మనోమాయా జగత్తు-1

2
12

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు’ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మొదటి భాగం. [/box]

ఆరంభం అదెక్కడ? ఆనందలోకంలోనా?

[dropcap]“బ్ర[/dropcap]హ్మ మనస్సు నుండి సనకసనందన సనత్కుమార సనత్సుజాతులను వారును, కశ్యపాది ప్రజాపతులును జన్మించిరి. నారదుడు బ్రహ్మ మానస పుత్రుడై జనించెను” అంటున్నాయి పురాణాలు. “చంద్రమా మనసో జాతః” అంటుంది పురుషసూక్తం.

సృష్టికర్త యైన బ్రహ్మకు మనసుంది. బ్రహ్మ సృష్టించిన మానవజగత్తును అలరించే అందాల చందమామ మనసునుండి పుట్టినవాడేట.

“భూమిరాపోఽనలోవాయుః ఖం మనో బుధ్ధిరేవచ

అహంకార ఇతీయం మే భిన్నా ప్రకడతిరష్టధా” (శ్రీమద్భగవద్గీత 7అ. 4శ్లోకం)

“నా మాయాశక్తి ఎనిమిది విధాలుగా విభజింపబడింది. అవి భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సు, బుధ్ధి, అహంకారం. ఇది నా అపర ప్రకృతి” అంటాడు భగవానుడు.

“చంచలంహి మనః కృష్ణ ప్రమాధి బలవధ్ధృఢమ్

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్” (6 అ. 34శ్లో.)

‘మనస్సు’ చాలా చంచలం, బలవత్తరమ్, సంక్షోభకరం. అలాంటి మనస్సును నిగ్రహించడం వాయువును నిరోధించడంలాగా చాలా దుస్సాధ్యం అనిపిస్తోంది అంటూ వాపోయాడు అర్జునుడు.

అర్జనుడి మాటలు సరైనవేనని ఒప్పుకుంటూ మనసును గురించి ఎంతో వివరించాడు శ్రీకృష్ణుడు.

“ఉద్దరేదాత్మనాత్మానం నాత్మాన మనసాదయేత్

ఆత్మైవ హ్యాత్మనో బన్ధుః ఆత్మైవరిపునాత్మనః”

తన మనసే తనకు బంధువూ, శత్రువూ కూడా కనుక మానవుడు తనను తానే ఉధ్ధరించుకోవాలి ఆత్మను అధోగతి పాలుచేసుకోకూడదు అంటాడు.

“బన్ధురాత్మాత్నస్తన్య యేనాత్మైవాత్మనా జితః

అనాత్మనస్తు శత్రుత్వే వర్తే తాత్మైవ శత్రువత్”

మనసును జయించుకున్నవాడికి తన మనసే బంధువు. మనసును జయించనివాడికి మనసే ప్రబల శత్రువుగా పరిణమిస్తుంది. అని భగవానుడు ఉవచించడంలోనే మనసుకు ఉన్న ప్రాధాన్యత అర్ధమవుతుంది.

మనసు! మనసు! మనసు! ఏమిటీ మనసనేది? వేదకాలంనాటి విజ్ఞులు మనసు, అహంకారం కూడా పంచభూతాత్మకమైన ప్రకృతినావరించి ఉన్న అతి ముఖ్యమైన భాగంగా గ్రహించారు. మనిషి మనుగడను శాసించే శక్తి మనసుకే ఉందని తీర్మానించారు. ఏమిటీ మనసు? కంటికి కనపడని మనసుకు ఉన్న శక్తి ఎంతటిది? ఎటువంటిది? కంటికి కనిపించే పంచభూతాలే కాదు మనసు, బుధ్ధి, అహంకారం ఈ మూడూ కలిసినదే తను సృష్టించిన అపర ప్రకృతి అన్నాడు భగవానుడు.

సృష్టికర్త బ్రహ్మకు మనసుంది. సృష్టింపబడ్డ మానవుడినీ మనసే వశపరుచుకుంటోంది.

మనసు – బుధ్ధి – అహంకారం. ఏమిటి ఈ మూడింటి మధ్య ఉన్న తేడా? మూడూ ఒకటి కాదా?

ప్రాచీన విజ్ఞానం ఆధునికులమనుకుంటున్న మనకందిస్తున్న సందేశం ఏమిటి?

1

ఇరవయ్యో శతాబ్దపు ఆఖరి దశకంలో

వినాయకరావు, వాణి తమ కూతురు సుశీలను నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు.

“కాన్పు కష్టమయ్యేలా ఉంది. డ్యూడేట్‌కి ఒక రెండురోజులముందే ఎడ్మిట్ చెయ్యండి ఎందుకైనా మంచిది” అంది డాక్టరు. అందుకని మంచి రోజుచూసుకుని వర్జ్యం రాకుండా వచ్చి చేర్పించేసారు. పుట్టబోయేది కవలలని కూడా చెప్పింది డాక్టరమ్మ. వివరాలన్నీ ఫార్మ్‌లో రాసుకుంటూ “సుశీల భర్త పేరేవిటన్నారు?” అంది డాక్టర్ శారద. అల్లుడి పేరు చెప్పబోతున్న వాణిని కళ్ళతోనే వారించాడు వినాయకరావు.

“లేదు డాక్టరుగారు, ఇంక అతని పేరు మేం మర్చిపోదలుచుకున్నాం. ఎక్కడా అతని పేరు రాయడానికి వీల్లేదు.” అన్నాడు. శారద ఆలోచించింది.

వినాయకరావు కాకినాడలో కాపురం పెట్టినప్పటినించీ వారికి డా.శారద, ఆమె భర్త ఢా.పాపారావ్ కుటుంబ వైద్యులు. బంధువులు కూడాను. శారదకి వీరి కుటుంబంలో రేగిన కలతలు తెలుసు. వినాయకరావు అలా అనడానికి కారణం తెలుసు. అతన్ని బలవంతపెట్టదలుచుకోలేదు.

“ఓకే. మీకిష్టం లేకపోతే బలవంతం పెట్టను. ఏదైనా లీగల్ గొడవలొస్తే మాత్రం మీరు పూర్తి బాధ్యత వహిస్తారన్న నమ్మకంతో తండ్రి పేరు రాయాలని పట్టు పట్టను. మీ మనసెందుకైనా మారితే అప్పుడే వచ్చి రాద్దురు గాని” అంది.

కూతురిని రూములో సెటిల్ చేసి, “ఇవిగో, నాన్నగారు వారపత్రికలన్నీ తెచ్చిపెట్టారు. ప్రశాంతంగా చదువుకో లేకపోతే టీవీ పెట్టుకో. వంటావిడ ఈ పాటికి వంట చేసేసి ఉంటుంది. నేనెళ్ళి భోజనం తీసుకు వస్తాను” అని చెప్పి వెళ్ళింది.

పుస్తకం పట్టుకుందే గాని ఆ నిండుగర్భిణి మనసు లగ్నం కావట్లేదు. ఆలోచనలు అప్పటివర కూ గడచిన తన జీవితాన్ని నెమరు వేసుకుంటున్నాయి. గోదావరి ఒడ్డున చల్లటి బృందావనం లాంటి ఊళ్ళో నిశ్చింతగా గడిచిన తన బంగారు బాల్యం, బాబాయి మరణం, తరవాత కొన్నాళ్ళకు కాకినాడకు మారిన కుటుంబం, విజయవంతంగా సాగిన విద్యార్ధిదశ, కాలేజి చదువు, విశ్వవిద్యాలయంలో జైత్రయాత్ర – ఏది గుర్తుకు వచ్చినా ఒక మధురస్మృతి. తరువాత……. తరువాతేమయింది?

తనకువివాహమయ్యింది. అందగాడు. విద్యాధికుడు. మంచి ఉద్యోగంలో ఉన్నవాడు. అన్ని అర్హతలు కలబోసుకున్న అతన్ని భర్తగా పొందడం అదృష్టం అని పొగిడారు అందరూ. పెళ్ళి సందడి ముగిసి కాపురానికి వెళ్ళిన తరవాతగానీ తనదెలాంటి అదృష్టమో తెలిసి రాలేదు. అతనొక అనుమాన పిశాచి. కొన్నాళ్ళు తనతో కాస్త ముభావంగా ఉండేవాడు కానీ, హింసించేవాడు కాదు. తనను ఇంటిపనిలో ప్రతి అడుగుకీ సలహాలతో విసిగించేవాడు. ఏదీ స్వతంత్రంగా చెయ్యనిచ్చేవాడు కాదు. తన సంపాదననంతా దోచుకుపోతుందని భయపడుతున్నట్టుండేవాడు. పోనుపోను భార్యంటే శతృవులు తనపై నిఘా వెయ్యడానికి తన ఇంట్లో పెట్టిన గూఢచారి అన్న అనుమానం ముదరిపోయింది అతనిలో. ప్రతి చిన్న విషయానికి పెద్ద రాధ్ధాంతం చేసి వేపుకు తినడం మొదలు పెట్టాడు. కొట్టడం, అనరాని మాటలతో తిట్టడం మామూలు రోజువారీ వ్యవహారం అయింది. తమతోనే ఉండే అత్తగారు కొడుకును వారించేది కాదు. కోడలిని రక్షించడానికి వెడితే కొడుకు తనని శిక్షిస్తాడని భయపడతున్నట్టు తన కళ్ళముందు ఏ ఘోరం జరిగినా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయేది. దూరంగా ఉన్న తల్లిదండ్రులు బాధపడతారేమోనని సంకోచించి మింగలేక కక్కలేక రెండేళ్ళు నరకం అనుభవించి ఒక అర్ధరాత్రి మెట్టినిల్లు వొదిలేసి పుట్టినింటికి వచ్చేసింది.

కూతురు చెప్పినవన్నీ విన్న వినాయకరావు, వాణి నిర్ఘాంతపోయారు. చేజేతులా కూతురు గొంతు కోసామే అన్న బాధతో కుంగిపోయారు. అప్పటికే గర్భవతిగా ఉన్న కూతురిని కళ్ళల్లో పెట్టుకు కాపాడారు. అల్లుడు చేసిన ఘోరాలు డాక్టర్ శారదతో చెప్పుకున్నప్పుడు ఆవిడ ఒక మాట అంది. “మీ అల్లుడిది మానసిక వ్యాధి. షైజోఫ్రేనియా లక్షణాలున్నట్టున్నాయి. ఆ వ్యాధిని మందులతో కంట్రోల్ చెయ్యవచ్చు. సైకియాట్రిస్టునెవరినై నా సంప్రదిద్దాం. పూర్తిగా తగ్గక పోవచ్చు గానీ వ్యాధిని అదుపులో ఉంచచ్చు.”

ఆవిడ మాటపట్టుకుని వినాయకరావు అల్లుడి తల్లితో మంతనాలు జరిపాడు. కానీ ఆవిడ కలిసి రాలేదు. ఆ కుటుంబంతో నెమ్మదిగా సంబంధం తెగిపోయింది. వాళ్ళిప్పుడెక్కడున్నారో కూడా బంధువు లెవరూ చెప్పలేకపోతున్నారు. తన జీవితాన్ని అవలోకించుకుంటున్న ఆమె కళ్ళలోంచి కన్నీటి చుక్కలు టపటప పుస్తకం మీద రాలాయి.

ఆమె దుఃఖం కడుపులోని కవలలను కదిలించింది కాబోలు, మా అమ్మని ఓదార్చడానికి మేము ఉన్నాం. మమ్మల్ని బయటకు రానీయండి అన్నట్టుగా కదలడం ప్రారంభించారు. ఆ రాత్రికి ఆపరేషను చేసి ముద్దులొలుకుతున్నఆడపిల్లల్ని ఇద్దరిని తీసి సుశీలకు చూపించింది డాక్టర్. పువ్వుల్లా కళకళలాడుతున్న ఆ చిట్టి ముఖాలు చూసి మనసారా నవ్వుతూనే మత్తుగా నిద్రపోయింది సుశీల.

తెల్లవారి కళ్ళుతెరుస్తూనే తనకు ఇరువైపులా పడుకోబెట్టి ఉన్న చిన్నారులిద్దరినీ మాటల్లో చెప్పలేని మమకారంతో రెప్పవెయ్యకుండా కొంత సేపు తృప్తిగా చూసుకుంది. అలా చూస్తుంటే ఇద్దరి ముఖాలలోను తండ్రి పోలికలు స్పష్టంగా కనిపించాయి. చెప్పలేని బాధతో కళ్ళు మూసుకుంది.

మూసిన కనురెప్పల్లో భర్త ముఖం చిత్రపటంలా ప్రత్యక్షమైంది. ఎంత చక్కటి ముఖం ఎంత అయోమయపు మనసు.

అతని పేరు అనంతం. అనంతమైన అనుమానాలకు, అర్ధంలేని అపోహలకూ ఆలవాలం అతని మనసు. అతని విద్యార్హతలు చూసి గౌరవించిన విద్యార్ధులు అతని విపరీత పోకడలకు విస్తుపోయారు. అతని మీద హాస్యోక్తులు, ఛలోక్తులు రకరకాలు పుట్టించి వ్వుకున్నారు. ఈ లోకంలో లేనట్టు చూసే అతని పిచ్చి చూపులు చూసి ప్రొఫెసర్ అనంతం అనడం మానేసి ప్రొఫెసర్ దిగంతం అని పేరుపెట్టేసారు.

అతనేమయ్యాడు? ఎక్కడున్నాడు? ఎవరి మీద దాష్టీకం చేస్తున్నాడు?

ఆమె ప్రశ్నలకు జవాబుదొరికే అవకాశమేలేదు.

***

“మానసిక ఆరోగ్య వైద్య మరియు మానసికఆరోగ్య శిక్షణా మరియు పరిశోధనా సంస్థ” అంటూ గంభీరమైన, సామాన్యుడికి తేలిగ్గా అర్ధంకాని భాషలో వ్రాయబడి పెద్ద ఆర్చి లాగా గేటుమీద ఉన్న ఆ బోర్డునెవరూ అంతగా పట్టించుకోరు. ఆ వైద్యాలయానికి సామాన్యులు గౌరవంగా పెట్టుకున్న పేరు – “పిచ్చాసుపత్రి.” ఆ రోజు ఆ ఆసుపత్రి లో రోజువారీ కార్యక్రమం హడావిడిగా కోలాహలంగా మొదలైంది.

ఒక్కొక్కళ్ళనీ పలకరించి, పరిశీలిస్తూ వస్తున్నాడు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నారాయణ. “ఏమిటీ, ఆ బెడ్ మీద సుబ్బయ్య ఇంకా నిద్రలేవలేదా?” ముసుగు పెట్టి పడుకున్న ఆకారాన్ని చూస్తూ అడిగాడు.

“ఏందో సార్. ఎంతలేపినా లేవట్లేదు” అంటూ వార్డ్ బోయ్ ఆ ఆకారాన్ని గట్టిగా తట్టాడు. అతను కదల్లేదు. “ఇంతకీ మన ప్రొఫెసరు గారేరీ?” ఖాళీగా ఉన్న బెడ్ వైపు చూస్తూ అడిగాడు డాక్టరు.

“బాత్రూములో ఉన్నట్టున్నాడు సార్” వార్డ్ బోయ్ తెరిచి ఉన్న బాత్రూము వైపు పరిగెత్తి తొంగిచూసాడు. అక్కడ పేషంటు లేడని గ్రహించి ఖంగారుగా అటూ ఇటూ వెతికాడు. “అనంతంగారూ! ప్రొఫెసర్ అనంతంగారూ!” డాక్టర్ కూడా కారిడార్‌లో అటూ ఇటూ చూస్తూ పిలిచాడు. సాధారణంగా డాక్టర్స్ రౌండ్స్ కొచ్చేసరికి స్నానం గట్రా చేసి శుభ్రంగా తయారై ఎదురొచ్చి విష్ చేస్తాడు అనంతం. ఆయన పేషంటుగా ఇక్కడ చేరకముందు మేథమేటిక్స్ ప్రొఫెసరుగా ఉద్యోగం చేసేవాడని చెప్పుకుంటారు.

“గార్డెన్లో ఉన్నాడేమో తరవాత చూసి తీసుకురా” వార్డ్ బోయ్‌కి పురమాయించి, “అతన్నింక లేపండి” అన్నాడు డాక్టరు ముసుగు తన్నిన ఆకారాన్ని చూపిస్తూ. మేల్ నర్స్ ఆ మంచం దగ్గరకెళ్లి, “సుబ్బయ్యా” అని గట్టిగా పిలుస్తూ భుజాలు పట్టుకు కదిపాడు. ఎంత కదిపినా అతనిలో చలనం లేదు. అనుమానం వచ్చి ముసుగు లాగేసాడు. ముఖంకేసి చూస్తూనే షాక్ కొట్టి నట్టు వెనక్కి జరిగిపోయాడు. డాక్టర్ నారాయణకూడా చకచకా మంచంపక్కకొచ్చి చెయ్యిపట్టుకు చూసాడు. స్టెత్ పెట్టి చూసాడు. “ఏమిటిది? ఇతను పోయి చాలా సేపయింది ఏంచేస్తున్నారు మీరంతా?” వార్డులో కోలాహలం మొదలయింది. భయంగా చూస్తున్న ఇతర రోగుల్ని కొందరు నర్సులు వేరే రూముల్లోకి తీసుకెళ్లారు. “సార్, అనంతం ఎక్కడా కనిపించట్లేదు సార్” వెతకడానికెళ్ళిన వార్డ్ బాయ్ పరిగెత్తుకొచ్చి చెప్పాడు.

గబగబా ఆస్పత్రి అంతా వార్త పాకింది. ఒక పేషెంటు కనిపించట్లేదు, మరొక పేషెంటు హఠాత్తుగా మరణించాడు. పోలీసులకి ఫోను వెళ్లింది. ముందుగా మీడియావాళ్లు రాకుండా కట్టుదిట్టం చేసాడు ఆస్పత్రి సూపరింటెండెంట్. సుబ్బయ్య, అనంతంల కుటుంబాలకు కబురందచెయ్యడానికై ఏర్పాట్లు జరిగాయి. పోలీసులు సుబ్బయ్య శవాన్ని పోస్టు మార్టమ్‌కై పంపారు. అనంతంని వెతికి పట్టుకోడానికి ఏర్పాట్లు జరిగాయి.

మర్నాడు సుబ్బయ్య పడుకున్న పరుపు తీసి ఎండలో వేసి మంచం శుభ్రం చెయ్యడానికి వచ్చిన వార్డ్ బోయ్‌కి మంచం కింద ఏవో కాయితాలు దొరికాయి. అటూ ఇటూ తిప్పి చూసి అవి తమ ఆస్పత్రికి సంబంధించినవి కావని గ్రహించాడు. పక్కనే ఉన్న చెత్తకాయితాల బుట్టలో పడేసి పోదామనుకున్నాడు. కొంచెం ఆలోచించి ఎందుకైనా మంచిది డాక్టర్లకి చూపిద్దాం అనుకుని డా.నారాయణ గదిలోకి వెళ్ళాడు. ఆయన అక్కడలేడు. ఏదో పనున్నట్టు వార్డ్ బోయ్ వెనకాలే వస్తున్న నర్సు విజయరాణి ఏంటి నాగరాజూ సార్ కోసం వెతుకుతున్నావా ఏం పనీ అని ఆరా తీసింది. ఇవిగో ఆ పోయిన పేషంటు పరుపు కింద ఈ కాయితాలున్నాయి. మనాస్పత్రివి కావని తెలుస్తాఉంది గానీ ఓపాలి సారుకి సూపిచ్చి పడేద్దారనీ… దీర్ఘం తీసాడు వార్డ్ బోయ్.

ఏదీ ఇలాగియ్యి విజయరాణి ఆ కాగితాలు తన చేతిలోకి తీసుకుని చూసింది. సారుకి నేను చూపిస్తాలే ఇవేవో ఈ పేషంటు ఇక్కడ ఎడ్మిటవకముందు చేయించుకున్న టెస్టుల రిపోర్టుల్లాగున్నాయి. సార్రాగానే నేను చూపిస్తాలే అవతలపారెయ్యమంటే పారెయ్యచ్చు బహుశా సారు ఆ పేషెంటు తాలూకు వాళ్ళకి పంపించెయ్యమంటారేమో అంది. వార్డ్బోయ్ వెళ్ళిపోయాడు. అతను కనుమరుగవగానే అటుఇటూ చూసి ఆ కాగితాలని తన యూనిఫార్మ్‌కున్న జేబులోకి తోసేసి అక్కడనించి చకచకా వెళ్ళిపోయింది.

ఆ ముందురోజు మరణించిన పేషంటు సుబ్బయ్యకి లంగ్ కేన్సర్ ఆరంభ దశలో ఉంది అని కొన్ని రోజుల క్రితం ఒక ప్రైవేటు డయాగ్నోస్టిక్ లెబోరేటరీ వాళ్ళిచ్చిన రిపోర్టే ఆ కాగితాలు అన్న సంగతి విజయరాణికి తప్ప అక్కడింకెవరికీ తెలియలేదు. ఆ కాగితాలతో విజయమ్మకి ఏంపని? ఆ కాగితాలను ఆస్పత్రి అధికారులకు ఎవరికీ అప్పగించకుండా తనే ఎందుకు దాచేసుకుంది విజయరాణి అన్న ప్రశ్నలకు జవాబు ఎప్పటికీ రహస్యం గానే ఉండి పోయింది.

ఎందుకంటే ఈ సంఘటనలన్నీ జరిగిన నెలరోజుల్లోపే విజయరాణి తన క్వార్టర్స్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఆవిడ కొంతకాలంగా ఆ క్వార్టర్స్‌లో ఒంటరిగా ఉంటోంది. భర్త దుబాయ్‌లో ఉన్నాడనేది. ఒక్కగానొక్కకొడుకు హాస్టల్లో ఉంటున్నాడు. ఆవిడ ఆత్మహత్య చేసుకునుంటుంది అని ఊహించారు చాలామంది. కొడుకు వచ్చి ఏడుస్తూ విజయరాణి శరీరాన్ని పోస్టుమార్టెమ్ కోసం పోలీసులకప్పగించి ఇతర కార్యక్రమాలు నిర్వహించి వెళ్ళిపోయాడు.

ఈ సంఘటనలన్నీ జరిగిన చాలా కాలానికి పోస్టుమార్టమ్ రిపోర్ట్‌లు వచ్చాయి. సుబ్బయ్యకి ఆ ముందురోజు ఇవ్వబడ్డ ఒకానొక ఇంజక్షన్ లోని మందు వికటించి విషమై అతని మరణానికి కారణమైంది. అన్నది ఆ రిపోర్ట్ సారాంశం. “మేం అతనికి ఇస్తున్న మందుల్లో ఇంజక్షన్లేమీలేవు. అన్నీ టాబ్లెట్లే” అన్నారు ఆస్పత్రి వైద్యులు. సుబ్బయ్య చావుకు కారణమైన మెడిసిన్ ఏమిటో కనిపెట్టలేక ఇంకా పరిశోధిస్తూనే ఉన్నారు ఫోరెన్సిక్ నిపుణులు.

ప్రొ. అనంతం జాడ తెలియలేదు.

సుబ్బయ్యను చంపిన డ్రగ్ ఏమిటో తెలియలేదు.

విజయరాణిది హత్యో ఆత్మహత్యో తేలలేదు.

పోలీసులు అన్ని కోణాలలోనూ విచారించి పరిశోధిస్తూనే ఉన్నారు.

తరవాత మరో ఆర్నెల్లకి – అంటే మీడియా వారూ, ప్రజలూ విజయరాణి హత్య గురించి మర్చిపోయి ఇతర సంచలన వార్తలలో మునిగిపోయాక, డా.నారాయణ క్వార్టర్స్ ముందు అందంగా మెరిసి పోతున్న తెల్లటి కారొకటి వచ్చి ఆగింది. అందులోంచి ఆ కారు కంటే తళతళా మెరిసి పోతున్న తెల్లదొరలిద్దరు దిగారు.

గేటు దగ్గర ఉన్న వాచ్‌మన్ కార్లోంచి దిగిన విదేశీయులని చూసి సంభ్రమంగా ఎదురెళ్ళాడు. వాళ్ళేదో వాళ్ళ భాషలో చెప్పారు. వాచ్‌మన్‌కి ఒక్కముక్క అర్థం కాలా. వాళ్ళు రెండు విజిటింగ్ కార్డులు తీసి అతనికిచ్చి లోపల చూపించమన్నట్టు సైగలు చేసారు. వాటిని తీసుకుని వెళ్ళి, డ్రాయింగ్ రూములో కూచుని పేపరు చదువుకుంటున్న డాక్టర్ నారాయణకి చూపించాడు. వాటిని చదివి, సరే గేటుతీసి వాళ్ళని లోపలికి పంపించు అన్నాడు నారాయణ. వాచ్‌మన్ గేటు తెరిచి వాళ్ళని లోపలికి వెళ్ళమని సైగ చేసాడు.వాళ్ళు వెళ్ళాక మళ్ళీ గేటు వేసి తన స్టూలు మీద కూచున్నాడు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెడుతున్న ఎటెండరు ఒకడు వాచ్‌మన్ దగ్గరకొచ్చి బాతాఖానీ వేసుకున్నాడు. ఇద్దరూ కబుర్లలో మునిగిపోయుండగా, లోపలినించి నారాయణ గట్టిగా అరవడం వినిపించింది.

వాచ్‌మన్ గబగబా లోపలికి పరిగెత్తాడు. అతని వెనకే అటెండరు కూడా. విదేశీయులమీద నారాయణ చాలా కోపంగా కేకలు పెడుతున్నాడు. నేనిప్పుడే మీసంగతి తేలుస్తా. ఇదిగో పోలీసులకి ఫోన్ చేస్తున్నా. ఇంగ్లీషులో గట్టిగా అరుస్తూ ఫోనుతీసాడు. దాని తీగ ఎప్పుడో తెగిపోయినట్టుగా ఉంది డిపార్ట్‌మెంటుతో కలిపే ఇంటర్‌కమ్ అందుకున్నాడు. దాని పరిస్థితీ అంతే. విదేశీయులిద్దరూ సారీ సారీ అంటూ బయటికి నడిచారు.

వాచ్‌మన్, వాచ్‌మన్ సెక్యూరిటీ ఛీఫ్‌ని పిలుచుకురా కేక పెట్టి గబగబా ఓ ప్రిస్క్రిప్షన్ పేడ్ అందుకుని జేబులోంచి పెన్ ఇవతలకి లాగి గేటు దగ్గరికి పరిగెత్తాడు నారాయణ. అలవాటు లేని పరుగులో హడావిడిలో చేతిలోని పేడ్ పడిపోయింది. విదేశీయులిద్దరూ ఎక్కి కూచున్న కారు నంబరు చకచకా తన చేతిమీదే నోట్ చేసుకున్నాడు నారాయణ.

అటెండరు నారాయణ దగ్గర సాయంగా నిలుచున్నాడు. వాచ్‌మన్ వెళ్ళి ఛీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని పిలుచు చ్చాడు. నారాయణ చెప్పింది విని తన సెల్ తీసి పోలీసుల కోసం ఫోన్ చేసాడు సెక్యూరిటీ. పోలీసులు వచ్చాక అందరూ కలిసి డ్రాయింగు రూములోకి వెళ్ళి కూచున్నారు.

వాచ్‌మన్, అటెండరు గంభీరంగా ముఖాలుపెట్టుకుని గేటు దగ్గరకొచ్చేసారు. డాక్టర్ సాబ్‌కి అంత కోపం రావడం ఇన్నేళ్ళల్లోను నేనెప్పుడూ చూడలేదు. గుండె మీద చెయ్యేసుకుని మెల్లిగా అన్నాడు వాచ్ మన్. సార్ ఎంత శాంతంగా ఉంటారు. ఆస్పత్రిలో అంతంత పిచ్చోళ్ళని కూడా ఎంత ఓపిగ్గా సముదాయిస్తారు అలాంటాయన్ని అంతకోపం వొచ్చేలా చేసారంటే ఆళ్ళెంత ఎదవలో. ఈ పారినోళ్ళు తెల్లగా సినిమా యాక్టర్లలా ఉంటారుగానీ ఒట్టి యదవలు అన్నాడు అటెండరు కారణం లేని కసితో.

నెలరోజుల తరవాత నారాయణ సైకియాట్రీ కాన్ఫరెన్స్‌కి వైజాగ్ వెళ్ళాడు. వెళ్ళిన రోజు అర్ధరాత్రే నారాయణ శవమై సముద్రపు ఒడ్డుకి కొట్టుకువచ్చాడు.

ఎలా పోయిందో తెలియదుకానీ నారాయణ రాసిచ్చిన పోలీస్ కంప్లెయింట్ మాయమయింది. ఇప్పుడది లేదు.

అంతూ దరీ లేని విచారణ కొంతకాలం జరిపి నారాయణ మరణం ఆత్మహత్యగా నిర్ధారించి ఫైలు మూసేసారు పోలీసువారు.

***

ఇక ఇప్పుడు ఇరవయ్యొకటో శతాబ్దంలో

పేపరు తిరగేస్తూ కూచున్న సుశీలకు పక్క గదిలోంచి పిల్లలిద్దరి మాటలు, నవ్వులూ వినిపిస్తున్నాయ్. ఒద్దన్నా చెవిని పడుతున్న మాటలు మొదట సుశీల పట్టించుకోలేదు. కానీ ఆ మాటల్లో ‘నితిన్, నిత్తి గాడు’ అన్నపేరు మాటి మాటికీ వినిపిస్తుంటే కుతూహలం కలిగి కాస్త జాగ్రత్తగా వింది. నితిన్ సుశీలా వాళ్ల పక్కింటి అబ్బాయి.

“క్లాసులో ఇవాళ వాడి బిహేవియర్ అల్టిమేట్! నవ్వాపుకోలేక చచ్చాం. వొంచిన తలెత్తకుండా కూచున్న వాడు ఉన్నట్టుండి ఫిజిక్స్ లెక్చరర్ మీద ఎగురుడు మొదలెట్టాడు. ఆగరా అని వాడి ఏకైక ఫ్రెండు లాగినా ఆగడు. అంత చిందులూ వేసి ఉన్నట్టుండి అసలేం తెలియనట్టు.. బిగుసుకుపోయి.. ఏమడిగినా కొయ్యలా మొహం పెట్టుకుని…” ఒకటే నవ్వుల మధ్య వాళ్లేం అన్నదీ వినబడలేదు. “బస్టాప్ నించి ఇంటిదాకా ఎలా నడిచాడూ.. పైగా తనలో తను మాటాడుకోడం.” మళ్లీ నవ్వులు. ‘ఆకాశం వైపుచేతులు విసిరేసి ఏదేదో అంటుంటే మనతో అనుకున్నా. ఆ ఏక్షనుకి రోడ్డు మీద అందరూ హడిలిపోయారు. ఆడుకుంటున్న పిల్లలు భయపడిపోయి ఏడుపు లంకించుకున్నారు.” ఇద్దరూ పొట్ట చెక్కలయి పోయేలా నవ్వుతున్నారు.

“ఏంటో వాడి గోల. వాడిది స్ప్లిట్ పెర్సనాలిటీ అనుకుంటా. ఒకసారి ఒకలాగా మరుక్షణం ఇంకో లాగా….. నిన్న అమ్మ చూస్తున్న ఛానెల్లో పురాణం పంతులుగారేమన్నారు? కనకనకకందులా ఏంటదీ?” “హహ్హహ్హ! కాదే. పిచ్చీ, సనకసనందులూ.” “ఏదోలే. ఆ కందులూనూ నారదుడూ బ్రహ్మకి మానస పుత్రుల్ట. హాహాహా హదివింటే నాకో థాట్ వొచ్చింది. మన నిత్తూభాయ్ కూడా మనసుతో ఎంతమంది పుత్రుల్ని కన్నాడోకదాని.”

“అదీ సంగతి. నిన్న రోడ్డుమీద నడుస్తూ అలాంటి మానసపుత్రులతో కబుర్లు చెప్తున్నాడేమో!”

“మానస పుత్రులూ వాళ్ళకి మానస పెళ్ళిళ్ళూ, వాళ్ళకి మానస మనవలు, వాళ్ళకి మానస చదువులూ, మానస ఉద్యోగాలూ” నవ్వులు నవ్వులు ఆపకుండా ఒకటే నవ్వులు

ఇంక వినలేకపోయింది సుశీల. చేతిలో పేపరు విసిరికొట్టి చివాలున లేచి నిలబడింది. “ఆపండి. మీ వాగుడు ఆపకపోయారో….” పిల్లల గది గుమ్మందగ్గర నిలబడి ఆవేశంగా అరిచింది సుశీల. “నితిన్ గురించి ఇంకొక్క మాట అన్నారంటే ….” ఆవేశంతో ఒణికిపోతూ, గొంతు చించుకుని అరుస్తున్న తల్లివైపు భయంగా, వింతగా చూసారు కవలపిల్లలు విరి, సిరి.

“అమ్మా! ఏంటి..” సిరి మాట పూర్తి కానేలేదు, బయటినించి మిన్నువిరిగిపడిపోతున్నట్టు, భూమి బద్దలై పోతున్నట్టు అరుపులు, కేకలు, భీభత్సంగా ఏడుపులూ వినపడ్డాయి. ముగ్గురూ కొయ్యబారి పోయినట్టు నిలబడి విన్నారు. పక్కింటి నించి ఆ అరుపులు. “బాబూ నితిన్! తండ్రీ, నిత్తు బాబూ. నితినూ, తండ్రీ! ఎంత పని చేసావురా! నిత్తూ, నిత్తు బాబూ!”

సుశీల నిలువునా ఒణికిపోయింది. నిలబడ్డ చోటే కూలబడిపోయింది. విరి గబగబా వీధిగుమ్మం వైపు పరుగెత్తింది. వెంటనే వెనక్కొచ్చింది. వెనకే పనిమనిషి సీతమ్మ, “అమ్మగారోయ్! నితిన్ బాబు పోయాడంట. సంపులో శవం తేలిందంట.” గావుకేక పెట్టింది. సుశీల విందోలేదో కూచున్నచోటే స్పృహ తప్పి పడిపోయింది. “సిరీ, అమ్మని చూడు”. విరి వీధిలోకి పరిగెత్తింది.

సిరిక్కూడా బయటికి వెళ్లి ఏంజరుగుతోందో చూడాలనిపించినా కిందపడున్న తల్లిని వదల్లేక వెళ్ళి పక్కన కూచుని తల్లి తల తన ఒడిలోకి తీసుకుని, “అమ్మా! అమ్మా!” పిలిచింది. బయటికి నడవబోతున్న సీతమ్మ వెనక్కొచ్చింది. గ్లాసుతో నీళ్ళు తీసుకొచ్చి సుశీల ముఖంమీద జల్లింది. చల్లని నీళ్ళు ముఖాన పడుతుంటే, సుశీలలో చలనం వచ్చింది. కళ్ళుతెరిచి శూన్యంగా చూస్తున్న సుశీలను లేవదీసి కూచోబెట్టింది సీతమ్మ. “అమ్మని గదిలో పడుకోబెడదాం పట్టు సిరెమ్మా” అని సిరి సాయంతో సుశీలను మంచందాకా నడిపించి పడుకోబెట్టింది. “నేను అమ్మని చూస్తా ఉంటా. నీకు నితిన్ బాబుని చూడాలనిపిస్తే ఎల్లి చూడు.” అంది సీతమ్మ సిరితో. సిరి తటపటాయించింది. “పోనీ ఒద్దులే సిరెమ్మా. బయపడతావేమో. ఒద్దులేమ్మా. అమ్మదగ్గిరే ఉండు. నేను ఎదురింటోళ్లనీ ఆళ్లనీ పిలుచుకొచ్చి కాస్త నితిన్ వాళ్లమ్మకేవయినా సాయం సేత్తారేమో సూత్తా. ఆ అయ్ గారు ఊళ్ళో లేరంట. పోన్లు సేపిచ్చి పిలిపిచ్చాలి. ఏటో! తన గోలేంటో తనేంటో అన్నట్టుండేవోడాబాబు! ఎందు కున్నట్టుండి ..” సీతమ్మ కళ్లల్లోంచి జలజలా నీళ్లుకారాయి. కొంగుతో తుడుచుకుంటూ వీధిలోకెళ్లింది.

పక్కింట్లోంచి మళ్ళీ ఏడుపూ అరుపులూ ఉధృతంగా వినిపించాయి.

రోడ్డు మీద ఆ వీధి జనం చేరుతున్నారు. నితిన్ ఇంటిమెట్ల నించి గేటు వరకు జనం నిండిపోయి ఉన్నారు. గేటుముందు రోడ్డుమీద గుంపుగా కొంతమంది నిలబడి మాటాడుకుంటున్నారు. వీధంతా చాలా కోలాహలంగా ఉంది. ఇంతలో పోలీస్ జీప్ వచ్చి జనం మధ్య ఆగింది. అందరూ అడ్డు తప్పుకుని పోలీసులకి దారిచ్చి వాళ్లు గేటు లోపలికెళ్ళగానే మళ్లీ గేటు ముందు చేరారు. పోలీసులు గేటు లోపలున్న జనాన్ని బయటికి పంపేసారు. ఇప్పుడు వీధిలో జనం గొడవ మరీ ఎక్కువయింది. తన ఇంటి వరండాలో నిలబడి చూస్తున్న సిరి, విరి ఎక్కడుందా అని చూడ్డానికి కాళ్ళెత్తి మునివేళ్లమీద నిలబడి అవస్థ పడింది. ఎక్కడా కనపడలేదు.

‘లోపల ఉందేమో ఇంక పోలీసులు ఇప్పట్లో బయటికి రానియ్యరు. దీనికక్కర్లేనిది లేదు. అంతమంది పెద్దవాళ్ళుండగా ఇదెందుకక్కడ దూరినట్టూ?’ విసుక్కుంటూ వరండాలోకి చిన్న కుర్చీ లాక్కుని అక్కడే కూచుంది సిరి. గంటగడిచింది. సిరి లోపలికెళ్ళి సుశీలని చూసింది. కళ్ళు తెరిచి పైన తిరుగుతున్న ఫ్యాన్ వైపే చూస్తూ కదలకుండా పడుకునుంది సుశీల. సిరి మంచం దగ్గరగా వెళ్ళి నెమ్మదిగా “అమ్మా” పిలిచింది. సుశీల పలకలేదు. కాస్త విసుగనిపించింది. మళ్ళీ మరుక్షణం జాలేసింది. ‘ఎందుకింత షాక్ తింది అమ్మ? ఇలా ఎంతసేపు పడుకుంటుంది?’ కొంతసేపు తల్లి పక్కనే కూచుంది. “అమ్మా మంచి నీళ్ళు తాగుతావా?” మెల్లిగా అడిగింది. “ఊఁ” మూలిగినట్టు జవాబిచ్చింది సుశీల. ఆ మాత్రానికే మహదానందపడిపోతూ చెంగున లేచి వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చి అందించింది. “అమ్మా ఎందుకమ్మా అంతలా భయపడిపోయావు? నువ్వలా షాక్ లోకెళ్ళినట్టు పడుంటే నాకెంత భయం వేసిందో తెలుసా?” గ్లాసందుకుంటూ అడిగింది సిరి. “సారీ.” అస్పష్టంగా రహస్యంలా అంది సుశీల. “ఛీఛీ నీ చేత సారీ చెప్పించాలని కాదు. కారణం ఏంటో తెలుసుకోవాలని.” పక్కనే కూచుని చెప్పింది సిరి. సుశీల మాటాడలేదు. “కాసేపు పడుకో. నువ్వెవరికీ సారీ చెప్పక్కర్లేదు. నీకు చెప్పాలనిపిస్తే ఎందుకింత ఆవేశపడ్డావో చెపుదువుగాని తరవాత. ఇప్పటికి కళ్లుమూసుకు పడుకో”.

గాజుకళ్లతో ఇంటికప్పువైపు చూస్తూ వెల్లకిలా పడున్న సుశీలను చూస్తే సిరికి భయం వేసింది. కొంచెం విసుగనిపించింది కూడా. ‘ఏంటో ఈ అమ్మ! పక్కింట్లో ఎవరో ఏదో అయితే ఇంతలా ఇదయిపోవాలా. అమ్మది మరీ బలహీనపు మనసు!’ “అమ్మా. చిన్నవాళ్లం మేం భయపడకుండా ఉన్నాం. కష్టంలో ఉన్న వాళ్లకేదయినా చేతనైన సాయం చెయ్యాలిగానీ, ఏంటమ్మా ఇది? ఇంకొంచెం మంచినీళ్లు తాగు.” సిరి నోటికందించిన నీళ్లు ఒక గుక్క తాగింది. ఇంక వద్దన్నట్టు తల తిప్పింది. సిరి ఒక్కసారి తేలిగ్గా ఊపిరివదిలింది. ‘హమ్మయ్య. అమ్మ కాస్త స్పృహలోకొస్తోంది’. రుమాలు తడుపుకొచ్చి సుశీల ముఖం చక్కగా తుడిచింది. అలా తుడుస్తుంటే తల్లి మీద అనిర్వచనీయమైన ప్రేమ మనసంతా నిండింది.

సుశీల కళ్లు మూసుకుని తల పక్కకి తిప్పింది. కళ్ల కొసలనించి రెండు కన్నీటి బొట్లు జారి దిండులోకి ఇంకిపోయాయి. సిరి తల్లి చెయ్యి తన చెంపకు ఆనించుకుని నిమురుతూ చూసింది ఏమయినా చెప్తుందేమోనని. సుశీల ఏమీ మాటాడలేదు. సిరి నిట్టూర్చి అలాగే తల్లి ముఖంలోకి చూస్తూ కూచుంది. కాసేపటికి కదలకుండా పడుకుండిపోయిన తల్లి ముఖం చూసి ఆమెకు నిద్ర పట్టిందేమోనని చప్పుడు చెయ్యకుండా లేచి ఇవతల కొచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here