లోకం నిర్దేశించిన దారిలో నడవడం తెలియని ఒక అమాయకురాలి కథ – ‘మరపురాని కథ’

1
11

[dropcap]ఆ[/dropcap]డపిల్లలు ఎలా మాట్లాడాలో, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో మన చుట్టూ ఉన్న సమాజం నిర్దేశిస్తుంది. అలా ఉండని స్త్రీలపై అమానుషంగా విరుచుకుపడుతుంది. సమాజం నిర్దేశించే నియమాలలో స్త్రీల పై ప్రేమ కన్నా అపనమ్మకంతో ఏర్పడ్డ ఒక నియంత్రణ కనిపిస్తుంది. ఇప్పటి తరంలో ఆడవాళ్ళు చాలా వరకు ఈ స్థితిని తప్పించుకున్నారేమో కాని పూర్తిగా బైటపడలేదు. ఆడవాళ్ళూ ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత సేపు ఎక్కడ మాట్లాడాలి ఇవన్నీ స్త్రీల పై నియంత్రణలో ముఖ్యమైన విషయాలు. చివరికి బిగ్గరగా నవ్వడం కూడా స్త్రీలకు నిషేధమే. ఇవన్నీ వారి శీలాన్ని కొలిచే కొలమానాలు. పసిపిల్లలుగా అమాయకంగా తమ మనసుకు తోచినట్టుగా జీవించే అమ్మాయిలను తాము నిర్దేశించినట్లు జీవించమని వారిలో సహజమైన ఆలోచనలు, భావాలను చంపే పని చేస్తారు చుట్టూ ఉన్న వారు. కాని ఆ నియంత్రణలు అర్థం కాక, అలా ఎందుకుండాలో అర్థం చేసుకోలేని కొందరు అమాయకుల పరిస్థితి ఎంత భయానకంగా ఉంటుందో చెప్పిన మంచి సినిమా 1967లో వచ్చిన ‘మరపు రాని కథ’ ఈ సినిమాని ఇప్పడు గుర్తుచేసుకోవడానికి కారణం ఆ సబ్జెక్ట్ మీద అంత సున్నితమైన చర్చతో మరో సినిమా తెలుగులో ఇప్పటిదాకా రాకపోవడమే.

1964లో కై కొడుత్త దైవం అని ఒక తమిళ సినిమా వచ్చింది. అందులో ప్రధాన నటులు సావిత్రి, శివాజీ గణేశన్. దీన్నే తెలుగులో వాణిశ్రీ, కృష్ణలతో తీసారు. తమిళంలో సావిత్రి గారు చేసిన పాత్రను తెలుగులో వాణీశ్రీ గారు పోషించారు. వాణిశ్రీ తెలుగులో మంచి నటిగా తనను తాను ఎన్నో సినిమాలలో నిరూపించుకున్నారు. వారి కెరియర్ మొదట్లోనే ఇంత మంచి పాత్ర రావడం ఆవిడ అదృష్టం. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసారు. రాధ, శాంతి మాధవరావు అనే ఆస్తిపరుని కూతుర్లు. రాధ అమాయకురాలు, అందరితో కలివిడిగా ఉండడం, తనకు తోచినది మాట్లాడం ఆమె నైజం. ఎవరినీ అనుమానంతో చూడదు. అందరితో అంటే ఆడ, మగా, బీద, గొప్ప ఎవరైనా కాని ఒకే విధంగా ప్రవర్తిస్తుంది. మగవారిని చూసి పారిపోవడం, వారితో దూరం పాటించడం ఎందుకో కూడా ఆమెకు అర్థం కాదు. ఎవరితో నయినా ఎక్కడయినా, ఎప్పుడయినా ఒకేలా మాట్లాడడం, ఒకేలా ప్రవర్తించడం ఆమె నైజం. ఇదే పెద్ద సమస్య అయిపోతుంది. ఎవ్వరితో ఏ భేషజాలు లేకుండా ఏ హద్దులు పాటించకుండా ఒకేలా ఉండే ఆమెలో స్త్రీ సహజమైన సిగ్గు బిడియం లేవని గుర్తిస్తారు అందరు. అందువలన ఆమె శీలవంతుల జాబితాలో రాదు. అలాగే ఒక దుర్మార్గుడికి సహాయం చేయబోయి ఆమె దెబ్బతింటుంది. ఒక పేద నిరుద్యోగికి సహాయం చేయడానికి ఆమె ముందుకు వస్తుంది. అతన్ని ఒంటరిగా కలుసుకుంటూ డబ్బు ఇస్తూ ఉంటుంది. ఆమె అమాయకత్వం ఆసరాగా తీసుకున్న వరహాలు అనే ఆ మోసగాడు ఆమెతో తనకు సంబంధం ఉందని ప్రచారం చేస్తాడు. వారిద్దరిని ఎన్నో సార్లు కలిసి మాట్లాడుకుంటూ చూసిన వారందరూ అది నిజం అని నమ్ముతారు. ఏ సంబంధం లేకుండా వరహాలును రాధ ఎందుకు కలుస్తుంది, అతనికి మాత్రమే డబ్బు సహాయం ఎందుకు చేస్తుంది ఇలా ఉంటాయి కదా లోకం ఆలోచనలు.

రాధ ప్రవర్తనలో నిష్కలంకమైన ఆమె హృదయం ఎవరికీ కనబడదు. ఆమె స్నేహితులు కూడా ఆమె స్వభావాన్ని వాడుకుని బాగుపడతారు కాని ఆమె మీద పడుతున్న నిందలను తప్పించే ప్రయత్నం చేయరు. ఆమె లోని ఆ సహజమైన అమాయకత్వం పట్ల ఒక అసూయ ఉంటుందేమో లోకానికి. రాధ చెడిపోయిందని ఊరంతా బాహాటంగా చెప్పుకుంటారు. ఇది రాధ కుటుంబం వరకు చేరుతుంది. రాధ అన్నయ్య రవి ఇది అవమానంగా భావించి తన చెల్లెలు చెడిపోయిందని ఆ ఇంట ఉండడం అవమానమని నమ్మి ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఆడపిల్లపై నింద పడితే అది జీవన్మరణ సమస్యగా భావించి తాము జీవించే ఆధారమే పోయిందని భావించే కుటుంబాలు మనకు తెలుసు. ఆ అన్న చెల్లెలి స్వభావం తెలిసినవాడు. ఆమెతో పాటు పెరిగినవాడు కాని ఎవడో చెప్పిన దాన్ని నమ్మడానికి వెనుకాడడు. ఇంట్లో ఆడవారి పట్ల ఏ చిన్న పుకారు పుట్టినా అందులో నిజ నిజాలు విచారించే ఓపిక లేని కోట్ల కొలది సోదరులకు ప్రతీక రవి. ఇల్లు వదిలి ఊరి వారి పుకార్లకు బలం చేకూర్చి ఆ ఇంటిని ఇంకా కష్టాలలోకి నెట్టేస్తున్నాననే కనీస అవగాహన లేని మగ వాడు ఆ అన్న.

రాధ చెల్లెలు శాంతి అక్కకు నచ్చ చెప్పాలని ఆమెను మిగతా ఆడపిల్లలుగా సిగ్గు పడుతూ, మగవాళ్లను చూసి చప్పున తల దించుకూంటూ అనవసరపు బిడియాన్ని జోడించుకుని బ్రతకడం నేర్పించాలని తాపత్రయపడుతుంది. అక్క మనసు అర్థం చేసుకున్న ఏకైక వ్యక్తి ఆమె. కాని అక్కలా ఉంటే విమర్శలు పాలవడం తప్ప సమాజంలో మంచి పేరు ఉండదని దాని వలన పెళ్ళి సంబంధాలు రావని ఆమె తెలుసుకుంటుంది. తండ్రి ప్రతి వారి వద్ద తల వంచుకుని బ్రతకవలసి రావడం, లోకం కూసే కూతలకు జవాబివ్వవలసిన హీన స్థితిలో అంతటి గొప్పవాడు సైతం ఉండడం శాంత చూసి తట్టుకోలేదు. లోకం కోసం అక్క ప్రవర్తనను మార్చాలనుకుంటుంది. కొంత లౌక్యం నేర్పాలని తపన పడుతుంది. కాని రాధకు ఇవేవీ అర్థం కావు. నేను చేసిన తప్పేమిటి అని ఆమె వేసే ప్రశ్నకు ఇంటివారి వద్ద సమాధానం లేదు.

రాధ తండ్రి మాధవరావు ఎక్కడకు వెళ్ళినా పని గట్టుకుని రాధ గురించి అందరూ వాకబు చేస్తుంటే ఆమెకు పెళ్ళి చేయడమే సమస్యకు పరిష్కారం అని నమ్మి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు అతను. కాని పెళ్ళి సంబంధం కుదిరిందనుకున్నంతలో ఆకాశరామన్న ఉత్తరాలు వరహాలు నుండి పెళ్ళి కొడుకులకు చేరుతాయి. కుదిరిన సంబంధాలు తప్పిపోతుంటాయి. ఈ బాధను ఆ సగటు తండ్రి భరించలేకపోతాడు. అతనికి సహయపడే కొడుకు పక్కన లేడు. అతను విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటాడు. కాని తండ్రిగా ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టి ఆ అమాయకురాలి గొంతు కొయ్యలేడు. శాంత కూడా అక్కకు ఏ డబ్బు పిచ్చి ఉన్నవాడికో ఇచ్చి పెళ్ళి జరిపించాలనుకోదు. అక్క సుఖం కోసం తన రీతిలో అందరితో పోరాడుతుంది.

రవి మరో రాష్ట్రం చేరుతాడు. అక్కడ రఘు అనే తెలుగు వ్యక్తితో స్నేహం ఏర్పడుతుంది. రఘు నిస్వార్ధంగా రవికి సహాయపడి తాను బంట్రోతుగా ఉద్యోగం చేస్తూ రవి మేనేజర్ అవడానికి సహయం చేస్తాడు. రవి ఆ ఆఫీసులోనే పని చేసి లత అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. ముగ్గురు ఒకే ఇంటిలో ఉంటారు. లతతో రఘు స్నేహాన్ని అందరూ విమర్శిస్తూ వారిద్దరి మధ్య ఎదో ఉందని పుకారు పుట్టిస్తారు. రఘు ఆ విషయం తెలుసుకుని వారి నుండి దూరం అవ్వాలనుకున్నా రవి అది పడనివ్వడు. లోకంలో ఎవరో ఏదో వాగారని మనం ఎందుకు మన సుఖాన్ని పాడుచేసుకోవాలని వాదిస్తాడు. రఘు తల్లి తండ్రులు ఎన్ని సంవత్సరాలుగాలో ఎదురుచూస్తున్న ఒక కేసు గెలుస్తారు. వారికి సహయం చేసిన లాయర్ మాధరరావుకు స్నేహితుడు, రాధ గురించి బాగా తెలిసినవాడు. అతను రఘుతో రాధ పెళ్ళి చేయాలని రఘు తల్లి తండ్రులకు మాధవరావు గురించి చెబుతాడు .పెళ్ళి కూతురును చూడడానికి వచ్చిన రఘు అనుకోకుండా రాధను కలుస్తాడు. ఆమె అమాయకత్వం, ఆమె భరిస్తున్న నిందలు అన్నీ ఆమె ద్వారానే విని పెళ్ళికూతురు స్థానంలో ఆమెను చూసి ఆమెను వివాహం చెసుకుంటానని చెబుతాడు. అయితే రవికి ఆమె ఫోటో పంపి స్నేహితుని అనుమతి తీసుకోవాలని కోరతాడు. రఘుకు రవి రాధకు స్వయంగా అన్నయ్య అన్న సంగతి తెలియదు. రాధ ఫోటో చూసిన రవి ఆమె రఘుకి తగదని జవాబు రాస్తాడు.

అనుమానం వచ్చిన రఘు విషయం తెలుసుకోవాలని రవి దగ్గరకు వస్తాడు. రాధ తన చెల్లెలు అని రవి అన్నప్పుడు అన్నగా తాను ఆ అమాయకురాలికి అండగా ఉండకుండా పారిపోయి ఆ కుటుంబాన్ని అన్ని బాధలకు గురి చేయడం ఎంత తప్పో రఘు వివరిస్తాడు. చెల్లెలిగా తాను చూసుకుంటున్న లతతో లోకం తనకు సంబంధం ఉంది అని అన్నప్పుడు ఆ లోకనిందలు పట్టించుకోవద్దు అని అన్న రవే తన చెల్లెలి విషయంలో అంత అన్యాయంగా ఎలా ప్రవర్తించాడని ప్రశ్నిస్తాడు. ఈ సినిమాలో ఈ పాయింట్ హైలైట్. చాలా బ్రాడ్ మైండెడ్‌గా ప్రవర్తించేవారు తమ తల్లులు చెల్లెల్ల దగ్గరకు వచ్చేసరికి వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని అనుమానించడం, లోకంలోని క్రూరత్వం నుండి రక్షించవలసినవారే అంత కన్నా క్రూరంగా ప్రవర్తించడం మనం ఇప్పటికీ చూస్తున్న విషయమే. ప్రియురాలి స్థానంలో ఉన్న భార్యను, తన స్నేహితుడుని అంతగా నమ్మిన రవి తన చెల్లెలు వద్దకు వచ్చేసరికి ఆమె మీద అధికారం చెలాయించే వ్యక్తిగా లోకం మాటలకు విలువ ఇచ్చి ఆ నిందలను నిజమని నమ్మి చెల్లెలుని అసహ్యించుకుని రఘుని ఆ పెళ్ళి చేసుకోవద్దని చెబుతూ రఘు పట్ల అతను చూపించిన స్నేహం, చెల్లెలి పట్ల అధికారం చాలా సహజంగా చిత్రించారు ఈ సినిమాలో.

రవి రాధ పట్ల చూపిన కోపంలో ఒక మగవాని నన్న అహంకారం, చెల్లెలిని తనతో సమానంగా చూడలేని అహంభావం, చెల్లెలి కన్నా లోకం పట్ల ఎక్కువ నమ్మకం కనిపిస్తాయి. కాని అవి తన స్నేహితుడు, భార్య దగ్గరకు వచ్చేసరికి మారిపోతాయి. అంటే తనకు సమానంగా భావించే తన భార్యా, స్నేహితుని పట్ల ఏర్పడే అభిప్రాయం, ఆత్మీయత ఒక అధికార దృష్టితో చెల్లెలిని చూసినప్పుడు కనిపించకపోవడం అన్నది ఎన్నో ఇల్లళ్ళో నిత్యం చూస్తున్న సమస్య. ఇది ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని ‘మరపురాని కథ’ అనే ఈ సినిమా తీసారు దర్శకులు వి. రామచంద్రారావు.

తాను ఎంతో ఆశపడిన రాధ పెళ్ళి ఈ సారి కొడుకే జరగనివ్వకుండా చేస్తున్నాడని మాధరావు కొడుకు రఘుకి రాసిన ఉత్తరం చదివి తెలుసుకుంటాడు. భాధతో అవమానంతో రాధను తిడతాడు. నీవు నిజంగానే చెడిపోయినదానివని ఆమెని దూషిస్తాడు. అన్న, చెల్లి ఊరివారంతా ఏమన్నా పట్టించుకోని రాధ తండ్రి నోట ఆ మాటే విని తట్టుకోలేకపోటుంది. నువ్వొక్కడివి నన్నునమ్ము నాన్నా అని ఆమె ఏడుస్తూ వేడుకునే సీన్‌లో వాణిశ్రీ గారి నటన చూడాలి. రవిని ఒప్పించి రఘు ఇంటికి వచ్చేసరికి రాధ నిద్రమాత్రలు తిని మరణిస్తుంది. నేను మంచిదానిని అని చెబుతూ ఆమె కళ్ళు మూయడం ఆఖరి సీన్.

తనను తాను మంచిదాన్నని శీలవతి నని నిరూపించుకుంటూ అడ్డమైన అపవాదులు వేసే వారందరి వద్ద తన పవిత్రతను నిత్యం నిరూపించుకుంటూ ఆడపిల్లలు బ్రతకవలసి రావడం ఎంత దుర్బరం. ప్రస్తుతం పరిస్థితి మారింది అని చాలా మంది అంటారు. కాని నాకు రాధ లాంటి వ్యక్తులు కనిపిస్తూనే ఉంటారు. పతివ్రతలుగా నటించే స్త్రీల సంఖ్య పెరుగుతుంది, అలాగే దేనికి బెదరకుండా తమకు నచ్చిన విధంగా ఉండే వారి సంఖ్య కూడా పెరుగుతుంది, వీరి మధ్య రాధ లాంటి స్త్రీల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. ఇప్పటికి కూడా ఏ ఇన్హిబిషన్స్ లేకుండా అందరితో ఒకేలా మాట్లాడే అమ్మాయిని చాలా మంది ఈజీ కాచ్ గానే చూస్తారు, చూస్తున్నారు కూడా. జీవన విధానంలో మార్పు వచ్చింది, స్త్రీలు కాస్త ఆర్థికంగా బలం పుంజుకుంటున్నారు కాని లోతుగా చూస్తే స్త్రీల పట్ల ఆలోచనలలో మనం పెద్దగా మారలేదు. స్త్రీల పట్ల ఇతర స్త్రీల ప్రవర్తనలో కూడా పెద్దగా తేడా ఏం లేదు. అందుకే ఈ సినిమా నాకు చాలా సార్లు గుర్తుకు వస్తూ ఉంటుంది. నువ్వు కంట్రోల్‌లో ఉంటే అందరితో ఎందుకు మాట్లాడతావు? అందరితో ఎందుకు రాసుకు పూసుకు తిరుగుతావు? అందరితో ఎందుకు నవ్వుతావు అని ప్రశ్నించే ఇతర స్త్రీల సంఖ్య కూడా తగ్గలేదు నేటి యుగంలో కూడా. అత్యాచారం జరిగింది అంటే, అంత రాత్రి వేళ ఆ ఆడపిల్ల బైటికి వెళితే మంచిదెందుకు అవుతుంది అనే వారే మన మధ్య. అలాంటి ఆడపిల్లలకు కుటుంబం లోని మగవారు ఎటువంటి రక్షణ ఇవ్వాలో రవి పాత్ర ద్వారా ఈ కథలో చూపించే ప్రయత్నం జరిగింది. లోకంలో చాలా విశాల భావాలు ప్రదర్శించే మగవారు తమ ఇంటి స్త్రీల పట్ల ఎంత సంకుచితంగా ప్రవర్తించి వారిని లోకం ముందు నేరస్తులుగా నిలబెడుతున్నారో చెప్పిన మంచి సినిమా ‘మరపురాని కథ’. ఈ సినిమాలో ‘నూటీకొక్క మనసే కోవెల’ అనే పాట చాలా బావుంటుంది. రాధను, రాధ లాంటి స్త్రీలను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే పాట ఇది.

ఇప్పటి తరానికి ఈ సినిమా అస్సలు తెలియదు. కాని ఇది చూసాక మంచి చిత్రం అని ఒప్పుకుంటారు. సుమారు మూడు గంటల నిడివి ఉన్న ఈ సినిమా కాస్త ఓపికగా చూడాలి. పాత చిత్రాలలోని మెలోడ్రామా కాస్త ఎక్కువగానే ఉంటుంది. కాని మూల కథ మాత్రం అందరినీ కదిలిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here