మనోమాయా జగత్తు-15

0
9

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 15వ అధ్యాయం. [/box]

[dropcap]“నీ[/dropcap]లాంబరి హెలికాప్టరు అదృశ్యం”. పొద్దున్నే పిడుగులా వార్త ప్రజల్లోకి వచ్చి పడింది.

ఏకంగా హెలికాప్టరుకు హెలికాప్టరే మాయమయ్యిందా? అదెలా సాధ్యం? మరి నిఘావర్గాల వారేం చేస్తున్నారు? నీలాంబరి ఆ హెలికాప్టరులో ఉందా? మాయమయిన హెలికాప్టరు ఎక్కడో ఒక చోట తేలాలి కదా?

ప్రజల సందేహాలకు అంతులేదు. ఎవరికి తోచిన సిధ్ధాంతాలు వారు చెపుతున్నారు. ఇది పూర్తిగా మన నిఘా వర్గాలవారి వైఫల్యమే అని సర్వత్రా కలిగిన అభిప్రాయం. అంత పెద్ద హెలికాప్టరు ఎలా మాయం అవుతుంది? రాడార్లూ అవీ ఉంటాయి. ఏదెక్కడుందో కనిపెడతారు. అయినా మాయమైపోయిందంటే ఇది మామూలు వ్యవహారం కాదు. దీని వెనకాల చాలామంది పెద్దల సహాయ సహకారాలు ఉండే ఉంటాయి. అధికార వర్గంలో వాళ్ళే తమ పరపతినంతా ఉపయోగించి నీలాంబరి తప్పించుకోడానికి చెయ్యందించి ఉంటారు – ఇలా సాగాయి ప్రజల్లో చర్చలు. ఎవరెన్ని చర్చించుకుంటే ఏం ప్రయోజనం? అధికారవర్గం వారినించి హెలికాప్టరుకై నిపుణులు వెతుకుతున్నారు అని తప్ప మరో ప్రకటన లేదు. ప్రజల్లో కలిగిన సందేహాలన్నిటీకీ ప్రభుత్వం నుంచి మౌనమే సమాధానం.

ఇదంతా పైపైన కనిపించినంత తేలిక సంగతి కాదు అని ఏకాభిప్రాయానికొచ్చారు ప్రజలు.

***

నీలాంబరికి చిరాకెత్తిపోతోంది. “అండర్‌గ్రౌండ్ అవడం అంటే మరీ ఇంత అవస్థ కింద ఉంటుందని నేనెప్పుడూ ఊహించలేదు. చాలామంది ప్రజానాయకులు ఏమాత్రం వ్యతిరేకత వచ్చినా అండర్‌గ్రౌండ్ అయిపోయి ప్రభుత్వంతో సరసాలాడుతూంటారు కదా. అదేదో చాలా సరదాగా ఉంటుందనునుకున్నాను” తన మొహం మీదికొస్తున్న చిన్న కీటకాన్ని చేతిలో ఉన్న విసినికర్రతో తరిమి కొడుతూ అంది. మళ్లీ వెంటనే, “అదేం పురుగు? ఇటు కందిరీగా కాదు అటు తేనెటీగా కాదు” అంటూ విమానంలా జుఁయ్ మని ఎగురుకుంటూపోతున్న పురుగును పరీక్షగా చూపులతో వెంటాడింది. ఆ చూపుల వేట తట్టుకోలేకో ఏమో పురుగు ఓ చెట్టువెనక మాయమయ్యింది.

“ఏదో అడవి జాతి పురుగు అయ్యుంటుంది గానీ, తమరసలు ఈ రాజకీయాల్లోకి దిగకుండా ఉండవలసింది తల్లీ. రాజకీయాలు పాపపు పుట్టలు. ఇప్పుడిలా పాములపుట్టలు, చీమలపుట్టలు తప్పించుకు తిరగవలసి వచ్చిందంటే మరి రాజకీయాలే కారణం” అన్నాడు పురాణానందస్వామి. పక్కనే ఉన్న దేవభక్తానందస్వామి బట్టలకు గుచ్చుకున్న తుమ్మముళ్లు తీసుకుంటూ ఏమీ మాటాడలేదు కానీ అవునవునన్నట్టు తలూపాడు.

నీలాంబరికూడా ఏమీ మాటాడలేదు. తన శిష్య ప్రశిష్యు లు తననే మాత్రం విమర్శించినా నీలాంబరి మౌనం వహించడం పరిపాటి. ఆ మౌనం విమర్శకులలో చిన్న భయం పుట్టిస్తుంది. తన మాటల్లో పొరబాటు ఏముందా అని ఆలోచింపచేస్తుంది. తన పొరపాటు తనకు తెలిసివచ్చినా రాకున్నా నీలాంబరికి కోపం తెప్పించానేమో అన్న జంకు పుట్టిస్తుంది. పురాణానందస్వామికి అన్నీ తెలిసినా ఇటువంటి పొరబాట్లు అప్పుడప్పుడు చేస్తుంటాడు. ముఖం చిన్నబుచ్చుకుని మౌనంగా ఉండిపోయాడు పురాణానందస్వామి.

చిక్కని చెట్లకొమ్మలు తప్పించుకుంటూ కాళ్ళకు చుట్టుకుపోతున్న తీగలను తీసి పెడుతూ హెలికాప్టరు పైలట్ వస్తున్నాడు. అతని వెనకే ‘సంకరుడు’, మరో ముగ్గురు విదేశీయులు జాగ్రత్తగా నడుస్తూ వస్తున్నారు.

“ఈ వయసులో ఇలా అడవుల్లో కందమూలాలతో ఎడ్జస్టయిపోవడం చాలా కష్టం. ఇంకా ఎన్నిరోజులు నాకీ శిక్ష?” అంది నీలాంబరి సంకరుడికి అర్ధమయ్యే ఆంగ్ల భాషలో. సంకరుడు నవ్వాడు.

“ఎన్నిరోజులా? ఇవాళే. ఇప్పుడే. చిన్న సందేశం రావాల్సి ఉంది. రాగానే వెళ్ళిపోదాం.” ఎక్కడికి? అని అడగలేదు నీలాంబరి. అనవసరం. తన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తాం అని వాగ్దానం చేసారు ఈ విభిన్నజాతీయులు. ఆ మాట నిలబెట్టుకుంటారని తనకు నమ్మకం ఉంది. వాళ్ళు తీసుకొచ్చిన పళ్ళూ పాలూ తాగి, తాత్కాలికంగా తనకోసం ఏర్పాటు చేసిన చిన్న పాకలో విశ్రమించింది. నీలాంబరి కళ్ళ ముందు బాల్యం నుంచీ తన జీవనప్రస్థానం కళ్ళముందు మెదిలింది.

పదమూడేళ్ళ పిల్లగా ఉన్నప్పుడే తనని ‘మాత’ను చేసి కూచోబెట్టింది తనకు జన్మనిచ్చిన మాత దుర్గ. తండ్రి వెంకట్రావు మీద అప్పటికే ‘ఎందుకూ పనికిరాడు’ అన్న ముద్రపడింది. ఉన్నవారి ఇళ్ళల్లో వంటలు చేసి దుర్గ సంపాదించుకొచ్చిందే ఆధారం. దండిగా డబ్బున్నవారి జీవన విధానం అతి దగ్గరగా రోజూ చూస్తుండే దుర్గకి, ‘మనం మాత్రం అలాంటి విలాసాలు ఎందుకు అనుభవించకూడదు?’ అన్న దుగ్ధ పుట్టింది. అంతే. తనను బాల సన్యాసినిగా అవతారం వేయించింది. విభూది నుదుటన దట్టించి పొడుగాటి బొట్టు భ్రూమధ్యంలో పెట్టించి కాషాయం కట్టించి ఎక్కడో సంపాదించిన కృష్ణాజినం మీద కూచోబెట్టింది. తన చేత భగవద్గీత బట్టీ పట్టించి, చిన్న చిన్న మాటల్లో అర్థం చెప్పడం నేర్పించింది.

ఇక అంతే. భక్తులు వచ్చిపడేవారు. వాళ్ళెందుకొచ్చేవారో తనకు అర్థమయ్యేది కాదు. వాళ్ళేం అడుగుతున్నారో అంతకన్నా అర్థమయ్యేది కాదు. అయినా అన్నీ తెలిసినట్టు అందరితోను మాట్లాడేది. బహుశ తల్లి నుంచి సంక్రమించిన తెలివితేటల వల్ల కాబోలు. తనకేం మాట్లాడాలో తెలియనప్పుడు చటుక్కున గుర్తొచ్చిన భగవద్గీతా శ్లోకం ఒకటి చదివేసేది. భక్తులూ తెలివైన వాళ్ళే. తను స్వంత మాటల్లో అప్పటికి తోచినట్టు చెప్పినా లేక గీతా శ్లోకం గడగడా చదివేసినా దాన్ని తమకు కావలసిన రీతిగా అన్వయం చేసుకుని తృప్తి పడేవారు. అదేదో తన ప్రతిభే అని కితాబులిచ్చేవారు. చాలా త్వరలో తను తెలిసీ తెలియకా చెప్పే మాటలు ప్రవచనాలుగా ప్రసిధ్ధి చెందాయి.

తరువాత తన ప్రఖ్యాతి విన్న కొందరు గురువులు తనని కొన్నాళ్ళ పాటు నిజంగానే హిమాలయ సానువుల్లో ఉన్న కొన్ని ఆశ్రమాలకు తీసుకువెళ్ళి రకరకాల ఆధ్యాత్మిక ప్రసంగాలు చెయ్యడం వంటి వాటిలో శిక్షణ నిచ్చారు. ఆ రోజుల్లో నిజంగానే మోక్ష మార్గంలో నడవాలన్న ఆశయం ఉండేది. గురువులు చెప్పినవన్నీ శ్రధ్ధగా విని, క్షుణ్ణంగా నేర్చుకుంది. కొండలలో ఊళ్ళకు దూరంగా ఉండేవారు కాబట్టి ఆ ఆశ్రమాలలోని సన్యాసులు చిన్నచిన్న ఆరోగ్య సమస్యలకు తమకు తెలిసిన ఆయుర్వేద వైద్యం చేసుకునేవారు. వారిలో కొందరు ఒక పధ్ధతిననుసరించి గురుముఖతః ఆయుర్వేదం నేర్చుకున్నవాళ్ళు ఉండేవారు. వారు ఇతర సన్యాసులకు వైద్యం చేస్తున్నప్పుడు వారేం చేస్తున్నారో చూసి ఆ వైద్యం తనకు తోచిన రీతిలో అర్థం చేసుకుంది. ఆ మిడి మిడి జ్ఞానపు వైద్యం చాలాసార్లు భక్తులను ఆకర్షించడానికి పనికొచ్చేది.

గురువుల వద్ద ఉన్నరోజుల్లోనే తనకు దైవ సందేశాలు వినబడడం ప్రారంభమైంది. మొదట తన వయసు లోనే ఉన్న సన్యాసినులతో చెప్పింది. తను ఒక్కతే ఉన్నప్పుడు తనకు దైవ సందేశాలు వినిపిస్తున్నాయని. వాళ్ళెవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ తనకు ఏవేవో మాటలు ఒంటరిగా ఉన్నప్పుడే కాక పదిమందితో కలిసి ఉన్నప్పు డు కూడా వినిపిస్తుండేవి. వచ్చిన చిక్కల్లా మాటలే వినబడేవి. ఆ మాటలు చెప్తున్న వారు కనబడేవారు కాదు. అయితే, అవి ఏవో నిరర్ధకమైన మాటలు కావు. తను పఠించే ఆధ్యాత్మిక గ్రంధాల రహస్య సారం అనిపించేది. ఒక్కోసారి తను అలా వినిపిస్తున్న గొంతులను తన ఆధ్యాత్మిక సందేహాలను అడుగుతుండేది, వారినించి జవాబులు కూడా పొందేది.

తనతో మాట్లాడుతున్న గొంతులతో తను అతి ముఖ్యమైన ఆధ్యాత్మికాంశం చర్చిస్తుండగా ఒకనాడు గురువుగారు చూసారు. తనని పిలిచి, “నీలో నువ్వు ఎందుకు మాట్లాడుకుంటున్నావు?” అని అడిగారు. అప్పుడు తనకు వినిపిస్తున్న సందేశాలను గురించి చెప్పింది. ఆయన ఆలోచించాడు. “ఇక్కడి అతిశీతల వాతావరణానికి, సంపూర్ణంగా ప్రకృతిలో మమేకమై గడిపే జీవన విధానానికీ సరిగ్గా అలవాటుపడి తట్టుకోలేని వారికి మానసికమైన భ్రమలు కలుగుతుంటాయి. బహుశః నీకూ అలాగే ఏదో భ్రమ కలుగుతున్నట్టుగా ఉంది. నువ్వు చెప్తున్నదాని ప్రకారం అవి గొప్ప దైవ సందేశాలని నాకనిపించట్లేదు. నువ్వు మనసును అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా సాధన చెయ్యి” అంటూ ఏవేవో నీతులు చాలా చెప్పాడు. పైగా, “నువ్వు నీకు వినిపిస్తున్న సందేశాలుగా చెపుతున్న మాటలు ఆధ్యాత్మిక ప్రవచనాలలాగా లేవు. ఏదో అన్నీతనకే తెలుసుననుకుని అయోమయంలో పడే వారు చెప్పే మాటల్లా ఉన్నాయి” అని కూడా అన్నాడు.

ఆయన కేవలం తనకు ఇంతటి ఆధ్యాత్మిక అనుభవం కలుగుతున్నందుకు అసూయకొద్దీ అలా చెప్తున్నాడనుకుంది. ఆయనలాంటి సామాన్య సన్యాసికి ఇటువంటి మహత్తరమైన అనుభవం గగన కుసుమమే. ఆయన తత్వశాస్త్రాన్ని మధించి ఉండవచ్చు. సామాన్య ప్రజానీకానికి అర్థమయ్యేలా చెప్పగలిగే భాషా పటిమ ఆయనకు ఉండవచ్చు. కానీ సాక్షాత్తూ ఆ భగవంతుడి కంఠస్వరంలోనే ఆధ్యాత్మిక రహస్యాలు వినపడాలంటే తనలాగా పెట్టి పుట్టాలి. అని అప్పుడూ ఇప్పుడూ కూడా తను మనస్ఫూర్తిగా నమ్ముతుంది.

ఆశ్రమంలో హిమాచల్ నుంచి వచ్చిన స్వామి చికిత్సానందస్వామి అనే సన్యాసి ఉండేవారు. ఆయన సన్యాసాశ్రమం స్వీకరించక ముందు ఎమ్.బి.బి.ఎస్. పాసయ్యాడు. రోగాలతో తీసుకునే మానవశరీరం, దుఃఖభరితమైన మానవ జీవితం పట్ల విరక్తి చెంది సన్యాసాశ్రమం స్వీకరించాడు. ఆయన చాలా చోట్ల తిరిగి దీనులకు ఉచిత వైద్యచికిత్స చేసి సేవ చేస్తుండేవాడు. ఆయన ఆశ్రమానికి వచ్చి గురువుగారి వద్ద కొన్నాళ్ళు గడిపి మళ్ళీ మారుమూల పల్లెటూళ్ళు పర్యటించి సేవలందించడానికి వెడుతుండేవాడు. గురువుగారొక నాడు ఆయనతో తన సంగతి చెప్పినట్టున్నాడు. చికిత్సా నందస్వామి తన దగ్గరకొచ్చి తనకు వినిపించే కంఠస్వరాల గురించి, ఎన్నో ప్రశ్నలు వేసాడు. తను చెప్పినదంతా విని ఆయన ఏమన్నాడో ఇప్పటికీ జ్ఞాపకం ఉంది.

“నీకు ఇల్లు వదిలిపెట్టి ఈ కఠినమైన సన్యాస జీవితం గడుపుతున్నందుకు కొద్దిగా మానసిక సమస్యలేవో కలుగుతున్న ట్టున్నాయి. భ్రమలు కలుగుతున్నాయి” అన్నాడు. డెల్యూషన్సో ఏదో ఇంగ్లీష్ పేరు కూడా చెప్పాడు.

“భ్రమ కాదు. నాకు అప్పుడప్పుడ దేవతా మూర్తులు ప్రత్యక్షమవుతున్నారు కూడాను” అంది తను. “వాటినే హేల్యూసినేషన్స్ అంటారు. నీకు వైద్యసహాయం అవసరం. నాకు తెలిసిన మానసిక వైద్యునితో మంచి వైద్యం చేయిస్తాను” అన్నాడు. “ఎందుకంటే నువ్వు చెపుతున్న మాటల్లో నిజమైన ఆధ్యాత్మికత లేదు. నీకు తెలిసీ తెలియని జ్ఞానంతో, గురువుల ప్రబోధాలను సరిగా అర్థం చేసుకోక తోచినట్టు ఆలోచిస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి నీకు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి అని చెప్తున్న దేవ సందేశాలు” అన్నాడు. తనకు ఆనాడు కలిగిన క్రోధం జీవితంలో ఏనాడు కలగలేదు.

కొన్నాళ్లకి దైవుడే కాక రాక్షసగణాలు కూడా తనతో అదృశ్యంగా సంభాషించడం మొదలైంది. వారిని తరిమి కొట్టడానికి తనెంతో శ్రమపడాల్సి వచ్చేది. ఆ రాక్షసులు గురువుగారు తనను పతనమొందించడానికి తన మీదకి పంపుతున్న శత్రువులుగా గుర్తించింది. చికిత్సానందస్వామి కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యుండవచ్చని భావించింది. ఎవరితోను ఏమీ అనలేదు. తనెప్పుడూ అంతే. శత్రువులను మౌనం తోనే శిక్షిస్తుంది. తరవాత ఇంక తల్లి దగ్గరకు తిరిగొచ్చేసింది.

గురువుల శిక్షణ ముగించుకుని – అంటే తనే వారి వ్యాఖ్యానాలు, విమర్శలు నచ్చక – తిరిగి వచ్చేనాటికి దుర్గ తనకు ‘నీలాంబరీ మాత’ పేరు స్థిరపరిచి భక్తజనాన్ని పోగెయ్యడానికి ప్రచారం చేసింది కానీ తను సాధించిన అభివృధ్ధి కళ్ళారా చూడకుండానే లోకంనుంచి నిష్క్రమించింది.

తనకు వినిపిస్తున్న మాటలు తననెంతటి అద్భుతమైన ఆధ్యాత్మిక గురువుగా తీర్చిదిద్దాయో తనకు మాత్రమే తెలుసు. తనను భక్తులు చేరి ప్రశ్నలు సంధిస్తున్నప్పుడు కూడా ఆ గొంతులు తనకు వినబడేవి. ఆ గొంతులు తనతో అంటున్నమాటలనే తను తిరిగి సందేహాలడిగిన భక్తులకు వినిపిస్తే, అవి వారికి సరైన పరిష్కా రాలుగా తోచేవి. వారికి అంతటి ఊరట నిస్తున్న ఆ కంఠస్వరాలు దైవ సందేశాలు కాక మరేమిటి?

తను గురువు మాటనమ్మి తనకేదో మతి భ్రమిస్తోందనుకుని ఊరుకుంటే తనివాళ ఈ స్థితికి వచ్చేదా?

తనకి ఈ రోజుల్లో వైద్య సలహాలు కూడా ఆ దైవ సందేశాల్లోనే వినిపిస్తున్నాయి. కానీ మానవమాత్రుల తప్పిదాలవల్ల ఫలించట్లేదు. దానికి తన బాధ్యతేముంది? చివరికి తన వల్ల ప్రయోజనం పొందిన వారు కూడా తనకు శత్రువులయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. ఏం చేస్తాం. అంతా ఆ నీలమేఘశ్యామార్పణం!

తన దగ్గరకు వచ్చే భక్తుల అంతస్తు సామాన్య మధ్యతరగతి నుంచి ధనికవర్గం, తరవాత అధిక ధనికవర్గం వరకు పెరిగింది. పై వర్గాలవారు తమ పరిచయాలు పెంచుకోడానికి తనను ఆశ్రయించేవారు. ఒకరితో ఒకరు పోటీపడి తన ఆశ్రమానికి అన్ని ఆధునిక వసతులు సమకూర్చారు. వారి సమస్యలు తను తలుచుకుంటే పరిష్కరించగలదన్న నమ్మకం రోజురోజుకూ పెరిగిందే తప్ప తరగ లేదు.

తను రాజకీయ ప్రవేశం చెయ్యాలన్న ఫ్రతిపాదనకూడా భక్తులనుంచి వచ్చినదే. తన వల్ల లబ్ధి పొందుతున్న భక్తులే తను రాజకీయప్రవేశం చేస్తే లాభదాయకంగా ఉంటుందని ఈ ప్రచారంలోకి దింపారు. అంతేకానీ తనకు ఇవన్నీ తృణప్రాయాలు. ఏదో, భక్తులకు ప్రయెజనం చేకూరుతుందని తనీ రంగంలోకి దిగింది. చుక్కెదురైనా తనకేం నష్టంలేదు. అంతా ఆ నీలమేఘశ్యామార్పణం! ఇప్పుడు తనను క్లిష్టపరిస్థితులనించి తప్పించ వలసిన బాధ్యతకూడా తన భక్తులదే. నీలాంబరి పెదవులపై చిన్న చిరునవ్వు విచ్చుకుంది. అవును భక్తులదే తన బాధ్యత భక్తులదే. అంత భక్తి చూపించిన ఆ రాజేశ్వరరావు నమ్మక ద్రోహం చేసి… ఆఖరు క్షణంలో… అసలు వాడెక్కడ? ఎక్కడ మాయమయ్యాడు? చిరునవ్వు మరిచిన పెదవులు కోపంగా వంకర తిరిగాయి. ఎక్కడా ఆ రాజేశ్వరరావు, ఎక్కడున్నా డిప్పుడు?

***

అసలు రాజేశ్వర్రావు తనంత తను నిగమ్‌ని కాంటాక్ట్ చేసి, ఇప్పుడు సిఐడి వారి రక్షణ కవచం మధ్యన భద్రంగా ఉన్నాడన్నది నీలాంబరి ఊహకందని విషయం. సంకరుడు నీలాంబరిని దేశం నించి తప్పించడానికి వేసిన ఎత్తుకి పై ఎత్తులు వెయ్యగలిగే అధికారులు భారతదేశంలో ఉన్నారని కూడా నీలాంబరికి కనపడని కంఠాలు చెప్పినా నమ్మలేక పోతుందేమో.

నీలాంబరిని అడవిలోంచి తీసుకురావడానికి వ్యూహరచన పూర్తి చేసాడు నిగమ్. సంకరుడు ప్లాన్ చేసినట్టే ఒక హెలికాప్టరులో ఆమెకు తెలియని ఒక గమ్యానికి ఆమెను చేర్చడమే ఆ వ్యూహం. హెలికాప్టరుకోసం ఎదురు చూస్తూ, అప్పటి వరకూ నీలాంబరి కేసులో బయటపడ్డ యథార్థాలను ఇతర అధికారులతో చర్చిస్తున్నాడు నిగమ్.

“నీలాంబరి ఆశ్రమంలో వ్యవహారాలమీద అనుమానం కలిగిన రాజేశ్వరరావు మన ప్రొటెక్షన్ అడిగడం వల్ల ఈ కేసు ఇంత త్వరగా పరిష్కారం దిశగా దూసుకెడుతోంది” అన్నాడు నిగమ్. “ఇన్నాళ్ళూ అంత మహాభక్తుడిగా గడిపాడు ఆవిడ ఆజ్ఞలేనిదే వ్యాపారంలో నిర్ణయాలు కూడా తీసు కోడు రాజేశ్వర్రావు అని పేరుపడింది. ఇప్పుడు హఠాత్తుగా…” సంజీవ్ తన ప్రశ్ననెలా ముగించాలో తెలియనట్టుండిపోయాడు. “అతని కొడుక్కి ఏదో అద్భుత వైద్యం కూడా చేసిందని చెప్పుకున్నా రు?” మరో ఇన్స్పెక్టర్ అన్నాడు.

“ఆ కొడుకు పోయాకే రాజేశ్వరరావులో మార్పొచ్చింది” నిగమ్ అన్నాడు. “పోయి కూడా ఎన్నాళ్లో అవలేదనుకుంటాను.?” మరొకరు అడిగారు. “అసలు ఎన్నికల ప్రచారంలో రాజేశ్వర్రావు నీలాంబరితో కలిసి టూర్ చేస్తాడని వార్తలొచ్చాయి”.

“నిజమే. నీలాంబరీదేవితో కలిసి టూర్ చేస్తున్నట్టుగా అతనే ప్రకటించాడు. చివరి నిముషం వరకూ అదే ఇంప్రెషన్ కల్పించి ఆవిడని నమ్మించాడు. మనతో చేతులు కలిపాడు. అతను ఆశ్రమ వ్యవహారాల గురించి కూడా చాలా ముఖ్యమైన సమాచారం ఇచ్చాడు. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగానే నీలాంబరి ఆశ్రమంలో మనవాళ్లు పరిశోధిస్తున్నారు. గీరూ ఇంటిమీద నిఘా వెయ్యడం కూడా ఫలితాన్నిచ్చింది. గీరూ తల్లిదండ్రులిద్దరికీ కూడా ఈ అరిటాకులో లేహ్యం మందుల వ్యవహారంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాజేశ్వర్రావే మన స్టార్ విట్నెస్.”

“ట్రీటికా అని ఒక బహుళ జాతీయ మందుల కంపెనీ ఉంది. ఒక మూడు అతిసంపన్న దేశాల పారిశ్రామికవేత్తలు నడుపుతున్న కంపెనీ అది. రాజేశ్వరరావు దానిలో భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తున్నాడు. రాజేశ్వరరావు కొడుకు రమేష్‌కు స్కీజోఫ్రేనియా అనే మానసికవ్యాధి ఉండేదని మన దర్యాప్తులో మనకు తెలిసిన విషయమే. ట్రీటికా వారికి తమదైన అధునాతన లెబోరేటరీస్ ఉన్నాయి. ఫార్మసీ రంగంలో మేధావులైన వారిని స్పాన్సర్ చేసి ప్రసిధ్ధి చెందిన విదేశీ యూనివర్సిటీల్లో పరిశోధనలు చేయిస్తారు”

అందరూ ఓపిగ్గా వింటున్నారు. నిగమ్ నీలాంబరి అదృశ్యం నుంచి మల్టీనేషనల్ కంపెనీలు ఔషధ పరిశోధనల వరకూ వెడుతున్నాడు. ఏ కారణం లేకుండా అతనలా చెయ్యడన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే సహనం కోల్పోకుండా జాగ్రత్తగా వింటున్నారు.

“రాజేశ్వర్రావుకు నీలాంబరిని ట్రీటికా వారే పరిచయం చేసారు.”

చిన్నసైజు నాటుబాంబు పక్కనే పేలినట్టు ఉలిక్కిపడ్డారందరూ. అంత పెద్ద బిజినెస్ మేగ్నెట్, మరో అతిపెద్ద మల్టీ నేషనల్ కంపెనీ – ఇద్దరికీ నీలాంబరితో ఏం లింకు? అందరిలో ఉత్కంఠ పెరిగింది.

“సంపన్న దేశాలలో పాతరోగాలకూ, కొత్తరోగాలకూ కూడా కొత్తకొత్త మందులు కనిపెట్టే ప్రయత్నంలో విపరీతంగా పరిశోధనలు జరుగుతుంటాయి మనందరికీ తెలిసినదే.”

తెలిసిన విషయాలే మళ్ళీ మళ్ళీ చెప్పేబదులు అసలు విషయానికి రావచ్చుగా అని ఎవరూ అనుకోలేదు. నిగమ్ ఇంత వివరంగా ఇతర సమాచారాలు కలుపుకుంటూ ప్రసంగిస్తున్నాడంటే విషయం చాలా గంభీరమైనదని అర్థం.

“కొత్త మందులు కనిపెట్టినప్పుడల్లా వాటిని ఎలుకలు, చింపంజీలు మొదలైన జంతువులమీద ప్రయోగించి ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు. అదికూడా అందరికీ తెలుసు. అయితే చాలామందికి తెలియని సంగతి మరొకటి ఉంది. జంతువుల మీద ఎన్ని ప్రయోగాలు చేసినా, ఫలితాలు పొందినా మనుషులు ఆ మందులు వాడినప్పుడు చిన్నచిన్న కొత్త సమస్యలు తలెత్తడం కూడా మామూలే. అందుకోసం ప్రయోగాలు చెయ్యడానికి మనుషులు కూడా కావాలి. అయితే వారి వారి దేశాలలో మనుషుల మీద ప్రయోగం చెయ్యడానికి కొన్ని చట్టబధ్ధమైన పధ్ధతులున్నాయి. మన దేశంలో కూడా ఉన్నాయి. అయితే ఈ అతిధనిక వర్గానికి చెందిన కంపెనీలు పేదదేశాలలో నిరుపేద ప్రజలమీద కొత్త మందులు ప్రయోగించి వారిని ‘మానవ గినీ పిగ్స్’ గా వాడుకుంటున్నారు.”

“కానీ దానికి ఒక పద్ధతి ఉంది. ఎవరిమీదైతే ప్రయోగం చెయ్యదలుచుకున్నారో, వారు దానికి తమ సమ్మతినివ్వాలి. వారికి పూర్తిగా ఆ ఔషధం ఎలా పనిచేస్తుందో, వస్తే ఎలాంటి సైడ్ రియాక్షన్‌లు రావచ్చో అవన్నీ వాళ్ళకి వివరంగా తెలియ చెప్పాలి. వచ్చిన రియాక్షన్లకు వెంటనే ట్రీట్‌మెంట్ ఇవ్వగలిగే ఏర్పాట్లు రెడీగా ఉండాలి. అన్నీ విని, అన్నిటికీ సమ్మతించాకే వారి మీద ప్రయోగం చెయ్యాలి. అదీ పధ్దతి” మరో ఇన్స్పెక్టర్ నిరంజన్ అన్నాడు.

“అది చట్టప్రకారం ప్రయోగం చెయ్యవలసిన పధ్ధతి. పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం, అమాయకత్వం, వీటన్నిటికీ తోడు మూఢనమ్మకాలు అధికపాళ్ళల్లో ఉన్న మనదేశం లాంటి దేశాలలో మనుషులను గినీపిగ్స్‌గా వాడుకోవడం చాలా తేలిక. చట్టము పట్ల, తమ హక్కుల పట్ల ఎటువంటి అవగాహన లేని ప్రజలు పెద్దపెద్ద కంపెనీల ప్రయోగాలకు అతి చవకగా దొరికే ఎలుకలు. ఈ ఎలుకలకు, నీలాంబరికీ ఏమిటి సంబంధం అన్నది మీ అందరి మనసులలో మెదులుతున్న ప్రశ్న. నాకు తెలుసు.”

“సర్! మీరు చెప్పినదాన్ని బట్టి పేదదేశాల్లో నిరుపేదలు మల్టీనేషనల్ కంపెనీల ప్రయోగాలకు బలిపశువులవుతున్నారు. కానీ రాజేశ్వరరావు కొడుకు నీలాంబరి ద్వారా ఈ ప్రయోగానికి గురవడానికి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. దాదాపు అసంభవం. ఎందుకంటే మీరు చెప్పిన క్రైటీరియా – అంటే పేదరికం, నిరక్షరాస్యత, అజ్ఞానం, అమాయకత్వం ఇవేవీ రాజేశ్రరావులో కనిపించవు. మరి అతని కొడుకు గినీపిగ్ అవడానికి అవకాశం ఏదీ?” అన్నాడు అందరికంటే జూనియర్ మనోహర్.

“నేను చెప్పిన క్రైటీరియాలో మరొక్కటి మీరు మర్చిపోయారు. అదే మూఢనమ్మకం. రాజేశ్వర్రావు కొడుకు రమేష్ మానసిక వ్యాధిగ్రస్తుడు. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే స్కీజోఫ్రేనియా పేషెంటు. అంతేకాక హీమోఫిలియా అనే వ్యాధి కూడా ఉంది అతనికి. ఈ కారణాల వల్ల నీలాంబరి ద్వారా అతను కూడా ప్రయోగానికి గురయ్యాడని మనం ఊహించవచ్చు. రాజేశ్వర్రావు కూడా అదే చెప్పాడు. చిన్నతనం నుంచి కొడుకు అనారోగ్యం చూసి బాధపడుతున్న రాజేశ్వర్రావు, అతని భార్య మనశ్శాంతి కోసం ఆధ్యాత్మికత వైపు మళ్ళారు. ఆ సందర్భంగా నీలాంబరి భక్తులయ్యారు. ఏ దైశంలోనైనా భక్తి మూఢనమ్మకంగా మారడానికి ఎంతో కాలం పట్టదు. తరువాతి కథ మనం ఊహించవచ్చు. మన ఊహలు నిర్ధారించుకోడానికి మనం ఏం చెయ్యలంటే….”

నిగమ్ అక్కడ సమావేశమైన ఒక్కొక్కరికీ ఒక్కొక్క పని అప్పగించాడు.

హెలికాప్టర్ సిధ్ధంగా ఉందన్న సమాచారం రాగానే నిగమ్, తివారీ హెలిప్యాడ్ వైపు సాగిపోయారు.

***

“హాయ్ విమల్!” అన్నాడు యోగి చిన్న బేక్‌పేక్‌తో ప్రత్యక్షమైన విమల్‌ని స్వాగతిస్తూ. మల్లిప్రోలు వచ్చి తమందరితోపాటు నీలాంబరి మిస్టరీ చర్చిస్తూ సరదాగా గడుపుదువుగాని రమ్మని యోగి ఇచ్చిన ఆహ్వానం కాదనలేనంత ఆకర్షణీయంగా ఉండడంతో తన రొటీన్ నించి విరామం తీసుకుని వచ్చేసాడు విమల్.

“యోగీ, నువ్వూనేను ఆ పిజ్జా పేలెస్‌కి వెళ్ళిన రోజు మహత్యం ఏమిటోగానీ అప్పటి నుంచీ ఇంటర్వెల్ గానీ మన టీవీ వాళ్ళు చెప్పినట్టు చిన్న బ్రేక్ గానీ లేకుండా అన్నీ గొప్ప ఎగ్జైటింగ్ న్యూసులే”.

“రైట్. రాష్ట్రమంతా సంచలన వార్తలతో ఉడికిపోతోంది. ఇక్కడ నీలాంబరి దర్శనం కోసం లక్షమంది చేరినా దర్శనం కాలేదు. ఆరోజు మనకి అంత ఫ్రీగా ప్రత్యక్షమైపోయింది” నవ్వాడు యోగి.

“ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ న్యూస్, నీలాంబరి ఎక్కడుందో తెలియదు”.

“నీలాంబరి సంగతేమోగానీ రాజేశ్వర్రావు ఎక్కడున్నాడో తెలియక రాజధాని నగరంలో కలకలం రేగుతోంది”.

“అవునుమరి నీలాంబరితోనే ఉన్నాడు. ఆవిడ కనబడితే గానీ ఆయనా కనబడడు”.

“అదే మిస్టరీ. నీలాంబరి ప్రయాణంలో రాజేశ్వర్రావు లేడు. అదీ ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నవార్త.”

“లేక ఎక్కడికి పోయుంటాడు? సరేలే సామాన్య మానవులం ప్రస్తుతం మనకది అప్రస్తుతం. ఇంతకీ అతని కొడుకు ఆటోప్సీ రిపోర్టులన్నీ పూర్తిగా వచ్చాయా?”

“అసలు నేను నీకు ఫోన్ చేసిందే అందుకు. అతని శరీరంలో అన్నోన్ కెమికల్స్ ఏమిటో కొంత వరకూ ఎనలైజ్ చెయ్యగలిగారు. ట్రీటికా కంపెనీ పేరు వినే వుంటావు.”

“తెలుసు. అదొక మల్టీనేషనల్ ఫార్మస్యూటికల్ కంపెనీ.”

ఇప్పుడు నీలాంబరి కేసులో అప్పుడప్పుడు అనఫిషియల్‌గా వినిపిస్తున్న పేర్లలో ట్రీటికా ముఖ్యమైనది. నీలాంబరి వీళ్ళతో చేతులు కలిపి ఏవో ఔషధ ప్రయోగాలు చేసి ఉంటుందన్నది రాజధానిలో వినిపిస్తున్న పుకార్లలో ప్రధానమైనది” అన్నాడు విమల్.

“పుకార్లు కాకుండా మన ఎదురుగా సురేష్ చెప్పిన దాని ప్రకారం ఎవరో ఒక డిగ్రీ కాలేజ్ స్టూడెంట్ నితిన్‌కి నీలాంబరి విడుదల చేసిన మందులను అలవాటు చేసి ఉంటాడు. అయితే రాజేశ్వర్రావు కొడుకు ఈ ప్రయోగాల్లోకి ఎలా బలయ్యాడన్నది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. అంత పెద్ద పెద్ద వాళ్ళతో పరాచకాలాడితే అది నిప్పుతో చెలగాటం ఆడ్డమేనని తెలియదా నీలాంబరికి?” ఆలోచిస్తూ అన్నాడు యోగి.

“కానీ మనకు ఒక దానికొకటి సంబంధం లేనట్టు కనిపిస్తున్న సంఘటనలు కొన్నిటిలో ఒక పోలిక ఖచ్చితంగా ఉంది. అదేమిటో చెప్పనా?” విమల్ అన్నాడు.

“నువ్వేం చెప్తావో నేనూహించగలను. నితిన్, రమేష్, మెంటల్ హాస్పిటల్ పేషెంట్సు, ఇక్కడ నేను ట్రీట్ చేసిన రంగరాణి, గంగానమ్మవంటి యువతులు, మరో ఇద్దరు వృధ్ధులు ఇలా అప్పుడప్పుడు హఠాన్మరణాలుగా రిపోర్టయిన చాలా సంఘటనలలో దాదాపుగా మృతులందరూ స్కీజోఫ్రేనియా పెషంట్లే. ఈ పల్లెలో కూడా హఠాత్తుగా చనిపోయిన వారిని నీలాంబరి శిష్యులు ఏదో ఒక సందర్భంలో కలుసుకున్నారు. కాబట్టి ఇదేదో చిన్నా చితకా వ్యవహారం కాదు”.

“దేశవిదేశాలలో ప్రసిధ్ధి చెందిన ఒక ఆధ్యాత్మిక సన్యాసిని, ట్రిలియన్ల కొద్దీ డాలర్ల వ్యాపారం చేసే ఒక మల్టీనేషనల్ కంపెనీ, దేశంలో అత్యంత ధనవంతుల్లో ఒకడు, పెద్ద బిజినెస్ మేగ్నెట్ అయిన రాజేశ్వర్రావు ఇన్వాల్వ్ అయిన కుతంత్రం ఇది”.

“ఈ మిస్టరీ పూర్తిగా ఛేదించబడాలంటే అసలు నీలాంబరి ఎక్కడుందో తెలియాలి, అప్పుడు నిజాలు బయటపడాలి.”

“ఇంతకీ నీలాంబరి ఎక్కడున్నట్టు?”

***

నీలాంబరిలో అసహనం ఎక్కువైంది. చిన్న ఫోన్ కాల్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పి వెళ్ళిన సంకరుడు ఇంకా రాలేదు. ఎన్నో సౌకర్యాలకు అలవాటు పడిన శరీరం ఈ అడవిలో ఇబ్బందులకు ఇంక తాళలేక పోతోంది. ఇన్నాళ్ళూ యోగా మెడిటేషన్‌లతో తన శరీరాన్ని ఎటువంటి కష్టానికైనా తట్టుకునేలాగా తయారు చేసుకున్నా ననుకుంటోంది. కానీ శరీరం ఎంత కాదన్నా సుఖం మరిగింది. దీర్ఘంగా నిట్టూర్చింది. పొదల చాటు నుంచి వస్తున్న సంకరుడు కనిపించాడు. నవ్వు ముఖం చూస్తేనే తెలుస్తోంది గ్రీన్ సిగ్నల్ అని. “ఇంకో పావుగంటలో బహుశః మనం బయల్దేరవచ్చు. పైలట్ అన్నీ చెక్ చేస్తున్నాడు. రెడీ కాగానే వెళ్ళిపోదాం” అన్నాడు.

నీలాంబరి ఆలోచించింది. “పట్టుబడ్డవాళ్ళల్లో సుందరం చాలా ముఖ్యుడు. నోరు విప్పడనే ఆశిస్తున్నాను. అతని శిక్షణ అలాంటిది. కానీ ..”

“అతను నోరు విప్పకుండా చూసే బాధ్యత మన వాళ్ళుతీసుకున్నారు” సంకరుడు భరోసా ఇచ్చాడు.

“గీరూ వాగినా పరవాలేదు. వాడికి అంత ప్రాముఖ్యం లేదు. అన్నట్టు మా నాన్న? అసలే కొంచెం మెంటలు.”

“మీనాన్న బాధ్యత కూడా వాళ్ళదే” సంకరుడు మళ్ళీ భరోసా ఇచ్చాడు. “సెక్రటరీ శంకరం మరీ ముఖ్యం కదూ?”

“అతని బాధ్యత తీరిపోయింది” నవ్వాడు.

ఇప్పుడు తృప్తిగా నిట్టూర్చింది. పైలట్ పిలుపునందుకుని ముందుకు కదిలారు.

పురాణానందస్వామి, దేవభక్తానందస్వామి పాదాల్లో గుచ్చుకుంటున్న ముళ్ళను, అడ్డంగా పాక్కుంటూ వెళ్ళిన పామును లెక్కచెయ్యకుండా వీలయినంత వేగంగా, పరుగుపరుగున వచ్చారు హెలికాప్టరు దగ్గరికి.

నీలాంబరి ఎక్కబోతూ ఆగి, “పాపపు పుట్టలైన రాజకీయాలను వదిలి ఈ సుందరనందనకాననంలో కందమూలాలు భుజిస్తూ తపస్సు చేసుకుని మోక్షమార్గాన పయనించే ముముక్షువులుగా శేష జీవితం గడపండి” అని పైకెక్కేసింది. హెలికాప్టరు ఎగిరిపోయింది.

స్వాములిద్దరూ నోరు తెరుచుకు చూస్తూ నుంచుండిపోయారు.

అప్పటి వరకూ వీళ్ళని రహస్యంగా అనుసరిస్తున్న సిఐడి సిబ్బంది నిశ్శబ్దంగా స్వాములిద్దరినీ చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నారు. వారిద్దరూ ఇప్పుడు కూడా నోరు తెరుచుకు చూస్తూ ఉండి పోయారేగానీ ఏమీ మాట్లాడలేదు. ఏం మాట్లాడతారు?

హెలికాప్టరులో కూచున్న సంకరుడు జాన్సన్ కనపడకపోవడంతో కంగారు పడ్డాడు. తివారీ దగ్గరగా వచ్చి తనకు పిస్తోలు చూపించి కదలవద్దని హెచ్చరిస్తే ఎదురు చెప్పలేకపోయాడు. మరొక ఆఫీసర్ వచ్చి తన చేతులకు బేడీలు వేస్తుంటే తన హక్కులు కొన్ని గుర్తు చేసి అభ్యంతరం చెప్పాలనుకున్నాడు కానీ ఒక్క హక్కు కూడా గుర్తుకు రాలేదు ఆ సమయంలో.

భయంతో మాటపడిపోయిన నీలాంబరికి మాత్రం నిగమ్ ముఖం ఎక్కడో చూసినట్టనిపించింది. ఎక్కడో చటుక్కున గుర్తుకు రాకపోవడం సహజమే కదా ఆ సమయంలో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here