మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-25

4
10

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]మ[/dropcap]కరంద్ మనోరమాదుల క్షేమ వార్తలు తెలియక అమర్నాథ్ అపరిమితమైన దుఃఖంతో అలకాపురం చేరి మిత్రుడైన జలదీప్ సహాయం కోరి ఉన్నాడు. వారి అన్వేషణార్థం పంపబడిన గూఢచారులు ఇంకా తిరిగి రాలేదు. ఏమీ తోచక అమర్నాథ్ అందమైన అలకాపురం అంతా చూడాలని మారువేషంలో తిరుగుతున్నాడు. అలా ఒకరోజు చాలా దూరం వెళ్ళాక ఒక బహు పురాతనమైనది, కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుత మణిమాణిక్యాలతో నిర్మితమైన గోపుర ప్రాకారాలతో దేవతామూర్తులతో తాపడం చేయబడిన, బంగారు ద్వారములతో, నానావిధశిల్ప చాతుర్యంతో అలరారుతున్న దేవాలయం అతని దృష్టిని ఆకర్షించింది. అలసి ఉన్న అతడు విశ్రాంతి తీసుకోవాలని లోన ప్రవేశించాడు. అందుగల చిత్ర విచిత్ర శిలాప్రతిమలను తిలకిస్తూ ఉండగా అక్కడ ఒక రాతి స్తంభమునకు గట్టబడి ఉన్న చిత్రపటం చూసి, ఆ జగన్మోహనాకారచిత్రం ఎవరిదై ఉండవచ్చునని, ఆ లావణ్యవతి సౌందర్యమునకు అచ్చెరువొంది దానిని తాకబోగా, అది వెంటనే వెనుతిరిగి గోడ వైపుకి అతుక్కు పోయింది. అతడెంత ప్రయత్నించినా వృథా ప్రయాస అయినది. అది ఏమి మాయో, ఆ చిత్రపటం ఎవరితో తెలియక అతడు తబ్బిబ్బయినాడు.

అంతలో ఆలయ పూజారి స్నానాదికాలు ముగించుకొని, స్వామి నివేదన కొరకు పూజాద్రవ్యములు తీసుకొని వచ్చినాడు. సన్యాసి వేషంలో నిలుచున్న మహారాజును చూసి ఆగ్రహించాడు. “అయ్యా క్షమించండి ఈ దేవాలయము ఎవరిది? ఈ చిత్రపటం ఎవరిది?” అన్నాడు అమరనాథ్.

“ఇది పాండురంగ స్వామి ఆలయం. దీనిని నిర్మించినది ఒక పుణ్యమూర్తి. ఆమె ఈ నగరమునకు చెందినదే. ఇటీవలనే వివాహమాడి ఇక్కడ నుంచి వెళ్ళినది. ఈ చిత్రపటమును ఎవరు ఇలా తిప్పినారు” అన్నాడు పూజారి. తాను తాకబోగా దానికదే తిరిగినది అని చెప్పినాడు మహారాజు. పూజారి కూడా ఆ విచిత్రానికి ఆశ్చర్యపోయాడు.

ఆ లావణ్యవతి సౌందర్యానికి మనసు పోగొట్టుకున్న మహారాజు దిగులుగా వెనుతిరిగాడు. మోహపరవశుడైన మహారాజు పరిస్థితి గమనించిన జలదీప్ పూజారి దామోదరుని పిలిపించి ఆ ఆలయం కట్టించిన ఆమె ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. ‘రెండు మూడు రోజులలో స్వామికి బ్రహ్మోత్సవం జరుగుతుంది, ఎక్కడ ఉన్నా ఆమె ప్రతి ఏడాది ఈ ఉత్సవానికి విధిగా వచ్చి తీరుతుంది’ అని చెప్పాడు పూజారి. ఆమె వస్తే తప్పక తెలియజేయమని ఒక జాగీరు బహుమతిగా ఇస్తానని చెప్పాడు మహారాజు.

అమరనాథ్ తన దర్శనార్థం ఒక వృద్ధురాలు వచ్చినదని తెలిసి ప్రవేశ పెట్టమన్నాడు. వచ్చినది రుద్రమ్మ. మనోరమ మకరంద్ లతో తను పంపినది ఈమెనే. అవంతితో మకరంద్ వివాహము, లాల్మియాతో వారు పడ్డ కష్టాలు, వాళ్ళు వెళ్ళిపోవటం, తను వారి కోసం ఇంత కాలం ఎదురు చూసి మహారాజుని వెతుక్కుంటూ రావడం చెప్పింది రుద్రమ్మ. ఆ మాటలు మీద కానీ, అక్కడ నుండి ఆమె వెళ్లిపోవటం మీద కానీ అమరనాథ్ మనసు నిలబడలేదు.

పిచ్చివాడిలా “రూపసుందరీ… రూపసుందరీ…” అని కలవరించ సాగాడు, పలవరించసాగాడు….

“ఆగు” అన్నాడు చిలుక చెపుతున్న కథను వింటున్న మహాబల మహారాజు. “రూప సుందరి…. ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది” అన్నాడు.

“కథలో కల్పించబడిన పేరుతో మీకెలా పరిచయం ఉంటుంది ప్రభూ” అన్నది రాగలత.

“ఏమే చిలుకా! నువ్వు చెబుతున్న కథ కల్పితమా? ఎప్పుడన్నా, ఎక్కడన్నా జరిగిందా?” అన్నాడు మహారాజు.

“ఏమో ప్రభూ. మా గురువులు శివస్వాములు చెప్పిన దానిని మీకు చెబుతున్నాను” అన్నాడు చిలుక శరీరంలో ఉన్న జయదేవ్.

“సరే. త్వరగా చెప్పు. ఈ రాత్రికి కథ పూర్తి కావాలి. ఉదయానికి వచ్చే గూండా ఫకీర్ కి నిన్ను అప్పగించి నా వాగ్దానం నిలుపుకోవాలి” అన్నాడు మహారాజు.

కథ ప్రారంభించింది చిలుక.

తన వారినందరిని ఆ సముద్రం కడుపులో దాచుకొని, తనని మాత్రం ఒడ్డుకు నెట్టి వేయడంతో, కాసేపటికి స్పృహ వచ్చి కళ్ళు తెరిచింది అవంతి. కన్నీరుమున్నీరవుతూ ఎదురుగా ఉన్న పాండురంగని దేవాలయాన్ని చూస్తూ ‘నేనేమి అపరాధము చేశాను తండ్రీ’ అని విలపిస్తూ, పడుతూ లేస్తూ, ఆలయంలోనికి ప్రవేశించింది. ఆమెను గుర్తించాడు పూజారి దామోదరం. మహారాజు ఆశ చూపిన జాగీరు కూడా గుర్తుకొచ్చింది. జాగీరును పోగొట్టుకోవడం ఆ పేద పూజారికిష్టం లేదు. ఆమె భగవత్ ప్రార్థనలో మునిగిపోవడం గమనించి, బయటకు వచ్చి, పరుగు పరుగున మహారాజు వద్దకు వెళ్లి విషయం చేరవేశాడు.

అమర్నాథ్ తన వాంఛితం నెరవేరనున్నందుకు పట్టలేని సంతోషముతో ఆలయానికి వచ్చాడు. “సుందరీ.. జగన్మోహినీ” తమకంతో బిగ్గరగా అన్నాడు.

ఆశ్చర్యపోయింది అవంతి.

“నీ సౌందర్య యౌవనాలతో నా తృష్ణ ను తీర్చు. సమస్త రాజభోగాలు అనుభవించు” అన్నాడు.

“దామోదర్” భయంతో పిలిచిందామె.

బయటకు పోవటానికి ప్రయత్నించింది.

పాండురంగని విగ్రహం చెంతకు పోయి పాదాలపై వాలి విలపించింది.

అమరనాథ్ పశుబలంతో ఆమె దాపుకు పోయి చేయి పట్టుకోబోగా, వెంటనే అతని నడుముకున్న కైజారుని అందుకొని, అతని కంఠంలో బలంగా పొడిచింది అవంతి.

హాహాకారాలతో అమరనాథ్ నేలకొరిగాడు.

స్వామి విగ్రహం వేడి రక్తంతో అభిషేకించబడింది. అవంతి కళ్ళు బైర్లుకమ్మాయి. విగ్రహం మీద పడింది. ఆమె ప్రాణవాయువులు పాండురంగనిలో ఏకమైపోయాయి.

అంతవరకు చెప్పి ఆగింది చిలుక.

“మీ ఇరువురిలో ఎవరికైనా పాండురంగని ఆలయం దర్శించిన జ్ఞాపకం ఉందా” అడిగింది చిలుక.

“ఎప్పుడో తెలియదు కానీ, నాకు దర్శించిన జ్ఞాపకం ఉంది” అన్నది రాగలత.

“అవును నాకూ స్వప్నములో చూసినట్లు ఉన్నది” అన్నాడు మహారాజు .

“మహారాజా! మీ కంఠం దగ్గర ఒక గాయపు మచ్చ ఉందేమో చూసుకోండి” అంది చిలుక.

“నాకు ఎప్పుడూ ఎవరి వల్ల కత్తి దెబ్బలు తగలలేదు. ప్రతి యుద్ధం లోను నాదే విజయం. నాకు తెలియకుండా నాకు గాయం ఎలా ఉంటుంది” అన్నాడు మహారాజు.

అతని కంఠం పరిశీలనగా చూసి “ఉంది మహాప్రభూ. చూసుకోండి” అన్నది రాగలత. చక్రవర్తి అక్కడ ఉన్న నిలువుటద్దం దగ్గరికి పోయి పరిశీలనగా చూసుకున్నాడు. నిజమే. ఏదో కత్తితో పొడిచినట్లు స్పష్టంగా ఒక గాయపు మచ్చ ఉన్నది. ఆశ్చర్యపోయాడు. ఎలాగా అని చిలుకని అడిగాడు. ‘మీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది’ అన్నది చిలుక.

“తెలియకుండానే గాయపు గుర్తు గురించి చెప్పావా! త్వరగా చెప్పు” అన్నాడు మహారాజు.

“నేను అడిగిన దానికి తమరు బదులు చెబితే మీరు అడిగిన దానికి నేను బదులు చెప్పగలను”

“అడుగు”

“తమరు దినమునకొక కన్య ననుభవించి మర్నాడు ఆమెను హత్య గావించటానికి ప్రతిజ్ఞ ఉన్నది అన్నారు కదా! దానికి కారణం ఏమిటి? తెల్లవారగనే ఫకీర్‌కి నన్ను ఇచ్చేస్తారు కనుక ఆ కారణం ఇప్పుడే చెప్పండి”

వందమందిని హత్యగావించిన ఆ వ్రత కారణమేమిటో తెలుసుకోవాలని రాగలత కూడా ఆత్రుతతో వేచి చూస్తున్నది.

(చిలక చెప్పే కథలోని పాత్రలకు ప్రస్తుత పాత్రలకు సంబంధమేమిటి? వందమందిని హత్య చేయటానికి మహారాజు కున్న కారణమేమిటి? తరువాయి భాగంలో….)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here