మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-28

9
9

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

[dropcap]నూ[/dropcap]రు మంది ధరాపాలకులు జయదేవుని వద్దకు వచ్చి”ఓ జగదేకవీరా! నవయౌవన ప్రావిర్భూతలై, వివాహ యోగ్యులుగా నున్న మా కుమార్తెలను ఈ చక్రవర్తి ఒక్కొక్కరినీ వివాహమాడి నిర్ధాక్షిణ్యంగా కడతేర్చాడు. పుత్రికా వియోగ దుఃఖముతో మేము బ్రతకలేము” అని కన్నీరుమున్నీరయ్యారు.

“చక్రవర్తిచే నరకబడిన నూరుమంది శరీరములు ఉద్యానవనంలోని బావిలో ఉన్నాయి. కోట వెనుక తులసి వనంలోని తులసికోట లోనికి వెళితే మృతులైన వారిని బ్రతికించే విధము తెలుస్తుందిట” అన్నది రాగలత.

దానికి నాగరాణి “ఆయుః ప్రమాణానికి ముందు మృతులైన వారికెవరికైనా దేవమందారం తాకిస్తే వారు సజీవులు అవుతారు. రండి. ఆ కందకం వద్దకు పోదాం” అనటంతో అందరూ అక్కడకు వెళ్లారు. నాగరాణి తన దేవమందారాన్ని రాగలతకీయగా, ఆమె లోనికి దిగి, ఒక్కొక్క మృతదేహానికి ఆ అపూర్వ పుష్పమును తాకించింది. అద్భుత రూపవంతులైన నూరుగురు రాజకుమార్తెలు సజీవులవడంతో వారి తల్లిదండ్రులు ఆనంద పరవశులై అయ్యారు.

“మహావీర జయదేవా! నా అఖండ సర్వ సామ్రాజ్యాలకు నీ పుత్రుడు వారసుడై పట్టాభిషిక్తుడై, భోజరాజు విక్రమార్కాది విశ్వవిఖ్యాతులను మరపించేలా విరాజిల్లాలి” అన్నాడు మహాబల చక్రవర్తి. “అంతే కాదు నీకు, నీ రాగలతకు నేను గావించిన మహాపరాధములెన్నో కలవు. నీ కరవాలానికి నా కంఠమును సమర్పిస్తున్నాను” అని మహాబలుడు బద్ధహస్తుడై నిలుచున్నాడు.

“మహారాజా పొరబడుతున్నారు. నాకు కావలసినది నీ శిరస్సు కాదు. నీ హృదయ పరివర్తన మాత్రమే నేను కోరుకుంటున్నాను. అందుకే చిలుక మృతదేహంలో పరకాయ ప్రవేశం గావించి నీకు ఎన్నో కథలు చెప్పాను. నీతి బోధలు చేశాను. ‘అహింసా పరమో ధర్మః‘ అన్న ధర్మసూత్రం ప్రధానమైనది. అది నీవు ఇప్పటికైనా గ్రహిస్తే నేను కృతార్ధుడ నయినట్లే” అన్నాడు జయదేవ్.

ఆకాశం నుండి పుష్ప వర్షం కురిసిందా, దేవదుందుభులు మ్రోగాయా అన్నట్లు అందరి ముఖారవిందాలలో కిలకిలా రావాలతో హర్ష ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

అవును. విశ్వశాంతి కి మూలం అహింసా పరమో ధర్మః.

సర్వే జనా స్సుఖినోభవంతు

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః

* శుభం *

~ ~

1960 జూన్‌లో ప్రారంభమైన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారి “జగజ్జాణ” ధారావాహిక నవల 1961 ఏప్రిల్‌కి పూర్తయింది. ఎం.వి.ఎస్ పబ్లికేషన్స్ (కోడంబాకం హైరోడ్డు, మద్రాస్) వారు ముందుగా ప్రకటించిన విధంగానే – పాకెట్ సైజులో ఒక్కొక్క భాగం 70 పేజీలతో, 60 పైసలు ఖరీదుతో, నెలకు రెండు, ఒక్కొక్క నెలలో మూడు చొప్పున పది నెలలలో 25 పుస్తకాలను వెలువరించారు. ‘ప్రచురణ మధ్యలో ఎన్నో అవాంతరాలు వచ్చినా, స్థిర సంకల్పంతో వాటినన్నిటినీ అధిగమించి, ‘జగజ్జాణ’ తో మొదలై ‘విశ్వశాంతి’ తో ఆఖరిభాగం’ ప్రచురించామని తెలియజేశారు. నాటి ప్రఖ్యాత చిత్రకారులు, చలన చిత్ర కళాదర్శకులు అయిన శ్రీ ఎస్.ఎం. కేతా (స్టూడియో కేతా) గారు ప్రతి భాగానికి అద్భుతమైన, అపూర్వమైన, అందమైన ముఖచిత్రాలను సమకూర్చారు. ఉత్సాహవంతులైన పాఠకుల యొక్క, శ్రేయోభిలాషులయిన ఏజెంట్స్ యొక్క ప్రోత్సాహం ప్రోద్బలాలే ముఖ్య కారణం అంటూ కృతజ్ఞతలు తెలియజేశారు ప్రచురణకర్తలు. ప్రతి భాగం “భయంకర్” కలం పేరుతో సకాలంలో అందించి సహకరించిన శ్రీ కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు అందించారు.

ఆనాడు అద్భుత విజయాలను అందుకున్న ఈ నవల ఎన్నో జానపద చిత్రాలకు కూడా ఆధారమయింది. ఈ మిస్టరీ, సస్పెన్స్ నవలని ఆబాలగోపాలం చదివి ఆనందించారు. “బాహుబలి”కి విశేష ఆదరణ అందించిన ఈనాటి వారికి కూడా ఇలాంటి రచనను సరళమైన భాషలో అందించాలన్న ఆలోచనతో “సంచిక” వెబ్ మ్యాగజైన్, శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి తెలియజేయగా వారు వెంటనే అంగీకరించారు. శ్రీ భువనచంద్ర గారు, శ్రీ దుగ్గరాజు శ్రీనివాసరావు గారు ఇచ్చిన కొంత సమాచారంతో మొదలుపెట్టాను. అనూహ్యంగా పరిచయమైన కొవ్వలి గారి కుమారులు శ్రీ కొవ్వలి నాగేశ్వరావు గారు, శ్రీ కొవ్వలి లక్ష్మీ నారాయణ గారు దాదాపు ప్రతిరోజు ఫోనులో “చెల్లెమ్మా” అంటూ ఆప్యాయంగా నాతో మాట్లాడుతూ, తమ తండ్రిగారికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేశారు. నాటి ఎం.వి.ఎస్ గారన్నట్లు నాకూ కొన్ని అనారోగ్యాలు, అవాంతరాలు, అవహేళనలు ఎదురైనా దృఢనిశ్చయంతో, సంకల్పంతో కథ మొత్తం పూర్తి చేయగలిగాను. రచనలో పూర్తి స్వేచ్ఛను, ప్రోత్సాహాన్ని అందించారు సోదరుడు మురళీకృష్ణ. వారికి, కొల్లూరి సోమశంకర్‌కు, మిగిలిన సంచిక సిబ్బందికి అనేక ధన్యవాదాలు.

సంచిక”కు మాత్రమే ప్రత్యేకం – కొవ్వలి కుమారులతో- ముఖాముఖి–

శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారితో ముఖాముఖి

రచయిత్రి: నమస్తే అండి. 1001 నవలలు రాసిన శ్రీ కొవ్వలి గారికి తెలుగు సాహిత్య చరిత్రలో సముచిత స్థానం కలగక పోవటానికి కారణం ఏమిటి?”

కొ.నా:- మీ ప్రశ్న లోనే సగం సమాధానం ఉన్నది. మీరు గొప్ప సాహిత్యవేత్తలు. పరిశోధనలు చేసి డాక్టరేట్ పొందారు. కొవ్వలి సాహిత్యానికి ఎంతో సేవ చేశారని ఒప్పుకుంటున్నారు. అదే విధంగా ప్రతి సాహితీవేత్త – ప్రముఖులు పూనుకుంటే తప్పకుండా ఆయనకు తగిన స్థానం కల్పించేవారు.

అసలు సముచిత స్థానం అంటే ఏమిటి? ఆయనకు పద్మశ్రీలు వగైరా బిరుదులు ఇవ్వాలా! పాఠ్యాంశ పుస్తకాలలో ఒక అంశంగా పెట్టాలా? అసలు తెలుగు తెరమరుగవుతున్న ఈనాటి వ్యవస్థలో – ఎవరికి కావాలి తెలుగు సాహితీ ఔన్నత్యాన్ని గురించి! ఈనాడు నాటి నాటికి తెలుగు పాఠకులు తగ్గిపోతున్నారు.

అయినా కొవ్వలి ఏ ప్రభుత్వము గుర్తింపులు ఇవ్వనక్కర్లేదు. ఆయన ప్రజా కవి! ఏ ప్రభుత్వపు ఆదరణా లేకుండా – ఎవరి ప్రోత్సాహం లేకుండా – ONE MAN లాగా – ఆయన సమాజంలో ఆనాడు ఉన్న కల్మషాన్నంతా కడిగి వేశారు. ప్రజలు ఆదరించారు. ఆనాడు కొన్న లక్షల మంది పాఠకులు ఆయన పుస్తకాలు చదివారు. ఆయన నవల అని ఎంతో ఆసక్తిగా చదివారు! 1930 నుండి 1970 వరకు కొవ్వలి పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగిపోయింది! ఏ ప్రభుత్వమూ ప్రోత్సహించలేదు, పాఠ్యాంశాలలో పెట్టలేదు. అయినా కొవ్వలి పుస్తకాలకున్న ఆదరణ – ముఖ్యంగా స్త్రీ పాఠకుల నుంచి వచ్చిన స్పందన మరే రచయితకు రాలేదేమో! రచయిత సమాజ శ్రేయస్సు కోసమూ – ప్రచురణకర్త వ్యాపార దృక్పథంతోనూ తమ ప్రవృత్తిని కొనసాగిస్తారు. పుస్తకాలు అమ్ముడు పోక పోతే, ప్రచురణకర్తలు వెయ్యి పుస్తకాలు ప్రచురించేవారా! నష్టాలలో వ్యాపారాలు చేసేవారా! ఆయన జనకవి అంటానికి ఇంతకన్నా ఏ నిదర్శనం కావాలి! ఇంకా ఎటువంటి గుర్తింపు కావాలి! ఈనాటికి ఇటీవల 10 సంవత్సరాల నుండి దాదాపు 100 పుస్తకాలు వివిధ ప్రచురణకర్తలు ప్రచురించారు. మళ్లీ కొవ్వలి అభిమానుల గుండెల్లో గూడుకట్టుకున్నాడు.

ఇహపోతే ఉచితంగా వచ్చినా, చేవగా వచ్చినా దానికి ప్రజలు గుర్తింపునివ్వరు. ఉదాహరణకి ఒకే వస్తువు 10 రూపాయలకి చవకైన ప్యాకేజింగ్‌తో ఇస్తే దాన్ని చులకన భావంతో చూస్తారు. కానీ అదే వస్తువుని ఖరీదైన ప్యాకేజింగ్‌లో పెట్టి 50 రూపాయలకు అమ్మితే ప్రజలు అదేదో మంచి క్వాలిటీ వస్తువు అని భ్రమ పడి అదే కొంటారు. లోపల వస్తువు ఒకటైనా 10 రూపాయల వస్తువుని గుర్తించరు.

అదే విధంగా క్వాలిటీ పుస్తకాలు మంచి మంచి సందేశాలతో అతి తక్కువ ధరని 60-70 పేజీలుగా ప్రచురిస్తే, అది సాహితీవేత్తల కంటికి ఆనలేదు. రామాయణ మహాకావ్య సారాంశాన్ని 5వ తరగతిలో సంక్షిప్తంగానూ చెప్తారు. అదే రామాయణ మహా సందేశాన్ని M.A లోనూ M.Phil లో కూడా పరిశోధనా వస్తువుగా ఎన్నుకుంటారు. వస్తువు ఒకటే వివరణ కొన్నిట్లో విస్తారంగా ఉంటుంది. కొన్నిట్లో సంక్షిప్తంగా ఉంటుంది! Always small is beautiful అన్న చందాన ఆయన రచనలు సాగించారు. ఒకే కథా వస్తువుని 500 పేజీల గ్రంథంగానూ రాయవచ్చు, 60 పేజీల పుస్తకం గానూ రాయవచ్చు. కొవ్వలి సామాన్య ప్రజానాడిని తెలుసుకున్న కవి. అందుకు అనుగుణంగానే రచనలు రాశారు.

రచయిత్రి: ప్రపంచ భాషా రచయితలలోనే వెయ్యిన్నొక్క నవలలు రాసిన ‘తెలుగు’ రచయిత మీ నాన్నగారు. ఆయన గురించి అప్పుడూ ఇప్పుడూ ఉపేక్ష వహించిన పరిస్థితి కి కారణాలు ఏమిటి? (కొవ్వలి నాగేశ్వరరావు గారి స్పందన తరువాయి భాగంలో..)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here