మనోమాయా జగత్తు-14

0
9

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 14వ అధ్యాయం. [/box]

[dropcap]నీ[/dropcap]లాంబరి ఎక్కడుంది? పోలీసువర్గం ఎందుకు మౌనంగా ఉంది? మల్లిప్రోలులో ఏం జిరిగింది? ప్రజలకూ మీడియావారికీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేవారెవరూ లేరు.

సమాధానం దొరికే వరకూ ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో ప్రజల కర్తవ్యం. ప్రజలనప్రమత్తంగా ఉంచడం ప్రచార మాధ్యమాల వారి పని. పెద్ద పెద్ద అక్షరాలతో ‘నీలాంబరి ఎక్కడుంది?’ అన్నప్రశ్నను వెయ్యకుండా కొంచెం మార్పు చేసి ‘నీలాంబరి ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది’ అని అర్థం వచ్చేలా రకరకాలుగా ఆ ప్రశ్నను తిప్పితిప్పి అడిగీ అడక్కుండా చిన్నచిన్నవ్యాసాలు వేసి ఉదయం కాస్త ఆలస్యంగా వార్తాపత్రికలు అందరి గుమ్మాలు తట్టాయి. చిన్న స్క్రీను మీద స్క్రోల్ గా వేసేందుకు కూడా నీలాంబరి వార్త ఏదీ లేదు. ప్రభుత్వం నించి అనధికారికంగా ఆంక్ష లేదా విజ్ఞాపన ‘నీలాంబరి మాటెత్తవద్దు’ అని వచ్చింది కాబట్టి నీలాంబరి వ్రాసి స్వరపరిచిన భజనలను టైమ్ ఫిల్లర్స్‌గా వేస్తూ, జనం తాత్కాలికంగా తమకున్న ఈతిబాధల్లోపడి నీలాంబరి గురించి మర్చిపోతారేమోనని ఆవిడ గురించిన సంచలన వార్తలు ముందుముందున్నాయి అని గుర్తు చేస్తున్నారు. మరీ కాలక్షేపం, పనీపాటా లేనివారు మాత్రం నీలాంబరి ఎక్కడుంది, మల్లిప్రోలులో ఏం జరిగిగంది అని చర్చించుకుంటున్నారు.

తొక్కిసలాట మొదలయ్యక కూడా కొన్ని ప్రైవేటు ఛానెళ్ళవారి కెమెరాలు నడిచాయి. దాదాపు ఒక అర గంట పాటు కొన్ని కెమెరాలు నడిచాయి. అన్నీ ఒకసారే కాకపోయినా ఒకటి తర్వాత మరొకటిలాగా నడిచిన ఆ వీడియో ఫుటేజి అంతా చూస్తే అసలు దొమ్మీ ఎలా ప్రారంభమైందో తెలుస్తుంది. అందుకే ఒక పాడుబడ్డ ట్రావెలర్స్ బంగళాలో ఉంచిన మీడియా కరెస్పాండెంట్‌లు అందరినీ వదిలి పెట్టేసినా, వాళ్ళ కెమెరాలు, ఇతర సామాను వాళ్ళకి తిరిగి ఇవ్వలేదు.

“ఈ కెమెరాల్లో ఎందులో ఏ సమాచారముందో ముందు మేము పరీక్షించాలి. అది చూడ్డం వల్ల దొమ్మీని దుండగులు, లేక తీవ్రవాదులు లాంటివాళ్ళెవరైనా ఉద్దేశపూర్వకంగా మొదలుపెట్టారా లేకపోతే అనుకోకుండా జనంలో అవగాహన, క్రమశిక్షణ లేకపోవడం వల్ల మొదలైందా అన్న ప్రశ్నలకి సమాధానం దొరకచ్చు. మేము సమగ్రంగా పరిశీలిస్తే గాని మీకు తిరిగి ఇవ్వలేము. దేశ భద్రతా కారణాలవల్ల ఇంత నిశితంగా పరిశీలించడం తప్పని సరి. మీరు సహకరించాలి” అని మీడియావారికి విన్నవించింది రాష్ట్ర ఫ్రభుత్వం. మీడియా వారెవరూ అభ్యంతరం చెప్పలేదు. దర్యాప్తులు కొనసాగుతున్నాయి.

***

మూడోనాటి మధ్యాహ్నానికి గానీ అసలు మల్లిప్రోలులో ఏంజరిగింది అన్న ప్రశ్నకు జవాబురాలేదు. మెల్లిమెల్లిగా పోలీసులు తాము పరీక్షించిన వీడియోలలో విశేషాలు బయటపెట్టారు. మల్లిప్రోలు తొక్కిసలాట జాతీయవార్తగా ప్రచారమై ప్రసారమైంది. పోలీసులు తాము నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్స్ అంటే – తీవ్రంగా గాయపడ్డవారిని విమానపు ఏంబులెన్స్ లో పెద్దాసుపత్రులకు తరలించడం, ఇతరులను జీపుల్లో జాగ్రత్తగా ఎక్కించి తీసుకు వెళ్ళడం, పైపై గాయలు తగిలిన వారికి మల్లిప్రోలులోనే ప్రథమ ఛికిత్స చేయించడం మొదలైన విశేషాలతోకూడిన విడియోలు టీవీ ఛానెల్స్ వారికి ఇచ్చారు. ఛానెల్స్ వారు రోజంతా వీలయినప్పు డల్లా అవి ప్రదర్శించారు.

‘మన పోలీసులూ కార్యసాధకులే’ అన్న నమ్మకం కలిగేలా ఉన్నాయి ఆ వీడియోలు. తీవ్రంగా గాయపడిన వారిని ఏంబులెన్స్ పారామెడికల్ సిబ్బంది విమానంలోకి చకచకా ఎక్కించడం చూసిన ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. మొత్తం మీద మల్లిప్రోలు తొడతొక్కిడి వ్యవహారాన్ని మన రాష్ట్ర పోలీసులు చాలా సమర్ధవంతంగా నిర్వహించి చేతనయినంత సహాయమే చేసారు కానీ మామూలుగా జనం అనుకునేటట్టు అపసవ్యంగా చెయ్యలేదు అన్న అభిప్రాయం అందరిలో కలిగింది.

***

మల్లిప్రోలులో జరిగిన సంఘటనలేవీ రాకేష్‌కి తెలియలేదు. మళ్ళీ ఎప్పుడు తిరిగి ఇంటికి వెడతాను ఎప్పుడు పోలీసులు తనని క్షేమంగా అమ్మానాన్నల దగ్గరికి చేరుస్తారు ఎన్నాళ్ళు తనుకూడా ఈ విలాసవంతమైన బందిఖానాలో ఉండాలి అన్న ఆలోచనలతో సతమతమవుతూనే గాఢనిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో ఏవేవో కలలు. ఏవేవో భయాలు. తలిదండ్రులు కనిపిస్తూనే ఉన్నారు కానీ వారిని చేరుకోనివ్వకుండా ఎవరో తనని ఆపుతున్నారు. ఎలా ఎలా వాళ్ళని చేరుకోవడం…..

తలుపు మీద ఎవరో తట్టినట్టు వినపడి ఉలిక్కి పడి లేచాడు రాకేష్. ఎప్పుడు రాత్రయింది? ఎప్పుడింత నిద్ర పట్టేసింది? అనుకుంటూ లేచికూచుని “ప్లీజ్ కమిన్” అన్నాడు. కిటికీలోంచి పడుతున్న ఎండ చూసి అసలెప్పుడు మళ్ళీ తెల్లారింది? అనుకున్నాడు.

లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి సంభ్రమాశ్చర్యాలతో, “నాన్నా!” అంటు మంచం దిగి నిలబడ్డాడు.

లాయరు విశ్వం వెనకే సంజీవ్ కూడా వచ్చాడు. “నువ్వు రాసిపెట్టిన చీటీని అమ్మకన్నా నేనే ముందు చూసాను. అర్థం కాలేదు. ఇంతకు ముందెప్పుడూ నువ్వలా చెయ్యలేదు కదా, ఏమయ్యుంటుంది? అనుకున్నాను. కొంచెం వర్రీ అయ్యాను కూడా. పొద్దున్నే ఇన్‌స్పెక్టర్ సంజీవ్ ఫోన్ చేసారు. అప్పటికి అమ్మ ఇంకా లేవలేదు. లేచుంటే చాలా కంగారుపడి పోయుండేది. నేనే రిసీవ్ చేసుకోవడం మంచిదే అయింది. ఫోన్లో అంతా చెప్పారు. అమ్మ లేచాక నెమ్మదిగా అంతా వివరించా. పనులన్నీ గబగబా కానిచ్చుకుని, పోస్ట్‌పోన్ చెయ్యగలిగిన పనులన్నీ పోస్ట్‌పోన్ చేసేసి కారేసుకుని బయల్దేరి పోయా” విశ్వం గబగబా చెప్తున్నాడు.

అతను చెప్తున్న మాటలు రాకేష్ అంతగా పట్టించుకోలేదు. తన గురించి సంజీవ్ ఎప్పుడు ఫోన్ చేసాడు, తండ్రి ఎప్పుడు బయలు దేరాడు, ఇక్కడికి ఎన్నింటికి చేరుకోగలిగాడు ఇవేవీ ముఖ్యంకాదు.

తనకి ఊహ తెలిసాక తండ్రి ఇన్ని మాటలు ఇంత శాంతంగా తనతో మాట్లాడటం ఇదే మొదటిసారి. అదీ ముఖ్యం! తనకదే ముఖ్యం!

ఆయన కంఠం శ్రావ్యంగా వినిపిస్తూ తన చుట్టూ ఒక రక్షణ వలయం నిర్మిస్తున్నట్టుగా ఉంది. కేవలం ఆ గొంతు వింటే చాలు తనను అంతరంగంలో నిరంతరం పీడించే అవ్యక్తమైన అభద్రతా భావం తొలగి పోతున్నట్టుగా ఉంది. ఎప్పుడూ ఇలా ఎందుకు చేసావ్? అలా ఎందుకు చెయ్యలేదు? నువ్విలాగే ఉండాలి! ఇదే చదవాలి! అలాగే ఆలోచించాలి! అంటూ శాసించినట్టు ఖంగుమనే ఆ కంఠం తనపట్ల సున్నితమైన వాత్సల్యంతో, వాత్స ల్యం వలన కలిగిన ఆందోళనతో, తనని చూసినందుకు కలిగిన ఆనందంతో, సౌమ్యతతో తనని పలకరిస్తుంటే చెవులప్పగించి వింటూ, కళ్ళప్పగించి తన తండ్రినే ఆరాధనగా చూస్తూ అలాగే నుంచున్నాడు రాకేష్.

 “ఆల్రైట్ మీరిద్దరూ మాటాడుకుంటూ ఉండండి, నేను పనిచూసుకు వస్తాను” అని సంజీవ్ వెళ్ళిపోయాడు. “రా ఇలా కూచో” రాకేష్ భుజం మీద చెయ్యేసి తన పక్కనే మంచం మీద కూచోబెట్టుకున్నాడు విశ్వం. “ఇలా నీలాంబరి శిష్యుల కనెక్షన్‌లో పోలీస్ వాళ్ళు నీ హెల్ప్ తీసుకున్నారని, నువ్వు వాళ్ళకి కొంత క్లూ ఇచ్చి ఒక ముఖ్యమైన డ్రగ్ ఏజెంటును పట్టిచ్చావని తెలిసి నేనెంత గర్వంగా ఫీలయ్యానో తెలుసా?”

‘వాట్?! హి ఈజ్ ప్రౌడ్ ఆఫ్ మీ!! వండర్ ఫుల్!’

“కానీ అసలు మల్లిప్రోలులో తొక్కిసలాట జరిగి చాలామంది సీరియస్ అయ్యారని ప్రాణాపాయంలో చాలామంది ఉన్నారని తెలిసి చాలా అప్సెట్టయ్యాం నేనూ మీ అమ్మా. నువ్వెక్కడున్నావో తెలియదు. ఎవరో ఫ్రెండు రమ్మంటే వెడుతున్నానని రాసావే కానీ ఎక్కడి కెడుతున్నావో రాయలేదు. ఎక్కడున్నావో తెలియ లేదు. నువ్వూనీ ఫ్రెండూ అందరిలాగే నీలాంబరిని చూద్దామన్న కుతూహలంతో మల్లిప్రోలు వెళ్ళారేమోనని అనుమానం వచ్చింది. అక్కడ ఏదో గొడవ జరిగిందని పుకార్లొస్తున్నాయి, అసలేం జరిగిందో ఎవరూ చెప్పట్లేదు ఇదంతా చూసి చాలా ఆదుర్దా పడిపోయాం. మీ అమ్మైతే ఏడిచేసింది కూడా. ఇన్‌స్పెక్టర్ సంజీవ్ దగ్గర్నుంచి మళ్ళీ ఫోన్ వచ్చే వరకూ ఇద్దరం ఎంత టెన్షన్ పడిపోయామో! మీ అమ్మ కూడా వస్తానని గొడవ. నేను తనని ఒక ఫ్రెండింట్లో దింపి డ్రైవర్ని తీసుకొచ్చాను. గొడవల తరవాత ఈ రూట్ ఎలా ఉందో తెలీదు. ఇద్దరం వచ్చి ఇబ్బంది పడి ఇరుక్కుపోవడం ఎందుకు అని తనని తీసుకురాలేదు” ఏదేదో చెప్పుకుపోతున్నాడు విశ్వం.

ఈ కొత్త నాన్న రాకేష్‌కి చాలా బాగున్నాడు. తనమీద అధికారం చలాయించే నాన్న మాయమై పోయాడు. ‘తనకోసం బెంగ పెట్టుకునే నాన్న ఎంత బాగున్నాడు!’

‘ఒరే గీరూ, థాంక్స్ రా. నీమూలాన నేనో సాహసం చేసాను. ఇన్నాళ్ళూ మా అమ్మా నాన్నా నన్ను వాళ్లు ఆడించినట్టల్లా ఆడాల్సిన కీలుబొమ్మలా చూస్తున్నారు అని నా అభిప్రాయం. ఇప్పుడు నాకు తెలుస్తోంది. నాకిష్టమైనట్టు నేను చేసేస్తే నేనేం ప్రమాదంలో పడతానో అని నాకోసం బెంగ పెట్టుకుని నన్నో పసివాడిలా ఇష్టంగా భద్రంగా చూస్తున్నారు. థేంక్స్ రా గీరూ. థేంక్స్’.

***

‘థేంక్స్ రా రాకేష్ థాంక్స్. నువ్వు నన్నిలా పోలీసులకి పట్టివ్వడం వల్లనే నాకు నేను చేస్తున్నది నేరం అని తెలిసొచ్చింది. ఇన్నాళ్ళూ నేనేదో ఎడ్వంచర్ చేస్తున్నాననుకుంటున్నా. పేద్ద బిజినెస్ చేస్తున్నా ననుకుంటున్నా. ఇరవై ఏళ్ళు దాటిపోయిన నాకు నేను చేస్తున్నది నేరమని తెలియలేదు. నన్ను నేనేమని తిట్టుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు నా కెరీర్ ఏమిటో నాకు బాగా తెలిస్తోంది. ఇప్పుడురా అసలు సిసలు థ్రిల్! వారేవా! అసలు నా వెనక సిఐడి ఇన్‌స్పెక్టర్‌లు నిఘావెయ్యడం, ఎవరిద్వారా వీడిని పడదామా అని వల వెయ్యడం, నన్నొక ఇంటర్నేషనల్ క్రిమినల్ లాగా తీసుకురావడం, పేరు తెలియని ప్రిజన్‌లో పెట్టడం – నవలల్లో దర్శనమిచ్చే థ్రిల్స్ అన్నీ వచ్చాయి నా కథలో. ఇదిగో వింటున్నా. ఇప్పడు నీలాంబరి ఎక్కడుందో తెలియట్లేదని చెప్పుకుంటున్నారు. నా సెల్ బయటపొట్టి పోలీసులు చెప్పుకుంటుంటే విన్నాను. నేను నిద్రపోతున్నా ననుకుంటున్నారు మూర్ఖులు. అనుకోనీ. పాపం తిండి బాగానే పెడుతున్నారు. ఆల్రైట్. మా అబ్బాయి తెలీక చిన్నతనం, అమాయకత్వం కొద్దీ అతను కేవలం ప్రజలకు మంచి చేసే మందులు పంచి పెడుతున్నానన్న భ్రమలో ఈ నేరం చేసాడని మానాన్న ఆర్గ్యుమెంట్లు మీ నాన్న చేతే చెప్పించి నన్ను చిన్న శిక్షతో తప్పిస్తాడు. ఆ శిక్ష మరీ చిన్నదైతే అనుభవించి మంచిపేరు తెచ్చుకుంటాను. అంత చిన్నది కాకపోతే జైల్ బ్రేక్ చేసి తప్పించుకుంటాను. తరవాత…. ఆ తరవాత నేను నిజంగా కరుడుగట్టిన క్రిమినల్‌నై, గొప్ప థ్రిల్లులన్నీ సొంతం చేసుకునీ అంతర్జాతీయ హోదా పొందీ….’

గీరూ ఊహలకి హద్దుల్లేవు. ఊహల్లో కూడా ఎక్కడా పశ్చాత్తాపం లేదు. ఒక తాపం, ఒక దాహం అంతలోనే ఒక హాయి! ఊహల్లోనే తన గురించి రాబోయే కథనాలు టీవీలో హెడ్లీ లెవెల్లో అంచనాలు…. ఆ మైకం! అంతులేనిది ఆ ఆనందం!

ఏ మాదకద్రవ్యం అవసరం లేకుండానే మత్తులో మునిగిపోయాడు గీరూ.

***

తెల్లారేటప్పటికి పుకార్లు దావానలంలా పాకిపోయాయి. మల్లిప్రోలులో నీలాంబరి కోసం ఎదురుచూస్తున్న సభాస్థలంలో తొక్కిసలాట పాత వార్త. నీలాంబరిని పోలీసులు అరెస్టు చేసే ఉంటారు అన్నది కొత్త వదంతి.

కొత్తగా రెండూరెండూ కలిపి మీడియా వారు నాలుగుగా ఒక ఫార్ములా చేసుకుని దానిని తెలిసీ తెలియనట్టుగా ప్రచారం చేస్తున్న వార్తలేమిటంటే – చుట్టుపక్కల ఊళ్ళనించి లక్షకుపైగా జనం బిపిబిపి వారు ఏర్పాటు చేసిన ట్రక్కులు, బస్సులు, ఇతరవాహనాలలో ప్రయాణించి మల్లిప్రోలు వైపు తరలి వస్తుండగా కొందరు బిపిబిపి కార్యకర్తలు, నీలాంబరి భక్తసేవకులు ప్రయాణికులలో కలిసిపోయి నీలాంబరి తయారు చేయించిన మందులు అని కొన్ని మందులు పంచారు. చాలామంది రోగులు మల్లిప్రోలు చేరే లోపే మొదటి డోసు మందు వేసేసుకున్నారు. తరవాత మల్లిప్రోలులో భోజనాలు ఏర్పాటుచేసారు. భోజనానంతరం డోసు మందు వేసుకున్నాక అది చాలా మందికి వికటించింది. దానితో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మందు వికటించిన రోగులను నీలాంబరి శిష్య సన్యాసులకు చూపించి విరుగుడు తీసుకోవాలన్న ఆతృతతో నేను ముందంటే నేను ముందని తోసుకోవడంతో తొక్కిసలాట మొదలైంది.

ఇది వార్తా పత్రికలలో వేరువేరు కాలమ్‌లలో వచ్చిన విషయాలుకూడుకుంటే ఎవరికైనా అర్థమవుతుంది. అయితే వార్తాపత్రికల వాళ్ళు ఆకుకి అందకుండా పోకకి పొందకుండా అన్నట్టు వేసిన కథనాలు కొంత సందేహాలకు కూడా తావిస్తున్నాయి.

అంటే, కావాలనే ఆ మందులు వికటిస్తాయోలేదో చూడడానికన్నట్టు కార్యకర్తలు పంచిపెట్టారా? ఏవైనా విద్రోహచర్యలా ఇవి? లేకపోతే బిపిబిపి కార్యకర్తల పేరుతో ఇతర పార్టీల వాళ్లు ఈ పనిచేసి నీలాంబరికి చెడ్డపేరు వచ్చేలా చెయ్యాలనుకున్నారా? ప్రజల్లో సందేహాలు పెరిగిపోతున్నాయి కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేరు. మామూలుగా చిన్న చిన్ననేరస్తుల్ని పట్టుకుని కెమెరాలముందు ప్రదర్శించడానికి ఉత్సాహపడే పోలీసులు కూడా మౌనం వహించారు.

అసలు జరిగిన ప్రమాదాలకు బాధ్యత వహించి సమాధానం చెప్పవలసిన వ్యక్తి నీలాంబరి. మరి ఆవిడ మాటాడదేం?

***

నిగమ్ తనతో పాటు నీలాంబరి, అరిటాకులో లేహ్యం మందుల పంపకం గురించి దర్యాప్తులు చేస్తున్న తక్కిన సిఐడి ఇన్‌స్పెక్టర్లతో సమావేశమయ్యాడు.

“మనం ఇప్పటివరకూ జరిపిన దర్యాప్తులోను, చేసిన అరెస్టులవలన, అసలు విషయం తెలిసిరాలేదు. ఈ మందులు పంచిపెట్టిన వారికి అవేం మందులో తెలుసా? అవి అసలు నీలాంబరి ఆశ్రమాన్నించి వచ్చినవా? లేక ఇంకెవరైనా నీలాంబరి పేరు చెప్పి ప్రజల్లోకి చొచ్చుకుపోయి చేస్తున్న విద్రోహచర్యలా? ఇప్పటి వరకూ మనం అరెస్టు చేసిన బిపిబిపి కార్యకర్తలు ఎవరూ పెదవి విప్పలేదు. మనం కూడా వాళ్ళ చేత నిజం కక్కించడానికి మన రొటీన్ మెథడ్స్ ఉపయోగించలేదు. అప్పుడే మొదలు పెట్టద్దు అన్నదే మన పాలసీ. నేరస్తులెప్పుడూ మన నించి క్రూరత్వం ఆశిస్తారు. అది కనపడకపోతే వాళ్ళు ఆశ్చర్యపడతారు. మనం వేసే ఎత్తులు ఊహించడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ ఊహలు తలకిందులు చేసినప్పుడు అనుకోకుండా వాళ్లే చాలా విషయాలు బయటపెడతారు. మీకు తెలిసిందే. ఇప్పుడు వాళ్ళని సస్పెన్స్‌లో పెట్టడం మనపని. వీళ్ళందరిలో సుందరం చాలా గట్టివాడు. గీరూ తొందరగా బయటపడతాడు, కొంత సమాచారం బయటపెడతాడు అని నేననుకుంటున్నాను. సరే ఈ అరిటాకులో లేహ్యాల సంగతి పక్కన పెడితే, నీలాంబరి మరో సమస్య. నీలాంబరి ఎక్కడో రహస్యంగా ఉంది. హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న మనిషిని పట్టుకోవడం చాలా తేలిక అనిపిస్తుంది. కానీ కాకినాడలో హెలికాప్టర్ దిగిన తరవాత మళ్ళీ నీలాంబరి హెలికాప్టర్ ఎక్కిన జాడలేదు. అయితే మనం ఈ సంగతి ఇప్పుడే బయటపెట్టవలసిన అవసరం లేదు. నీలాంబరి తనంతతానే హైడింగ్‌లోకి వెళ్ళిందా లేక ఏ రాజకీయ ప్రత్యర్థులో కిడ్నాప్ చేసారా అన్న ప్రశ్నకు జవాబు దొరికాకే మనం నిర్ణయం తీసుకోవాలి”

“ఇదేమంత తేలిక వ్యవహారం కాదు ఇది మనం అనుకున్నట్టు కేవలం డ్రగ్ రాకెట్ కాదు. మాదకద్రవ్యాల వ్యాపారం కాదు. పోరెన్సిక్ నిపుణుల రిపోర్టులు వస్తున్నాయి నీలాంబరి శిష్యులు పంచుతున్న అరిటాకు లేహ్యాల్లో కొద్దిగా మత్తుపదార్దాలున్న మాట వాస్తవమే కానీ, చాలా తక్కువ శాతం. ఇప్పటి వరకూ మార్కెట్ లోకి రాని ఏవో కెమికల్స్ ఎక్కువ భాగం ఉన్నాయి అని వాటిని పరీక్షిస్తున్న ఫోరెన్సిక్ లేబ్ వారు అనుమానిస్తున్నారు. ఇంకా పరీక్షలు జరిపితే గాని పూర్తిగా ఆ మందుల్లో ఏమున్నదీ తెలియదు. మూలికలేమయినా మామూలుగా వాడకంలో ఉన్న మందులతో కలిపారా? వంటి ప్రశ్నలకు సమాధానం ఇంకా తేలవలసిఉంది.”

నిగమ్ మాటలు శ్రధ్ధగా వింటున్నారు అతనితో కలిసి ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఇతర అధికారులు.

***

మల్లిప్రోలులో పోలీసుల పని పూర్తికాలేదింకా. తొక్కిసలాటలో తప్పిపోయిన పిల్లల బాధ్యత వారి మీద పడింది. కొందరు సరిగా వివరాలు ఇవ్వలేని పసిపిలల్లు. కొందరు కొంచెం తెలిసిన పిల్లలు వివరాలు ఇవ్వగలిగినా వాళ్ళ తాలూకు పెద్దలు ప్రాణాపాయ స్థితిలో పెద్దాసుపత్రిలో పడున్నారు. వాళ్ళ తాలూకు బంధువలెవరైనా వచ్చేదాకా పోలీసులే బాధ్యత వహించాలి. డజనుమంది దాకా స్టేషనులో చేరిన పిల్లల ఫొటోలు పేపరులో వేయించి వారి తాలూకు వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకెళ్ళవచ్చు అని విజ్ఞాపన చెయ్యడం తప్ప అప్పటికి పోలీసులు చేసేదేం లేదు. స్టేషనులోనే వంటలు చేయించి ఆ పిల్లల వసతులు చూసుకుంటున్నారు

పోలీసుస్టేషనులో ఉన్న పిల్లల్లో ఐదేళ్ళ లోపు పిల్లలు ముగ్గురు కొద్దిగా బుద్దిమాంద్యం ఉన్న వాళ్ళుగా గుర్తించారు. మరో నలుగురు పదేళ్ళు దాటిన పిల్లల ప్రవర్తన కూడా కొంచెం విచిత్రంగా ఉండడం గమనించారు. ఒకసారి చాలా నిరాశ నిస్పృహల్లో మునిగినట్టుండడం. మరో సారి చాలా ఉత్తేజంగా ఎలాంటి పరిస్తితుల్లోను భయపడని వాళ్లల్లా చాలా హుషారుగా ఉండడం. బెంగగా భయంభయంగా ఉంటున్నవాళ్ళే మరోగంటలో విపరీతంగా చలాకీతనం ప్రదర్శించడం. ఇవన్నీగమనించిన స్టేషను సిబ్బందికి వాళ్ళు మానసికసమస్యలున్న పిల్లలని అర్థమైంది. బహుశ ఈ సమస్యకేదైనా పరిష్కారం నీలాంబరి చూపిస్తుందన్న ఆశతో వాళ్ళ పెద్దలు ఆ రోజు సభకు వాళ్లని తీసుకొచ్చి ఉంటారు. తమ దగ్గర ఉన్నంతకాలం వీళ్ళందరినీ యోగికి చూపించి అతని సలహాతో చికిత్స చేయించాలని నిర్ణయానికొచ్చాడు ఆ స్టేషన్ ఎస్.ఐ.

గాయపడ్డ వారు ఇంకా యోగి దగ్గరకు వస్తూనే ఉన్నారు. రెండోరోజుకల్లా ఎవరి ఊరికి వారు తిరిగి వెళ్లిపోవలసిన వారు కూడా ఏదో ఒక నీడ చూసుకుని ఉండిపోయారు. వారందరికీ అక్కడే ఉండిపో వాలనిపించడానికి ముఖ్యకారణం – డాక్టర్ యోగి. అతనిలో వాళ్ళందరినీ ఆకర్షించి బాగా నచ్చిన ముఖ్యలక్షణం తాము చెప్పుకునేది పూర్తిగా ఓపిగ్గా వినడం. విని తమ సమస్యపట్ల తమకు సరైన అవగాహన కలిగించడం. “అసలు కొంత మంది ఈ కొత్త పేషంట్లు చెప్తున్నది వింటుంటే మనదేశంలో వైద్యవిధానం ఎంతలా పతనమైపోతోందో తెలిసి వస్తోంది” అన్నాడు ఆ రోజు మధ్యాహ్నం వరకూ రోగులను పరీక్షించి భోజనానికి వచ్చిన యోగి.

“కానీ మిమ్మల్ని చూస్తుంటే మన పల్లెటూళ్లల్లో వైద్యరంగానికి స్వర్ణ యుగం నడుస్తోందా అనిపిస్తోంది” అన్నాడు వినాయకరావు. అలసట మర్చిపోయి హాయిగా నవ్వేసాడు యోగి.

మల్లిప్రోలు సంఘటన తరవాత ఎందుకైనా మంచిదని ఒకరోజు ఆగి కాకినాడ తిరిగి వెడదామనుకున్నాడు వినాయకరావు. కానీ సిరి, విరి మల్లిప్రోలు లాంటి చిన్న ఊరు పుట్టాక ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఊరు చాలా నచ్చేసింది. ఒక గంటలో ఊరంతా చుట్టిరావచ్చు. ఊరి చివర అరటి, కొబ్బరి తోటలు, పంటపొలాలు ఓ అద్భుతంలాగా తోచాయి. ఒక పక్క ప్రవహించే గోదావరి వాళ్ళకి ప్రత్యేక ఆకర్షణ. “ఉన్న నాలుగురోజులూ ఇక్కడే ఉందాం. మరో నాలుగురోజులు నీ లీవు ఎక్స్‌టెండ్ చేసుకో అమ్మా” అన్నారు వాళ్ళు. యోగి కూడా వినాయకరావుని ఇంకో నాలుగురోజులుండి వెళ్ళండి అని ఆహ్వానించాడు. వినాయకరావుక్కూడా పెద్ద తొందరపెట్టే పనులేమీ లేవుకాబట్టి ఉండిపోయారు.

“ఆ రోజు స్టాంపీడ్‌లో దెబ్బలు తగిలిన వాళ్ళని ఫస్ట్ ఎయిడ్ కోసమే కదా మీ దగ్గరకు తీసుకొచ్చారు? వాళ్ళ ఇంజరీస్ మరీ సీరియస్ కాకపోయినా ఎందుకు ఇంకా మీ హాస్పిటల్‌కి వస్తున్నారు?” సిరి అడిగింది.

“మొదట కేవలం గాయాలకి మందు పూయించుకుని కట్టుకట్టించుకుని వాళ్ళ ఊళ్ళకి తిరిగి పోదామనే వచ్చారు. కానీ వాళ్ళు అసలు ఇక్కడికి వచ్చిన మొట్టమొదటి కారణం వేరు. వాళ్ళకి సంబంధించిన మానసిక రోగులకు నీలాంబరి చేతి మందు వేయించాలని. నీలాంబరి దర్శనమే కాలేదు పైగా ఆవిడ శిష్యులు ఇచ్చిన మందులకు రియాక్షన్లొచ్చాయి. ఇప్పడు నన్ను చూసాక వాళ్ళకి ఎడారిలో ఒయాసిస్సు దొరికినట్టుందనుకుంటా. నేను మామూలు గవర్నమెంటు ఆస్పత్రి చూసుకునే డాక్టర్నేకాక సైకియాట్రిస్టునని కూడా తెలిసింది. సరే, నీలాంబరికి నేను ఆల్టర్నేటివ్‌లా బాగానే కుదిరాను వాళ్ళకి. కాస్త టైమ్ స్పేర్ చేసి వాళ్లు చెప్పేది విసుక్కోకుండా వింటున్నాను. దాంతో వాళ్ళు తీసుకొచ్చిన మానసిక రోగుల్ని నాకే చూపించి చికిత్స మొదలు పెడదామని ఐడియా వచ్చి ఇక్కడే ఉండిపోయారు” వివరించాడు యోగి.

“మెల్లిగా మీ మూలాన మల్లిప్రోలులో పెద్ద సైకియాట్రిక్ హాస్పిటల్ వెలుస్తుందేమో” అంది విరి భవిష్యత్తును ఊహించేసుకుంటూ.

“అలా జరిగితే మంచిదే. ప్రస్తుతం మాత్రం వీళ్ళకి సులువుగా పని జరుగుతోంది. కొంత మందిని చూస్తే చాలా జాలేస్తోంది. మహాపట్నాల్లో వైద్యం డబ్బున్నా సజావుగా జరుగుతుందా లేదా అని అనుమానం వస్తోంది. మరో ముఖ్య విశేషం అసలు మానసిక వ్యాధుల పట్ల ప్రజలకి సరైన అవగాహన లేక పోవడం” ఏదో ఆలోచిస్తూ అన్నాడు యోగి.

“ఈ రోజుల్లో ఇలాంటి వాటి గురించి చాలా పత్రికలలో మంచి సమాచారమే ఇస్తున్నారు. టీవీల్లోను, రేడియోల్లోను చెప్తున్నారు అవగాహనా లోపం అని నేననుకోను” అన్నాడు వినాయకరావు.

“పత్రికలెంతమంది చదువుతున్నారు? చదివే అలవాటున్నవాళ్ళు, కొంతైనా డబ్బుపెట్టి కొనగలిగిన వాళ్ళే కదా. కొని చదివేవాళ్ళు కూడా తమకు పనికిరావు అన్న శీర్షికలు చదవరు. ఇంక రేడియోలు అంటే సినిమా పాటలకు, ఎఫ్ ఎమ్. స్టేషన్లకే అంకితమైపోతున్నారు. టీవీ వీక్షణం సీరియల్స్‌కే అంకితం. ఏ దూరదర్శన్‌లోనో ఇటువంటి కార్యక్రమాలు వచ్చినా చూసేదెవరు? అదీకాక మీరన్నట్టు పత్రికలనే తీసుకుందాం. మానసిక వ్యాధుల గురించి కొంత సమాచారం ఇస్తారు సరే. కాని దాని వల్ల రోగం తగ్గుతుందా? రేడియోల్లోనూ, టీవీల్లోనూ ఫోన్-ఇన్ కార్యక్రమాలు వస్తాయి. నిజమే, వాటివల్ల ప్రశ్న అడిగే వారికి తమ సమస్య పట్ల కొంత అవగాహన కలుగుతుంది. కానీ అదే పరిష్కారం కాదు కదా? పత్రికల్లో ప్రశ్నోత్తరాల శీర్షికలు కూడా కొన్ని పరిమితులకు లోనై ఉంటుంది. ఒక్క ప్రశ్నతో పరిష్కారం దొరకదు పైగా ఇంకా కొన్ని సందేహాలు ఉత్పన్నమవుతాయి. వైద్యుడితో ముఖాముఖీ వలన మాత్రమే చికిత్స సరిగ్గా జరుగుతుంది. సరైన చికిత్స నిరుపేదకు కూడా అందుబాటులో ఉన్నప్పుడే మాయలు, మంత్రాలు మొదలైన వాటితో అమాయకులను మోసం చెయ్యడం తగ్గుతుంది” అన్నాడు యోగి.

“ఎలాగైనా ఇదో పెద్ద బృహత్కార్యక్రమం అనే అనిపిస్తుంది. పరిష్కారం దగ్గరలో ఉన్నట్టు తోచదు”. నిరాశగా అన్నాడు వినాయకరావు. అప్పుడు తన కూతురు సుశీల జీవితంలో పలికిన అపశృతి వివరించాడు.

“అల్లుడు మేథ్స్ ప్రొఫెసర్ అని పిల్లనిచ్చాము. దాని గొంతు కోస్తున్నామని ఊహించలేదు.” అని సుశీల భర్త గురించి చెప్పుకొచ్చాడు. సిరి, విరి అప్పటికే అతని గురించి విని ఉన్నారు. తాతగారి వైపునించి కూడా విని తమ తండ్రి గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. “తాతగారూ, అప్పటికే ఇలా సైకియాట్రిక్ డిసీజెస్ గురించి అవేర్‌నెస్ ఉండేది కదా. మీరెలాగైనా ఆయనకు ట్రీట్‌మెంట్ ఎందుకు ఇప్పించలేకపోయారు?” అని అడిగింది విరి.

“అమ్మ చెప్పింది కదా మన బామ్మ కూడా ఏమీ కో-ఆపరేట్ చెయ్యలేదని తాతగారూ వాళ్ళు ఏం చెయ్యగలరు?” సిరి గుర్తుచేసింది.

“మానసిక వైద్యం సరిగా జరగాలంటే మొట్టమొదట ఆ పేషెంటు సహకరించాలి. పేషంటు నాకేం జబ్బు లేదు నాకు ట్రీట్‌మెంటు అవసరం లేదు అని మొండికేస్తే ఏ వైద్యుడు ఏమీ చెయ్యలేడు. తరవాత కుటుంబ సభ్యుల సహాయసహకారాలు చాలా ముఖ్యం. మీ నాన్నగారి విషయంలో ఆయన తల్లి బొత్తిగా సహకరించకపోవడం దురదృష్టం. ఇలా జరుగుతూంటాయి అప్పుడప్పుడు. ఇతరుల పొరపాటు, మొండితనం వల్ల ధనికవర్గాలలో కూడా మానసిక రోగులకు వైద్యం సజావుగా జరగట్లేదు” ఆలోచిస్తూ అన్నాడు యోగి.

“మా తాతగారు చెప్పినదాన్ని బట్టీ మానాన్నగారికి ఉన్నజబ్బు షైజోఫ్రేనియానే అంటారా అంకుల్?” ఆసక్తిగా అడిగింది సిరి.

“కేవలం కొన్ని లక్షణాలను విని రోగనిర్దారణ చెయ్యడం కుదరదు. పేషంటుకు చాలా దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులు వారి ప్రవర్తన గురించి చెప్పేది వినాలి, పేషంటును స్వయంగా ప్రశ్నించి తెలుసుకోవాలి రోగనిర్ధారణ చేసే లోపు చాలా వివరాలు సేకరించాలి” అన్నాడు యోగి.

“అంటే మానసికరోగాలు కూడా చాలా రకాలు ఉంటాయా?”

సిరి ప్రశ్న విని చిన్నగా నవ్వాడు యోగి.

“ఉంటాయి. మన సంభాషణ ఎందుకో షైజోఫ్రేనియా వైపే మళ్ళుతోంది మొదటినించీ. అందుకేనేమో మీకు అదొక్కటే మానసికవ్యాధి అన్న ఇంప్రెషన్ కలిగి ఉండచ్చు. కానీ మానసిక వ్యాధులు చాలా రకాలు ఉంటాయి. మూడ్ డిజార్డర్స్, ఏంగ్జైటీ, సొమటోఫార్మ్, డిసీజెసు, మాదక ద్రవ్యాల వ్యసనాలు, పెర్సనాలిటీ డిసార్డర్స్, ఒకటి కాదు చాలానే ఉన్నాయి. అంతెందుకు షైజోఫ్రేనియాలో కూడా రకాలున్నాయి. పేరనాయిడ్ టైప్, డిసార్గనైజ్డ్ టైప్, కెటాటానిక్ టైపు, సింపుల్ షైజోఫ్రేనియా ఇలా ఎన్నో రకాలున్నాయి. జనరలైజ్ చేసి చెప్పడానికి వీల్లేదు. అందువలన రోగనిర్ధారణ చెయ్యడం పెద్దపని. చేసాక రోగికి సరిగ్గా చికిత్స జరగడం మరో బృహత్కార్యక్రమం.”

యోగి మాటలు వింటున్నవాళ్ళల్లో ఎన్నో ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ‘మా నాన్నని యోగి అంకుల్ ట్రీట్ చేసుంటే ఎంత బాగుండేది! నాన్నకూడా ఇప్పుడు అందరిలాగా చాలా మామూలుగా ఉండేవారు. మాకు నాన్నంటే ఎవరో తెలియకుండా పెరగవలసిన అవసరం ఉండేది కాదు’ సిరి అనుకుంది.

“ఇంత వ్యవహారం ఉందన్నమాట ఒక మెంటల్ పేషంటును నిర్ధారించి వైద్యం చెయ్యాలంటే. మరలాంటప్పుడు నీలాంబరి తన కార్యకర్తలకు ఏవో మందులిచ్చేసి పంచి పెట్టమని ఎలా చెప్పింది. ఆ పంచి పెట్టేవాళ్ళకి వైద్యం ఏం తెలుసని?” అంది విరి కాస్త ఆవేశంగా.

“మరదే కదా అందరూ మొత్తుకుంటున్నది? ఆవిడ జనానికి ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టింది? ఇందులో అంతరార్ధం ఏమిటి? అని”.

“మన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పవలసింది నీలాంబరే. మరి ఆ నీలాంబరి మాటాడదేం? అసలెక్కడుంది ఆవిడ?” అసహనంతో అరిచింది విరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here