మనోమాయా జగత్తు-11

0
9

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 11వ అధ్యాయం. [/box]

[dropcap]నీ[/dropcap]లాంబరీదేవి స్వయంగా రచించి పాడిన భజనలు అన్నిదిక్కులనించీ ఘల్లున, ఝల్లన, గుండె గుభిల్లన గట్టిగా మైకులోవినిపిస్తుంటే కలతనిద్ర నించి మేలుకున్నాడు యోగి. లేచి ముఖం కడుక్కొచ్చి సూరయ్య తెచ్చిన కాఫీ కప్పుతో వరండామీదకొచ్చే సరికి కనకరత్నం, వీరేశం కలిసి గేటుకి తోరణాలు కడుతూ కనిపించారు.

“ఏంటది కనకరత్నం? ఇవాళేం ఆగస్టు పదిహేనుకాదు. అవెందుకు కడుతున్నావు?” కేకపెట్టాడు.

“ఊరు ఊరంతా సంబరాలు చేసుకుంటోంది సార్, మనాస్పత్రెందుకు తీసిపోవాలి? చక్కగా అలంకరించుకుందాం అనుకున్నాం సార్ నేనూ వీరేశం.”

“తోరణాలు కడితే కట్టారుగానీ ఊళ్ళోనించి తెచ్చి నీలాంబరి బేనర్లు మాత్రం కట్టకండి ఉద్యోగాలూడతాయ్.” అన్నాడు. ఇద్దరూ కిచ కిచమని నవ్వారు.

“నవ్వులాటకాదు సీరియస్‌గా చెబుతున్నాను. పొలిటికల్ పార్టీలకీ, మనకీ సంబంధం లేదు” హెచ్చరించి లోపలికెళ్ళాడు.

యోగి ఎనిమిదింటికల్లా ఓపి ఓపెన్ చేసి తన సీట్లో కూచున్నాడు. “ఎవ్వర్రాలేదండి ఎవరొస్తారండి? ఇంతమూల పల్లెటూరికి నీలాంబరీమాత స్వయంగా వస్తుంటే ఇంక మన ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ఎవరొస్తారండి?” అన్నాడు కనకరత్నం నీలాంబరి నడిచేదారిలో ఇంక ఆస్పత్రులన్నీ మూసుకుపోవలసిందే అన్నట్టు.

“ఏం? ఆవిడొస్తే ఊళ్ళో ఎవరికీ జరాలూ జలుబులూ రావా?” మెడికల్ జర్నల్ పేజీలు తిప్పి చూస్తూ అడిగాడు యోగి.

“అలాగని కాదండి. నీలాంబరి మాత ప్రతి ఊళ్ళోను మహత్యాలు చూపిస్తూ వస్తోందండి. తెల్లవారుజామునే భజనలు చేయిస్తుందండి ఎక్కడకొచ్చినా. ఆ టైములో ఎలక్షన్ల గురించి మాటాడదండి. భజన, ఆధ్యాత్మిక ఉపన్యాసం అయ్యాక అరగంట విరామం ఇచ్చి ఇంక బహిరంగ సబలో ఎన్నికల ఉపన్యాసం అండి. అర్దరాత్రి దాకా ఎన్ని ఊళ్ళుతిరగ్గలిగితే అన్ని ఊళ్ళు తిరగడం, తెల్లారేదాకా ఆఖరి ఊళ్ళో నిద్రపోవడం. అదండి టైమ్ టేబుల్. ఉదయం భజనల టైములో మహత్యాలు చూపిస్తుందంటండి. జబ్బులున్న వాళ్లని దగ్గరకి పిలిచి మంత్రం చదివి మందిస్తుందంట. ఎన్నేళ్ళ బట్టీ ఉన్న జబ్బైనా ఆ రోజుతో తగ్గిపోతుందంట. అంతా చెప్పకుంటున్నారు. ఇంకివాళ భజన టైమయిపోయాక మనూరుకొస్తుంది కాబట్టి రాత్రి వరకూ చుట్టుపక్కల టూర్ చేసి నిద్రచెయ్యడానికి మనూరే వస్తదంట. రేపు జబ్బులు తగ్గిస్తుందంట” తను విన్నదంతా ఏకరువు పెట్టాడు కనకరత్నం.

‘ఆవిడకన్నా ముందు ఆవిడ మహత్యాల గురించి పుకార్లు టూర్లు కొడుతున్నాయే!’ ఫెయిత్ హీలింగ్ గురించి విన్నాడు. సాధుసన్యాసులు మహిమలతో వైద్యం విన్నాడు, కోయదొరల నాటువైద్యం, భూత వైద్యుల మోటు వైద్యం ఇవన్నీ తెలుసు కానీ, మతం, ఆధ్యాత్మికత, మహిమల వైద్యం, మూలికా వైద్యం వీటన్నింటిని కలగా పులగంగా కలిపి రాజకీయ ప్రస్థానం కూడా దిగ్విజయంగా సాగిస్తున్న ఆధునిక సన్యాసిని నీలాంబరీదేవి ఒక్కతేనేమో!

కనకరత్నానికి కాలు నిలవట్లేదు. ఊళ్ళో అందరూ గుమిగూడి ఇష్టమైన వాళ్ళతో ఇష్టమొచ్చినట్టు కాలక్షేపం చేస్తూ నీలాంబరి కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంబరి వచ్చినా రాకపోయినా ఒకరోజు ఖర్చులేని పండగ లాగా గడిచిపోవడం ఖాయం. ‘భోజనాల టైముకి ఆవిడొచ్చినా రాకపోయినా ‘నీలామృతం’ పేరుతో భోజన శిబిరాలు ఏర్పాటు చేసి ఎందరొచ్చినా లేదనకుండా సాయంత్రం వరకూ అన్నం పెడుతూనే ఉంటార్ట. చింతకాయ పచ్చడేసి పెట్టినా నిజంగా అమృతం లానే ఉంటుందంట. ఆధరువులేవుఁన్నాలేకపోయినా నీలాంబరీ ఆశ్రమం వారి గోశాలనించి స్వఛ్ఛమైన ఆవునెయ్యి వస్తుందంట. అన్నంలో అది కలుపుకు తింటే చాలంట. ఆ రుచి మనం ఎంత డబ్బిచ్చి కొన్నా రాదంట’. ఇవన్నీ గత వారం రోజులుగా వింటున్న కనకరత్నానికి తనిక్కడ ఈ ఆస్పత్రిలో కట్టిపడేసినట్టు పడుండడం నచ్చలేదు. డ్యూటీ డ్యూటీ అంటూ పట్టుకు వేళ్ళాడే ఈ డాక్టరు మీద మొదటిసారి కోపం తన్నుకొచ్చింది. తన మొత్తం సర్వీసులో ఎవరిమీదా ఇంత కోపం రాలేదు!

***

పొద్దున్నే రైలుదిగి తాతగారిల్లు చేరిన సిరి విరి ఉత్సాహంగా స్నానాలూ గట్రా ముగించేసారు. సుశీల ఆశ్చర్యపోయింది. తాతగారింటికొస్తే మహా బధ్దకంగా పక్కమీద దొల్లుతూ కాలక్షేపం చెయ్యాలి అని రాజ్యాంగంలో రాసేసి ఉన్నట్టు ప్రవర్తించే అమ్మాయిలిద్దరూ ఇలా కడిగిన ముత్యాల్లా తయారైపోయి, వంకలు పెట్టకుండా వంటావిడ చేసిన టిఫిన్ తినేసి తాతగారి పూజ పూర్తయ్యే వరకూ బుధ్ధిగా కూచోడం – ఇదేదో తుఫాను ముందరి ప్రశాంతతలాగా ఉంది. సిరి కాదుగాని ఈ విరి ఏదో ప్లానేసే ఉంటుంది. తనకి తానాతందానాలాగ సిరిక్కూడా బ్రెయన్ వాష్ కొట్టే ఉంటుంది. తల్లితో కబుర్లు చెప్తోందేగాని సుశీల మనసంతా పిల్లలమీదే ఉంది. ‘వాటీజ్ ద నెక్స్ట్ మూవ్?’

సుశీల తండ్రి వినాయకరావు పూజ ముగించుకున్నాక ఎప్పటిలాగే “పిల్లలూ తీర్థప్రసాదాలు తీసుకోండమ్మా” అని పిలిచాడు. ఇద్దరూ ఎగురుగుంటూ ఆయన ముందు వాలారు. సుశీల, తల్లి వాణి కూడా వెళ్ళి తీసుకున్నారు. “తాతగారూ, మనింటి పక్కనే కొత్తగా సైబర్ కేఫ్ వెలిసిందే. ఒక్కసారి వెళ్ళొస్తాం” ఇద్దరి తరఫునా విరి ఎనౌన్స్ చేసింది. “నేనొద్దంటే మాత్రం ఆగుతారా? అసలింకా తెరిచారో లేదో!”

“ఎనిమిదింటికే తెరిచారు తాతగారూ. చూసాను పదినిముషాల్లో వచ్చేస్తాం” ఇద్దరూ చకచకా నడుచుకుంటూ పోయారు.

అక్కడ కూచుని మెయిల్ ఓపెన్ చేసింది విరి. టికెట్ బుక్ చేసినవెంటనే తన కాంటాక్ట్‌కి తమ ట్రెయిన్ వివరాలు మెయిలిచ్చింది. బహుశః తాము వాళ్ళ ఆఫీసుకు ఎప్పుడు రావాలి ఎట్ సెట్రా వివరాలు తమ మెయిల్లో దర్శనమిస్తాయి అనుకున్న విరికి నిరాశే ఎదురైంది. “మనం మరీ ఇంత పొద్దున్నే రాకుండా ఉండాల్సింది. కాసేపయ్యాక వద్దాం” అంది విరి డబ్బులిచ్చేసి బైటికొచ్చేసాక.

“ఎంతసేపయినా ఇంకింతే” అంది సిరి.

“నువ్వో అనుమానప్పక్షివి!” కోపంగా ముఖంపెట్టుకు ఇంట్లోకొస్తున్న విరిని చూసి “అయిందా పొద్దున్నే? ఇద్దరికీ డిష్యూం డిష్యూ లాగా ఉందే!” అంది సుశీల.

“కాదులే కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి” అని “తాతగారూ, ఇది చూడండి. ఈ ఎడ్రస్ మీకు తెలుసా? ఇది మనింటికి ఎంత దూరం? రిక్షాలో వెళ్ళగలిగిన దూరమేనా?” తన చిన్నపాకెట్ డైరీ తీసి అందులో ఈమెయిల్ నించి నోట్ చేసుకున్న ఎడ్రస్ చూపించింది సిరి. వినాయకరావు కళ్లజోడు తగిలించుకుని అది చదివాడు.

“నాకు తెలిసి ఇటువంటి ఎడ్రస్సు కాకినాడలో లేదు. ఎవరో మీకు బోగస్ ఎడ్రసిచ్చాడు.” అన్నాడు. విరి మొహం మాడిపోయింది. “నీలాంబరి కుటీరం కాకినాడలో లేదు. ఇంతకీ మీరీ ఎడ్రసు ఎందుకు పట్టుకొచ్చారు? నీలాంబరీదేవిని చూడాలనుకున్నారా?” నవ్వుతూ అడిగాడు వినాయక రావు. అవునన్నట్టు తలూపేసింది సిరి గబగబా.

“నేనా ఎరేంజ్‌మెంటు చేసానమ్మా. ఇక్కడకూడా రేపటెల్లుండిల్లో బహిరంగసభ ఉంది కానీ, అబ్బే! మనం ఆ జనంలో వెళ్ళలేం. ఇవాళ టాక్సీ ఏర్పాటు చేసాను. ఇక్కడికి దగ్గర్లో మల్లిప్రోలు అనే ఊరుంది. ఇవాళ మధ్యాన్నానికి ఆవిడ అక్కడ బహిరంగ సభ, రేప్పొద్దున్న భజనకార్యక్రమం. అక్కడ నాకో ప్రెండున్నాడు ఆయనింట్లో దిగి అన్నీ చూసుకు వద్దాం. మీకేం డిసప్పాయింట్‌మెంటు లేకుండా నేను చూసుకుంటాకదా” భరోసా ఇచ్చాడు. కృత్రిమ నవ్వుముఖంతో కృతజ్ఞతలు చెప్పి పక్కగదిలోకి నడిచింది విరి. గుమ్మం పక్కనుంచుని సిరిని కూడా రమ్మని సైగలు చేసింది. సిరి కూడా వెళ్ళింది.

“నీ డైరీ లో వాడెవడో ఇచ్చిన ఫోన్ నంబరుంది కదా చూపించు వాడికి ఫోన్ చేద్దాం. తేలిపోతుంది అదికూడా బోగస్ నంబరేమో” అంది “చూసావా నా చాదస్తమే పనికొచ్చింది.” గొప్పగా అంటూ డైరీతీసింది సిరి.

“ఒక్కటి చెప్తున్నా గుర్తుంచుకో.ఇప్పుడు వీడు బోగస్ ఎడ్రస్ ఇచ్చాడని తేలిపోయింది. ఆ సంగతి మనకి తెలిసిపోయిందని వాడికి తెలియనీయకు. మనం అమాయకంగా వాడు చెప్పిందే నమ్ముతున్నామని అనుకోనీ. ఇంకోటి, ఇక్కడి దాకా మనం ఒక్కళ్ళం మనంతటమనమే వచ్చామన్న ఇంప్రెషన్ ఇయ్యి వాడికి. మనవెనక పెద్దలున్నారని వాడికి తెలియనియ్యద్దు. ఏదో టీనేజ్ గర్ల్స్ తాడూబొంగరం లేకుండా తిరుగుతున్నారు అనుకోనీ. అప్పుడే వాడి నిజస్వరూపం బయటపడుతుంది. తాతగారు వాడిని పోలీసులకి పట్టిస్తారు” అందిసిరి.

“అదంతా అసలీ ఫోన్ నంబరుకెవడైనా పలికితేను. ఈ నంబరు మనుగడలో లేదు అన్న మెషీన్ డైలాగు తప్ప మానవమాత్రుడెవడైనా ఆన్సర్ చేస్తాడనుకోను” అంటూ సెల్ తెచ్చి ఆ నంబర్ కి కాల్ చేసింది విరి. అవతలవాడు పలకంగానే లౌడ్ స్పీకర్ బటన్ నొక్కింది సిరి కూడా వినాలని.

“నేను విరి అనీ.. మీరు ఈమెయిల్స్ ఇచ్చారు కదండీ, ఇక్కడకొస్తే మీరు ఆయుర్వేదవైద్యవిధానంలో శిక్షణ నిచ్చి నన్ను వైద్యురాలిగా తీర్చిదిద్దుతాననీ? మీ వైద్యకళాశాలలో చేరుదామని వచ్చానండి” మహా అమాయకురాలిలా గొంతు పెట్టి చెప్పింది విరి.

‘ఇదొకత్తి! నటించమంటే జీవిస్తోంది. ఓవరేక్షనూ ఇదీనూ!’ మురిపెంగా అనుకుంది సిరి.

“ఇప్పుడొచ్చారాండీ? అయ్యో! నేనిప్పుడు కాకినాడలో లేనండి. మా నాయకురాలు నీలాంబరీమాత వచ్చారు కదండీ ఆవిడతో తిరుగుతున్నానండి. నేనే ఆవిడకి ఈ ప్రాంతాల్లో కుడిబుజం లాంటోణ్ణండి. నేన్లేకపోతే ఆవిడ గారు ఎటూ కదల్లేరండి. మరందుకే మల్లిప్రోలు అని ఓ ఊరుందండి. అక్కడ బహిరంగసబేర్పాట్లలో ఉన్నానండి ఉప్పుడు. పోన్లెండి మీరు కూడా ఇక్కడికే వొచ్చెయ్యండి. ఇక్కడే మాటాడుకుందారి. మిమ్మల్ని నీలాంబరీ మాతకి పరిచయం చేస్తాను. ఇంకేంటండి. ఆవిడ మిమ్మల్ని వెంటనే వైద్యవిద్యార్ధిగా చేర్చేసుకుంటారు. నేనుంటాను కదండీ, మామూలుగా అయితే ఇంటర్వ్యూలు గట్రా ప్రొసీజరుంటదండి. నేను చెప్తే అయ్యే మీ లేకుండానే చేర్చేసుకుంటారండి మాత. చెప్పాను కదండీ నేనావిడకి కుడి బుజం లాంటోణ్ణని?”

“అలాగాండీ? అయితే నేనొచ్చేస్తానండి మీరున్న ఊరికి. మల్లిప్రోలు కదండీ ఆ ఊరుపేరు? బస్సులుంటాయాండీ ఇక్కడినించి.?”

“ఆ ఉంటాయండీ. మహా అయితే ఓ రెండుగంటల ప్రయాణం. ఒచ్చేసాక గోరింకల రామనాధం అని మా బిపి బిపి పార్టీ వోళ్ళనెవరినైనా అడగండి నాదగ్గరకి పంపిస్తారు” గ్రాండ్‌గా చెప్పాడు. “సరేనండి చాలా థాంక్సు.” విరి కాల్ కట్ చేసింది.

“అదమ్మాయ్ సంగతి. మనం తాత గారేర్పాటు చేసిన కార్లో మల్లిప్రోలు వెడతాం. గోరింకల రామనాదాన్ని చూస్తాం.”

“పేరేం చెప్పాడు? గోరింకలరామనాధం కదూ చిలకల సోమనాధం కాదూ?” పకపకా నవ్వుకున్నారు ఇద్దరూ. ఇద్దరికీ గొప్ప సరదాగా ఉంది.

విరికి ఎవడో చౌకబారు మోసగాడి ట్రాప్‌లో తనుపడినందుకు కొంచెం సిగ్గుగా కూడా ఉంది. తాతగారికి ఎడ్రస్ చూపించి తనకి జ్ఞానోదయం చేసిన సిరి అంటే ప్రేమ అధికమైంది. “నిజమేనే అమ్మచెప్పినట్టు నీకెలాగైనా ఆలోచనెక్కువ” సిరి వైపు ముద్దుగా చూస్తూ అంది. “అమ్మయ్య! ఇన్నాళ్ళకి గుర్తించావ్. అవతలివాళ్ళ గొప్పదనం గుర్తించాలంటే మనలో కూడా కాస్తో కూస్తో గొప్పదనం ఉండాలి. మరంచేత నువ్వూ గొప్పదానివే”. ఇద్దరూ చేతులు కలుపుకుని ఇష్టంగా ఊపేసుకున్నారు.

“ఇంకనించీ నీ ఆలోచనలన్నీ నాతో చెప్పు. ఆలోచన మంచిదైనా ఆచరణలో తొందరుండకూడదు. ముఖ్యంగా మనం ఆడపిల్లలం. మన హద్దులు మనం తెలుసుకోవాలి. ఎవరు ఎన్ని కబుర్లు చెప్పినా అమ్మాయిలకు సమాజంలో ప్రమాదాలే ఎక్కువ. మరంచేత అడుగడుగునా మనకి ఒక రక్షణవలయం మనమే ఏర్పాటు చేసుకోవాలి. ఎవరితోనూ చెప్పకుండా ఎక్కడికీ వెళ్ళకు. చిక్కుల్లో పడకు” పెద్ద అనుభవం ఉన్నదానిలా చెప్పింది సిరి. బుధ్ధిగా బుర్రూపింది విరి.

***

నీలాంబరీదేవికి మనసు పట్టలేనంత ఆనందం పొంగి పొర్లిపోతోంది. ‘నీలాకృష్ణా నీ కరుణ అపారం!’ ప్రతి నిముషం ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు చెపుతూనే ఉంది. తనకోసం ఇంత మంది ప్రజలు శ్రమకోర్చి ఇలా పరుగుల పెడుతూ వస్తారని ఆశించలేదు. తన భక్తగణం రోజురోజుకీ పెరుగుతున్నారేకాని తరగట్లేదు అని తెలుసుకానీ ఇది తన ఊహకైనా అందని అభిమానపు వెల్లువ. ఎక్కువమంది చల్లగా ఇంటిపట్టునే ఉండి టీవీలో లైవ్ కవరేజ్ చూసి సంతృప్తి పడతారని అనుకుంది. కానీ తనని ప్రత్యక్షంగా చూడాలని తన నోటినుండి వచ్చిన ప్రతి మాటా హృదయాలలో నిక్షిప్తం చేసుకోవాలని ఇలా అసంఖ్యా కంగా తరలివస్తారని ఊహించలేదు. ఆ నీల మేఘశ్యాముని లీలలు అపారం!

కార్లో సుఖంగా కూచుని కొత్తగా రాయబోయే భజనలకు కొత్తకొత్త పదాలు ఆలోచిస్తున్న నీలాంబరికి మనసు నిమగ్నమవట్లేదు. ఎంతెంత జనం! తనకోసం అలా వస్తూనే ఉన్నారు! తన ఉపన్యాసం విని మళ్ళీ మళ్లీ వినాలని తనని మరో ఊరికి అనుసరిస్తున్నారు! సిటీలో తనకోసం వచ్చే భక్తులు వేరు. తన వల్ల ప్రయోజనం ఆశించే వస్తారు. ఇచ్చిపుచ్చుకునే భాగోతం ఉండనే ఉంటుంది. కానీ ఈ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి దిగిన తర్వాత తను ప్రజలందరి మనిషీ అని నమ్మకం వచ్చేసింది.

మరో తమాషా! ఇన్నాళ్ళూ ప్రముఖులు తన దగ్గరకొచ్చారంటే అది స్వప్రయోజనం కోసమే. తను నిర్వహించే భజనలకు, పురాణ, ఉపన్యాస కార్యక్రమాలకు హాజరై తను చెప్పే భక్తి ప్రవచానాలు విన్నట్టు నటిస్తూ తన ద్వారా రాజకీయ నాయకులు, దేశనాయకులు, ఇతరప్రముఖులతో పరిచయాలు పైరవీలు సాధించుకునేవారు. ఇప్పుడు తనే రాజకీయాల్లోకి దిగిన తరవాత తన మహత్యాల పట్ల, తన ఆధ్యాత్మికత పట్ల సామాన్యులకే కాక అసామాన్యులకు కూడా ఆసక్తి పెరిగింది. తన భజనల సిడిల అమ్మకాలు ముమ్మరంగా పెరిగి పోయాయి. ఇతర వీడియోల సంగతి చెప్నే అక్కరలేదు.

తను కేవలం భక్తిపథంలోనే ఉండి రకరకాల ఆయుర్వేదపు మందులు, మూలికా వైద్యాలు చేస్తుంటే అంతగా పట్టించుకోలేదు సామాన్య ప్రజ. బాగా డబ్బున్న వాళ్ళు దీర్ఘవ్యాధులు ముదరబెట్టుకుని తన చేత వైద్యం చేయించుకునేవారు ఆఖరి ప్రయత్నంగా. ఇప్పుడు తన వైద్యానికి కూడా విస్త్రుతంగా ప్రచారం లభించింది. మందులు కూడా లక్షలమీద అమ్ముడవుతున్నాయని చెప్పుకుంటున్నారు దేశవ్యాప్తంగా. అసలు తనకు సంతోషం కలిగించేది అదే. తను మొదటినుంచీ ఆశించినదీ అదే. తను తెలుసుకున్న మూలికా రహస్యాలు ప్రజలకందించాలని, వాళ్ళని ఆరోగ్య వంతులుగా చేయాలని. తన రాజకీయ జీవితం వల్ల మాత్రమే ప్రజలు తన ఇతర సేవలు గుర్తించే అవకాశం వచ్చింది.

ఆనాటి నీలమేఘశ్యాముడు కురుపాండవుల మధ్య రాజకీయం నడిపించి దుష్టశిక్షణ శిష్ఠరక్షణ చేయడం వల్లనే కదా దేవుడిగా గుర్తింపు వచ్చింది! కలి యుగంలో ఏరకమైన ప్రజా సేవ చెయ్యాలన్నా రాజకీయ పదవుల వల్లనే సాధ్యం. ఆ నీలమేఘశ్యాముని లీలలు అపారం. సుఖంగా నిట్టూర్చింది నీలాంబరి.

చిన్న కునుకు పట్టబోతుండగా కారాగడం గమనించి, “ఏమైంది డ్రైవర్?” అడిగింది. “స్వాములున్న కారువాళ్ళు ఆగి, మననీ ఆగమంటున్నారమ్మా” చెప్పాడు డ్రైవరు. శిష్యస్వామి ఒకాయన విండో దగ్గరికి వచ్చి విండో దింపమని సైగచెయ్యడం కనపడింది. నెమ్మదిగా గ్లాసు దింపింది. ఫోను చేతికందించి “మన వేన్ ఒకటి బ్రేక్ డౌన్ అయిందని, వారికి మరోవాహనం పంపించామని విన్నవించుకున్నాను కదమ్మా. అందులోనివారు మల్లిప్రోలు చేరుకున్నారు. చిన్నచిక్కొచ్చిందని విన్నవించుకుంటున్నారు”. సెల్ ఫోన్ చేతికందించాడు. నీలాంబరి ఫోనందుకుని “హలో” అంది. అవతలి వారు చెప్తున్నది వింటూ ముఖం చిట్లించింది.

***

సన్నగా గీరూ పెడుతున్న గురక నేపథ్య సంగీతంగా కారు ముందుకు పోతుంటే కారుతో పాటు వస్తున్న సూర్యుడు ఆకాశంలో పైకి ఎగబాకి వేడెక్కిపోతున్నాడు. టైమ్ చూసాడు రాకేష్. పది గంటలు దాటింది. దారంతా నీలాంబరికి స్వాగతతోరణాలు రెపరెపలాడుతూ ‘మీకూ స్వాగతమే’ అంటున్నాయి. తమని దాటి వెడుతున్న వాహనలన్నీ దాదాపుగా నీలాంబరి దర్శనార్థమే అని వాటికి కట్టిన బేనర్లు చెప్తున్నాయి. తెల్లారే కొద్దీ వాహనాల జోరు, నినాదాల హోరు ఎక్కువైంది. పల్లెలు దాటి ఏదో పట్టణంలో ప్రవేశించామని గ్రహించాడు రాకేష్. ఆలోచనలు కట్టిపెట్టి బోర్డులు చదివాడు. “అరే మనం కాకినాడ వచ్చాం! మల్లిప్రోలు వెళ్ళడానికి కాకినాడ మీంచికాక వేరేరూట్ ఉందన్నారుగా?” అన్నాడు సంజీవ్ వైపు తిరిగి. “ఆ రూట్‌లో వెళ్ళాలని గీరూ ముచ్చటపడ్డాడు. మరందుకనే మనం ఆ రూట్ లో వెళ్ళం” చిన్నగా నవ్వాడు సంజీవ్.

రాకేష్‌కి గుర్తొచ్చింది. ఇది కేవలం విహారయాత్ర కాదని. ఇప్పటి వరకూ పోలీసు ఇంక్వయిరీలో భాగంగా ఈ ప్రయాణం జరుగుతోన్నట్టే లేదు. ఇప్పుడే ఆ స్పృహ కలిగింది. కొంచెం ఆదుర్దా అనుభవించాడు. ఇప్పుడేం జరుగుతుంది?

***

గడియారాలు పదకొండుగంటలు చూపిస్తుంటే మల్లిప్రోలులో అసంఖ్యాకంగా చేరిన జనంలో ఆత్రం పెరిగిపోతోంది ఎప్పుడెప్పుడు నీలాంబరీమాత దర్శనం అవుతుందా అని. ఆవిడ రావాలి, తమ మనసులకు నాలుగు చల్లని మాటలు చెప్పాలి, తమలో కనీసం కొందరి కష్టాలైనా వినాలి, కష్టాలు తీరే మార్గాలు చెప్పాలి, సమస్యలకు పరిష్కారాలు చూపించాలి, తమ జీవితాల్లో కాస్తైనా మార్పు రావాలి. ఎలాగూ తామంతా ఆ తల్లికే వోట్లు వేస్తారు. అప్పుడు రాష్ట్రంలో సమస్యలు ఒక్కొక్కటీ తీరుస్తూ రాష్ట్రాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దుతుంది. ఈ లోగా వ్యక్తిగత సమస్యలు తీర్చాలి. ఇదీ ప్రజల ఆభీష్టం. అందుకే వారికంత ఆత్రుత.

‘నీలాంబరి పైఊరినించి బయల్దేరింది కానీ దారంతా బారులు తీరిన జనం వల్ల ప్రయాణం నత్తనడకగా సాగు తోంది’ అన్న వార్తవిని జనమంతా ఒక్కసారి ‘అయ్యో!’ అన్నారు. ‘భోజనాలొచ్చాయి. నీలాంబరీదేవి వచ్చే లోగా భోజనాలు ముగించేస్తే ఆవిడ వచ్చిన తక్షణం బహిరంగ సభ ప్రారంభించెయ్యచ్చు’ అన్న కబురు వచ్చింది. కార్యకర్తలు శిబిరాల్లో గబగబా డిస్పోజబుల్ పళ్ళాల్లో అన్నం, నెయ్యి, సాంబారు వడ్డించి పంచడం మొదలెట్టారు. అడిగినవాళ్ళకి అడిగినంత. కడుపునిండా పెట్టారు. గ్లాసుల్లో మజ్జిగలు సప్లై చేసారు.

చక్కగా వరుసలో నిలబడి అందరూ పళ్ళాలు తెచ్చుకుని తింటుంటే గోవిందు చేత మొహం కడిగించి వరసలో నిలబెట్టింది శేషమ్మ. ఇద్దరూ అన్నప్పళ్లేలు తెచ్చుకుతిన్నారు. తినడం అయ్యాక గోవిందు “అబ్బ ఎంత హాయిగా ఉందే అమ్మా. ఇలా ఏకబిగిని ఇంతసేపు నిద్రపోయి ఎన్నాళ్ళయిందో!” అన్నాడు. “అన్నం తిన్నాక మళ్ళీ ఇంకోసారి లేహ్యం తినమన్నాడుగా, జేబులో పొట్లం తీసి వేసుకో. కానీ ఒరే, ఆ మందిచ్చినబ్బాయి పేరు సుందరం అని చెప్పాడా? కానీ మళ్ళీ మెలుకువొచ్చినప్పుడు చూస్తే ట్రక్కులో కనబడలేదురా. సర్లే వేరే ఎందులోనైనా ఎక్కాడేమో పైఊళ్ళనించి అన్నేసి కార్లొస్తన్నా యికదా అనుకున్నానురా. మన లారీని తెల్లారాక టీలు తాగేవోళ్ళు తాగండని ఓ చోట ఆపార్రా. అప్పటికినువ్వింకా నిద్రపోతన్నావ్. అప్పుడావొటేల్లో కనిపించాడ్రా ఆ సుందరం. తీరా పలకరిత్తే అబ్బే నేను కాదమ్మా మీకు మందు పొట్లం ఇచ్చిందీ అన్నాడురా అంటే ఏంటర్ధం? మనకి తెల్లారకముందే మందు పొట్లం ఇచ్చింది ఆ నీలాంబరమ్మతల్లే. ఆ సుందరం రూపం లో వొచ్చి ఇచ్చిందన్నమాట.”

శేషమ్మ చెప్పుకుపోతూనే ఉంది. గోవిందుకి ఎంత అర్ధమయ్యిందో తెలీదు. ఆవిడ చెప్పడం ఆపగానే “నా జేబు లో పొట్లం లేదే అమ్మా ఎక్కడో పడిపోయిందేమో. ఇంకో మూడో నాలుగో ఇస్తే నీ సంచిలో పెట్టావుగా ఒకటి తియ్యి వేసుకుంటా” అన్నాడు. తను జాగ్రత్తగా ఓ పక్కన పెట్టిన సంచీ తీసుకొచ్చి చూసింది. ‘పైనే పెట్టానే ఏమయ్యాయి?’ అనుకుంటూ వెతికింది. ఎక్కడా కనబడలేదు. ‘పెట్టినవి పెట్టినట్టు ఎలా మాయమయ్యాయబ్బా?’ అనుకుంటూ మళ్ళీ వెతికింది. కనబడలేదు. “ఇందులోవి కూడా పోయాయిరోయ్. ఎలా పోయాయంటావు?” నీరసంగా ముఖం పెట్టింది.

అంతకుముందునించీ వీళ్ళిద్దరి సంభాషణ వింటున్న ఓ పెద్దాయన “ఏంటమ్మా పోయాయంటున్నావు?” అనడిగాడు. “మందు పొట్లాలు బాబూ” శేషమ్మ మళ్ళీ ఆయనకి కూడా ఏకరువు పెట్టబో యింది “అతనికి చెప్తుంటే విన్నానమ్మా. ఆ పొట్లాలు పోయాయని చెప్తే బిపిబిపి కార్యకర్త లెవరైనా మళ్ళీ తెప్పించి ఇస్తారమ్మా. అడుగుదాం. అల్లా ఆ స్టేజి పక్కన కూచుందాం. కార్యకర్తలక్కడికే వస్తారు” అన్నాడు.

అక్కడున్న కార్యకర్తలతో శేషమ్మ సమస్యే కాదు మందిచ్చిన సుందరం మాయమయిపోవడం గురించి కూడా చెప్పాడు. బిపిబిపి కార్యకర్తల ఆనందానికి అవధిలేదు. “మందుల సంచీ ఇంకారా లేదు. వచ్చాక మీకేం మందివ్వాలో చూసి ఇస్తాం కానీ మీరు నీలాంబరిమాత మీకు కార్యకర్త రూపంలో దర్శనం ఇవ్వడం, మీ అబ్బాయి జబ్బుకు మందివ్వడం గురించి స్టేజి మీద మైకులో అందరికీ చెప్పాలి” అన్నారు. “దాన్దేవుంది లెండయ్యగోరూ. చెప్తాను. మీరు మాత్తరంనాకు మందిప్పించాలి” అంది శేషమ్మ.

***

వినాయకరావు ఏర్పాటు చేసిన టాక్సీ పొద్దున్నే వచ్చింది. సుశీల,విరి,సిరి, వాణి వినాయకరావు అప్పటికే ప్రయాణానికి తయారై సిధ్ధంగా ఉన్నారు. వాళ్ళని ఎక్కించుకుని బయల్దేరిన వాహనం కాకినాడ దాటినప్పటి నించి నత్త నడకే నడుస్తోంది. దారిపొడవునా జనప్రవాహం, ఏదో ఊరేగింపులాగా వాహనాల వరద!

మల్లిప్రోలు దగ్గరపడుతున్నకొద్దీ జనప్రవాహం వల్ల సుశీల కుటుంబం కూచుని ఉన్న వేన్ ఇంక కదలడం కష్టంగా ఉంది. కాలి నడకన పోయే వాళ్ళే కారుకన్నా స్పీడుగా పోతున్నారు. సిరి, విరి పుట్టాక ఎప్పుడూ ఇలాంటి జన సముద్రం పోటెత్తిపోవడం చూడలేదు. “బాబోయ్ తాతగారూ, భారత దేశపు జనాభా చైనా జనాభాని మించిపోయినట్టుగా ఉంది ఈ మల్లిప్రోలు జనాభాని చూస్తుంటే” కేక పెట్టింది విరి. డ్రైవరు కంగారు పడుతున్నాడు కారు ముందుకు సాగడం చాలా కష్టంగా ఉంది.

“సార్ ఎటు పోవాలి?” వేన్ డ్రైవర్ వినాయకరావును అడిగాడు. “గవర్నమెంటు ఆస్ప త్రికి పోవాలి. నేను వేరే రూట్ చెప్తా పట్టు కొంచెం చెరువు గట్టు పక్కన కాస్త జాగ్రత్తగా పోనిస్తే వెళ్ళిపోవచ్చు” డ్రైవరు వినాయకరావు సూచనలు వింటూ, హారన్ సౌండు వినిపించుకోకుండా అడ్డొస్తున్న వాళ్ళని అదిలిస్తూ మొత్తం మీద ప్రభుత్వ ఆస్పత్రి గేటులోకి పోనిచ్చాడు.

మెట్లమీద నిలబడి రోడ్డుమీద సందడి చూస్తున్న యోగి లోపలికొస్తున్న వేన్ చూసి మెట్లు దిగాడు. “హల్లో డాక్టరుగారూ!” పలకరించిన వినాయకరావును చూసి యోగి “హల్లోహల్లో సార్.! ఏంటి మీరు కూడా నీలాంబరి దర్శనానికే వచ్చారా?” అంటూ ఆహ్వనించాడు.

కారు దిగి ఆశ్చర్యంగా చూస్తున్న విరి సిరిలను చూసి “హాయ్ మోనోజైగోటిక్ ట్విన్స్! మీరేంటి ఇక్కడ ప్రత్యక్షమయ్యారు?” అన్నాడు.

***

మొహం మీద ఎండపడుతూన్నా కార్లో ఒళ్ళుమరిచి నిద్ర పోతున్న సుందరానికి మెలుకువ రాలేదు. మరీ మంచిది అనుకున్నాడు రంజిత్. జాగ్రత్తగా గేటులోకి కారు పోనిచ్చాడు. నలుగురు కాన్స్టేబుల్స్ వెనక తలుపు కి కాపలాగా అటిద్దరూ ఇటు ఇద్దరూ నిలబడ్డారు. ముందు వేపు తలుపులు తెరిచారు ఇద్దరు సెంట్రీలు. రంజిత్, అశోక్ చెరోవైపునించీ దిగారు.

కారాగిపోవడంతో ఏసి కూడా ఆగిపోయి ముఖం మీద ఎండ దంచి కొట్టడంతో సుందరం నిద్రాభంగమై కళ్ళు తెరిచి వొళ్ళు విరుచుకున్నాడు. “వొచ్చేసిందా మల్లిప్రోలు డ్రైవర్?” అంటూ కూచున్నాడు. కారు తలుపు తెరిచి దిగమంటున్న పోలీసుల్ని చూసి దడుచుకున్నాడు. కంగారు పడుతూ దిగాడు. చుట్టూ పోలీసులే! “ఏం.. ఏం జరిగింది?” తలతిప్పి రంజిత్, అశోక్‌లని పిలవబోయి పరిసరాలు గమనించాడు. అది పోలీస్ స్టేషన్ అని అర్ధం ఐంది. “సార్ నాకేం తెలియదు అతను మల్లిప్రోలు ఫ్రీగా తీసుకెడతానంటే కారెక్కాను. కారు దొంగతనం చేసి తీసుకొచ్చాడా సార్?” దాదాపు వొణికి పోతూ అడిగాడు.

ఎవరూ మాటాడలేదు. సుందరం చేతులు పట్టుకుని లోపలికితీసుకెళ్ళారు. సెల్‌లో పెట్టి తాళం వేసారు. ‘నాకు రాజ్యాంగ హక్కులున్నాయి. నన్నెందుకు అరెస్టు చేస్తున్నారో నాకు చెప్పాలి. నన్ను ఇరవై నాలుగు గంటలలోగా కోర్టులో విచారణకు ప్రవేశపెట్టాలి. ఇంకా ఏవేవో చట్టపరమైన రాజ్యంగపరమైన తన హక్కులు ఉటంకిస్తూ కేకలు పెట్టాలి. చాలా గొడవ చెయ్యాలి’ అనుకున్నాడు. ఏమీ చెయ్యలేదు. నోట్లోంచి ఒక్కమాట కూడా రాలేదు. కార్లోంచి తన సంచీ తీసుకొచ్చిన పోలీసు, సంచీ జిప్ తెరిచి లోపలి సరుకును తీస్తుంటే అలా చూస్తూ నుంచుండిపోయాడు.

***

టైము గడుస్తోంది. నీలాంబరి వస్తున్న జాడ కనిపించట్లేదు. కార్యకర్తల ఫోనులు ఆగకుండా పనిచేస్తు న్నాయి. సమాచారం పూర్తిగా అందట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళల్లో కాస్త వయసులో పెద్ద స్వామీజీ ఇంక తనే ఏదో కల్పించుకుని కాస్త కార్యక్రమం ఏదో నడిపించకపోతే జనం గోల ఆగదని గ్రహించాడు. చేసేదేమీలేక, పడిగాపులు పడే సహనం నశించి, లేనిపోని పోట్లాటలు పెట్టుకుంటున్నారు. వాళ్ళని శాంతింప చెయ్యాలంటే ఏదో ఒక కార్యక్రమం నడిపించాలి. తమను కలుసుకునేందుకు విజయవాడ నించి వచ్చిన భక్త భజన బృందం వారిని స్టేజి మీద కూచోబెట్టి భజనలు పాడమన్నాడు. అరగంట సేపు భజన కార్యక్రమం జరిగాక, “ఇప్పుడు కొందరు భక్తులు నీలాంబరిమాత దయ తమ మీద ఎలా ప్రసరించిందో చెప్తారు” అని ప్రకటించి ఒక్కొక్కళ్ళనీ స్టేజిమీదకి పిలవడం ప్రారంభించారు.

***

గీరూ గురక సన్నగా లయబధ్ధంగా సాగుతూనే ఉంది. కారొచ్చి పోలీస్స్టేషన్లో ఆగింది. సంజీవ్, రాకేష్ దిగి తలుపులు వేసిన సౌండుకు కళ్ళు తెరిచాడు గీరూ. “ఏంట్రా రాకేషూ ఏ వూరొచ్చిందేమిటి?” బధ్దకంగా ఆవులించాడు గీరూ. టక్కున తలుపు తెరిచిన పోలీసులు దిగమన్నట్టుగా సైగచేసారు. బిత్తరపోతూ దిగి, “కారు దేనికైనా గుద్దేసాడేంట్రా మీ అంకులు?” అన్నాడు రాకేష్ వైపు చూసి. ఎవరూ మాటాడలేదు. గీరూ చేతులు పట్టుకుని తీసుకుపోయి సెల్లులో వేసేసారు.

మొదట షాక్‌తో మాట పడిపోయినా, కాస్త తేరుకున్నాక “నన్నెందుకురా అరెస్టుచేసారు? మా ఫాదర్ సంగతి మీకు తెలీదు. మా మదర్ ఒక్కొక్కళ్ళనీ ఉద్యోగాలు పీకించి దిక్కులేకుండా చెయ్యగలదు. ఆ సంచి తియ్యకండిరోయ్! అది నీలాంబరీ మాతకి అప్పచెప్పాలి. ఆవిడ రేపు చీఫ్ మినిస్టరైతే మట్టికొట్టుకు పోతార్రోయ్ మీరంతా!” నోరు నెప్పెట్టే వరకూ కేకలు పెడుతూనే ఉన్నాడు గీరూ.

***

భక్తుల అనుభవాలు చెప్పడం అయిపోయింది. మళ్ళీ భజనసంఘం వాళ్ళు పాటలందుకున్నారు. గోవిందుకి చిరాగ్గా ఉంది. “అమ్మా స్వాములార్ని మందు అడగవే” సతాయిస్తున్నాడు. “ఆళ్ళే పిలుస్తా మన్నారుగా మందుల వేనొస్తే” శేషమ్మకేం చెయ్యాలో పాలుపోవట్లేదు.

“ఇదుగోమ్మా నీ కొడుక్కిచ్చిన లేహ్యం ఇట్టాంటిదేనా?” ఇంకొకావిడ తన దగ్గరున్న మందు పొట్లాం చూపించింది. “మాకాడ చాలా ఉన్నాయ్. స్వాములారు మందుల పంపకం మొదలెట్టేదాకా నీ కొడుక్కి అవసరమైతే ఇది తినమను. మళ్ళీ మీ పొట్లాలు మీకొచ్చాక నాది నాకిచ్చేద్దురుగాని.”

శేషమ్మ దండం పెట్టేసింది. “రక్షించావు తల్లీ. ఒరేయ్ గోవిందూ! నీ కిచ్చిన మందుకూడా ఇట్టాంటిదే కదురా?” చూపించింది. కొంచెం నాకి రుచి చూసి, ‘ఇదే ఇదే. అమ్మయ్య. ఇవాళ కూడా నిద్రపోతా.” సంబరంగా తీసుకున్నాడు గోవిందు.

స్టేజిమీద భజన చేస్తున్న వాళ్ళు శ్రోతలని కూడా భజన చెయ్యమని ప్రోత్సహిస్తున్నారు. ఓపికున్నవాళ్ళు చేస్తున్నారు, లేని వాళ్ళు టీ కాఫీల ఏర్పాటెక్కడైనా ఉందా అని వెతుక్కుంటున్నారు.

ఇంతలో “ఓలమ్మో! ఓలమ్మో! పిల్లాడికేటో అయిపోతాంది సూడండమ్మో” కేకలు వినబడ్డాయ్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here