మారందాయి మహాశ్వేతాదేవి

0
13

[28 జూలై ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి వర్ధంతి సందర్భంగా ఈ రచన అందిస్తున్నారు శ్రీమతి దాసరి శివకుమారి]

[dropcap]మ[/dropcap]హాశ్వేతాదేవి ఒక విలక్షణ మహిళ. అటు సామాజికపరంగానూ, ఇటు సాహిత్యపరంగానూ, గిరిజనుల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. గిరిజనులు పడుతున్న కష్టాల గురించి తన ప్రతి అక్షరంలోనూ చిత్రించారు. ముఖ్యంగా ‘ముండా’, ‘సంతాల్’ జాతుల వారు తిండి కోసం, నీటి కోసం, మనుగడ కోసం ఎంత తపిస్తున్నారో తను వ్రాసిన బెంగాలీ సాహిత్య కేంద్రం ద్వారా ప్రపంచానికి తెలియజెప్పారు. వారి పిల్లలు స్కూల్లో చేరి చదువుకోవటం కోసం ఎంత పోరాడవలసి వస్తోందో కళ్ళకు కట్టినట్లు చిత్రీకరించారు. గిరిజన మహిళలను మోసం చేసి వ్యభిచార కూపంలోకి దించే నేర ప్రవృత్తిని బట్టబయలు చేశారు. పోడు వ్యవసాయం చేసుకునే గిరిజనుల నుండి భూమిని లాక్కుని ఆ రైతుల్ని కేవలం వ్యవసాయ కూలీలుగా మార్చటాన్ని ఖండించారు. ఏం వ్రాసినా గిరిజన సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకున్నారామె.

మహాశ్వేతాదేవి 14 జనవరి 1926న ఢాకాలో జన్మించారు. తల్లిదండ్రులు ధరిత్రీదేవి, మనీష్ ఘటక్‍లు. ఆమె మేనత్త, మేనమామతో సహా వీరి కుటుంబమంతా సాహిత్య కళారంగాలకు చెందినవారే. స్వగ్రామంలో ప్రాథమిక విద్యతో మొదలుపెట్టి మధ్యలో శాంతినికేతన్ లాంటి చోట చదివి, చివరగా ప్రైవేటుగా ఎం.ఎ. ఇంగ్లీషు పూర్తి చేశారు. ఈమె భర్త బిజోన్ భట్టాచార్య. కుమారుడు నవారుణ్. వీరిరువురు కూడా సాహిత్య రంగానికి చెందినవారే.

మహాశ్వేతాదేవి మొదటి నవల ‘ఝాన్సీర్ రాణీ’. ‘అరణ్యేర్ అధికార్’, ‘హజార్ చౌరాసీ మా’ అనే బెంగాలీ నవలలు ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ‘అరణ్యేర్ అధికార్’ను గిరిజనులు తమ భాషలోకి అనువదించుకున్నారు. ఆదివాసీల కడగండ్లను సాహిత్యపరంగా చిత్రీకరించడమే కాకుండా క్రియాశీలక ఆదివాసీ సామాజిక కార్యకర్తగా పనిచేశారు. ‘ఆదివాసీ కళ్యాణ సమితి’, ‘పశ్చిమ వంగభూమి ముండ గిరిజన సమాజ్ సుగన్స్’, ‘భారత్ కే ఆదిమ్ జాతి ట్రైబల్ సమితి’ మొదలగు వాటిని ఏర్పరిచి, వారి విముక్తి కోసం ఎంతో పాటుపడ్డారు. పశ్చిమ బెంగాల్ న్యాయసేవా సమితి సంస్థ ద్వారా ఎన్నో విషయాలను పరిష్కరింపగలిగారు.

గిరిజనుల అక్షరాశ్యత కోసం, అనియత విద్యా కేంద్రాలు ఏర్పాటుకు కృషి చేశారు. అంతేకాకుండా గిరిజనులు తయారు చేసిన హస్తకళాఖండాలను విక్రయించుకోవటానికి ఎన్నో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించారు. తన వ్యక్తిత్వాన్ని, తన సాహిత్యాన్ని గిరిజనుల కోసమే, వారి సేవకే అంకితం చేశారు. గిరిజనులు ఆమెను ప్రేమగా ‘మారందాయి’ అంటే ‘పెద్దక్కయ్య’ గా పిలుచుకునేవారు.

ఇవే కాక పశ్చిమ బెంగాల్‍లో ఉన్న ట్రైబల్ సమితులన్నింటి తోనూ ఆమెకు సంబంధమున్నది. వారితో ఆమె ఎంతగా మమేకం అయ్యారంటే, “నేను గిరిజనుల మధ్యే చనిపోవాలని నిర్ణయించుకున్నాను. వాళ్ళ సంస్కృతి ప్రకారమే నా అంత్యక్రియలు జరగాలి. ఆ ప్రకారమే నా సమాధి మీద ఒక చెట్టును నాటాలి” అంటూ వారి పట్ల తనకున్న గాఢానురక్తిని తెలియజేశారు. ‘బిజినెస్ స్టాండర్డ్’, ‘సండే’, ‘యోజన’ వంటి ఇంగ్లీషు పత్రిలలలో రిపోర్ట్లులు, పరిశోధనాత్మక వ్యాసాలు వ్రాసేవారు. ‘ఆజ్‍కల్’, ‘వసుమతి’ లాంటి బెంగాలీ పత్రికలలో వివిధ శీర్షికలను నిర్వహించేవారు. కొన్ని పరిశోధనాత్మక సంచికలకు సంపాదకత్వమూ వహించారు.

మహాశ్వేతాదేవి పొందిన బహుమతులకు లెక్కే లేదు. ‘శరత్‌చంద్ర స్మారక పతకం’తో మొదలై, ‘పద్మశ్రీ’, ‘పద్మభూషణ్’, ‘రామన్‍మేగ్‌సేసే అవార్డు’లను పొందారు. 1996లో ‘జ్ఞానపీఠ’ పురస్కారాన్ని గ్రహించారు. ఈ జ్ఞానపీఠ్ వారిచ్చిన రెండు లక్షల యాబైవేల రూపాయలను పశ్చిమ బెంగాల్ లోని పురూలియా జిల్లాకు చెందిన గిరిజన సవర ప్రజల నీటి సౌకర్యం కోసం విరాళంగా ఇస్తూ, అలా ఇవ్వటం తన కర్తవ్యమనీ అన్నారు.

ఉపాన్యాసకులుగా ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీ, ఇంగ్లాండ్, అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాలలో పర్యటించారు. ఆమె నలభై ఐదు నవలలను, పదిహేను కథాసంపుటాలను, బాలసాహిత్యంలో పది సంపుటాలను, ఒక నాటికల సంపుటిని వెలువరించారు.

1997 మే 8వ తేదీన విశాఖపట్ణణం, ఆంధ్రా యూనివర్శిటీ అంబేద్కర్ హాలులో ప్రజా సాహితీ సాంస్కృతికోద్యమ సంస్థ ఏర్పాటు చేసిన ఉత్తర కోస్తా జిల్లాల సాహిత్య సదస్సులో ఆమె పాల్గొని ఉత్తేజపూరితమైన ప్రసంగాన్నీ, పాటల్నీ వినిపించారు.

“మన్యం పులి అల్లూరి సీతారామరాజు గిరిజన పోరాటనాయకుడు” అంటూ “ఆయన పోరాటం కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందినది మాత్రమే కాదు. ఈ పోరాటం భారతదేశానికి చెందినది. ఇది వరకు పోరాట స్ఫూర్తి కోసం భారతదేశం బెంగాల్ వైపు చూసేది. ఇప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ వైపుకు చూసేటట్టుగా ఉండాలి” అని ఆమె ఆకాక్షించారు.

ఏ సాహిత్య ప్రక్రియ చేపట్టినా దాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి అని చెప్పేవారు. వీరు వ్రాసిన నవలలు చాలా విదేశీ భాషలలోకి, మన భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి. వీరి నవలలు ఎంత ప్రసిద్ధి పొందాయో, కథా సాహిత్యం కూడా అంతే ప్రఖ్యాతి పొందింది. చదివే పాఠకుల మనసును ఆలోచింపజేస్తాయి. ఆర్ద్రతను కలిగిస్తాయి. గిరిజన సంక్షేమంతో పాటు స్త్రీలకు జరిగే అన్యాయలను, సమాజంలో పాతుకుపోయిన అనాచారాలు, దోపిడీలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ‘వరద’ అనే కథలో ఒక తల్లి తాను వంచనకి గురై, ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డకు కడుపు నిండా తిండి పెట్టలేకపోతుంది. కడుపు నిండని ఆ బిడ్డ ఆకలితో ఉండి నదికి వరదన్నా వస్తే బాగుండును, వరద వస్తే ఊళ్ళోని పెదకామందులు బీదాబిక్కీకి తినడానికి ఏమైనా పెడతారని ఆశపడతాడు. ‘వేట’ అనే కథలో కామంతో నిండిన ఒక కాంట్రాక్టరును గురించి గిరిజన మహిళ ‘నాకు వేట కావాలి. అన్నిటికంటే పెద్ద జంతువైన ఈ మనిషిని వేటాడాలి’ అని కోరుకుంటుంది. ‘బేహులా’ అనే కథలో ఒక గిరిజనుడు పాము మంత్రగాడు అయివుండి కూడా ‘యాంటీ సీరమ్’ ఇచ్చి ప్రజలను పాము కాటు నుంది కాపాడడానికి పడిన తపన హృద్యంగా వర్ణించబడింది. “సాధారణంగా ప్రజలే చరిత్రను సృష్టిస్తారని నా నమ్మకం. ఓటమిని అంగీకరించలేని వారే నాకు ప్రేరణ. అలాంటి వారి చరిత్రే నా కథా వస్తువులు” అని తేల్చిచెప్పేవారు మహాశ్వేతాదేవి.

ఇంతటి విశేష కృషి సల్పిన మహాశ్వేతాదేవి 28 జూలై 2016న కలకత్తాలో తుదిశ్వాస విడిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here