మనోమాయా జగత్తు-6

0
11

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఆరవ అధ్యాయం. [/box]

[dropcap]సు[/dropcap]రేష్ వెళ్ళి నిగమ్ కార్లో కూచుంటుంటే విరికి ఎక్కడలేని అసూయ తన్నుకొచ్చింది. తనకే ఆ రాకేష్ అన్నవాడెవడో తెలిసుంటే తనే ఈ పోలీసాయన్ని రాకేష్ ఇంటికి తీసుకెళ్ళి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఎంతో కొంత పాల్గొనేది కదా అనిపించింది. కార్లు రెండూ డుర్రుమని వెళ్ళిపోగానే తను తుర్రుమని లోపలికి పరిగెత్తింది. చెంగున గెంతుకుంటూ వెళ్ళి కంప్యూటర్ ముందు వాలింది .

“ఇందాక వాళ్ళకి ఒక వంటాయన వచ్చి చేరాడమ్మా. నేనింక అక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ వంట చేసి రాత్రికి ఇక్కడే ఉండిపోతా. అక్కడ రాత్రి కూడా ఉండాల్సొస్తుందని బట్టలూ అవీ తెచ్చుకున్నా. ఏకంగా రేప్పొద్దున్న వంటయ్యాక ఇంటికెళ్ళి పోతా” సీతమ్మ సుశీలతో చెప్పడం విరి చెవిని పడింది.

“థేంక్యూ సీతమ్మగారూ!” అని కూచున్నచోటినించే కేక పెట్టింది తనకు కూరలు తరగడం లాంటి పనులు తప్పాయన్న ఆనందంతో.

సిరి కూడా వచ్చి విరి పక్కనే కూచుంది.

“ఇందాక ఆ డాక్టర్ గారు మేధ్స్ నొబెల్ లారియేట్ పేరు ఏం చెప్పారు గుర్తుందా?” కంప్యూటర్ ఆన్ చేసి లాగిన్ అవుతూ అడిగింది విరి.

“ఆ మూవీ స్టోరీలో ఆయనా? ఆఁ.. జాన్ నేష్ అన్నారు కదూ”.

“వాటే బ్యూటిఫుల్ మెమొరీ అండ్ మైండ్!” సిరి బుర్రమీద మెత్తగా ఒకటేసి మెచ్చుకుని ఆ పేరు గూగుల్‌లో కొట్టింది విరి. కళ్ళముందు తెరుచుకున్న జాన్ నేష్ విశేషాలు చదువడం మొదలెట్టారు.

“ఈయన మేథమెటీషియనే కాదు ఎకానమిస్ట్ కూడా. అరే వా! ఈయన థియరీలు మార్కెట్ ఎకనమిక్స్ లోనే కాదు ఇవల్యూషనరీ బయాలజీలో కూడా ఉపయోగపడ్డాయి.”

ఇద్దరూ చాలా ఆశ్చర్యపోయారు. “బయాలజీ, ఎకనమిక్సూ, మేథ్స్ ఆల్ ఇన్ వన్. మరి మనకేంటి అవన్నీ ఒకదానికొకటి సంబంధం లేనివన్నట్టు ఎవరికి వాళ్ళకి విడగొట్టి చెప్తారు? అసలు వాళ్ళేం నేర్చుకుంటున్నారో మనకి తెలియదు, బయాలజీ అంటే యాక్ థూ అంటూ వాళ్లు పారిపోతారు. ఈయన అన్నీ కలిపేసాడే?” ఆశ్చర్యపోయింది విరి.

“మరి ఎకనమిక్స్ అంటే లెక్కలు అవసరమే కదా. అలా మేథ్స్ థియరీలు ఆ ఫీల్డు లోక్కూడా ఎంటరవుతాయి” తనకున్న పరిజ్ఞానంతో అర్థం చేస్కోడానికి ప్రయత్నించింది సిరి.

“బయాలజీకి మేథ్స్‌కీ ఏంటమ్మా మరి సంబంధం? ఇప్పటి వరకూ మనం బయాలజీలో ఏదైనా మేథ్స్ థియరీ ఉపయోగించామా? ఫిజిక్స్ లోనూ కొంచెం కెమిస్ట్రీ లోను మేథ్స్ అవసరం గానీ” సాగదీసింది విరి.

“ఆల్రైట్ అదీ చూద్దాం. ఇవల్యూషనరీ బయాలజీలో మేథ్స్ అంటే ఏంటో. ఆ లింక్ క్లిక్ చెయ్యి” ఇద్దరూ ఆత్రంగా చదివారు. చాలామటుకు అర్థం కాలా.

“ఇదంతా ఓపిగ్గా చదివి అర్థం చేసుకోడానికి మన పరిజ్ఞానం చాలదేమో. మొత్తం మీద జాన్ నాష్ థియరీ జీన్ ట్రాన్స్‌మిషన్‌లో అప్లై అవుతుంది.” అని టూకీగా అర్థం చేసుకుని తృప్తిపడ్డారిద్దరూ. జాన్ నేష్ జీవిత విశేషాలు వాళ్ళని అమితంగా ఆకర్షించాయి.

“ఈయనకున్న జబ్బుని పేరనాయిడ్ స్కీజోఫ్రేనియా అంటారు. ఇంత గొప్ప రిసెర్చ్ చేసి ఇన్ని సబ్జెక్టుల్లో తన థియరీలు ఉపయోగిపడేలా సాధించిన ఈ వ్యక్తి, ఈ గ్రేట్ పెర్సన్ ఒక మెంటల్ డిసీజ్‌తో పీడింపబడ్డాడు. పాపం!” సిరి మనసు సానుభూతితో కరిగిపోయింది.

“మనమేం జాలి పడక్కర్లేదు. అంత జబ్బుతో బాధపడుతూ కూడా సైన్స్ ఫీల్డ్‌కి అధ్భుతమైన థియరీలు అందించాడు. ఏ వ్యాధినైనా మేధస్సుతో జయించవచ్చని ప్రపంచానికి ఋజువు చేసాడు. అందుకు ఆయన్ని అబినందించాలి. దారి చూపించినందుకు కృతజ్ఞత చూపించాలి!” ఆర్ద్రంగా వినిపించిన సుశీల గొంతు విని విని ఇద్దరూ వెనక్కి తిరిగారు.

“అవును మరి ఆయన మీద జాలి పడకూడదు మనం. జాలిపడితే ఇందాక యోగి గారు చెప్పినట్టు మన దేశంలో స్కీజోఫ్రేనియా రోగులను తలుచుకుని జాలిపడండి. చేతనైతే ఈ పరిస్థితిని మార్చడానికి మీ ప్రయత్నం మీరు చెయ్యండి” కొంచెం ఆవేశంగా అంది సుశీల. విరి సిరి ఇద్దరూ వింతగా తల్లి ముఖంలోకి చూసారు.

“అమ్మా నితిన్ పోయినప్పటినించీ నువ్వు ప్రతి చిన్నవిషయానికీ బాగా అప్సెట్ అయిపోతున్నావు. అన్నిటికీ ఆవేశ పడుతున్నావ్. ఎందుకమ్మా అలా అయిపోతున్నావ్?” సుశీల భుజాల చుట్టూ చేతులేసి బుజ్జగిస్తున్నట్టు అడిగింది సిరి.

పిల్లల ముందు అలా చీటికీ మాటికీ ఆవేశపడే తన బలహీనతకు కొంచెం సిగ్గు పడింది సుశీల. కాస్త సద్దుకుని, “ఏం లేదులే. ఏవో జ్ఞాపకాలు. మీరిద్దరూ మెడిసిన్ చదవాలని ఉత్సాహపడుతున్నారు కదా, చదివాక ఇలాంటి డిసీజెస్ మీద కాన్సన్‌ట్రేట్ చేసి మంచి మందులు కనిపెట్టేందుకు రీసెర్చ్ చెయ్యండి” అంది సిరి చెంపలు నిమురుతూ.

“నా చెంపలు కూడా అలా రాయవా అమ్మా. ఎప్పుడూ దాన్నే ముద్దు చేస్తావ్” బుంగ మూతి పెట్టుకు దగ్గరకొచ్చిన విరి బుగ్గమీద ముద్దు పెట్టి నవ్వింది సుశీల.

“ఆ డాక్టరు ఇంకో ఇండియన్ సైంటిస్ట్ పేరు కూడా చెప్పాడు కదా పదండి ఇంటర్‌నెట్‌లో చూసి ఆయన గురించి తెలుసుకుందాం” ముగ్గురూ కంప్యూటర్ ముందు చేరారు.

సెకండ్ రామానుజన్‌గా కొనియాడబడ్డ వసిష్ఠ నారాయణ సింగ్ జీవితగాథ చదువుతుంటే సుశీల కళ్లల్లో నీళ్లు ఏకధారగా కారిపోతున్నాయి. ఎంతటి మేధా సంపన్నత ఎంత దీనంగా వ్యర్థమైపోయింది!

ప్రస్తుతం బీహార్ లోని వసంతపూర్‌లో మతి స్థిమితంలేని వృధ్ధుడిగా జీవితం గడుపుతున్న వసిష్ఠ  నారాయణ సింగ్ ఒకప్పుడు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా నించి గణిత శాస్త్రంలో డాక్టరేట్ సాధించాడు. అమెరికాలోని అంతరిక్షకేంద్రం నాసాలో సైంటిస్ట్‌గా పదవి నిర్వహించాడు. సామాన్య పోలీస్ కానిస్టేబుల్ కొడుకైన సింగ్ టీనేజ్ లోనే విజయాలు సాధించాడు. బీహార్ రాష్ట్రంలో మెట్రిక్యులేషన్ లోను, ఇంటర్ మీడియేట్ లోను ఆయన రికార్డ్ హోల్డర్. ఇరవై ఏళ్లుకూడా పూర్తికాక ముందే ఇంజనీరింగులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పొందిన తొలి భారతీయ విద్యార్థిగా కూడా రికార్డు స్థాపించాడు.

1960 దశకంలో పాట్నాలోని బీహార్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో సింగ్ చదువుతున్నప్పుడు ప్రొఫెసర్ జాన్ ఎల్.కెల్లీ అనే ప్రొఫెసరు యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా, బెర్క్‌లీ (University of California, Berkley – UCB) నించి మేథమేటిక్స్ కాన్ఫెరెన్సుకు వచ్చాడు. ఆయన విద్యార్ధులకు ఐదు జటిలమైన గణిత సమస్యలను ఇచ్చాడు. వసిష్ఠ నారాయణసింగ్ ఐదు సమస్యలను రెండు విధానాలలో పరిష్కరించి చూపించాడు. బెర్క్ లీ ప్రొఫెసర్ గారు చాల ఇంప్రెస్ అయిపోయి అతనికి టికెట్టూ, వీసా అన్నీ ఏర్పాటు చేసి బెర్క్‌లీ యూనివర్సిటీకి రప్పించుకున్నాడు. అక్కడ తన గణిత విజ్ఞానంతో అందరినీ ఆశ్చర్య పరిచిన సింగ్, యూనివర్సిటీ వదిలి నాసాలో ఉద్యోగానికి వెళ్ళాడు. తరువాత ఇండియాకి తిరిగి వచ్చి ఐ.ఎస్.ఐ (కలకతా), ఐఐటి (కాన్పూర్) టిఐఎఫ్‌ఆర్ (బాంబే) లలో పని చేసాడు. కానీ ఈ ఉద్యోగాలలో ఏమంత సంతృప్తి లభించలేదాయనకి. వివాహజీవితం కూడా సమస్యాభరితమైంది. భార్యాభర్తలు విడిపోయారు. తరువాత ఆయన మతిస్థిమితం కోల్పోయారు. రాంచి లోని మెంటల్ హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుగుతుండగా సింగ్ ఎడ్మిటై ఉన్న విఐపి వార్డు మరో రాజకీయ నాయకుని బంధువుకు కావలసి రావడం వల్ల సింగ్‌ను మీరట్ హాస్పిటల్‌కి తరలించారు. అక్కడనుంచి వసిష్ఠ నారాయణసింగ్ ఎవరికీ తెలియకుండా పారిపోయాడు. ఆయన కుటుంబానికి, ఆయనకు వైద్యం చేయించడానికి గానీ ఎక్కడున్నాడో వెతికించడానికి గానీ స్తోమతు లేక పోయంది. చాలా ఏళ్ళ పాటు ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. తరవాత తొంభైయవ దశకంలో ఆయన ఛప్రా అనే ఊరిలో చెత్తకాయితా లేరుకుంటూ కనిపించాడు. ఆయన అన్నగారు వెళ్ళి ఆయనను ఇంటికి తీసుకు వచ్చారు కానీ ఆయన వృధ్ధాప్యం మతిస్థిమితం లేని స్థితి లోనే గడిచిపోతోంది.

భారతీయుడైన వసిష్ఠ నారాయణసింగ్ స్కీజోఫ్రేనియా పేషెంటు. అమెరికా దేశస్థుడు జాన్ నేష్ కూడా షైజోఫ్రేనియా పేషెంటే. ఇద్దరూ గణితశాస్త్రంలో మహా మేధావులే. వసిష్ఠ నారాయణసింగ్ పైన స్షైజోఫ్రేనియా విజయం సాధించి వికటాట్టహాసం చేసింది. షైజోఫ్రేనియాని ఓడించి జాన్ నేష్ నొబెల్ బహుమతి గెల్చుకున్నాడు.

ఇలా ఎందుకు జరిగింది? అన్న ప్రశ్నకు జవాబు ఎవరు చెప్ప గలరు? భారతీయ వేదాంతం ప్రకారం ప్రారబ్ద కర్మలను ఎవరూ తప్పించలేరు. అంతేనా? కేవలం వేదాంతాన్ని నమ్ముకుని చేతులు ముడుచుకు కూచోవడమేనా? ఈ జీవితగాథనించి పాఠం నేర్చుకునేదేమీ లేదా? ఇలా ఎన్ని జీవితాలు వ్యర్ధంగా బలై పోతున్నాయి ఎవరికి తెలుసు? ఇకముందైనా ఇలా జరగకుండా నివారించడానికి మార్గమే లేదా?

ముఖం చేతుల్లో కప్పుకుని ఏడుస్తున్న తల్లిని చూసి సిరి విరి భయపడి పోయారు.

“అమ్మా. ఎందుకమ్మా అంతలా ఏడుస్తున్నావూ? ప్లీజ్ ఊరుకో” ఇద్దరూ బతిమాలారు.

“లే. అమ్మా, నువ్వు తట్టుకోలేనప్పుడు ఇలాంటివి మనమసలు చూడద్దు” ఇద్దరూ కలిసి సుశీలని లేవదీసి మంచం వరకూ నడిపించి పడుకోబెట్టారు.

సిరి ఫ్రిజ్ లోంచి చల్లటి నీళ్ళు తెచ్చి కొంచెం రుమాలు మీద పోసుకుని తల్లి ముఖం తుడిచింది. తరవాత కాసిని నీళ్ళు సుశీల చేత తాగించింది. సుశీలకు చెరోపక్కనా కూచున్నారిద్దరూ. ఆమె దుఃఖం తగ్గి తేరుకునే వరకూ ఎదురుచూసారు.

వంటపని ముగించిన సీతమ్మ గేటు కానుకుని నిలబడింది. వచ్చే పోయే వాహనాలు చూస్తూ నడుచుకు పోతున్న వాళ్ళల్లో తెలిసిన మొహాలుంటే పలకరిస్తోంది. సీతమ్మకు లోపల తల్లీ కూతుళ్లు ఏదో కంప్యూటరు చూసుకుంటున్నారులే అనుకుంటోంది గానీ జరుగుతున్నది తెలియలేదు.

“అమ్మా ఇప్పటికైనా చెప్పమ్మా ఎందుకు మరీ అంత బాధ పడుతున్నావ్? ఇదివరకు మేం చిన్నపిల్లలం మాకు నువ్వు చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళం కాదేమో. ఇప్పుడు మరీ చిన్న పిల్లలం కాదుకదమ్మా. నీ బాధ ఏమిటో చెప్పకూడదా? ఎన్నాళ్ళు నీలో నువ్వే బాధంతా దాచుకుంటావు? మనసులో మాట మాతో పంచుకో. పైకి చెప్పకపోతే ఎప్పటికీ నీకా బాధ తీరదు” తల్లి తల నిమురుతూ ఎంతో అనుభవం ఉన్నదానిలా బతిమాలింది సిరి.

“ఏవైందో చెప్పు. ఇంటర్‌నెట్‌లో ఆ కథలన్నీ చూస్తుంటే బాధ కలిగిందా? ఎవరైనా గుర్తొచ్చారా?” ఎటో చూస్తూ అవునన్నట్టు తలూపింది సుశీల. “ఆ వసిష్ఠ నారాయణసింగ్ జీవితం చదువుతుంటే..” సుశీల గొంతు పూడుకుపోయింది. “ఆఁ చదువుతుంటే ఎవరు గుర్తొచ్చారు? మళ్ళీ మీ బాబయి గుర్తొచ్చాడా?” వెక్కిళ్లు పెడుతూ కాదన్నట్టు తలూపింది సుశీల. “మరెవరు గుర్తొచ్చారమ్మా?” సుశీల ఏడుపు మళ్ళీ ఉధృతమైంది “అది చదువుతుంటే నాకు..”

“అమ్మో! అమ్మగారోయ్! అమ్మాగారూ!” వీధిలోంచి పెద్ద పేద్ద కేకలు. ముగ్గురూ ఉలిక్కపడ్డారు. విరి, సిరి వీధి గుమ్మం వైపు పరిగెత్తారు. గేటుదగ్గరనించి సీతమ్మ హిస్టీరికల్‌గా కేకలు పెడుతోంది. ముఖంతుడుచుకుని సుశీల కూడా ఇవతలకొచ్చింది. అప్పటికే అమ్మాయిలిద్దరూ గేటు చేరుకున్నారు. సుశీల కూడా గబగబా అక్కడికి చేరింది.

రోడ్డు మధ్యలో ఎవరో అనామకురాలు పడుంది. ఓ చంటిపిల్ల రక్తపు మడుగులో చచ్చి పడుంది. అటూ ఇటూ వాహనాలు ఆగిపోయున్నాయి. కొంతమంది సీతమ్మలాగే భయంతో కేకలుపెడుతూ పరిగెడుతున్నారు. ఫోలీసుల నంబరు కలవక అవస్థ పడుతున్నాడొకాయన. ఏంబులెన్స్ కోసం ప్రయత్నిస్తున్నారింకొందరు.

ఎవరదీ ఎవరా పడిపోయినదీ, ఏ కారైనా గుద్దేసిందా సుశీల గాభరాగా అడిగింది సీతమ్మని.

ఏం లేదమ్మగారూ. అందరూ ఎవరిమానాన వాళ్ళు పోతూనే ఉన్నారు. ఏం తోచక ఊరికే నేనీ గేటు దగ్గర నిలబడి చూస్తున్నానండి. ఆ మనిషి కూడా తన మానాన తను పోతోంది. అసలు చాలా మామూలుగానే కనిపించిందండి. ఉన్నట్టుండి తూలుకుంటూ నడవడం మొదలెట్టిందండి. ఏంటబ్బా అని తేరిపార చూస్తున్నానండి. ఇంతలోనే భళ్ళున కక్కుకుని తెలివితప్పి పడిపోయిందండి. చేతిలో చంటిపిల్ల బంతెగిరినట్టు ఎగిరి ఆ పక్కన పడి పోయిందండి. చూసిన దృశ్యాలు వర్ణించి చెప్పింది సీతమ్మ.

చంటిపిల్ల ఎగిరి పడిపోయిందని సీతమ్మ చూపించిన వైపు చూసారు. అయ్యో చిన్న కేకపెట్టింది సిరి. హభ్భా చూడలేకపోతున్నాం అని ముఖాన్ని చేతులతో ప్పేసుకుంది విరి. ఆ పిల్ల పడడమే రాళ్ళగుట్ట మీద పడింది కాబోలు తల పగిలి రక్తం ధారకట్టి ఉంది.

జనం చేరుతున్నారు.

ఏమిటిది ఏం జరిగినా మన వీధిలోనే జరుగుతోంది.

***

సురేష్‌ని కార్లో ఎక్కించుకున్నాక అతను, “ముందు మా ఇంటికెళ్లి మానాన్నగారితో చెప్పి రాకేష్ ఇంటికి వెడదాం సార్” అని నిగమ్‌ని రిక్వెస్ట్ చేసాడు. సురేష్ దారి చెప్తుండగా అతన్ని అతని ఇంటికి తీసుకువెళ్ళా డు నిగమ్ ‘కుర్రాడు బుధ్ధిమంతుడే’ అనుకుంటూ. ఇంటికెళ్ళాక “నాన్నా ఈయన డాక్టరుగారు. నితిన్ గురించి మమ్మల్నేవో అడగడానికొచ్చారు. లాయరు విశ్వంగారి ఫోన్ నంబర్ నీ దగ్గరుందికదూ. వాళ్ళబ్బాయి రాకేష్‌తో మాటాడతానంటున్నారీయన”. అన్నాడు. నిగమ్‌ని చూసి తల పంకిస్తూ ఫోన్ బుక్ తీసి సురేష్ అడిగిన నంబర్ వెతుకున్నాడాయన.

‘విమల్ యోగిలతో పాటునన్ను కూడా డాక్టర్ అనుకుంటున్నట్టున్నాడీ అబ్బాయి’. మనసులోనే నవ్వుకుని మాటాడకుండా కూచున్నాడు నిగమ్. ఆయన నంబరు సురేష్‌కి చూపించి, “ఏంటోనండి పాపం నిక్షేపం లాంటి పిల్లాడు” అని నిట్టూర్చాడు. నిగమ్ కూడా నిట్టూర్చాడు. ఆయన ఎందుకో చేతులు పైకెత్తి ఆకాశానికి దండం పెట్టాడు. నిగమ్ కేం చెయ్యలో తెలియక ఊరుకున్నాడు. సురేష్‌కి నంబరు కలిసినట్టుంది. “రాకేష్, నేనురా సురేష్‌ని. చిన్న పని పడింది. మీ ఇంటికి రావాలి. ఎగ్జాక్ట్‌గా మీ ఇల్లెక్కడ. ఎన్నో నంబరు బైలేన్?” అడుగుతున్నాడు.

కొంతసేపు విని నోట్ చేసుకుని “పదండి సార్ వెడదాం” అన్నాడు. మళ్ళీ ఇద్దరూ కారెక్కి రోడ్డున పడ్డారు. లెఫ్టూ రైటూ స్ట్రెయిటూ అని చెప్తూ తీసుకెళ్ళి పదిహేను నిముషాల్లో ఒక లాయరు బోర్డు వేలాడుతున్న గేటు ముందు కారాపించాడు సురేష్.

“నేను వెళ్ళి పిలుచుకొస్తా సర్” దిగాడు. నిగమ్ కూడా దిగి నుంచున్నాడు.

ఆ ఇంట్లోంచి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి. పేద్ద కురుక్షేత్రయుద్ధం లాంటిదేదో జరుగుతోంది. ‘కుటుంబ సమస్యలకు పరిష్కారం వెతుక్కుంటున్నట్టున్నారు’ అనుకుని నవ్వుకున్నాడు నిగమ్. గేటు తియ్యబోతూ సురేష్ నిగమ్ కేసి తిరిగి ఇబ్బందిగా నవ్వాడు. సురేష్‌ని లోపల్నించి చూసినట్టున్నాడు “నేనొచ్చేస్తున్నాను” అని కేకపెట్టాడు రాకేష్.

సురేష్ కారు దగ్గరకొచ్చి “రాకేష్‌కి వాళ్ళ పేరెంట్స్‌తో ఆట్టే పడదు. లాయర్సు కాదు లయ్యర్స్ అని తిట్టుకుంటుంటాడు” చిన్నగా చెప్పాడు. చిన్నకుటుంబమే చింతలులేని కుటుంబం అన్నవాడిని కాల్చిపారెయ్యాలని పించింది నిగమ్‌కి ఆ క్షణంలో. ఇంట్లోంచి హడావిడిగా వచ్చిన రాకేష్, నిగమ్‌నీ, కార్‌నీ చూసి టక్కున ఆగి సురేష్ వైపు ప్రశ్నార్ధకంగా చూసాడు.

“నితిన్ గురించి ఏవో డీటెయిల్స్ కావాల్ట. అడగడానికొచ్చారు.” సురేష్ మాటలు విని ఏం కావాలన్నట్టు నిగమ్ వైపు చూసాడు. ఇంట్లో రేగిన ధూమ్ ధామ్‌ల తాలూకు పొగలుసెగలూ అతని కళ్ళల్లోంచి ఇంకా విరజిమ్ముతున్నట్టుగా ఉంది.

“రండి కార్లో కూచుని మాటాడుకుందాం” రాకేష్ ఫ్రంట్లో నిగమ్ పక్కన కూచున్నాడు. కొంచెం ముందుకు పోనిచ్చి ఓ చెట్టు నీడలో కారాపాడు నిగమ్.

“నితిన్ కోసం మీ కాలేజ్ నించి ఒక స్టూడెంట్ తరచుగా వచ్చేవాడుట కదా అతనెవరు?” నిగమ్ ప్రశ్న విని అర్థం కానట్టు సురేష్ వైపు చూసాడు రాకేష్.

“వాడురా. మొహం మీద మచ్చలుండి పోనీ టెయిల్ కడతాడు. కొంచె లావుగా నీకంటే పొడుగ్గా ఉంటాడు అదేదో టైప్ సంచీ ఒకటి వేలాడేసుకొస్తుంటాడురా” వర్ణించడానికి కొంచెం అవస్థ పడ్డాడు సురేష్.

“వాడు, నితిన్ చాలాసార్లు అటు కెమిస్ట్రీ లేబ్ వైపు గోడ కింద చేరి టైమ్ పాస్ చేసేవారు.”

“ఓ! య్యా. వాడా? వాడి మొహం వాడు స్టూడెంటేంటి? ఏదో వాడి బాబు ఫీజులు కట్టిపడేస్తుంటాడు డబ్బెక్కువై. వీడు మందుకొడ్తూ తిరుగుతూ ఉంటాడు.”

“ఆల్కహాలిక్?” అడిగాడు నిగమ్.

“అన్ని హాలిక్కూనూ. వాడికిలేని వెధవ అలవాటు లేదు”

“అతనితో నితిన్‌కి ఎలాంటి స్నేహం?”

“ఇంతకీ అసలు మీరెవరు? సారీ. సురేష్ చెప్పలేదు అందుకని”

“ప్లీడరుగారి అబ్బాయివనిపించుకున్నావ్” నవ్వాడు నిగమ్.

“ఐ హేట్ మై పేరెంట్స్! వాళ్ల పేరెత్తకండి” చిరాకు పడ్డాడు రాకేష్.

“సారీ సర్. ఇలా మాటాడకూడదని నాకు తెలుసు కానీ ఒళ్ళు మండిపోతోంది నాకు. పాపం క్లయంట్స్ నమ్మి వాళ్ళ సమస్యలు వీళ్ళ చేతిలో పెడతారు. వీళ్ళు అవతలి పార్టీ వాడికి ఉప్పందించి వాడి దగ్గరా వీడి దగ్గరా కూడా డబ్బు లాగుతారు. ఎథిక్స్, నీతి, నియమం ఏమీ లేవు. డబ్బొక్కటే. మా అమ్మా నాన్నా ఇద్దరూ లాయర్లే లెండి. ఇద్దరూ తోడుదొంగలే. నన్నూ లాయర్ చెయ్యాలనుకుంటున్నారు. మనం సివిల్స్‌కి ప్రిపేరవు తున్నాం. వీళ్లకి లొంగను. కరప్షన్ లేకుండా గవర్న్‌మెంట్‌లో ఉద్యోగం చేసి నిరూపిస్తా” వేడి ఇంకా తగ్గలేదేమో గబగబా చెప్పేసాడు.

‘ఇలా అప్పుడప్పుడైనా ప్రహ్లాదులు పుడుతూండాలి’ మనసులో మెచ్చుకున్నాడు నిగమ్. “ఆల్రైట్ నేనెవరినని అడిగావుకదూ. సురేష్ నువ్వు కూడా విను నేను పోలీస్ ఇన్‌స్పెక్టర్. క్రైమ్ బ్రాంచ్. నువ్వు విరి పరిచయం చేస్తున్నపుడు సరిగా వినలేదనుకుంటా”.

సురేష్ అబ్బురంగా చూసాడు. “అయితే నితిన్‌ది ఆత్మహత్య కాదా? హత్యా?” భయమూ కుతూహలమూ కలగాపులగం ఇమోషన్స్‌తో ఉక్కిరిబిక్కిరయ్యాడు సురేష్. కళ్ళు పెద్దవి చేసి బిగుసుకు పోయాడు రాకేష్.

“ఇంకా ఎటూ తేల్చలేం. మీలాంటి స్టూడెంట్సంతా హెల్ప్ చేస్తే మిస్టరీ సాల్వ్ అయిపోతుంది. ఏంటలా భయంగా చూస్తున్నావ్? రిలాక్స్. కాబట్టి ఆ పోనీ టెయిల్ ఫ్రెండ్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి” అన్నాడు. రాకేష్ తేరుకున్నాడు. ఉత్సాహంగా దారి చెప్పడం మొదలెట్టాడు. అరగంటసేపు ట్రాఫిక్‌తో యుధ్ధం చేసి ఒక పోష్ కాలనీ చేరారు. ఒక మీడియమ్ సైజు లగ్జరీ విల్లా ముందు కారాపించాడు.

“మీ ఫ్రెండుకి నేను పోలీసునని చెప్పకండి” అన్నాడు నిగమ్.

“ఛీ వాడసలు మా ఫ్రెండు కాదు.” రాకేష్ దిగాడు.

సెక్యూరిటీ వాడు నిద్రకళ్ళతో బోరుగా చూసాడు.

“గీరూ. గిరీష్ ఉన్నాడా?” అడిగాడు రాకేష్. అవునో కాదో తెలీకుండా తలెగరేసాడు సెక్యూరిటీ. వీడితో లాభంలేదని రాకేష్ జేబులోంచి సెల్ తీసి గిరీష్‌తో మాటాడాడు. సెక్యూరిటీ చేతిలో మొబైల్ మోగింది.

“అట్లనే అట్లనే” సెల్లుకి సెల్యూట్ కొట్టినంతపని చేసి గేటు తెరిచి ముగ్గురినీ లోపలికి పంపించాడు.

లోపల ఓ పక్కగా చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ ఉంది. దానిపక్కన పడుకుని పడి దొల్లుతున్న వాడొకడు రాకేష్‌ని పిలుస్తూ కష్టం మీద లేచి కూచున్నాడు. వాడికిప్పుడు పోనీ టెయిల్ లేదు. జుట్టంతా నెత్తిన బుట్ట బోర్లించినట్టుంది. వెండి,రాగి రంగుల చారలచారల డైయింగ్ చేసుంది. చొక్కా లేకుండా నల్లటి బెర్ముడాస్ ధరించి ఉన్నాడు అక్కడి మసక వెలుతురులో నరకంలో దొర్లుతున్న యమకింకరుడిలాగా కనబడుతున్నాడు.

“వీడి దుంపాతెగా. వీడినో ఆటాడిద్దాం సార్” చిన్నగా అన్నాడు రాకేష్. చాలా జోవియల్‌గా గిరీష్ వైపు నడుస్తూ, “హల్లో! ఏంటి కాలేజీకి రావడం మానేసావ్. లాంగ్ టైమ్ నో సీ” అన్నాడు.

వాడు కారణం లేకుండా గడబిడగా నవ్వి దగ్గాడు. “ప్రిన్సిపాల్ బెంగపెట్టుకున్నాడా నాకోసం?” దగ్గు తగ్గాక అడిగాడు.

“గాల్స్! గాల్సందరూ బెంగెట్టేసుకున్నారు. నన్ను చంపేస్తున్నారు గీరూ ఎందుకు రావట్లేదని.”

జన్మకంతటికీ ఇప్పుడే మొదటిసారి ఓ జోకు విన్నట్టు తలవిదిలించుకుంటూ పిచ్చెక్కినట్టు నవ్వాడు గీరూ. నవ్వు ఫిట్టు తగ్గాక “రా బ్రదర్ కూచో. అరే లిటిల్ బ్రదర్ కూడా వచ్చాడే! నన్నుచూస్తే చాలు బెదిరిపోతాడు”. సురేష్ చెయ్యిపట్టి లాగుతూ నిగమ్ వైపు అనుమానంగా చూసాడు.

“మా అంకుల్. మనతో సమానంగా జల్సా చెయ్యగలడు” నిగమ్ జేబులోంచి చిన్న పేకెట్ తీసి చూపించాడు. గీరూ దాన్నిచూస్తూనే చాలా గౌరవంగా లేచికూచుని దండం పెట్టినంత పనిచేసి అందుకుని అటూఇటూ తిప్పి చూసాడు. “నాట్ బేడ్. మన దగ్గిరింకా బెటర్ క్వాలిటీ ఉంది.”

“ఇక్కడేనా?” నిగమ్ ప్రశ్న. కాదన్నట్టు తలూపాడు. “ఆర్డర్ బట్టి తెస్తాం. వెరైటీ కూడా ఉంది” ఊరించాడు

“ఎప్పుడు? ఎక్కడ?” ఉత్కంఠ ప్రదర్శించాడు నిగమ్.

వాడు ఆరోహణలో నవ్వాడు. “మీరు చెప్పాలి మేం వస్తాం మీ దగ్గరకి. స్పాట్ అండ్ టైమ్ సెలెక్షన్ మీదే.” గ్రాండ్‌గా అన్నాడు.

నిగమ్ జేబులో సెల్లు మోగింది. తీసి తీరిగ్గా అడుగులేసుకుంటూ ఓ చెట్టుచాటుకెళ్ళాడు. “సార్, ట్రాంక్విల్ కాలనీ లో ఇంకో డెత్” వివరాలిస్తున్నాడు ఎస్సై. జాగ్రత్తగా విన్నాడు. “ఎగ్జాక్ట్‌గా మీరు మధ్యాహ్నం వెళ్ళిన కవలపిల్లల ఇంటి ముందు. వాళ్లకి సంబంధం ఉందనుకోను. బిచ్చగత్తె లాగా ఉంది. డేస్ బేబీ కూడా ఉంది. పాపం బేబీ తల రాయిమీద పడి పగిలిపోయింది” వింటూ బాధగా కళ్లు మూసుకున్నాడు నిగమ్.

“ఆల్రైట్ వస్తాను. ఆ రోడ్ కార్డన్ ఆఫ్ చెయ్యండి.” గీరూ వైపు నడిచాడు.

“చెప్పు అంకులూ టైమూ స్పాటూ చెప్పు” గీరూ తగులుకున్నాడు.

“నితిన్ స్పాట్ లోనే” వింతగా రాకేష్ వైపు చూసాడు గీరూ.

“కేరీ ఆన్. అంకుల్ తో నో నాన్సెన్స్” గేరెంటీ ఇచ్చాడు రాకేష్.

“ఓఖే ఓఖే డన్” గార్దభం పాటపాడినట్టు రాగం తీసాడు. “సీ యూ”. రాకేష్ లేచాడు. సురేష్ కూడా గీరూ చెయ్యి విడిపించుకుని గబుక్కున లేచి నుంచున్నాడు. ముగ్గరూ ఇవతలకొచ్చి కారెక్కారు.

గీరూ అంత తేలిగ్గా తనని నమ్మి డ్రగ్స్ తెచ్చిపెడతాననడం కొంచెం ఆశ్చర్యం అనిపించింది నిగమ్‌కు. “చాలా తేలిగ్గా నన్ను నమ్మి తెచ్చిపెడతానన్నాడే! నువ్వూ ఎప్పుడైనా వీడి కస్టమర్‌వా?” రాకేష్‌ని కంటికొస నించి గమనించుతూ అడిగాడు.

“ఛీఛీ. అంకుల్ నన్ననుమానించకండి, అవమానించకండి. మొదట మొదట్లో వాడికి కస్టమర్లని సప్లై చేస్తున్నది నేనే అని వాడి మట్టిబుర్రకి ఎందుకో నమ్మకం పుట్టింది. అందుకని నేనంటే గురి. వాడి నమ్మకాన్ని నేను కాదనలేదు. ఇవాళ చూడండి నా స్ట్రాటజీ పనిచేసింది.” నవ్వాడు

“అంటే ఇతను డ్రగ్ డీలింగ్ చేస్తున్నాడని ఎప్పటినించీ తెలుసు నీకు?”

“ఓ అంకుల్! డోన్ట్ మిస్‌అండర్‌స్టాండ్ మీ. వాడు డ్రగ్ డీలింగ్ చేస్తున్నాడని అప్పట్లో తెలియదు నాకు. వాడు ఒక హెర్బల్ మెడిసిన్‌కి డీలర్‌షిప్ తీసుకున్నానని చెప్పేవాడు. ఎవరైనా కొనుక్కనే వాళ్ళుంటే మార్కెట్ కన్నా సగం రేటుకిస్తాననే వాడు.”

నిగమ్ నిటారుగా కూచున్నాడు. ఈ తీగతో చాలా డొంక బయటపడేలా ఉంది. కారు చిన్న ఐస్క్రీమ్ పార్లర్ ముందు ఆపి, “మీ ఇద్దరకీ ఐస్ క్రీమా, కూల్‌డ్రింకా?” అడిగాడు. “ఐసే” నవ్వారిద్దరూ. బోయ్ కారుదగ్గరికి రాగానే రెండు లార్జ్ కసాటాలు తెమ్మని తనకి ఎస్ప్రెసో తెప్పించుకున్నాడు. ఇష్టంగా ఐస్క్రీమ్ తింటున్న అబ్బాయిలిద్దరినీ చూస్తూ ‘ఇంకా పూర్తిగా చిన్నతనం వదలని అడోలిసెంట్స్! వీళ్ళ వయసే చాలా క్లిష్టమైనది. గీరూలాంటి గ్రద్దల చేతిలో పడకుండా వీళ్ళని కాపాడాల్సిన పెద్దలు వాళ్ళే గ్రద్దలుగా వ్యవహరిస్తున్నారు’. కొంచెం బాదపడ్డాడు రాకేష్ తన పేరెంట్స్ గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి.

‘ఏం మెడిసిన్ గీరూ అమ్ముతానన్నది?”

“ఏదో మామూలు పెయిన్ బామ్ లాంటిదని నాకప్పుడు ఇంప్రెషన్ వచ్చింది వాడు చెప్పినదాన్ని బట్టి. తలనొప్పి, కాన్సన్‌ట్రేషన్ లేకపోవడం ఇలాంటి వాటికి బాగా పనిచేస్తుందనే వాడు. మామూలుగా స్టూడెంట్లలో పరీక్షలముందు అలాంటి సమస్యలు వొస్తూనే ఉంటాయిగా, ఒకళ్ళిద్దరికి చెప్పాను. మరి వాళ్ళు నాకు కొనుక్కున్నామని చెప్పలేదు. కొనే ఉంటారు. నెమ్మదిగా బిజినెస్ ఇంక్రీజ్ అయిందేమో నాతో ఫ్రెండ్లీగా ఉండేవాడు. నన్నూ కొనమనేవాడు. నేనెప్పుడూ కొనలా. కానీ రీసెంటుగా నితిన్ బిహేవియర్ చూస్తుంటే కొంచెం కొంచెం అనుమానం వచ్చింది. అందుకే మీరు పోలీస్ అని తెలియగానే మీతో కోఆపరేట్ చేస్తే వాడి సంగతి తేలుతుందనిపించింది.”

“పెయిన్ బామ్ అన్నదాన్ని ఏదైనా ఆకుల్లోచుట్టి తీసుకొచ్చేవాడా?” అడిగాడు నిగమ్.

“ఏమో మరి. నేనెప్పు డూ చూడలా. కొన్న వాడెవడూ నాకు చూపించలా. నేనూ అంతపట్టించుకోలా”

సురేష్ అందుకున్నాడు. “నితిన్ దగ్గర చూసానురా రాకేష్. చిన్న ఆకుతో చుట్టిన పొట్లం ఏదో కనిపించేది నితిన్ దగ్గర. అందులోంచి ఏదో తీసుకుతినే వాడు. లేహ్యం అంటుండేవాడు” నిగమ్‌కి చెప్పిందే మళ్ళీ చెప్పాడు సురేష్.

“గీరూ నీలాంబరీదేవి పేరెప్పుడైనా మెన్షన్ చేసాడా?” నిగమ్ ప్రశ్న విని, “ఆ హెర్బల్ ఫార్ములా ఆవిడే కని పెట్టిందన్నాడు ఒకసారి మాటల్లో. నేను నమ్మలేదు కానీ. వాడి పేరెంట్సు నీలాంబరి భక్తులనో ఏదో చెప్పాడొకసారి. అన్నట్టు అంకుల్ ఇంపార్టెంట్ మేటర్ చెప్పలేదు. వాడికి స్టెప్ ఫాదర్.”

సురేష్ అయోమయంగా ఛూసాడు. “స్టెప్ మదర్ ఉంటారుగానీ ఎక్కడైనా……” “అంటే వాడి మదర్ ఫస్ట్ హస్బెండ్‌కి డైవోర్స్ చేసి ఈ ఫాదర్‌ని చేసుకుంది. అందుకని స్టెప్ ఫాదరయ్యా డాయన” ఎక్స్‌ప్లెయిన్ చేసాడు రాకేష్ చిన్నపిల్లాడితో చెప్పినట్టు.

“ఓహో” ఏదో చేదు తిన్నట్టు మొహం పెట్టాడు సురేష్.

“చాలా ఇన్పర్మేషన్ సంపాదించావే గీరూ గురించి” అన్నాడు నిగమ్ నవ్వుతూ.

“ఇదంతా నేను సేకరించింది కాదంకుల్ వాడంతట వాడే వాగాడు. ఎందుకో గానీ వాడి తిరుగుళ్ళయ్యాక కాలేజ్ ప్లే గ్రౌండ్లో కాసేపు నాతో హస్క్ కొట్టేవాడు. ఏవేవో చెప్పేవాడు. ఇప్పుడు నేను మీతో రిలాక్సయి పోయి ఏవేవో చెప్తున్నట్టు.”

‘ఈ రాకే్ష్ నీ ఓ కంట కనిపెట్టాల్సిందే’ మనసులో తీర్మానించుకున్నాడు నిగమ్. ఇలాంటి కుర్రాళ్లు సరదా కోసం సాహసం చేస్తారు. విజయం సాధిస్తే సాధిస్తారు లేదా అనుకోని కష్టాల్లో కూరుకుపోతారు. కాపాడుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటే వీళ్ళు సంఘానికి చాలా ఉపకారం చెయ్యగలరు. రాకేష్, సురేష్ నెమ్మదిగా సార్ నించి అంకుల్ లోకి దిగడం గమనించి నవ్వుకున్నాడు. మళ్ళీ సెల్ మోగింది “సార్, బాడీని పోస్ట్ మార్టెమ్‌కి పంపించాం. ఆ రోడ్డు పూర్తిగా క్లోజ్ చేసి డైవర్ట్ చేస్తున్నాం.”

“నేను వొస్తున్నా.”

“కమాన్ గైస్ ఇంక పోదాం” కారు స్టార్ట్ చేసాడు.

“రాకేష్, నాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వెంటనే నీదగ్గరికి నేనో, నాదూతలో వొచ్చి వాలిపోతాం. నువ్వు హెల్ప్ చెయ్యాలి.”

“ష్యూర్ అంకుల్” సంతోషంగా అన్నాడు రాకేష్.

“సురే,ష్ నువ్వుకూడా” సురేష్ వైపు తిరిగాడు నిగమ్. “ఓ కే అంకుల్” బుధ్ధిగా అన్నాడు సురేష్.

“ఇంకో విషయం మనం ఇలా గీరూ చేస్తున్న డ్రగ్ డీలింగ్ గరించి కూపీలాగుతున్నాం అని ఎవరికీ చెప్పద్దు. చాలా సీక్రెట్‌గా ఉంచాలి. ఉంచగలరా?” ఇద్దరూ కాస్త గంభీరంగా తలలూపారు.”నేను ఇంకొంచెం ఇంక్వయిరీలు చేయిస్తాను. తరవాత మీ ఫ్రెండ్స్‌లోనే ఎవరైనా మనకింకా ఉపయోగపడే వాళ్లుంటే చెప్తాను. వాళ్లని కాంటాక్ట్ చేద్దాం” సురేష్, రాకేష్ ఆ క్షణంలో చాలా ఎదిగిపోయినట్టుగా అనుభూతి పొందారు. వాళ్ళిద్దరినీ వాళ్ళ ఇళ్ల దగ్గర దింపేసి సిరీ వాళ్ళ రోడ్డువైపు దారితీసింది నిగమ్ కారు.

***

నిగమ్ వెళ్ళేసరికి ఇంకా రోడ్డునిండా పోలీసులు ఉన్నారు. జనం చాలామంది గుమిగూడి చర్చించుకుంటు న్నారు. ఒక కానిస్టేబుల్ నిగమ్ దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకువచ్చాడు. అతను “నేను చూస్తూనే ఉన్నానండి ఇట్నించి సైకిల్ తొక్కుకొస్తున్నానండి. నాపక్కనించి కార్లూ స్కూటర్లూ పోతూనే ఉన్నాయండి. ఆపోజిట్ సైడ్ నించి ఆ మనిషొచ్చిందండి. ఏ వెహికిలూ తగల్లేదండి. ఉన్నట్టుండి తనంతట తనే రోడ్డుమీద అడ్డంగా పడిపోయిందండి. పాపం అందరూ టక్కన బ్రేకులేసేసుకుని ఆగిపోయారండి” అంటూ చూసిందంతా వర్ణించాడు. చుట్టుపక్కల అందరూ అతను సరిగ్గానే చెప్తున్నాడంటూ వంతపాడారు.

వరండాలో నుంచుని రోడ్డుమీది తతంగాన్ని చూస్తున్న విరి, “అమ్మా, అరుగో మనింటికొచ్చిన పోలీసాఫీసర్ అక్కడున్నారు” చూపించింది. “పోనీలే ఆయన పని ఆయన్ని చేసుకోనీ”. ఎక్కడ ఈపిల్ల ‘హాయ్ అంకుల్’ అంటూ వెళ్ళి ఆగొడవలో చేరిపోతుందోనని సుశీల భయం.

గేటుదగ్గరే నిలబడి అందరి మాటలూ వింటున్న సీతమ్మ కూడా మళ్ళీ వరండా ఎక్కింది. “ఆ మనిషిని ఏంబులెన్సులోకెక్కించే ముందూ ఫొటోలు తీసారు. ఇదుగో ఇప్పుడు మళ్లీ ఆమె రోడ్డు మీద పడ్డ చోట్లు కూడా ఫొటోలు తీస్తున్నారు. ఏంచేస్తారమ్మా ఇవన్నీ పోటోలు తీసి?” అని విస్తుబోయింది. “కానీ మహా ప్రభో! ఆ చంటిపిల్లని మాత్రం చూడలేక పోయారందరూ. మహా హృదయవిదారకంగా ఉంది.”

అసలే మనసు పాడైపోయి చెప్పకోలేని వేదనలో ఉన్న సుశీల ఇంక భరించలేక పోయింది. “ఇంక చాలు ఆ వర్ణన సీతమ్మా, జరిగిందేదో జరిగింది. మనకి ఏమీ సంబంధం లేదీ సంఘటనతో. ఇంక మర్చిపోదాం ఇంక లోపలికి పదండి.”

పక్కింట్లోంచి రామారావు, ఇంకొంతమంది చుట్టాలూ కూడా రో్డ్డుమీదకి చూస్తున్నారు. “ఏంటో ఈ కాలనీకి ఏదో శని పట్టినట్టుంది” వాళ్ళల్లో ఎవరో అనడం విని నిట్టూర్చింది సుశీల.

సుశీల, పిల్లలు లోపలికి వెళ్ళిపోయారు. సీతమ్మ కూడా లోపలికి వచ్చి హాల్లో తన పక్క పరుచుకుంది.

ఆ రాత్రి సిరికి నిద్ర పట్టని కాళరాత్రే అయింది. “అమ్మా, నాకిక్కడ ఉండాలని లేదు. కొన్నాళ్ళెక్కడికైనా వెడదామా?” తల్లి పక్కనే పడుకుని అడిగింది.

“వెడదాం. నా ప్రెండొకావిడకి ఫార్మ్ హౌస్ ఉంది నాలుగురోజులు అక్కడ గడిపి వద్దామా?”. అడిగింది సుశీల. “అబ్బా ఎవరూ లేని ఒంటరి ప్రదేశానికి కాదు. పదిమంది మధ్యలో ఉండేలాగా”

“అమ్మమ్మా వాళ్ళింటికి వెడదామా?” సిరి ఆలోచించింది.

“వొద్దులే మళ్లీ ఎమ్సెట్ ప్రిపరేషన్ దెబ్బతింటుంది.”

సుశీల మాటాడలేదు.

“ఇప్పుడు మహా ప్రిపేరయిపోతున్నట్టు! పోదాం పద. తాతగారి ఊరంటే పెద్ద ఊరే. అదేం లోన్లీ ప్లేస్ కాదులే” విరి పోట్లాటకు దిగింది.

“ఇక్కడికంటే అక్కడ పవర్ కట్సెక్కువ. ఇంటర్నెట్ ఇంట్లో ఉండదు. షాపుకు పోవాలి” కూల్ గా తాతగారింటికి వెడితే నష్టాలు ఏకరువు పెట్టింది సిరి.

“డల్లుగా కనిపిస్తావ్ గానీ నీకూ బుర్రుందేవ్!” మెచ్చుకుంది విరి. “విరీ, నీకు గంతులూ దూకుడూ ఎక్కువ దానికి ఆలోచన ఎక్కువ” నవ్వింది సుశీల. “ఊఁ నీకు మాత్రం అదంటేనే మక్కువ ఎక్కువ” బుంగమూతి పెట్టింది విరి.

“ఇందాకటి చంటిపిల్లే కళ్ల ముందుకొస్తోంది” బాధగా అంది సిరి.

“నాకూను. ఏమిటేమిటో చెప్పుకుంటున్నారు రోడ్డు మీద వాళ్ళు. బిచ్చగత్తె అని కొందరంటే కాదు మెంటల్ హాస్పిటల్లో పెట్టారు. కాస్త లోక్లాస్ వాళ్ళు గానీ ముష్టిది కాదు అని కొందరు చెప్తున్నారు” విరి తను విన్నది చెప్పింది. ముగ్గురూ ఎవరి ఆలోచనలో వాళ్ళుండిపోయారు కాసేపు.

“అబ్బ! ఇంక అవేవీ మాటాడకండి. నా తల పగిలి పోతోంది!” చిన్నగా కేకపెట్టింది సుశీల.

సిరి,విరి ఉలికిపడ్డారు. సిరి తల్లికి దగ్గరగా జరిగి మెడ చుట్టూ చేతులు వేసింది. “అమ్మా, అసలు నితిన్ సంఘటన జరిగినప్పటినించీ నువ్వసలు మామూలుగా ఉండట్లేదు. మేం ఇద్దరం చాలా బాధపడుతున్నాం నువ్వు నీలో నువ్వే బాధపడుతూ కుంగిపోతుంటే మాకిద్దరికీ భయం వేస్తోంది, నీ ఆరోగ్యం దెబ్బతింటుందేమోనని. నీ బాధేమిటో మాతో చెప్పుకుంటే నీకూ భారం తగ్గి కాస్త బావుంటుంది.” నెమ్మదిగా బతిమాలుతున్నట్టు అడిగింది సిరి. సుశీల లేచి దిండుకానుకుని కూచుంది.

“నేనూ చెప్పాలనే అనుకుంటున్నాను. మీ ఎగ్జామ్స్ అయిపోయాక చెప్దాం అనుకున్నాను” అంది. “పరవాలేదులే అమ్మా మేం ప్రిపేర్డ్ గానే ఉన్నాం. నీ బాధ మేం తట్టుకోలేకపోతున్నాం. నువ్వేం చెప్పినా మేం మనసు పాడుచేసుకోం. మా ఇద్దరికీ స్టడీస్ ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసుకదమ్మా”.

“నిజమే. ఇప్పుడు మరీ చిన్న పిల్లలేం కాదు మీరు. నా బాధ పంచుకునేందుకు మీకంటే దగ్గర వాళ్ళెవరూ లేరు నాకు”. కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ మొదలు పెట్టింది. “చెప్పాను కదా నేను పెరిగిన ఊరు పెద్దపట్నమూ కాదు అలాగని పల్లెటూరూ కాదు. నా స్కూలు చదువై కాలేజీ కొచ్చే నాటికి మా ఊళ్ళోనే డిగ్రీ కాలేజి వెలిసింది. కానీ నేను కాలేజీకొచ్చేనాటికి మా కుటుంబం కాకినాడలో స్థిరపడ్డాం. నా కాలేజీ చదువు ముగిసే నాటికి చాలామంది అమ్మాయిలు యూనివర్సిటీ చదువులకెళ్ళడం, ఉద్యోగాలు చెయ్యడం పరిపాటి అయిపోయింది. నన్నూఎమ్మేకి వైజాగ్ పంపి చదివించారు మావాళ్లు. నేను ఫైనల్ పరీక్షలు రాసి వచ్చేసరికి పెళ్ళి సంబందం కూడా సిధ్ధం చేసి పెట్టారు. మీ నాన్న కర్నాటకలోని ఓ యూనివర్సిటీలో మేథ్స్ ప్రొపెసర్.”

సిరి, విరి పుట్టాక జీవితంలో తండ్రి గురించి సుశీల ప్రస్తావించడం ఇదే మొట్టమొదటిసారి. ఇద్దరూ ఏదో వివరించలేని అనుభూతికి గురయ్యారు.

“మీ నాన్న మీ ఇద్దరిలాగానే చాలా అందంగా ఉండేవారు” సిరి, విరి శరీరాల్లో ఏదో తెలీని పులకింత. ఇద్దరూ తల్లికి దగ్గరగా జరిగి చెరో భుజం మీదా తలలాన్చారు. “తన సబ్జెక్ట్‌లో నిష్ణాతుడిగా ఆయనకు మంచి పేరే ఉండేది”.

“జాన్ నేష్ లాగానా?” ఆత్రంగా అడిగింది విరి.

“అంత మేధావి కాకపోయినా ఆయన డాక్టరేట్ థీసిస్‌కి చాలా మంచి ప్రచారం వచ్చిందని విన్నాను. టీచింగ్‌లో కూడా మంచి పేరే ఉండేది. కానీ కానీ…” బాధగా కళ్ళుమూసుకుని మోకాళ్ళ మధ్య తల దాచుకుంది సుశీల.

“చెప్పమ్మా నువ్విలాగే కుంగిపోతుంటే బాద ఎక్కువవుతుందే కానీ తగ్గదు. చెప్పమ్మా” సుశీల భుజాలు పట్టుకు కుదిపేసింది సిరి.

“మనం ఆ మేధావుల జీవితాలలో చదివినట్టే మీ నాన్నక్కూడా పేరనాయిడ్ స్కీజోఫ్రేనియా అనే మానసిక వ్యాధి ఉండేది”. ‘నేనిది ముందే ఊహించాను’ అన్నట్టు సిరి వైపు చూసింది విరి. “అంటే నాన్న ఏం చేసేవారమ్మా?” నెమ్మదిగా అడిగింది సిరి. అమ్మ పొరబడిందేమోనని సిరి మనసులో చిన్న ఆశ.

“ఆరోజు మనింటికి వచ్చిన డాక్టరుగారు చెప్పినప్పుడు విన్నావుగామ్మా వాళ్లకి డెల్యూషన్స్, హేల్యూసినేషన్స్ అలాంటి లక్షణాలు ఉంటాయని?”

“ఆ మాటలకు అర్థం తెలుసు. ఏ డిక్షనరీ చూసినా తెలుసుకోవచ్చు. కానీ నాన్న ప్రవర్తన ఎలా ఉండేది అది తెలుసుకోవాలనుంది. ఏంచేసేవారు?”

“మొదమొదట నాకు ఏమీ అర్ధమయ్యేది కాదు. ఆయన దేనికీ నేచురల్‌గా సహజంగా అందరూ ఎలా స్పందిస్తారో అలా స్పందించట్లేదని మాత్రం అర్థమయింది. అతనికి తనదైన లోకం ఏదో ఉండేది. ఆ లోకంలో అతడు మహా మేధావి. మారువేషంలో ఉన్న మహారాజు. తన మేధాశక్తిని భరించలేని లోకం తన సామ్రాజ్యాన్ని కూడా కొల్లగొట్టింది. అందుకే తను మామూలుగా అందరి లాగా ఉద్యోగం చెయ్యవలసి వస్తోంది. తన మేధా శక్తికి గుర్తింపురాకుండా డిపార్ట్‌మెంటులో ప్రతి ఒక్కరూ ఏవేవో కుట్రలు పన్నుతూ ఉంటారు. అతని మస్తిష్కం నిండా భ్రమలే. ఎన్నెన్నో భ్రమలు! అదే డాక్టర్లు చెప్పే డెల్యూషన్ అని అనుకుంటున్నాను ఇప్పుడు. ఒక్కోసారి తనని ఎవరో బెదిరిస్తున్నారని, ఉద్యోగంలో తన అభివృధ్ధిని అడ్డుకుంటున్నారని. తనకి ఏవేవో బెదిరింపులు వినిపిస్తున్నాయనీ గొడవ చేసే వారు. అవన్నీ నేను చేయిస్తున్నానని భ్రమపడి నన్ను చాలా బాధలు పెట్టేవారు.”

“కొట్టేవాడామ్మా?” ఆదుర్దాగా అడిగింది విరి. అవునన్నట్టు తలూపింది. “ఒకటి కాదు. అయితే అతనికి ఏదైనా మానసిక సమస్యేమో నని అనుమానించడానికి నాకు చాలా కాలం పట్టింది. కోపం ఎక్కువ అనుకుని భయపడేదాన్ని. తరవాత తరవాత నా శీలం పట్ల విపరీతంగా అనుమానం పెంచుకున్నారు. ఇదీ అని ప్రత్యేకంగా చెప్పలేను చాలా గొడవలు పెట్టేవారు. చివరికి ఒకరోజు అర్ధరాత్రి నన్ను బయటికి గెంటేసి తలుపు వేసుకున్నారు. మాతోనే ఉండే మా అత్తగారికి కొడుక్కు మానసికవ్యాధి ఉందని తెలుసు. కానీ నా పట్ల ఆవిడకి ఏమీ సానుభూతి ఉండేది కాదు. ఏ సహాయమూ చేసే వారు కాదు. బయటకు గెంటిన రాత్రి నేనింక భరించలేక పోయాను. ఆ రాత్రి సిగ్గువిడిచి పక్కింట్లో ఆశ్రయం అడుక్కుని తెల్లారుతుండగా బస్టాండుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చే బస్సెక్కేసాను, మూడు బస్సులు ఎక్కి దిగి మా ఊరు చేరుకున్నాను. అప్పుడు మీరు నా కడుపులో ఉన్నారు.” విరి సిరి జాలిగా తల్లిచుట్టూ చేతులు వేసారు.

“తరువాత కొందరు చుట్టాలను మధ్యవర్తులుగా పంపారు మా అత్తగారు. ‘మీరు రండి. అతనికి వైద్యం చేయిద్దాం’ అని తాతగారు కబురు పంపారు. అత్తగారు సహకరించలేదు. ఆ తల్లీ కొడుకుల సంగతి తరవాత నాకు తెలియదు. తాతగారు నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. నేను డాక్టరేట్ చేసి లెక్చరర్‌గా స్థిరపడ్డానంటే అమ్మమ్మ తాతగార్లు ధైర్యాన్నివ్వకపోతే సాధ్యమయ్యేది కాదు.”

ముగ్గురూ చాలాసేపు ఎవరి ఆలోచనలో వారుండి మౌనంగా గడిపారు. విరి నెమ్మదిగా మంచం దిగి స్టడీ రూములో చేరి కంప్యూటర్ ఆన్ చేసింది. నిద్ర వచ్చే వరకూ అక్కడే గడిపింది.

సిరి, సుశీల ఆలోచనలలో మునిగి ఎప్పుడో తెలతెలవారుతుండగా నిద్ర పోయారు. వాళ్ళకి విరి ఏం చేసిందో ఎప్పుడు నిద్ర పోయిందో తెలియదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here