మనోమాయా జగత్తు-9

0
11

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 9వ అధ్యాయం. [/box]

[dropcap]గీ[/dropcap]రూ ఇంటి చుట్టూ మఫ్టీలో పోలీసుల్ని పెట్టాడు నిగమ్. ఆ ఇంట్లో రాకపోకల మీద ఓ కన్నేసి ఉంచి అన్నీ రికార్డ్ చేసి సమాచారం అందించడం వాళ్ళ డ్యూటీ. ఆ మధ్యాహ్నం నిగమ్‌కి మెసేజ్ వచ్చింది.

“సార్. పెద్ద వేన్‌లో చాలామంది వచ్చారు. గంట క్రితం లోపలికి పంపించాడు వాచ్‌మన్. ఇంకా బైటికి రాలేదు. వాళ్ళు నీలాంబరితో ప్రచారానికి వెళ్ళే వాళ్ళల్లా లేరు. ఎందుకంటే నీలాంబరి కాన్వాయ్ సిటీ అవుట్‌స్కర్ట్స్ దాటి పోయిందని రిపోర్ట్స్ వస్తున్నాయ్”

“ఆల్రై ట్. మరి గీరూ లేడా లోపల?” అడిగాడు నిగమ్.

“లేడు సార్. ఇందాక బిపిబిపి ప్రచార బేనర్లు కట్టుకుని ఒక క్వాలిస్ వచ్చింది. అందులో ఎక్కుతూ కనిపించాడు. ఆ తరవాత అతని ఫాదర్ వచ్చాడు. వచ్చాక ఇంక ఉండిపోయాడు. ఎక్కడికీ కదల్లేదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు మరి ఈ ఫాదర్ కోసమే వచ్చుంటారు. కానీ బెయిలు మీద తిరుగుతున్నాడు చూడండి, డ్రగ్ డీలర్ డూండీ అతను కూడా వాళ్ళల్లో ఉన్నట్టు కనిపించింది. వేన్ లోంచి ఎవరూ గేటు బయట దిగలేదు. వేన్ లోపలికి పంపించేసాడు సెక్యూరిటీ.”

“ఆల్రైట్ చూస్తూండండి. అనుమానం వస్తే ఏక్షన్ లోకి దిగండి.”

“ఎస్ సర్.”

***

దేవీ నీలాంబరి ఎన్నికల ప్రచారానికి స్వయంగా రథయాత్ర ప్రారంభించబోతోందన్న వార్త రాష్ట్రంలో గొప్ప సంచలనం సృష్టించింది. మారుమూల పల్లెటూర్లను కూడా వదలకుండా ఊరూరా ప్రయాణించి ప్రచారం చేసేందుకు బిపిబిపి పార్టీ ప్రముఖులు మహావ్యూహం తయారుచేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఎలెక్ట్రానిక్ మీడియా సంగతి చెప్పనే అక్కరలేదు. పోటీ పడి నీలాంబరి విజువల్స్ పాతవీ కొత్తవీ ఆపకుండా ప్రదర్శించారు. అదంతా నీలాంబరీ ట్రస్టునుంచి కోట్లకొద్దీ నోట్లు ఆయా ఛానెల్సు గుమ్మాలవద్ద గుమ్మరించడం వల్ల లభిస్తున్న పెయిడ్ న్యూస్ కవరేజి అని ప్రతిపక్షాల వాళ్ళు ఆరోపించారు.

నీలాంబరి లాంటి ఆధ్యాత్మిక గురువు రాజకీయాల్లోకి రావడం వల్ల దేశానికి మేలే గాని కీడు జరగదని ప్రగాఢంగా విశ్విసించిన సామాన్య ప్రజానీకం మాత్రం ప్రతి పక్షాల హోరు పట్టించుకోలేదు. ‘ఆవిడకి కనీసం దైవ భక్తి ఉంది. ఈ కరుడుగట్టిన పాత పార్టీలకు దైవ భక్తీ లేదు దేశ భక్తీ లేదు’ అని చెప్పుకున్నారు. వోటేసే మాట ఎలా ఉన్నా నీలాంబరి నిర్వహించే బహిరంగ సభలకు వెళ్ళి తీరాలనుకున్నారు. దేవీ నీలాంబరిని దర్శించుకుంటే చాలు ఎంతో మందికి జీవితసమస్యల నుంచి పరిష్కారం లభించింది. ఆవిడ దర్శన భాగ్యం కోసమైనా ఆవిడ ప్రసంగించే సభలలో పాల్గొనాలి అన్నతపన పెరిగిపోయింది జనంలో.

రాష్ట్రమంతా ఒకే రకంగా ఎన్నికల జ్వరంతో వేడెక్కిపోయింది. నీలాంబరి యాత్ర కోసం ప్రత్యేకమైన వేన్ అన్ని సౌకర్యాలతోను తయారైంది. దానిని ఇండస్ట్రియలిస్ట్ రాజేశ్వరరావు ప్లాన్ చేసి చేయించాడని చెప్పుకున్నారు. కొడుకు పోయిన దుఃఖాన్నించి మరిచిపోయేందుకు రాజేశ్వరరావు, సుమతి దంపతులను తనతో పాటు ప్రజాసేవ యాత్ర చెయ్యమని నీలాంబరీదేవి వాళ్ళని అడిగిందని, యాత్రలో తనకు తీరికైనప్పుడల్లా వాల్ళకి ఆధ్యాత్మిక ప్రబోధలు చేసి ఉపశమనం కలిగించే ఉద్దేశంతోనే వాళ్ళని రమ్మని నీలాంబరీదేవి అడిగిందని వార్తలొచ్చాయి. ఒక శుభముహూర్తాన దేవీనీలాంబరి భక్తి ప్రచార జైత్రయాత్ర ప్రారంభించింది.

***

రాత్రి పదకొండింటికి రాకేష్ సెల్లు మోగింది. చదువుతున్న టెక్స్ట్ బుక్ పక్కన పెట్టి తీసి చూసాడు. ‘నిగమ్!’. ఉత్సాహంగా “హలో అంకుల్” అన్నాడు.

“రాకేష్, ఇప్పడు నిన్ను ఇన్స్పెక్టర్ సంజీవ్ కాంటాక్ట్ చేస్తాడు. అతనొకవేళ తనతో నిన్ను రమ్మంటే వెళ్ళగలవా? నీకు చదువుకోవాల్సిన పనున్నా, మీ పేరెంట్స్ ఒప్పుకోరనుకున్నా ఓకే. నువ్వు వెళ్ళనక్కరలేదు. నేను నిన్ను ఎందుకు అడుగుతున్నానంటే గీరూ నిన్ను చాలా బ్లైండ్‌గా నమ్ముతున్నాడు. డ్రగ్ డీలింగ్ లాంటి దొంగపనులు చేసేవారు సాధారణంగా తమ నీడని తామే నమ్మరు. నువ్వుంటే ఎవరికైనా గీరూని కలుసుకోడానికి పాస్‌పోర్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే అతనితో నువ్వెళ్ళు”.

“తప్పకుండా అంకుల్ మీ ఇన్వెస్టిగేషన్‌లో నాకు చేతయినా హెల్ప్ ఏదున్నా చేస్తాను.”

ఇంకో రెండునిముషాల్లో మళ్ళీ ఫోన్ మోగింది.

“నేను ఇన్స్పెక్టర్ సంజీవ్. మీ ఇంటి ముందే ఉన్నాను.”

“వస్తున్నా”నని లేచాడు. హాల్లో చూసాడు. అప్పటికే లైట్లార్పేసి గాఢనిద్రలో ఉంది తల్లి. తండ్రి ఇంకా ఇల్లు చేరలేదు.

‘నేను మా ఫ్రెండ్ రమ్మంటే అతనితో వెడుతున్నాను. మళ్ళీ రేపు సాయంత్రానికి వచ్చేస్తాను’ అని చిన్న నోట్ రాసి మేగ్నెట్‌తో ఫ్రిజ్‌కి పెట్టాడు. నెమ్మదిగా డూప్లికేట్ కీస్ జేబులో వేసుకుని చప్పుడు చెయ్యకుండా ఇవతలకొచ్చేసి డోర్ లాక్ పడేలా గట్టిగా లాగి రోడ్ మీదకొచ్చాడు. రోడ్డవతల పార్క్ చేసున్న జీపులోంచి ఎవరో చెయ్యూపుతున్నారు. వెళ్ళాడు.

“నేను సంజీవ్” కార్డ్ చూపించాడు. జీపెక్కాడు రాకేష్.

“గీరూ, నీలాంబరి కాన్వాయ్‌తోపాటు కాకినాడ రూట్లో వెడుతున్నాడు. వాళ్ళెక్కడుంటే అక్కడ కలుసుకుందాం అతన్ని” అన్నాడు సంజీవ్.

సరే అన్నట్టు తలూపాడు. చెయ్యబోతున్న సాహసయాత్ర తలుచుకుని గుండె అత్యుత్సాహంతో స్పీడుగా కొట్టుకుంది.

***

విరి ఆ రోజు రాత్రి నెట్‌లో ఏం చూసిందో ఏం చదివిందో ఎవరూ పట్టించుకోలేదు. కానీ విరికి తనకేదో మార్గం దొరుకుతున్నట్టుగా అనిపించేది. పూర్తిగా స్కీజోఫ్రేనియా లక్షణాలేమిటో తెలుసుకుంది. తరవాత వాడవలసిన మందులు ట్రీట్‌మెంట్ మెథడ్స్ చదవడం మొదలు పెట్టింది. కానీ అది తనకున్న పరిజ్ఞానపు పరిధిలో అర్థం చేసుకోడం చాలా క్లిష్టమైన సమాచారం అని తెలిసింది. కానీ ఏదో ఆశ! స్కీజోఫ్రేనియా వైద్యంలో మార్పులు వచ్చాయి. కానీ మందులు, వాటి కాంపోజిషనూ చదువుకుంటూ పోవడం తప్ప చేసేదేం లేదు. అయినా అలాగే టైమ్ దొరికినప్పుడల్లా బ్రౌజింగ్ చేస్తూ ఉండేది. అలా వరసగా కేవలం స్కీజోఫ్రేనియా, ట్రీట్‌మెంటు సంబంధించిన వెబ్ సైట్లు వందలకొద్దీ ఓపెన్ చెయ్యడం, అర్థమయినంత మటుకు చదవడం చేస్తుండేసరికి రకరకాల పాప్ అప్స్ స్క్రీన్ మీదకి వచ్చి ఆకర్షిస్తున్నాయ్. మొదట ఏదోలే అని కొట్టి పారేసినా మెల్లిగా వాటినీ చదవాలన్న ఆసక్తి పుట్టింది.

“మీరు స్కీజోఫ్రేనియా పేషెంటా? మీ వ్యాధి గురించి మీరు తెలుసుకోండి. మా కంపెనీ మందులు వాడి కొందరు రోగులు ఎంత తొందరగా వ్యాధి నయం చేసుకున్నారో తెలుసుకోవాలంటే మా వెబ్ సైట్‌కి లాగిన్ అవండి.” అని కొన్ని, “ఇతర మనోవ్యాధిగ్రస్తులతో స్నేహం చెయ్యండి. మీ పరిధిని పెంచుకోండి” అని కొన్ని. ప్రపంచంలో ఏ ఏ దేశాలలో ఏఏ ఆస్పత్రులలో స్కీజో ఫ్రేనియాకి మంచి వైద్యం దొరుకుందో అని వివరించేవి కొన్నీ. కొన్ని వెబ్ సైట్లు “మీకు మానసిక వ్యాధి ఉన్నా పరవాలేదు. మీ అర్హత బట్టీ ఉద్యోగం ఇస్తాం. ముందుగా ఇంత డబ్బు కట్టాల”నేవి కొన్ని. కొన్ని వెబ్ సైట్లు లాగిన్ అవమని ఆకర్షించేవి. కొన్ని పేయింగ్ సైట్లు. లాగిన్ అయిన మరుక్షణం ఎంత డబ్బు కట్టాలో ఎలా కట్టాలో వివరాలు ఇచ్చేవి. కొన్ని మేమే మీ దగ్గరకొచ్చి డబ్బు కలెక్ట్ చేసుకుంటాం అనేవి. అన్నిటిలోకీ రెండు సైట్లు బాగా ఆసక్తిని కలిగించాయి విరిలో.

“భారతదేశంలో స్కీజోఫ్రేనియా రోగులకు సహాయం చెయ్యదలుచుకున్నారా? మాతో చేతులు కలపండి. మీ వంతు సేవలందించండి. వైద్యవిధానాలలో వస్తున్న మార్పులు తెలుసుకోండి. మందులు కొత్తకొత్తవి వస్తున్నాయ్. అన్నిటి వివరాలు మీకిస్తాం” అంటూ చాలా ఆకర్షణీయమైన మాటలతో ఒక పాప్ అప్ వస్తుండడం చూసి ఎడ్వర్టైజ్మెంట్ తరచు చూసి చూసి అది ఒక రోజు ఓపెన్ చేసింది.

బారతదేశంలో తరతరాలుగా ఉన్న వైద్యవిదానాల గొప్ప దనం వివరించారు. లక్ష్మణుడిని బతికించిన సంజీవని గురించి వివరించి ఇంతటి విజ్ఞానం ఉన్న మనదేశపు వైద్యం కాదనుకుని విదేశీ మందుల వెంటపడడమే మన దేశంలో మనోవ్యాధుల పట్ల అవగాహన, సరైన వైద్యసదుపాయాలు లేకుండా చేసింది అంటూ సాగిన ఆ రైట్ అప్స్ చదువుతుంటే కుతూహలం ఆపుకోవడం కష్టమైంది విరికి. తమ వెబ్ సైట్‌లో రిజిస్టర్ అయిన వారికి ఉచితంగా సమాచారం అందుతునే ఉంటుంది అన్న హామీ చదివి, అందులో చెప్పిన స్టెప్స్ పాటించి తన మెయిల్ ఐడి, పాస్‌వర్డ్ మొదలైన వివరాలతో రిజిస్టర్ అయింది. వ్యక్తిగత వివరాలు చాలా ఫీడ్ చెయ్యవలసి వచ్చింది. అన్నీ భక్తిగా టైప్ చేసింది.

ఆ క్షణం నించీ విరి ఇమెయల్ లోకి రకరకాల మెయిల్స్ రావడం మొదలైంది.

చూర్ణము లేహ్యము అనే మాటలు వివరించి వాటి తేడాలను విప్పి చెప్పడం దగ్గరనుంచి అదో కోర్సులాగా రకరకాల మందులు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోడం లాంటి విషయాలు చెప్పడం అలా ఉపయోగం ఉందో లేదా అని ఆలోచించనియ్యకుండా ఆసక్తిని పెంచే అనేక అంశాలు ఉండేవి అందులో. తరువాత తరువాత ఇంకా ఆసక్తికరమైన వివరాలు కావాలంటే ఎక్కడ ఎవరిని కలుసుకోవాలో ఎడ్రసులు ఆగకుండా వస్తూనే ఉండేవి.

“నీకు స్కీజోఫ్రేనియా గురించి తెలుసుకుని పరిశోధనలో పాలు పంచుకోవాలనుంటే ఫలానా ఎడ్రసుకి రా. ఫలానా వారిని కలుసుకో” అంటూ రకరకాల పిలుపులు, ఆకర్షణలు. “ఇంటరు పాసయిన విద్యార్హత చాలు. మేమే శిక్షణ నిచ్చి వైద్యులుగా తయారుచేసి పరిశోధకులుగా తీర్చిదిద్దుతాం. మనో వ్యాధికి మందులు కనిపెట్టి భారతీయులు మానవజాతికే మహోపకారం చెయ్యాలి. గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి అందించినవారు భారతీయులే. మన ప్రాచీన ఆలయాలు, కట్టడాలు చూస్తే ఆర్కిటెక్చరంటే ఏమిటో కూడా తెలియనిదశలో ఇతర దేశాలు ఉన్నప్పుడే మనవారు ఆ శాస్త్రంలో ఎంత అభివృధ్ధి సాధించారో అని అన్నదేశాల వారూ కొనియాడారు. భాషావ్యాకరణ శాస్త్రాల సంగతి చెప్పనే అక్కరలేదు. కానీ వైద్యశాస్త్రాభివృధ్ధికి ప్రాచీన భారతీయులు అందించిన విజ్ఞానం వెలుగులోకి రాలేదు. రండి మనం పైకి తీసుకొద్దాం ప్రపంచానికి తెలియచెప్దాం” అలా సాగిపోయేవి ఆ రచనలు.

నాలుగురోజుల పాటు ఆసంఖ్యాకంగా అవి చదివిన విరి ఇంక ఆగలేక పోయింది. ఇదేదో చూడవలసిందే అను కుంది. ఎడ్రసు, ఫోన్ నంబరు జాగ్రత్తగా తన ఫోన్ బుక్‌లో నిక్షిప్తం చేసుకుంది. ఒకటేమిటి లేలేత మనసులను ఉత్తేజపరిచే పదజాలంతో ఆ మెయిల్స్ చూస్తుంటే తప్పకుండా ఇదేదో చూడాలి అన్న తపన విరిలో పెరిగిపో యింది.

సిరి చదువుకుంటూ ఏదైనా సందేహం వచ్చి ఇంటర్నెట్ చెక్ చేసుకుని చూసుకుంటానని అడగంగానే ఇదివరకటిలా “ఇవ్వనుపో. నేను పట్టుకున్నప్పుడే కంప్యూటర్ నీకూ కావాలా?” అని గొడవ పడకుండా గబగబా తను చూస్తున్న సైట్లు క్లోజ్ చేసేసి ఇచ్చేసేది. రెండురోజులు ఇలా గడిచాక సిరికి అనుమానం వచ్చింది. విరి ఏ సైట్లు ఓపెన్ చేసిందా అని చెక్ చేస్తుండేది. ఆ సైట్లు ఎందుకు చూస్తోందో కొంచెం అర్థమైనా మరీ రోజంతా అదే పనిగా చూసి ఏం చెయ్యదలుచుకుంది విరి? అని అనుమానంగా విరిని ఓ కంట కనిపెట్టడం మంచిదని నిశ్చయించుకుంది.

విరి కూడా సర్ఫింగ్ చేస్తూ కొన్ని ఎడ్రసులూ ఫోన్ నంబర్లూ నోట్ చేసుకుంటున్నా, ఇదేదో మోసం కాదుకదా రకరకాల సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి అని కొంత అనుమానం కలుగుతూనే ఉంది. చివరికి కుతూహలమే గెలిచింది. ఆ వయసలాంటిది. ప్రమాదం ఉందని తెలిస్తే కుతూహలం మరింత పెరుగుతుంది.

***

“విరీ! నిజం చెప్పు నువ్వా కంప్యూటర్ ముందు అర్ధరాత్రి అపరాత్రి ఎప్పుడు చూసినా ఏదో చేస్తునే ఉంటావు. ఏం చూస్తున్నావు దేని కోసం సెర్చి చేస్తున్నావు?” సుశీల ఇంట్లో లేకుండా చూసి విరిని అడిగింది సిరి.

“ఏదో తోచకా, నిద్రపట్టకా ఏదో కాసేపు బ్రౌజింగ్ చేస్తే దానికేదో నేను దొంగతనం చేసేస్తున్నట్టు నిలదీస్తావేంటి” అంది విరి తల తిప్పుకుని దొంగచూపులు చూస్తూ.

“విరీ, నువ్వు అమ్మని దబాయించగలవేమోగానీ నన్ను మాయ చెయ్యలేవు. నీ దూకుడూ వ్యవహారం నాకు తెలుసు. నువ్వు నాకు మాటివ్వు. నాతో చెప్పకుండా ఎటైనా వెళ్ళడం కానీ ఎవరితోనైనా అతిగా పూసుకు తిరగడం కానీ చెయ్యనని..” చెయ్యిచాచింది.

“ఇదేవిఁటి? ఏదో వెలిసిపోయి, సౌండ్ ట్రాక్ నాశనమయిపోయిన మహాపాత సినిమాలో సీను గుర్తుకొస్తోంది. ఈ మాటివ్వడాలేంటి?”

సిరి జవాబు చెప్పకుండా చాచిన చెయ్యి చాచినట్టే పెట్టి విరి కళ్ళల్లోకి చూసింది.

“చేసావులే గొప్ప హిప్నోటిజమ్. ఏదో ఏడ్చిపోతావని వేస్తున్నాను చేతిలో చెయ్యి. నీతో చెప్పకుండా ఏేమీ చెయ్యను సరేనా.”

సిరి కొంచెం తృప్తి పడింది.

“ఇప్పుడు నిజం చెప్పు. ఏమిటి అంతలా దేనికోసం సెర్చ్ చేస్తున్నావ్?” సౌమ్యంగా అడిగింది.

“నా సెర్చ్ ఏదైనా ఫలిస్తే నీకే చెప్తాను. నీకు చెప్పకుండా ఏమీ చెయ్యను. చెయ్యను. చెయ్యను.” సిరిచెయ్యి పట్టుకు ఊపేసింది విరి.

అప్పటికి వొదిలేసింది. బాధ్యత తెలిసిన సిరి తల్లికి కూడా ఇంట్లో జరుగుతున్న వి తెలియాలని తామిద్దరి మధ్యా జరిగిన సంభాషణ చెప్పింది.

“సరేలే. నేను కూడా ఏంచేస్తున్నావ్ అంటూ రెట్టిస్తే అది దాని పని బయట కెక్కడికైనా వెళ్ళి చేసుకుంటుంది. మరీ నిఘా వేసినట్టు కాక ఓ కంట కనిపెడుతూ ఉండు. నేనూ చూస్తూ ఉంటా” అంది సుశీల.

సిరికి మాటిచ్చాక విరి వైఖరిలో కూడా మార్పొచ్చింది. ‘నిజమే అసలు తను దేనికోసం తాపత్రయ పడుతోంది? దేనికోసం అన్వేషిస్తోంది? నిజమే తన తండ్రి స్కీజోఫ్రేనిక్. ఆయన ఉన్నాడో లేదో కూడా తెలియదు. తను డాక్టర్ కాదు. మరి ఈ అన్వేషణ లక్ష్యం ఏమిటి?’ ఆత్మ పరిశీలన చేసుకుంది. తన మనో వేదన ఏమిటో తనకే తెలియదు. తను దేనికోసం వెతుకుతోందో అదీ తెలియదు. కానీ ఒక నమ్మకం మాత్రం ఉంది. తను దేనికోసం నిరీక్షిస్తోందో అది ఈ వెతుకులాటలో కనిపించి తీరుతుంది. అది కనపించినప్పుడు దాన్ని తను గుర్తుపట్టి తీరుతుంది. తనకు కావలసినది దొరికితీరుతుంది. అలా అనుకుంటే నిశ్చింతగా అనిపించిది.

***

రాకేష్‌ని తీసుకుని సంజీవ్ వేరే కారులో బయల్దేరాడు. నలుగురు పోలీసులు మామూలు దుస్తుల్లో క్వాలిస్ జీపులో దూరంగా అనుసరిస్తున్నారు. రాకేష్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఏదో మూవీలో హీరోగా నటించేస్తున్నట్టుగా ఉంది. కానీ ఇది సినిమాకాదు. ఇంత సాహసోపేతమైన సంఘటన నిజంగా తన జీవితంలో జరుగుతోంది. ఇందులో తనే ముఖ్యుడు. తన సహాయం మీద ఆధారపడి ఒక నేరస్తుడిని పట్టుకోబోతున్నారు రక్షక భట సిబ్బంది. ఈ ఆలోచన వచ్చాక కొంచెం భయం లాంటిది పుట్టింది. నిజంగా తన వల్ల పనవుతుందా? తీరా గీరూ చాలా మంచివాడు, వాడు నితిన్ లాంటి వాళ్ళకి అమ్ముతున్నది కేవలం ఏదో బలవర్ధకమైన లేహ్యం అని బయటపడితే తనెంత అపహాస్యం పాలవుతాడు! ఉన్నట్టుండి కార్లోంచి దూకి పారిపోవాలనిపించింది.

కాసేపు కళ్లుమూసుకుని కూచున్నాడు. మెరుపులా ఒక ఆలోచన మనసంతా వెలుగు నింపింది. ‘నిజంగానే గీరూ అమ్ముతున్న లేహ్యం వల్ల ఆరోగ్యం కలుగుతుంది కానీ హాని కలగదు. అని తేలిపోతే గీరూ మీద అనుమానం పోతుంది. గీరూ మంచి వాడని ఋజువవుతుంది. అదీ ఒకందుకు మంచిదే. అపోహలు తొలిగిపోయి ఒక యువకుడి అమాయకత్వం బయటపడి, అతను నేరస్తుడు కాడు అని ఋజువవుతే అంతకన్నా కావలసినదేముంది? ఇప్పటి వరకూ తనకు తెలిసిన విద్యార్ధి బృందాల్లో గీరూ అంటే ఎవరికీ కొంచెం కూడా గౌరవం లేదు. వాడేదో చీకటి వ్యవహారాలు నడుపుతుంటాడనే కాస్త బుధ్ధిమంతులైన కుర్రాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వాడు నిర్దోషి అని ఋజువైతే వాడి పట్ల గౌరవం కలుగుతుంది కదా? తనుకాస్త వేళాకోళం పాలవుతే మాత్రం నష్టమేముంది? రాకేష్ గుండె తేలికపడింది. కళ్ళు తెరిచాడు.

“ఏంటి నిద్రొస్తోందా?” నవ్వుతూ అడిగాడు సంజీవ్.

“లేదంకుల్” అలవాటుగా అనేసి “సారీ. నిద్ర రావట్లేదు సర్. ఏదో ఆలోచిస్తున్నా” అన్నాడు.

సంజీవ్ “ఫరవాలేదులే” అన్నాడు సరదాగా నవ్వుతూ.

“ఇప్పుడు మనం సర్, దేవీ నీలాంబరీమా కాన్వాయ్‌ని ఫాలో అవుతూ వెళ్ళి ఎక్కడో ఒకచోట కలుసుకుంటాం కదూ?” అన్నాడు. అవునన్నట్టు తలూపాడు సంజీవ్.

“మనం అప్పుడు గీరూని విడిగా తీసుకెళ్ళి ప్రశ్నలేసి నిజం రాబట్టడం కష్టం అవుతుందేమో. నీలాంబరీమాత అనుమతించదేమో” అనుమానంగా అన్నాడు రాకేష్.

“నీలాంబరి కార్లలో రోడ్డుమీద ప్రయాణించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా తన హెలికాప్టర్లో వెడుతుంది. ఆవిడ భక్తులైన సామాన్య మానవులే రోడ్లమీద ప్రయాణిస్తారు. ఒక పట్టణంలో హెలికాప్టర్ దింపుకుని ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ తన సొంత రథంలాంటి కార్లో చుట్టబెడుతుంది. కాబట్టి మనం గీరూని దార్లోనే పట్టేసుకోవచ్చు” ధైర్యం చెప్పాడు సంజీవ్.

“ఆవిడకి హెలికాప్టర్ ఉందా?” ఆశ్చర్యంతో రాకేష్ కళ్ళు పెద్దవైపోయాయి.

“మినిస్టర్లూ వాళ్ళకే అలాంటివన్నీ ఉంటాయనుకుంటున్నా”. అన్నాడు.

‘ఒకవేళ నీలాంబరి పక్కనే గీరూ ఉన్నా పట్టుకురాగలను. పోలీసుల గురించి సినిమాలో హాస్యగాళ్ళుగా తప్ప మీకేం తెలుసు?’ అనుకున్నాడు సంజీవ్ మనసులోనే నవ్వుకుంటూ.

ఇప్పుడు రాకేష్ మనసు హాయిగా తేటగా ఉంది. ఎంత తొందరగా గీరూ వాహనాన్ని తమ కారు చేరుతుందా అని ఆత్రం మొదలైంది.

***

ఈ నీలాంబరీ రాబోయే సంబరం వల్ల ఓ.పి.లో కాలక్షేపం కోసం వచ్చే వృధ్దులు, నిజంగా మందు అవసరమై వచ్చే వృధ్ధులు తప్ప ఎవరూ ఉండరన్న నమ్మకంతో వచ్చిన యోగి కొంచెం ఆశ్చర్యపోయాడు. అన్ని వయసుల వాళ్ళతోను కిక్కరిసిపోయి, కిటకిటలాడుతూ, కళకళ లాడిపోతున్న ఓపి. ని చూసి. చకచకా నడిచి రూమ్‌లో కూచున్నాక, లీవు పొడిగించకుండా ఆరోజు డ్యూటీకొచ్చిన నర్సు దేవమ్మ ఒక్కొక్కళ్ళనీ లోపలికి పిలవడం మొదలెట్టింది.

యువ నాయకుడిగా చలామణీ అవుతూండే వీరన్నని చూసి, “ఏంటి వీరన్నా, ఊళ్లోకి మహానాయకురాలొస్తుందిటకదా. నువ్వు హడావిడిగా ఊరంతా నువ్వే అయి తిరగాల్సినవాడివి. ఇక్కడ ప్రత్యక్షమయ్యావేంటి? నువ్విలాంటి సమయంలో ఆస్పత్రి చుట్టూ తిరిగితే ఎలా?” అన్నాడు స్టెత్ తగిలించుకుంటూ.

“ఆయ్. చూడండి. గొంతేంటో కిచకిచమన్నట్టొస్తోంది. రేపు నీలాంబరీమాత గారి బహిరంగసభ నిర్వహించాల్సింది నేనే కదండి. మైకులో జైజైలు చెప్పించాలి, కార్రెక్రమంలో ఈరు మాటాడ్తారు ఆరుమాటాడ్తారు అని యనౌన్స్‌మెంట్లు చెయ్యాలి. అబ్బో సాలా పన్లుంటాయండి మాలాంటి కార్యకర్తలకి. మరి గొంతు పోతే ఎలా గండీ. సభంతా గొంతు మీదే కదండీ ఆదారం. మరి ఇప్పుడే ఏదైనా మందు తవరిప్పిస్తే బాగా ప్రాక్టీసు చేసుకుంటా. మా యువకులం అందరం బాగా ఊపుమీదున్నాం అండి. ఆవిడొచ్చేది మొదట కాకినాడ కాకినాడ అన్నారండి. కానండి రాజమంద్రం వెల్లారండి. ఆ సుట్టుపక్కల సబలుచూసుకుని అప్పుడు కాకినాడండి. కాకినాడలో ఎలికేప్టరు దింపుకున్నాక, మొదట పల్లెటూల్లు టూరు చేసాకే అసలు కాకినాట్లో సబంటండి. ఈ పక్కల ఫష్టు బహిరంగ సబ మనూళ్ళోనే నండి.” మొత్తం రిపోర్ట్ ఇచ్చేసాడు వీరన్న. “సూడండి బాబో. తీరా మైకుముందుకెల్లేసరికి గొంతు కీకీ మనకుండా ముందు జాగ్రత్తగా మందిచ్చెయ్యండి”.

యోగి నవ్వుకుంటూ అతని గొంతు పరీక్షించి “ప్రస్తుతానికైతే గొంతులో ఇన్పెక్షన్ ఏమీలేదు. ముందుజాగ్రత్తగా ఏం చేస్తావంటే రోజుకుమూడుసార్లు ఉప్పునీళ్ళు గార్గ్‌లింగ్ చెయ్యి. కాస్త నొప్పి అనిపిస్తే ఈ బిళ్ళలు చప్పరించు” అంటూ జాగ్రత్తలు చెప్పి పంపేసాడు.

మరో ముగ్గురు పేషెంట్లయ్యాక తోటమాలి వీరేశం వచ్చాడు. “ఏంటోనండయ్యగోరూ, మూడురోజులుగా ఒల్లు నెప్పులు. అదిగో ఆ పాపారావేమో ఏంట్రోయ్ తీరా బహిరంగ సబ టయానికి ముసుగుతన్ని పడుకుందారని సూస్తన్నావా లేచి పెచారప్పని చేపట్టాల, సబకి మీ వోళ్ళందరినీ కూడగట్టి తీసుకురావాల అని ఒకటే గొడవండి. మరి ఆయమ్మ ఇయ్యాలొస్తదో రేపొస్తదో అందరం రెడీగుండాలంట” ఏదేదో చెప్పుకు పోతున్నాడు.

అతని వాక్ప్రవాహానికి అడ్డు కట్ట వేస్తూ, “జరమేవయినా ఉందా” అని ఎగ్జామిన్ చేసాడు. అతని ఒళ్ళు నెప్పులు తగ్గేందుకు మందు రాసి ఇస్తూ, “కాంపౌండర్ కనకరత్నం సీసా మందిస్తాడు పట్టికెళ్ళు” అంటూండగా గుర్తొచ్చింది. కనకరత్నం తను ఊళ్ళోలేనప్పు డు ఇతని తాత పోయాడని చెప్పాడని. వచ్చాక ఇతను తనకి కనిపించడం ఇవాళేనని.

“అవునూ, ఏంటి వీరేశం నేనూరినించి వచ్చాక అసలు కనిపించనే లేదు. డ్యూటీక్కూడా రావట్లేదని చెప్పాడు సూరయ్య. మరి ఇన్నిరోజులబట్టీ ఒంట్లో బాగుండకపోతే ఎందుకు నాకు చూపించుకోలేదు. మందుకోసమైనా రాకపోయావా?” అడిగాడు.

“ఏంటో అదే తగ్గిపోద్దిలే రెండురోజులు పడుకుంటే అని ఊరుకున్నానండి. నేన్రాకపోయినా మా అన్నకొడుకును పంపిత్తన్నానండి సెట్లకి నీళ్ళు పోసేటందుకు” అన్నాడు.

“అందుక్కాదు నేనడుగుతున్నది. నేను ఊళ్ళో లేనప్పుడు మీ తాత పోయాడ్ట కదా కనకరత్నం చెప్పాడు ఏవన్నా దిగులు పెట్టుకున్నావా ఏంటి? ఎప్పుడూ లేనిది ఒంట్లో బాలేదంటున్నావ్.”

“మరి దిగులే కదండీ అయ్యగోరు. నాకూ మా అన్నకీ ఆడే దిక్కై పెంచాడండి మాతాత. ఉన్నట్టుండి పోయాడండి. తింటా తిరుగుతా ఉన్నోడే.”

“ఏవయిందసలు?”

“అసలు పండక్కి కూడా కల్లుసారా ఏదీ ముట్టడండి మాతాత. మరి ఈ మద్దెన ఏటయిందో ఏటో ఎవడో ఎదవ గుట్కా అలవాటు జేసేసాడండి. సర్లే ఏదో ముసలాడు అని ఊరుకున్నావండి నేనూ మాఅన్న. గుట్కా అమ్మితే పోలీసులట్టుకుంటన్నారన్చెప్పి ఆ కిల్లీ కొట్టోడు దాన్నే ఆకులో చుట్టి ఏదో లేయ్యమనో ఏదో పేరెట్టి అమ్ముతు న్నాడంటండి. నాకూ తలీదండి. సుట్టుపక్కోల్లు ఆడు పోయాక సెప్తన్నారండి. ఆ ఆకులో గుట్కా మరిగాడండి. మరి అదేవన్నా తేడా చేసిందో ఏటో.”

“ఆకులో గుట్కా కిల్లీ కొట్టతనే తయారుచేసే వాడా?”.

“ఆడి మొహం. అసలు గుట్కా సప్లై దొరకట్లేదని ఏ కొండోడినో పట్టుంటాడండి. అది మాతాత పానాల్లాగేసిందండి. ముసలోడేలెండి. కానీ ముసల్తనంలో ఆ ఎదవ అలవాటు చేసుకునే సరికి అసలుకే మోసం వచ్చేసిందండి.”

“నువ్వివాళ ఊరికే మీటింగులూ గీటింగులూ అని తిరక్క. కాంపౌండరు దగ్గర మాత్రలు పట్టుకెళ్లి వేసుకుని పడుకో. పాపరావు పెద్దమీటింగు టైముకి నీకు ఒళ్ళు నెప్పులు తగ్గిపోతాయ్.”

వీరేశం వెళ్లిపోయాక ఆలోచించాడు.

‘ఆకులో గుట్కా! ఇదేవిటి? ఒకటికి పది కలిపి పుకార్లు చెప్పుకుని కాలక్షేపం చేసే పల్లెటూరి కబుర్లేనా? కాస్తోకూస్తో నిజం ఉందా? సరే ఏ అనుమానం వచ్చినా తనకు ఫోన్ చెయ్యమన్నాడు నిగమ్. చేద్దాం.’ అనుకున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here