మార్పు మన(సు)తోనే మొదలు-16

0
9

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఆబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌తో బాధపడుతూ, గగన్ ఇచ్చిన మందులు వాడుతుంటాడు స్వయంప్రకాష్. ఒకరోజు అతని తండ్రి గగన్‍కి ఫోన్ చేసి స్వయంప్రకాష్ మళ్ళీ తేడాగా ప్రవర్తిస్తున్నాడని చెప్తాడు. గగన్ అడిగితే మరిన్ని వివరాలు చెప్తాడు. గగన్ తగిన సూచనలు చేస్తాడు. నిరూప్‍ని, ప్రభాత్‍ని వేరే ఇళ్ళు చూసుకోమని చెప్తాడు గగన్. వాళ్ళకి త్వరలోనే అద్దెకి ఇళ్ళు దొరుకుతాయి. ప్రభాత్ ఇంట్లో – ప్రభాత్, మృగనయని మాట్లాడుకుంటూ ఉంటారు. తన ఒకప్పటి ప్రవర్తనని గుర్తు చేసుకుంటూ తాను ఆమెని ఎంత ఇబ్బంది పెట్టాడోనని బాధపడతాడు ప్రభాత్. ఆమె అతన్ని ఓదార్చి తన ప్రవర్తనకి కారణం చెబుతుంది. ఇద్దరూ ఒకనొకరు అర్థం చేసుకుంటారు. తన డిప్రెషన్‍కి కారణం చెబుతుంది మృగనయని. తామిద్దరూ గగన్ వల్ల బాగుపడ్డామని గ్రహిస్తారు. తన కూతురు అనామిక ఇప్పుడు ఏం చేస్తోందని అడుగుతాడు గగన్. ఎంబిఎ పూర్తి చేసి తాతగారి ఊళ్ళో ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోందని చెప్తుంది. తమ జీవితాలు గాడిలో పడ్డాయి కనుక ఇప్పుడు అనామికకి పెళ్ళి చేయాలని అంటుంది. దాని కన్నా ముందు తామిద్దరం మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అంటాడు ప్రభాత్. చట్టప్రకారం గతంలో విడాకులు తీసుకున్నారు కాబట్టి, కూతురు పెళ్ళి చేయాలంటే, మళ్ళీ చట్టరీత్యా భార్యాభర్తలవ్వాలని అనుకుంటారు. రిజిస్టర్ మేరేజ్ చేసుకుంటారు. తల్లిదండ్రుల పెళ్ళికి కూతురు అనామిక సాక్షి సంతకం చేస్తుంది. తన కూతురిని తమతోనే ఉండిపొమ్మని అడుగుతాడు ప్రభాత్. తండ్రి ప్రేమకు తపించినప్పుడు తనకది దొరకలేదని;.ఇప్పుడు అది లేకపోయినా బతకడానికి అలవాటు పడ్డానని; తనలాగే లేని వాళ్ళు తనకోసం ఎదురు చూస్తూ ఉంటారని, తాను వెళ్ళాలని అంటుంది. అప్పుడు గగన్ జోక్యం చేసుకుని ‘మార్పు మనతోనే మొదలు’ అనే ఎన్.జి.ఓ. గురించి అనామికకి చెప్పి, దానిలో పనిచేయమని అడుగుతాడు. బాగా ఆలోచించి, చివరికి ఒప్పుకుంటుంది. ఒక నెల రోజుల్లో అనామిక, తన తాతయ్యతో కలిసి గగన్ వాళ్ళ ఊరికొచ్చి, మార్పు కోరే యోధుల్లో ఒకరవుతుంది. – ఇక చదవండి.]

[dropcap]క[/dropcap]రోనా సమయంలో జనాలు భయకంపితులై ‘దినదిన గండం’ మాదిరి బ్రతుకుతుంటే, ‘మార్పు మనతోనే మొదలు’ వాలంటీర్లు పూర్ణిమ సాయంతో ఒక హెల్ప్ లైన్ ప్రారంభించి, దానికి సామాజిక మాధ్యమాల్లో బాగా ప్రాచుర్యం ఇప్పించారు. ఇక చూసుకోవాలి, వాళ్ళ హెల్ప్ లైన్‌కి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి.

మన పెద్దలు వాళ్ళ జీవిత కాలంలో చూసిన కరువు కాటకాలు, రోగాలూ మనం ఎరుగం గనుక ఇలా భయపడడం సహజమేనని, అలాగని ధైర్యం కోల్పోకుండా ఉండాలని, ఫోన్ చేసిన వారికి ధ్యానం, యోగా, ప్రాణాయామాల వల్ల మనోధైర్యం పెరుగుతుందని, వాటిని తప్పనిసరిగా ఆచరించమని, గుణం కనిపించకపోతే అప్పుడు సైకియాట్రిస్ట్‌ని కలవచ్చని ప్రోత్సాహాన్నిచ్చేది పూర్ణిమ. ఇంకా, హాబీలేమైనా ఉంటే వాటికి అంకితమైతే సంతోషం పొంగుతుందని కూడా చెప్పేది.

కొందరు కోవిడ్ పుణ్యమా అని ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు. వారు వారి బాధలని చెప్పుకుంటే, ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ గానీ, హ్యాండ్ శానిటైజర్ డిస్పెంసర్‌ని డిజైన్ చేయమని అడిగేది. రొటీన్‌గా ఆలోచించకుండా, మారిన కాలానికి అనుగుణంగా ఏదైనా ఉద్యోగాన్ని వాళ్ళనే ఆలోచించుకొమనేది.

ఐ‌టిలో ఉద్యోగాలు పొగుట్టుకున్న వాళ్ళతో ఈ-కామర్స్ లో ఏదో ఒక విషయాన్ని పరిశోధించి, ఆ సేవని అందించమని సలహా ఇచ్చేది. ఒకబ్బాయి ఇంటి అప్పు తాలూకు ఈఎంఐ గురించి ఒకటే బాధపడుతుంటే, ఆమె “మీ ఇంటికి కూరగాయలు ఎలా వస్తాయి?” అని అడిగింది.

“బిగ్ బాస్కెట్ ద్వారా”, అన్నాడతను. “ఆ బాస్కెట్ చిన్న ఊళ్ళలో లేదు కదా.. ఇక్కడ ఏమైనా చెయ్యగలరేమోనని ఆలోచించండి”, అని సలహా ఇచ్చింది. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, మానసిక వైద్యపు సలహా కోసం వస్తే, బ్రతుకుతెరువు మార్గాలు తెలుసుకుని సంతోషంగా వెళ్ళే వాళ్ళు పేషంట్లు. ఇలాంటి హెల్ప్ లైన్ ఉంటే, కాల్స్‌కి కొదవ ఉండదు కదా! అనతి కాలంలోనే ఈ హెల్ప్ లైన్ ప్రజలలో ఫ్రాచుర్యాన్ని పొంది, కాలర్స్‌కి ఊరట కలిగించింది.

నింహాన్స్ వారు కోవిడ్ కోసం తయారు చేసిన వీడియోల తయారీలో గగన్ తన సహాయసహకారాలను అందించాడు. దివిజ్ వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకై కృషి చేయాలని పట్టుబట్టాడు. ఇది తమ శక్తికి మించిన పనని గగన్ అభిప్రాయపడితే, కామాక్షి విషయంలో దివిజ్‌తో గగన్ అన్న ‘హోలిస్టిక్’ మాట అతడికే అప్పచెప్పాడు దివిజ్.

“నాలో రోగ నిరోధక శక్తి ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది కదా! అందుకు మనం ఈ పని చెయ్యడం వల్ల రోగికి మనోధైర్య పెరుగుతుంది- ‘ప్లాసిబో ఎఫెక్ట్’. ఔనా అంకుల్?”అని కూడా అడిగాడు. గగన్ ఇక కాదనలేక పోయాడు.

ఇక న్యూట్రిషన్ విషయంలో సాయం ఎవరు చెయ్యగలరా, అని ఆలోచిస్తున్న గగన్‌కి కొన్నాళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చింది.

@@@

త్రయంబకేశ్వర్ గారి మీటింగ్ నాటి ఆ నడివయస్కురాలు వచ్చి గగన్‌ని కలిసింది. “నా పేరు ప్రమీల. నేను క్రీస్తు పూర్వం హోం సైన్స్‌లో డిగ్రీ చదివాను”, అంది. అర్థం కానట్టు చూశాడు గగన్. “సారీ సర్. పెళ్ళి కాక ముందు హోం సైన్స్ చదివాను. ఇప్పుడు మాడ్రన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాను. మా వారు పెళ్ళైన మూడేళ్ళకే పోయారు. ఒక కూతురు. దాన్ని అల్లారు ముద్దుగా పెంచాను. అలాగని విచ్చలవిడితనం అలవాటు చేయలేదు.”

“ఆమె పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగం సంపాదించుకుంది. అక్కడ హై సొసైటీ పేరిట తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఇతర లైఫ్‌స్టయిల్ అలవాట్లు చూసి కల్చరల్ షాక్‌కి గురైంది. మనో మథనం తట్టుకోలేక ఉద్యోగం మానేసింది.”

“కొన్నాళ్ళు ఒకటే తలపోటని బాధపడింది. బ్రెయిన్ సీటీ స్కాన్, ఈఈజీ తీసి, ఏమీ లేదన్నారు. తరువాత కాళ్ళ నొప్పి వచ్చింది. ఆర్తో, న్యూరో టెస్టుల్లో ఏ తేడా కనిపించలేదు. కానీ ఆమె నిస్సత్తువతో బాధపడింది. కొన్నాళ్ళకి ఆకలి తగ్గింది. పచ్చకామెర్లు గానీ, మరే ఇతర హెపటైటిస్‌లు గానీ లేవు. ఒక రోజు నేను లేచేసరికి నా కూతురు శాశ్వతంగా నిద్రపోతూ ఉంది.”

“నా జీవితంలో భూకంపం వచ్చినట్టయ్యింది. నా దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ఏడ్చి, ఏడ్చి, కన్నీళ్ళు ఇంకిపోయాయి. పోయినేడాది మా దూరపు చుట్టం ఒకావిడ యూఎస్ నుండి వచ్చింది. ఆవిడ సైకియాట్రిస్ట్. ఆ రిపోర్ట్‌లు చూసి, నేను చెప్పింది విని, నా కూతురు మనోవ్యాధి వల్ల, లేని నొప్పులు ఉన్నట్టు ఫీల్ అయ్యిందని, వాటినే ‘సైకో-సొమాటిక్ పెయిన్స్’ అంటారని చెప్పింది.”

“నేను ఒక్కొక్క నిపుణుడికి చూపించి, కోల్పోయిన సమయంలో ఒక మానసిక వైద్యుడి దగ్గరకి పిల్లని తీసుకుని వెళ్ళుంటే, ఆమె ఆరోగ్యం బాగుపడేందుకు ఆస్కారం ఉండి ఉండేదని చెప్పింది. నేను మళ్ళీ కన్నీళ్ళ పర్యంతమయ్యాను”, అని రుమాలుతో కళ్ళు తుడుచుకుంది.

ఈ ఉపోద్ఘాతం ఆవిడ ఎందుకు ఇస్తోందో ఇసుమంతైనా పాలుపోలేదు గగన్‌కి. కానీ, మానసిక వైద్యులు ఎప్పుడూ ఓర్పు వహిస్తారు. విసుగేసినా బయటికి చెప్పరు. గగన్ ఇప్పుడు ఆ పనే చేస్తున్నాడు. ఆవిడ కొనసాగించింది. “ఆవిడ ప్రేరణతో నేను ఈ ఉద్యోగం చేస్తున్నాను. అదీ కాక, మానసిక రోగాల గురించి ఆవిడ మంచి అవగాహన కలిగించి, విద్యార్థుల్లో ఆ లక్షణాలుంటే మానసిక వైద్యుడి దగ్గరకి తీసుకుని వెళ్ళమంది.”

“నేను ఆమె జ్ఞానాన్ని మెచ్చుకుంటే, ఫలాపేక్ష లేని మీలాంటి మంచి డాక్టర్లుంటే తన్ను మెచ్చుకోవడం ఏమిటి, అని ఆమె అంది. అప్పుడు మీ గురించి గూగుల్ చేశాను. ఆ మీటింగులో ఎవరో మీరు వచ్చారని చేప్తూండడం విన్నాను. అందుకే కలిశాను.”

“‘మార్పు మనతోనే మొదలు’ వాలంటీర్లు గత వారం మా స్కూలుకొచ్చి, మీ ఆశీస్సుల వల్ల ఆ ఎన్‌జి‌ఓని స్థాపించామని చెప్పారు. నేను కూడా మారి, నా చుట్టుపక్కల కూడా మార్పు తీసుకుని రావాలనుకుంటున్నాను. ఇప్పుడు మీ ఆశయమే నా ఆశయం కాబట్టి, ఈ విషయంలో మీకు ఏ విధంగానైనా సహాయపడగలనా?” అని అడిగింది.

గగన్ మనసులో, ‘మన దివిజ్ గాడు పట్టిందల్లా బంగారమే లాగుంది’, అనుకుని, “తప్పకుండా! మీకు తెలుగు మీడియం స్కూళ్ళు, కాలేజీలలో తెలిసిన వాళ్ళుంటే, అక్కడ దివిజ్ వాళ్ళ ప్రసంగం ఏర్పాటు చేయడానికి ట్రై చేయండి. ఇంకా మీరు దివిజ్‌తో టచ్‌లో ఉంటే ఇంకేమైనా ప్లాన్ చేయవచ్చు. మీరు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారా?” అడిగాడు గగన్. చిన్న వయసులో భర్తని కోల్పోయిన ఈవిడ ఉద్యోగం చేయకుండా పిల్లని పెంచగలిగిందంటే ఆస్తిపరురాలని అర్థం కదా!

“అవునండీ. మా సొసైటీలోనే కాదు, మా చుట్టాలు, స్నేహితులు ఉండే అపార్ట్‌మెంట్స్‌లో లెక్చర్స్ ఏర్పాటు చేయిస్తాను”, అంది విశాలి. ప్రత్యక్షంగా మానసికారోగ్యంతో సంబంధం లేని ఒక మామూలు మనిషి తన ఉద్యమంలో చేయి కలపడానికి ముందుకి వచ్చినందుకు ఎంతగానో సంతోషించాడు గగన్.

@@@

ప్రమీల మాస్క్ వేసుకుని వచ్చి, చేతులు హ్యాండ్ శానిటైజర్‌తో శుభ్రం చేసుకుని, మాస్క్ వేసుకున్న దివిజ్ ముందు కూర్చుంది. “మన చానెల్ పేరు ‘ఇమ్యూనిటీ ఫర్ కమ్యూనిటీ’. మీరు చానెల్ ప్రేక్షకులకి చెప్పే వంటలు, పొడులు, ‘రుచికరమైన’ కషాయాలు వగైరా, క్లుప్తంగా ఉండాలి. మొదలుపెట్టేటప్పుడు వంటకం పేరు, అది ఏ విధంగా రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది – అని మొదలు పెట్టి, మిగిలినవన్నీ, మామూలు వంట-వార్పు ప్రోగ్రాం లాగా తయారు చేసుకోవచ్చు.”

“మరో ముఖ్యమైన విషయం, ఆంటీ! ఏ వంటకమూ కూడా ఐదు నుంచీ పది నిముషాలకన్నా ఉండకూడదు. క్లుప్తంగా ఎక్కువ విషయాలు చెప్పడం మన ప్రత్యేకత. ఆయుష్ మినిస్ట్రీ వారు ఇచ్చిన బుక్లెట్‌లో శొంఠి, వెల్లుల్లి, బత్తాయిలు-కమలాలు, నిమ్మకాయలు- వీటన్నిటి గురించిన బోలెడంత సమాచారం ఉంది. బట్, వాటిని మామూలు కషాయాల్లా తాగాలంటే జనాలకి బోర్. వాటితో ఏవైనా రుచికరమైన వంటలు చెప్దురూ!”

“వచ్చే శుక్రవారం నుండి షూట్ మొదలెడదాం.. కనీసం అయిదారు రెసిపీలతో సిద్ధంగా ఉండండి”, అని ముగించాడు దివిజ్. “నా మొహాన్ని మాత్రం కనపడనీయకండి బాబూ!” అంది ప్రమీల. “ఈ అమృత హస్తం ఉన్న నగుమోము చూడాలని ప్రేక్షకులు ఆశపడతారు కదా! ప్లీజ్, సింపుల్‌గా కనిపించండి చాలు. మీరు భయపడకుండా, కెమెరా వెనుక అనామిక అనే మా టీమ్ మేట్‌ని పంపిస్తాను, సరేనా? ఆమె మీకు బోలెడంత ధైర్యం చెప్తుంది”, అని మొత్తానికి ప్రమీల భయాన్ని దూరం చేసి, యూట్యూబ్ చానెల్ విషయం తేల్చేశాడు దివిజ్.

***

కరోనా లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తేశాక, రైళ్ళ రాకపోకలు మొదలయ్యాక ఒక రోజు, గగన్ తన ఇంట్లో దివిజ్, జాయ్‌లతో మాట్లాడుతున్నప్పుడు మల్లిక వచ్చింది. కారణమడిగితే, సెలవు కావాలంది. “మా బంధువు చెప్పారు. తిరుచ్చి దగ్గర, కావేరీ తీరాన గుణశీలం అనే పవిత్ర స్థలం ఉందట. ఒక మండలం పాటు, అంటే నలభై ఎనిమిది రోజులపాటు, రోజూ నదిలో స్నానం చేయించి గుణశీలుడి రూపంలో ఉన్న విష్ణుమూర్తి అశీస్సులు తీసుకుంటే ఎటువంటి మానసిక రోగమైనా నయమైపోతుందట. ఏ పుట్టలో ఏ పాముందో ఏమో, చిన బాబు గారికి ఆ గుణశీలుడి ఆశీస్సులు తీసుకోవాలనుంది సార్”, అందామె.

కాస్సేపు ఆలోచించి గగన్ ఆమెను వెళ్ళి రమ్మన్నాడు. కానీ ఒక షరతు పైన- ఇప్పుడు వాడే మందులేవీ ఎట్టి పరిస్థితుల్లోనూ మానకూడదన్నాడు; అందుకే, రెండు నెల్లకి సరిపడా మందులని తీసుకుని మరీ బయలుదేరమన్నాడు. ఆమె ధన్యవాదాలు చెప్పుకుని వెళ్ళిపోయింది.

ఇది చూస్తున్న దివిజ్‌కి చిర్రెత్తుకొచ్చింది. “శభాష్, అంకుల్! ఒక పక్క నుంచి మన సంస్థ మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి కష్టపడుతుంటే, మీరు మరో పక్క మూఢనమ్మకాలని ప్రోత్సహిస్తూ ఉండండి, గ్రేట్!”, అని చప్పట్లు చరిచాడు. “ఇంకా నయం, భూత మాంత్రికుడి దగ్గరకి పంపలేదు”, అని కూడా దెప్పిపొడిచాడు.

గగన్ ప్రశాంతంగా, “నీ ఆవేశంలో అర్థం ఉంది. కానీ, నమ్మకం అనేది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తుంది. నా ఫ్రెండ్‌కి ఒక హెమీప్లీజిక్ కూతురుంది. అంటే, ఆమెకి యాభై శాతం పక్షవాతమన్న మాట. ఆమె ఎప్పుడూ చిరునవ్వు నవ్వుతూ కనిపించేది. తనంతట తాను నడవగలిగేది. మొన్నామధ్య ఏదో పెళ్ళికి వెళ్ళినప్పుడు, గొయ్యి మీద పరచిన కార్పెట్‌పై కాలేసి, ఎగిరి పడి, పనిచేసే మోచిప్పకి గట్టిగా దెబ్బ తగిలించుకుందట.”

“ఫిజియోథెరపీ చేయించుకున్నా నొప్పి పెద్దగా తగ్గలేదట. ఒకళ్ళ చెయ్యి పట్టుకోకుండా పట్టుమని పది అడుగులు కూడా వెయ్యలేకపోయేదట. ఇలా ఓ అయిదేళ్ళు గడిచాయట. అటువంటి పరిస్థితుల్లో ఎవరో ఆమెను సద్గురువుగారి ఆశ్రమానికి వెళ్ళి ధ్యానం నేర్చుకోమన్నారట.”

“అయిదు రోజుల్లో ఆమె బాలన్స్ యాభై శాతం మెరుగు పడిందట. ‘మైండ్ ఓవర్ మాటర్’ అంటే ఇలానే ఉంటుందేమో! మానసిక వైకల్యం ఉన్న వాళ్ళని నయం చేసేందుకు కూడా అక్కడ కోర్సులున్నాయట. వాళ్ళ నాన్న చెప్పాడు.”

“థాయ్‌లాండ్‌లో మాదక ద్రవ్యాలకి ఎడిక్ట్ అయిన జనాలని, బౌద్ధ సన్యాసులు ధ్యానం ద్వారా నయం చేస్తున్నట్టు దాఖలాలు ఉన్నాయి. కానీ, దాన్ని ఒక ట్రీట్మెంట్‌గా పరిగణించడానికి సరిపడేంత పరిశోధన జరగలేదు.”

“మనకి అల్లోపతీ అలవాటైపోయింది. ఫిజియోథెరపీ నయం చేయలేని ఒక హెమీప్లీజిక్ కాలుని, ధ్యానం నయం చేసిందంటే మనస్సు పటిష్ఠమైనట్టే కదా! అలాగే ఎడిక్ట్స్‌ని ధ్యానంతో నయం చేస్తే మంచిదే కదా! మనం నమ్మం గానీ, భూత మాంత్రికుడు విలువలతో పని చేస్తే, రోగి మనస్సు బలపడుతుంది కదా! దైవాన్ని నమ్ముకుంటే అద్భుతాలు సంభవిస్తాయంటారు. ఆమె మాట కాదనడం ఎందుకు? ఎలాగూ మందులు కొనసాగిస్తుందిగా!” అని ముగించాడు.

ఇదంతా అయ్యాక, “అసలైతే నేనివ్వాళ ఒక శుభవార్త చెప్దామనుకున్నా! ఈ లోగా ఈ సమస్య వచ్చి పడింది గానీ! మన యూట్యూబ్ ఛానెల్స్‌కి రోజూ కోట్లలో హిట్స్ వస్తున్నాయి కదా!” అన్నాడు దివిజ్. “అదెలా? అవి తెలుగు చానెల్స్ అనుకున్నానే!” అన్నాడు జాయ్. “సబ్ టైటిల్స్ పదిహేను భాషల్లో వస్తాయి, వాళ్ళు లాగిన్ అయిన ప్రాంతాన్ని బట్టి. మన దేశపు భాషలే కాకుండా అంతర్జాతీయ భాషలు కూడా వాటిలో ఉన్నాయి.”

“ఆసక్తి కలిగించే విషయమేమిటంటే, తిరుమల వెళ్ళిన భక్తులు తిరుచానూరు కూడా దర్శించుకున్నట్టు, ఇమ్యూనిటీ చానెల్ చూడ్డానికి వచ్చిన వాళ్ళు ‘మంచి మాట’ చానెల్‌ని కూడా చూస్తున్నారట. మనం ముందు చూపుతో సబ్ టైటిల్స్ ఏర్పాటు చేయడం ఎంత కలిసొచ్చిందో చూశారా?”

“ఒక మిలియన్, అంటే, పది లక్షలకు పైగా, సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అందుకని, మనకి మన చానెల్స్‌పై ప్రకటనలు వేసే అరుదైన అవకాశం వచ్చింది. పేకాట రాయుళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వదలచుకోలేదు. ఈ-కామర్స్ సైట్‌లు ఏమైనా దొరుకుతాయేమో చూడాలి. ఆఁ, మరో మాట- మన చానెల్స్‌కి ఇంత ప్రాచుర్యం వచ్చిందంటే, ప్రమీలాంటీ చలవ వల్లే కదా! ఈ రాబడిలో ఆవిడకి టెన్ పెర్సెంట్ షేర్ ఇద్దామనుకుంటున్నాను. ఏమంటారు, అంకుల్?” అడిగాడు దివిజ్.

“ఏమంటాను? నువ్వు చెప్పిన దానికి ‘రైట్’ అంటాను”, నవ్వుతూ అన్నాడు గగన్. జాయ్ మౌనంగా ఉండిపోయాడని గురుశిష్యులిద్దరూ గమనించలేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here