మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-23

3
8

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]సు[/dropcap]ల్తాన్ స్వర్గస్తుడైనప్పటినుంచి రాణులు, బానిసలు సురాపానంతో మత్తెక్కి అహర్నిశలు పుష్పవనం లోనే క్రీడా విలాసాలతో మైమరచి గడుపుతున్నారు. మంత్రి, దండనాయకులకు కావలసినదదే. రాజ్య సర్వస్వమును హస్తగతం చేసుకోవడానికి మంత్రాంగాలు జరిపిస్తున్నారు. తమ ధనాగారాలను పుష్కలంగా నింపుకుంటున్నారు.

కాపాలి బంధింపబడి ఉండి, తనకు ఏమి సహాయం చేయలేని స్థితిలో ఉండటం వల్ల, ఒక్క పనిని విజయవంతంగా చేయలేక పోతున్నానన్న నిరాశతో గుండా ఫకీరు ఉన్నాడు. నాగరాణి మంజూషాదేవి నగరం విడిచి ఎక్కడికో వెళ్లిపోవడంతో దిగులుగా ఉన్నాడు ఫాలాక్షుడు.

“ఒక్కసారి గాలి గుర్రం పూరించారంటే దాని మీద పోయామంటే మీకు హేమాంగి, మైనాకులు, నాగరాణి నాకు దొరుకుతారు. ఈసారి జయం మనదే” అన్నాడు ఫాలాక్షుడు.

ఫకీరు గాలిగుర్రంలో గాలిని నింపి, గురుశిష్యులు ఇద్దరూ దానిపైకెక్కి అంతరిక్షానికి ఎగిరారు.

ఒక చోట ఇద్దరు పురుషులు సరస సల్లాపాలు ఆడటం చూసి ఆశ్చర్యపోయారు. తీరా కిందకి వచ్చి చూస్తే పురుషరూపంలో ఉన్న హేమాంగి, మైనాకులు.

వారి మాటలు వినాలని గురు శిష్యులు ఇద్దరూ పక్షుల రూపాలు దాల్చి, వృక్షంపై నిలిచి, ఆలకించారు. వారి ఆనందాన్ని చూసి ఆవేశంతో ఫకీరు హేమ తలపై వాలి ముక్కుతో పొడవ సాగాడు. తక్షణం మైనాకుడు అతి లాఘవంతో ఆ పక్షిని తన రెండు చేతులతో పట్టుకొని క్రోధంతో “నువ్వు మారురూపంలో ఉన్న గూండా ఫకీరువు కదూ” అన్నాడు. ఫాలాక్షుడు తనకు సహాయంగా రాకపోవడంతో ఫకీరు “లేదు. నేను ఫకీరుని కాదు” అన్నాడు. “అబద్ధం నువ్వు ఫకీరు కాదని రుజువు చేసుకుంటేనే విడిచి పెడతాం” అంది హేమాంగి. ఫకీరు కోపంతో తన వంక చూడటంతో పాలాక్షుడు గొంతు పెగల్చుకుని “దయచేసి మా గురువును వదిలిపెట్టండి. ఆయన మీరు అనుకున్నట్లు గూండా ఫకీరు కాదు” అన్నాడు. అయినా మైనాకుడు తీవ్రంగా చూడడంతో భయపడి చెట్టును వదిలి ఎగిరిపోయాడు ఫాలాక్షుడు.

“దేవి, మంజూష దేవి! నేను పక్షిని కాదు. నీ కొరకే వస్తున్నాను. ఆగు” అని రెండవ గువ్వ రూపంలో ఉన్న ఫాలాక్షుడు కొంచెం దూరంలో అనడం ఫకీరుతో పాటు హేమాంగి, మైనాకుడు కూడా విన్నారు. నాగరాణి పేరు విన్నంతనే భయబ్రాంతులై చేతిలోని పక్షిని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పక్షి తుర్రున ఎగిరిపోయింది.

“రాణీ…! నేను ఫాలాక్షుణ్ణి…” అంటుంటే మంజూషాదేవి గట్టిగా కసురుకొని, విసుక్కుని, బెదిరించింది. “నీవు వెదుకుతున్న హేమాంగి మైనాకులను నేను చూసాను” అని అతడు అనడంతో ఆగిపోయింది.

“అవును. నేను, ఫకీరు అతని గాలి గుర్రం మీద ఇటువైపు విహరిస్తూ ఉండగా హేమాంగి, మైనాకులు ఈ ఒడ్డున కనిపించారు. మేమిద్దరం వెంటనే ఒక కొండ మీద వాలి, గాలిగుర్రం దాచి, యథారూపాలతో వెళితే వాళ్లు దొరకరని ఈ విధంగా గువ్వలమై, వారిని సమీపించాం. ఫకీరు ఆవేశంతో హేమాంగి మీద పడినప్పుడు మైనాకుడు పట్టి చంపబోయాడు. నేను పారిపోయి వస్తుండగా నీవు కనిపించావు” అన్నాడు. అంతేకాక, ఆమెని వెంటబెట్టుకొని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. కానీ అక్కడెవరూ లేకపోవడంతో రాణి క్రోధావేశంతో పలుకుతుండగా, గాలిగుర్రంని చేత పట్టుకొని ఫకీరు వచ్చాడు.

ఏమైందని రాణి పకీరుని అడగగా ‘హేమాంగి మైనాకుల దగ్గర దేవమందారం వుండడం వల్ల మహా బలవంతులయ్యారు. నేను నా కాపాలిని కాపాడుకోవాలని ఎవమండుగురు కన్యలను ఎలుగుబంటి రూపంలో అపహరించాను. బలి ఇవ్వడానికి గుహలో దాచి వుంచాను. కానీ మహాబల మహారాజు వారిని రక్షించి తీసుకొని వెళ్ళిపోయాడు. కాపాలి లేకపోవటంతో నా శక్తులేమి పనిచేయడం లేదు’ అని నిట్టూర్చాడు.

“కానీ అచిరకాలంలోనే మురారి అంపాపురం రాజ్యాలకు యుద్ధం జరగనుంది. హేమాంగి మైనాకు లిద్దరు అంపాపురరాజుతో చేరి, మురారి రాజ్యంతో పోరాడబోతున్నారు. తన తండ్రి రాజ్యమైన మురారిని తిరిగి సంపాదించుకోవాలని అతని కోరిక” అన్నాడు ఫకీరు.

ముగ్గురూ అంపాపురం బయలుదేరారు.

***

చెరసాలలో ఉన్న రణధీర్ గత నాలుగు రోజుల నుండి కూతురు రాగలత రాకపోవటం వల్ల అధికంగా కంగారు పడుతున్నాడు. మహాబల మహారాజు నుంచి తప్పించుకోలేక ఏమైందో ఏమో అని దుఃఖిస్తున్నాడు. అంతలో చిలుక ఎగిరి వచ్చి కారాగృహ ముంగిట అతని ఎదురుగా నిలిచింది. కానీ ఎప్పటిలాగా రాగలతతో కాకుండా ఒంటరిగా చిలక వచ్చినందుకు భయపడ్డాడు రణధీర్. కూతురి గురించి అడిగాడు.

“ఆరోగ్యం సరిగా లేదు. వాంతుల మూలంగా నీరసించి ఉండటంవల్ల రాలేకపోయింది. రెండు రోజులలో వైద్య సేవల వల్ల యథాస్థితికి వస్తుంది. ఆ విషయం మీకు తెలుపుడు చేయటానికి నన్ను పంపించింది” అన్నది చిలుక సారంగి. “కథ చెప్తూ, రోజులు పొడిగిస్తూ, ఆపదలో రక్షకుడిగా, మిత్రుడిగా ఆమెను కాపాడుతున్న నీ రుణం జన్మజన్మలకు తీర్చుకోలేము” అన్నాడు రణధీర్

“తీర్చగలరు. ఆ సమయం కూడా వస్తుంది” అంటూ చిలుక ఎగిరిపోయింది.

చిలుక తిరిగివచ్చి తండ్రి గారి సమాచారం గురించి ఆదుర్దా పడుతున్న రాగలతతో “నీవు వాంతుల వల్ల నీరసంగా ఉన్నావు అంటే ఆయన ఏమో అనుకున్నారు. కానీ నువ్వు తల్లి కాబోతున్నావని గ్రహించలేదు” అన్నాడు చిలక రూపంలో ఉన్న జయదేవ్.

“ఆయనకు అప్పుడే చెప్పకూడదు. ఇతరులు వింటే ప్రమాదం కదా” అన్నది రాగలత సిగ్గుపడుతూ.

అంతలో మహారాజు విచ్చేశారు. పదమూడవ రాత్రి కథ చెప్పటం మొదలు పెట్టింది చిలుక.

“మహారాజా! నేను చెబుతున్న కథలో మనోరమ మకరంద్‌ల తండ్రి అమరనాథ్, అమరావతి రాజ్యం గురించి జ్ఞాపకం ఉన్నదా” అన్నాడు చిలుక రూపంలో వున్న జయదేవ్.

“తండ్రిగారైన అమరనాథ్ నిర్ణయించిన పంచవర్ష ప్రణాళికను అమలు పరచటానికి మనోరమా తారానాధ్ మకరందులు కలిసి అమరావతి నుంచి కదా అలకాపురి వచ్చారు! తరువాత అవంతితో వివాహము, లాల్మియా వల్ల అనేక కష్టములకు లోనై, బయటపడలేక పోవడం జరిగింది కదా” అన్నది రాగలత.

చిలుక కథ ప్రారంభించింది.

బిడ్డల నుండి ఏ సమాచారం రాకపోవడంతో అమర్‌నాథ్ సైనిక బలముతో తరలి అలకా పురాధీశుడైన జగదీప్ వద్దకు బయలుదేరి వచ్చాడు. జగదీప్ ఆ బలగాన్ని చూసి భయపడ్డాడు కానీ, పిల్లల సమాచారం కోసం వచ్చాడని తెలిసి స్థిమితపడి, తప్పక సహాయం చేస్తానని మాట ఇచ్చాడు.

అక్కడ మకరంద్ మనోరమ అవంతి మాధురిబేగం సంతోషంగా మాట్లాడుతుండగా వక్రనాధుడు గుండెలు బాదుకుంటూ వచ్చాడు- చిత్రరేఖ కళేబరం ఎవరో అపహరించుకుని పోయారని. “ఇదిగో ఈమే అవంతి. తన కంఠ రక్తబిందువులతో నీ భార్యను బ్రతికించగలదు” అన్నది మాధురి బేగం. వక్రనాథుడు అవంతి కాళ్ళపై పడి ‘ఇప్పుడు నాకేది దారి తల్లి’ అన్నాడు. “తారానాధుని కాపలా పెట్టావు కదా” అన్నాడు మకరంద్.

“అతను అమాయకుడు. అతనిని అనుమానించకండి” అంది కంగారుగా మనోరమ.

చిత్రరేఖను అవంతి వల్ల బ్రతికించుకోవాలన్న తలంపుతో మృత కళేబరంతో భర్త బయలుదేరిన సమాచారాన్ని పసిగట్టి మదనమంజరి తను కూడా భర్తకు తెలియకుండా సింహళం చేరింది. తారానాథ్‌ను ఏమార్చి, వక్రనాథుడు యుద్ధరంగానికి పోయిన సమయంలో తలుపులు బద్దలు కొట్టి, లోనికి ప్రవేశించి, చిత్రరేఖ కళేబరాన్ని భుజాలపై మోసుకొని అడవిలోనికి పోయింది. అక్కడ ఆ కళేబరంపై కొన్ని ఆకులు కప్పి మరుగు పరచి, మరికొన్ని ఎండు కట్టెలు సేకరించడానికి బయలుదేరింది. తర్వాత కట్టెలతో పెద్ద చితిని తయారుచేసింది. అంతలో అటుగా వచ్చిన లాల్మియా ఆమెనక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. “నారికేళ ద్వీపం నుండి ఇక్కడికి ఎలా రాగలిగావు” అన్నాడు. “నా సవతి చిత్రరేఖని ఎవరో అవంతి అట బ్రతికిస్తుందని నా భర్త ఆ మృతకళేబరాన్ని ఇక్కడకు చేర్చాడు” అంది. అవంతి అక్కడ ఉందని తెలిసి ఆశ్చర్య పోయాడు లాల్. ఆమె చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించగలదన్న విషయం తెలిసి మరీ ఆశ్చర్యపోయాడు.

“అగ్ని దొరికితే ఇప్పుడే కట్టెలకి మంట అంటిస్తాను” అంది కసిగా మదనమంజరి.

“ఈ అడవిలో అగ్ని ఎక్కడ దొరుకుతుంది? ఒక పని చేద్దాం. మనిద్దరం ఆ కళేబరాన్ని మోసుకు పోయి సముద్రంలో వేద్దాం” అన్నాడు లాల్. ఇద్దరూ కలిసి ఆ మృతదేహాన్ని సముద్రం వద్దకు చేర్చారు. కానీ అంతటి సౌందర్యరాశిని నీటిపాలు చేయటం నచ్చలేదు లాల్‌కి. “నీ సవతి అడ్డులేకుండా పోవటమే కదా నీకు కావాలి. నీకు కనపడకుండా, జన్మలో నీకు సవతి పోరు లేకుండా చేస్తాను” అన్నాడు.

“నిన్ను నమ్మినందువల్ల ప్రతిసారి నీ వల్ల నాకు అపకారమే జరుగుతోంది” అని గట్టిగా అరిచింది మదనమంజరి.

ఆ అరుపులకు మకరంద్, వక్రనాథుడు, మరికొందరు భటులు కర్రలు పట్టుకుని అక్కడికి వచ్చారు. వారిని చూసి మదనమంజరి, లాల్మియా భయ విభ్రాంతులయ్యారు.

“నీవల్ల చిత్రరేఖ మృతురాలయిందని తెలిసినప్పుడే నిన్ను శిక్షించకుండ వదిలిపెట్టడం అపరాధమైంది. ఇక్కడి వరకు వచ్చి నేను భద్రపరిచిన శరీరాన్ని అపహరించి నీవు చేస్తున్న పని ఇదా” అని వక్రనాథుడు నిప్పులు కురిపిస్తుంటే ఆమె తల ఎత్తి భర్త మొహం చూడలేకపోయింది. ఆ సమయంలో తనతో వచ్చిన భటుల వద్దనున్న బలమైన ఇనుప గొలుసులతో లాల్మియాను బంధించడం పూర్తిచేశాడు మకరంద్. వక్రనాథుడు మదనమంజరిని గూడ గొలుసులతో బంధించాడు. ఇద్దరినీ లాక్కుపోసాగారు.

(మైనాకుడు, హేమాంగి ఏమయ్యారు? గూండా ఫకీరు కాపాలిని తిరిగిపొందాడా? తనకు తెలియకుండా తన ఆధీనంలో ఉన్న రాగలత గర్భవతి అయిందని మహారాజుకు తెలిసిందా?…. తరువాయి భాగంలో…!)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here