఎవరినన్నా అడిగి తెలుసుకున్నప్పుడు ఆ ప్రకారం కొన్నాళ్ళు గుర్తుంచుకున్నా మళ్ళీ మధ్యలో మరపు… తను పొరపాటు చేసింది. ఆయన పోగానే ఏదైనా ఆశ్రమంలో చేరితే పోయేది. అక్కడైనా నలుగురు ఉండేవాళ్ళేమో. అప్పుడేమో కడుపు తీపి కట్టి పడేసింది. పెద్దాడు అమాయకుడు. ఆదా చేయడం దాచుకోవడం తెలీవు. మనవరాలి పెళ్ళి, మనవళ్ళ చదువులు… తను లేకపోతే వాడికి జాగ్రత్త ఎవరు చెబుతారు? తనకు పదివేలకు పైగా పెన్షన్ వస్తుంది. తన ఒక్క పొట్టకు ఎంత కావాలి? ఏదో పెద్ద దిక్కుగా ఇంటి పట్టున ఉండాలని ఆశపడింది. కానీ అంతా తారుమారైంది. తీరా ఇప్పుడు ‘న్వ్వు ఏ ఆశ్రమంలోనూ ఇమడలేవు. అయినా నిన్నెవరు చేర్చుకుంటారు? ఒకవేళ డబ్బు కట్టి చేర్చినా నాలుగోనాడే నచ్చలేదని గొడవ చేయడం ఖాయం’ అన్నారు. మళ్ళీ ఆ డబ్బు మాట తను ఎత్తకూడదు. నీ డబ్బెక్కడికీ పోదంటారు, కానీ ఏ వివరం చెప్పరు. సంతకం పెట్టడం వరకే తన పని. అదేమన్నా అంటే ‘నీకు వినబడదు, అర్థం కాదు’ అంటారు. ఆయనే ఉండి ఉంటే తమ బతుకేదో తాము బతికేవాళ్ళం. ఏకాకి నయ్యాను. డబ్బు ఉంటేనే పిల్లలు గడ్డిపోచలా తీసిపడేస్తున్నారు. ఇంక అదే లేకపోతే తన ముఖం చూస్తారా? ఈ చెవులకేమొచ్చిందో వినబడి చావవు. చెవిటి మెషిన్ పెట్టిస్తారేమో అంటే ‘కర్ణభేరికే చిల్లు పడింది, కుదరదు’ అన్నారు. నిజమో, అబద్ధమో, నమ్మక చేసేదేముంది? కళ్ళా… అంతంత మాత్రమే. ఆయన ఉన్నన్నాళ్ళు ఇంటి పనే సరిపోయేది. అప్పుడు టీవీలు కూడా అంతగా లేవు. పనిమనిషిని పెట్టుకోకుండా అన్ని పనులూ చక్కబెట్టి, ఇల్లు పొదుపుగా నడపబటి సరిపోయింది కానీ తన ఆడపడుచు భాగ్యమ్మల్లే పూటా మూరెడు పూలు, సోడాలు, కొబ్బరి బోండాలు, కిళ్ళీలు, సినిమాలు అంటూ జల్సా చేసి ఉంటే ఇవాళ ఈ ఇల్లు ఇలా ఉండేదా? ఆ కృతజ్ఞత ఎవరిలోనూ కనిపించదు. ఎవరికోసం అన్నట్లుంటారు… పుస్తకం చదువుదామంటే కాలం నాడు కుదరలేదు. తీరా ఇప్పుడేమో చూపే ఆనదు. కళ్ళద్దాలు పేరుకే. ఈ మధ్య కళ్ళు నీళ్ళు కారుతున్నాయ్. టీవీలో బొమ్మ కూడా అంత స్పష్టంగా కనిపించదు. ఇవి చాలక కాళ్ళనొప్పులు, నడుం నొప్పి మొదలయ్యాయి. ఆ రోజుల్లో ఆయన ఉద్యోగరీత్యా తిరిగిన ఊళ్ళే కానీ ఏ పుణ్యక్షేత్రాలకూ వెళ్ళింది లేదు. పైసా పైసా కూడబెట్టి స్టీలు గిన్నెలు ప్రతీది పెద్దాడికి, చిన్నాదికి అంటూ రెండేసి కొనేది. తీరా కోడళ్ళకు అవీ పనికిరాలేదు. కాస్తో కూస్తో ఓపిక ఉండి తన అన్నమేదో తాను ఉడకేసుకున్న రోజులలో కూడా తను వాళ్ళకు ఓ అడ్దుగా, భారంగా భావించారు. తర్వాత తర్వాత ఓపిక పూర్తిగా నశించి లేచి తిరగలేకపోయింది. మూత్రం ఆగదు. తనకేదో ఇన్‌ఫెక్షన్ అన్నారు. మూత్రం సమస్యకు గొట్టం అమర్చారు. దాంతో అసలే లేవకుండా అయిపోయింది. ఏదన్నా ఆపరేషన్ చేస్తే నడవగలదేమో. ఆ మాటే అంటే ఈ వయసులో ఆపరేషన్ చెయ్యరన్నారు. కానీ ఆ జానకమ్మ మోకాళ్ళ ఆపరేశన్ చేయించుకుని నడవడమే కాదు, కాశీ కూడా వెళ్ళొచ్చిందట. అయినా అంతా తలరాత… ఆడపిల్లలు ఉన్నారే కానీ తనకే బుద్ధులు చెబుతారు. చేతగాని వయసులో, ఉన్నచోట నోటిమంచితో రోజులు నెట్టుకురావాలని, ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదని, ఎవరినీ ఏమీ అనకూడదని… గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని వీళ్ళు తనకు చెపుతారూ… ఇంట్లో ఉన్నాక మంచీ చెడ్డా మాట్లాడకుండా ఎలా ఉంటారు? అయినా అంత కాని మాట తనేమంటుందని? ఉన్నమాట అంటాననే వాళ్ళ మంట అంతా.
చచ్చి ఏ లోకాన వుందో తన అత్తగారు. ఆమె అదృష్టవంతురాలు. పెద్ద కోడలు మనమరాలే కావడంతో మంచాన పడ్డా, శ్రద్ధగా స్నానం చేయించి, బట్టకట్టి, వండి పెట్టి, ఉచ్ఛం నీచం లేకుండా అన్ని సేవలూ చేసింది. మామగారు వడ్లబస్తాలు లెక్కపెట్టిస్తునే హఠాత్తుగా గుండెపోటుతో పోయాడు. తనెప్పుడూ అత్తగారితో “మామగారు పుణ్యాత్ముడు.. ఎవరిచేతా చేయించుకోకుండా హఠాత్తుగా వెళ్ళిపోయారు” అనేది. “అంటే నేను పోలేదనేగా” అని ఉడుక్కునేది అత్తగారు. తనేమో మాటవరస కన్నాను అనేది. ఇప్పుడనిపిస్తోంది, ఆమె అదృష్టం తనకెక్కడిది? చివరి వరకూ ఆమెను అంతా ఆదరంగా, గౌరవంగా చూశారు. తననో… పదిసార్లు పిలిస్తే ఒకసారి తొంగి చూస్తారు. మాటా పలుకు లేకుండా కాఫీ గ్లాసు అక్కడ పెట్టి వెళ్ళడం, అన్నం పళ్ళెం అందించడం… ఏమిటో ఏవీ నోటికి రుచించవు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరెవరో వస్తుంటారు, పోతుంటారు. ఆలోచనలతో అలసిన అనసూయమ్మకు మెల్లగా కళ్ళు మూతలు పడ్డాయి.
***
అర్ధరాత్రి అనసూయమ్మకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. అంతా నిశ్శబ్దం. కిటికీలోంచి చెట్ల కొమ్మలు ఊగుతూ కనబడి భయపెట్టాయి, ఏవో ఆకారాలు తన దగ్గరకు వస్తున్నట్టు. ఇంతలో నైట్ బల్బ్ కూడా పోయింది. కరెంట్ పోయిందేమో, చిమ్మచీకటి. తన గదే తనని భయపెడుతోంది. అప్రయత్నంగా ‘అబ్బాయ్’ అని శక్తినంతా కూడదీసుకుని అరిచినట్లుగా పిలిచింది.
“ఆ. వస్తున్నా ఉండు. కరెంట్ పోయింది. క్యాండిల్ తెస్తా. పడుకో… అప్పుడే ఏం కొంప మునిగిందని లేచావ్” అన్నాడు కొడుకు.
అనసూయమ్మకు అవేవి వినబడలేదు. కానీ కొద్దిసేపటికి కొవ్వొత్తి వెలుగు కనిపించింది. ‘హమ్మయ్య’ అనుకొంది. అప్పటి వరకు అలముకొన్న భయం వల్లనేమో చెమటలు. ఆ చెమటతో ఒళ్ళంతా చల్లగా. చావు కూడా చీకటి లాంటిదేగా. కోడలితో పోట్లాడినప్పుడల్లా ‘నాకు చాతగానినాడు నాలుగు మాత్రలు మింగుతా. అంతేగాని నీ మోచేతి నీళ్ళు నాకెందుకు? ముక్కు మూసుకుంటే మూడు నిముషాలు’ అనేది తను. కానీ అవేవీ చేయలేకపోయింది. ఏమిటో గుండెలో గాభరాగా ఉంది. నిన్ననే డాక్టర్ వచ్చి చూసి మాత్రలిచ్చాడు. ఈ పక్క మీద పడుకుని, పడుకుని వీపంతా ఒకటే నొప్పి. ఈ దుప్పట్లు, తువ్వాళ్ళు, పాతచీరెలు అన్నీ అస్తవ్యస్తంగా. సరి చేసుకుందామంటే తన చేతనైతేగా. గొంతు తడారిపోతోంది. ఏంటో… అంతా తేలిపోతున్నట్లుగా…
***
సదాశివంకు హఠాత్తుగా మెలకువ వచ్చింది. అమ్మ మళ్ళీ మళ్ళీ పిలవలేదంటే విచిత్రమే. లేకపోతే తనకీ కాస్త కునుకు ఎలా పట్టేది? డాక్టర్ ఇచ్చిన మందుల వల్ల నిద్ర పట్టి ఉంటుందామెకు. పోన్లే, ఇంకో గంట పడుకోనీ అనుకుంటూ అటు తిరిగాడు. సెకన్లు నిముషాలు, నిముషాలు గంటలు అయ్యాయి. “ఇంక లేచేద్దాం. పాలు తేవాలి. భార్యా పిల్లలు పదింటి కల్లా ఊర్నుంచి దిగుతున్నారు. ఇంకో రెండు పాకెట్లు ఎక్కువ తేవాలి” అనుకుంటూ లేచి ఎందుకో అనసూయమ్మ గది వైపు చూశాడు. అసంకల్పితంగా అడుగులు ముందుకు పడ్డాయి. రోజూలాగా చిన్నపాటి గురక వినిపించలేదు. మనసు కీడెంచింది… ముంచెత్తిన భయంతో. ‘అమ్మా’ అని పిలిచాడు. బదులు లేదు… కదలిక లేదు. చేతులతో పట్టి కుదుపుతూ పిలిచాడు. ఊహూ… ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లేవు. చల్లని మంచుముద్దలా శరీరం. బాధతో, భయంతో ఒళ్ళంతా నిస్సత్తువ అవహించింది. తనను తాను కూడదీసుకుంతూ ఫోనందుకుని డాక్టరుకు చెప్పాడు. సంవత్సరాలుగా తెలిసిన డాక్టర్ కావడంతో వచ్చి చూసి, ఉదయం ఐదున్నర ప్రాంతంలో పోయారంటూ అనసూయమ్మ మరణాన్ని ధ్రువీకరించి, సారీ అంటూ వెళ్ళిపోయాడు. మిశ్రమ భావాలతో దుఃఖతమమవుతున్న మదిని అదుపులో పెట్టుకుంటూ మళ్ళీ ఫోనందుకున్నాడు సదాశివం.
***
“హలో! ఏమిటీ… అమ్మ పోయిందా… ఎప్పుడు? ఏమైందీ… అయ్య్యో. సరే బయల్దేరుతాం” వచ్చే ఏడుపును నొక్కిపట్టింది భావన. ఒక్క క్షణం మనసు మొద్దుబారిపోయినట్లయింది. అమ్మ… ఆమె చివరి అధ్యాయం గురించి తను ఆందోళన పడని రోజు లేదు. ఏదో ఒక రోజు ఈ విషాదవార్త వస్తుందని తెలుసు. కానీ అది ఈ ఉదయమన్నది ఊహక్కూడా అందలేదు. మంచంలో ఉండి… కదల్లేక… సరిగా కనిపించక… వినిపించక… అసహాయతలో అందరినీ అపార్థం చేసుకుంటూ, అందరి గురించి తనకు తానే చిత్ర విచిత్రంగా ఊహించుకుంటూ వచ్చిన వాళ్ళతో అర్థం లేని మాటలు మాట్లాడుతూ, సుఖము, శాంతి లేకుండా… ఎంతటి నరకం? అందరూ ఆమె నిష్క్రమణ కోసం నిరీక్షించడం… అలాంటి దుఃస్థితి ఎవరికీ వద్దు. ఇంకా తీవ్రంగా జబ్బు పడి, కోమా లోకి వెళ్ళిపోవడం వంటివేవీ లేకుండా సహజంగానే వెళ్ళిపోయిందంటే కొంతలో కొంత అమ్మ అదృష్టవంతురాలే. ఆమె పిల్లలం మేమే జీవనసంధ్యలోకి జారిపోతున్నాం. చిన్నన్నయ్య అయితే అమ్మ కన్నా మూడేళ్ళ ముందే వెళ్ళిపోయాడు. అన్నిటికీ ముందు వెనకలుంటాయేమో కాని మరణానికి మాత్రం ఉండవు. ఇక్కడ వయసుతో నిమిత్తం లేదు. మృత్యుదేవత చూపు ఎప్పుడు, ఎవరిమీద పడుతుందో ఎవరూ చెప్పలేరు. తన బిడ్డలు తన కళ్ళముందే కన్నుమూయడం తల్లికి ఎంతటి వేదన? చిన్నన్నయ్య గురించి అమ్మ ఎంత రోదించి ఉంటుంది? తనింకా వచ్చేవారం వెళ్ళి ఒకసారి చూసి రావాలనుకుంది. కానీ ఇలా అవుతుందనుకోలేదు. వచ్చే నెల యు.ఎస్. వెళ్ళాల్సి ఉంది తను. తను అక్కడుండగా అమ్మకేమయినా అయితే తను కడసారి చూసేదెలా? నా ప్రాప్తం ఎలా వుందో. వెళ్ళే ముందు ఒకసారి కళ్ళారా… మనసారా చూద్దామనుకుంది. కానీ ఇప్పుడే కడసారి చూపు కళ్ళారా చూడమంది అమ్మ… ఆటో పరుగు భావన మనోవేగం ముందు ఓడిపోతోంది.
***
అనసూయమ్మ మరణం బంధువుల్లో ఓ వైపు ఆమె జ్ఞాపకాలను తిరగదోడుతూ మరోవైపు మృత్యువు గురించి పలుకోణాలను ఆవిష్కరిస్తోంది. “ఆవిడకు ఎంతటి జ్ఞాపకశక్తి. మనిషి కనిపిస్తే చాలు, ఎక్కడెక్కడి విషయ్యాలు, ఎప్పటెప్పటివో చెప్పుకొచ్చేది. అందర్నీ పేరుపేరునా గుర్తు చేసేది. ఆ కాలం మనిషి కాబట్టి తొంభై ఏళ్ళ వయసులోనూ ప్రాణాంతక జబ్బుల్లేకుండా వుంది. ఇప్పుడు ప్రతి వాళ్లకు బిపి, షుగరు కామన్ అయిపోయాయి. ఏమిటో చావు, చెప్పాపెట్టకుందా ఎప్పుడైనా చేయి పట్టుకోవచ్చు. అరవై తర్వాత ప్రతి ఒక్క సంవత్సరం బోనస్ కిందే లెక్క. పెద్దావిడని చూడాలని వచ్చే వాళ్ళం. ఇంక ఆ కారణం ఉండదు. నిద్రలోనే పోయిందట. అదృష్టవంతురాలు. తమ పని ఏమవుతుందో? ముందుంది ముసళ్ళ పండుగ అంటే ఇదేనేమో. ఆమెకు కాస్తో కూస్తో డబ్బుందన్న ధైర్యమన్నా ఉండేది. డబ్బున్నా ఎవరూ కేర్ చేయని రోజులివి. కానీ ఆమె డబ్బుంటే ఎవరైనా చేస్తారనుకునేది. ఆ తీరే ఆమె అంటే వ్యతిరేకతగా తయారైంది. నిజానికి డబ్బు కూడా లేకుండా చూసేదెవరు? తనకు ఆ డబ్బే లేదు. ఏదో మేకపోతు గాంభీర్యం నటిస్తున్నాడంతే”. రాఘవరావ్ ఆలోచనల్లో అలసిపోతున్నాడు.
‘పండుటాకు రాలిపోవడం ఎంత సహజమో, తొమ్మిది పదుల వయసులో మృత్యువు రావడం అంతే సహజం. అయినా ఏదో అనుకోవడమే కానీ రోజూ ఎంతమంది కన్నుమూయడం లేదు? ఇప్పుడు హార్ట్ అటాక్‌లకు వయసుతో పనే లేదు. ముప్ఫయ్ ఏళ్ళ వాళ్లనీ గుండె జబ్బు వదలడం లేదు. లేదంటే ఏదో ఒక క్యాన్సర్ కబళిస్తోంది. మెన్నటికి మొన్న శ్రవణ్… పెళ్ళయి ఏడాది కూడా కాలేదు. హఠాత్తుగా పోయాడు.. స్ట్రెస్‌ఫుల్ జాబ్. కార్డియాక్ అరెస్ట్‌తో పోయాడన్నారు. శశాంక్ వాళ్ళ బాబుకు నిండా పదేళ్ళు లేవు. ఏదో విషజ్వరం పొట్టనబెట్టుకుంది. ఈ మధ్య కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువయ్యాయి. మందులు వాడినా బాధే, వాడకపోయినా బాధే. ఏం తినాలో, ఏం తినకూడదో తెలియదు. రకరకాల వైద్యులు. వందమంది వందరకాలుగా చెబుతుంటారు. ఏది నమ్మి, ఫాలో అవ్వాలో తెలియదు. అయినా దేవుడు ఆయుర్దాయం మన నుదుటన మొదటే రాస్తాడంటుంది భారతీయ కర్మ సిద్ధాంతం. మరి అప్పుడు అలోపతి… హోమియోపతి… అయుర్వేదం ఏదయినా మరణం నుంచి రక్షిస్తుందా? అలా అని వైద్యం చేయించుకోకుండా ప్రాణాలను గాలికి వదలగలమా? బ్రతుకు పట్ల భ్రమ లేకపోతే బతికేదెట్ల?’ వేదాంత్ ఆలోచనల వసారాలో పచార్లు చేస్తున్నాడు.
“చావు ఎంత చిత్రమైనది! కొందరితో ఇదిగో, అదిగో అంటూ దోబూచులాడి నానా అవస్థ పెడుతుంది. మరికొందరినేమో హఠాత్తుగా కౌగిలించుకుంటుంది. నాన్న బయటకు వెళ్తుంటే అమ్మ ఓ సారి జాగ్రత్త చెబుతూ, ‘రోడ్డు మీద జాగ్రత్త. పేవ్‌మెంట్ మీదే నడవండి. రయ్‌మని వెళ్ళే బళ్ళని చూస్తే ఎప్పుడు ఎవరిని మింగేస్తాయో అని భయమేస్తోంది’ అంది. దానికి నాన్న ‘ఆ టైమ్ వస్తే గట్టు మీద ఉన్నా యాక్సిడెంట్ అవకతప్పదు’ అన్నాడు వేదాంతిలా. అయితే ఆయన ఆ అభిప్రాయాన్నే అంటి పెట్టుకుని ఉన్నాడా అంటే అదీ లేదు. నిత్యం మృత్యుంజయ మంత్రం చదివేవాడు. ఎంతటి వాడికైనా క్షణిక వైరాగ్యమే కానీ భ్రమల నుంచి విముక్తి అంత సులభమా? ఇప్పుడు సహజ మరణాలని మించి ‘ప్రమాద మరణాలు’ ఎక్కువయ్యాయి. వాహన ప్రమాదాలు మాత్రమే కాదు, బాంబు దాడులు, యాసిడ్ దాడులు, దారుణ హత్యలు హడలెత్తిస్తున్నాయి. ఎప్పుడు ఎక్కడ పేలుళ్ళు జరుగుతాయో, ఏ ఉద్యానవనాలు మరుభూములుగా మారుతాయో ఊహించలేని క్షణ క్షణ గండాల కాలమిది. అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల సంభవించే మరణాలు అటుంచి, మానవ తప్పిదాల వల్ల, మారణ హోమాల వల్ల ముంచుకొచ్చే మృత్యువు మిగిల్చే విషాదం ఎందరి కుటుంబాలకో జీవితకాలపు పీడకలగా పరిణమిస్తుంది. చావుతో ‘నాది’ అన్నది నాస్తి అయిపోతుంది. ‘జాతస్య హి ధ్రువః మృత్యుః’ అని నిత్యం వెళ్ళే అంతిమ యాత్ర వాహనాలు గుర్తు చేస్తూనే ఉంటాయి. అంతలోనే ట్రాఫిక్ జామ్, ఆఫీస్ టైమ్, అందని ఫోన్ కాల్… గజి’బిజీ’ జిందగీలో కొట్టుకుపోతూంటాం” వర్ష మనసులో తలపుల వర్షం ఆగనంటోంది.
ఇలా ఎవరి మనసులో వారు ఆలోచనల ప్రవాహంలో ఈదులాడుతూ, అంతలోనే అందులోంచి బయటపడుతూ పరస్పర పరామర్శలు మొదలుపెట్టారు. అనసూయమ్మ బతికి ఉన్నప్పుడు ఆమెని విసుక్కోని వారే లేదు. కానీ ఇప్పుడో… అందరికీ ఎంతో శ్రద్ధ. శవాన్ని మంచం మీద ఉంచకూడదన్నారొకరు. సరే కింద పడుకోబెడదామంటూ ఖరీదైన దుప్పట్లను వెనుకాడకుండా పరిచారు ఇంకొకరు. పడుకోబెట్టాక తలకింద ఆమె వాడుకున్న దిండు కూడా తెచ్చి అమర్చారు మరొకరు. తల వైపు దీపం వెలిగించారు. వచ్చేవాళ్ళు వస్తున్నారు… చూస్తున్నారు… విచారం ప్రకటిస్తున్నారు.
కొద్ది సేపటికి పురోహితుల రాక… మృతదేహాన్ని వీధి గుమ్మం బయటకు తరలించారు. మంత్రాలు… తతంగాలు అంతా శాస్త్రోక్తంగా. ‘స్నానం చేసి ఎన్ని రోజులయ్యిందో… రోజూ తడి బట్టతో తుడుచుకోవడమే’ అని చిరాకు పడ్డ అనసూయమ్మకు ఇప్పుడు పూర్తి స్నానం, ఆ పై ఖరీదైన చీర కప్పి, జాకెట్ బట్ట ఉంచారు. ఇదంతా అనసూయమ్మ ఎప్పుడైనా ఊహించుకొని ఉంటుందా? ఏమో… ఆమె సంతానం ఆమె నోట్లో బియ్యం ఉంచి ప్రదక్షిణ చేసి, భక్తిగా నమస్కారం చేశారు. ‘ నా తప్పులు మన్నించు, మా అమ్మవు కదా’ భావన వేదనతో వేడుకుంది మనసులోనే.
అంతిమయాత్ర వాహనం రానే వచ్చింది. నలుగురు కలిసి భగవన్నామ స్మరణ చేస్తూ అనసూయమ్మ పాడెను వాహనంలోకి చేర్చారు. పురోహితులు, సదాశివం, ఇంకొంతమంది ఎక్కగానే వాహనం ముందుకు కదిలింది.
భావన హృదయంలో అమ్మ తోడి కాలమంతా అలలై ఎగసిపడుతోంది. అమ్మ గతం ఖాతాలో కలిసిపోయింది…. “అమ్మా” అని తను ఇంక పిలిచేందుకు లేదు. కాకతాళీయంగా ఎక్కడి నుంచో… ‘నానాటి బ్రతుకు నాటకము… కానక కన్నది కైవల్యము. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము… నట్టనడిమి పని నాటకమూ…’ ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి గళం నూటికి నూరు కాదు… నూట పది శాతం వైరాగ్యాన్ని ధ్వనిస్తోంది.
దాన్ని అధిగమిస్తూ మొబైల్ మోతలు మొదలయ్యాయి.
“కాంతమ్మ గారికి ఫోన్ చేశారా? ఓ ముప్ఫయ్ మందికి అన్నం, కూర, పప్పు, చారు పంపమనండి. వాళ్ళు తిరిగొచ్చే లోపు అందరూ స్నానాలు ముగించి రెడీగా ఉండాలి” జరగాల్సిన దాన్ని ఎవరో వివరిస్తున్నారు.
భావన దగ్గరున్న మొబైల్ కూడా మోగింది. ‘అమ్మా’ అంటూ కూతురి ఆత్మీయ పలకరింపు… మమతల వెల్లువలోకి భావన…
వైరాగ్యంలోంచి అంతా వైఫై ప్రపంచంలోకి.
అంతా ‘మాయమయం’.