మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-27

4
14

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]త[/dropcap]నను పరాభవించి, మోసగించి, తన అంతఃపురం లోనే ఉంటూ పర పురుషుని వల్ల గర్భవతి అయిన రాగలత, తన కర్పింపబడిన గాలి గుఱ్ఱమును సైతం తస్కరించుకొని పోవటంతో మహాబల మహారాజు శాంతి కోల్పోయి పిచ్చివాడిలా తయారయ్యాడు. ఆమె ఎక్కడుందో కనుక్కుని శిక్షించాలని, ఆమె తండ్రి రణధీర్‌ని ఉరి తీయాలని దండోరా వేస్తే, తండ్రిని రక్షించుకోవడానికి ఎలాగైనా వస్తుందని పన్నాగం పన్నాడు. ఊరూరా దండోరా వేయించాడు. రణధీర్‌ని బహిరంగంగా ఉరితీయాలని ఏర్పాట్లు గావించాడు అతన్ని ఉరికంబం ఎక్కించబోతుండగా ఒక వైపు నుంచి ఒక దేశదిమ్మరి లాంటి వేషంతో ఉన్న యువకుడు అత్యంత వేగంగా రణధీర్‌ని చేరి అతని కట్లు విడదీసి తనతో లాక్కుపోసాగాడు. అదే సమయంలో మరొక పక్క నుంచి ఒక సన్యాసి వేషధారి కూడా రక్షించడానికి వచ్చాడు. అక్కడినుంచి ముగ్గురు పారిపోయాక, ఆ దేశదిమ్మరి జయదేవ్ అని, సన్యాసి వేషధారి రాగలత అని తెలుసుకొని ముగ్గురు కళ్ళనీళ్ళ పర్యంతంగా ఆనందంలో నిండిపోయారు. తండ్రి కోసం బయలుదేరిన రాగలత తన బిడ్డను శైలబాల అను యక్షకన్యకు అప్పగించి వచ్చింది. అటు వెళ్లబోతుండగా “శివస్వాముల వారు జీవసమాధి చెందుతున్నారు” అన్న కలకలం విన్న జయదేవ్ రాగలతతో పాటు బిల్వవనం చేరుకున్నాడు.

ఆ పున్నమినాడు, వేలాది శిష్య జనం వీడ్కోలు పలుకుతుండగా, ప్రధాన శిష్యగణం లోని దుందుభి దంతనాధులు స్వామికి ఇరువైపులా నిలిచి ఉండగా, వింధ్య పర్వతములలో భాగమైన ఒక కొండ ప్రాంతంలో…, పెద్ద రాతి పలక లోనికి శివస్వామి… నిమీలితనేత్రుడై… “ఓం నమశ్శివాయ” అనే మహా మంత్రాన్ని ఏకాగ్రతతో జపిస్తూ… అంతర్భాగం లోనికి… ప్రవేశం చేశారు.

కొన్ని క్షణాలు ఆలస్యంగా జయదేవ్ అక్కడికి చేరుకున్నాడు. గురువుగారు జీవసమాధి అయ్యారని తెలిసి పొగిలి పొగిలి రోదించాడు. చివరికి సమాధికి తల బాదుకోసాగాడు.

“నాయనా! నీ గురువు నీలోనే అంతర్ముఖుడై ఉండగా క్షణికమైన బాహ్యరూప సందర్శనం కోసం ప్రాకులాడుతున్నావా! జ్ఞాననేత్రం విప్పి దృష్టిని అంతర్ముఖం ప్రసరింప చేసుకో. నీ గురువుని నీలోనే చూడగలవు…'” దివ్యవాణి పలుకులు విని జయదేవ్ కళ్ళు మూసుకున్నాడు. కొద్ది క్షణాల తర్వాత బ్రహ్మానందంతో కళ్ళు విప్పి “స్వామి! తరించాను. ధన్యోస్మి” అన్నాడు. “నీ కార్యక్రమమింకా పూర్తి కాలేదు. భార్యా పుత్రులతో కొంతకాలం సుఖించి, నిర్దేశిత కార్యములన్నీ నెరవేర్చి నన్ను చేరుతావు. నీకు శుభములు కలుగుగాక” అన్న ఆశీర్వచన పలుకులు విని సంతృప్తుడు అయ్యాడు.

శైలబాల మరియు ఆమె తల్లిదండ్రుల దగ్గర ఉన్న తమ బిడ్డ కోసం జయదేవ్ రాగలతలు రణధీర్‌తో కలిసి అన్వేషిస్తూ వెళుతుండగా మైనాకుడు, హేమాంగి లను కలుసుకున్నారు. ఆ సంరంభంలో హేమాంగి కంఠం నుండి జారిపడిన రక్షరేఖను పరీక్షగా చూసిన రణధీర్ సంతోషాతిశయంతో “నా బిడ్డ… చిన్ననాటనే ఎవరో అపహరించుకు పోయిన నా బిడ్డ..” అన్నాడు. తాము అనుమానించినట్టే రాగలత, హేమాంగి కవలలు అన్న విషయం రూఢి అయి జయదేవ్, మైనాకులు సంతోషించారు. ఇద్దరు బిడ్డల్ని దగ్గరకు తీసుకొని పరమానందం పొందాడు రణధీర్.

రాగలత మీద ద్వేషంతో మహాబల మహారాజు ప్రజల్ని, పాలనను మరిచి, తనను తాను మరిచి, పగ తీరే మార్గం కానరాక, జుట్టు పీక్కుంటూ, రక్తం కారేలా గోళ్ళతో ఒళ్ళంతా గాయపరుచు కుంటున్నాడు. మహారాజు పరిస్థితి తెలిస్తే రాజ్యం లోపలా బైటా కూడ అరాచకమే అని భావించి ప్రధాన మంత్రి ఒక తంత్రం పన్నాడు. ముమ్మూర్తులా రాగలతలా ఒక మైనపు బొమ్మను శిల్పాచార్యులచే తయారుచేయించి కారాగారంలో ఉంచాడు. రాగలతను బంధించామని మహారాజుకి చెప్పి అక్కడకు తీసుకెళ్ళాడు. అదే రాగలత అని భావించి, ఒక్క వ్రేటుతో తెగనరికి, కసి తీరిందని తృప్తి పడ్డాడు మహారాజు. దానితో అతని ఉన్మాదావస్ధ తొలిగి పోయింది.

ఎందరెందరో కన్యలను మోహించి, ఎవరిని దక్కించుకోలేక భంగపడిన గుండా ఫకీర్ చివరకు యక్షకన్య అయిన శైలబాలను మోహించాడు. తన మంత్ర శక్తులతో చంపేస్తానని ఆమె తల్లిదండ్రులను బెదిరిస్తే వారు మారుమాట్లాడక పెళ్లి ఏర్పాట్లు చేశారు. విధివిహితంగా మంత్రాలు వినవస్తుండగా… గూండా ఫకీర్ అత్యంత ఆనందంగా… ఆమె మెడలో మాంగల్యం ముడి వేస్తుండగా… బ్రహ్మాండం బద్దలవుతున్నంత.. ఫెళఫెళ శబ్దాలతో… ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. గూండా ఫకీర్ గిలగిలా కొట్టుకొంటూ… రక్తం కక్కుకుంటూ.. నేలపై పడిపోయాడు.

“మా శైలబాల మెడలో మొదట మాంగల్యం కట్టినవాడు మృతుడౌతాడని శాపం వుంది. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకొన్నాం కానీ వీడికి భయపడికాదు” అన్నారు వారు.

“ఈ అవతారం ఇంతటితో ముగిసింది. మీ అందరి మీదా పగ సాధించడానికి మళ్ళీ అవతరించకపోను…” అంటూ ప్రాణాలు వదిలాడు గూండా ఫకీర్.

“వీడి మరణం ‘విశ్వశాంతి’కి నాంది” అనుకుంటున్న అందరి మనసులు కుదుటపడ్డాయి.

అనుకోకుండా రాగలత బిడ్డ తనచేతికి దొరకడంతో ఆ చిన్న పిల్లవాడి చిరునవ్వుకి ముచ్చట పడి తనతో వుంచుకొంది. తన బిడ్డను కాపాడి తెచ్చిన చతురిక, నాగరాణిలకు కృతజ్ఞతలు తెలిపింది రాగలత. ఆమె చెప్పడంతో హేమాంగి ‘దేవమందారం’ను నాగరాణికి అప్పగించింది. “నిజానికి చతురిక దగ్గరున్న పిల్లవాడు తప్పిపోవడంతో, ఆ బిడ్డను రక్షించి తెచ్చినవాడిని పెళ్ళాడతానని నేను ప్రకటించాను. చాలా కష్టపడి తెచ్చిన ఫాలాక్షుని పెళ్ళాడాలి మరి” అంది నాగరాణి నవ్వుతూ. ఫాలాక్షుని ఆనందానికి అవధులు లేవు. నాగరాణిని వెదుకుతూ వచ్చిన చతురిక వెంట వచ్చి, సహాయంగా నిలిచిన రత్నశేఖరుని పెళ్ళాడడానికి చతురిక అంగీకరించింది.

(ముగింపు తరువాయి సంచికలో….)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here