మార్పు మన(సు)తోనే మొదలు-11

0
11

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఒక సూసైడ్ ఫెయిల్యూర్ కేస్ ఉంది, మీ సహాయం కావాలంటూ గగన్‍ని పిలుస్తాడు జాయ్. ప్రభాత్‍ని తీసుకుని అక్కడికి వెళ్తాడు గగన్. ఓ రైతు ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. కష్టాలు భరించలేక అతని భార్య కామాక్షి పిల్లలని చంపి తానూ చనిపోవాలనుకుంటుంది. అన్నంలో ఎండ్రిన్ కలుపుతుంది. అంతలో అనుకోకుండా ఆమె అన్న వాళ్ళింటికి రావడంతో, వాళ్ళని ఆసుపత్రిలో చేరుస్తాడు. పిల్లలు చనిపోతారు. తల్లి బతుకుతుంది. తన పిల్లల్ని తానే చంపేసాను అని బాధ పడుతూంటుంది. ఆమెను చూసిన ప్రభాత్ కూడా బాధపడతాడు. అతడి స్పందన చూసిన గగన్, ప్రభాత్ తన జబ్బు నుంచి బాగా కోలుకున్నట్టే అని గ్రహిస్తాడు. పిల్లల్ని చంపినందుకు ఆమెపై కేసు ఉందని జాయ్ చెప్తాడు. ఆనంద్ విరగ్గొట్టి, అందంగా తయారు చేసిన వస్తువులతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేయిస్తాడు గగన్. మానసిక వైకల్యం ఉన్నవారికి అభయమిచ్చే ఓ స్వచ్ఛంద సంస్థ వారు ఆనంద్‌ని, అతని తల్లిదండ్రుల్నీ జీవితాంతం చూసుకునేందుకు ముందుకు రావడంతో వాళ్ళకి అప్పగిస్తాడు గగన్. ఇదంతా జరుగుతూండగా నిరూప్ కనిపించకుండా పోతాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. వారం తరువాత నిరూప్ వచ్చి జరిగినదంతా వివరిస్తాడు. అతడిని క్షమించి, అతనికి మరో అవకాశం ఇస్తాడు గగన్. త్రయంబకేశ్వర్ అనే ఆయన బై-పోలార్ డిజార్డర్ గురించి తన అనుభవాలు వివరించే కార్యక్రమం ఉందని తెలుస్తుంది, దానికి ప్రభాత్‍ని, నిరూప్‍ని కూడా తీసుకువెళ్తానంటాడు గగన్. మ్యాన్‌హట్టన్‌లో ఉద్యోగం దొరకడమంటే గొప్ప అదృష్టంగా భావించిన దివిజ్ తనకెదురైన ఇబ్బందులను, సమస్యలను గగన్‍తో చెబుతూ ఉంటాడు. – ఇక చదవండి.]

[dropcap]ఫో[/dropcap]న్ మోగుతూ, ‘జాయ్’ అనే పేరుని సూచిస్తోంది. గగన్ అందుకున్న వెంటనే, “డాక్టర్ గారూ, మీకు ఆ ఇల్లాలు గుర్తుందా? కామాక్షి- ఆదివారం- ఆత్మహత్యా యత్నం?” అంటూ గుర్తు చేయబోయాడు జాయ్. “ఆఁ, గుర్తుంది. ఆవిడ కేసు ఏమయ్యింది?” అడిగాడు గగన్.

“మతి భ్రమించిన కారణం చేత పిల్లల హత్యా నేరం కొట్టివేయబడింది. ఆవిడ ఉండే ఊరు మీ ఔట్‌రీచ్‌లో ఉంది. ఈ మాటు మీరు వెళ్ళినప్పుడు కలవమని చెప్తాను”, అన్నాడు జాయ్. సరేనని ఫోన్ పెట్టి, త్రయంబకేశ్వర్ ఉపన్యాసం వినడానికి నిరూప్, ప్రభాత్‌లతో సహా బయలుదేరాడు గగన్.

దారిలో, ప్రభాత్, “డాక్టర్, అంత పెద్ద గణిత శాస్త్రజ్ఞుడైన నాష్‌కి నిజంగానే మానసిక రోగం ఉండేదా? లేక డ్రమటిక్ ఎఫెక్ట్ కోసం రచయిత్రి కల్పించిందా?” అని అడిగాడు. “ఎంత నాన్-ఫిక్షన్ అయినా కల్పనలుంటాయి. నిజాల కోసం వికిపీడియా పేజీ చూడండి”, అన్నాడు గగన్ డ్రైవ్ చేస్తూ. “అది కాదండీ, అలా అయితే ఆయన విడాకులు తీసుకున్న భార్య దగ్గరే బోర్డర్‌గా, ఉంటేను, సినిమాటిక్‌గా అనిపించింది లెండి.. ఆవిడకి దగ్గరవడానికి అదో వ్యూహమేమోనని”, అన్నాడు ప్రభాత్.

“ఒక్క విషయం- స్కిజోఫ్రెనియా మహామహులని పీడించే మహమ్మారి. జాన్ నాష్ ఈ రోగంతో చాలా ఏళ్ళు బాధపడ్డ మాట నిజం. ఆయన తన భార్యతో విడాకులు తీసుకున్న మాట నిజం. ఆవిడ దగ్గరే బోర్డర్‌గా ఉండడం కూడా నిజమే! ఆవిడకి జబ్బు మీద అవగాహన ఉంది కనుక గుణం కనబడుతుందని అందరూ ఆశ పడ్డారేమో!”

“కొన్నేళ్ళకి జబ్బు దానంతట అదే నయమయింది. విడాకులు తీసుకున్న భార్యతో పునర్వివాహం చేసుకోవడం కూడా ఒక నిజం. ఆ తరువాత ఆ జబ్బు లక్షణాలు తెలుసుకుని, దానిపై ప్రజలలో అవగాహన పెంపొందించడానికి పాటుబడుతూ శేష జీవితం గడిపిన మాట కూడా నిజమే!” అని తనకి తెలిసిన నిజాలు చెప్పాడు గగన్.

“మరి ప్రపంచ నేతలకి ఉత్తరాలు వ్రాయడం, ఇవన్నీ?” అడిగాడు ప్రభాత్. “ప్రభుత్వాలకి ఎసరు ఎవరో పెడుతున్నట్టు ఆయనకి అనిపించేదట. కనబడనివి చూడడం, వినబడనివి వినడం, ఈ వ్యాధి లక్షణాలు, ఏం చేస్తాం?” అన్నాడు గగన్. నిరూప్ అక్కడ ఉండగానే ప్రభాత్ ఇలా మాట్లాడడం గగన్‌కి ఆనందాన్నిచ్చింది. కానీ, ఈ సంభాషణ కొనసాగే లోగా మీటింగ్ హాల్‌కి చేరుకున్నారు మిత్రులు ముగ్గురూ!

***

పరిచయాలూ వగైరా అయిన తరువాత త్రయంబకేశ్వర్ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. “చాలా మంది ఆశ పడే చిన్నతనం నాది. చదువులో ఫస్టు, ఆటపాటల్లో కూడా ఫస్టు. వినయ విధేయతలలో కూడా నేనే ఫస్టు. మా కాలనీలో తల్లిదండ్రులకి నేనొక ఆదర్శపు బిడ్డ. ప్రతీ విషయంలోనూ వాళ్ళ తల్లిదండ్రులు నాతో పోలిక చేసి చూస్తారు గనుక నా వయసు పిల్లలకి నేను కంట్లో నలుసు వంటి వాడిని.”

“చిన్న వయసులోనే ఇంతటి మెచ్చుకోలు వచ్చేసరికి విమర్శలు పట్టించుకోవడం మానేసి, ఇంకా ఎత్తుకి వెళ్ళి, మరెన్నో శిఖరాలని అధిష్ఠించాలని ఆశ పడేవాణ్ణి. నిద్ర మానుకుని, ఏవేవో ఆబ్స్‌ట్రాక్ట్ విషయాలు చదవడం మొదలు పెట్టాను. ఏదో ఒక రోజున నోబెల్ పురస్కారం నాకు దక్కుతుందని కలలు గనే వాణ్ణి.

“యుక్త వయసు వెళ్ళే వరకూ అన్నీ బాగానే జరిగాయి. నాకు యంగ్ సైంటిస్టు పురస్కారం దక్కింది. నా పథంలో ముందుకు సాగితే చాలు, నోబెల్ ప్రైజ్ పొందడమొక్కటే తరువాయి, అనుకునేవాణ్ణి. అంతా బాగానే గడుస్తే ఇవ్వాళ ఈ విషయం మీద ప్రసంగించను కదా!”

“సడన్‌గా నాలో నిస్సత్తువ. నన్ను పూర్తిగా కబళించేసింది. ఏ పనీ చేయాలని ఉండేది కాదు. ఏ పనీ, అంటే, మంచం మీద నుంచి లేచి, పళ్ళు తోముకోవడానికి కూడా. కుంభకర్ణుడిలా నిద్ర పోవాలనుండేది, అదేపనిగా! ప్రయోగాలు చేయాలని ఉండేది కాదు. నా పరిశోధనని నట్టేట ముంచి, నిద్రలో మునిగి తేలాను. అదృష్టవశాత్తు ఈ గోల ఎక్కువ కాలం నన్ను పట్టి పీడించలేదు.”

“మళ్ళీ యథాప్రకారం నా ప్రాజెక్టులు మొదలుపెట్టాను. బోలెడంత శక్తి ధారపోసి కొత్త విషయాలు కనిపెట్టే పనిలో పడ్డాను. నా తెలివి తేటలు చూసో, లేక నా ఉద్యోగాన్ని చూసో, ఒక తెలివైన అమ్మాయి నాకు భార్యగా వచ్చింది. ఓ ఏడాదికి నన్ను తండ్రిని చేసింది.”

“నేను ఇన్ని బాధ్యతలు వహించడం నా మీద ఒత్తిడి పెంచింది. ఈ మాటు నా ప్రయోగాలు దెబ్బ తిన్నాయి. నా మీద ఏం ఆవహించిందో ఏమో, ప్రయోగపు ప్రోటోకాల్స్‌ని ఉల్లంఘించి ఏమౌతుందో ఎదురుచూశాను. బుర్ర పనిచేసే వాడెవడూ ఆ పని చేయడు. ఎందుకంటే, అందులో రిస్క్ ఉంది – నియమాల ఉల్లంఘనకి సంబంధించినది. నేను చేసిన పనికి ప్రాజెక్టు రద్దవడమే కాకుండా, మా విశ్వవిద్యాలయం పరువు తీసినందుకు, ప్రాజెక్టు ఇచ్చిన సంస్థకి నన్ను నష్ట పరిహారం కట్టమన్నారు మా వాళ్ళు. అది కాకుండా, నాపై క్రమశిక్షణా చర్యలు చేపట్టారు.”

“డబ్బులు కట్టి, క్షమాపణలు చెప్పుకుని ఆ సారికి ఎలాగో బయటపడ్డాను. బుద్ధిగా పరిశోధనలు మొదలుపెట్టాను. మా పాపాయికి బాలారిష్టాలు ఎక్కువగా వచ్చేవి. ఆ ఒత్తిళ్ళ ప్రభావం మళ్ళీ నా పరిశోధనలపై పడింది. మళ్ళీ, నిద్రపోవాలని ఉండడం, పనికి నాగా కట్టడం, విసుగు, నిస్పృహ- షరా మామూలైపోయాయి. భార్యని, పాపని కొట్టి నాకు తెలియని, అర్థం కాని బాధని అధిగమించాలని అనుకున్నాను. ఆమె పాపతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది.

“విషయం అక్కడితో ఆగదు కదా! మా అత్తమామలు నా మీద అమ్మానాన్నలకి ఫిర్యాదు చేశారు. వాళ్ళు నన్ను కసిరి, భార్యాబిడ్డల్ని మా ఇంటికి చేర్చారు. నాలో చెప్పుకోలేని బాధ ఉందని, దానివల్లే అలా ప్రవర్తిస్తున్నానని ఎవరితో చెప్పుకోను? ఆ విషయం ముందు నాకు అర్థమైతే కదా!”

“కొన్నాళ్ళు ఎలాగో మంచిగా ఉండగలిగాను. కొన్నాళ్ళు ఈ పరిసరాలకి దూరంగా ఉంటే బాగుంటుందేమో అని మా ఆవిడ అంటే, ఒక ఫ్యామిలీ హాలిడే ప్లాన్ చేశాను. ట్రిప్‌కి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేస్తుంటే మళ్ళీ నా మీద వత్తిడి పెరిగింది.”

“ఎలాగో నిలదొక్కుకుని థాయ్‌ల్యాండ్ ట్రిప్‌కి వెళ్ళాం. అందరూ పట్టాయా బీచ్‌లో కేరింతలు కొడుతూ ఉంటే నాలో ఏదో బాధ, మథనం.. నేనే కదా ఈ కష్టాలన్నిటికీ కారణం, అనే విషయం జ్ఞానోదయమయ్యింది. ఆలోచన వచ్చిందే తడవుగా ముందుకి సాగిపోయాను, సముద్ర గర్భంలో కలసిపోవడానికి. మా ఆవిడ పెట్టిన పొలికేకకి ఎలర్ట్ అయిన లైఫ్ గార్డ్ ఈదుకుంటూ వచ్చి నన్ను కాపాడాడు.”

“చదువుకున్న వాణ్ణి గనుక ఆత్మహత్య చేసుకుందామనుకునే ఆలోచన ఎందుకు వచ్చిందా అని ఆత్మావలోకనం చేసుకున్నాను. సైకియాట్రిస్ట్‌ని కలిసి, ఇది బై-పోలార్ జబ్బు అని తెలుసుకున్నాను. మందులు రెగ్యులర్‌గా తీసుకోవడం మొదలుపెట్టాను. మందులు మాత్రమే కాదు, ఒక సపోర్ట్ గ్రూప్‌లో చేరాను. నాలాగ ఎందరున్నారో తెలుసుకున్నాను. కొంత ధైర్యం తెచ్చుకున్నాను.”

“తరువాత ఒక క్లినికల్ సైకాలజిస్ట్ దగ్గరకి వెళ్ళి, టాక్ థెరపీ చేయించుకున్నాను. నాకు వచ్చే నెగెటివ్ ఆలోచనలు ఎప్పుడు, ఎలా వస్తాయో, వాటిని ఎలా ఎదుర్కోవచ్చో నేర్చుకున్నాను. ఒక మూడ్ చార్ట్‌ని తయారు చేసుకుని, నా ప్రవర్తనలోని అపశ్రుతులపై అవగహన పెంచుకున్నాను.”

“ఇంకా, మానసిక రోగాలు, వాటిని ఎదుర్కొనే విధానాలు – అన్నీ నేర్చుకున్నాను. మా ఆవిడకి కూడా నా పరిస్థితిపై అవగాహన కలిగించడం జరిగింది. అయినా, అప్పుడప్పుడు ఆసుపత్రి పాలయ్యేవాణ్ణి కూడా! ఇవన్నీ జరగడానికి ఒక దశాబ్దం పట్టింది”, అన్నాడు త్రయంబకేశ్వర్.

ఆయన మంచి నీళ్ళు తాగుతుంటే, అక్కడ ఉన్న ఆహూతులలో కలకలం బయలుదేరింది, దశాబ్దపు సమయం మీద. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగించాడు. “మీరు విన్నది నిజమే, దశాబ్దమే! మన భూమ్మీద వేల ఏళ్ళు బ్రహ్మ గారి లెక్కలో కొన్ని రోజులేనని పెద్దలు చెప్తారు. అలాగే, గట్టిగా చెప్పాలంటే మానసిక రోగాల లెక్కలో పదేళ్ళు చాలా తక్కువ సమయం. జీవితం సినిమా కాదు కదా, మూడు గంటల్లో చక్కబడడానికి!”

“ఇలా మరి కొన్నాళ్ళకి వ్యాధి లక్షణాలు మాయమైనట్టు అనిపించింది. సొంత తెలివి పెట్టకుండా డాక్టర్ దగ్గరకి వెళ్ళి, సలహా కోరాను. ఆయన ఈ రోగం జీవిత కాలం ఉంటుందని, దాని వల్ల కృంగిపోకుండా మైల్డ్ డోసేజ్‌లో మందులు వాడాలని చెప్పారు.”

“ముందు నేను నిరాశ పడ్డాను. తరువాత ఆలోచించాను – బీపీ, షుగరూ వస్తే జీవితాంతం మందులు వాడతాం కదా, మరి మానసిక రోగం పెద్దది అవకుండా ఉండేందుకు మందులు వేసుకోవడానికి ఎందుకు తటపటాయిస్తాం? అసలైన రోగం నా మెదడులో ఉందని తెలుసుకున్నాను. మెంటల్ బ్లాక్ అనండి, నామోషీ అనండి, భయం అనండి, ఇంకేమైనా పేరుతో పిలవండి.”

“మానసిక రోగాల గురించి అరమరికలు లేకుండా మాట్లాడకపోతే, ఆ రోగాలు మనల్ని పట్టి పీడిస్తాయి. స్త్రీలు నెలసరిలో పాటించవలసిన శుభ్రత గురించి నా స్నేహితుడి భార్య ఒక పదేళ్ళ క్రితం ఒక డాక్యుమెంటరీ తీసింది. అందరూ, ముఖ్యంగా ఆడవాళ్ళే, నోళ్ళు వెళ్ళబెట్టారు – గోప్యంగా ఉంచాల్సిన ఇలాంటి విషయాన్ని ఇలా బహిరంగంగా చర్చిండమేమిటని! కానీ, ఆ చిత్రం ఎందరో ఆడపిల్లలకి తెలియని విషయాలు నేర్పించింది, వాళ్ళని ఆరోగ్యవంతులని చేసింది! ఆవిడ పేరు, ఆ డాక్యుమెంటరీ పేరు తెలుసుకోవాలని ఉందా?” అని కొంత గ్యాప్ ఇచ్చాడు త్రయంబకేశ్వర్.

“అవును, అవును”, అన్న శబ్దాలు వినబడ్డాయి హాల్లోంచి. “ఆవిడ పేరు శ్రీమతి గీతా ఇళంగోవన్. ఆ డాక్యుమెంటరీ పేరు ‘మాదవిడాయ్’. ఆవిడే నాకు స్ఫూర్తి. ఎవరో ఒకరు ధైర్యం చేసి మొదటి అడుగు వెయ్యకపోతే, సమాజంలో అవగాహన ఎలా పెరుగుతుంది?”

“అందుకే, సమాజం నోరు విప్పని ఈ నిషిద్ధ విషయంపై అవగాహన పెంపొందించడానికి కంకణం కట్టుకున్నాను. నా ఉద్యోగం మానేశాను. ప్రత్యేకమైన ప్రాజెక్టులలోనే పాల్గొంటాను. మిగిలిన సమయాన్ని అంతా ఇటువంటి అవగాహనా కార్యక్రమాలకి  కేటాయించేశాను.”

“మీరంతా నా ప్రసంగం విన్నందుకు ధన్యవాదాలు. కంటిన్యూయస్‌గా పట్టలేని ఆనందం గాని, పట్టలేని దుఃఖం గాని ఉంటే వెంటనే మానసిక వైద్యుణ్ణి సంప్రదించండి. నాలాగ ప్రాణం మీదికి తెచ్చుకోకండి”, అని ముగించాడు త్రయంబకేశ్వర్.

బయటికి వస్తున్నప్పుడు అమిత పలుకరించి, “గగన్ గారూ, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇప్పుడు చూశారా, నేను ఆరోగ్యవంతురాలిని అయ్యాను”, అంది. “అవును, తేడా తెలుస్తోంది. చాలా సంతోషం”, జవాబిచ్చాడు గగన్.

“మరో ముఖ్య విషయం.. మానసిక రోగాలతో బాధపడే ఉద్యోగుల విషయంలో మా కంపెనీ ఒక కొత్త కోణం ఆవిష్కరించబోతోంది. అదేమిటంటే..” ఇంకా అమిత ఏదో చెప్పబోతుండగా, “నమస్కారమండీ.. మ్యాగ్సేసే పురస్కార గ్రహీత డాక్టర్ గగన్ గారు మీరేనాండీ?” అని ఒక నడివయస్కురాలు అడిగింది. “ఓకే గగన్ గారూ, మీకోసం ఎవరో వచ్చారు. నేను తరువాత ఫోన్ చేసి చెప్తాను.. బై”, అని నిష్క్రమించింది అమిత.

ఇప్పుడు గగన్ ఆవిడకేసి తిరిగి, “నమస్కారం, నేనే, చెప్పండి”, అన్నాడు. “ఇప్పుడు లేట్ అయ్యింది కదండీ, నాకు ఒక రోజు అపాయింట్మెంట్ ఇప్పిస్తే, ధన్యురాలిని”, అందావిడ. గగన్ ఒక రోజు రమ్మని చెప్పాడు. అప్పటికి అక్కడికి వచ్చిన ప్రభాత్, ఇక వెళ్దామా, అన్నట్టు మొహం పెట్టుకున్నాడు. అతణ్ణి పరిశీలనగా చూశాడు గగన్. ఏదో తేడా ఉంది.

***

ఇంటికి తిరిగి వస్తుండగా, “ప్రభాత్, మీ ఉదాసీనతకు కారణం చెప్పండి”, అని అడిగాడు గగన్. “మీరిచ్చిన పుస్తకానికి, త్రయంబకేశ్వర్ ప్రసంగానికి, నా జీవితానికి ఏదో సంబంధం ఉన్నట్టుంది”, అన్నాడు ప్రభాత్. “ఎటువంటిది?” మళ్ళీ అడిగాడు గగన్. “నాష్ ఆయన భార్య నుండి విడాకులు తీసుకున్నారు- నేనూ అంతే. త్రయంబకేశ్వర్ భార్యని కొట్టేవాడట! అంటే, మా ముగ్గురికీ ఎప్పుడో అప్పుడు భార్యతో పడేది కాదు.

“ఆ తర్వాత లేనివి ఉన్నట్టు కనిపించడం. మీకు తెలియదు డాక్, ఒకప్పుడు మా ఇంట్లో టాపింగ్ డివైస్లు ఉండేవని నమ్మేవాణ్ణి. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది! నా ప్రవర్తన వల్ల నేను చాలా నష్టపోయానేమో కదా! వాట్ డూ యూ సే?” అని ముగించాడు ప్రభాత్.

గగన్ మరింత ఆశ్చర్యపోయాడు. స్కిజోఫ్రేనియా రోగులు వాళ్ళ తప్పులు అసలు ఒప్పుకోరు. ఎవరి మీదనైనా నెట్టడానికి చూస్తారు. ప్రభాత్ తన ప్రవర్తనకి బాధ్యత వహిస్తున్నాడు, అందులోనూ మూడో మనిషి ఎదురుగా ఉన్నప్పుడు. ఇది చాలా పెద్ద విషయం, జబ్బు నయమయ్యింది అనడానికి ఒక చిహ్నం!

“మీ డైరీ సమీక్షించాలి. అప్పుడు మాట్లాడుకుందాం. అంతా వరకూ బెంగపడకండి. దేవుడు అప్పుడప్పుడు పోగుట్టుకున్నవి తిరిగి ఇస్తూ ఉంటాడు. అరే, మాటల్లోనే ఇల్లొచ్చేసిందే.. ఇవ్వాళ్టికి గుడ్ నైట్”, అని అప్పటికి ఆ చర్చకి ఫుల్ స్టాప్ పెట్టాడు గగన్.

కానీ, గగన్ నిరూప్‌ని కూడా గమనిస్తూనే ఉన్నాడు. అతను మరొకళ్ళ విషయంలో అనవసరంగా తల దూర్చకపోవడం అతని సంస్కారానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. ఎప్పుడూ అతను సంస్కారవంతుడే. ఇప్పుడు మందు జోలికి పోవడం లేదు గనుక అతనికి డి‌ఎం‌హెచ్‌పిలో మగ నర్స్ ఉద్యోగం ఇప్పించవచ్చని నిర్ణయించుకున్నాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here