మనోమాయా జగత్తు-13

0
12

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 13వ అధ్యాయం. [/box]

[dropcap]గీ[/dropcap]రూ కదల్లేక పోతున్నాడు. శరీరం, అందులో ప్రవహించాల్సిన రక్తం గడ్డకట్టుకు పోయాయి. రక్తం గుండెకి అందట్లేదు.. ఇంక ఏం కదలగలుగుతాడు? ఐస్ టబ్బులో పూర్తి నగ్నంగా పడుకునున్నాడు. వెలుతురు! వెలుతురు! ఎటుచూసినా వెలుతురు! కళ్ళుచెదిరిపోయే వెలుతురు! కళ్ళు మూసేసుకోవాలి. ఏదీ? అసలు ఒక్క కండరం కదిల్తేనా? కళ్ళు ముయ్యలేడు. కాళ్ళు కదపలేడు. టబ్బులో ఐస్ ఎంత గట్టిగా గడ్డలాగా ఉందో అందులో కూరుకుపోయిన తన శరీరం కూడా అలాగే ఉంది. లేవాలి, లేవాలి. ఈ ఐసులోంచి ఎలాగైనాలేవాలి. “ఒరేయ్ రండిరా! ఎవరైనా రండిరా! నన్ను బయటికి తియ్యండిరా!” అరిచాడు గీరూ. కాదు అరవాలనుకున్నాడు. కళ్ళే కదపలేకపోతున్నాడు. ఇంక నోరేం మెదపగలడు? “మా అమ్మ, మా అమ్మకి తెలిసిందో!….. మమ్మీ! మమ్మీ! కుక్కలు! మమ్మీ! కుక్కలు! నన్ను టబ్బులోంచి రానీయట్లేదు. కుక్కలు!” పెద్ద కుక్క నోరంతా తెరిచి బొఁయ్ మని మీదకి ఒక్కదూకు దూకింది.

“అమ్మోయ్!!” ధబ్బున దొల్లి గోడక్కొట్టుకున్నాడు గీరూ. ఉలిక్కిపడి గజగజ వణుకుతూ గబుక్కున లేచి కూచున్నాడు గీరూ. “కల! అంతా కల! ఎంత పీడకల!” ఇంకా వణుకు తగ్గలేదు. లేవాలని లేదు. లేస్తే తనెక్క డున్నాడో గుర్తొచ్చి మనసుకు ముల్లై గుచ్చుతుంది.

తనెక్కడున్నాడు? జైల్లో! సుబ్బరంగా పెద్ద భవంతిలో తిని తిరగడం కన్నా మరో ముఖ్యమైన పనేమీలేని లగ్జరీలో ఉండాల్సిన తను ఇప్పుడెక్కడున్నాడు? ఇది అసలు జైలేనా? ఏం చేసాడు ఆ రాకేష్ గాడు? ఎవరో పోలీసాళ్లని తీసుకొచ్చి తనని పట్టించాడు. ‘అసలిది ఏ ఊరి పోలీస్ స్టేషను? వాడిని నమ్మి ఆ కారులో ఎక్కడమే కాకుండా గుర్రుపెట్టి నిద్రపోయాను కూడా. అందుకే తీరా పోలీసులు రెండుచేతులూ పట్టుకుని లోపలకి తీసుకెడితే గానీ అసలు జరుగుతున్నదేంటో అర్ధం కాలా. తనకి ఈ శాస్తి అవ్వాలిసిందే. ఇది ఏ ఊరో తెలిస్తే బాగుణ్ణు.’ ఆ గట్టి జైలుగట్టు మీద పడుకోవాలని లేదు. పడుకోక తప్పదు.

ఇందాక వచ్చిన కల గుర్తొచ్చింది. మళ్ళీ ఒళ్ళు సన్నగా వొణికింది. ఎందుకొచ్చింది అలాంటి కల? అలోచించాడు. గ్వాన్టనామో ప్రిజన్ (Guantanamo prison) గురించి తను చదివినవీ, ఏదో ఇంగ్లీషు న్యూసు ఛానెల్లో చూసిన విశేషాలు తన మనసును పట్టేసి ఉంటాయి. అలాంటి జైళ్ళ గురించి కొన్ని మేగజైన్స్ లో చదివిన సంగతులు మనసులో ఏదో మూల ఉండిపోయి ఉంటాయి. ఏవంటారు? – సబ్ కాన్షన్స్- ఆ సబ్ కాన్షన్స్‌లో అవన్నీ ఉండిపోవడం వల్ల అలాంటి పీడకలలొస్తున్నాయి. అయినా కార్లో దారంతా నిద్రపోయినా కూడా మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు నిద్రొస్తోంది? భయం వల్లనా? ‘బాబోయ్! నిద్ర పోకూడదు. పీడకలలొస్తాయ్. అసలు ప్రస్తుతం బతుకే పీడకలా ఉంది. ఏ ఊర్లో ఉన్నాడు తను? తెలిస్తే బాగుండును. ఏ ఊర్లో అనాలా ఏ జైల్లో అనాలా?’ విరక్తిగా నవ్వుకున్నాడు.

అమెరికాలో రహస్య జైళ్ళు బోలెడున్నాయి. బ్లాక్ జైల్స్. భరించలేని చిత్ర హింసలకు నిలయాలు ఆ జైళ్ళు. అటువంటి జైళ్ళు అఫిషియల్ రికార్డ్స్‌లో ఉండవుట. ‘కేంప్ నో’ అనేది అలాంటి ఒక జైలు. ఇంక ‘గ్వాన్టనామో ప్రిజన్’ గురించి చెప్పనే అక్కరలేదు. ఇప్పడు దాదాపు అలాంటి జైల్లోనే ఉన్నాడు తను. అంటే మన దేశం కూడా ఈ విషయంలో తక్కువేం తినలేదు. ‘బయటపడ్డం ఎలా? నా సెల్లేమయింది? ఇంకెక్కడి సెల్లు? ఈ పోలీసోళ్ళు ఇస్తారా?’ ‘ఒరేయ్ రాకేష్! నమ్మక ద్రోహి! నిన్నెంత ప్రేమగా చూసానో తెలుసునా? నువ్వు ఇంత ద్రోహం చేసావ్! నేనూరుకుంటానా? మనసులో “రాకేష్!” పెద్ద కేక పెట్టాడు. ఊరుకోక ఏం చెయ్యాలి? అని తనను తాను ప్రశ్నించుకున్నాడు గీరూ.

‘వీళ్ళెలాగూ నన్ను టార్చర్ చేస్తారు. అదేదో ఇప్పుడే మొదలు పెట్టెయ్యచ్చుగా? ఓ పనైపోతుంది. బ్లాక్ జైల్లో ఎలా టార్చర్ చేస్తారు?’ దాదాపుగా తనకొచ్చిన కలలాగే. ఒకసారి రాత్రి ఏదో ఇంగ్లీషు సినిమా సిడి తెచ్చుకుని చూసాడు. అర్ధరాత్రి దాటినా చూస్తూనే ఉన్నాడు. రకరకాలు. ఒకటా రెండా? ఆ చిత్ర విచిత్ర హింసలు. అది సినిమా, అంతా నిజం కాదు అని తెలిసినా భయంతో ఒళ్ళంతా చెమట్లు పట్టేసింది. సోఫాలో ఓ మూలకి ఒదిగిపోయాడు తను. మంచినీళ్ళకో ఇంకెందుకో లేచాడు డాడీ – అదే సవతి డాడీ. “అంత భయం వేస్తే కట్టేసి పోయి పడుకోరాదా” అనేసి ఆయన పోయి పడుకున్నాడు. కానీ తను మాత్రం సినిమా చివరి వరకూ చూస్తూనే ఉన్నాడు. ఆ తరవాత కొన్ని రోజులపాటు ఒకటే పీడకలలు. ఎవరో ముఖాల్లేని మనుషులు ఆ సినిమాలో చూపించిన హింసలన్నీ తనకు రుచి చూపించేవారు. నిద్ర పోవడం అంటే భయం వేసేది ఆ రోజుల్లో. నిద్ర పట్టక, పడితే కలలొస్తాయేమోని నిద్రపోక తను అవస్థ పడుతున్న రోజులోలనే ఒక పనివాడు, నీలాంబరమ్మని నమ్ముకోమన్నాడు. తను నమ్మాడు. వెంటనే కాదుగాని ఒక నెల రోజుల్లో ఆ పీడకలలు తగ్గాయి. అప్పటినించి నీలాంబరి మాతయే తనకు దైవం. మార్గదర్శి.

రోజంతా 24 గంటలూ చీకటిగా టైము తెలియకుండా ఉంచుతారు. లేదా ఇరవై నాలుగు గంటలూ వెలుతురు! ఎక్కడున్నాడో ఏ రోజు, ఏ పూట ఏమీ తెలియకుండా ఉంచడం పెద్ద హింస. మనసు గందరగోళం పడి పోతుంది. మరో శరీర హింస అక్కరలేదు. కొన్నిసార్లు ఆ ఐసు టబ్బులో కూచోబెట్టి ఎటూ పారిపోకుండా కాళ్ళకి చేతులకీ అనవరంగా సంకెళ్ళు బిగిస్తారు. అదే తనకు పీడకలలా వచ్చింది. ఎవరూ ఎవరితో మాటాడరు, దిగంబరంగానే ఉంచుతారు. తిండి మానేసి చావనైనా చద్దాం అని నిరాహార దీక్ష చేసేవారికి బలవంతంగా తిండి తినిపిస్తారు. దెయ్యాల్లాంటి కుక్కల్ని చుట్టూ కాపలా పెడతారు. కదిలితే వాటిని ఉసిగొల్పుతారు. ఇంక రకరకాల చిత్రహింసలు సరేసరి. మొత్తం మీద బతకనివ్వరు, చావనివ్వరు. తను చెప్పేది అబధ్ధం అనుకుంటే తన చేత నిజం చెప్పించడానికి తనకి నార్కో టెస్టు చేస్తారు. అంటే అదేదో ఇంజక్షన్ ఇస్తారు. అదేంటి దానిపేరు? ట్రూత్ సీరమ్. దానికి ఏదో కెమికల్ నేమ్ కూడా చదివాడెక్కడో. ఏంటబ్బా? సోడియమ్ పెన్టథాల్! రైట్. ఒక్క క్షణం ఆశ్చర్యంతో చిరునవ్వు మొలిచింది. కెమిస్ట్రీ పరీక్షలో పూర్తిగా పూర్ణానుస్వారం వచ్చింది తనకు. జన్మలో కాపీ కొడితే కాని ఏ చిన్న పరీక్షా పాసవలేదు. అలాంటిది తనకి ఎక్కడో ఎప్పుడో చదివిన ట్రూత్ సీరమ్‌కి కెమికల్ నేమ్ గుర్తొచ్చింది!

భయంలో కాస్త బుర్ర పదునెక్కినట్టుంది! ఇంతకీ ఆ నార్కోటెస్టుతో మత్తొచ్చి మనసులో ఉన్న నిజాలన్నీ కక్కేస్తాడు. ఏం తెలుసు తనకి? ఏనిజాలు తెలుసు? ఏదో ధ్రిల్లు కోసం ఎవరో అప్ప చెప్పిన పని చేస్తున్నాడు తను. నిజంగా ఈ పని ఎక్కడమొదలైంది ఎవరు నడిపిస్తున్నారు ఇవన్నీ తనకి తెలుసా?

అన్నిరకాల హింసలూ పెడతారీ పోలీసులు. ష్యూర్. అంతా అనుభవించాక ఇంక ఇలాంటి బతుక్కంటే చావే నయం అనిపిస్తుంది. అందుకని వాళ్ళు చెప్పిన నేరాలన్నీ ఒప్పేసుకుంటే ఏ ఉరిశక్షో పడుతుంది ఈ బాధలకు ఓ ముగింపు వస్తుంది అనుకుని, చేసినవి చెయ్యనివి ఈ ప్రపంచంలో ఉన్ననేరాలన్నీ చేసానని ఒప్పేసుకుంటారెవరైనా. నేరాలైతే కోట్లకొద్దీ ఉన్నాయిగానీ ఉరిశిక్ష ఒక్కసారే వెయ్యగలరు!

గీరూ గుండె గుభేలుమంది. అయితే తనకి ఉరిశిక్ష వేసేస్తారా? ఏడుపొచ్చింది. బ్యారుమని గొంతెత్తి ఏడవాలనిపించింది. అసలు తనేం నేరం చేసాడు? వాడెవడో వచ్చి అవేవో మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తే డబ్బిస్తానన్నాడు. మందులంటే డ్రగ్స్. డ్రగ్స్ అంటే ఎల్‌కెజీ పిల్లాడిక్కూడా తెలుసీ రోజుల్లో. తెలీక కాదు. ఏదో, తన పాకెట్ మనీ తనే సంపాదించుకున్నానన్న గర్వం. ఇలాంటి చిన్నబిజినెస్‌లే పెద్ద వ్యాపారంగా రూపుదిద్దుకుంటాయని భ్రమ! అసలు కారణం – ఎవరికీ తెలీకుండా గొప్ప సాహసం చేసానన్న థ్రిల్! ఆ థ్రిల్లే ఇప్పుడుకొంప ముంచింది.

ఉన్నట్టుండి ఇంకో సందేహం వచ్చింది గీరూ బుర్రలో.

అసలు ఇది జైలేనా? తనని పట్టుకున్నవాళ్ళు పోలీసులేనా? ఇంకేదో పేద్ద డ్రగ్ డీలర్సు ముఠా కాదుకదా? గీరూ గుండె దడదడలాడింది. అమ్మో, మరో మాఫియాగేంగ్ చేతుల్లో తను పడ్డాడంటే ఇంకేమయినా ఉందా? వాళ్ళకన్నా పోలీసులే నయం. నేరస్థుల ముఠాల గురించి బోలెడు సినిమాలు టీవీలో చూసాడు, డివిడిలు తెచ్చుకుని చూసాడు. ఆ ఇంగ్లీషు మూవీల్లో చూపించే హింసలు కొన్ని, వాటికన్నా పూర్తిగా చూపించకుండా సూచనప్రాయంగా వదిలేసేవి చూపించిన వాటి కన్నా భయంకరంగా ఉంటాయి.

గీరూకి నిజంగా ఏడుపొచ్చింది. “మా….మ్మీ….” కుళ్ళి కుళ్ళి కుమిలి కుమిలి ఏడ్చాడు.

***

సుందరం ఆ చిన్న గదిలో ఓ మూల గోడకానుకుని కూచుని ఆలోచిస్తున్నాడు. ఇప్పుడేం జరుగుతుంది? తనకింక బైటి వెలుతురు చూసే అదృష్టం ఉందా? ఇక్కడ ఈ సెల్లులో ముగిసిపోవలసిందేనా శేష జీవితం? తనకి ఈ పని చెయ్యడం ఎంతో తృప్తినిచ్చింది ఎందుకంటే ఏం చెప్పలేం. కానీ ఇందులో కూడా రిస్కుందని తెలుసు. ఆ రిస్కు తీసుకోడంలోని థ్రిల్లేనేమో తనని ఇంత కాలం ఈ పనిలో ఆసక్తిని పోకుండా ఉంచింది. ఆనాటి ఎల్‌టిటిఇ వాళ్ళల్లాగా మెడలో సైనైడ్ కాప్సూల్ కట్టుకోవాలి అని తను చాలాసార్లు అనుకున్నాడు. అన్నాడు కూడా తన బృందం నాయకుడితోను ఇతరులతోను. వాళ్ళందరూ పిచ్చివాడిని చూసినట్టు చూసారు. “అంత పిచ్చిగా ఆలోచించకు మనం టెర్రరిస్టులం కాదు. ఆధ్యాత్మిక కార్యకర్తలం. ఇది ఆధ్యాత్మిక కార్యక్రమం. మనని పోలీసులు పట్టుకోడం, టార్చర్ చెయ్యడం లాంటివేమీ ఉండదు” అన్నాడు బృందం నాయకుడు.

అంతా భ్రమ! ఇప్పుడు వాళ్ళకేదో అనుమానం వచ్చింది. ఇదిగో ఇలా దొరికినవాళ్ళని మూసేసారు. తనొక్కడేనా పట్టుబడింది ఇంకా ఉన్నారా? అసలెలా అనుమానం వచ్చింది? నీలాంబరీ మాత పేరు చెప్తే ఎవ్వరూ ఏమీ అనుమానించరు అన్నాడే బృందం నాయకుడు?

సరే అసలు తన మీద కాదు అనుమానం. ఎక్కడో ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వాళ్లు ఎవరో ఏదో నేరం చేసుంటారు. దొరికిందే సందని పార్టీ ఫండ్ అని చెప్పి లెక్కల్లేకుండా చందాపేరుతో డబ్బు వసూలు చెయ్యడమో, లేకపోతే వోటుకింత ఇప్పిస్తాను బిపిబిపి వాళ్ళచేత అని ఇప్పటినించే జనాన్ని ప్రలోభ పెట్టడమో ఏదో జరిగుండాలి. లేకపోతే తనమీద అనుమానం వచ్చుండేది కాదు. ఇదే ఊరి జైలో ఏంటో? కంగారులో పోలీస్ స్టేషను పేరు చూడలేదు. ఎవరికి తెలుస్తుంది తనిక్కడున్నట్టు? ఎవరికి తెలియాలి? ఎవరూలేని అనాథ తను. చిన్నదనంలో ఓ తల్లి ఉండేది. కాయకష్టం చేసి తనకింత పెట్టేది. కాస్త ఐదో తరగతిదాకా చదివాడు కూడాను. తరవాత ఆవిడా పోయింది. ప్రభుత్వ అనాథ శరణాలయంలో పదో తరగతి దాకా లాగించాడు. తరవాత ఇదిగో, నీలాంబరమ్మ కుటీరంలో పనులు చేసుకుంటూ ఇలా కార్యసేవకుడుగా ఏదో కాలం వెళ్ళిపోతోంది. ఇంకిప్పుడు ఈ చెరసాల. దీని తరవాత? ఎవరినడగాలి. సరే. ఇప్పటివరకూ మన ప్రమేయంతోనే అన్నీ జరిగాయా? చూద్దాం ఏం జరుగుతుందో!

కళ్ళు మూసుకున్నాడు. తను కుటీరంలో ఉండగా సేవకుల గదుల్లో టీవీలో చూసిన దృశ్యాలు గుర్తొచ్చాయి.

నేరస్తుల తలలమీద సంచుల్లాంటివి తొడిగి నిలబెట్టి, వాళ్ళగురించి పోలీసులు అన్నివివరాలు చెప్తుంటారు. సుందరం తన ఆకారం అలా ఊహించుకున్నాడు. తన తలమీద దిండుగలీబో, చిరిగిన బనీనో తొడుగుతారు. టీవీలో చూపిస్తారు. తనేవేవో నేరాలు చేసేసాడని ఎస్‌ఐ గారు చెప్తుంటారు. తనొక మొహం లేని మనిషి లాగా, లాగూ చొక్కా వేసుకున్న జంతువులాగా కదలకుండా నుంచుని ఉంటాడు. తను జీవితంలో మొదటి సారి టీవీలో కనిపిస్తే ఎవరూ తనకి మంచి బట్టలు వెయ్యరు. తనకి మేకప్పులు చెయ్యరు. చేసేందుకు అసలు తనకి మొహమే ఉండదు. ఏడుపో నవ్వో తెలీని చప్పుడేదో గొంతులోంచి వచ్చింది. అలాగే నేల మీద బోర్లా పడుకుని ఏడ్చాడు సుందరం. వెక్కివెక్కి ఏడ్చాడు సుందరం.

***

రాకేష్‌కి బలే ఆశ్చర్యంగా ఉంది. తను ఒక క్రిమినల్‌ని అరెస్టు చేయించడంలో పోలీసులకి సహాయం చేసాడు! ఎప్పుడైనా కలగన్నాడా తను ఇలా ఉపయోగ పడగలడని? హాయిగా ఫోమ్ పరుపు, శుభ్రమైన దుప్పట్ల మీద పడుకుని ఆలోచిస్తున్నాడు. సంజీవ్ తనని ఒక గెస్ట్ హౌస్ రూమ్‌లో పెట్టాడు. అప్పుడు గీరూని స్టేషన్లో పోలీసులు తీసుకుపోతుంటే తనకి తెలిసిన పరిజ్ఞానంతో అక్కడే ఉన్న లాకప్‌లో పెడతారేమోననుకున్నాడు. చాలా సేపు అలా ఆ పోలీస్ స్టేషన్‌లో కూచున్నాడు. అలా కూచున్నప్పుడు తనకొచ్చిన ఆలోచనలు గుర్తొచ్చి నవ్వొచ్చింది.

గీరూతో పరిచయం ఉన్నందుకు తనని కూడా అనుమానిస్తారేమోనని చెడ్డభయం వేసింది. తనని కూడా లాకప్‌లో వేస్తారేమోనన్న ఆలోచన రావడంతోనే వెన్నులోంచి సన్నని వొణుకొచ్చేసింది. అసలే అమ్మకి, నాన్నకి తను అప్పుడప్పుడు వాళ్ళని విమర్శిస్తాడని కోపం. ఇప్పుడు పోలీసుల చేతుల్లో పడి పరువు తీస్తే… అస్సలు క్షమించరు. నిజంగా పోలీసులు తనని అనుమానించి లాకప్‌లో పెట్టి రకరకాల ప్రశ్నలు వేస్తే భయంతో తనేం వాగుతాడో తనకే తెలియదు. ఏదో పేద్ద ఎడ్వంచర్ చేసేస్తున్నాననుకున్నాడింతసేపూ. ఇప్పుడేదో మెడకి తనంతతానే ఉచ్చు బిగించుకున్న ఫీలింగ్ వొస్తోంది. జన్మలో ఇంకెప్పుడూ అమ్మానాన్నలని ఎదిరించకూడదు. బుధ్ధిగా ఉండాలి. వాళ్ళ వ్యవహారం తనకి నచ్చకపోతే నోర్మూసుకుని ఊరుకోవాలి. అమ్మానాన్న కంటే తనకి ఈ ప్రపంచంలో రక్షకులింకెవరూలేరు. ‘సారీ అమ్మా, సారీ నాన్నా’ మనసులోనే చెంపలు పగిలేలా వాయించుకున్నాడు. తన మనసులో ఆలోచనలు ఆ పోలీస్ స్టేషన్లో ఓ బల్ల దగ్గర కూచున్న పోలీసులు కనిపెట్టేస్తారేమో అన్నట్టు వాళ్ళవైపు చూసాడు రాకేష్.

సరిగ్గా అప్పుడొచ్చాడు మళ్ళీ సంజీవ్. “సారీ రాకేష్. కొంచెం పని ఒత్తిడి. నిన్ను మర్చిపోయాననుకున్నావా” అంటూ.

తనని గెస్ట్ హౌస్‌కి తీసుకొచ్చారు. చక్కని ఏసీ రూమ్‌లో కూచోబెట్టి టిపిన్ కాఫీ ఇచ్చారు. సంజీవ్ వెళ్ళి పోయాడు. “విశ్రాంతి తీసుకో రాకేష్. డోంట్ వర్రీ. ఇప్పుడే నిన్ను మీ ఊరు పంపడం అంత క్షేమం కాదు. గీరూ అరెస్ట్‌లో నువ్వు పోలీసులకి హెల్ప్ చేసినట్టు అసలు దీని వెనకున్నవారికి తెలిసిందంటే నీకు డేంజర్. అందుకే మా ప్రొటెక్షన్‌లోనే ఉంచి సేఫ్ అనుకున్నాక పంపించేస్తాం. నువ్వేం బెంగ పెట్టుకోవద్దు. టీవీ ఉంది. ఇవిగో ఈ రేక్‌లో మేగజీన్స్ చాలా ఉన్నాయి. హేపీగా కాలక్షేపం చెయ్యి. ఇంకో విషయం. మీ ఫాదర్‌ని మేమే కాంటాక్ట్ చేస్తాం. నువ్వెవరికీ ఫోన్ చెయ్యడానికి ట్రై చెయ్యకు. బై.” చెప్పేసి సంజీవ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోగానే రాకేష్‌కి వచ్చిన మొట్ట మొదటి ఆలోచన – పోలీసులు నిజంగా మంచి వాళ్ళు. సినిమాల్లో చూపించినట్టు తెలివితక్కువ దద్దమ్మ కామెడీగాళ్ళూ కాదు, మానవత్వమూ మేనర్సూ లేని మృగాలు కాదు. వాళ్ళకీ సంస్కారం ఉంది. సభ్యత తెలుసు. అవి తెలియని వాళ్ళు ఇతరవృత్తుల్లోనూ ఉన్నారు. ఉన్నతమైన వ్యక్తులు పోలీసుల్లోను ఉన్నారు.

‘ఇంతకీ పాపం గీరూ ఎలా ఉన్నాడో! ఏంచేసుంటారు వాడిని? లాకప్పులో పెట్టారా ఏకంగా పెద్ద జైల్లో పెట్టే సారా?’ మళ్ళీ ఏవేవో ఆలోచనలు ముసురుకున్నాయి. ‘మనసు పాడైపోయేలోగా ఆలోచనలు మళ్ళించుకోవాలి’ అనుకుంటూ రిమోట్ అందుకుని టీవీ ఆన్ చేసాడు. చకచకా ఛానెల్స్ మార్చి చూసాడు. ఎక్కడా నీలాంబరి ఎన్నిక ప్రచారయాత్ర చూపించట్లేదు. ఏమైంది లైవ్ కవరేజ్ రావాలి కదా?

ప్రతి ఛానెల్ లోను మామూలుగా జాతీయ వార్తలు, ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినంత వరకూ ఇతర నాయకుల ప్రచార యాత్రల వార్తలు వస్తున్నాయి. కొంచెం వింత అనిపించింది. ‘మల్లిప్రోలులో బహిరంగసభ ముగిసి పోయిందేమో! మళ్ళీ ఆవిడ మరో ఊరు చేరే వరకూ ఇంకేం ఉంటుంది? ఇవాళ్టికి బహిరంగ సభల కోటా అయి పోయిందేమో!’ అనుకుని తనకు నచ్చిన ఛానెల్ పెట్టుకుని ఓ పుస్తకం పట్టుకున్నాడు.

ఒక కానిస్టేబుల్ తలుపు మీద కొట్టి లోపలికివచ్చి బల్లమీద భోజనం పెట్టి వెళ్ళి పోయాడు. ఆకలి వెయ్యక పోయినా కాలక్షేపం కోసం తినేసాడు. తినీ తినంగానే నిద్ర ముంచుకు వచ్చింది. ప్రయాణ బడలిక వల్లనేమో! నిద్రలోకి జారుకునే ముందు వచ్చిన ఒకే ఒక ఆలోచన –

‘నేనూ ఒక రకం జైల్లోనే ఉన్నాను. నాకూ స్వేచ్ఛ లేదు కదా ఈ పోలీసులు వదిలేవరకూ!’

***

ఆ రోజంతా బిపిబిపి ప్రచార యాత్రలకెడుతున్న అశేష జనాల సమూహాల్లోంచి పట్టుబడ్డ మందుల సంచీలు పోలీస్ స్టేషనుకి వచ్చిపడుతున్నాయి కుప్పలుకుప్పలుగా. అలాగే ఆ సంచీలతో పట్టుబడ్డ కార్యసేవకులు లేక కార్యకర్తలు చాలామంది ముఫ్ఫై ఏళ్ళలోపు యువకులే. కొంతమంది అతి బీద నేపధ్యం నుంచి వచ్చినవాళ్లు. మరికొందరు ఉన్నత వర్గాలనుంచి వచ్చిన అతి ధనవంతుల సంతానం. అందరినీ కలిపి దండ గుచ్చగలిగిన పేరు – నీలాంబరి. కొందరి తల్లిదండ్రులు నీలాంబరి భక్తులు. మరి కొందరు ఆవిడ రాజకీయరంగ ప్రవేశం చేసాక స్వప్రయోజనం కోసం భక్తబృందంలో చేరిన వారి పిల్లలు. ఏదేమైతేనేం తలిదండ్రుల వారసత్వంగా బిపిబిపి ప్రచార సభల్లో మందుల పంపిణీ డ్యూటీ భక్తిగా నిర్వహించడానికి తాత్కాలికంగా ఒక ఉద్వేగంలో బాధ్యత తీసుకున్నవారు కొందరు, అసలు ఈ పంపిణీ వ్యవహారం మంచి ఆదాయాన్నిచ్చే ఒక వృత్తిగా చాలా కాలంగా చేస్తున్న వాళ్ళు ఇంకొందరు.

సుందరం, గీరూ వాళ్ళ అదృష్టం కొద్దీ విఐపీల్లాగా కారుల్లో సుఖంగా వచ్చి చేరారు. చాలామంది గుంపులు గుంపులుగా పట్టుబడి ట్రక్కుల్లోను పోలీసు వేనుల్లోను తీసుకురాభడ్డారు. సంచీల్లోని మందులు అన్నీ ఒకే రకం కావని తేలింది. అన్ని మందులనూ ఫోరెన్సిక్ నిపుణులు పరీక్ష మొదలు పెట్టారు. కానీ జరుగుతున్న వ్యవహారమేమీ మీడియావారికి తెలియనియ్యలేదు పోలీసులు.

***

ముఖ్యమంత్రి, గృహమంత్రి పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం అయ్యారు. పరిస్థితినంతా మంత్రులకు అధికారులు వివరించి చెప్పారు. అందరూ కల్సి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్చించారు. చర్చల ఫలితంగా కొన్ని నిర్ణయాలు తీసుకోబడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా నీలాంబరి గురించిన వార్తలేవీ ప్రసారం చెయ్యవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్నుంచి ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింటు మీడియాకి ఆజ్ఞలు వెళ్ళాయి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఊహాగానాలు, చర్చాకార్యక్రమాలు పెట్టవద్దని సంకేతాలు వెళ్ళాయి. నీలాంబరి చిన్న స్క్రీను మీంచి మాయమైంది.

***

మల్లిప్రోలులో లైవ్ కవరేజ్ చెయ్యడం కోసం అక్కడ చేరిన టీవీ వారు, వార్తా పత్రికల కరెస్పాండెంట్లు నీలాంబరి రాగానే కెమెరాలు ఆన్ చేద్దామని తయారుగా ఉండి ముందు రెండు రోజులుగా ఏర్పాట్లు చేసుకుని ఎదురు చూస్తున్నారు. ఎదురుచూపులతో కళ్ళుకాయలు కాచాయే గానీ నీలాంబరి దర్శనం కాలేదు. సభాస్థలంలో తొక్కిసలాట మొదలవగానే ఆ గొడవలే రికార్డ్ చేయ్యాలని ముచ్చటపడ్డారు కరెస్పాండెంట్లు. రెండు నిముషాల్లోనే అదుపులేకుండా విజృంభించిపోయిన దొమ్మీ చూసి హడిలిపోయి ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకు నిలబడ్డారు. దొమ్మీ మొదలైన మరుక్షణం రంగంలోకి దిగిన పోలీసులు మీడియావారి నందరినీ రౌండప్ చేసారు. అందరినీ ఆ ఊరి పొలిమేరలలో ఉన్న బ్రిటిషుకాలంనాటి ట్రావెలర్స్ బంగళా అనబడే ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో ఉంచి వారి ఎక్విప్‌మెంటంతా స్వాధీనం చేసుకున్నారు. పోలీసు రక్షణకవచంతో గెస్టుహౌసు చేరిన మీడియా వారు జీవితంలో మొదటి సారి పోలీసులపట్ల కృతజ్ఞతతో తరించిపోయారు. ‘అత్యంత సమర్ధవంతమైన మన పోలీసు వ్యవస్థ అన్న శీర్షికతో ప్రోగ్రాములు చెయ్యాలి, వ్యాసాలు రాయాలి’ అని నిర్ణయించేసుకున్నారు కూడా అప్పటికప్పుడు కొంత మంది జర్నలిస్టులు. అక్కడ ఇరుక్కుపోయిన మీడియా వారికి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వార్త చేరనే లేదు.

గంటలు గడిచే కొద్దీ తొక్కిసలాట అధికమై పోతోందేకాని అదుపులోకి రాలేదు. పడిపోయినవారిని, దెబ్బలు తగిలి మొర్రోమని ఏడుస్తున్న వారిని పక్కకి లాగి టెంట్స్‌లో పడేస్తున్నారు. పెద్దలనించి వేరుపడిపోయి, ఘొల్లున ఏడుస్తున్న పిల్లలు, భయానికి సొమ్మసిల్లిన పెద్దలు, పిల్లలు, వృధ్దులు ఎక్కడి వాళ్ళక్కడ కుప్పకూలి పోతున్నారు. ప్రాణాలతో బయటపడడానికి ప్రయత్నిస్తూ పరిగెడుతున్నవారు వారి కాళ్ళకింద ఎవరు ఉన్నారో చూసుకోకుండా తొక్కుకుంటూ పోతున్నారు. ఎవరి ప్రాణం వారికి అతి ముఖ్యం. శిరస్త్రాణాలు ధరించిన రక్షక భటులు మాత్రం తమ ప్రాణాలు ఫణం పెట్టైనా సరే వీలయినన్ని ప్రాణాలు రక్షించాలని దీక్ష పట్టిన వారి లాగా ఆగకుండా సేవలందిస్తూనే ఉన్నారు. అసలే దొమ్మీ జరుగుతోంది, జనం అదుపులో లేరు. దెబ్బలేవీ తగలకుండా ఒంట్లో శక్తి కలిగి ఉన్నవాళ్ళు ఇతరులకి సహాయపడదాం అని కాక ఈ తొక్కిడిలోంచి అవతల పడడమే ధ్యేయంలాగా ఒకటే పరుగు పెడుతున్నారు. వారి వల్ల పోలీసులు చెయ్యగలిగిన సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది

జనాల హాహరావాలను ముంచేస్తూ హెలి కాప్టర్ శబ్దం జనాల గుండెల్లో దడపుట్టించింది. “నీలాంబరి! నీలాంబరి! అమ్మ! తల్లీ! రా రక్షించు!” ఇంకా ఓపిక మిగిలిన జనాలు కొందరు హఠాత్తుగా ఒకరినొకరు తోసుకోవడం ఆపి హెలికాప్టరు వైపు చేతులు జాపి దణ్ణాలు పెడుతున్నారు మొక్కుతున్నారు. హెలికాప్టరుకు వీళ్ళ మొర లేవీ వినబడలేదు. దిగంతాల్లోకి దూసుకు పోయి మాయమయిపోయింది.

నివ్వెరపోయిన జనం ఊపిరి పీల్చడం కూడా మర్చిపోయారు. నిశ్శబ్దంగా నుంచున్నారు ఒక్కక్షణం.

మరుక్షణం తేరుకున్న జనసముద్రం నింగికెగసి పోతోందా అన్నంత ఘోషణ!

అంత రోదన! అంతులేని వేదన!

ఇంకెవరున్నారు? నమ్ముకున్నదేవతే వమ్ముచేసి పోయాక ఇంకెవరున్నారు? రాదా ఇంక తమను రక్షించేందుకు నీలాంబరి? కుప్పకూలిన వాళ్ళు కూలిపోగా ప్రాణ భయంతో పరుగులుపెట్టిన వాళ్ళు ఎటుపోవాలో దిక్కుతోచని వాళ్ళల్లా మళ్ళీ వెనక్కొస్తున్నారు. వాళ్ళని ఆపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు పలించట్లేదు.

ఇంతలో మళ్ళీ ఆకాశాలు బద్దలకొట్టుకుంటూ వస్తున్నట్టుగా దూసుకొస్తున్న మరో విమానం దృగ్గోచరమైంది. జనంలో పిసరంత ఆశ. అంతలో నిరాశ. దీనులకోసం బాధాతప్తులకోసం ఎవరూ రారు. రోజురోజంతా ఎదురు చూసారు. నీలాంబరి వస్తుందని తమ బాధలు తీరుస్తుందని. ఆ నీలపు ఆకాశ వాహనం నిర్దయగా వెళ్ళే పోయింది. ఇంకిప్పుడు మనం ఎంతలా ఏడుస్తున్నామో పైనించి ఛాయా చిత్రాలు తియ్యడానికొచ్చిందా ఈ గండభేరుండం?

అది గండభేరుండమో విష్ణుమూర్తిని మోస్తూ గగనాన విహరించే ఖగరాజో గానీ అక్కడే చక్కర్లు కొట్టి కొట్టి చూసి చూసి ఏమయితే అయిందని పొలిమేరల్లో పొలంలో సాహసించి దిగింది. అందులోంచి మరో గ్రహం నించి వచ్చిన దేవదూతల్లాగా తెల్లటి దుస్తులు ధరించిన మనుషులుదిగి ఫోల్డబుల్ స్ట్రెచర్లు పట్టుకుని పరిగెత్తు కొచ్చారు.

“అరె వ్వాహ్! ఏంబులెన్స్ ఎయిరోప్లేన్!” అన్నారెవరో. లౌడ్ స్పీకర్ చేత్తోపట్టుకుని ఎనౌన్స్ చేస్తున్నాడొకడు. బాగా ప్రాణాపాయంలో ఉన్న క్షతగాత్రుల్ని స్ట్రెచర్ల మీద విమానంలోకి చేరవేస్తున్నారు కొందరు. గాయపడ్డా అంతగా ప్రమాదం లేని వారిని రోడ్డుపక్క నున్న ఏంబులెన్సుల్లో చేరుస్తున్నారు. ఓ రెండు గంటల్లో కదల్లేని వాళ్ళందరినీ అటు విమానంలోను, ఇటు ఏంబులెన్సుల్లోను చేర్చేసారు. విమానపు ఏంబులెన్సు, రోడ్డుమీది ఏంబులెన్సులూ పట్నంలో పెద్దాస్పత్రి వైపుగా వెళ్ళిపోయాయి. చిన్నచిన్నగాయలతో మూలుగుతూ భయం వల్ల కదల్లేక ఆ ప్రదేశమం తటా అక్కడక్కడ పడి ఉన్న వాళ్ళకి చేయూతనిచ్చి లేవదీస్తున్నారు అక్కడి సేవల కోసమే ఉండిపోయిన పేరా మెడిక్స్. వాళ్ళందరినీ పోలీసుల జీపుల్లోకి వేనుల్లోకి ఎక్కించి “పదండి ఇక్కడి ప్రభుత్వాసుపత్రిలో మీకు చికిత్స చేయిస్తాం”. అని బయల్దేరదీసారు.

***

ముందే కబురందుకున్న యోగి హాస్పిటల్ తలుపు తెరిచి అన్నీ సిద్దం చేసి ఎదురుచూస్తున్నాడు. యుధ్ధంలో ప్రాణాలు కోల్పోకుండా తిరిగి వచ్చిన వీరజవానులా నిలబడున్నాడు యోగి పక్కనే కనకరత్నం. తెల్లారేదాకా ఇద్దరూ విరామం లేకుండా రోగులకు తమ సేవలందిస్తూనే ఉన్నారు పేరామెడిక్స్ సహాయంతో. సిరి, విరి కూడా తమవంతు సాయం చేసారు. జీపు దిగి వచ్చిన వారిని వరుసగా కూచోబెట్టడం. కావలసిన వారికి మంచినీళ్ళం దించడం తమకు ఓపిక ఉన్నంత వరకు చేసి ఇంక అలసిపోయాక విశ్రమించారు.

యోగి గాయపడ్డవాళ్ళకు కట్లుకడుతూ మందులిస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. మాటల్లో తెలిసింది ప్రజల అమాయకత్వంతో కొందరు స్వార్థపరులు ఎంత బాగా అడుకుంటారో. “ఇక్కడ మెంటల్ జబ్బులున్న వాళ్లకి మదులిస్తారంటే ఒచ్చాం. వాళ్ళే డబ్బులు తీసుకోకుండా లారీల్లో తీసుకెళ్ళి భోజనాలు కూడా పెట్టి రోగుల్ని పరీక్షించి మందులిస్తారని చెప్పారండి. అందుకే వచ్చాం మేవంతా. తీరా వస్తే ఏవీలేదు. నీలాంబరమ్మ మహత్యాలు చూపిస్తుందని కూడా చెప్పారు. అసలు నీలాంబరమ్మే లేదు, ఎదవలు ఆయమ్మని ఏం చేసేసారో!”

“ఎందుకమ్మా ఎన్నో ప్రబుత్వ ఆస్పత్రులున్నాయి ఉచితంగా మీకు మందులివ్వడానికి. ఆ ఆస్పత్రులకెందుకు వెళ్ళరు. నిజానికి ఈ నీలాంబరి కన్నా బాగా చదువుకున్న డాక్టర్లుంటారు అక్కడైతే. అక్కడకెందుకువెళ్ళరు?” వాళ్ళకి చేయ వలసిన చికిత్సచేస్తూనే ప్రశ్నించాడు యోగి.

“డాక్టరుగారూ, ఉన్న మాట చెపుతా వినండి. మీ సంగతి మాకు తెలుసు. మీ గురించి, మీ నిజాయితీ గురించి మా కాకినాడ దాకా చెప్పుకుంటుంటారండి. ఒట్టేసి చెపుతున్నా వినండి డాక్టరుగారూ, గవర్నమెంటు ఆస్పత్రులలో మీరు తప్ప మీలాంటి వారింకొకరు లేరు. ఏదో మీలాంటోరు చెప్పారు కదా అని గవర్నమెంటాస్పటాలు కెళితే అక్కడ మా దుంప తెంచుతారండి. బైటికెళ్ళి రక్త పరీక్షలు చేయించుకురా అది చేయించుకురా ఇది చేయించుకురా అని నానా బాధలు పెడతారండి. ఆళ్ళ టైముకెళ్ళకపోతే ఓపీ టిక్కెట్లు రాయరండి. మాకు మా పల్లెటూళ్ళ నించి బస్సులుదొరికి పట్నం చేరేటప్పటికి ఒక్కోసారి ఆళ్ళ టైములయిపోతాయండి. ఆ రోజంతా అక్కడే ఉండి మర్నాడు చూపించుకోవాలంటే ఎంత కర్చో తమలాటి మారాజులకి తెలవదండి” వాళ్ళ కష్టాలు వాళ్ళు ఏకరువు పెట్టారు.

యోగికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. “అసలు ఇంతకీ నీలాంబరి ఒక్కరోజులో ఇన్నాళ్లనించీ ఉన్న జబ్బు నయం చేసెయ్యగలదని మాత్రం ఎలా అనుకున్నారు?”

“అందరూ చెప్తున్నారండి. ఆయమ్మ మహత్తులు గల తల్లి, నమ్ముకుంటే ఎంతటి రోగాలైనా ఇట్టే నయమవు తాయని. ఓసారి ప్రయత్నించి చూద్దాం తప్పేంటి అనొచ్చాం. అంతే కదండీ తప్పేంటండి?” ఇది ఒకరి వాదన.

“బాబుగారూ, మా వాడికి పధ్ధెనిమిదేళ్ళొచ్చినప్పటినించీ తనలో తను మాటాడుకోడం, అందరి మీదా అనుమానపడి పోట్లాడడం ఇలాంటి లక్షణాలన్నీ నచ్చాయండి. ఈ మధ్యనండీ ఎవరో తనని చంపడానికొస్తున్నారని, వాళ్ళని మేమే – అంటే వాడి అమ్మానాన్నలం – వాడి వెనకాల పంపుతున్నామని అనడం మొదలెట్టాడు. ఆ చంపడానికొస్తున్న వాళ్ళు తనకి స్పష్టంగా కనిపిస్తున్నారంటాడు. అయ్యా, మొదట పిచ్చనుకున్నాం. తరవాత మా ఊరివాళ్ళంతా దెయ్యపు చేష్టలివి అని మా చెవినిల్లుగట్టుకుని పోరితే భూతవైద్యం చేయించాం. డబ్బొదలింది కాని దెయ్యం వదల్లేదు. ఇవన్నీ మానసిక రోగాలు అని టీవీలో వర్ణించి వర్ణించి చెప్తే సరే పట్నంలో మానసిక నిపుణుడట ఆ డాక్టరు దగ్గర చూపించాం. ఏదో కొన్నాళ్ళు తగ్గినట్టే తగ్గి మళ్లీ తిరగబెట్టేది. ఆ డాక్టరు నెలకోసారి రమ్మనేవాడు. ఆయన చెప్పినట్టే చేద్దామనుకున్నా గుణం కనపడేది కాదు ప్రతి మాటు వందలు వందలు తెమ్మనే వాడు. పైగా ఎపాయింటుమెంటు కోసం పడిగాపులు పడడం. “తగ్గట్లేదు డాక్టరుగారు అంటే మీలాగా సంగతేంటో అడిగి తెలుసుకునే వాడనుకుంటున్నారా? మీకింతే. ఎంత చేసినా విశ్వాసం లేదు” అనుకుంటూ మామీద విరుచుకు పడేవాడు. “అయ్యా, మా కష్టలొకటీ రెండూనా? ఆయన చెప్పిన మందులు క్రమంతప్పకుండా కొనేవాడినండి. అప్పులపాలై పోయినా కొనేవాడినండి. పిల్లాడు బాగు పడడం కంటే డబ్బెక్కువా అనుకుని చెప్పినవల్లా తెచ్చే వాడినండి. కానీ డాక్టరుగారూ, తమరి మాట కెదురు చెప్తున్నాననుకోకండి గానీ ఎన్నాళ్ళు తేగలనండి? గవర్నమెంటాస్పత్రిలో చూపిద్దామంటే అక్కడ అప్పుడప్పుడు డాక్టరున్నా మందులుండవు. ప్రైవేటు డాక్టర్ని నమ్ముకుందామంటే డబ్బు తే డబ్బు తే తప్ప మరో మాట ఉండదండి. అటువంటప్పుడు ఏదో మహిమో మహత్యమో కాస్త మా కష్టాలకి ఓదార్పునిస్తుందని ఆశపడితే తప్పులేదుకదండీ?” అన్నాడు పెద్దాయన.

యోగి మాత్రం ఏం చెప్పగలడు? ప్రైవేటు ప్రాక్టీసు పెట్టుకోడం తప్పులేదు. కాని కొంతమంది డాక్టర్లు డబ్బు తప్ప డాక్టరుకుండాల్సిన సేవా గుణం మర్చిపోతున్నారు. కొందరిలో ఎథిక్స్ పూర్తిగా కనుమరుగయి పోతున్నాయి. ప్రభుత్వానికి నిరుపేదలకు కూడా వైద్యసేవలు అందించవలసిన బాధ్యత ఉంది. కాని ఆస్పత్రులు కట్టామని రికార్డులు రాసుకోడమే తప్ప వసతులు సమకూర్చాలన్న జ్ఞానం ఉండడం లేదు. పల్లెటూళ్ళల్లో ఆసుపత్రులు పేరుకు మటుకే ఉంటున్నాయి. కావలసిన సిబ్బంది, వసతులు ఉండట్లేదు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రజాధనంతో అన్నిరకాల వైద్య నిపుణులను తయారుచేస్తున్నారు. కాని ఆ తయారైన నిపుణుల వల్ల సామాన్య జనానికి ఏమాత్రం సేవలందుతున్నాయో ఎవరికీ తెలియదు. బాధితులైన బీదప్రజానీకానికి తప్ప. ఇటువంటి పరిస్థితుల్లో జనం మహత్యాలు, మేజిక్ మందులు ఏవైనా నమ్ముతుంటారు. ఆశ్చర్యపోనక్కరలేదు దీర్ఘంగా నిట్టూర్చి పనిలో నిమగ్నమయ్యాడు యోగి అతను అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పలేక. మొత్తం మీద క్షతగాత్రులందరికీ చికిత్స చెయ్యడం పూర్తయ్యే సరికి తెలతెలవారుతోంది.

ఇంతకీ నీలాంబరి మల్లిప్రోలు ఎందుకు రాలేదు? ఇంకా ఆవిడ సన్నప్రోలులోనే ఉందా? అన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరకలేదు.

అలిసిపోయి ఇంట్లో కెళ్ళిన యోగికి వినాయకరావు స్వాగతం పలికాడు. అతను అప్పుడే నిద్రలేచి, ఇంకా యోగి ఇల్లు చేరలేదని గమనించి ఆస్పత్రిలో తొంగి చూసి పరిస్థితి తెలుసుకుందాం అని తయారౌతున్నాడు. “అయ్యో డాక్టర్ గారూ! రాత్రంతా పని చేస్తూనే ఉన్నారా?” అన్నాడు సానుభూతిగా. యోగి నీరసంగా నవ్వాడు. “సూరయ్య లేచాడా? కొంచెం కాపీ పట్రమ్మనండి” అన్నాడు సోఫాలో కూలబడుతూ.

అంతకు ముందే లేచారు కాబోలు సుశీల, వాణి వంటింటి ఛార్జి తీసుకున్నారు. సుశీల అందరికీ కాఫీలు తెచ్చింది. సూరయ్య ఇంకా నిద్ర లేవలేదు. “పెరటి అరుగు మీద పడీపడీ నిద్రపోతున్నాడు” అని చెప్పింది. యోగికి ఇంక మాటడే ఓపికలేక ఆత్రంగా కాఫీ కప్పు అందుకున్నాడు.

“డాక్టరుగారూ, నిన్న స్టాంపీడ్ జరుగుతుంటే మనకి ఇంకో ఆలోచన రాలేదుగానీ, ఎలక్షన్ కాంపెయిన్ చేసే టప్పుడు వోటర్లకు ఏమీ పంచిపెట్టడం లాంటివి చెయ్యకూడదు కదా. అది చట్టవిరుధ్ధం. మరి నీలాంబరి కార్యకర్తలు మందులు పంచిపెడతాం అని బహిరంగ ప్రకటన చేసి మరీ ప్రజలని తీసుకు వస్తున్నారు. మరి అది చట్టవిరుధ్దమే కాదా?ఎలక్షన్ కమిషన్ వారి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం అలా ఏవేవో లంచాలు ఇస్తాం అనడం, ఇవ్వడం కరప్ట్ ప్రాక్టీసెస్, బ్రైబింగ్ ఆఫ్ వోటర్స్(corrupt practices and bribing of voters) కిందకి వస్తుంది. అది నేరం కదా. అందుకని నీలాంబరిని అరెస్ట్ చేసారేమో! అసలే గొడవలుగా ఉంది ఆ సంగతి బయటపెడితే మరీ గొడవలవుతాయని నీలాంబరి అరెస్టు సంగతి రహస్యంగా ఉంచారేమో!” అన్నాడు వినాయకరావు.

“నిజమే. నీలాంబరిని అరెస్ట్ చేసుండచ్చు.”

“సూరయ్య తిరిగి వస్తాడనుకోలేదసలు. అదృష్టవంతుడే. కాలూ చెయ్యీ విరక్కుండా బయట పడ్డాడు. ఒళ్ళు హూనం చేసుకుని వచ్చాడు ఏదో పెద్ద యుధ్ధం చేసొచ్చినట్టు. కానీ అతని బంధువులు మాత్రం ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియదు. తెల్లారాక వెతుక్కోవాలి అనుకుంటూ నిద్రపోయాడు” అన్నాడు వినాయకరావు.

నీరసంగా సోఫాలో వాలిన యోగి మాటాడలేదు.

“అయ్యో డాక్టరుగారూ లోపలికి వెళ్ళి పడుకోండి. కాసేపైనా విశ్రాంతి తీసుకోండి” వినాయకరావు యోగిని చూసి జాలి పడుతూ అన్నాడు.

“ఫరవాలేదులెండి నాకిది అలవాటే. సూరయ్య ఏమైనా చెప్పాడా అక్కడి విశేషాలు” అడిగాడు యోగి.

“అతను చెప్పిన ప్రకారం, దెబ్బలు తగిలి సీరియస్‌గా ఉన్నవాళ్ళ కోసం ఈ పోలీసుల విమానం రాక ముందు నీలం రంగు హెలికాప్టరొకటి గింగిరాలు తిరిగి దిగబోతున్నట్టు కొంచెం కిందికి వచ్చి మళ్ళీ ఎటో ఎగిరి పోయిందిట. ఆ హెలికాప్టరు శబ్దం మనక్కూడా వినబడింది. అది నీలాంబరి హెలికాప్టరే అని చెప్పుకుంటున్నార్ట. అదే నిజం అయితే నీలాంబరి అరెస్టవలేదేమో అనిపిస్తోంది. ఏ సంగతీ తెలియడానికి అటు రేడియో పలకట్లేదు ఇటు టీవీ ముందే పోయింది” అన్నాడు వినాయకరావు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here