మార్పు మన(సు)తోనే మొదలు-8

0
9

[ప్రసిద్ధ రచయిత్రి డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి రచించిన ‘మార్పు మన(సు)తోనే మొదలు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము. తెలుగులో మానసిక ఆరోగ్యం కేంద్రంగా రచించిన నవల ఇది.]

[ఔట్‌రీచ్‌లో ఉన్న గగన్‌కి మరో కొత్త అడిక్షన్ కేసు దొరుకుతుంది. అతనో విద్యావంతుడు, మాజీ క్రీడాకారుడు. ఆను నిరూప్, వెయిట్‍లిఫ్టర్. గగన్ స్కూల్‍కి వెళ్ళే వయసులో ఉండగా నిరూప్ గురించి పేపర్లలో చదివేవాడు. పేదరికం నుంచి వచ్చినా, గొప్ప ఛాంపియన్ అవుతాడు నిరూప్. అవన్నీ గుర్తు చేసుకున్న గగన్ తాను అతని అభిమానినని నిరూప్‍తో అంటాడు. చికిత్సకి ముందు జరిగిన సంభాషణలో – తనకు జరిగిన అన్యాయాన్ని గగన్‍కి వివరిస్తాడు నిరూప్. చేయని తప్పుకు బలై పోయి, తాగుడుకి బానిస అయిన వైనాన్ని వెల్లడిస్తాడు. తన చెల్లెలు బలవంతం మీద డీ-అడిక్షన్ సెంటర్‍కి వచ్చాననీ, తాను మారితే గాని తన చెల్లెలు పెళ్ళి చేసుకోనంటోందని చెప్తాడు. నిరూప్‍కి ట్రీట్‍మెంట్ మొదలుపెడతాడు గగన్. తాగాలని అనిపించినప్పుడల్లా ఏదైనా మంచిపనిపైకి మనసు మళ్ళించమన్నాడు. అక్కడున్న ఆనంద్‍తో చిన్నగా కుస్తీలు పడుతూ, ఆనంద్‍కి, అతని తండ్రికి దగ్గరవుతాడు నిరూప్. వాళ్లందరికీ మందులు ఇయ్యడంతో పాటు శారీరిక శ్రమ కలిగించే తోట పని లాంటి చిన్న చిన్న పనులు అప్పజెప్తాడు గగన్. క్రమంగా, నిరూప్, ఆనంద్, ఆనంద్ తండ్రిలొ మార్పు వస్తుంది. గగన్‍ మాగ్‍సేసే పురస్కారానికి ఎంపికయనట్లు వార్త వస్తుంది. తన స్నేహితుడి కొడుకు దివిజ్‌కి అమెరికాలో ఒక పెట్టుబడుల బ్యాంకులో ఉద్యోగం వచ్చిందని తెలిసి ఆ అబ్బాయికి కొన్ని జాగ్రత్తలు చెప్తాడు. గగన్ భార్య పూర్ణిమ విసుక్కుంటుంది. అప్పుడు – అమెరికాలో భార్యాబిడ్డలని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడి ఉదంతం భార్యకి చెప్తాడు, అందుకే దివిజ్‌ని జాగ్రత్తలు తీసుకోమన్నానని అంటాడు. అప్పుడు తనకి వచ్చిన ఓ మెసేజ్ గురించి చెప్తుంది పూర్ణిమ. ఇంజనీర్ అయిన తన మిత్రుడి కొడుకు – క్యాంపస్ ఇంటర్వ్యూలలో విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడని చెపుతుంది. ఇద్దరూ బాధపడతారు. పిల్లలపై ఒత్తిడి పెంచకుండా, వాళ్ళలో ప్రతిభని పట్టి వాళ్ళు ఎదగాలని అనుకున్న రంగంలో తల్లిదండ్రులు ప్రోత్సహించాలని చెప్తాడు గగన్. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుండగ, ఆ మాటలని అంగీకరిస్తుంది పూర్ణిమ. – ఇక చదవండి.]

[dropcap]“హే[/dropcap] గగన్, మా ఫ్రెండ్ అమిత గురించి నేను చెప్పేదాన్ని గుర్తుందా?” అని ఉత్సాహంగా అడిగింది పూర్ణిమ. “ఎవరూ, ఆ పర్ఫెక్షనిస్టేనా?” ఆలోచిస్తూ అన్నాడు గగన్. ఆమె, “యెస్. తనే! ఆమె చేసే కృషికి తగ్గట్టుగా ఆమెకు ‘సూపర్ ఉమన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇస్తున్నారు అంది. “ఎందుకో కాస్త అర్థం అయ్యేటట్టు చెప్పు”, అన్నాడు గగన్.

“ఇది కార్పొరేట్ సెక్టార్లో పని చేసే మహిళలలో ఒకళ్ళకి ఇస్తారు. ఉన్నత స్థానంలో ఉంటూ కూడా ఇంటినీ, ఆఫీసునీ సమతూకంగా మేనేజ్ చేసే స్త్రీకి ఈ ఉన్నతమైన అవార్డునిస్తారు. నా ఫ్రెండ్‌కి వచ్చిందంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎగిరి గంతు వేయాలని ఉంది”, అని ఇంచుమించు ఆ పని చేసినట్టే అంది పూర్ణిమ.

“అంతగా సంతోషంగా ఉంటే వేసేయ్. నీ ఫిట్నెస్ మీద నాకు నమ్మకం ఉంది లేవోయ్”, నవ్వుతూ అన్నాడు గగన్. “యూ”, అంటూ నవ్వుతూ, ‘ఇంతకీ తన నెంబర్ నా దగ్గర ఉందా లేదా’, అని ఫోన్‌ని స్వైప్ చేసింది. ‘ప్చ్.. అవసరానికి కనిపించదు కదా’, అనుకుంటూ లోపలికి వెళ్ళింది పూర్ణిమ.

***

ఒక రోజు న్యూస్‌పేపర్‌లో ఒక పాంఫ్లెట్ వచ్చింది. గగన్ వాళ్ళ ఊళ్ళో ఒక పబ్ పెడుతున్నారట! అతని మనసు చివుక్కుమంది. ఉన్న జనాలకే మానసిక ఆరోగ్యపు సేవలు అందట్లేదు. ఇప్పుడు ఈ పిచ్చిలో పడి ఎంత మంది కొత్త తాగుబోతులు తయారవబోతున్నారో, అని మనసులో మథనపడ్డాడు గగన్. ఈ రోజుల్లో ఏ చెత్త పని చేసినా ఫ్యాషన్ అని ఫీల్ అయిపోవడం కామన్ అయిపోయింది కదా!

***

నిరూప్ వచ్చి గగన్ ముందు కూర్చున్నాడు. గగన్ ఏవో కాగితాలు తదేక దృష్టితో చదువుతున్నాడు. ఏం కావాలి, అన్నట్టు కనుబొమ్మలు ఎగరేసి సైగ చేశాడు. అతనొక న్యూస్‌పేపర్‌ కటింగ్ చూపించాడు. అందులో, ఆ ఊరిలోని పబ్‌లో బౌన్సర్‌గా పనిచేసేందుకు దృఢకాయులైన పురుషులు కావాలి, అన్న విషయం ఉంది. గగన్ మళ్ళీ తన కాగితాల్లోకి తల దూర్చాడు.

నిరూప్‌కి సహనం నశిస్తోంది. ఎంతకాలమని ఇలా కూర్చుంటాడు? డాక్టర్ గారు బిజీగా ఉన్నారంటే, ఇంటికెళ్ళి మొక్కలకి నీరు పెట్టడమో, మట్టి బిగుసుకుపోయిన చోట గొప్పులు తవ్వడమో చేసుకోవచ్చు, అనుకున్నాడు. ఈ నిరీక్షణ వల్ల టైమ్ వేస్ట్ తప్ప మరేమీ జరగట్లేదు, అని పరిస్థితులని మనసులో తిట్టుకుంటున్నాడు.

తన మనోవ్యథ ఎరిగిన వాడిలా, “ఊ, క్రికెట్ మ్యాచ్లో ఉండే బౌన్సర్‌కీ, పబ్‌కీ ఏమిటి సంబంధం?” అన్నాడు గగన్. “డాక్టర్ గారూ, అదీ, అదీ, అదీ”, అని నీళ్ళు నమిలాడు నిరూప్. గగన్ మనసులో సంతోషించాడు. తను పైకి కనబరిచే అయిష్టత వల్ల నిరూప్ మనసు మార్చుకోవచ్చు. ఆ దిశగా కృషి చేస్తున్నాడు తను. “అంటే, సంబంధం లేదా?” అతని మీద మానసిక వత్తిడి తీసుకు వస్తున్నాడు గగన్.

“గట్టిగా చెప్పాలంటే, ఈ రెండు బౌన్సర్లకీ సంబంధం లేదు సర్. క్రికెట్లో అయితే బాట్స్మన్ భుజానికన్నా ఎత్తున వచ్చే బంతిని బౌన్సర్ అంటారు. పబ్‌కి ఆడా, మగా అంతా వస్తారు కదండీ”, అని చెప్పబోతుంటే గగన్ అడ్డు తగిలి, “ఆ, వస్తే?” అన్నాడు. “వాళ్ళెవరైనా మత్తులో పబ్‌లోని వస్తువులను విరగ్గొట్టినా, ఇంకేమైనా చేసినా, చేయ జూసినా, వాళ్ళని నియంత్రించేందుకు బలశాలులైన మగవాళ్ళు కావాలి కదండీ, ఆ పోస్టుకి అప్లై చేద్దామని”, ముగించాడు నిరూప్. “పబ్ వాళ్ళ ఆస్తిపాస్తులు మాత్రమే కాపాడతావా?” ప్రశ్నించాడు గగన్. “నాకు అర్థం కాలేదు”, అన్నాడు నిరూప్.

“పబ్‌కి వచ్చే ఆడవాళ్ళని లోకువ కట్టే పురుషాహంకారులు ఉన్న దేశం మనది. గుర్తు లేదూ, కొన్నాళ్ళ క్రితం గౌహతీలో ఒకమ్మాయి పబ్ నుండి బయటకు రాగానే ఆమెను దారి తప్పిన మనిషి కింద జమకట్టి, ఆమెను ఒక మగ మృగ సమూహం పరిహసించబోయింది. అదేదో మహత్కార్యమన్నట్టు దానికి ఒక వీడియో కూడా ఉండేది. అదృష్టవశాత్తు ఆమెకి ఏమీ జరగలేదు గానీ, మన దేశంలో మగ బుద్ధి ఇలాగే ఉంటుంది.

“అలాంటిది, ఇలాంటి వెనుకబడిన ప్రదేశంలో పబ్ పెడితే, మగ బుద్ధి వెర్రితలలు వేయదూ? ఎవరైనా అమ్మాయి దురాత్ముల పాలపడితే, రక్షించగలరా?” సూటిగా అడిగాడు గగన్. నిరూప్ తొణక్కుండా, “నేను ఒకప్పుడు తాగుబోతునే గానీ, ఎప్పుడూ కూడా లూస్ కారెక్టర్ ఉన్న వాణ్ణి కాను సార్. స్త్రీలను గౌరవిస్తాను. అందుకే, మా చెల్లి మాట చెల్లించడానికి మీ దగ్గరకి వచ్చాను. మరచిపోయారా?” అని అన్నాడు. ఈ మాట గగన్‌కి నచ్చింది.

“మీకు ఆ దేహ దారుఢ్యం ఉందని ఏమిటి గ్యారంటీ?” ప్రశ్నించాడు గగన్. “డాక్టర్ గారూ, రోజూ ఆనంద్‌తో కుస్తీ పడతాను”, జవాబిచ్చాడు నిరూప్. “ఆనంద్‌తో పట్టడం, ఆ ఒళ్ళు బలిసున్న వాళ్ళతో పట్టడం ఒకటేనా?” గగన్ ఇంకా వదిలే మూడ్‌లో లేడు.

“ఊహూఁ కాదండీ! ఒకరు తనపై అవగాహన లేదు గనుక అంతర్గతంగా ఉన్న అల్లకల్లోలం తట్టుకోలేక కుస్తీ పడుతున్నారు; మరొకరు ఒంటి మీద స్పృహని కావాలని కోల్పోయి, రచ్చ చేస్తున్నారు. బట్, ఆనంద్ చేసే చేష్టల్లో ఎనర్జీ రిలీజ్ ఉంది డాక్టర్ గారూ! అందుకే, అతనితో కుస్తీ పట్టడమే కష్టం”, విడమర్చి చెప్పాడు నిరూప్.

గగన్ మొహంలో ఓ చిరునవ్వు పూసింది. “గుడ్. కానీ, పబ్ అంటే మద్యం ఏరులా ప్రవహించే చోటు కదా! మీకు మళ్ళీ టెంటేషన్ వస్తేనో?” అనుమానం వ్యక్తం చేశాడు గగన్. “మనసుని మనం అనుకున్న విషయాల కన్నా మంచి వాటి మీద లగ్నం చేసుకుంటే తాగాలనే తింగరి ఆలోచన రానే రాదు సార్. పైగా, నేనింకా మందులు పుచ్చుకుంటూనే ఉన్నాను. ఒక్క డోస్ కూడా మిస్ అవలేదు. అందుకని, నా గురించి మీరు బెంగ పెట్టుకోకండి.

ఫైనల్లీ, నాకు ఇక్కడ బాగున్నంత మాత్రాన ఎంత కాలం ఒక పరాన్నభుక్కులా ఉంటాను చెప్పండి?” అన్నాడు నిరూప్. “అంటే, మీరు డబ్బులిచ్చేస్తే, మీతో ఎటువంటి సంబంధమూ లేని ప్రభాత్ గారి ఋణం తీరిపోతుందా?” అడిగాడు గగన్.

నాలుక కరచుకున్నంత పని చేసి, నిరూప్, “అయ్యో, ఎంత మాట! డాక్టర్ గారూ, నాకు ఉద్యోగం చేయాలని ఉంది. ‘ఉద్యోగం పురుష లక్షణం’ అని అన్నారు కదండీ! ఆ మాట అన్నాను గనుక నాపై ‘లింగ వివక్ష’ అభియోగం మోపకండి. నా మనసుకి, అంతరాత్మకి సంబంధించినంత వరకూ ‘నేను ప్రయోజకుణ్ణే, పనికి మాలిన వాణ్ణి ఎంత మాత్రమూ కాను’, అని అనిపించుకోవడానికే ఈ తంటాలంతా!

పెద్ద ఉద్యోగం చెయ్యాలి అనుకోవడానికి నేనేమైనా పెద్ద చదువులు చదివాను గనుకనా? చదువుకోని వాడికి ఇంతకన్నా పెద్ద ఉద్యోగం ఎవరిస్తారు?” ముగించాడు నిరూప్.

గగన్ దీర్ఘాలోచనలో మునిగిపోయాడు, నిరూప్ గురించే! నిరూప్ ఆలోచనావళి ఇప్పుడు చాలా లోతుగా, స్పష్టంగా ఉంది. అంటే, అతను చాలా చాలా ఇంప్రూవ్ అయినట్టు. కానీ చాలా మంది మందు బాబులు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన కొన్నాళ్ళకే మంచి నీళ్ళకి బదులు మందు నీళ్ళ కోసం ఎగబడుతారన్నది నిరూపింపబడిన నిజం.

వరుసగా కనీసం ఒక ఏడాది మందుకి దూరంగా ఉంటేనే నిగ్రహ శక్తి పెరుగుతుందని కూడా కొన్ని పరిశోధనలు నొక్కి వక్కాణిస్తున్నాయి. కానీ, నిరూప్ ఈ ట్రీట్మెంట్ మొదలెట్టి కేవలం నాలుగు నెలలే అయ్యింది.

వెనుకటికి చాణక్యుడు కోశాగారం వద్ద పని చేసే ఉద్యోగులు డబ్బుని కాజేసే అవకాశం ఎక్కువని చెప్తూ, ‘నీటిలో ఈదే చేపలు నీటిని తాగకుండా ఉంటాయా’, అనే పోలిక చెప్పాడు. నిరూప్ విషయంలో కూడా అది నిజం కావచ్చు. అదే గగన్ దీర్ఘాలోచనకి, తటపటాయింపుకీ కారణం.

‘శంఖంలో పోస్తే గానీ తీర్థం కానట్టు’, మొత్తానికి ఎలాగో అలాగ తన మాటకి గగన్ చేత ‘మమ’ అనిపించేసుకున్నాడు నిరూప్.

***

“ఈ ఆదివారం మనింటికి స్పెషల్ గెస్ట్‌లు రాబోతున్నారోచ్”, ఉత్సాహం ఉరకలు వేస్తుంటే చెప్పింది పూర్ణిమ. మంచి మూడ్‌లో ఉన్నాడేమో, గగన్ ‘తెలుగు వీర లేవరా’ పాటకి పారడీగా, ‘ఎవడు వాడు, ఎచటి వాడు, ఇటు వచ్చే గెస్టుగాడు’, అని పాడాడు. “పాట బాగానే ఉంది గానీ, గెస్ట్‌లకి మర్యాద ఇవ్వద్దూ?” అంది పూర్ణిమ. మళ్ళీ తనే, “ది గ్రేట్ సూపర్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ – అమిత, విత్ ఫ్యామిలీ. టట్టడాఁయ్”, అని వాణిజ్య ప్రకటనలా చెప్పింది.

“తన ఫోన్ నెంబర్ కోసం ఎంత కష్టపడ్డానో తెలుసా? ముగ్గురు ఫ్రెండ్స్‌ని అడగాల్సి వచ్చింది. వాళ్ళు వాళ్ళ కబుర్లతో పిడకల వేటకు తీసుకెళ్ళారు కూడాను. ఇల్లు అలుకుతున్న ఈగలా నేను ఎందుకు ఫోన్ చేశానో మరచిపోతాననుకున్నాను. అదేమిటీ, నేను మా అమ్మలా సామెతలు తెగ ఉపయోగించేస్తున్నాను?

మరో విషయం. తనకి ఇప్పటికీ మన పిండి వంటలంటే మహా ఇష్టమట! పొట్లకాయ-తెలకపిండి కూర డిసైడెడ్. స్కూల్లో తనకి కూడా ఇంకో డబ్బాలో ప్యాక్ చేసేది మా అమ్మ. అంటే, తనకి ఆ కూరంటే అంత పిచ్చి. ఇంకా ఎవరికి ఏం కావాలో చెప్పండి. శశీ, ఒరేయ్ రవివర్మా, నీకేం కావలిరా?” అంటూ మూడు రోజుల ముందు నుండీ హడావుడి మొదలెట్టేసింది పూర్ణిమ.

“నాకు పోలి బూర్లు కావాలి”, అని వాడు గొంతెమ్మ కోరిక కోరాడు. గగన్ పనసపొట్టు కూర కోరాడు. “వాళ్ళ వాళ్ళకి ఏదిష్టమో కనుక్కున్నావా?” అడిగాడు గగన్. “చీఫ్ గెస్ట్ గారి ఫేవరెట్స్‌కి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది”, నిష్కర్షగా చెప్పేసింది పూర్ణిమ.

ఇవి కాకుండా కంద-బచ్చలి కలయికతో కూర, చారు, సాంబారు అన్ని చోట్లా దొరుకుతాయని బెల్లం, కూర ముక్కల పులుసు, ముద్దపప్పు, గోంగూర పచ్చడి – వీటన్నిటితో పూర్ణిమ డైనింగ్ టేబుల్ విశేష అతిథులకి స్వాగతం చెప్పడానికి రెడీగా ఉంది.

ఒంటి గంటన్నరకి సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ, భర్త, పిల్లలు లేకుండా ఒక్కతే వచ్చింది అమిత. వచ్చిన అవార్డుకి ఆమె మొహం వెలిగిపోతుందనుకుంటే, కళ్ళు నీరసంగాను, వాటి చుట్టూ నల్లని వలయాలతోనూ ఉన్నాయి. వెరసి ఆమె ఒక పేషెంట్‌లా ఉంది. వాళ్ళు అడిగేలోపే, “క్షమించాలి. మా వారికి ఏదో ఆఫీసు పని పడింది. ట్రబుల్ షూటింగ్‌కి వెళ్ళారు. పిల్లల ఫ్రెండ్స్ స్లీపోవర్‌కి వస్తారట. ఎవరో ఒకళ్ళు వస్తే తప్ప మా వాళ్ళు వాళ్ళ గదులు క్లీన్ చేయరులే”, అంది అమిత.

ఆమె మనసుని నొప్పించకుండా, ఎటువంటి చొప్పదంటు ప్రశ్నలూ వేయకుండా ఆహ్లాదకరంగా మాట్లాడింది పూర్ణిమ. “’తెలక పిండి అనగానే మనకి గుర్తొచ్చే సామెత, ‘ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు సోమలింగం’, కదూ! నీ ఫేవరెట్ డిష్. మా అమ్మ చేసినంత బాగా చేశానో, లేదో చెప్పు”, అంటూ కొసరి కొసరి వడ్డించింది పూర్ణిమ.

“గగన్ గారిని, శశినీ పట్టించుకోవా?” అని మొహమాటపడుతూ అడిగింది అమిత. “వాళ్ళకి కావాల్సినవి కూడా టేబుల్ మీద ఉన్నాయి. వాళ్ళు వడ్డించుకుంటారులే! మనిద్దరం ఇన్నాళ్ళ తరువాత కలిశాం. పైగా, నీకు అవార్డ్ కూడా వచ్చింది. ఇవ్వాళ నా ఫ్రెండ్ మాత్రమే కాదు ది అవార్డ్ విన్నర్ అమిత మా ఇంటికి వచ్చిందోచ్! ఆ విషయం చాలు నేను ఉత్సాహపడడానికి! ఇంకాస్త కంద-బచ్చలి వెయ్యమంటావా?” అని అడిగింది పూర్ణిమ.

“తెలక పిండి కూర అచ్చం ఆంటీలాగే చేశావ్. అదే రుచి, అదే అమృత హస్తమూనూ!” అని చటుక్కున పూర్ణిమ ఎడమ చేతిని ముద్దు పెట్టుకుంది అమిత. మళ్ళీ తానే, “తెలుగు వాళ్ళ డెలికసీ, అదే మన గోంగూరని ఎంత బాగా చేశావో.. ముద్దపప్పులో తిన్నా, అన్నంలో కలుపుకు తిన్నా, బ్రహ్మాండం. థాంక్స్”, అంటూ, ఇంకా ముక్కల పులుసునైతే, ‘మనిషికీ, స్వర్గానికీ అనుసంధానమయ్యిం’దని పొగిడింది. పోలి బూర్లు బొందితో తనని స్వర్గానికి తీసుకుని వెళ్ళినట్టుంది, అని మెచ్చుకుంది.

“స్నేహితురాళ్ళిద్దరూ కబుర్లు చెప్పుకోండి. నేను వస్తా”, అని లేవబోయాడు గగన్. “గగన్ గారూ ఉండండి. మీ ఇద్దరితోటీ మాట్లాడాలి”, అంది అమిత.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here