మార్పు మన(సు)తోనే మొదలు-6

0
8

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[మానసిక సేవికగా పనిచేస్తున్న మల్లిక ఆ ఊర్లో ఒక రిటార్డేషన్ కేసుని గుర్తించి డాక్టర్ గగన్ వద్దకు వచ్చి చెబుతుంది. వాళ్ళు వేరే చోటి నుంచి వచ్చారంటూ కేసు కాగితాలు గగన్‍కి ఇస్తుంది. గతంలో మానసిక రోగి అయిన మల్లికకి తాను చేసిన సాయాన్ని గుర్తు చేసుకుంటాడు డా. గగన్. మల్లిక అన్నయ్య మధు కోరిక మేరకు ఆమెను డా. గోవర్ధన్ వద్దకు పంపుతాడు. గోవర్ధన్ చేసిన చికిత్సకి కోలుకుంటుంది మల్లిక. ఆపై రెండేళ్ళ తరువాత ఆ ఊరిలోనే మానసిక సేవికగా చేరుతుంది మల్లిక. తనకి మల్లిక అందించిన వివరాల ప్రకారం బుద్ధిమాంద్యం ఉన్న జమీందారు గారి చిన్న కొడుకు – ‘చిన భూపతి’ని చూడడానికి వెళ్తాడు గగన్. తాను ఆ కుర్రాడికి చికిత్స చేస్తానని అంటే, పాలెస్‌కే వచ్చి చికిత్స చేయాలని చెప్తుంది జమీందారుగారి పెద్ద కోడలు. కొన్నాళ్ళు సాఫీగా సాగిన చికిత్స – వివిధ కారణాల వల్ల కుంటుబడుతుంది. మల్లిక ముందుకొచ్చి చిన భూపతి చికిత్స పర్యవేక్షణ బాధ్యత తాను తీసుకుంటానని గగన్‌తో అంటుంది. అయితే ఓ రోజు తాను చిన భూపతిని ఇష్టపడుతున్నట్లు గగన్‍తో చెబుతుంది మల్లిక. ఆరోజే చిన భూపతిని ఇంట్లో వాళ్ళు వేరే ఊరు పంపేశామని చెప్తారు. మధు ఆ ఊరు వెళ్ళి కనుక్కుంటే, చిన భూపతి జాడ దొరకదు. గగన్, మల్లిక వెళ్ళి పోలీస్ కంప్లయింట్ ఇస్తారు. ఇన్‌స్పెక్టర్ భరత్ విచారిస్తే, ఆ అబ్బాయి విషయం తమకేమీ తెలియదని దబాయిస్తారు ఇంట్లో వాళ్ళు. వాళ్ళు సంఘంలో పెద్ద మనుషులనీ, సరైన ఆధారాల్లేకుండా అరెస్ట్ చేయలేమని, ఇంటరాగేషన్ మాత్రం చేయవచ్చని అంటాడు భరత్. – ఇక చదవండి.]

[dropcap]“మొ[/dropcap]దటి సక్సెస్.. డాక్టర్.. వాళ్ళని కాస్త అదిలించేసరికి ‘ఏనుగుని చూతువు రా’, అని, అతణ్ణి ఒక అడవి ప్రదేశంలో వదిలి పెట్టినట్టు చెప్పారు. అక్కడికి జమీందారు గారి మనిషిని తీసుకుని వెళ్ళమని మా వాళ్ళతో చెప్పాను. త్వరలోనే ఈ చిక్కు ముడి విడవచ్చు”, అన్నాడు భరత్, గగన్ ఉండే ఆసుపత్రికి వచ్చి. గగన్ సంతోషిస్తూండగా, ఒక వార్డ్ బాయ్ వచ్చి, “సార్, మీ పక్కింటాయన, ఫారెస్టాఫీసర్‌తో కలిసి ఒకబ్బాయిని తెచ్చారండీ!” అన్నాడు.

వెనువెంటనే వెళ్ళిన గగన్‌కి కనబడ్డది, అమాయకుడైన చిన భూపతి మొహం! “అడవిలో స్పృహ తప్పి పడిపోయి, ఫారెస్ట్ గార్డ్‌కి దొరికాడితను. ఆ సమయంలో అక్కడే ఉన్న నా ఫ్రెండ్ ప్రభాత్ అలవాటు ప్రకారం మీ దగ్గరకి తీసుకుని వెళ్దామన్నాడు”, అన్నాడు ఫారెస్ట్ ఆఫీసర్. “నాకు మీ కన్నా శ్రేయోభిలాషి ఇంకెవరున్నారు?” అన్నాడు ప్రభాత్. “అసలు, నేనిక్కడుంటానని మీకెలా తెలుసు?” అడిగాడు గగన్. “అరెరే, ఊర్లో అందరూ నన్ను ‘పిచ్చి డాక్టర్ పక్కింటాయన’ అంటారు లెండి”, జవాబిచ్చాడు ప్రభాత్. ఇప్పుడు ఆశ్చర్యపోవడం గగన్ వంతయ్యింది. అయినా, ప్రభాత్ తనని అనుమానించనందుకు సంతోషించాడు.

***

చిన భూపతిని ఆసుపత్రిలో చేర్పించే బాధ్యత మధు తీసుకున్నాడు. నీరసం తగ్గే వరకూ చిన భూపతిని ప్రభాత్ వాళ్ళింట్లో ఉంచాడు గగన్. అతను కోలుకునేసరికి మళ్ళీ తర్జనభర్జనలు మొదలు. చూస్తూ చూస్తూ అతణ్ణి ఆ కసాయి వాళ్ళకి అప్పజెప్ప బుద్ధి కాలేదు అతనికి. చట్ట ప్రకారం ఆ దుష్టులు గార్డియన్లు గనుక, వాళ్ళతన్ని తీసుకుపోయి, ఏమైనా చేయచ్చు.

***

అడ్వకేట్ జాయ్ భృకుటి ముడి వేసి కేసుకి సంబంధించిన కాగితాలని, లా పుస్తకాలని మళ్ళీ, మళ్ళీ చదవసాగాడు. అంతలో అక్కడికి ఒక నడివయస్కుడు వచ్చాడు. “రండి సుబ్బారావు గారూ, మీ అమ్మాయి కాపురం చల్లగా ఉంటుంది. మీరు ఆ విషయాన్ని నాకొదిలేశారుగా! ఈ కాలంలో స్కిజోఫ్రేనియా వల్ల విడాకులు తీసుకోవడం కుదరని పని! సో, ఇంక నిశ్చింతగా ఉండండి”, అని కొన్ని కాగితాలు చూపించి, వాటిని విశదీకరించి, సుబ్బారావుని పంపించేశాడు.

“హలో జాయ్, హౌ ఆర్ యూ”, అడిగాడు భరత్. కుశల ప్రశ్నలు వేశాక గగన్‌ని పరిచయం చేసి, వాళ్ళొచ్చిన పని చెప్పాడు. అతను కాస్సేపు ఆలోచించి, “మీ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం చిన భూపతి రిటార్డెడ్ అని నిరూపించవచ్చు.

నెక్స్ట్, పోలీస్ కంప్లైంట్ ప్రకారం అతను మొక్కు తీర్చుకునేందుకు ఊరు వెళ్ళలేదని, తన సవతి అన్నయ్య, వదినల ప్రమేయంతో అడవిలో విడువబడ్డాడని చెప్పొచ్చు. వాళ్ళు మాట మార్చినా, ఫారెస్ట్ ఆఫీసర్ వాఙ్మూలం మనకి హెల్ప్ చేస్తుంది.

ఫైనల్లీ, వాళ్ళ దగ్గర ఉంచడం వల్ల భూపతి ప్రాణానికి ముప్పు వాటిల్లుతుందని మనం నిరూపించవచ్చు. అతని ఖర్చుల కోసం కొంత సొమ్ము కూడా రాబట్ట వచ్చు”, అన్నాడు.

ఆంతవరకూ మౌనంగా ఉన్న మల్లిక, “భరణాలూ, ఆభరణాలూ నాకేం వద్దు. చినబాబు గారితో పెళ్ళి చేయిస్తే చాలు”, అంది.

“సినీమాల్లో చూసి నీకీ ఐడియా వచ్చిందా? చూడమ్మా, ఒకటి, జీవితం మూడు గంటల్లో అయ్యేది కాదు. ఈ అబ్బాయికి ఎంత నయమౌతుందో ఎవరూ చెప్పలేరు. నేను కూడా! ఆ మూడ్ స్వింగ్స్, ఇన్‌కన్సిస్టెంట్ ప్రవర్తన భరించడం చాలా కష్టం. పిల్లలు పుడితే వాళ్ళు రకరకాల వైకల్యాలకి లోనవచ్చు. ఇదంతా చెప్పడం డాక్టర్‌గా నా బాధ్యత. అర్థమౌతోందా? ఎక్కడైనా డాక్టర్ పేషంట్‌ని పెళ్ళి చేసుకోవడం చూశావా, సినీమాల్లో తప్ప?” నిష్కర్షగా అడిగాడు గగన్.

“నేను రేపు జవాబు చెప్తాను. నా ప్రేమ ఆకర్షణ కాదని మీకే అర్థమవుతుంది”, ప్రసన్నంగా అంది మల్లిక.

***

మరునాడు..

“నేను అతణ్ణే పెళ్ళి చేసుకుంటాను. ఇద్దరం మేజర్లమే. పిల్లల్ని కనకుండా నేను ఉండగలను. నాకు కావలసినది ఆయన మేలు మాత్రమే!” అని ఖచ్చితంగా చెప్పేసింది మల్లిక.

“భారత చట్ట ప్రకారం అతడితో నీ పెళ్ళి చెల్లదమ్మా”, అన్నాడు జాయ్. “వాళ్ళు మీ మీద కేసు వేసి, ఆస్తి కోసం నాటకమాడుతున్నారని ఆరోపిస్తే మళ్ళీ మొదటికొస్తుంది వ్యవహారం”, అని వివరాలిచ్చాడు.

“వాళ్ళకి తిరిగి అప్పగిస్తే మళ్ళీ వాళ్ళు ఆయనపై అఘాయిత్యం చేయరని ఏమిటి గ్యారంటీ?” ప్రశ్నించింది మల్లిక. జాయ్ ఆలోచించి, “కేసు వెయ్యాల్సిందే! ఏమౌతుందో చూద్దాం”, అన్నాడు.

***

మతి స్థిమితం లేని వారసుణ్ణి చూసుకోమని మరో కోర్టు వారు ఇచ్చిన తీర్పుని గౌరవించడం లేదని జమీందార్ కొడుకు, కోడలుపై వ్యాజ్యం వేశారు గగన్, మధులు. వాద ప్రతివాదాలను విన్న తరువాత, మల్లిక జడ్జి గారితో ఏదో విన్నవించుకుంటానని చెప్పింది.

ఆయన సరేనన్నాక, ఆమె, “చట్టాలు అయిన వాళ్ళకే బాధ్యతనివ్వచ్చు. అవే చట్టాలు, చినబాబుగారికి పెళ్ళి హక్కు లేదనీ చెప్పొచ్చు. కానీ, జీవించే హక్కు ఆయనకుందిగా? బంధువులు రాబందుల్లా పీక్కు తినబోతుంటే, ఆయన్ని ఎవరు చూసుకుంటారు? నేను చేస్తానా పని, అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.

నా పేర రెండెకరాల కొబ్బరి తోటలున్నాయి. వాటిని కౌలుకిచ్చుకుని, ఆ డబ్బుతోను, ‘మానసిక సేవిక’గా నాకు వచ్చే జీతంతోనూ ఆయన్ని పోషించుకోగలను. ఆయన మందులు సర్కారు వారి దయవల్ల ఉచితంగా లభిస్తాయి. జమిందారీ ఆస్తి నాకొద్దు. అవసరమైతే, వ్రాతపూర్వకంగా ఇవ్వగలను.

మరో ముఖ్యమైన విషయం- నేనొకప్పుడు మానసిక రోగినే! అందువల్ల, ఒక మానసిక రోగి చెప్పడం చేతకాక మనసులో బాధపడే విషయాలు కోకొల్లలు, అని నాకు తెలుసు. ఈయనైతే ఒక చంటి పిల్లాడు- అంతే! నేను తల్లినవాలని ఆశపడకుండా ఆయనని తల్లిలా చూసుకోగలను.

ఇద్దరం కలిసి ఒకే చూరు కింద ఉండాలంటే సంఘం ఆమోదించాలిగా! అందుకే, మా పెళ్ళికి ఆమోద ముద్ర వేయమని కోరుతున్నాను సార్.. అదే.. యువర్ ఆనర్..” కళ్ళు తుడుచుకుంటూ విన్నవించుకుంది మల్లిక.

మరి కొన్నాళ్ళకి.. మల్లిక కల నిజమాయెను, కోరిక తీరెను.. కోర్టు వారు తన విన్నపాన్ని మన్నించి, వాళ్ళ పెళ్ళికి అనుమతించారు.

***

“డాక్టర్ గారూ, మీతో మాట్లాడ్డానికి సమయం ఇవ్వండి”, అని అడిగాడు ప్రభాత్. గగన్ అతణ్ణి పరీక్షగా చూశాడు. ఇప్పుడు మొహంలో చాలా మార్పు కనిపిస్తోంది. ఆ అనుమానపు చూపులు లేవు; మాటల్లో కరుకుదనం లేదు. ఆత్మ విశ్వాసం ఉట్టిపడుతోంది.

దొంగతనంగా తానిచ్చిన మందు, రోగి ముఖతః చేయమన్న యోగా, ధ్యానం, ముఖ్యంగా తనపై ప్రభాత్‌కి ఉన్న నమ్మకం- వెరసి ప్రభాత్‌ని ఇంచుమించు మామూలు మనిషిని చేశాయి. మందులు మాత్రం ఆపడం కుదరదు. బీపీ పేషెంట్లు, షుగర్ పేషెంట్లూ జీవితాంతం మందు మింగినట్టు, స్కిజోఫ్రేనియా పేషెంట్లు కూడా ఒక అల్పపు డోస్ వేసుకోవాలి. పూర్తి స్పృహతో రోగి మందు వేసుకుంటే ఉండే గుణం, దొంగతనంగా ఇస్తే ఉండదు. ఈ పేషెంట్ ఎలాగో ఒకలా గుణమయ్యాడని సంతోషించాలి, అనుకున్నాడు గగన్.

మల్లిక మారాలనుకున్న సమయం, ప్రభాత్ ఆ ఊరికి వచ్చిన సమయం ఒక్కటే! ఆమె ఇప్పుడు మానసిక సేవిక అయ్యిందంటే ఓ నాలుగేళ్ళు కనీసం అయినట్టు. రోజులెంత త్వరగా గడిచిపోతున్నాయో, అనుకుని, నవ్వుకున్నాడు గగన్.

ఇరువురూ సాయంకాలపు చల్లని గాలి వాళ్ళని తాకుతుండగా, గగన్ ఇంట్లో ఉన్న లాన్లోని ఉయ్యాల బల్ల మీద కూర్చుని, దగ్గరలో ఉన్న టీపాయ్ మీద పెట్టిన మినప సున్నుండలు, జంతికలు తింటూ మాటలు మొదలెట్టారు. “డాక్టర్, అనుమానం పుట్టి నేను పుట్టానని అనుకునేవాణ్ణి. ఇప్పుడు నాలో నిస్పృహ, నిరాశ ఇసుమంత కూడా లేవు. సంతోషాన్ని నా ఇంటి పేరు చేసుకోవాలని ఉంది. అంతా తమ దయ!” అన్నాడు ప్రభాత్.

“నన్ను మునగ చెట్టెక్కించకండి, ప్రభాత్! ఒక మంచి పొరుగువాడిగా మీతో మెలిగాను. అందులో గొప్పేముంది?” అన్నాడు గగన్. “మీలాంటి శ్రేయోభిలాషులు అన్ని చోట్లా ఉంటే, ఈ దేశంలో చెడు మనడానికి తావే ఉండదు కదా! ఉదాహరణకి నా మాజీ భార్య నాపై హత్యాయత్నం చేసుండేది కాదు కదా! అప్పుడు నాకీ ఏకాకి బతుకూ తప్పేది”, అన్నాడు ఇసుమంత బాధగా!

“ఒక పర్సనల్ విషయం అడగనా?” అడిగాడు గగన్. “ష్యూర్”, జవాబిచ్చాడు ప్రభాత్. “మీరెందుకు మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు?” అడిగాడు గగన్. “నాకు నయని అంటే చాలా ఇష్టం. అమే నాకు ద్రోహం చేయగలిగితే మిగిలిన ఆడవాళ్ళు చేయలేరా? అసలు ఆ జాతి మీదే నాకు నమ్మకం పోయింది గగన్! అందుకే, కూతుర్ని కూడా వద్దనుకున్నాను కదా!” విశదీకరించాడు ప్రభాత్.

మళ్ళీ తనే, “చూశారా, గగన్! ఇదివరకు నేను నయనిని తలచుకుంటే పట్టరాని కోపంతో మండిపోయే వాణ్ణి. ఇప్పుడు చూడండి.. నాలో ఎటువంటి భావమూ లేదు. అంతా మీ వల్ల కాదా, ఏం? థాంక్యూ!” అన్నాడు ప్రభాత్.

“మనం సరదాగా మీ ఆటిట్యూడ్ మీద ఒక టెస్టు పెట్టుకుందామా?” అడిగాడు గగన్. ఔనన్నట్టు తలూపాడు ప్రభాత్. “నేను ఒక రెండు రోజుల పాటు ఊళ్ళో ఉండను. వచ్చినప్పుడే మొదలౌతుంది మన పరీక్ష”, అని సస్పెన్స్‌లో ప్రభాత్‌ని ఉక్కిరిబిక్కిరి చేశాడు గగన్. ప్రభాత్ క్లూ ఇవ్వమని అడిగితే, “ష్ ష్.. వెయిట్ టిల్ ఐ యాం బ్యాక్”, అని ఇంకా ఊరించాడు. ఇద్దరూ భోజనానికి లేచారు.

***

ఊరు నుంచి తిరిగివచ్చిన గగన్, ఇద్దరు మనుషులను వెంట తెచ్చాడు – ఒకరు ఏ‌డీహెచ్‌డీ పేషెంట్, ఆనంద్, మరొకరు అతడి తండ్రి. వాళ్ళని ప్రభాత్ ఇంట్లో దింపి, “వీళ్ళిదరూ కొన్నాళ్ళపాటు మీకు అతిథుల్లా ఉంటారు. ఇదే మీకు పరీక్ష, ప్రభాత్!” అన్నాడు గగన్. ఆనంద్ ఇంకా గుణమవకపోవడానికి కారణముంది. కానీ ఆ విషయం గగన్ ప్రభాత్‌కి చెప్పలేదు.

ప్రభాత్‌ని తన ఇంటికి రమ్మని రిక్వెస్ట్ చేసి, ఏ‌డీహెచ్‌డీ లక్షణాలు, ఆ మానసిక రోగం నుండి బాధపడే వ్యక్తితో ప్రవర్తించవలసిన విధానం, వగైరాలున్న కాగితాలను అతడికిచ్చి, గగన్, “ఈ అబ్బాయి నాకు చిన్నతనం నుండీ తెలుసు. ప్రాబ్లమ్ చైల్డ్. మా శశి వయసువాడు. అతనికి ట్రీట్మెంట్ సరిగ్గా అందాలంటే వాళ్ళ తల్లిదండ్రులు అవసరానికి తగ్గట్టు నడుచుకోవాలి కదా! కానీ, వాళ్ళకంత అవగాహన లేదు. ఆ తండ్రికి కూడా ప్రాబ్లమ్ ఉంది.

ఈ కాగితాల్లో ఉన్న సమాచారాన్ని ఆకళింపు చేసుకుని, వాళ్ళిద్దరి వ్యాధి లక్షణాలని, మీరు రియాక్ట్ అవవలసిన తీరుని ప్రాక్టీస్ చేయండి. ఇదే మీరు కొత్తగా అలవరచుకున్న సహనానికీ, సంతోషానికీ టెస్ట్. ఇదిగో, ఈ డైరీ తీసుకోండి. దీనిలో డేట్లుండవ్.

రోజు వారీగా డేట్లు వేసి, మీ ముగ్గురి మధ్య జరిగిన ముఖ్యమైన విశేషాల వివరాలు రాసుకోండి. ఒక్కొక్కళ్ళ రియాక్షన్స్ కూడా క్లియర్‌గా నోట్ చేయండి. మన ప్రయోగం అయిపోయేసరికి ఈ కాగితాలు తిప్పి చూసుకుంటే, మన ఎదుగుదల ఎంతో మనకే తెలుస్తుంది”, ముగించాడు గగన్.

నవ్వుతూ డైరీ అందుకున్నాడు ప్రభాత్. “ఐ విల్ డూ మై బెస్ట్”, అన్నాడు. గగన్ నవ్వి, “ఐ నో. విష్ యూ అల్ సక్సెస్”, అన్నాడు.

***

“గగన్ గారూ, వీడు నా టీవీ మీదకి పేపర్ వెయిట్ విసిరాడు. స్క్రీన్‌కి చిల్లు పడింది”, ఆదుర్దాగా అరిచాడు ప్రభాత్. “ఆనంద్ విరగ్గొట్టినవాటి లిస్టు కూడా తయారు చేయండి. నేను మీ నష్టం పూడుస్తాను”, కామ్‌గా అన్నాడు గగన్. “ఛ, ఛ.. మీ నుండి తీసుకునేటంత మూర్ఖుడిలా కనిపిస్తున్నానా నేను?” జవాబిచ్చాడు ప్రభాత్.

మరో రోజు ఉదయం, గగన్ ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు, “గగన్ గారూ, ఇవ్వాళ ఆనంద్‌తో నేను కుస్తీలో గెలిచాను”, అని గొప్ప చెప్పుకున్నాడు. “ఇవ్వాళ ఒక్క వస్తువూ విరగలేదు”, అని వివరాలు చెప్పాడు కూడా. గగన్ ఇంకా వివరాల కోసం ఎదురు చూస్తున్నాడని భావించి, “నేను అతనితో ఒక ఒప్పందానికొచ్చాను. రోజూ పొద్దున్నే ఒక కుస్తీ పోటీ నడుస్తుంది. ఎవరు గెలుస్తే, వాళ్ళ మాట చెల్లుతుంది”, అన్నాడు.

ఈలోగా భళ్ళుమని ఒక శబ్దం. “అయ్య బాబోయ్, వీడు మరో వస్తువుకి బొక్కపెట్టాడో ఏవిఁటో”, అని, బండ భాష మాట్లాడుతూ లోపలికి దౌడు తీశాడు ప్రభాత్. ‘ఇంకా చాలా ఉంది’, అనుకుని ఆసుపత్రికి వెళ్ళాడు గగన్. ఆ రోగులని రూల్సు చెప్పి ఒక గిరి గీసి ఆపలేరని తనకు తెలుసు కదా! విషయాలన్నీ చదివినా, మనుషులు మామూలుగా, సర్వసాధారణంగా ప్రవర్తించి, ఖంగు తింటూ ఉంటారు!

***

ప్రభాత్ డైరీ నింపుతున్నాడు. మొదలుపెట్టి కొద్ది రోజులే అయినా, రోజురోజుకీ ఆనంద్‌ని బాగుచేయగలనన్న ఆశ సన్నగిల్లుతోంది. కొత్తకొత్త యుద్ధాలు ప్రతీ రోజూ జరుగుతున్నాయి. ఒకసారి పేజీలు ముందుకీ, వెనక్కీ తిప్పి చదువుకున్నాడు.

తోటపని నేర్పిద్దామని అనుకుంటుంటే, ఆ పిల్లాడు తన కళ్ళలో నిజంగా మట్టి కొట్టాడు. కార్నియా చెడిపోయి గుడ్డివాడైపోతాడేమో అని భయపడ్డాడు తను. దేవుడి దయవల్ల అంతటి ఘోరం జరగలేదు!

వాడికి బొమ్మల పుస్తకాల మీద ఆసక్తి కలిగిద్దామంటే, ఆ రోజు తన స్టడీ టేబుల్ని చిందర వందర చేసి, బుచ్చిబాబు గారి ‘చివరకు మిగిలేది’, నవలని చింపేశాడు. తన జీవితంలో చివరికి మిగిలేది చిరిగిన పుస్తకాలేనా, అని తను బాధపడ్డాడు కూడా.

ఇంకొక రోజు, తను స్నానం చేసి వచ్చేలోపు వాళ్ళ నాన్న ఆనంద్‌ని చితక బాదుతున్నాడు. విషయం కనుక్కుంటే, ఆ తండ్రి, “ఇంత పే.. ద్ద టీయీ సూసే అవకాసం కలిగిందాండి.. ఆడిక్కావులసినప్పుడు నేను ఆడికి ఈ పుడక ఇస్తన్నాను గదండీ.. నేను సూస్తంటే లాక్కున్నాడండీ.. నాకు పిచ్చి కోపమొచ్చింది.. నా బతుకులో ఇట్టాంటియి సూత్తానని కల్లో కూడా అనుకోలేదండి మరి..” అని రెమోట్ కోసం కొట్టినట్టు చెప్పేసరికి తనకి కూడా అదే పిచ్చి కోపమొచ్చినంత పనయ్యింది.

వాడికి నల, భీముల వాసన ఏమైనా ఉంటే, షెఫ్‌గా జీవితాన్ని వెళ్ళబుచ్చవచ్చు అనుకుంటే, కూరలు కాకుండా కత్తితో తన చేతిని గట్టిగా కోసుకున్నాడు. వాణ్ణి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి, కట్టు కట్టించడమే కాకుండా, ఒక ఇంజెక్షన్ కూడా ఇప్పించవలసి వచ్చింది.

ఇవన్నీ చదువుతున్న ప్రభాత్‌కి మెరుపులాంటి ఒక ఆలోచనొచ్చింది. పెదవులు చిరునవ్వు నవ్వాయి. ఎందుకేవిఁటి? ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా తను తన సహనం, సంయమనం కోల్పోలేదు (మొదట్లో నోట్లోంచి వెలువడిన బండ భాష తప్ప). తన జీవితం ఇంచుమించు బాగుపడినట్లే! అలా తనొక్కడూ బాగుంటే సరిపోతుందా? నో, నో! ఆనంద్‌ని, వాళ్ళ నాన్నని కూడా ఇంప్రూవ్ చేయద్దూ? అనుకుని, కర్తవ్యం అర్థం అయినవాడిలా ఫీల్ అయ్యి, హాయిగా పడుక్కున్నాడు.

***

మరుసటి రోజు ఉదయానే లేచి చూస్తే, తండ్రీకొడుకులు అప్పటికే లేచారు. వాళ్ళని పిలిచి, “ఒక ఆటని ఆడుదామా?” అడిగాడు ప్రభాత్. ఫుట్బాల్ తీసి, ఇంట్లో ఉండే ఖాళీస్థలంలో ఒక గోల్ ఏరియాని గీసి, ఆట ప్రారంభించాడు. తను కోరుండి ఓడిపోయి, వాళ్ళ చేత గోల్స్ వేయనిచ్చాడు. వాళ్ళ ఆనందంలో తన సంతోషం చూసుకుని తనూ ఆనందించాడు.

ఆ తరువాత వాళ్ళిద్దరినీ కూర్చోబెట్టి సద్గురువు గారి గైడెడ్ మెడిటేషన్, అది పూర్తయ్యాక ‘నమోస్తుతే సరస్వతి’ అనే భజన పెట్టి, వాళ్ళు కళ్ళు మూసుకుని స్థిరంగా ధ్యానం చేస్తారేమో అని చూశాడు. అనుకున్నంత స్థిరత్వం లేకపోయినా, అనుకున్నంత అలజడి కూడా లేదు. ఇప్పుడు ప్రభాత్‌కి ఇసుమంత నమ్మకం కలిగింది, తను సరైన దారిలో ఉన్నాడని. వాళ్ళిద్దరి మానసిక ఆరోగ్యమూ మెరుగౌతుందన్న ఆశ, తన మనసులో చిగురించింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here