మరోసారి ‘జగజ్జాణ’ – సరళంగా, సంక్షిప్తంగా!!-35

0
6

[box type=’note’ fontsize=’16’] కొవ్వలి, భయంకర్ పేరుతో రచించిన జగజ్జాణ ఆ కాలం పాఠకులను సమ్మోహితులను చేసింది. ఆనాటి జగజ్జాణను ఈనాటి పాఠకుల కోసం సరళంగా, సంక్షిప్తంగా అందిస్తున్నారు డా. సి.హెచ్. సుశీల. [/box]

శ్రీ కొవ్వలి లక్ష్మీ నారాయణ గారితో ముఖాముఖి:

[dropcap]ర[/dropcap]చయిత్రి: సంచిక మ్యాగజైన్‌లో నేను రాస్తున్న ‘జగజ్జాణ సరళంగా సంక్షిప్తంగా’ – పై మీ అభిప్రాయం తెలుపండి.

కొ.ల.నా.: నాన్నగారు రచించిన బృహత్తర నవల జగజ్జాణని ఇన్ని వారాలపాటు ధారావాహికంగా, సంక్షిప్త రూపంలో పాత్ర ఔచిత్యానికి, కథాగమనానికి ఏ మాత్రం భంగం కలిగించకుండా మీరు అచంచలమైన పట్టుదలతో, అకుంఠిత దీక్షతో (అప్పుడప్పుడు మీ ఆరోగ్యం సహకరించకపోయినా) విజయవంతంగా పూర్తి చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. జగజ్జాణ అనే కొండను సంచిక డాట్ కామ్ అనే అద్దంలో పాఠకులకు అందించారు. రక్తి కట్టించారు. మహానుభావుడు కొవ్వలి గారి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.

బంగారు పీటకైనా గోడ చేర్పు కావాలి – అంటారు. పాత కాలంలో సాహిత్య పోషకులు ఉండేవారు కాబట్టి మనకి కవులు పండితులు కావ్యాల్ని, ప్రబంధాల్ని అందించగలిగారు. అదే విధంగా జగజ్జాణ అనే నవలారాజాన్ని పాఠకులందరికీ అందించాలన్న మీ సత్సంకల్పానికి బాసటగా నిలిచి, యిన్ని వారాలు తమ విశాల హృదయంతో మీకు, మాకు మనస్ఫూర్తిగా సహకరించిన సంచిక డాట్ కామ్ సంపాదకులు శ్రీ మురళీకృష్ణ గారికి, వారి సిబ్బందికి వందన సహస్రి. అభినందన శతాలు.

రచయిత్రి: ధన్యవాదాలండీ. నమస్కారం.

నేనెందుకిది రాసాను!

చిన్నప్పుడు – రాజుల కథలు, జానపద చిత్రాలు, కత్తియుద్ధాలు, మాయలు మంత్రాలు, పరకాయప్రవేశం చదువుతూ అబ్బురపడే రోజులవి. 1965లలో మా అమ్మగారు ఎమెస్కోఇంటింటి గ్రంథాలయం (ఎమెస్కో హోమ్ లైబ్రరీ) మెంబర్‌గా ప్రతినెల 5 రూ. చందా కడుతూండటంతో చాలా మంచి పుస్తకాలు ఇంటికి వచ్చేవి. ఆసక్తితో అమ్మ మరికొన్ని పుస్తకాలు కొనేవారు. అందువల్ల పుస్తకాలు చదివే అవకాశం, అదృష్టం చిన్ననాటే నాకు కలిగింది. అందులో ‘భయంకర్’ రాసిన ‘జగజ్జాణ’ 25 పాకెట్ సైజు పుస్తకాలు ఎన్నో సార్లు చదివాం నేను, నా స్నేహితురాళ్ళం.

భువన చంద్ర గారి ‘మూడోసీత’ నవల మీద నేను సమీక్ష రాసిన తర్వాత మాటల మధ్య ‘భయంకర్’ పేరుతో రాసింది కొవ్వలి లక్ష్మీ నరసింహారావు గారు అనీ, ఒక తరం వారిని కొవ్వలి నవలలు ఉర్రూతలూగించాయని వారు చెప్పారు.

వెయ్యిన్నొక్క నవలలు రాసిన రచయితని తెలుగువారు మర్చిపోవడమా! అని ఆయన గురించిన వివరాల కోసం అన్వేషణ ప్రారంభించాను. సీనియర్ జర్నలిస్టు దుగ్గరాజు శ్రీనివాసరావు గారిని సంప్రదించాను. ఆయన కొవ్వలి గారి రచనలకు అభిమాని మాత్రమే కాక, వారి కుమారులతో కూడా పరిచయం ఉండటంతో, వారి ద్వారా నా పరిశోధన విషయం తెలిసి కొవ్వలి వారి కుమారులు నాగేశ్వరరావు గారు, లక్ష్మీనారాయణ గారు నాకు ఫోన్ చేసి తండ్రి గారి గురించి అనేక విషయాలు చెప్పారు. కొన్ని పుస్తకాలు పంపించారు.

కొవ్వలి గారి గురించి రాస్తానని చెప్పగానే ‘సంచిక’ వెబ్ మ్యాగజైన్ కస్తూరి మురళీకృష్ణ అంగీకరించి, ప్రతివారం ప్రచురిస్తూ, పూర్తి సహకారం అందించారు. సోదర తుల్యుడు మురళీకృష్ణకి, ఎక్కడా దొరకని ‘కేతా’ గారి (మద్రాస్) 25 జగజ్జాణ ముఖచిత్రాలు మెచ్చుకొంటూ, ప్రచురణకు సహకరించిన కొల్లూరి సోమశంకర్‌కి, మొత్తం ఎడిటోరియల్ టీంకి కృతజ్ఞతలు.

ఆ తరాన్ని ఉర్రూతలూగించిన జగజ్జాణ ఇప్పటి తరానికి నచ్చుతుందా!

ఆంగ్లంలో హారీపోటర్ నవలలు, సినిమాలు ఎంత సంచలనాన్ని సృష్టించాయో, తెలుగులో బాహుబలి సినిమా అన్ని వయసుల వారినీ ఎంత ఆకట్టుకుందో చూసాం. గొప్ప కథ, కథనం, శిల్పం, సస్పెన్స్, ఊహించని సన్నివేశాలతో నిండిన ‘జగజ్జాణ’ నవలని – ఈ తరం యువతకు అందించాలనుకొన్నాను. కథా గమనానికి ఆటంకం రాకుండా సంక్షిప్తంగా, కొంత సరళమైన భాషలో (దాదాపు 9 నెలలు) ప్రతివారం సీరియల్‌గా, సస్పెన్స్‌తో, చివర ప్రశ్నలతో, కొవ్వలి వారి శైలినే, style నే అనుకరిస్తూ రాసాను. 1265 పేజీల నవలని 125 పేజీలలో సంక్షిప్తీకరించడం కొంచెం కష్టమనిపించినా మంచి పని చేసానన్న తృప్తి కలిగింది.

‘సంచిక’కు ధన్యవాదాలతో… మళ్లీ కలుద్దాం.

ప్రస్తుతానికి సెలవ్.

సుశీల

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here