మనోమాయా జగత్తు-16

0
10

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 16వ అధ్యాయం. [/box]

[dropcap]“నీ[/dropcap]లాంబరి హెలికాప్టరు అదృశ్యం” పొద్దున్నే పిడుగులా వార్త ప్రజల్లోకి వచ్చి పడింది.

“నీలాంబరి హెలికాప్టరు బంగాళాఖాతంలో పడిపోయిందా?” అన్న ప్రశ్నతో ఆ రోజు తెల్లారింది దేశమంతటా.

కొందరు ఆ విషాదం భరించలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నారని చెప్పుకున్నారు. పుకార్లో నిజమో ఎవరికీ తెలియదు. మరికొందరు ‘పెరుగుట విరుగుట కొరకే అన్నట్టుగా అయింది నీలాంబరి జీవితం’ అని నిట్టూర్చారు. రాజకీయాల్లో ప్రవేశించకుండా ఉంటే ఇలా జరిగుండేది కాదు అన్నది ఇంకొందరి అభిప్రాయం. ప్రతిపక్షంవారు పట్టలేని సంతోషాన్ని పట్టి దాచిపెట్టి తమ దిగ్భ్రాంతిని ప్రజలకు అన్ని రకాల మీడియాల ద్వారానూ తెలియపరిచి రెండే రెండు నిముషాలు మౌనం వహించారు. అన్నిరంగాలలోని ప్రముఖులు తమ సంతాపాన్ని వెలిబుచ్చడానికి పోటీలు పడ్డారు.

‘మేము ముందునించీ చెప్తూనే ఉన్నాం’ అన్నారు ఎన్నికలొచ్చినప్పుడల్లా ఏ పక్షం వారి అవకాశాలెంతెంత ఉన్నాయో చెప్పడానికి ఉత్సాహపడే రాజకీయ జ్యోతిష్య వ్యాఖ్యాతలు – అక్కడికి తామే అభ్యర్ధులందరి తల రాతలు ఖచ్చితంగా రాసి రెజిస్టరు చేస్తున్నట్టు! వాళ్ళు ముందే ఏం చెప్పారో ఇవాళ ఎవరికీ ఎలాగూ గుర్తుండదు. కాబట్టి చెప్పే ఉంటారు అని జనం అన్వయించు కోవలసిందే.

నీలాంబరి హెలికాప్టరు క్రాష్ అయిపోయిందన్న పుకారు ఎందుకు వచ్చిందీ అంటే – ఆనాడు మల్లిప్రోలు తొక్కిసలాట సమయంలో ప్రత్యక్షమై చక్కర్లుకొట్టి వెళ్ళిపోయిన నీలిరంగు హెలికాప్టరు నీలాంబరిదే అన్న విషయం అందరికీ తెలిసినదే. అయితే అది అలా వెళ్ళిపోయిన తరవాత నిజంగానే బంగాళాఖాతంలో పడిపోయింది. అయితే అందులో సంకరుడు ఏర్పాటు చేసిన పైలట్ తప్ప నీలాంబరి గానీ, మరే ఇతర ప్రయాణీకుడు గానీ లేడన్న సంగతి ప్రపంచానికింకా తెలియదు. సముద్రంలో హెలికాప్టరు ముక్కలు దొరకడమే అతి కష్టమైపోయింది. మృతదేహాల గాలింపు ఇంకా కొనసాగుతూనే ఉంది.

ఆ హెలికాప్టరు పడి పోవడం కేవలం ప్రమాదవశాత్తూనేనా లేక ఒకప్పటి కారులాగా ఇది కూడా బాంబు పేలుడు వల్ల కూలిందా అన్న దర్యాప్తులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

అయితే ఆ హెలికాప్టరులో నీలాంబరి లేదు, ఆమె తమ కస్టడీలో భద్రంగా ఉంది అన్న విషయం నిగమ్ డిపార్ట్‌మెంటు వారు తమ పరిశోధనలు పూర్తిగా ముగిసే వరకూ బయటపెట్ట దలుచుకోలేదు దేశభద్రత దృష్ట్యా.

***

అకస్మాత్తుగా తన సెల్ తాళం తీసి లోపలికొస్తున్న పోలీసులను చూసి వొణికిపోయాడు సుందరం. గత రెండు రోజులుగా సుందరానికి నరకం రుచి చూపిస్తున్నారు. కేవలం నీలాంబరీమాత నామం ధ్యానిస్తూ వాళ్లు పెడుతున్న బాధలను గొంతు విప్పకుండా భరిస్తున్నాడు సుందరం. ఇంక తను భరించలేడు. ఇవాళ తన సహనం నశించచ్చు. ఏం మాటాడతాడో తనకే తెలియదు. కానీ నిజానికి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు నిజంగానే తనకు సమాధానం తెలియదు. చిత్రహింసలు తప్పించుకోడానికి తెలియని వాటికి కూడా ఏదోఒక జవాబు చెప్పి మరింత ఇరకాటంలో పడతానేమో అన్న భయం కూడా సుందరాన్ని కుంగదీస్తోంది.

పోలీసులు ముగ్గురూ దగ్గరగా వచ్చారు. ఎవరూ ఏమీ మాటాడలేదు. నిశ్శబ్దంగా వచ్చి సుందరం ముఖంమీద ముసుగు తొడిగారు. సుందరాన్ని నడిపించుకుంటూ తీసుకువెళ్ళి వేన్ ఎక్కించారు. గమ్యం చేరే ముందే వేన్ లోనే నిశ్శబ్దంగా మరణించాడు సుందరం.

పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ ప్రకారం సుందరం సైనైడ్ విషం వల్ల మరణించాడు. అయితే సుందరానికి సైనైడ్ ఎవరు ఇచ్చారు? అతనికి కాపలా కాస్తున్న జెయిల్ పోలీసుల్లోనే ఎవరో నీలాంబరి ఏజెంట్లున్నారా? రహస్యాలు ఏవైనా బయటపెట్టేస్తాడని భయపడి అతను గొంతు విప్పేలోగానే ఆ గొంతును ఎప్పటికీ తెరవకుండా మూసేసారా? ఈ ప్రశ్నలకు ప్రభుత్వమే జవాబు వెతుక్కోవాలి. ఆ వెతుకులాట ఎన్నేళ్లు సాగుతుందో ఎవరూ చెప్పలేరు.

అనాథగా పుట్టి పెరిగిన సుందరం అనామకంగా మరణించాడు. అంతే.

గీరూ వలన అతని సవతి తండ్రి కార్యకలాపాలమీద డేగ కన్నేసి ఉంచిన సిఐడి పోలీసులు అతని అక్రమ వ్యాపారాలు బయటపెట్టగలిగారు. అతను మాదకద్రవ్యాల వ్యాపారంలో అంతర్జాతీయంగా కీలకమైన వ్యక్తి. అతని కోసం వచ్చే వ్యక్తులు, గీరూ కూడా ఇటువంటి వ్యవహారాలు చాకచక్యంగా నడపగలడని గ్రహించి అతన్ని తమ మరోరకం వ్యాపారంలో వాడుకున్నారు. ఆ వ్యాపారానికి నీలాంబరితో సంబంధం ఉండడం అప్పట్లో కేవలం అతని అదృష్టం. అయితే పూర్తిగా వికసించకుండా పోలీసుల చేతిలో పడడం ఇప్పటి దురదృష్టం.

సుందరాన్ని తరలించినట్టే గీరూని కూడా పేరులేని మరో జైలుకు తరలించారు. అక్కడ చిత్రహింసలు అనుభవించేకొద్దీ తనెంతో ధృఢంగా, కఠినంగా, టఫ్‌గా తయారవుతున్నానని సంతోషించాడు గీరూ.

సుందరం, గీరూలతో పాటు అరెస్ఠయిన ఇతరులకు కూడా అదే రకపు ఆతిథ్యం లభించింది. వారినించి చాలా విలువైన సమాచారం రాబడుతున్నారు నేరవిబాగపు పోలీసులు.

ఏ మాత్రం ప్రచారం లేకుండా రహస్యంగా, నిశ్శబ్దంగా నీలాంబరి ఆశ్రమం మీద దాడిచేసిన పోలీసులకు తన గదిలో రాత్రికిరాత్రే నిద్రలో మరణించిన వెంకట్రావు దేహం దొరికింది. ఆపీసు పనికే అంకితమైన సెక్రటరీ శంకరం అదే రోజు ఆఫీసులో నీలాంబరి అధిరోహించే సింహాసనం ముందు మోకాళ్ళమీద కూచుని తల సింహాసనంలో పెట్టి మరణించినట్టు కనుగొన్నారు.

అశ్రమం బీరువాల్లో అంతులేని ధనం డాలర్లు, రూపాయలు రూపంలో దొరికింది. ఆశ్రమం గోడల్లో నిర్మింపబడ్డ లాకర్లలో బంగారం దొరికింది. వాటి విలువ ఇంకా లెక్కలు కడుతున్నారు.

***

జరుగుతున్నపరిణామాలు ప్రతిఒక్కరిలోను ఉత్కంఠ పెంచుతూనే ఉన్నాయి. సస్పెన్స్ భరించలేని యోగి నిగమ్ నంబర్‌కు ఫోన్ చేసాడు. నో రెస్పాన్స్. “నిగమ్ ఇంత ముఖ్యమైన కేసులో పని చేస్తూ నా ఫోన్ కాల్స్ ఆన్సర్ చేస్తాడని అనుకోలేదు కానీ ఏంటో… బై ఛాన్స్… ఎందుకైనా… కాస్త తీరిగ్గా ఉంటే ఫోన్ తీస్తాడేమోనన్న ఆశ కొద్దీ అతనికి రింగ్ చేసాను. కానీ ఆన్సర్ చెయ్యడనే అనుకున్నా” అన్నాడు యోగి. “అతను మొదట మనతో చెప్పినట్టు కేవలం ఇన్‌స్పెక్టర్ కాదనుకుంటా” అనుమానంగా అన్నాడు విమల్. “నిజమే. ఏ కమిషనర్ లెవెల్ రేంక్ వాడో ఇంకా పెద్ద రేంక్ ఉంటే ఆ రేంక్ వాడో అయ్యుండాలి” యోగి అన్నాడు.

“అంతటివాడు, అంతర్జాతీయ నేరస్తులని పట్టుకోవడంలో పరమ బిజీగా ఉన్నవాడు ఈ పల్లెటూరి నుంచి ఓ ప్రభుత్వ డాక్టరు ఫోన్ చేస్తే తీసి మర్యాదగా తను చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా వివరంగా చెప్తాడనుకున్నావా? నా తండ్రే!” వెక్కిరించాడు విమల్.

విమల్ మాటలు పూర్తికాకుండానే ఘల్లున మోగింది యోగి సెల్.

సెల్ ఆన్ చేసి, “హలో నిగమ్ సార్!” అన్నాడు యోగి. బిత్తరపోయినట్టు ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు విమల్.

యోగి స్పీకర్ బటన్ నొక్కడం వల్ల నిగమ్ మాటలు అక్కడున్న వాళ్ళందరికీ స్పష్టంగా వినిపించాయి.

“హలో డాక్టర్ యోగి! నీలాంబరి కేసు మిస్టరీ గురించి అడగాడానికే మీరు ఫోన్ చేసారనుకుంటున్నాను. ఇంకొక్క టెన్ డేస్‌లో ఐ కెన్ గివ్ డీటెయిల్స్. పదిరోజుల తర్వాత మళ్లీ మీకు ఫోన్ చేస్తాను”.

“హుర్రే!” చిన్నపిల్లాడిలా అరిచాడు యోగి. వింటున్న వాళ్ళందరికీ నవ్వొచ్చింది.

***

ఒక్కొక్కటిగా నీలాంబరి వార్తలు నెమ్మదిగా బయటపెట్టారు పోలీసు వర్గాలు.

నీలాంబరి తను గురువుల దగ్గర నేర్చుకున్నాను అని చెప్పి రకరకాల మూలికా వైద్యాలు చేస్తుండేది. ఆవిడ మీద మూఢ విశ్వాసంతో, భక్తితో ఇదేమిటి అని ప్రశ్నించకుండా ఆవిడ చెప్పినట్టే ఆ నాటు మందులు ఉపయోగించేవారు. కొందరికి పని చేసేవి. కొందరికి ఫలితం ఉండేదికాదు. తను ఏం మందిచ్చినా, ‘మీరు వాడుతున్న ఇంగ్లీషు మందులు కూడా వేసుకోండి ఏం ఫరవాలేదు’ అని చెప్తుండేది నీలాంబరి. తగ్గిన వారికి నిజంగా ఏ మందు వలన తమ రోగం తగ్గిందో తెలియకపోయినా నీలాంబరిని ఆశ్రయించాక, ఆవిడ దయవలనే తగ్గిందని అనుకుని అలాగే చెప్పుకునేవారు. ఒకరి నుంచి ఒకరికి నోటిమాట ద్వారా నీలాంబరి మహత్యాలు చాలా ప్రచారమయ్యాయి. వాటిలో ఎన్ని నిజమో, ఎన్ని అబధ్ధాలో, స్వప్రయోజనాల కోసం ఏ అనుచరులు ప్రచారం చేసారో ఎవరికీ తెలిసేది కాదు. మొత్తం మీద నీలాంబరిని ఆశ్రయించడం వల్ల చాలా మందికి చాలా ప్రయోజనాలు చేకూరాయి. వ్యాపారాభివృధ్ధి కోసం దేశవిదేశీ ప్రముఖులతో పరిచయాలే కాక నిఘా వర్గాల డేగకన్ను పరిధిలో లేకుండా ఎవరితో ఎవరు సమావేశమవ్వాలన్నా నీలాంబరి ఆశ్రమమే ఆశ్రయం. రాజకీయ ప్రయోజనాలు సాధించాలంటే నీలాంబరి ఆశ్రమం ఎంత క్షేమకరమో అనుభవ పూర్వకంగా చాలా మంది తెలుసుకున్నారు.

విదేశీ వ్యాపారవర్గపు భక్తుల వల్లనే నీలాంబరి తన సొంత మందులతో చేస్తున్న ప్రయోగాలకు రహస్యంగా విస్తృత ప్రచారం జరిగింది. ఆ వొరవడిలో ట్రీటికా కంపెనీ వారి దృష్టినాకర్షించింది నీలాంబరి. ఆ కంపెనీ శాస్త్రజ్ఞుల పరిశోధనలలో రెండు కొత్త మందులు తయారు చేసారు. వాటిని మనుషుల మీద ప్రయోగించి ఫలితాలు తెలుసుకోవాలంటే నీలాంబరి వల్లనే సాధ్యం అని నిర్ణయించారు. చట్టాలు, హక్కులు పట్ల ఏ మాత్రం అవగాహనలేని ప్రజలమీద ఏ ప్రయోగమైనా చెయ్యవచ్చునన్న అహంకారపు ప్రవృత్తి సంపన్న దేశాలలోని సంపన్నులది. ఆ అహంకారానికి కావలసిన ఆజ్యం పోసి అక్రమార్జన చేసే ధనవంతులకూ ఈ విశాల ప్రపంచంలో లోటులేదు.

మరి నీలాంబరికి ట్రీటికా వారితో చేతులు కలపడానికి గానీ ట్రీటికా వారికి నీలాంబరికి ప్రజలమీద ఉన్న ప్రభావాన్ని ఉపయోగించుకోడానికి గానీ అభ్యంతరం ఏముంది? ఇద్దరూ కలిసి చాలా కథ నడిపారు. కథలన్నీ కంచికెళ్ళిపోతుండే దేశంలో పుట్టిన నీలాంబరి తను సమాజం కళ్లముందునుంచి కనబడకుండా పారిపోయే పరిస్థితికి వచ్చింది.

***

పదిరోజుల తరవాత నిజంగానే నిగమ్ పేరు డిస్‌ప్లే చేస్తూ యోగి ఫోను మోగింది. అప్పుడే ఓపి క్లోజ్ చేసి తన క్వార్టర్స్ లోకి నడుస్తున్నయోగి “హలో సార్!” అని ఉత్సాహంగా అరిచాడు ఫోన్‌లో.

“హాయ్ డాక్టర్! నేను మల్లిప్రోలు వస్తే నాకు ఆతిథ్యమివ్వగలరా?” నిగమ్ ప్రశ్నఆనందం కలిగించినా, దానికన్నా ఆశ్చర్యం ఎక్కువ కలిగించింది.

వాట్?!! అనబోయి, ఆపుకుని “ష్యూర్.ష్యూర్” అన్నాడు యోగి.

“బ్రిటిష్ కాలం నాటి మా ట్రావెలర్స్ బంగళా కమ్ గెస్ట్ హౌస్ కాదు. మీ క్వార్టర్స్, మీ వంటాయన వండిన భోజనం. ఈ రెండూ ప్రొవైడ్ చేస్తానంటే వస్తాను. నాక్కూడా నీలాంబరి లాగా హైడింగ్ లోకి వెళ్లిపోవాలని ఉంది. ఐ వాంట్ టు రిలాక్స్” చాలా సరదాగా వినపడింది నిగమ్ గొంతు.

“తప్పకుండా మీరు వస్తాననాలేకానీ ఊళ్లోకెల్లా బెస్ట్ వంటాయన్ని పిలిచి వంటలు చేయిస్తాను” అన్నాడు యోగి ఉల్లాసంగా.

“అయితే నీలాంబరి హైడింగ్ లో ఉందంటారా?” కుతూహలం ఆపుకోలేక అడిగేసాడు యోగి.

“ఆశ! దోసె! అప్పడం! వడియం! అడగంగానే చెప్పేస్తాననుకున్నారా? ముందు ఆతిథ్యం, తరవాతే కథాంతం. ఇంకొక్క పదిరోజులు వేచి యుండండి” ఊరించాడు నిగమ్.

***

తను అన్నట్టుగా పదిరోజుల తరవాత కాదు గానీ ఇరవై రోజుల తరవాత తను వస్తున్నట్టుగా ఫోన్ చేసాడు నిగమ్. అంతకు ముందే నిగమ్ ఎప్పడు వస్తే అప్పుడు రావడానికి రెడీగా ఉండమని విమల్‌కి, వినాయకరావుకీ చెప్పి ఉంచాడు యోగి. వినాయకరావు కబురందుకుని సుశీల, సిరి,విరి కూడా వచ్చారు.

రాత్రి డాబా మీద వెన్నెల్లో అందరికీ కుర్చీలు వేయించాడు యోగి. అందరూ నిగమ్ ఏం చెప్తాడా అని ఉత్కంఠతో ఉన్నారు. అందరి ముఖాల్లోకి చూసి నిగమ్ చిరునవ్వు నవ్వాడు.

“మీ అందరి జీవితాల్లోకీ నీలాంబరి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ప్రవేశించింది. అందుకని నీలాంబరి అసలు చరిత్రను తెలుసుకోవాలని మీకు ఆసక్తిగా ఉండడం నేను అర్థం చేసుకోగలను. అందుకే మీకు మేమింతవరకూ కనుక్కున్న వాస్తవాలు చెప్పడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఇప్పటివరకూ కొన్ని ప్రెస్ మీట్‌లు పెట్టి రివీల్ చేసిన సంగతులు మీకు తెలుసు. నీలాంబరి తనే తయారుచేసానని మందులు పంచి పెడుతుంటే ఆవిడను నమ్మిన భక్తులు నిరభ్యంతరంగా తమ రోగాల నివృత్తికోసం వాటిని వాడుతున్నారు. భక్తుల మీద నీలాంబరి కున్న ప్రభావం ట్రీటికా వారి దృష్టిలోకి వచ్చింది. వారికి ప్రయోగాలు చేసి పెట్టడానికి నీలాంబరిని ఉపయోగించుకోవాలనుకున్నారు. నీలాంబరికి మిలియన్లు, బిలియన్లు కొద్దీ డాలర్లు గుమ్మరించారు. తన కార్యకర్తలు, సేవకుల ద్వారా పక్కా ఏర్పాట్లు చేయించింది నీలాంబరి”.

“ఇంతకీ ఏ రోగాలకు ట్రీటికా కంపెనీ వాళ్ళు కొత్తగా మందులు కనిపెట్టారు?” ఆసక్తిగా అడిగాడు యోగి.

“స్త్రీలలో వచ్చే కొన్నిరకాల కేన్సర్లకి ఒకే మందు పనిచేసే విదంగా కనిపెట్టామన్నారు వాళ్ళ పరిశోధకులు. మరొకటి స్కీజో ఫ్రేనియా అనబడే మానసిక వ్యాధికి.”

“ఓ!” అందరూ ఒకేసారి ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

“అదీ సంగతి. అందుకే అంతగా ఎగబడడ్డారు జనం తమ తాలూకు మెంటల్ పేషెంట్సును తీసుకుని” అన్నాడు వినాయకరావు.

“అయితే, కాళిదాసు కవిత్వం కొంత నా పైత్యం కొంత అన్నట్టు కొందరి మీద నీలాంబరి తన సొంత ప్రయోగం కూడా కంబైన్ చేసింది. హీమోఫిలియా రోగం కూడా ఉన్న స్కీజోఫ్రేనియా పేషెంట్ల వివరాలు సేకరించి వారిమీద ట్రీటికా వారి మెడిసిన్‌తో పాటు తన మూలికాలేహ్యం కూడా కలిపి ప్రయోగించింది”.

“హీమోఫిలియా అంటే ఏంటి?” విరి కుతూహలం చూపించింది.

“ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి రక్తం తొందరగా గడ్డకట్టదు. అంటే చిన్న దెబ్బతగిలి రక్తస్రావం మొదలైనా అది ఇంక ఆగకుండా ప్రవాహం అవుతుంది. అంతే కదండీ డాక్టరుగార్లూ?” నిగమ్ యోగినీ విమల్‌నీ కలిపి చూస్తూ అడిగాడు.

“రైట్. అయితే అందులో కూడా లెవెల్సుంటాయి. కొందరికి ఆ సమస్య తీవ్రంగా ఉంటుంది. కొందరికి మైల్డ్‌గా ఉంటుంది. ఇంతకీ అవేం మందులో ఎనాలిసిస్ చెయ్యగలిగారా?” విమల్ అడిగాడు.

“మా సిఐడి విభాగం వారు ఫోరెన్సిక్ నిపుణులు కలిసి ప్రెస్ మీట్‌లో వెల్లడించిన వివరాలు రేపు అన్ని న్యూస్ ఛానెల్స్ లోనూ ప్రసారమవుతాయి. నేను మీకు పూర్తి వివరాలు ఇప్పుడు కెమికల్ నేమ్స్‌తో సహా ఇవ్వలేను”.

“అంత డీటెయిల్స్ అక్కర్లేదుకానీ అసలు సంగతి చెప్పండి. ఇంకా ఉంది ఈ వ్యవహారం వెనక భాగోతం”. అన్నాడు వినాయకరావు.

“చెప్తాను. ట్రీటికా వారు కనుక్కున్న కేన్సర్ డ్రగ్‌ను మొదట జంతువుల మీద ప్రయోగించారు. అది జంతువులలో సంతానోత్పత్తి శక్తిని అత్యధికంగా, విపరీతంగా పెంచింది. ఇంకా ప్రయోగాలు చెయ్యాల్సి వచ్చింది. అయితే ఆ మందులోని ఈ విచిత్ర శక్తిని, అంటే సంతానోత్పత్తిని విపరీతంగా పెంచడం అనే శక్తిని ‘మానవకళ్యాణం కోసం సదుపయోగం చెయ్యగలను, మందులోని విచిత్ర లక్షణాన్ని వైశిష్ట్యంగా మార్చగలను మరే ప్రయోగాలు అవసరం లేదు’ అని మార్పులు లేకుండా ఆ మందును తన వద్దకు సంతానభాగ్యం కలగజెయ్యమని అర్ధిస్తూ వచ్చే భక్తులమీద ప్రయోగించింది నీలాంబరి. నడి వయసు స్త్రీలు సంతానం పొంది నీలాంబరిదేవి మహత్యాన్ని వేనోళ్ళ ప్రచారం చేసారు. అయితే ట్రీటికా కంపెనీ వారు చేసిన ఇంకొన్ని ప్రయోగాల్లో ఆ మందు కేన్సరు లేని స్త్రీలలో వాడితే వాళ్ళలో కేన్సరు కలగచేస్తోందని కనుగొన్నారు. అప్పటికే చాలామంది ఆ మందు వాడారు. నీలాంబరి భారతీయ దృక్పధంతో ఆలోచించానని తనను తాను సమర్థించుకుంది. పిల్లల్లేక గొడ్రాలన్న బిరుదుతో కుంగి పోతున్న స్త్రీకి సంతాన భాగ్యం కలగచెయ్యడంకన్నా మహోపకారం మరొకటిలేదు. తల్లిగా కొన్నాళ్ళు జీవితానందం సంపూర్ణంగా అనుభవించాక కేన్సరో హార్టెటాకో వచ్చి పోతే మాత్రం ఏముంది? ఎలాగూ అంతా పోవలసిన వాళ్ళమే కదా? కొంచెం ముందుపోతారు. అంతే! గొడ్రాలుగా కలకాలం జీవించడం కంటే సంతానవతై అర్ధాయుష్కులవడానికే ఇష్టపడతారు భారతీయ మహిళలు అన్నది ఆవిడ ఫిలాసఫీ. అలా నీలాంబరి ట్రీట్‌మెంటుతో సంతానభాగ్యం పొంది ఇప్పుడు కేన్సరు బారిన పడిన వారు ముగ్గురు మహిళలు తేలారు ఇప్పటికి”

“మరి నితిన్ మొదలైన స్కీజోఫ్రేనియా పేషంట్ల విషయంలో నీలాంబరి కనెక్షన్ ఏమిటి?” వినాయకరావు ప్రశ్నించాడు.

“ఇందాక చెప్పినట్టు స్కీజోఫ్రేనియా మందుల్లో ఆవిడ మూలికావైద్యం కలపడం ట్రీటికాని, నీలాంబరినీ పట్టిచ్చింది. కేవలం కేన్సరు మందు ప్రయోగంతో ఊరుకుని ఉంటే ఇంత తొందరగా బయటపడేదికాదు ఈ వ్యవహారం. రాజేశ్వర్రావుకొడుకు రమేష్‌కు హీమోఫిలియా వ్యాధి ఉండేది. అతని మీద కూడా తన మందు ప్రయోగం చేసింది. రమేష్ మరణించడంతో రాజేశ్వర్రావు కళ్ళు తెరుచుకున్నాయి. తమకు జరిగిన అన్యాయం మరే తల్లిదండ్రులకూ జరగ కూడదన్న ధ్యేయంతో అతను నీలాంబరిమీద నమ్మకం పోనట్టు నటిస్తూనే ఆశ్రమం కార్యకలాపాల గురించి చాలా ఇన్పర్మేష,న్ సంపాదించి మాకిచ్చాడు. నితిన్, ఇంకా ఇతర మెంటల్ పేషంట్ల మరణం పరిశోధించగా అసలు సంగతి బయటపడింది. ఈ మరణాల్లో నితిన్ తప్ప మిగిలిన అందరూ హిమోఫిలియా పేషంట్లే. అయితే నీలాంబరి ట్రీటికా వారిదీ, తనదీ కలిపి ఇప్పించిన మందుల్లో హఠాన్మరణాన్ని కలిగిస్తున్నది నీలాంబరి వాడిన శీఘ్రఘనరక్తకి(ఈ మొక్కపేరు కేవలం కల్పితం ఇటువంటి ఔషధమొక్క లేదు) అనే మెడిసినల్ ప్లాంట్ ఎక్స్‌ట్రాక్ట్ అని అనుమానిస్తున్నారు నిపుణులు. ఈ ఔషధమొక్కనించి చేసిన లేహ్యం వలన హీమోఫిలియా జబ్బుకు వైద్యం జరపవచ్చుననుకుంది నీలాంబరి. ట్రీటికావారు తాము తయారు చేసిన స్కీజో ఫ్రేనియా మందు ఎవరిమీద ప్రయోగించాలో రహస్యంగా లిస్టు తయారు చేసుకుని నీలాంబరికి అందించారు. వాళ్ళల్లోనే కొంతమంది హీమోఫిలియా పేషంట్లున్నట్టు గమనించింది నీలాంబరి. ట్రీటికా వారి మందుతో తన మందూ కలిపి ప్రయోగించింది”

“ఆ శీఘ్రఘనరక్తకి మందేదో కేవలం హీమోఫిలియా పేషంట్ల మీదే ప్రయోగించచ్చుగా? మెంటల్ ప్రాభ్లెమ్ ఉన్న హీమోపిలియా వాళ్ళనే ఎందుకు ఎంచుకుంది? స్కీజోఫ్రేనియా ప్లస్ హీమోఫిలియా కాంబినేషన్ ఎందుకు తీసుకుంది తన ప్రయోగానికి నీలాంబరి?” అందరి మనసుల్లోనూ ఒకేసారి మెదిలిన ప్రశ్నను సిరి అడిగింది.

“మెంటల్ పేషంట్లకి ఏదైనా వికటించినా ఎవరూ పట్టించుకోరని ధీమా!అంతకంటే పెద్ద కారణం ఏదీ లేదు. దీర్ఘ కాలంగా వేధించే మానసిక వ్యాధిగ్రస్తులతో ఎంతోకొంత విసిగిపోయి ఉంటారు కుటుంబసభ్యులు, కాబట్టి వాళ్ళు హఠాత్తుగా మరణించినా ఎందుకిలా జరిగింది అనుకుంటూ పోలీసులనెవరూ ఆశ్రయించరు, కారణాలు వెతకరు అని గట్టిగా గుడ్డిగా నమ్మింది నీలాంబరి. అందుకే హీమోఫిలియా మందు ప్రయోగానికి మానసికరోగులనే ఎంచుకుంది. ఈ శీఘ్రఘనరక్తకి మందు తీసుకున్న పేషంట్లలో మొదట్లో అధిక రక్తస్రావం సమస్య తీరినట్టే కనిపించినా, కొన్ని రోజులకి హఠాత్తుగా శరీరంలో మొత్తం రక్తం ఒకేసారి గడ్డ కట్టుకు పోయి మరణాలు సంభవిస్తున్నాయి అని నిపుణులు తేల్చారు” చెప్పడం ఆపి మంచినీళ్ళ గ్లాసందుకున్నాడు నిగమ్.

శ్రోతలకు తాము విన్నదంతా అవగాహన చేసుకోడానికి కొంతసమయం పట్టింది.

“నమ్మలేని నిజాలంటే ఇవే. ఎక్కడో విదేశాల్లోని మందుల కంపెనీవాళ్ళేమిటి, ఇక్కడి నీలాంబరి చెయ్యి కలపడమేమిటి? జనాల ప్రాణాల మీదకి రావడమేమిటి?” అంది వాణి.

“నువ్వు అసలు ముఖ్యమైన పాయింటు మర్చిపోతున్నావ్ అమ్మమ్మా! ట్రీటికా కంపెనీవాళ్ళకి పేద దేశాలంటే లోకువ. మన దేశపు మనుషుల ప్రాణాలతో చలగాటం ఆడుకోడం వాళ్ళ హక్కనుకుంటారు” విరి కోపంగా అంది.

“అలాంటివాళ్ళకి నీలాంబరిలాంటి వాళ్ళు సాయపడతారే, అదింకా సిగ్గుచేటు” అంది సిరి.

“డాక్టర్ యోగీ, నేను మిమ్మల్ని కంగ్రాట్యులేట్ చెయ్యక తప్పదు. ఆరోజు రమేష్ మీద కత్తిపోట్ల దాడి జరిగినప్పుడు మీరు చేసిన ఒక కామెంట్ ఈ పరిశోధనకు నాంది పలికింది” అన్నాడు యోగివైపు అభినందనగా చూస్తూ.

“ఏ కామెంట్? చాలా తొందరగా రక్తం గడ్డ కట్టిపోయింది అని యోగి రిపీటెడ్‌గా అనడమేనా?” హుషారుగా అడిగాడు విమల్.

“ఏస్. అదే అందరిలోనూ ఆలోచనలురేపింది.”

“ఆ ఒక్క మాట ఆధారంగా మీరు పరిశోధన మొదలుపెట్టారా.?”

“నేను కాదు. మీరు ఆ కామెంట్ చేసినప్పుడు మొదటి సారి రాజేశ్వరరావు విన్నాడు. తరవాత కూడా మీరా పాయింటు స్ట్రెస్ చేసి రిపీటెడ్‌గా అన్నట్టు అతనికి ఎవరో చేరవేసారు. అఫ్ కోర్స్! నాకు కూడా అదే కామెంటు టేకాఫ్ పాయింట్ లాగా పని చేసింది. తరవాత కొన్నిగంటల్లోనే రాజేశ్వర్రావు మమ్మల్ని కాంటాక్ట్ చేసి నీలాంబరి మీద ఇన్వెస్టిగేషన్‌లో మాతో చేతులు కలిపాడు.”

వింటున్న శ్రోతలందరూ యోగిని అభినందనలతో ముంచెత్తారు.

“అయితే నితిన్ కూడా హీమోఫీలియా పేషెంటేనా?” విరి అడిగింది.

“సరైన ప్రశ్న అడిగావు. ఈ సందేహం ఎవరికీ రాలేదేమిటా అనుకుంటున్నాను. నితిన్ హీమోఫిలియా రోగి కాదు. నీలాంబరిని నేరాన్ని పట్టచ్చినది ఆవిడ నిర్లక్ష్యమే. మెంటల్ పేషంట్లు మరణించినా ఎవరూ పట్టించుకోరు అన్న నిర్లక్ష్యం మొదటి పొరబాటు. నితిన్‌కి హీమోఫిలియా రోగం ఉందో లేదో నిర్ధారించుకోకుండానే అతని మీదా మందులు ప్రయోగించడం రెండవ పొరబాటు. నేరస్థులను వాళ్ళు చేసే చిన్నచిన్న పొరపాట్లే పట్టిస్తాయని మరోసారి ఋజువయింది. పైగా ఇక్కడ మరో విషయం కూడా నిపుణులకు అనుమానం కలిగించింది. ఇలా హఠాత్తుగా మరణించిన వారందరిలోనూ బ్లడ్ కేన్సర్ ఆరంభదశలో ఉన్నట్టు బయటపడింది. ఇది నీలాంబరి మందు మహత్యమో, ట్రీటికావారి మిడిమిడి పరిశోధనల పలితమో ఇంకా తేలాల్సి ఉంది” అన్నాడు నిగమ్.

 “అయ్యయ్యో! కోట్లకొద్దీ డబ్బు బహుమతిగా తీసుకుని విదేశీయుల ప్రయోగాల కోసం మనదేశ ప్రజల ప్రాణాలను జంతువుల కంటే హీనంగా బలిపెట్టిందా నీలాంబరి? ఇంతకీ ఆ నీలాంబరి ఆచూకీ పట్టారా మీ సిఐడి బలగాలు?” అడిగాడు వినాయకరావు.

“రాజమండ్రిలో హెలికాప్టరు దిగి, కార్లో సన్నప్రోలు బయల్దేరింది నీలాంబరి. అటునుంచి మల్లిప్రోలులో బహిరంగ సభ జరపాలని కదా ప్లాను. అయితే అప్పటికే మా సిఐడిలు నీలాంబరి ఏజంట్లను హడావిడేం లేకుండా నిశ్శబ్దంగా రౌండప్ చేసి తీసుకుపోవడం మొదలైంది. నీలాంబరి కాన్వాయ్‌లో ఉన్న స్వాములకు సమాచారం అందించారెవరో. అంతే! కారుని హైవే మీంచి మళ్ళించి అడవుల్లోకి తీసుకుపోయాడు ట్రీటికా వారి ఏజంటు. అదే కారు మల్లిప్రోలు హైవే మీద బాంబుతో పేలిపోయిన వార్త అందికీ తెలుసు. అడవిలో సేఫ్‌గా కూచున్న నీలాంబరి రాజేశ్వర్రావుని సెల్ ఫోన్లో కాంటాక్ట్ చేసింది. నిముషాలమీద ఆవిడ రహస్య స్థావరం మాకు తెలిసిపోయింది. అదే సమయంలో నీలపురంగు హెలికాప్టర్ బంగాళాఖాతంలో క్రాష్ అయిందన్న సమాచారం వచ్చింది. అయితే పేలిపోయిన నీలాంబరి కారులో నీలాంబరి లేనట్టే క్రాష్ అయిన నీలం హెలికాప్టరులో నీలాంబరి లేదని మాకు తెలుసు. ఎందుకంటే అప్పటికే ఆమె మా చేతికి చిక్కింది కాబట్టి” అని నవ్వాడు నిగమ్.

“నేననుకోవడం ఇలా సంపన్నదేశాల కంపెనీలు పేదదేశాల ప్రజల మీద ప్రాణాంతకమైన ప్రయోగాలు చెయ్యడం కొత్తగా జరుగుతున్న సంగతి కాదు. ఇది చాలా కాలంగా జరుగుతున్నదే. ఇప్పుడు యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనలవల్ల తీగకదిపితే అన్నట్టు డొంకంతా కదిలి సంగతంతా బయటపడింది. నీకు గుర్తుందా విమల్, మనం స్టూడెంట్స్‌గా ఉన్నప్పుడు మెంటల్ హాస్పిటల్‌లో జరిగిన ఒక సడన్ డెత్ ఇన్సిడెంట్?”

“యా.యా. నాకు బాగా గుర్తుంది. చాలా ఇంప్రూవ్ అవుతున్నాడనుకున్న పేషెంటు హఠాత్తుగా చనిపోయాడు. ఇంకో పేషంటు అదే రోజు ఆస్పత్రినుంచి తప్పించుకు పారిపోయాడు. ఆ పారిపోయిన పేషెంటుని ‘ప్రొఫెసర్’ అని పిలుస్తుండేవారు హాస్పిటల్ సూపరిండెంట్ డా. నారాయణ. ఆరోజుల్లో ఫోరెన్సిక్ సైన్స్‌లో ఇప్పుడున్నన్ని ఎడ్వాన్స్‌డ్ మెధడ్స్ ఉండేవి కావు. హఠాత్తుగా ఆ పేషెంటు చనిపోవడానికి కారణం తెలియలేదు. తరవాత ఒక నర్స్ మిస్టీరియస్‌గా చనిపోయింది. డా. నారాయణని హత్య చేసేసారు. హత్య చేసినది ఎవరో ఫారినర్స్ అని చెప్పాడప్పట్లో ఒక వాచ్‌మన్” విమల్ తనకు గుర్తొచ్చిన సంఘటనల పరంపర చెప్పేసాడు.

“అప్పుడు ఏదీ ఋజువు కాలేదు కానీ అది కూడా ఇలాగే విదేశీ కంపెనీల మందుల ప్రయోగాల స్కాండల్‌గా వార్తల్లో కెక్కింది. అంతా ఊహాగానాల స్థాయిలోనే ఆగిపోయింది. అప్పటి పోలీసులు చాలా తొందరగానే ఆ ఫైల్స్ క్లోజ్ చేసేసారు” అన్నాడు యోగి.

“ఆ పారిపోయిన పేషెంట్ ప్రొఫెసర్ నిజంగానే మెంటల్ హాస్పిటల్లో చేరకముందు మేథ్స్ ప్రొఫెసర్‌గా చేసేవాడని లెజెండ్ ఉండేది.” అన్నాడు విమల్.

చటుక్కున, “ఆ పేషంట్ ప్రొఫెసర్ పేరేమిటో గుర్తుందా డాక్టరుగారూ?” అడిగాడు వినాయకరావు. యోగి, విమల్ ముఖాలు చూసుకున్నారు.

“నీకు గుర్తుందా?” అడిగాడు విమల్.

“ప్రొఫెసర్” తనలో తనుగొణుక్కుంటూ గుర్తు తెచ్చుకోడాని ప్రయత్నించాడు యోగి.

“యస్! ప్రొఫెసర్ అనంతం!” ఒకేసారి అరిచారు యోగి, విమల్.

పక్కనే పిడుగు పడ్డట్టుగా అదిరిపడ్డారు వినాయకరావు, వాణి, సుశీల.

***

మరో నెలరోజుల తరవాత నిగమ్ దగ్గర్నుంచి యోగికి ఫోన్ కాల్ వచ్చింది. “డాక్టర్ యోగీ, నీలాంబరి ఆశ్రమం సీల్ చేసి, అక్కడ ఉంటున్న సన్యాసులందరినీ మా కస్టడీలోకి తీసుకున్నాం. వాళ్ళల్లో ఒక పెద్దవయసాయన కూడా ఉన్నాడు. ఆయన్ని ఆశ్రమవాసులు మౌనానందస్వామి గా పిలుస్తుంటారని తెలిసింది. ఏమీ మాట్లాడడు. అలా కూచుని ఉంటాడు. అతనిమీద నీలాంబరి తన సొంతమందులు చాల ప్రయోగించిందని, వాటివల్లనే అతనలా అయిపోయాడని ఇక్కడి వాళ్ళ అభిప్రాయం. అతను ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఏవేవో పెద్దపెద్ద ఆల్జీబ్రా ఈక్వేషన్స్ పేజీల కొద్దీ రాసిపడేసి, వాటికి ఏవేవో ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు చేస్తుంటాడుట. తరవాత నెలలతరబడి మౌనంగా కూచుంటాడుట. నీలాంబరి అతన్ని ‘అవధూత’గా ప్రచారం చేసి ప్రమోట్ చేద్దామని చూస్తోందిట. అతను ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో పెద్దగా అర్దం ఏమీ ఉండదని విన్నవాళ్ల అభిప్రాయం. ఇదంతా మీకెందుకు చెపుతున్నానంటే, ఈ మౌనానందస్వామే సుశీల భర్త అని అనుమానం కలుగుతోంది. మీరు వినాయకరావుగారిని ఒకసారి హైదరాబాదు రమ్మనండి. చూస్తే గుర్తుపట్టగలరేమో. సుశీలగారిని ఇన్వాల్వ్ చెయ్యొద్దు బాధపడతారు.” అన్నాడు.

‘నిగమ్ ఆఫీసరుగా ఎంత కఠినమైనవాడో మనిషిగా అంత మృదుస్వభావుడు’ అనుకున్నాడు యోగి. యోగి అందించిన సమాచారం విని వినాయకరావు, వాణి హైదరాబాదు బయల్దేరారు. కుతూహలం కొద్దీ యోగి కూడా వారితో కలిసాడు. స్టేషన్‌కు కారుతీసుకు వచ్చాడు విమల్. సుశీల హఠాత్తుగా వచ్చిన తలిదండ్రులను చూసి సంతోషించినా, కారణం తెలుసుకోవాలని ప్రయత్నించింది. వినాయకరావు దాచలేక పోయాడు. ఆ వ్యక్తి ఎవరో చూడడానికి తను కూడా వస్తానని పట్టుబట్టింది సుశీల. సిరి విరి లకు సంగతి తెలియనివ్వలేదు. వాళ్ళు స్నేహితులతో కలిసి చదువుకుంటామని వెళ్ళిపోయాక బయల్దేరారు.

“ఆశ్రమాన్నించి మేం తీసుకు వచ్చిన వాళ్ళల్లో ఒక ముగ్గురు వ్యక్తులు మతిస్థిమితం లేని వాళ్ళుగా మాకు కనిపించడంతో వారిని మెంటల్ హాస్పిటల్లో ఎడ్మిట్ చేసాం. అక్కడికి వెడదాం పదండి” అని తీసుకు వెళ్ళాడు నిగమ్.

ఒక గదిలో కిటికీ దగ్గర శూన్యపు దృక్కులతో చూస్తున్న వ్యక్తి కూచుని ఉన్నాడు. పీలికలు పడిపోయిన నీలపు వస్త్రం ధరించి ఉన్నాడు. సరైన పోషణ లేని శరీరం కృశించి ఉంది.

“డాక్టరుగారూ, ఇతను మా అల్లుడు అనంతమే” అన్నాడు వినాయకరావు తడారిపోయిన గొంతుతో. అప్పటికే సుశీల కళ్ళలోంచి కన్నీళ్ళు ధారగా కారిపోతున్నాయి.

***

తరవాత ఆ కుటుంబంలో నెలరోజుల పాటు చర్చలు జరిగాయి. యోగితో ఫోనులో తమ ఆలోచనలు చెప్పుకుంటూనే ఉన్నాడు వినాయకరావు.

“అతను ఇప్పుడన్న స్థితి కంటే పెద్దగా ఇంప్రూవ్ అవుతాడని, అతని మానసిక స్థితి మెరుగుపడుతుందనీ చెప్పలేము. అతన్ని ఇంటికితీసుకు వెళ్ళి చూసుకోవడం చాలా కష్టం. అతను ఇమడలేడు. మళ్ళీ ఇల్లొదిలి పెట్టి పోతాడు. అందుకని నా సలహా ఏమిటంటే, ఇప్పుడతనున్న హాస్పిటల్ కాక నాకు తెలిసిన మంచి ప్రైవేట్ హాస్పిటల్ ఉంది. సేవాగుణంతో మానసిక వ్యాధిగ్రస్తులను జాగ్రత్తగా చూసుకుంటారు అక్కడి వాళ్ళు. అక్కడ చేర్పించడం మంచిది. మీరు కావలసినప్పుడల్లా వెళ్ళి చూసి రావచ్చు. అతను కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చును కూడా” అన్నాడు. యోగి సలహా పాటించారు. అనంతం ఇప్పుడు ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లో ఉంటున్నాడు. సిరి విరిలకు కూడా వివరంగా చెప్పారు. ఇద్దరూ తమ తండ్రిని చూడడానికి వెళ్ళారు. ‘మానాన్న మతి స్థిమితం లేనివాడే కానీ మంచి మనిషే’ అని ఆ పిల్లలు తల్లితో అన్నప్పుడు, సుశీల ఇద్దరినీ గుండెకు హత్తుకుని జీవితంలో మొదటిసారి తనివితీరా ఏడ్చింది.

సుశీల అనంతాన్ని చూడడానికి వెళ్ళినప్పుడల్లా అనుకుంటుంది ‘ఇతను తన మనసులోనే మరో లోకం సృష్టించుకుని ఆ లోకం లోనే ఉండిపోయి ఇతరులను మరిచిపోయాడు. అతని లోకంలో అతను ఒక్కడే. ఆ మనోమాయాజగత్తులో ఇదివరకటిలాగా పెనుతుఫానులులేవు. హఠాత్తుగా బ్రద్దలయ్యే అగ్నిపర్వతాలు లేవు. అతని మనసిప్పుడు ఏ అనుభూతుల స్పందనా లేని మిథ్యా ప్రపంచం. తన మనసు సృష్టించిన మిథ్యే అతనికి వాస్తవం.’

నీలాంబరి కూడా దాదాపు అంతే. తనని తాను మహిమలుగల మహాత్మురాలిగా ఊహించుకుంది. తనంత వారు ఇంకెవరూ లేరనుకుంది. తను చెప్పిందే వేదం, తను చేసిందల్లా అద్భుతం అని ఊహించుకుంది. కానీ అనంతం లాగా తన ఊహా ప్రపంచంలో తనొక్కతే లేదు. తను సృష్టించుకున్నభ్రమల్లోకి, తను నమ్మిన మాయాప్రపంచంలోకి మొత్తం ప్రపంచాన్ని తనతో తీసుకు వెళ్ళాలని ప్రయోగం చేసింది. ఆమె చేసిన ప్రయోగం విఫలమైంది.

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here