మార్గదర్శి

0
6

[dropcap]రా[/dropcap]మాపురం ప్రాథమికోన్నత పాఠశాల ప్రాంగణం. సాయంత్రం మూడున్నర గంటల సమయం. పిల్లలందరినీ ఆడుకోమని చెప్పి మైదానంలోకి పంపిచేసారు ఉపాధ్యాయులు. ఒకటి నుంచి ఐదు తరగతులకు చెందిన విద్యార్థలు మైదానంలోకి వచ్చారు. తన తరగతి గదిలో కూర్చొని పిల్లల ఆటలను చూస్తున్నాడు రాజేష్. వాళ్ళు పరుగెత్తుతూ ఒకరి నొకరు పట్టుకొనే ఆట ఆడుతున్నారు. ఆటను పరికిస్తున్న రాజేష్, దినేష్ అనే అబ్బాయి వేగంగా పరుగెత్తడం చూసి ఆశ్ఛర్యపోయాడు. మూడవ తరగతి చదువుతన్న వాడి కాళ్ళు పొడవుగా ఉన్నాయి. చురుకుగా కదులుతున్నాడు. వాడి పాదాల కదలికను, వేగాన్ని చూసిన రాజేష్ వెంటనే మైదానంలోకి వచ్చాడు.

దినేష్‌ని పిలిచి అడిగాడు “ఇంత వేగంగా ఎలా పరుగెడుతేన్నావురా, నాకే ఆశ్చర్యంగా ఉంది!”

“నేనా సార్, ఎప్పుడూ ఇలాగే పరుగెడుతాను” అమాయకంగా అన్నాడు.

“నీకు మంచి భవిష్యత్ ఉందిరా”

వాడు సిగ్గు పడ్డాడు.

“మీ అమ్మ, నాన్నలు ఏం చేస్తుంటారు?”

“కూలి పని సర్. తెల్లారి వెళ్ళిపోయి, రాతిరికొస్తారు.”

“నీకు మంచి జీవితం ముందుంది. నేను చెప్పినట్లు చేస్తావా?”

వాడు తలూపాడు.

“రేపట్నుంచి పెదరాడే లేచి రెండు కిలోమీటర్ల దూరం పరుగెత్తు. నేను రోజూ బస్ దిగుతాను కదా అంత వరకు. ఎంత టైం తీసుకున్నావో నాకు చెప్పు.”

“నా దగ్గర వాచీ లేదు సార్.”

“నేనిస్తాను. టైం చూసి పరుగెత్తు.”

వాడు అంగీకరించాడు. తన వాచీని దినేష్‌కిచ్చాడు.

మరు రోజు పాఠశాలలో తను పదినిముషాల టైం తీసుకున్నట్లు చెప్పాడు. ఇంకా బాగా పరుగెత్తాలని చెప్పాను. వారం రోజుల్లో వాడి రన్నింగ్‌లో వేగం పెరిగింది. పది నిముషాలులోపే రెండు కిలోమీటర్లు పరుగెత్తుతున్నాడు.

చదువు మీద శ్రద్ధ తగ్గకూడదని దగ్గరుండి చదివిస్తున్నాడు రాజేష్.

ఒక రోజు సాయంత్రం దినేష్‌ను తీసుకొని దగ్గరున్న పొలం గట్ల వైపు తీసుకెళ్ళాడు. అనువుగా ఉన్న రెండు పొలాలను చూసాడు. ఒరేయ్ నువ్వు హైజంప్ ప్రాక్టీస్ చెయ్యాలి. మన పాఠశాలలో ఏ సదుపాయాలు లేవు. కనీసం డ్రిల్ మాస్టర్ కూడా లేడు. నువ్వే ఆ పొలం నుంచి పరుగెత్తుకొచ్చి ఈ గట్టుమీదగా గెంతాలి. రాజూ సాయంత్రం ఓ అరగంట ప్రాక్టీస్ చెయ్యి” చెప్పాడు.

వాడు అలాగేన్నాడు. అరగంట ప్రాక్టీస్ చేయించాడు. బాగా జంప్ చేసాడు. సాయంత్రం గుండ్రుపు రాయిని తీసుకొని షాట్ పుట్ ప్రాక్టీస్ చేయించాడు. రెండు నెలల పాటు బాగా ప్రాక్టీస్ చేయించాడు.

స్పోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశానికి అర్హత పరీక్ష రాయించడానికి తీసుకెళ్ళాడు. అన్ని క్రీడా విభాగాల్లో బాగా రాణించాడు. అంతే కాకుండా పరీక్షలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు. దినేష్ తల్లిదండ్రులను ఒప్పించి స్పోర్ట్స్ స్కూల్‌లో  జాయిన్ చేయించాడు. దినేష్ పాఠశాల క్రీడల్లో మంచి ఫలితాలు సాధించాడు. తెల్లవారి, సాయంత్రం వేళల్లో బాగా ప్రాక్టీస్ చేసాడు. అతని వేగవంతమైన పరుగును దృష్టిలో పెట్టుకొని ఫుట్‌బాల్ టీంకు సెలక్ట్ చేసారు. అందులో బాగా రాణించి పాఠశాల పుట్‌బాల్ టీంకు కెప్టెన్ అయ్యాడు. అంతర పాఠశాల టోర్నీల్లో పాల్గోని పాఠశాలకు ఎన్నో విజయాలను సాధించిపెట్టాడు.

ఒక రోజు సాయింత్రం ప్రిన్సిపాల్ పిలిచి అడిగాడు “ఒక మారుమూల గ్రామం నుంచి స్పోర్ట్స్ స్కూల్ వరకు వచ్చావు. నీకీ సంగతి ఎవరు చెప్పారు?” అని.

“మా సార్ రాజేష్. నన్నీ స్థితికి తెచ్చింది ఆయనే” క్లుప్తంగా చెప్పాడు.

‘డెడికేటెడ్ టీచర్’ మనసులో అనుకున్నాడు. “నీకో గుడ్ న్యూస్ చెబుదామని పిలిచాను. నువ్వు సంతోష ట్రోఫీ కోసం ఆడే టీంలో సెలక్టయ్యావు. కంగ్రాట్స్.” అన్నాడు.

దినేష్ ఉప్పొంగిపోయాడు. రాజేష్ సార్‌ను తలచుకున్నాడు.

ఓ మంచి అవకాశం. ఆ విభాగంలో కూడా రాణించి. సంతోష్ ట్రోఫీని గెలవడంలో కీలక పాత్ర వహించాడు. తర్వాత అంచెలంచలుగా ఎదిగాడు. మంచి ఉద్యోగం సంపాదించాడు. ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఉన్నత స్థానానికి ఎదిగాడు.

ఆ రోజు తన తల్లితండ్రులతో పాఠశాలను సందర్శించాడు దినేష్. ఎప్పుడో బదిలీ అయిపోయిన రాజేష్ అక్కడికి వచ్చి ప్రేయర్‌లో అతని గూర్చి అందరికీ పరిచయం చేసాడు. “మీరందరూ దినేష్‌ను స్ఫూర్తిగా తీసుకోండి” అని చెప్పాడు. “మీకు మార్గదర్శి” అంటూ అందరి చేతా చప్పట్లు కొట్టించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here