ప్రాంతీయ సినిమా-1: మరాఠీ సినిమాలు మళ్ళీ పుంజుకుంటాయా?

    0
    5

    [box type=’note’ fontsize=’16’] సుప్రసిద్ధ సినీ విశ్లేషకులు సికందర్ సంచిక కోసం వారం వారం ప్రాంతీయ చలన చిత్రాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు అందిస్తారు. ఈ వారం మరాఠీ సినిమాలను విశ్లేషిస్తున్నారు. [/box]

    ఒకప్పుడు మరాఠీ సినిమా రంగం కూడా తెలుగు సినిమా రంగం లాగే స్టూడియోలు నిర్మాణ సంస్థలుగా ఉండేవి. ఒక పక్క హిందీ సినిమాలతో పోటీ నెదుర్కొంటూనే మనుగడ సాగించేవి. బాలీవుడ్ హిందీ సినిమాలకి, మరాఠీ సినిమాలకీ కేంద్రం ముంబాయియే కావడంతో, మహారాష్ట్ర రాజధాని అయిన ముంబాయి నగరంలోనే మరాఠీ సినిమాలు ఆడాలంటే కనాకష్టమైయేది. స్థానిక జీవితాలని చిత్రించే,  చిన్నచిన్న బడ్జెట్లతో ప్రాంతీయ సినిమాలుగా మరాఠీ భాషా చిత్రాలు మిగిలిపోతే, అక్కడే నిర్మాణమయ్యే హిందీ సినిమాలు పాపులర్ స్టార్లతో, బ్రహ్మాండమైన వెలుగు జిలుగులతో,  బిగ్ బడ్జెట్ కమర్షియల్స్‌గా, జాతీయ సినిమాలుగా వెలుగొందడం మరాఠీ సినిమాలకి ప్రాణసంకటమైపోయింది. మరాఠీ ప్రేక్షకులు హిందీ సినిమాల మీద మక్కువ పెంచుకోవడంతో, మరాఠీ సినిమాలకి మిగిలిన ప్రేక్షకులు నామమాత్రమే. 1970 – 90 ల మధ్య దాకా దాదా ఖొండ్కే సినిమాలొక్కటే వసూళ్లు సాధించేవి. కానీ వాటితో మరాఠీ సినిమాల ప్రతిష్ట మాత్రం పెరగలేదు. ఆయన నిర్మించి, దర్శకత్వం వహించి,  నటించిన ఆ సినిమాలన్నీ బూతు కామెడీలే. ఇవి కొన్ని హిందీలోకి  డబ్ చేస్తే కూడా బ్రహ్మాండంగా ఆడాయి. ఈ అస్థిర వాతావరణమంతా ఒక్క కొత్త గాలి వీచడంతో మటుమాయమైపోయింది. మరాఠీ సినిమా ఏకంగా ప్రపంచాని కెక్కింది కొత్త శ్వాస పీల్చుకుని… అది 2004లో ‘శ్వాస్’తో!

    కొత్త తరం దర్శకుడుగా సందీప్ సావంత్ ‘శ్వాస్’తో మరాఠీ సినిమాల చరిత్రని కొత్త మలుపు తిప్పాడు. అప్పటికి గత యాభై ఏళ్లుగా జాతీయస్థాయి అవార్డు కూడా లేని మరాఠీ సినిమాలకి ‘శ్వాస్’తో జాతీయ ఉత్తమ చలనచిత్రం అవార్డు సాధించి పెట్టాడు. అంతే కాదు, ఆస్కార్ అవార్డులకి విదేశీ చిత్రాల విభాగంలో నామినేట్ కూడా అవడంతో,  సందీప్ మరాఠీ సినిమాల కొత్త మార్గదర్శి అయిపోయాడు.

    అక్కడ్నించి మొదలెడితే కొత్త దర్శకులతో మరాఠీ సినిమా కొత్త పుంతలు తొక్కడం ప్రారంభించింది. పూర్వం యువ దర్శకులకి అవకాశాలిచ్చేవారు కాదు. అలాటిది యువదర్శకులు తీసుకొచ్చే సరికొత్త కథాంశాలకి నిర్మాతలు ద్వారాలు తెరవడం మొదలెట్టారు. పరేష్ మోకాషీ, సచిన్ కుందల్కర్, రవి జాదవ్ లాంటి కొత్త దర్శకులు హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ, గంధా, సౌండ్ ఆఫ్ హెవెన్ : ది స్టోరీ ఆఫ్ బాలగంధర్వ లాంటి గుణాత్మక సినిమాలు తీయడం ప్రారంభించారు. ఇంకా  రవి పటేల్, ఉమేష్ కులకర్ణి, గిరీష్ కులకర్ణి, చైతన్య తమ్హానే లాంటి మరెందరో యువ దర్శకులు రంగంలోకి దూసుకొచ్చారు. వీళ్ళంతా జాతీయంగానే కాదు అంతర్జాతీయంగానూ మరాఠీ సినిమాలకి పేరుప్రతిష్ఠలు సంపాదించి పెట్టారు. తిరిగి మరోసారి 2015 లో ‘కోర్ట్’ అనే సంచలనం ఆస్కార్‌కి నామినేట్ కావడం ఇంకో మైలురాయి.

    లో-బడ్జెట్‌లో తీస్తున్న ఈ కొత్తతరం సినిమాల నిర్మాణానికి కొన్ని టీవీ చానెళ్ళు కూడా పూనుకోవడంతో పెట్టుబడులతో బాటు, థియేటర్ల విషయంలో కూడా సమస్యలు తీరిపోయాయి. టీవీ చానెళ్ళు నిర్మించిన సియారత్, కటియార్ కల్జత్ ఘుసాలి, లాయి భారీ మొదలైన సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఐతే మరోవైపు ఎవరి బ్యాకింగ్ లేని ఇండిపెండెంట్ సినిమాలు కూడా కొత్త దర్శకులు తీస్తున్నారు. ఎల్లో, రేజ్, అస్తు లాంటి ఇండీ మూవీస్‌కి నిర్మాతలు దొరక్క, దర్శకులే స్వయంగా నిర్మించుకుంటే విడుదలలు కష్టమై, విడుదలైనా నస్తాలపాలై నిరాశని మిగుల్చుతున్నాయి. కంటెంట్ పరంగా మరాఠీ సినిమాలిప్పుడు ఉన్నతంగా ఉంటున్నాయి, కానీ టీవీ చానెళ్ళ బ్యాకింగ్ లేకపోతే, ఇతర నిర్మాతలతో తీసినా సరైన విధంగా ప్రేక్షకుల్లోకి  వెళ్ళడం లేదు. ఇక్కడి పంపిణీ రంగంలో ఫ్యూడల్ వ్యవస్థ కొనగుతోందని ఆరోపణలున్నాయి. ఐతే అదే సమయంలో సరికొత్త మార్కెటింగ్ వ్యూహాలు కూడా కొత్త దర్శకులు అన్వేషించడం లేదన్న విమర్శ వుంది.

    ఇటీవల విడుదలైన డిటెక్టివ్ థ్రిల్లర్ ‘ఫాస్టర్ ఫేనే’కి బ్రహ్మరధం పట్టారు మరాఠీ ప్రేక్షకులు, ఇది విభిన్న జానర్ సినిమా అయినప్పటికీ పట్టించుకోలేదు. తమని కూర్చోబెట్టిందా లేదా అన్నదే చూశారు. ఆదిత్యా సర్పోట్ దార్ దీనికి దర్శకత్వం వహించాడు. మరాఠీలో ఇప్పుడు రచనలో, దర్శకత్వంలో, నటనలో మంచి క్వాలీటీని ఇవ్వగల కొత్త టాలెంట్స్‌కి కొదవలేదు. ఐతే అందరి సినిమాలూ టీవీ చానెల్సే నిర్మించాలంటే కుదిరే పని కాదు. నిర్మాణ –పంపిణీ – ప్రదర్శనా రంగాల్లో టీవీ చానెళ్ళ అందదండలు లేకపోతే మంచి టాలెంటు కూడా మరుగున పడిపోక తప్పడంలేదు. 2015 ఏప్రిల్ నుంచి హిందీ సినిమాలు ప్రదర్శించే మల్టీప్లెక్సుల్లో తప్పనిసరిగా ఒక ఆట మరాఠీ సినిమాలకి కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇది అమలవుతున్నా ఇకా 90 శాతం సినిమాలు ఫ్లాపవడానికి కారణాలేమిటో తెలుసుకోలేకపోతున్నారు.

    గత సంవత్సరం రెండు విశిష్టమైన సినిమాలు విడుదలయ్యాయి. సుమిత్రా భావే, సునీల్ సుక్తాంకర్ లు తీసిన కాసవ్, ‘శ్వాస్’ ఫేం సందీప్ సావంత్ తీసిన ‘నదీ వాహతే’ అన్నవి. ‘కాసవ్’ని డిప్రెషన్ సమస్యమీద సున్నిత కథాచిత్రంగా తీశారు. ‘నదీ వాహతే’ పర్యావరణ పరిరక్షణ గురించి తీశారు. రెండూ బలమైన సందేశాలిచ్చేవే. అయినా ఈ రెండిటికి ప్రదర్శడానికి సరైన షోలే లభించలేదు. పెట్టుబడులు కూడా తిరిగి రాలేదు. కాసవ్‌కి జాతీయ స్థాయిలో స్వర్ణ కమలం అవార్డు లభించింది.

    ఒకరకంగా ఇవి వాస్తవిక కథా చిత్రాలు. బాలీవుడ్ తీసేవి భారీ కమర్షియల్ సినిమాలు. బాక్సాఫీసు దగ్గర ఈ రెండిటి ఫలితాలూ ఒకటే. అపజయాలే ఎక్కువ. అయితే బాలీవుడ్ సినిమాలకి పెట్టుబడులకి కొదవ లేదు. అవి ఆడతాయని నమ్మకమే వుంటుంది. మరాఠీ సినిమాలు ఆడవనే నమ్మకంతో నిర్మాతలు ముందుక రావడమే కష్టమైపోతోంది. 2004లో కొత్త గాలితో చరిత్ర మలుపు తిరిగినా, ఇవ్వాళ దశాబ్దంన్నర గడిచేసరికి మళ్ళీ అస్తిత్వ పోరాటం చేస్తున్నాయి మరాఠీ సినిమాలు. మరాఠీ ప్రేక్షకులకి కూడా ఇప్పుడు ఛాయిస్‌లు పెరిగిపోయాయి. అద్భుత బాలీవుడ్ సినిమాలతో బాటు, మహాద్భుత మన్పించే హాలీవుడ్ సినిమాలు కూడా వాళ్ళని ఊరిస్తున్నాయి. సగటున ఒక మరాఠీ కుటుంబం నెలకి రెండు సినిమాలు మాత్రమే చూస్తోంది. చూసేవే రెండు సినిమలైనప్పుడు ఆ రెండూ బాలీవుడ్ లేదా హాలీవుడ్ సినిమాలే అవుతున్నాయి. మరాఠీ సినిమాల సమస్యేమిటంటే,  కంటెంట్ పరంగా వేటికీ తీసిపోవు. అయితే పదుల కోట్లు పెట్టి బాలీవుడ్‌కి దీటుగా అద్భుతంగా తీయడానికి అంత విస్తృత మార్కెట్ లేదు.

    ఇలాంటప్పుడు కంటెంట్‌ని మార్చడమే పరిష్కారమార్గంగా తోచింది. ‘ఫాస్టర్ ఫేనే’ ఇలాగే డిటెక్టివ్ యాక్షన్ కంటెంట్ తీసి కొత్త రుచులు చూపించారు. దీన్ని ఆరుకోట్ల బడ్జెట్‌తో తీస్తే, థియేటర్ వసూళ్ళు 27 కోట్లు వచ్చాయి. దీన్ని బాలీవుడ్ హీరో రీతేష్ దేశ్‌ముఖ్, జెనీలియాలు నిర్మించారు. ఇలా జానర్లు మార్చడంతో బాటు, విద్యాబాలన్ లాంటి బాలీవుడ్ స్టార్స్‌తో కూడా నటింపజేసి మరాఠీ ప్రేక్షకులని ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

    సికిందర్

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here