[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]
శ్రీ కొవ్వలి నాగేశ్వరరావు గారితో ముఖాముఖి:
రచయిత్రి: శ్రీమతి మాలతీ చందూర్ వంటి రచయిత్రులు అత్యంత అభిమానంతో మెచ్చుకున్నారంటే కొవ్వలి నవలల ప్రత్యేకత ఏమిటి?
కొ.నా.: మాలతీ చందూర్ గారు ఒక్కరేమిటి? అంతఃపురాలలోనూ, ఆ మూల సౌధాల లోనూ, తెలుగు గాలి సోకినంతమేరా కొవ్వలి ప్రభంజనం వెల్లివిరిసిందానాడు. ఆమె కూడా ప్రత్యేకించి ఒక రచయిత్రి, విమర్శకురాలు, కొవ్వలి రచనలను తన చిన్ననాడే చదివి స్ఫూర్తి పొందిన రచయిత్రి. కొవ్వలి వారి కథావస్తువు, భావ స్పష్టీకరణ, కథను ఆద్యంతమూ నడిపిన తీరు, ఆధునిక సమాజంలో పురుషాధిక్యత తోసిరాజని, స్త్రీని కొవ్వలి తన నవలలో చిత్రీకరించిన తీరు ఆమెను ముగ్థురాలిని చేశాయి. ఒక సభలో ఆమె అన్నమాట – “చిన్నతనంలో ఏలూరులో ఆయన నవలలు చదివి నేను చాలా నేర్చుకున్నాను. గోరు వెచ్చటి నీళ్లతో స్నానం చేసినంత హాయిగా కొవ్వలి నవలలు మనకు ఆనందాన్ని ఇస్తాయి”.
అంతేకాకుండా కొవ్వలి తన ప్రతి నవలలోనూ తను చెప్పదలుచుకున్న సందేశాన్ని సూటిగా, స్పష్టంగా నాలుగు వాక్యాలతో ముందుగా ఉపోద్ఘాతంగా చెప్పి, సమాజానికి చురకలు అంటించేవారు. అందుకే స్త్రీ పాఠకులు కొవ్వలి నవలలను అభిమానించేవారు.
రచయిత్రి: సినీ చిత్ర పరిశ్రమలో కొవ్వలి గారి నవల అంటే విపరీతమైన ఆకర్షణ ఉందట! ఆ వివరాలు చెప్పండి.
కొ.నా.: దాదాపు 1930 నుండి 1950 వరకు కొవ్వలి గారు, స్త్రీ అభ్యుదయ రచయితగా, విప్లవాత్మక సందేశాలతో, పురాతన ఛాంసాలను కాలరాసి, భాషలోనూ భావంలోనూ తన ప్రత్యేకతను చాటి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ గాలి సినీ ప్రపంచాన్ని కూడా తాకింది. మొదటగా కన్నాంబ గారు కొవ్వలి గారి రచనలను చదివి ఆకర్షితురాలై, తాను తీయబోయే మొదటి చిత్రానికి కొవ్వలి గారి చేతే కథ రాయించాలని స్థిరచిత్తంతో, ఏలూరులో ఉన్న కొవ్వలి వారి వద్దకు తన మనుషులను పంపారు. మొదట్లో కొవ్వలి వారు విముఖత చూపినా, కన్నాంబ గారి విడువని పట్టు మూలాన తల ఒగ్గారు. మద్రాసు వచ్చిన తర్వాత వారికి అక్కడ సర్వ సదుపాయాలు కల్పించి, తన మొదటి చిత్రానికి కథ మాటలు రాయాలని కోరారామె. రాజరాజేశ్వరి ఫిలిమ్స్ పైన ‘తల్లి ప్రేమ’ చిత్రం కొవ్వలి కలం ద్వారా వెలువడింది. తన బిడ్డ కోసం తల్లి ఎంత త్యాగానికైనా, తుదకు తన ప్రాణాన్ని కూడా తృణప్రాయంగా ఎంచి తానే బలి అవుతుందనే ఇతివృత్తాన్ని ఆ చిత్రం ద్వారా కొవ్వలి తెలియజెప్పారు. తరువాత కొవ్వలి తను వ్రాసిన ‘మెత్తని దొంగ’ నవల ఆధారంగా ఆనాటి ప్రఖ్యాత నిర్మాత డి.ఎల్ నారాయణ గారు ‘శాంతి’ అనే చిత్రాన్ని నిర్మించారు. తరువాత విక్రమ్ ప్రొడక్షన్స్ బి.ఎస్. రంగా గారు కొవ్వలి కదా మాటలతో ‘మా గోపి’ చిత్రాన్ని నిర్మించారు. ‘రామాంజనేయ యుద్ధం’ (అమర్నాథ్, శ్రీరంజని) కూడా కొవ్వలి గారి రచనే. ఆ తర్వాత ఇదే కథావస్తువుగా గబ్బిట వెంకటరావు గారు కొవ్వలి వారి పంథాని అనుసరిస్తూ, దాదాపుగా ఏ మార్పు లేకుండా రచన చేశారు. అందులో ఎన్టీఆర్ గారు శ్రీరాముడిగా అద్భుతంగా నటించారు. తర్వాత కొవ్వలి గారి రచన ‘సిపాయి కూతురు’ సూపర్ హిట్ చిత్రం వచ్చింది. దానిలో కథానాయకుడిగా నటించిన కైకాల సత్యనారాయణ గారిని చాలా రోజులు ‘సిపాయి కూతురు సత్యనారాయణ’గా పిలిచేవారు. హెచ్ ఎన్ రెడ్డి గారు కొవ్వలి చే కథ రాయించిన ‘బీదల ఆస్తి’ చిత్రం కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.
సాధారణంగా ఎవరికైనా ఒక కథా వస్తువు నచ్చితే దాని ఆధారంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి తమ బాణీలో రాసుకుంటారు, చిత్రాలను తీస్తారు. అదే కొవ్వలి వారి నవలలకూ జరిగింది. ఉదాహరణకు విఠలాచార్య గారి ‘గురువును మించిన శిష్యుడు’ చిత్రంలో ‘విషకన్య’ నవలలోని కొంత భాగాన్ని తీసుకుని పొందుపరిచారు. ఇలా మరి కొన్ని జానపద చిత్రాలు వచ్చాయి. కొవ్వలి నవలలోని కథావస్తువు చాలామంది నిర్మాతలకు, దర్శకులకు పరోక్షంగా ఉపయోగపడింది అంటే అది చాలా సంతోషించదగ్గ విషయం గర్వించదగ్గ విషయం.
దక్షయజ్ఞం ఒక పౌరాణిక సంఘటన. దానిని ఒక నవలగా మలిచి కొవ్వలి ‘దాక్షాయిని’ రూపొందించారు. ఆ నవల ఆధారంగా కన్నాంబ, కడారు నాగభూషణం గార్లు , చిత్రానుకరణ చేయించి, దక్షయజ్ఞం చిత్రాన్ని రూపొందిస్తున్న తరుణంలో కొవ్వలికీ దర్శకనిర్మాతలకు మాట పట్టింపు పెరిగి, ఆత్మాభిమానానికి మారుపేరైన కొవ్వలి ఆ చిత్రం నుంచి విరమించుకున్నారు. అదే స్క్రీన్ ప్లే తో వేరొకరితో దక్షయజ్ఞం చిత్రం పూర్తయింది. ఆనాటి ప్రముఖ నటి మీనా కుమారి, కొవ్వలి వ్రాసిన ‘చదువుకున్న భార్య’ నవలను మెచ్చి, ‘మరపురాని కథ’ పేరుతో చిత్రాన్ని ప్రారంభించారు. ఆర్థిక కారణాల వల్ల, ఆ చిత్రం వెలుగు చూడలేకపోయింది.
శ్రీమతి సూర్యకాంతం గారు కొవ్వలి గారికి వీరాభిమాని. ఆమె గ్రంధాలయంలో కొవ్వలి పుస్తకాలు చాలా ఉండేవి. ఆమె మనిషిని మా ఇంటికి పంపించి నాన్నగారు రాసిన సరికొత్త నవలను తెప్పించుకునేవారు. నాన్నగారు తన వెయ్యవ రచనను శ్రీమతి సూర్యకాంతం గారికి అంకితం ఇచ్చారు. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారు సాహిత్య పిపాసి. కొవ్వలి నవలలను ఆమె అనేకం చదివి ఆనందించేవారు. కొవ్వలి వారి షష్టిపూర్తి సంచికకు గాను ఆమె కొవ్వలి గురించి తన సందేశాన్ని పంపించారు. జమున గారు ,కొవ్వలి వారి ‘మా గోపి’, ‘సిపాయి కూతురు’ చిత్రాలలో నటించారు. అనేక సభలలో కొవ్వలి తన అభిమాన రచయిత అని ప్రశంసించారు.
రచయిత్రి: సమకాలీన రచయితలు మీ ఇంటికి రావటం కానీ, మీ నాన్నగారితో స్నేహ బంధాలు జరిపినట్టు గాని మీకు ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా?
కొ.నా.: నేను మీతో లోగడ మనవి చేసినట్లుగా, ఆయన ఎవ్వరితోనూ ఎక్కువ స్నేహబంధాలు పెట్టుకోలేదు. తన పనేదో తాను ఏకాంతంగా రాసుకొనేవారు. ప్రచురణకర్తలు మాత్రం మా ఇంటికి తరచూ వస్తుండేవారు. వారికి కావలసిన రీతిలో వ్రాయించుకొనే వారు. ఆయన వ్రాసిన వ్రాత ప్రతులను తీసుకొని వెళ్ళేవారు.
ఆధునికయుగంలో గురజాడ, గిడుగు వంటి వ్యావహారిక భాషా రచయితల తర్వాత 1930 నుండి 1975 వరకు శ్రీ కొవ్వలి వారే ప్రథమంగా నిలిచారని చెప్పవచ్చు. అది కొవ్వలి యుగం. ఆ కాలంలో చాలమంది రచయితలు వారి బాటలో నడిచిన అజ్ఞాత శిష్యులున్నారు. చాలామందికి కొవ్వలి నవలలు మేటి ప్రేరణ కలిగించాయి. మాలతీ చందూర్ గారు, గొల్లపూడి మారుతీరావు గారు చాల సందర్భాలలో చెప్పుకొన్నారు కొవ్వలి నవలలు చదివి స్ఫూర్తి పొందినట్లు. తర్వాత వారైన కొమ్మూరి సాంబశివరావు, టెంపోరావు, విశ్వప్రసాద్, కృష్ణమోహన్ అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి, మా నాన్నగారి సలహాలు, సూచనలు తీసుకునేవారు.
రచయిత్రి: ఆయనను వరించిన సన్మానాలు, బిరుదులు..!
కొ.నా.: కొవ్వలి గారు ఎప్పుడూ ప్రచారాలను ఇష్టపడేవారు కాదు. ఆడంబరాలకు, ఆర్భాటాలకు ఆయన చాలా దూరం. ఆయన ఒక విచిత్రమైన మహనీయుడు. ఆయన ధ్యేయం ఒక్కటే – ప్రజలలో ముఖ్యంగా స్త్రీలలో ఒక చైతన్యం తీసుకురావాలి. ఆనాటి సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను, ఇతివృత్తంగా తీసుకొని నిర్భయంగా రచనలు చేసేవారు. సామాన్య స్త్రీ పాఠకులకు అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసి ఒక ఉద్యమాన్ని తీసుకువచ్చారు. ఆయన చాలా మితభాషి. తన గురించి ప్రచారం చేసుకోవడం, తనకంటూ ఒక వర్గాన్ని కానీ, ఒక శిష్య బృందాన్ని ఏర్పాటు చేసుకోవడం కానీ ఆయన ఇష్టపడేవారు కాదు. ఆ రోజుల్లో ఏలూరు లోనూ, మద్రాసులోనూ చాలామంది ప్రచురణకర్తలు, అభిమానులు సన్మానాలను ఏర్పాటు చేస్తామంటే సున్నితంగా తిరస్కరించేవారు. చాలా తక్కువ సభలో మాత్రం ఆయన అంగీకరించారు. ఒక సభలో ఆయన అన్న మాటలు…….
“నేను చేసిన పనిని మరెవరూ చేయలేరని నా గట్టి నమ్మకం. రాక్షసులైనా చేయాలి, దేవతలైన చేయాలి. కానీ మానవ మాత్రులకు సాధ్యంకాని పనిని నేను చేశాను.”
నిజమే! ఒక్క చేతితో వెయ్యి నవలలు పైగా రాసి అన్ని ముద్రించబడి బహుళ జనాదరణ పొందాయి అంటే నమ్మదగిన విషయం కాదు, ఒక బృహత్కార్యం. తాను నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి, ఆర్థిక దాహానికి లోను కాక, ఆడంబరాలకు దూరంగా ఉంటూ జీవితాన్ని గడిపిన మహనీయుడు ఆయన. ఎక్కువ మంది స్నేహితులు లేరు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ దూషణ భూషణాలు రెండు ఉంటాయి. పొగడ్తలకు మురిసిపోకా, విమర్శలకు కృంగి పోకా, అన్నిటినీ సమదృష్టితో చూసిన కర్మయోగి కొవ్వలి. దేనిపైనా ఆసక్తి చూపకపోవటం, ఆ పనిని నిరంతరాయంగా, ఏకోన్ముఖుడై చేస్తూ ప్రజలలో కొవ్వలి తన ఉనికిని చాటుకున్నారు. కొన్ని లక్షల మంది పాఠకుల హృదయాలలో నిలిచాడు. ఈనాటికీ కొవ్వలిని గుర్తు పెట్టుకున్న ఆనాటి తరంవారు ఉన్నారు. 1971-72 లలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయం కొవ్వలి వారి సాహిత్య సేవను గుర్తించి సన్మాన పత్రాలు ఇచ్చి సత్కరించాయి. మరి ఇప్పుడు సుశీలమ్మ గారు ఎంతో ఆవేదనతో అంటున్న “కొవ్వలిని ఎందుకు ఉదాసీనతతో ఈనాటి వారు చూస్తున్నారనే” ప్రశ్నకు – ఈనాటి తరపు సాహిత్యవాదులు కానీ, విమర్శకులు కానీ తమని తాము ప్రశ్నించుకుని, తమ విద్యుక్త ధర్మాన్ని పాటించి, కొవ్వలి గురించి ఈనాటి వారికి, రాబోయే తరం వారికి చెప్పవలసిన బాధ్యత ఉంది. ఆయన పని ఆయన చేశారు. తరువాత పని పాఠకుల బాధ్యత కదా!
రచయిత్రి: కొవ్వలి గారికి మీరెంతమంది సంతానం? మీ కుటుంబ విశేషాలు వివరించండి.
(కొవ్వలి వారి కుటుంబ వివరాలు తర్వాత భాగంలో…..)