మార్పు మన(సు)తోనే మొదలు-3

0
11

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[అల్లుడిపై కోపగించుకున్న సుధని శాంతపరుస్తాడు రామారావు. మోనోపాజ్ టైమ్‍లో మూడ్ స్వింగ్స్ ఉంటాయని తల్లి సుధకి నచ్చజెబుతుంది పూర్ణిమ.  కొడుకు శశాంక్‌తో కలిసి తమ ఇంటికి వచ్చేస్తుంది పూర్ణిమ. పాపని ఇంట్లో వదిలేసి వచ్చిన మంజులని పాపని తేలేదేం అని అడుగుతుంది పూర్ణిమ. మంజుల ఏడుపు మొదలుపెడుతుంది. పాప వల్లే తనకి కష్టాలు అని చెబుతుంది. కాన్పు తరువాత వచ్చే క్రుంగుబాటుతో మంజుల బాధపడుతోందని గ్రహించిన పూర్ణిమ మంజులని ఓదారుస్తుంది. వేసవి సెలవకి శశాంక్‌తో కలిసి పుట్టింటికి వెళ్తుంది పూర్ణిమ. తల్లి సుధలో పెద్దగా మార్పు రాదు. సుధకి తాత్కాలిక మతిమరుపు కూడా వస్తుంది. తల్లికి సాయం చేయాలని నిశ్చయించుకున్న పూర్ణిమ అన్ని పనులు తాను చేస్తానని తల్లిని ఒప్పిస్తుంది. పూర్ణిమ చెప్పిన ధ్యానం, యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల సుధ త్వరలోనే కోలుకుంటుంది. తల్లిని మందులు వాడడం మానవద్దని హెచ్చరించి తమ ఇంటికి వచ్చేస్తుంది పూర్ణిమ శశాంత్‌తో కలిసి. మంజులకి కూడా పూర్తిగా నయమవుతుంది. పాపని జాగ్రత్తగా చూసుకుంటుంది. గగన్ వాళ్లు ఉంటున్న ఇంటి పక్క ఇంట్లోకి కొత్తగా ఎవరో వచ్చినట్టు తెలుస్తుంది. ఓరోజు ఆసుపత్రికి వెళ్తుండగా పక్కింట్లో బ్యాంక్ ఆఫీసర్ ప్రభాత్‌ని చూసి ఆశ్చర్యపోతాడు. ప్రభాతే గగన్‍ని పలకరిస్తాడు. ఏంటి ఇక్కడ కొచ్చారు?, ఇంట్లో చెల్లాయి పాప బావున్నారా అని అడిగితే ప్రభాత్ కోపగించుకుని తన భార్య ప్రస్తావన తేవద్దని చెప్తాడు. ఆసుపత్రికి వెళ్ళాక పూర్ణిమకి ఫోన్ చేసి చెప్తాడు. ప్రభాత్ పరిచయం గుర్తు చేసుకుంటాడు. గతంలోకి వెళ్తాడు. ప్రభాత్ భార్య మృగనయని భర్య సమస్యలన్నీ గగన్‌కి చెబుతుంది. – ఇక చదవండి.]

[dropcap]“ఋ[/dropcap]ణాలు ఇవ్వడంలో నిపుణుడికి వసూలు చెయ్యడం ఎలా సాధ్యమై ఉంటుందబ్బా, అని ఆయన సహచరులు ముక్కుమీద వేలేసుకునేవారు. దానికి కారణం ఆయన నీతి, నిజాయితీ, కలుపుగోలుతనం. కల్పవృక్ష బ్యాంకులో ఆయన విరోధులు కూడా ఒప్పుకునే నిజాలివి. మంచి మాటలతో నచ్చజెప్పి బకాయిలు వసూలు చేసేవారు. కిస్తులు ఎగ్గొట్టే ఎంతటి ఉద్దండులైనా, ఆయన వెళ్ళి మాట్లాడితే అంతే, లేదనడానికి వాళ్ళకి మనసు వచ్చేది కాదు.”

“ఆయన కష్టానికి తగ్గట్టు సకాలంలో కాకుండా, త్వరితంగా ఆయనకు ప్రమోషన్లు లభించాయి. ఆయన నిజాయితీకి నిదర్శనంగా ఆయన్ని విజిలెన్స్‌లో వేశారు. ఓ రెండున్నర ఏళ్ళ క్రితం ఒక బ్రాంచిలో కాష్ క్లోస్ చేసే సమయానికి సర్‌ప్రైజ్ చెక్‌కి వెళ్ళారు, మరో ఇద్దరితో. క్యాషియర్ దగ్గర రెండు లక్షల రూపాయలు గల్లంతయ్యాయి.

“బ్రాంచి మేనేజర్ వచ్చి, ‘ఆ క్యాషియర్ చాలా బుద్ధిమంతుడు, మొన్న ఒక రోజు తన పక్క కౌంటర్లో క్యాషియర్ డబ్బు తెస్తుంటే, కొన్ని నోట్లు కిందపడ్డాయి. అయినా, దురాశకి పోకుండా ఆ డబ్బులు అతనికిచ్చేశాడు. మేము మెచ్చుకుంటే, పరధనం త్రాచుపాముతో సమానమని, వాళ్ళ బామ్మ చెప్పిందని చెప్పాడు. ఇలాంటి వాణ్ణా మీరు అనుమానిస్తున్నారు?’ అని సమర్థించాడట. పైపెచ్చు, ‘మీరు కాస్త టైమ్ ఇస్తే ఎలా మిస్ అయిందో చూసుకుని చెపుతా’మన్నాడట.”

“మా ఆయన నిజాయితీ అంటే ప్రాణమిస్తారు గనుక అన్నీ చెక్ చేసుకునే అవకాశం ఇచ్చారట. వాళ్ళు ఎక్కువ డబ్బు డ్రా చేసిన ఒక సేఠ్‌జీ‌కి ఫోన్ చెయ్యడానికి అనుమతి కోరారట. ఆయన ఒప్పుకున్నారట. ఆ మనిషి దగ్గర డ్రా చేసిన సొమ్ముకంటే రెండు లక్షల నగదు ఎక్కువుందట. అది తెప్పించి సర్దుదామని వాళ్ళు ప్రాధేయపడితే ఆయనొప్పుకున్నారట.

“అంతా జరిగిన తరువాత ఆయనకు ఒక పచ్చి నిజం తెలిసింది. ఆ క్యాషియర్‌కి, సేఠ్‌జీ‌కి లాలూచీ ఉందట. రోజూ ఆ డబ్బుని తన చిన్నకారు వ్యాపారానికి పెట్టుబడిగా వాడుకుని, కాష్ మూసేసే ముందు డబ్బు, దీన్ని అతడికి వడ్డీ లేకుండా తిప్పినందుకు క్యాషియర్‌కి కొంత డబ్బు ముట్టజెబుతాడట. అందులో మేనేజర్‌కి కూడా వాటా ఉందట.

“వీళ్ళు చెక్ చేసే సమయానికి ఆతడు ఇంకా డబ్బులు ఇవ్వనందున వీళ్ళకి కాష్‌లో తేడా వచ్చిందట. ఆ క్యాషియర్ నిజాయితీపరుడని మేనేజర్ పాడిన పాటను నమ్మి మోసపోయారు కనుక ఆ విషయంపై చాలా బాధ పడ్డారు”, కళ్ళ నీళ్ళతో, బాధలో ముగించింది ఆవిడ.

ఏకాగ్రతతో వింటున్న గగన్, “మంచినీళ్ళు తీసుకోండి”, అంటూ తన టేబుల్ మీద ఉన్న నీళ్ళ సీసాని అందుకోబోయాడు. “పరవాలేదు డాక్టర్”, అంటూ, ఆవిడ టిష్యూతో కళ్ళ నీళ్ళు తుడుచుకుని, తన హాండ్ బాగ్ లోంచి ఒక చిన్న సీసాని తీసి, నీళ్ళు తాగి, మౌనంగా ఉండిపోయింది. కొంతసేపు ఆమెని తేరుకోనిచ్చి, “అసలు ఈ లోపాయికారీ వ్యవహారం గురించి ఆయనకి ఎవరు చెప్పారు? అది నిజమేనా?” అడిగాడు.

”ఇదివరకు ఆయన దగ్గర పని చేసి, ఆయన్నే రోల్ మోడల్‌గా భావించే ఒక గుమస్తా ఆ క్యాషియర్‌కి బ్యాచ్‌మేట్ అట. ఆ సంఘటన జరిగిన రోజున ఆ క్యాషియర్ గుమస్తా దగ్గరకొచ్చి, ‘నీతి, నిజాయితీ, గాడిదగుడ్డూ, అని నాకు ఏవో ట్రాష్ నీతులు చెపుతూంటావ్ కదా.. అవన్నీ అవినీతి ముందు ఓడిపోవాల్సిందే! హహహ.. మీ గురువుగారు ప్రభాత్ గారు లేరూ.. నా కాష్‌లో కొరత ఉన్నా ఆయన ఏమీ చేయలేకపోయారు.. చూస్కో’, అంటూ కథంతా చెప్పుకు వచ్చాడట. ఆయన ముందు నమ్మలేదు. చాలా మందితో వాకబు చేశారు. అందరూ ఈ విషయంలో ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు గనుక నమ్మక తప్పలేదు ఆయనకి.

“ఎప్పుడూ తప్పు చేయని ఆయన ఇలాంటి తప్పు చేసినందుకు కొన్నాళ్ళు కృంగిపోయారు. ఆ తరువాత.. తరువాత”, కన్నీరు పెట్టిందా ఇల్లాలు. మళ్ళీ మంచినీళ్ళు తాగి, తేరుకుని, తన కథ, కాదు కాదు, వ్యథని కొనసాగించింది ఆమె.

“కొన్నాళ్ళు అందరినీ, ఎవరి మీద కోపమొస్తే వారిని, బండ భాషలో తిట్టేవారు”, అన్నవెంటనే ఆమె వాక్ప్రవాహానికి ఆనకట్ట కట్టినట్టు, “మళ్ళీ చెప్పండి.. ఎవరి మీద కోపమొచ్చేది? ఈ బండ భాషంటే, మీ పరిభాషలో ఏమిటి?” అని అడిగాడు గగన్.

ఆమె ఆలోచిస్తున్నట్టు భృకుటి ముడి పెట్టి, కాస్సేపు ఆలోచించి, “అప్పట్లో ఆయనకు ఆ బ్రాంచి మేనేజర్ మీద, క్యాషియర్ మీద కోపముండేది, ఆయన్ను మోసం చేశారు గనుక. వాళ్ళనే కసి కొద్దీ తిట్టేవారు”, అని మౌనం వహించిందామె.

“ఆ కసి తిట్లు ఎలా ఉండేవో కాస్త వివరిస్తారా?” అడిగాడు గగన్. “అంటే, ‘వాళ్ళు నాశనమై పోతారు, మట్టికొట్టుకు పోతారు, పురుగులుపట్టి పోతారు..’ ఇలాంటివి. “ఇవి బండ తిట్లా?” అడిగాడు గగన్. “ఆయన ఏమనేవారంటే”, అని, “మీరు కేస్ ఫైల్లో వ్రాయనంటే చెప్తాను. ఎందుకంటే, ఆ మాటలు అంత జుగుప్సాకరంగా ఉంటాయి గనుక”, అని, గగన్ తలాడించే వరకూ ఆగి, తల మరోపక్కకి తిప్పి, చిన్న గొంతుకతో ఆ బూతు మాటలేవో చెప్పింది.

గగన్ ఒళ్ళు జలదరించింది.. ఆ మాటలు మామూలు వాళ్ళు మాట్లాడడానికి భయపడేవి. అలాంటిది, పెద్ద ఉద్యోగంలో ఉండే ఆమె భర్త, వాటిని అంత సునాయాసంగా ఎలా అనగలిగాడో ఆశ్చర్యంగా ఉంది. ఆవిడ తల దించుకుని, “మరి కొన్నాళ్ళ తరువాత ఏ పని చేసినా దిక్కులు చూసేవారు. నాకు వింతగా ఉండేది.

“నేనలా చూడ్డం చూసి ఆయన, ‘మనింట్లో ఏమైనా రహస్య కెమెరాలున్నాయేమోనని డబుల్ చెక్ చేస్తున్నాను’, అనేవారు. ప్రైవసీకి పెద్దపీట వేసే ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నాం.. ఇలాంటి తలమాసిన పనులు చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా, చెప్పండి డాక్టర్!” అని మళ్ళీ కళ్ళనుండి గంగను పొంగించింది ఆమె.

ఈసారి ఆమె తెచ్చుకున్న బాటిల్లో నీళ్ళు అయిపోయి, గగన్‌ని మంచి నీళ్ళకోసం అడిగింది మృగనయని. నీళ్ళందుకుని, ధన్యవాదాలు చెప్పి, బాగ్ లోంచి టిష్యూ పేపర్ తీసుకుని, కళ్ళు తుడుచుకుందామె. మర్యాదస్థురాలు, అని మనసులో అనుకున్నాడు గగన్. మానసిక రోగుల్ని పరీక్షించేటప్పుడు, డాక్టర్ వారిని క్షుణ్ణంగా పరిశీలించి, వారి బాడీ లాంగ్వేజ్ చెప్పే రహస్యాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు శ్రీమతి మృగనయని చెప్పే విషయాలలో ఈ కీలకమైనది మిస్ అయింది.

గగన్ ఈ ఆలోచనలనుండి తేరుకునే లోగా ఆమె, “మా ఆయన ప్రాబ్లంకి పరిష్కారముందో లేదో నేనెరుగను. కానీ మీతో మాటలాడిన ఈ కాస్సేపూ చాలా రిలీఫ్ ఫీల్ అయ్యాను. థాంక్యూ డాక్టర్ గారూ. ఇలాంటి విషయాలు అందరితోనూ షేర్ చేసుకోలేం కదండీ! మీ చెల్లెలు తార నాకు ఫ్రెండ్ అయినందువల్ల, మీరు మా వూళ్ళో లేకపోవడం వల్ల నేను ధైర్యంగా వచ్చి, ఏ విషయం దాచకుండా మీతో చెప్పగలిగాను”, అంది.

ఆమె వాక్ప్రవాహానికి మళ్ళీ మరో ఆనకట్ట వేసి, “నేను ముందే మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. మా చెల్లెలు ఫ్రెండ్‌కి ఇలా ఇక్కడికి వచ్చి మాటలాడాల్సిన అవసరమేముంది? మీ వదిన, అంటే మా ఆవిడ, మంచి హోస్టెస్. అతిథులకి కావలసినవన్నీ జాగ్రత్తగా చూసుకుంటుంది. ఇక్కడికే రావాలన్న పట్టుదలకి కారణం చెప్తారా?” అన్నాడు గగన్.

“నేనున్న పరిస్థితి ఆలాంటిది. ‘పుర్రెకో బుద్ధి’ అనే సామెత గుర్తు చేసుకుని, ఈ విషయం ఎంత తక్కువ మందికి తెలుస్తే అంత మంచిదనుకున్నాను. ఈయన వాలకం రెండేళ్ళ నుండీ అనుభవిస్తున్నాను గానీ ఎవరికీ చెప్పే ధైర్యం సరిపోలేదు. నానాటికీ పరిస్థితి చెయ్యిదాటిపోతోందనిపించి, వేరే ఊళ్ళో ఉన్న తారని సలహా అడిగాను. అంత వేదన అనుభవిస్తే గాని నేను సమస్యని పరిష్కారం వైపు తీసుకుని వెళ్ళే యోగం లేదు కాబోలు..”, మళ్ళీ మరొక టిష్యూ పేపర్‌తో కళ్ళు తుడుచుకుంది.

“బాధపడకండి. విషమించిన పరిస్థితి గురించి వివరాలు చెప్పండి”, అన్నాడు గగన్.

“మరి కొన్నాళ్ళకి, ఒక రోజు ఆఫీస్ నుండి ఫోన్ చేసి, కంగారుగా, ‘నువ్వు అర్జెంటుగా నాకో సాయం చేయాలి. నేను బీఎస్ఎన్ఎల్ వాళ్ళకి ఫోన్ చేస్తే జోక్ లాగ కొట్టిపారేస్తున్నారు. నువ్వు వాళ్ళని కన్విన్సు చేయాలి, ప్లీజ్..’, అని ఏవేవో మాటలు అనడం మొదలుపెట్టారు. నాకు అయోమయంగా ఉండి, ఏమీ అర్థమవలేదు.

“అప్పుడు, ‘మనింట్లో ఎక్కడో టాపింగ్ డివైస్లున్నాయి. ఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాటలాడి నాకు కొంచెం ఊరట కలిగించు డియర్’, అని ప్రాధేయపడేవారు. నాకు కాళ్ళూ, చేతులూ ఆడేవి కావు. మరి కొన్నాళ్ళ తరువాత నా తరఫు చుట్టాలకి ఫోన్ చేసి, ఇదివరకు వాళ్ళతో ఉన్న అభిప్రాయభేదాలని తిరగతోడి, ‘ఆ విషయం దృష్టిలో పెట్టుకుని, నా మీద కసితో మా ఇంటిలో టాపింగ్ డివైస్ పెడతారా?’ అని పేచీ పెట్టుకుంటున్నారు.

“చుట్టపక్కలతో సత్సంబంధాలు లేవు. ఉన్నా అది గౌరవప్రదంగా ఉండే అవకాశం లేదు కదా! తల తీసేసినట్టయింది నాకు. ఓ శుభకార్యం లేదు.. ఎక్కడికెళ్ళినా మా ఆయన ప్రస్తావన తెచ్చి, మొసలి కన్నీరు కార్చేవారే, బూటకపు జాలి చూపించే వారే.. చుట్టాలుండే చోట్లకి వెళ్ళడం మానుకున్నాం, పోనీ ఫ్రెండ్స్‌తో పార్టీలకి కూడా గతి లేదు.

మొన్నీమధ్య నేను ఇంటిలో లేనప్పుడు మా సెక్యూరిటీ అబ్బాయిని పిలిచి టాపింగ్ డివైస్ కోసం వెతకమన్నారట.. ఇంక మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో ఈ విషయం అట్టుడికిపోయింది. మతిస్థిమితం లేని వారికి ఈ గేటెడ్ కమ్యూనిటీలో చోటు లేదంటూ కొందరు ఆందోళన లేవదీశారు. ఇక చేసేది లేక తారని అడిగి, మీ దగ్గరికొచ్చాను”, అంది మృగనయని.

“ఆయన ప్రవర్తన తేడాగా అనిపించినప్పుడు వెంటనే వచ్చి ఉండచ్చు కదమ్మా!” అన్నాడు గగన్. “అంటే.. ఆయనకి నయమవ్వదా?” ఆదుర్దాగా ప్రశ్నించింది మృగనయని. “మానసిక రోగాలు రెండు రకాలు.. ఒకటి, కామన్‌గా వచ్చే రుగ్మతలు, రెండు, తీవ్రమైన రుగ్మతలు. మీరు చెప్పినదాని బట్టి మీవారికొచ్చింది తీవ్రమైన రుగ్మత. మనిషిని చూసి నిర్ధారణ చేసుకోవాలి. తార వాళ్ళింట్లో కలవచ్చా?” అన్నాడు గగన్.

“సరేనండీ.. ప్రస్తుతం ఆయన నమ్మే కొద్దిపాటి మనుషుల్లో వాళ్ళ కుటుంబం ఒకటి. ఎప్పుడు కలుద్దాం?” అందామె కళ్ళలో కాంతి నింపుకుంటూ. గగన్ ఫోన్‌లో తారతో మాటలాడి, ఆ ఆదివారమే కలిసే ప్రోగ్రాం పెట్టాడు. ఆమె వెళ్ళబోతుంటే కొంచెం కంగారుగా, “నేను సైకియాట్రిస్టునని మీ వారికి తెలియదు కదా!” అన్నాడు. “నో ప్రాబ్లం అండీ, ఆయనకి తార, వాళ్ళాయన, వాళ్ళ పిల్లలూ, అత్తమామలూ తెలుసు, అంతే!” అంది. ఒత్తిడి తగ్గి నిట్టూర్చాడు గగన్.

***

ఆ ఆదివారం గగన్, పూర్ణిమ, శశాంక్‌లు తార ఇంటికి వెళ్ళి, ఆమె భర్త మురళితోను, శశాంక్ కన్నా రెండున్నర ఏళ్ళు పెద్దవాడైన వాళ్ళబ్బాయి అనుజ్‌తో పిచ్చాపాటీ, ఆటలు వగైరా, ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు. తన స్పెషలైజేషన్ గురించి ప్రస్తావన తేవద్దని పిల్లలు లేనప్పుడు మురళికి చెప్పి, తారకి గుర్తు చేశాడు గగన్. వంట రెడీ అయ్యేసరికి, మృగనయని, వాళ్ళాయన ప్రభాత్, అమ్మాయి అనామిక వచ్చారు.

ప్రభాత్‌ని తను గమనించాడని అనిపించకుండా గమనించాడు గగన్. సంభాషణలో ప్రభాత్ ఎలా స్పందిస్తాడో కన్నార్పకుండా చూస్తున్నాడు. ప్రభాత్ మాటల్లో ఆత్మవిశ్వాసం లేదు; భోజనం చేసేటప్పుడు అదొక రకంగా తేడాగా తింటున్నాడు. చూపులు అనుమానాన్ని, అసహనాన్ని చూపిస్తున్నాయి.

గగన్‌కి రూఢి అయింది- ప్రభాత్ స్కిజోఫ్రేనియా అనే తీవ్ర మానసిక రోగగ్రస్థుడని. ఇది చాలా అరుదైన రోగం. ఈ రోగం ప్రత్యేకతేమిటంటే, అది సర్వసాధారణంగా అత్యంత తెలివైన వాళ్ళని బాధిస్తుంది.

జిల్లా మానసికారోగ్య కార్యక్రమం మొదలుపెట్టి రెండు దశాబ్దాలు దాటినా, ఈ సేవలు దేశంలోని ఆరొందల ఇరవై జిల్లాలలో కేవలం నూటిరవై మూడు జిల్లాల్లో మాత్రమే లభ్యం. పైగా, ప్రతీ రాష్ట్రంలో కొన్ని వెనుకబడిన జిల్లాలలో మాత్రం ఉండే ఈ కార్యక్రమంలో స్కిజోఫ్రేనియా వ్యాధితో బాధ పడే రోగి దొరకడం చాలా అరుదు. అందుకనే, అటువంటి రోగిని గమనించే అవకాశం రావడం తన అదృష్టం. పుస్తకాల్లో చదివినది ప్రాక్టికల్‌గా చూడగలగడం ఎంతమందికి సాధ్యమౌతుంది?

మరో ముఖ్య విషయమేమిటంటే, స్కిజోఫ్రేనియా రోగి తను సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణనుకుంటాడు. ‘గేమ్ థియరీ’ ని కనిపెట్టిన ప్రఖ్యాత గణిత శాస్త్ర నిపుణుడు, నాష్‌కి అప్పట్లో ఏవేవో గొంతులు వినిపించేవట. తన చికిత్సకి సంబంధించిన ఒత్తిళ్ళ వల్ల భార్య నుండి విడాకులు కూడా తీసుకున్నారట.

ఇలాంటి వారికి మందులివ్వడం కష్టం. చేదుగా ఉండకుండా, ఏ రుచీలేని కొన్ని మందులు కాఫీలోను, అన్నంలోనూ కలపవచ్చు. ఈ కలపడం ద్వారా రోగికి వైద్యం చేయవచ్చు. కానీ, ఈ పని చాలా జాగ్రత్తగా, రోగికి తెలియకుండా చేయాలి. నాష్ తన అనుమతి లేకుండా ఆసుపత్రి పాలు చేశారని రోదించినా, సాధారణంగా అమెరికాలో రోగి అనుమతి లేనిదే ఎటువంటి ట్రీట్మెంటూ కుదరదు. ఇది మన దేశంలోను, మరికొన్ని దేశాల్లోనే సాధ్యం. ఈ సీక్రెట్ వైద్యం సంగతి రోగికి తెలిసిందో, ఇంతే సంగతి!

మన దేశంలో మందులని రోగికి దొంగతనంగా ఇచ్చే వెసులుబాటు వుంది గనుక గగన్ ప్రభాత్‌కి మందులివ్వడానికే నిశ్చయించుకున్నాడు. ఒక రోజు మృగనయనికి కబురుపెట్టి, “మీరు సీక్రెట్‌గా ఏదో చేస్తున్నట్టు ప్రభాత్‌కి అనుమానం వస్తే, అందరి మీదా ఉండే అనుమానాలూ మీ మీద కూడా ఆపాదింపబడతాయి. ఆయనకి తెలియకుండా మేనేజ్ చేయండి. ప్రతీనెలా మీ వారిని ఎక్కడో అక్కడ కలిసే ఏర్పాటు చేయండి. అప్పుడు మందుల్లోనూ, వాటి మోతాదులోనూ మార్పులు-చేర్పులు చెప్తాను”, అని ముగించాడు.

***

మొదటి నెలలో మృగనయని, వాళ్ళాయనకి తు.చ. తప్పకుండా మందులు ఇచ్చినట్టుంది, ప్రభాత్‌లో మంచి మార్పు వచ్చింది. గగన్ మందుల మోతాదు తగ్గించాడు. ఎందుకంటే, వాటిని చటుక్కున మానెయ్యకూడదు కనుక. అయినా, అతని వ్యాధికుండే తీవ్రతను బట్టి మందులాపే ప్రసక్తి ఉండదని అనుకున్నాడు. కానీ, ఈ విషయం ఆమెకు ముందుగా చెప్తే, ఆమె నీరుగారిపోయి, మందుల్ని శ్రద్ధగా ఇవ్వకపోవచ్చు కూడా. అందుకే, ఆ విషయం తనలోనే దాచుకున్నాడు గగన్.

రెండో నెలలో ప్రభాత్ ఆరోగ్యం క్షీణించినట్టు అనిపించింది గగన్‌కి. “మొత్తం ఆరు రోజులు ఆయనకి మందులివ్వలేకపోయాను. రెండున్నర రోజులు ఆయన టూర్లో ఉన్నారు. మరో మూడు పూటలు మా ఇంటికి డిన్నర్‌కి గెస్టులొచ్చారు. మిగిలిన రోజుల్లో టేబుల్ ఎరేంజ్ చేసేటప్పుడు ఆయన నా పక్కనే ఉన్నారండీ.. నిస్సహాయురాలిగా ఉండిపోయాను”, బాధగా చెప్పింది మృగనయని.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here