మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-21

4
9

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]మై[/dropcap]నాకుని తండ్రి అయిన సింహబలుని వధించి మురారి నగరాన్ని స్వాధీనపరుచుకున్న నాటి నుంచి సుల్తాన్ తన రాజధానిని నవరంగాబాద్ నుంచి పెద్ద నగరమై, చుట్టూ పెట్టని గోడల వంటి పర్వత పంక్తులు కలిగి దుర్భేద్యమైన మురారినగరానికి మార్చుకున్నాడు. తను పెండ్లాడిన నూరుగురు భార్యలను ఒకే భవనంలో ఉంచి సురాపానంతో తేలియాడుతూ ఉండేవాడు. ఒక హైందవ రాజ్యాన్ని అక్రమంగా ఆక్రమించుకుని అవిచ్ఛిన్నంగా పరిపాలిస్తున్నా, ఇది అక్రమమని అడ్డుకున్న వారు గానీ, అన్యాయమని వారించగలిగిన వారు గానీ ఎవరూ లేరు. ప్రజలందరూ అతని కఠినమైన నిర్ణయాలకు, పెంచిన శిస్తులకు విసిగిపోయి, పాతరాజైన సింహబలుని, ఏమైపోయాడో తెలియని అతని కుమారుడైన మైనాకుని తలచుకుంటున్నారు. కొందరు సుల్తాన్ పెట్టే కష్టాలు తట్టుకోలేక వలసలు వెళ్ళిపోసాగారు.

మంత్రి ముజాఫర్, దండనాయకుడు దౌలత్ ఖాన్ మరి కొందరితో సమాలోచన జరుపుతున్న సుల్తాన్ సభకి తుర్కీదేశం నుండి ఇద్దరు బానిసలు వచ్చారు. తాను బానిసలకు పెద్దవాడినని, కొందరు బానిసలను తీసుకొనివచ్చి నగరంలో అమ్మినానని, మజ్ను అనే బానిసను రాజు గారికి అమ్మటానికి వచ్చానని పెద్దవాడిగా కనిపిస్తున్న బానిస చెప్పాడు. స్త్రీజనాలుండే అంతఃపురానికి కంచుకి లాంటివాడు అని, సుల్తాన్ దగ్గర వేయి బంగారు నాణాలు తీసుకొని మజునూ పేరుతో వున్న హేమాంగిని సుల్తానుకి అప్పగించి, జమాల్ తన పేరు అని చెప్పి వెళ్ళిపోయాడు మైనాకుడు.

మగతనం లేని సుల్తాన్ ప్రపంచానికి తానొక గొప్ప పురుషుడనని ప్రకటించడానికి నూరుగురు కన్యలను వివాహం చేసుకున్నాడు. అతడు మద్యం మత్తులో సోలి తూలిపోతుండగా వారందరూ కొందరు బానిసలతో రహస్యంగా యథేచ్ఛగా సుఖభోగాలను అనుభవించ సాగారు. ఈ విషయాన్ని గమనించిన మజ్ను వేషంలో ఉన్న హేమాంగి వారందరూ కలుసుకునే ‘భూతలస్వర్గం’ లాంటి ఉద్యానవనం రహస్యాన్ని మైనాకునికి చెప్పింది.

రాజ్యంలో ప్రజలందరూ సుల్తాన్ విచిత్ర పద్ధతులకు విసిగి అక్కడక్కడ కొందరు పౌరులు విప్లవ భావాలతో మాట్లాడుకో సాగారు. అది గమనించిన భటులు వారిని తీవ్రంగా హింసించసాగారు.

ఆ శిక్షలకు రోధిస్తున్న ప్రజలను చూసి “నాయనలారా! కొంతకాలం ఓర్చుకోండి. మన రాజుగారి కుమారుడు బ్రతికే ఉన్నాడు. త్వరలోనే వచ్చి ఈ రాజ్యాన్ని తన ఆధీనంలోకి తీసుకొంటాడు” అని ఒక 80 ఏళ్ల వృద్ధుడు చెప్తుండగా, వెంటనే అతన్ని ఖైదు చేసి లాక్కుపోతుండగా, జమాల్ వేషంలో వున్న మైనాకుడు చూసి అతన్ని ధర్మదాసుగా గుర్తించాడు.

రహస్యాలోచనా మందిరంలో హుక్కా తాగుతూ తన్మయానందంలో ఉన్న సుల్తాన్‌తో పక్కనే ఉన్న బానిస మజ్ను నమ్మకంగా మాటలు కలిపింది. “సర్కార్! నూరుమంది రాణులు అంతపుర రహస్య మార్గం గుండా పూతోటలో ప్రవేశిస్తారు ప్రతి ఆదివారం. అక్కడ నూరు మంది బానిసలు సిద్ధంగా ఉంటారు. వారందరూ మోహపరవశులై..” అంటుండగా ‘ఛీ’ అని ఆగ్రహంతో అరిచాడు అతను. “నా భార్యలు అటువంటి నీచకార్యములు చేయరు. ఇది నిరూపించక పోయావో నిన్ను ఉరి తీస్తాను” అన్నాడు. “ఆదివారం రాత్రి మీరు మారు వేషంతో నా వెంట రండి ఉద్యానవనంలోనికి. అక్కడ చూపిస్తాను” అన్నది మజ్ను.

ఆదివారం అమావాస్య. కారు చీకటిలో నిశ్శబ్దంగా మజ్ను, సుల్తాన్ ఉద్యానవనంలోనికి వెళ్లి పొదల మాటున దాగి జరగబోయే తంతు కొరకు నిరీక్షించసాగారు. అంతలో అంతఃపుర రహస్యద్వారం తెరవబడింది. ఒకరి తర్వాత ఒకరు రాణులందరూ వచ్చారు. వంద మంది బానిసలు కూడా వచ్చి వారితో సరససల్లాపాలు మొదలుపెట్టారు.

ఆవేశం పట్టలేక సుల్తాన్ కరవాలం తీసుకొని వారి మీదికి దాడి చేశాడు. హఠాత్ పరిణామానికి వారందరూ నిశ్చేష్టులై పోయారు. వారి నాయకురాలు నూర్జహాన్ రాణీ బేగం తేరుకొని వెంటనే బానిసలకు ఆజ్ఞాపించింది – “సుల్తాన్ ని బంధించండి”. ఒక్కుమ్మడిగా వారందరూ సుల్తానును చుట్టుముట్టారు.

“బేగం! ఎంత ధైర్యం! నన్నే బంధిస్తావా” హుంకరించాడు. “అన్యాయం… అక్రమం…” అంటూ అరిచాడు.

“నువ్వు నపుంసకుడివై యుండి ప్రపంచం కోసం, నీ గౌరవం కోసం నూరుగురు కన్నెలను కట్టుకొని, వారి జీవితాలను కత్తులబోనులో ఉంచావు. దాని ముందు మేము చేసేది అవినీతి కార్యం ఎంత మాత్రం కాదు” అన్నది. సుల్తాన్‌ను బంధించి ఈడ్చుకొని తీసుకు పోయారు బానిసలు. అదే సమయంలో అక్కడి నుంచి మెల్లగా జారుకుంది మజ్ను వేషంలో ఉన్న హేమాంగి.

ఏదో ఆలోచనలలో మునిగి నడుస్తున్న జమాల్ కాలు పొరపాటున ఒక మెత్తటి పదార్థం మీద పడినట్లయింది. ఉలిక్కిపడి చూసేటప్పటికి నల్లటి త్రాచు. అంతలో ఆ సర్పం “ఓ మానవుడా భయపడకు. సుల్తాన్ కొలువులో కానీ, ఈ నగరంలో కానీ మైనాకుడు, హేమాంగి అనే ఇరువురు ఉన్నారని తెలిసింది. వారి సంగతి నీకేమైనా తెలుసా!” అన్నది.

ఆ ప్రశ్నతో ఉలిక్కిపడ్డాడు. తన కంగారు బయటికి కనిపించనీక “నాకు తెలియదు. ఎవరినైనా అడిగి చెప్తాను” అన్నాడు.

“నిన్ను నేను ఎలా కలుసుకోగలను! నేను వస్తే అందరూ భయపడి పోతారు. కర్రలు పట్టుకుని నన్ను చంపటానికి వస్తారు” అన్నది. “అవసరం లేదు. నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేనే వస్తాను” అన్నాడు.

“ఇదే స్థలంలో అక్కడ ఒక మొగలిపొద ఉంది చూడు. అక్కడ ఉంటాను. నువ్వు రాగానే వెలుపలికి వస్తాను” అని చెప్పి నాగరాణి వెనువెంటనే మొగలి పొదలోకి దూరింది.

కానీ ఒక పెద్ద తాచుపాము ఆ చుట్టు పక్కల తిరుగుతూ ఉన్నదని కొందరు భటులు గుర్తించి దాని కోసం తీవ్రంగా వెతుకుతున్నారని నాగరాణికి తెలియదు. రాణీబేగం నూర్జహాన్‌కి ‘ఒక ప్రమాదకరమైన పాము తిరుగుతున్నది’ అని తెలియజేశారు.

ఆ రోజు ఎందుకో చెరసాలలో ఉన్న సుల్తాన్‌కి విపరీతమైన ఆకలి కలిగింది. పరిచారిక తెచ్చిపెట్టిన భోజన పదార్ధాలు దగ్గర కూర్చొని కొంత తిని, పాలు తాగిన వెంటనే అతనికి ఎందుకో తల తిరగటం మొదలు పెట్టింది. మత్తుమందు తాగినట్లు శరీరం తూలి, నాలుక లోనికి లాక్కుపోతుంది. కళ్ళు మూతలు పడడంతో నిలువలేక నేలకొరిగాడు. ఇద్దరు బానిసలు మాత్రం పక్కనే పొంచి ఉండి అతని విషయం అంతా కనిపెడుతూనే ఉన్నారు. అతను నేలకొరగగానే, వెంటనే అతనిని పట్టుకొని రాణీవాసం లోనికి మోసుకొని పోయారు.

ఒక దుష్టసర్పం తిరుగుతోందని, కర్రలు తీసుకొని వెంట తరిమామని అక్కడ కొందరు రాణీబేగంకి చెప్తున్నారు. అంతలో ఆ ఇరువురు బానిసలు సుల్తాన్ దేహాన్ని అక్కడ ఉంచి “దేవి! ఒక పరిచారిక సుల్తాన్ వారికి ఆహారం కొని వచ్చినప్పుడు మేము వారున్న మందిర ద్వారములు తెరిచి చూడగా ప్రభువులు మృతుడై పడిఉండటం కనిపించింది” అని చెప్పారు. ఆ మాట విని మంత్రి, దండనాయకులు విస్తుపోయారు. రాణి సుల్తాన్ సుల్తాన్ మృతదేహం పై పడి “అయ్యో ఆ దుష్ట సర్పం ఇందుకోసమే ఇక్కడికి వచ్చింది కాబోలు. సుల్తాన్ వారిని కరిచి పారిపోయిందా” అని రాణి ఏడుస్తూ ఉండగా మిగిలిన రాణులందరూ అక్కడ గుమికూడారు.

“రాజులేని ఈ రాజ్యం, మేము దిక్కు లేని వారమై పోయాం” అని శోకిస్తున్న రాణి బేగంకి “మేమందరము లేమా! మీకూ, రాజ్యానికి ఎటువంటి శత్రు భయము లేదు” అంటూ మంత్రి దండనాయకులు బాస చేసి ఊరట కలిగించారు.

“ఆ సర్పం ఇంకెందరి ప్రాణాలు బలి గొంటుందో. వెంటనే పట్టి బంధించి చిత్రవధ చేయించండి” అజ్ఞాతపించింది రాణీ బేగం. సుల్తాన్ మరణవార్తను ప్రకటించి అతని దహన కార్యాలకు ఏర్పాట్లు గావించబడ్డాయి.

ఈ విధంగా ఒక దుష్టుడైన పరిపాలకుని జీవితం అంతమైంది.

(సుల్తాన్ మరణించిన తర్వాత రాజ్యానికి రాణి అయిన బేగంగారి పరిపాలన ఎలా సాగింది? తన రాజ్యాన్ని మైనాకుడు తిరిగి సంపాదించుకొన్నాడా?…. తరువాయి భాగంలో….)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here