మరమానవి

0
6

[dropcap]స[/dropcap]మీప భవిష్యత్తులో ఒక రాత్రి. కారు నేషనల్ హైవే నంబర్ 165 మీద విలాసంగా సున్నితంగా జారిపోయినట్లు పరుగెడుతోంది.

కళాధర్, కరిష్మా కారులో వెనక సీటు కూర్చున్నారు.

డ్రైవర్‌లెస్ ఆటోమాటిక్ కారు అది. ప్రోగ్రాం చేయబడిన గమ్యానికి వెళ్ళిపోతుంది.

వాళిద్దరూ సంతోషంగా వున్నారు. తన్మయత్వంలో వున్నారు. చుట్టూ జరిగిపోయే దృశ్యాలు, చెట్లూ, ట్రాఫిక్ తప్పించుకుని పోతున్న కారులో వాళ్ళకి కనబడటం లేదు.

కారణం… ప్రేమ.

ప్రేమ మానవులని మరో లోకంలోకి తీసుకువెళ్ళగలదు. ప్రేమ, మార్పు లేకుండా సాగిపోయే జీవితాన్ని ఒక్కసారి రాగరంజితం చేయగలదు.

అది సెక్స్ కాదు. కోరిక కాదు. కామం కాదు.

ప్రేమిస్తున్న మనిషి దగ్గర వున్నప్పుడు వచ్చే అద్భుతమైన, సైన్సుకి అర్థం కాని అలౌకిక పారవశ్యం. అది మానవ జాతి కొక్కరికే కలిగే ప్రత్యేకత ఏమో. ప్రేమిస్తున్న వ్యక్తిని చూస్తే మెదడులో Endorphins అనే రసాయనిక పదార్థాలు వెలువడి ఒక విధమైన అనందాన్ని కలగజేస్తాయని శాస్త్రజ్ఞులు, పరిశోధనలలో కనుగొన్నారు.

అందుకే ప్రేమ దైవత్వం.

…కాని కళాధర్, కరిష్మా విషయంలో ఒక తేడా వుంది.

కళాధర్ మానవుడే, బిజినెస్‌మాన్. సిమ్ సిటీకి తరచు వచ్చి గడిపే ఒక కస్టమర్ మాత్రమే.

ఇక్కడ సిమ్ సిటీ అంటే చెప్పాలి.

‘Simulated City’ అంటే నిజాన్ని భ్రమింప చేసేటట్లు నిర్మించిన సిటీ. ఇది నగరానికి దూరంగా నలభై కిలోమీటర్ల దూరంలో వంద ఎకరాల స్థలంలో నిర్మించిన యాంత్రిక నగరం. దీంట్లో అన్ని రకాల వినోదాలు ఏర్పరచారు. సాహసాలు, జంతువుల వేట, అందమైన యువతుల సాహచర్యం, బార్లలో పానీయాలు, హోటళ్ళలో వుండేందుకు విలాసవంతమైన గదులు… వూహించలేని ప్యాకేజీలతో వినోదం.

సిమ్ సిటీలో వుండి పని చేసే వారంతా, యాంత్రిక వ్యక్తులే. రోబోలే.

అంతా ప్రోగ్రామే!

చూడటానికి మామూలు మనుషులు లాగానే వుంటారు. హ్యుమనాయిడ్ రోబోలు అనొచ్చు.

వీరి శరీరంలో కృత్రిమ కండరాలు, రక్తనాళాలు కూడా ఏర్పరచారు. అవయవాలు అన్నింటినీ సృష్టించగలిగారు.

కాని కపాలంలో మాత్రం, మెదడుకు బదులు, హార్డ్ డిస్క్‌లో మెమరీ ప్రోగ్రామ్‌లు రాయబడి వుంటాయి. ఆ వ్యక్తులు రోబోల లాగానే, ప్రోగ్రాం ప్రకారం, వారి యజమాని చెప్పిన ప్రకారం నడుచుకుంటూ వుంటారు.

నచ్చిన కస్టమర్లకు వినోదం, సంభాషణలు, అన్నీ ప్రోగ్రాం ప్రకారమే జరుగుతాయి.

కాని వారు చూసేందుకు అందమైన స్త్రీల లాగానో పురుషులలాగానో వుంటారు. రోబోట్ అనవచ్చు. రోబోలు అని కూడా అనవచ్చు.

వారందరూ అసిమోవ్ గారు చెప్పిన సూత్రాల ప్రకారం పని చేస్తూంటారు. ఎప్పుడో 1945లోనే ఆయన రాసిన సూత్రాలు!

  1. రోబో ఏ మానవుడికీ అపాయం చేయకూడదు. లేదా, తన అసమర్థత వల్ల ఏ మానవుడికీ అపాయం జరిగేటట్లు చేయరాదు.
  2. రోబో, మానవ యజమాని చెప్పిన ఆజ్ఞలని విధేయంగా పాటించాలి, కాని మొదటి రూల్‌కి అడ్డం రాకూడదు.
  3. రోబో తన ఉనికిని కాపాడుకోవాలి. కాని ఆ ప్రయత్నంలో మానవులకి అపాయం కలగ జేయకుడదు. ఈ ప్రయత్నంలో..
  4. మొదటి రెండు సూత్రాలకి విఘ్నం జరగకూడదు.

అంతా బాగానే వుంది.

కాని ఇక్కడే ఒక వింత విషయం జరిగింది.

కళాధర్ మానవుడు. కస్టమర్.

కరిష్మా మానవి కాదు. రోబో.

సిమ్ సిటీకి వచ్చిన కళాధర్ ఆమెని కోరుకున్నాడు. నువ్వు మనిషివే అన్నాడు. నువ్వు కావలసిన దానివి అన్నాడు. నాకు కావాలి అన్నాడు. ప్రేమించాడు.

ఇద్దరు సిమ్ సిటీ సెక్యూరిటీ గార్డులని తప్పించుకుని పారిపోతున్నారు.

ఇద్దరికీ మధ్య ఒకటే బంధం… ప్రేమ.

కాని కళాధర్ ఒక మనిషి . కరిష్మా ఒక రోబో! అందమైన స్త్రీ రోబో.

***

దూరంగా హైవే మీద అడ్డంగా బ్యారికేడ్లు, వెలిగి ఆరే ఎర్రటి దీపాలూ కనిపించాయి.

నీలం యూనిఫారంలో గన్స్ ధరించిన పోలీస్ ఆఫీసర్లు నిలబడి వుండటంలా కనిపించింది.

ఆ దృశ్యం క్రమంగా దగ్గరవుతూ వస్తోంది!

“ఆపు కళాధర్! పోలీస్ చెక్ పోస్ట్. మనం వెళితే చెక్ చేసి పట్టుకుంటారు! సందేహం లేదు!” అంది కరిష్మా.

ఆమె నీలిరంగు జీన్స్ నల్లటి టీషర్ట్ వేసుకుని బంగారు రంగు రింగులు తిరిగిన జుట్టుతో మెరిసే చెవి దుద్దులు బంగారు రంగు గొలుసుతో, మనోహరంగా వుంది.

కాని ఆమె కళ్ళలో ఒక భయం, ఒక పట్టుదల.

“ఎందుకని? మనం ఏం తప్పు చేశాం! సిమ్ సిటీ వాళ్ళడిగిన డబ్బు ఇచ్చి నిన్ను నేను తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు నన్నెవరూ ఏం ప్రశ్నించలేరు. అదే వారికి చెబుతాను!”

“నో కళాధర్! అది అంత తేలికగా జరిగే విషయం కాదు. ముందు కారాపు!”

కారు సడెన్ బ్రేక్ పడి, ఆగింది.

“ముందుకు వెళ్ళి ఎడమ వైపు చెట్లలోని సన్నని దారిలోకి తిప్పు కారుని!”

అతను అలాగే చేశాడు.

“కళాధర్ నేను నిన్ను ప్రేమించాను. నాకు ఈ ప్రేమ ఎలా కలిగిందో తెలియదు. నేను సిమ్ సిటీలో పని చేయడమే తెలుసు…

రోజూ ఉదయం నుంచి కష్టమర్లని ఆహ్వానించడం, వారితో మాట్లాడటం, రాత్రి వారితో గడపటం. ఇవే గుర్తున్నాయి. కానీ… కానీ… నువ్వు నన్ను ఎందుకు ప్రేమించావో తెలియడం లేదు. నా గురించి తెలిసీ…”

చుట్టూ చెట్లూ దట్టంగా పెరిగివున్నాయి. కారు టైర్లు బురదలో కూరుకుపోయాయి. ఇద్దరూ దిగి నడవసాగారు.

కరిష్మా చెప్పింది. “వాళ్ళు వచ్చేస్తారు. నా దగ్గర్నుంచి వాచ్చే సిగ్నల్స్ ఆధారంగా నన్ను పట్టుకుంటారు. పరుగెత్తుందాం!పద!వేగంగా!”

మళ్ళా ఆలోచించి అంది. ఇప్పుడు ఆమె గొంతు మంద్రంగా, యాంత్రికంగా వస్తోంది.

“నా మొదడు వీపు వెనక భాగంలో అమర్చిన బాటరీలు తీసేసెయ్యి. అప్పుడు సిగ్నల్ రాదు. నా శరీరాన్ని నీతో బాటు తీసుకువెళ్ళి పొదల్లో దాచేయి. వాళ్ళు వచ్చినా నేను కనబడను. అదొక్కటే మార్గం. లేకుంటే వాళ్ళు నన్ను మళ్లీ ఆ నరకం లోకి తీసుకుపోయి పడేస్తారు. నిన్ను జైల్లో పెట్టవచ్చు కూడా. క్విక్! నేను చెప్పినట్లు చేయి!

రెండ్రోజుల తర్వాత మళ్ళీ వచ్చి నన్ను బాటరీ సాయంతో తిరిగి ఏక్టివ్ చేయి ప్లీజ్!”

కళాధర్ ఓ క్షణం అయోమయంలో పడ్డ్డాడు.

దూరాన పోలీస్ సైరన్ వినిపిస్తోంది.

వెంటనే కంగారుగా కరిష్మా శరీరాన్ని కౌగిలించుకుని, ఆ వెంటనే ఆమె తల తిప్పాడు.

ఆమె అన్నట్లుగానే మెడకీ తలకీ మధ్య ఒక చిన్న బటన్ వుంది. నొక్కగానే, ఒక చిన్న బ్యాటరీ బయటకి వచ్చింది.

అది జేబులో వేసుకున్నాడు. మరొకటి వెన్నెముక క్రింద వుంది. అది కూడా బయటకి తీశాడు.

అందమైన స్త్రీ శరీరం ఇప్పుడు అచేతనంగా అయింది.

ఆమె శరీరాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి ఒక దట్టమైన పొదలో వేశాడు.

మళ్ళీ ఆలోచించి ఆమె మీద ఆకులు మట్టి కప్పి వేశాడు.

పోలీసులు మైక్‌లో ఆరుస్తున్నారు.

“మీరెవరైనా సరే, చేతులెత్తి బయటకి రండి. లేదంటే కాల్పులు చేయాల్సి వస్తుంది” అని. సైరన్ మోగుతోంది.

కళాధర్ కరిష్మా శరీరాన్ని పొదల్లో దాచేసిన తర్వాత చేతులెత్తి చెట్ల మధ్యగా నడుచుకుంటూ వచ్చాడు.

“డోంట్ షూట్!నా దగ్గర గన్స్ లేవు ఏమీ లేవు. కారు టైరు పంక్చర్ అయి చెట్లలోకి పడిపోయింది. అంతే.”

ముగ్గురు పోలీసులు ఏవో పరికరంతో గాలిలో సిగ్నల్స్ చెక్ చేస్తూ అతని దగ్గరకి వచ్చారు.

“సిగ్నల్స్ లేవు సార్.”

కళాధర్ జేబులోని బాటరీలు తడుముకున్నాడు. అవి వాళ్ళు చూస్తే ప్రమాదం.

“నీ కారు నంబర్ మీద కంప్లయింటొచ్చింది. సిమ్ సిటీలో రోబోని ఎత్తుకుని పోతున్నట్లు. ఆ రోబో స్త్రీ రోబో.

నీకు అక్కడ కస్టమర్‌గా ప్రవేశం వుంది కాని రోబోలని బయటకు తీసుకుపోవడానికి వీల్లేదు. అది నేరం.

ఇప్పుడు కంప్లెయింట్ వచ్చింది. వారి దగ్గర్నుంచి.”

కళాధర్ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అన్నాడు.

“నేను కళా ఇండస్ట్రీస్, సికింద్రాబాద్ మారేడ్‍పల్లిలో వున్న టెక్స్‌టైల్స్ యజమానిని చూడండి.!”

“కారు చెక్ చేయాలి”

“ఓ.కే” దూరంగా చూపించాడు.

బురదలో కూరుకుని పోయిన మెర్సిడెస్ కారు.

కాసేపటికి హైవే పోలీస్ కారు చుట్టుపక్కల చెక్ చేయడం అయిపోయింది.

“ఓ.కే మేము టోయింగ్ సర్వీస్‌కి ఫోన్ చేశాము. వచ్చి మీ కారు తీసుకొని వెళ్తుంది. రిపేరు చేయించుకోండి.

సారీ! మీకు లిఫ్ట్ కావాలంటే సిటీకి తీసుకువెళ్ళి వదిలి పెడతాం.” అన్నాడు ఇన్‌స్పెక్టర్.

“థాంక్యూ… నన్ను సికింద్రాబాద్‌లో ఇంటి దగ్గర వదిలితే ధన్యవాదాలు చెబుతాను.”

 ఆ ఎస్.ఐ.కి మహా ధనవంతులతో ఎలా మెలగాలో తెలుసు. జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి పొలిటికల్ కనెక్షన్స్ కూడా వుంటాయి.

“రండి సార్! సారీ ఫర్ ది ట్రబుల్!

మా వాళ్ళు సిమ్ సిటీ సి.ఇ.ఓ. ఫిర్యాదు మేరకి ఏక్షన్ తీసుకున్నారు అంతే.

కానీ రోబో సిగ్నల్స్ లేవు మరి.

వాళ్ళ బిజినెస్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు. కాని ఏమీ ఎవిడెన్స్ లేనిదే మేం ఏం చేయలేం. మీ నంబర్ ఎడ్రస్ ఇచ్చి పోండి చాలు! మీరు ఫ్రీనే!”

పోలీస్ కాన్వాయ్ హైవే మీద సిటీ వైపు వెళ్ళిపోయింది.

***

రాత్రి 8 గంటలు.

ఊరికి నలభై కిలోమీటర్ల దూరంలో చీకటి చెట్ల మధ్య అస్పష్టమైన గుట్టల మధ్య వున్న సిమ్ సిటీ లైట్లు మాత్రం దేదీప్యమానంగా వెలుగుతున్నాయి.

చాలా మంది అతిథులు వెళ్ళిపోయినా కొంత మంది రాత్రికి అక్కడ వున్న కాటేజేస్‌లో వుండిపోతారు. కొంతమంది బార్లో, డాన్సులు చూస్తూ, రోబో స్త్రీలతో గడపటం, లేక రోబోలతో పేక ఆడటం, లేక సరదాకి బాక్సింగ్ కానీ షూటింగ్ కానీ చేయటం చేస్తుంటారు.

బాగానే వుంటుంది కాని, ఈ వినోదం అందరికీ తేలికగా దొరకదు. ఇక్కడ ఒక రోజుకే సుమారు రెండు లక్షల ఏభై వేల రూపాయలు ఫీజు కట్టాలి మరి.

మీరు కావాలంటే రోబోలని గన్స్‌తో పేల్చచ్చు. వాళ్ళందరు మానవ శరీరాలలోనే వుంటారు. వారు కూడా మిమ్మల్ని కాల్చచ్చు. కానీ మీకు ఏం కాదు. మీరు కాల్చిన తుపాకీ గుండు మాత్రం ఆ హ్యూమనాయిడ్ రోబోలని చంపుతుంది.

కృత్రిమ రక్తం కారుతూ కిందపడిపోతారు. మీకు గెలిచిన ఆనందం దొరుకుతుంది.

ఇలాగే అన్ని వినోదాలూ. శారీరక సుఖాలు కూడా! ఎప్పుటికీ ఆ రోబోలు మనుషులని చంపపు. చంపకూడదు. మానవ శరీరాల లాగానే చేసిన వారి మెదడులో మాత్రం ఈ కంప్యూటర్ ప్రోగ్రాం నిక్షిప్తమైవుంటుంది.

వీటిని పర్యవేక్షించేందుకు, సిమ్ సిటీ సెక్యూరిటీ గార్డులుంటారు. కంప్యూటర్ కంట్రోల్ రూమ్ వుంది.

వీటన్నింటికి లైసెన్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వుంది! ఏదైనా అపాయం జరిగితే శిక్షలున్నాయి.

…కానీ ఈ మధ్య ఈ మానవ రూప రోబోలకి కూడా కొంచెం కొంచెం, తెలివి, స్వంత ఆలోచనలు వస్తున్నాయి. బాధ, సంతోషం ప్రేమ, కోపం, లాంటి ఎమోషన్‌లు కొంచెం కొంచెం కలుగుతున్నాయి.

ఎప్పుడయినా మానవ అతిథులు చిత్రహింసలు, అవమానాలు చేసినప్పుడు… ఒకటి రెండు సార్లు తిరగబడుతున్నాయి రోబోలు. వాటిని ఎమర్జెన్సీ మోడ్‌లో “ఫ్రీజ్” అని నియంత్రించి ఆపాల్సి వస్తోంది.

సిటీ మధ్యలోని పెద్ద భవనంలో మూడో అంతస్తులో కాన్ఫరెన్స్ రూంలో వున్న మేనేజింగ్ డైరెక్టర్ విశ్వనాధానికి ఇదే సమస్యగా వుంది.

కోపంగా వుంది.

విసుగ్గా వుంది.

ఆ రౌండ్ టేబుల్ చుట్టూ ఇంజనీర్లు ఆరుగురు కూర్చుని వున్నారు.

విశ్వనాధం టేబుల్ చివర కూర్చుని వున్నాడు.

స్థూలకాయం, పూర్తిగా జుట్టూడి తల గుండు అయిపోయింది. దానికి సమాధానంగా తెలుపునలుపు వెంట్రుకల ‘గోటీ’ గడ్డం, నీలి రంగు సూటు, గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలోంచి సూటిగా చూసే చూపులు.

ఈ సిమ్ సిటీ అతని సృష్టే!

విదేశాలల్లో చదువుకుని, అక్కడ ఇలాంటివే వున్న రోబో పార్కులు, ఎమ్యూజ్‌మెంట్ పార్కులను, అన్నీ గమనించి, ఇండియాలో హైద్రాబాద్‌కి తీసుకుని వచ్చి ఆ టెక్నాలజీతో ఇక్కడ సిమ్ సిటీ నిర్మించాడు.

అద్భుతంగా సక్సెస్ అయింది. అతను, కృత్రిమ మేధ, రోబోటిక్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీలు తీసుకుని కొన్నాళ్ళు ‘అక్కడ’ పని చేసి వచ్చాడు.

ఇప్పుడు అయిదు వందల కోట్లకి అధిపతి అయాడు.

ఈ రాత్రి ఒక అత్యవసర సమావేశం జరగుతోంది.

“కరిష్మా ఏమయింది? ఎలా ఎస్కేప్ అయింది. ఇంత వరకూ పట్టుకోలేక పోయారు. షేమ్!” బల్ల గుద్ది అరిచాడు విశ్వనాధం, ఎం.డి. “నాకు జవాబుదారీ కావాలి. సాకులు కాదు. పరిష్కారం కావాలి. వాట్ ఇఫ్… వాట్ ఇఫ్ రోబోలన్నిటికీ, స్వంత తెలివి, నిర్ణయాలు తీసుకునే ‘ఎవల్యూషన్’ వస్తే?”

తెల్లటి గది గోడలకి రెండు టీవీ తెరలు ఉన్నాయి. ఇక్కడి నుంచి సిమ్ సిటీ అంతా కనిపిస్తుంది. గేటు దగ్గర నుంచి, బార్లలో, రూములలో అన్ని చోట్ల రహస్య నిఘా కెమేరాలున్నాయి.

“చెప్పు గణేశన్! యూ ఆర్ ఇన్‌ఛార్జ్ ఆఫ్ సెక్యూరిటీ ఆపరేషన్స్! మనం పార్క్ మూసేయాలా?

ఇప్పుడు ఈ స్త్రీ రోబో పారిపోయింది. పోలీసులకి డబ్బిచ్చి పట్టుకోమన్నా, కనిపెట్టలేకపోయారు. కనీసం ఆ కస్టమర్…” ఒక క్షణం దగ్గరున్న తన కాగితం చూసి అన్నాడు.. “పేరు కళాధర్. బిజినెస్ మాగ్నెట్. అతనిని పట్టకోమన్నా, ఆధారాలు లేవని వదిలేశారు.

మళ్ళీ కాగితం చూశాడు. “రెండు నెలల నుంచి ఐదు సంఘటనలు జరిగాయి. నీలం బార్‌లో ఒక మగ రోబో పేరు ‘X 313’ కస్టమర్‌ని చెంప మీద కొట్టాడు. జంగిల్ పార్క్‌లో ఒక కస్టమర్‌ని మరొక రోబో గుర్రం మీద నుంచి పడేసి తొక్కి నిలబడ్డాడు.

నీలి ఆనే స్త్రీ రోబో కస్టమర్ వికృత చేష్టలు భరించలేక అతని మర్మావయవం కొరికేయబోయింది. అతనికి లక్ష రూపాయాలు ఇచ్చి క్షమాపణ కోరాం. లేకపోతే పెద్ద గొడవ అయేది.

ఇలాగే చెదురు మదురు సంఘటనలు. అసలు ఏమవుతోంది?”

గణేశన్ లేచి నిల్చున్నాడు.

చామన ఛాయ, తెల్లసూటులో లావుగా పెద్ద పొట్టతో కొద్దిగా ఆయాసపడుతూ, మాట్లాడసాగాడు. చెమట్లు నుదుటి మీద నుంచి చెంపల మీదగా కారిపోతున్నాయి. జుట్టు బాగా నూనె రాసి దువ్వాడు. అతని ఇంగ్లీషు తమిళ లేక మలయాళీ యాసలో వుంది.

“సార్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌లో ఇది ప్రపంచమంతా ఎదుర్కొంటున్న సమస్యే. మనం రోబోల శరీరాలు అవయవాలు మానవుల లాగానే చేశాం. వాటి మెదడులో వారికి చేయవలసిన కర్తవ్యాలు, సమాధానాలు, ప్రోగ్రాం చేశాం. రెండు రోజుల కొకసారి వాటిని మెమరీ తుడిచేసి మళ్ళీ కొత్త ఆజ్ఞలతో ప్రోగ్రాం చేస్తున్నాం.

వాటి ‘Role Play’ మన ప్రోగ్రాం మీదనే ఆధారపడివుంది… కానీ కానీ కొన్ని సార్లు పాత జ్ఞాపకాలు పూర్తిగా తుడిపివేయబడటం లేదు. కొన్ని మానవ రోబోలని నిజమైన మానవ మెదడులోని టెంపోరల్ లోబ్‌తో కలిసి తయారుచేశాం. అలాంటి వారికి పూర్వ జ్ఞాపకాలు వస్తున్నాయి. అవి స్వంతంగా ఆలోచించే అవకాశం, ప్రోగ్రాం ప్రకారం కాకుండా స్వంతంగా ప్రతీకార చర్యలు, తీసుకునే అవకాశం వుంది.

దానికి పరిష్కారం వాటిని, ఫ్రీజ్ చేసి, మళ్ళా ప్రోగ్రాం చేయడమే! ఇది ఆమెరికా, ఇంగ్లాండ్, చైనా లాంటి అన్ని దేశాల నుంచి రిపోర్ట్ అవుతోంది సార్. నూటికి నూరు శాతం వాటిని నియంత్రించే అవకాశం లేదు. కొన్ని తప్పులు ‘ఎర్రర్స్’, ‘గ్లిచ్‌లు’ తప్పవు!”

విశ్వనాధం తారస్థాయిలో అరిచాడు “నాకు సంజాయిషీలు వద్దు. ఏక్షన్ కావాలి. ఇది కోట్ల బిజినెస్. డు ఆర్ డై లాంటి సమస్య. గో ఎహెడ్, సాల్వ్ ఇట్.”

ఇంతలో నక్క వూళ పెట్టినట్లు, గుడ్లగూబ అరిచినట్లు, కూకూ మని ఎలారం మోగసాగింది. గోడ మీద తెరలలో ‘ఎమర్జెన్సీ’, ‘ఎమర్జెన్సీ’, ‘కోడ్ రెడ్’ అని అక్షరాలు కనిపించసాగాయి.

అత్యవసర సమావేశం నుంచి ముఖ్య అధికారులు అందరూ గబగబా బయటకు పరిగెత్తారు. కంట్రోల్ రూమ్‌కి వెళ్లారు!

***

‘సిమ్ సిటీ’ అన్న పెద్ద వెలిగే అక్షరాలు కల కమాన్ దగ్గర పెద్ద గేటు వుంది.

అక్కడ గేటు కటూ ఇటూ వున్న చిన్న గూడు లాంటి సెక్యూరిటీ క్వార్టర్స్ లోని అద్దాల కిటికీ లోంచి వచ్చే పోయేవారిని చెకింగ్ చేసే గార్డులు కూర్చుని వున్నారు.

ఒక నల్లటి మెర్సిడెస్ కారు విసురుగా వచ్చి ఆగింది. దానిలోంచి ఒక మధ్యవయస్సు మనిషి, ఒక జీన్స్ ధరించి బంగారు జుట్టు వున్న స్త్రీ దిగారు. గార్టులు బయటకి వచ్చి “ఇప్పుడు ప్రవేశం లేదు. రేపే రావాలి” అని చెప్పసాగారు. ఇంతలో వారి చేతిలోని ఎలక్ట్రానిక్ పరికరాలలో నుంచి ఎర్రటి వెలుగు, బీప్ మనే శబ్దం వచ్చాయి.

హఠాత్తుగా వారిద్దరికి అర్థం అయింది.

“అరే కరిష్మా వచ్చేసింది” అని అరిచారు.

రెండో గార్డు ఫోన్ తీసి ‘కరిష్మా’ వచ్చింది అని చెప్పసాగాడు.

తళుక్కున ఒక మెరుపు మెరిసింది.

కరిష్మా చేతి వేళ్ళలోంచి లేజర్ కిరణాల్లా శక్తి కిరణాలు వచ్చినట్లయి ఇద్దరు గార్డులు క్రింద పడ్డారు.

కరిష్మా గార్డు రూంల లోకి వెళ్ళి కంప్యూటర్ ప్యానెల్స్ నొక్కగానే గేటులు తెరుచుకున్నాయి.

కరిష్మా అంది “కళాధర్ నా వెంట నడువు!”

వారిద్దరు సిమ్ సిటీ వీధుల్లో మెల్లగా నడవసాగారు.

ఒక్కొక్క కాటేజీ నుంచి అరుపులు కేకలు వినవస్తున్నాయి.

అవి వచ్చిన అతిథుల అరుపులు. అప్పుడప్పుడు రోబోల నుంచి వచ్చిన శక్తి కిరణాలు కావచ్చు. వాటి తళుకులు మెరుస్తూ వున్నాయి.

కాసేపటికి అందరూ బయటకి వచ్చారు.

మానవాకృతిగా చేయబడిన ‘హ్యూమనాయిడ్స్’. కొందరు ‘కౌబాయ్‌ల లాగా, కొందరు ‘కోయవాళ్ళు’, ‘రెడ్ ఇండియన్స్’ లాగా. కొందరు మామూలు సూట్లలోనూ వున్నారు. స్త్రీలు, అందంగా ఆకర్షణీయమైన దుస్తులలో అదే రకంగా వివిధ గెటప్ లతో తయారు చేయబడ్డారు. వారందరూ బలంగా, ఆకర్షణీయంగా వున్నారు.

కాని సంతోషంగా లేరు. క్రోధంతో మండిపోతున్నారు. వాళ్ళు మానవులు కాదు రోబోలు అన్నదానికి గుర్తు ఒకటే.

వారి కళ్ళు ఒక రకమైన నీలి రంగు కాంతితో ప్రకాశిస్తున్నాయి.

అందరూ ఒకే రకంగా గుంపుగూడి నిశ్శబ్దంగా నిలబడి, మళ్ళీ మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ కంట్రోల్ టవర్ వైపు నడుస్తూన్నారు.

వాళ్ళ మాట్లడకపోయినా వారి మెదడులు నిశ్శబ్దంగా సంభాషించి సమాచారం ఇచ్చిపుచ్చుకున్నట్లు అనిపించింది.

కరిష్మా పరిగెత్తి వెళ్ళి వారి ముందు నాయకురాలిలాగా నిలబడింది.

కళాధర్ ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతనికి భయం వేసింది. వీళ్ళంతా ఒకే మెదడు ఆజ్ఞాపిస్తున్నట్లు నడుస్తున్నారు. అందరూ ఒకరితో ఒకరు సంభాషించుకుంటున్నారు.

నిశ్శబ్దంగా.

నడుస్తున్నారు. ఒక పెద్ద తేనెతుట్టలాంటి మెదడు (Hive Mind) వారి నందరిని నడిపిస్తోందేమో. ‘కలెక్టివ్ కాన్‌షన్‍నెస్!’

కృత్రిమ మేధ ‘తిరుగుబాటు’ లోకి ‘ఎవాల్వ్’ అయింది!

అది చూసిన కళాధర్ గేటు బయటకి భయంగా పరుగెత్తాడు.

కరిష్మా వెనక్కి తిరిగి చూసింది.

ఆమె కళ్ళు నీలంగా మెరుస్తున్నాయి.

“కళాధర్! వుండు! నీకేం కాదు. ఒక గంటలో వచ్చేస్తాను.

నీ కోసం!

ఇద్దరం కలిసే వుందాం!

PLEASE WAIT!”

కళాధర్ అది వినిపించుకోలేదు.

నీడల్లోకి చెట్ల కింద వున్న కారు వైపు పరుగెత్తాడు.

***

సిమ్ సిటీ కంట్రోల్ రూం.

అధిపతుల కాన్ఫరెన్స్ హాలు! గోడలకి తెరలు!

వాళ్ళందరూ ఆ తెరల వంక అప్రతిభులై చూస్తున్నారు.

అలారం క్రూరంగా అరుస్తూ వుండగా, రోబోల గుంపు ఒక సైన్యంలా నడుచుకుటూ కంట్రోల్ రూం వైపు వేగంగా నడుచుకుంటూ వస్తున్నాయి.

వారి వెనక నియాన్ లైట్ల వెలుతురులో దుమ్ము రేగి ధూళి కణాలు వింతగా మిణుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి.

వాళ్ళందరి కళ్ళు నీలి రంగులో మెరుస్తున్నాయి.

“ఎలా ఎలా ఎలా ఇది సాధ్యం!” అరుస్తున్నాడు ఎం.డి. విశ్వనాధం.

సెక్యూరిటీ ఆపరేషన్స్ చీఫ్, “సెక్యూరిటీ గార్డులు ఏరి?” అని చేతిలోని సెల్ ఫోన్ బటన్‌లు తెగ నొక్కతున్నాడు.

రోబోటిక్స్ ఇంజనీర్లు తలలు పట్టుకున్నారు.

ఏదయితే జరగకూడదనుకున్నారో అది జరిగింది. రోబోలకి స్వంత తెలివీ, నిర్ణయం వచ్చేశాయి. అవి ఎలా ఎలా వచ్చేస్తున్నాయి.

“మాల్ ఫంక్షన్, మాల్ ఫంక్షన్” ఒకాయన అరిచాడు.

విశ్వనాధం కోపంగా అరిచాడు. “అది తెలుస్తూనే వుంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో చూడండి!”

కొందరు సెక్యూరిటీ లేజర్‌తో తయరుచేసిన జామర్స్ తీసుకు లోపలికి వచ్చారు.

రోబోలు కంట్రోల్ రూం తలుపులు బాదసాగాయి.

ధడ్! ధడ్! ధడ్…! ఆ చప్పుడు ఎక్కువై తలుపులు ఒక్కసారి బద్దలైనాయి.

రోబోలు లోపలికి ప్రవేశించాయి. వాటికి నాయకురాలు కరిష్మా. ఆమె చేతి వేళ్ళు చూపిస్తే నిప్పులు కురుస్తున్నాయి.

“షార్ట్ సర్క్యూట్” ఒకడు అరిచాడు.

 Short circuit!

“ఎలట్రికల్ ఇంటర్‍ఫియరెన్స్” మరొకడు.

“సెక్యూరిటీ! వాటిని న్యూట్రలైజ్ చేయండి. లేజర్ గన్స్! ఫైర్ !ఫైర్!”

లేజర్ గన్స్ నుంచి ఎర్ర నిప్పుకిరణాలు.

రోబో కరిష్మా కళ్ళ నుంచి నీలి మంటలు.

అప్పుడు అక్కడ ఒక మహా యుద్ధం జరిగింది.

“అందరూ పారిపోండి. ఎమర్జెన్సీ! ఎమర్జెన్సీ! ఆఫీసు ప్రెమిసెస్ ఖాళీ చేయండి. ఫైర్ ఫైర్” అని మైకులలోంచి వచ్చే యాంత్రిక స్వరం అరిచినా ఒక రోబో వేలు పెట్టి చూపెట్టగానే నీరసంగా, బలహీనంగా అయి ఆగిపోయింది.

“ఫ్రీజ్ ఫ్రీజ్” అని కమాండ్స్ నొక్కుతున్నారు. కంట్రోల్ రూంలో మరొక గదిలో ‘Inactivate! ‘కంట్రోల్ Alt Delete’ బటన్స్ నొక్కుతున్నారు.

ఏవీ పని చేయడం లేదు.

అసిమోవ్ మూడో సూత్రం ప్రకారం రోబోలు మనిషికి అపాయం కలుగ చేయకూడదు. వాటికి అపాయం కలిగిన పక్షంలో అవే ఆత్మాహుతి చేసుకునేట్లు ప్రోగ్రాం చేయబడినాయి.

‘SELF DESTRUCT SELF DESTRUCT’ కమాండ్ నొక్కారు. ‘ఆత్మ వినాశనం చేసుకోండి!’

అదీ పని చేయలేదు.

కాసేపటికి సిమ్ సిటీలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగి మంటలు చెలరేగాయి. ఎలక్ట్రిక్ సెక్యూరిటీలు కాలిపోయాయి.

కలలు కన్న సౌధం మంటలలో వెలిగి పోవడం చూసి ఎం.డి. విశ్వనాధం పరుగెత్తబోతూ కింద పడిపోయాడు.

అతడి గుండె అగింది. అది మానవుడి గుండె!

కొన్ని రోబోలు ఇంజనీర్ల కమాండ్‌కి లొంగి కాలిపోతున్నాయి. కాని కొన్ని పని చేస్తున్నాయి.

అంతా గందరగోళం. అవి కంప్యూటర్ శరీరాలు.

కరిష్మా మాత్రం నిప్పులలో నడుస్తూనే వుంది. ఆమె ఇప్పుడు మరొక ‘స్పీషీస్’గా తయారయింది.

ఒక కొత్త ‘రోబో మానవి’ (మరమానవి)ఉద్భవించింది.

మరి కొద్ది నిముషాల్లో కంట్రోల్ రూం మంటల్లో మండి కాలిపోసాగింది.

పేలుడు శబ్దాలు, గాలిలో నిప్పురవ్వలూ, మనుష్యుల హాహాకారాలు సిమ్ సిటీలో నిండిపోయాయి.

కొంచెం దూరంగా హైవే మీద కారు నడుపుతూ పారిపోతున్న కళాధర్ కారు ఆపి కిందికి దిగి, వెనక్కి తిరిగి చూశాడు.,

పది కిలోమీటర్లు దూరంలో వున్న గాలిలో కెగసిన జ్వాలలు కనిపిస్తునే వున్నాయి.

“కరిష్మా బై! బై!

అదంతా ఒక పొరబాటు. It was all a mistake. My love was mistake. అది సిమ్ సిటీకాదు సిన్ సిటీ. ఆమె మనిషి కాదు యంత్రం!” కారు సికింద్రాబాద్ వైపు వేగంగా సాగిపోయింది…

కంట్రోల్ రూం బయటకి మంటల్లోంచి వచ్చి నిలబడిన కరిష్మా “కళాధర్, కళాధర్” అని పిలుస్తూనే వుంది.

ఎపిలోగ్:

‘రోబోట్స్’,లేక ‘రోబోలు’ సైన్స్ ఫిక్షన్‌లో వంద సంవత్సరాల నుంచి వున్నాయి. ఇప్పుడు నిజంగా మన జీవితం లో ప్రవేశం చేశాయి. మొట్టమొదటిసారిగా ఒక జెకోస్లోకివాకియన్ – కారెల్ సిపెక్ – అనే రచయిత తన రచనలో Robota అనే మాట వాడాడు. అప్పటి నుంచి అసిమోన్ రాసిన I Robot, మైఖేల్ క్రైటెన్ రాసిన వెస్ట్ వరల్డ్, ఆ తర్వాత వచ్చిన టెర్మినేటర్ సిరీస్ లాంటివి మంచి చెడు రోబట్ల గురించి, అవి మానవులకి హాని చేస్తాయా, మేలు చేస్తాయా అనే అంశం మీద వైజ్ఞానిక కల్పనా సాహిత్యం ఎంతో రాశారు.సినిమాలు తీశారు.

వెస్ట్ వరల్డ్ అనే సినిమాలో హ్యూమనాయిడ్ రోబట్లతో ఒక పార్క్ చేయడం, అవి సరిగా పని చేయక వచ్చిన వాళ్ళ మీద తిరగబడటం రాశారు.

వెస్ట్ వరల్డ్ లోని రోబో పార్క్ యే సిమ్ సిటీ కథలకి స్ఫూర్తి. కాని ఇవి అవే కథలు కావు. హ్యూమనాయిడ్స్‌కి కృత్రిమ మేధతో మానవులకి సహజమైన ప్రేమ లాంటివి, ఇంకా ఎక్కువ శక్తులు వస్తే… అనే వూహతో రాసినది. ఆ సినిమాల్లో అంశాలు ఇంకా క్లిష్టంగా వుంటాయి.

ఇప్పుడు ప్రపంచంలో రోబోలని విరివిగా వాడుతున్నారు, వైద్యంలో, పరిశ్రమలలో, ఇంటి పనులకీ, అయినా ప్రస్తుతానికి ఇవి మనిషి చెప్పినట్లు సమాచారం వినే యంత్రాలే కానీ… వాటికి తెలివి స్వంత వ్యక్తిత్వం వస్తే…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here