మరమ్మత్తు

0
6

[dropcap]సా[/dropcap]యంత్రం వేళ.

తాత, మనవడు కిషోర్ కలిసి బయల్దేరుతుంటే చూడగానే మోహన్ రావు “తాతా మనవలిద్దరి ప్రయాణం ఎక్కడికో?” అని అడిగాడు.

కిషోర్ తాతగారి మొహంకేసి చూస్తూ “కొత్త మోటరు తీసుకునొచ్చి మిక్సీలో బిగించడానికి నాన్నా” అన్నాడు. మోహన్ రావుకి అర్థం కాక తండ్రివైపు చూసి అడిగేలోపు

సీతారామయ్య గారు “కోడలు పిల్ల మధ్యాహ్నం మిక్సీ తిప్పుతుంటే వేడెక్కి పొగ వచ్చేసింది. పాతది కదా! బహుశా దాని లోపల మోటార్ కాలిపోయిందనుకుంటాను. అది మార్చేస్తే మళ్ళీ మిక్సీ ఎంతో కాలం పనిచేస్తుంది. వీధి చివర ఎలక్ట్రికల్ స్పేర్ పార్టులు అమ్మే ఖాదర్ మియా దుకాణం నుంచి తీసుకొద్దామని వెళ్తున్నాం” అని జవాబు యిచ్చారు.

“ఎందుకు నాన్నా! పాతది ఎంతకాలం నడుస్తుంది? ఫ్లిప్‍కార్ట్‌లోనో, అమెజాన్‌లోనో ఆర్డర్ యిస్తే ఎప్పుడో ఆ మిక్సీ కొన్న ధర కన్నా తక్కువకే రేపు సాయంత్రానికల్లా కొత్తది యింటికి వస్తుంది” అన్నాడు మోహన్ రావు.

సీతారామయ్య గారు మనవడితో “నువ్వు బయటకు నడు, నేను అయిదు నిమిషాల్లో వస్తాను” అని వాడు వెళ్ళాక, మోహన్ రావు దగ్గరకొచ్చి “చూడు మోహన్! వస్తువులని పాడయిపోగానే వాటిని బాగుచేసి, వీలయితే మనం స్వయంగా బాగుచేసి వాడుకునే ప్రయత్నం పూర్తిగా మానుకుంటున్నాం. ఒకప్పుడు డబ్బులు లేక అలా చేసినా అవి మనలో ఓర్పు, సహనం అనే గుణాల్ని తెలియకుండానే మనలో పెంచాయి. ఆర్థికస్థితి మెరుగయ్యేసరికి పాత వస్తువులను పారేసిన కొత్తవి సులభంగా కొనుక్కునే అలవాటుతో ఆ మంచి గుణాలూ కొరవడుతున్నాయి. చవగ్గా కొన్నవి మాత్రం మన్నుతున్నాయా? కొత్తవి చౌకగా వున్నాయని చకచకా మార్చేసుకుంటూ పోవడం వలన మనలో ‘ఇన్‌స్టెంట్’ మనస్తత్వం పెరిగిపోతోంది. అదే అలవాటు నిత్య జీవితంలో ప్రవేశించి మన ప్రవర్తననే మార్చేస్తోంది.. దాని ఫలితం ఎలా వుంటోందో చుట్టుపక్కల రోజూ చూస్తూనే వున్నాం. స్వయంగా ఏ వస్తువునైనా మరమ్మతు చేయడం అలవాటు చేస్తే అది నా మనవడికి జీవితంలో కూడా చాలా పనికొస్తుందని నా గట్టి విశ్వాసం”

అని వెళ్ళబోతూ ఆగి “నాకు అవకాశం కుదిరినప్పుడల్లా వాడిలో ఆ గుణం పెంపొందించేలా చేస్తున్నాను. నువ్వు కొత్త పుస్తకాలు కొన్నాక ఆ టెక్స్ట్ పుస్తకాలు కొంచెం చిరిగినా వాడితోనే బైండింగ్ చేయించాను. వాడు బయటకు వెళ్ళినప్పుడు వేసుకునే తోలు చెప్పులు మొన్న తెగిపోయినా కుట్టు వేయిస్తే మళ్ళీ ఎంతో కాలం వాడుకునేలానే వుండడంతో కిషోర్‌ని నాతోపాటు బయటకు తీసుకెళ్ళి వాటిని కుట్టించాను. బాగా సంపాదిస్తున్నాను కదా అని ప్రతీసారీ నువ్వు కొత్తవి కొనేసి ‘ఇన్‌స్టెంట్’గా అందించి వాడిని పాడుచేయకు. మనకు వీలైన వాటిని మనమే మరమ్మత్తు చేసుకోవచ్చని నేను వాడికి నేర్పిస్తున్న అలవాటుని మాన్పించకు. అలాగే మనకు వీలుకానివి స్వల్ప ఖర్చుతో బయట బాగు చేయించుకుంటే మన్నుతాయనిపించే వస్తువులని బాగుచేయించి వాడుకునే అలవాటునీ తప్పించకు. అది నీకూ వాడికీ కూడా మంచిది కాదు భవిష్యత్తులో! అంతే కాదు జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ భూమండలానికే మంచిది కాదు” అనేసి సీతారామయ్య గారు మనవడిని కలుసుకునేందుకు త్వర త్వరగా అడుగులు వేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here