మరుగునపడ్డ మాణిక్యాలు – 1: ‘క్యాలిబర్’

0
9

[dropcap]క[/dropcap]మర్షియల్ చిత్రాలు అందరూ చూస్తారు. అవార్డు చిత్రాలకు ప్రచారం వస్తుంది కాబట్టి వాటిని చూడటానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అటు కమర్షియల్ చిత్రమూ కాక, ఇటు పెద్ద అవార్డులూ రాక కొన్ని మంచి చిత్రాలు మరుగున పడిపోతాయి. అలాంటి వాటిలో ఒకటి ‘క్యాలిబర్’ (2018). నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

మనకు శ్రవణకుమారుడి కథ తెలుసు. దశరథుడు వేటకు వెళ్ళినపుడు దూరంగా ఏదో జంతువు కొలనులో నీళ్ళు తాగుతున్న శబ్దం వినిపిస్తుంది. శబ్దభేది విద్య తెలిసిన దశరథుడు దూరం నుంచే బాణం వేస్తాడు. ఇంతకీ అక్కడ ఉన్నది జంతువు కాదు. గుడ్డివారైన తన తలిదండ్రుల కోసం నీళ్ళు తీసుకువెళుతున్న శ్రవణకుమారుడు. అతనికి బాణం తగులుతుంది. దశరథుడు వెళ్ళి చూస్తే అతను కొన ఊపిరితో ఉంటాడు. తన తలిదండ్రులు గుడ్డివారని, వారికి నీళ్ళు ఇవ్వమని అడిగి కన్నుమూస్తాడు. దశరథుడు అతని తలిదండ్రుల దగ్గరకి వెళ్ళి జరిగినది చెబుతాడు. వారు పుత్రశోకంతో దశరథునికి శాపం ఇస్తారు, దశరథుడు కూడా పుత్రశోకం అనుభవించి మరణిస్తాడని. శాపం ఇచ్చి వారు మరణిస్తారు. దశరథుడు తర్వాత రాముడి వియోగంతో మరణిస్తాడు. దశరథుడు చేసిన పొరపాటే ఈ కాలంలో జరిగితే ఎలా ఉంటుంది? ‘క్యాలిబర్’ చిత్రంలో చూడవచ్చు.

స్కాట్లండ్‌లో మార్కస్, వాన్ అనే స్నేహితులు వేట కోసం అడవికి వెళతారు. అక్కడ అనుమతులు తీసుకుని వేట చేయవచ్చు. ఆ అడవికి దగ్గరలో ఒక ఊరిలో బస చేస్తారు. ఆ ఊరివాళ్ళు ఎక్కువగా వేటకు వచ్చే పర్యాటకుల మీదే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే వేట మీద ఆసక్తి తగ్గి పర్యాటకుల రాక తగ్గటంతో వారి బతుకుతెరువు మీద ప్రభావం పడుతుంది.

వాన్‌కి ఒక ప్రేయసి ఉంటుంది. ఆమె గర్భవతి. వారు పెళ్ళి చేసుకోవాలని అనుకుంటారు. ఒకసారి సరదాగా వేటకు వెళదాం, మళ్ళీ ఆ అవకాశం రాకపోవచ్చు అని మార్కస్ పట్టుబట్టడంతో వాన్ వేటకి బయలుదేరుతాడు. సాయంత్రం వేళ అడవి దగ్గరి ఊరికి చేరుకుంటారు, మర్నాడు వేటకి వెళ్ళే ఉద్దేశంతో. ఆ రాత్రి బార్‌కి వెళతారు. ఇద్దరమ్మాయిలు వారి దగ్గరకి వచ్చి పరిచయం చేసుకుంటారు. మార్కస్ ఒకమ్మాయితో వెళతాడు. రెండో అమ్మాయి వాన్‌ని దగ్గరవటానికి ప్రయత్నిస్తే అతను తన ప్రేయసి గురించి చెబుతాడు. కనీసం నాతో కలిసి డ్రింక్ చెయ్యి అని అమె అనటంతో ఒప్పుకుంటాడు. మర్నాడు హ్యాంగోవర్ (మద్యపానం వల్ల వచ్చే తలనొప్పి)తో నిద్ర లేస్తాడు. అలాగే వేటకు బయలుదేరుతాడు. మార్కస్ డ్రగ్స్ తీసుకున్నాడని తెలుస్తుంది. మానేశావనుకున్నాను అని వాన్ అంటే విహారయాత్రకి వచ్చాం కదా, ఎంజాయ్ చెయ్యనీ అంటాడు మార్కస్. వేట కోసం ఒకచోట ఆగుతారు. వాన్ ఇంకా హ్యాంగోవర్ లోనే ఉంటాడు. కొంచెం విస్కీ తాగితే హుషారుగా ఉంటుందని చెప్పి మార్కస్ ఇచ్చిన విస్కీ తాగుతాడు. తన తుపాకీ తెచ్చుకోవటం మర్చిపోవటంతో తన దగ్గరున్న మరో తుపాకీ ఇస్తాడు మార్కస్. ఇద్దరూ అడవిలోకి వెళతారు.

కాసేపటికి వాన్‌కి కాస్త దూరంలో ఒక జింక కనపడుతుంది. “నువ్వే ఆ జింకని చంపు” అని వాన్ మార్కస్ తో అంటాడు. “నువ్వు చూశావు కాబట్టి నువ్వు చంపటమే న్యాయం” అంటాడు మార్కస్. వాన్ తుపాకీ కాల్చే సమయానికి జింక కదలుతుంది. గుండు దూరంగా ఉన్న ఒక బాలుడికి తగిలి అతను చనిపోతాడు. వాన్ పరుగెత్తి అక్కడకు వెళతాడు. మార్కస్ వెనకాలే వెళతాడు. వాన్ కాళ్ళూ చేతులూ ఆడక చతికిలపడిపోతాడు. ఇంతలో ఆ బాలుడి తండ్రి అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. కొడుకు చనిపోయాడని తెలిసి అతను వాన్ మీద తుపాకీ గురిపెడతాడు. “అతను నాకు కనపడలేదు” అని వాన్ దీనంగా అంటాడు. ఇంతలో వెనక నుంచి మార్కస్ బాలుడి తండ్రిని తుపాకీతో కాల్చటంతో అతను కూడా చనిపోతాడు.

పోలీసుల దగ్గరకి వెళ్ళి ప్రమాదవశాత్తూ జరిగిందని (యాక్సిడెంటని) చెబుదామంటాడు వాన్. “నువ్వు నా తుపాకీ వాడావు. అది చట్టవిరుద్ధం. పైగా నీ దగ్గర్ విస్కీ వాసన వస్తోంది. నీకు శిక్ష పడుతుంది. నిన్ను కాపడటానికి నేను బాలుడి తండ్రిని అతి దగ్గర నుంచి కాల్చి చంపాను. నాకూ శిక్ష పడుతుంది. జైలు శిక్ష భరించటం మనవల్ల కాదు. పైగా నువ్వు తండ్రివి కాబోతున్నావు. నీ కాబోయే భార్యని, బిడ్డని దిక్కులేని వాళ్ళని చేస్తావా? మనం చంపినవాళ్ళు పర్యాటకుల్లాగా ఉన్నారు. ఇక్కడి వాళ్ళు కాకపోవచ్చు. ప్రస్తుతానికి ఎవరికీ అనుమానం రాకుండా మనం ఊరికి వెళ్ళిపోయి రాత్రి వచ్చి శవాలని పూడ్చిపెట్టేద్దాం. ఇంత పెద్ద అడవిలో వారి జాడ ఎవరికీ తెలియదు” అంటాడు మార్కస్. ఏమీ తేల్చుకోలేని స్థితిలో వాన్ మార్కస్ చెప్పినట్టు చేస్తాడు. ఊరికి వెళ్ళి ఒక రెస్టారెంట్లో ఊరివారితో కలిసి భోజనం చేస్తారు. రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అడవిలోకి వెళతారు. బాలుడి తండ్రికి తగిలిన బుల్లెట్ అతి దగ్గర నుంచి కాల్చటం వల్ల అతని శరీరం లోనుంచి దూసుకువెళ్ళి ఒక చెట్టుకు తగిలినట్టు కనిపెడతాడు మార్కస్. ఆ బుల్లెట్ ని తీసేసుకుంటాడు. పిల్లవాడికి తగిలిన బుల్లెట్ అతని తలలోనే ఉండిపోయిందని గుర్తిస్తాడు. ఎప్పుడైనా శవాలు దొరికితే ఆ బుల్లెట్ ఆధారంగా తనను పట్టుకుంటారని కత్తితో పిల్లవాడి తలలోంచి ఆ బుల్లెట్ తీస్తాడు, వాన్ వద్దంటున్నా వినకుండా! గొయ్యి తీసి శవాలను పూడ్చి ఊరికి వచ్చేస్తారు. అప్పటికే తెల్లవారుతూ ఉంటుంది. వారు ఉండే లాడ్జి యజమాని కొడుకు వారిని కిటికీ లోంచి చూస్తాడు.

వేటకి నిర్దేశిత ప్రదేశాలు ఉంటాయి కదా, అక్కడికి పిల్లలని తీసుకురావటం తప్పు కదా లాంటి విషయాలు ఆలోచించదగ్గవే. వాన్ తన తుపాకీ వాడి ఉంటే చట్టప్రకారం అది ఆక్సిడెంటే అవుతుంది. పిల్లవాడిని అలాంటి చోటికి తీసుకువచ్చినందుకు అతని తండ్రిదే తప్పు అయి ఉండేది. కానీ వాన్ తనది కాని తుపాకీ వాడటంతో సమస్య వచ్చి పడింది. చట్టవిరుధ్ధమని తెలిసినా పిల్లలని అలాంటి చోటికి తీసుకురావటం, వేరొకరి తుపాకీ వాడటం చిన్న విషయాలు గానే అనిపిస్తాయి కానీ చట్టాలు ఉన్నది ఎందుకు? ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండటానికే. తన తుపాకీ అయితే అలవాటు అయినది కాబట్టి జాగ్రత్తగా ఉండేవాడేమో. పైగా హ్యంగోవర్‌లో ఉన్నాడు. ఇలాంటి సమయాల్లో “నేను ఇప్పుడు వేట చేయను. హ్యాంగోవర్ తగ్గాక నా తుపాకీ తెచ్చుకుని చేస్తాను” అనటమే సరైన నిర్ణయం. వాన్ తప్పు ఉందనేది కాదనలేని విషయం. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. తన మిత్రుడిని చంపేస్తాడేమోమని బాలుడి తండ్రిని చంపేశానంటాడు మార్కస్. ఇందులో కూడా స్వార్థం ఉంది. బాలుడి తండ్రికి అడ్డుపడి వాన్‌ని చంపకుండా ఆపినా అతను పోలీసుల దగ్గరకి వెళ్ళేవాడు. అప్పుడు వేరొకరి తుపాకీ వాడినందుకు వాన్‌కి, తుపాకీ ఇచ్చినందుకు మార్కస్‌కి శిక్ష పడేది. తన మిత్రుడిని కాపాడటం కన్నా అసలు సాక్ష్యం లేకుండా చేయటమే మార్కస్ ఉద్దేశం. అతనిదీ తప్పే. సాక్ష్యాలన్నీ రూపుమాపాలని బాలుడి తలలోని బుల్లెట్‌ని కత్తితో తీయడం హేయమైన విషయం. ఏమైతే అయిందని పోలీసుల దగ్గరకి వెళ్ళిపోవటమే సరైన నిర్ణయం. ఇలాంటి అకృత్యాలు చేసి తప్పించుకుంటే వేరే అకృత్యాలు చేసే ధైర్యం వచ్చేస్తుంది. అలా కాకుండా ఉండాలంటే శిక్ష పడాల్సిందే.

కథ ముందుకి సాగి అనేక మలుపులు తిరుగుతుంది. ఊపిరి బిగపట్టి చూసేలా చేస్తుంది. ఒక సందర్భంలో ఒక పాత్ర “వద్దు. ఇది అమానుషం” అంటే మరో పాత్ర “ఆ గీత ఎప్పుడో దాటేశారు” అంటుంది. వేరొకరు అమానుషం చేస్తే దానికి మరో అమానుషమే సమాధానమా? మనలో చాలామంది వారలా చేశారు కాబట్టి నేనిలా చేశాను అంటారు. అలా గీతలు దాటుకుంటూ వెళితే ఎక్కడికి చేరతాం? మహాభారతంలో ద్రౌపదిని కర్ణుడు వేశ్య అన్నాడు కాబట్టి అతను నిరాయుధుడై ఉన్నా చంపేయమన్నాడు కృష్ణుడు. కానీ అసలు ఉద్దేశం కర్ణుడు అధర్మపక్షాన ఉన్నాడు కాబట్టి అతన్ని మట్టుబెట్టాలి అని. అది యుద్ధరంగం కాబట్టి కొన్ని వ్యూహాలు అలా ఉంటాయి. చంపటమే లక్ష్యం కాబట్టి ఎవరూ తప్పుబట్టే అవకాశం లేదు. జీవితంలో చిన్న సమస్యలని యుద్ధంగా భావిస్తే ఎలా? ఈ చిత్రంలో హత్యలు జరిగాయి, కానీ హత్యకు హత్యే బదులంటే ఇక చట్టాలు, పోలీసులున్నది ఎందుకు? తాము తప్పులు చేస్తున్నామని తెలిసినా మార్కస్ ప్రభావంతో వాన్ అతని చెప్పినట్టు చేస్తూ ఉంటాడు. ఎవరికి వారు ఆలోచించుకోవాల్సింది ఏమిటంటే తాను చేస్తున్నది ధర్మమేనా అని. అంతే కానీ నాకు, నా వాళ్ళకి నష్టం కలగకుండా ఏమైనా చేస్తాను అంటే అది ఎప్పటికైనా బెడిసికొడుతుంది.

ఊరివాళ్ళలో కొంత మంది వాన్‌ని, మార్కస్‌ని శత్రువుల్లా చూస్తుంటారు. సిటీ నుంచి వచ్చి పోజు కొడుతున్నారనే భావం కనిపిస్తుంది. మార్కస్ ఒకమ్మాయితో పడుకున్నాడని, ఆమెకి డ్రగ్స్ ఇచ్చాడని మార్కస్ మీద దాడి చేస్తారు. అతని తప్పు ఉంటే ఆ అమ్మాయి తప్పు లేదా? తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు. పాశ్చాత్య దేశాలలో ఎవరి జీవితం వారిదే. లైంగిక స్వేచ్ఛ ఎక్కువ. ఇష్టంగానే అతనితో వెళ్ళినపుడు ఎవరినీ తప్పుపట్టకూడదు. మామూలు పరిస్థితుల్లో మార్కస్ ఎదురుతిరిగే వాడేమో! కానీ అక్కడి నుంచి ఎంత త్వరగా బయటపడదామా అని చూస్తున్న అతను దెబ్బలని భరిస్తాడు.

చిత్రం పేరు ‘క్యాలిబర్’ అని పెట్టడం చాలా బావుంది. తుపాకీ పరిమాణాన్ని కొలిచేందుకు వాడే పదం ‘క్యాలిబర్’. అలాగే మనిషి ఔన్నత్యాన్ని చెప్పటానికి కూడా వాడతారు. ఈ చిత్రంలోని పాత్రలు నీతిమంతులేనా అనే ప్రశ్న చివరికి మిగిలిపోతుంది. ఈ చిత్రానికి మ్యాట్ పామర్ స్క్రీన్ ప్లే, దర్శకత్వం సమకూర్చాడు. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంటుంది. చెప్పాల్సిన విషయాలన్నీ ఎక్కడా అధిక సమయం తీసుకోకుండా చెప్పాడు. చిన్నప్పుడు బోర్డింగ్ స్కూల్లో వాన్‌కి మార్కస్ అన్నలా ఉండేవాడని, మార్కస్ చిన్నతనంలో తన తండ్రితో అదే అడవికి వేట కోసం వచ్చేవాడని, వాన్‌కి వేట అనుభవం లేదని, మార్కస్ పట్టుబట్టి అతనికి తుపాకీ లైసెన్స్ ఇప్పించాడని మాటల్లో తెలుస్తుంది. ఫొటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంటుంది. రాత్రి వేళ సన్నివేశాలు కూడా స్పష్టంగా ఉంటాయి. ఎక్కువ వెలుగుతో కృత్రిమంగా కాకుండా వెన్నెల వెలుగులో ఉన్నట్టు ఉంటాయి. అయినా ఎక్కడా మసకగా అనిపించవు. వాన్, మార్కస్‌గా నటించిన జాక్ లౌడెన్, మార్టిన్ మెకాన్ పాత్రల్లో ఒదిగిపోయారు. నెమ్మదస్తుడైన వాన్, కాస్త దుడుకు స్వాభావం కల మార్కస్ పాత్రల్లో చక్కగా నటించారు. ముఖ్యంగా జాక్ లౌడెన్ వాన్ పాత్రలోని అంతర్మథనానికి జీవం పోశాడు. ఊరివాళ్ళగా నటించిన వారందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కొందరిని చూస్తే భయం వేస్తుంది. సినిమా అంగ్లంలోనే ఉన్నా స్కాట్లండ్ యాస అర్థం కావటం కష్టం. సబ్ టైటిల్స్‌తో చూడవచ్చు.

తర్వాతి కొంత కథ ఈ క్రింద ప్రస్తావించబడింది. సినిమా చూడాలనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు. సినిమా చూశాక కింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

శవాలని పూడ్చిపెట్టి తిరిగివచ్చిన వాన్, మార్కస్ ఇంకో రెండు రోజులు లాడ్జి బుకింగ్ ఉన్నా ఏదో వంక పెట్టి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఇంతలో మార్కస్ ఒకమ్మాయితో పడుకున్నాడని తెలిసి ఊరివారు అతని జీపు టైర్లను కోసేస్తారు. కొంతమంది మార్కస్‌ని రక్షించి అతని జీపుని గ్యారేజ్‌కి తీసుకువెళతారు. ఎక్కువ డబ్బులిచ్చినా మెకానిక్ మార్కస్ మీద కోపంతో రిపేరు ఎప్పుడవుతుందో చెప్పలేనంటాడు. కొందరు ఊరివాళ్ళు వారికి ఇబ్బంది కలిగించినందుకు మార్కస్‌కి, వాన్‌కి క్షమాపణలు చెబుతారు. మాటల్లో లోగన్ అనే అతని బావ, మేనల్లుడు అడవిలో క్యాంపింగ్‌కి వెళ్ళి తిరిగి రాలేదని తెలుస్తుంది. వాన్‌కి, మార్కస్‌కి భయం మొదలవుతుంది. అంతవరకు వారు చంపినది పర్యాటకులనని అనుకున్నవారు తాము స్థానికులనే చంపామని తెలిసి ఏమీ పాలుపోక ఉండిపోతారు.

రాత్రివేళ ఊరివారు వచ్చి తప్పిపోయినవారిని వెతకటానికి వెళుతున్నామని, మీ జీపు రిపేరు అయిపోయిందని, మీరు కూడా వెతకటానికి రండి అని వాన్‌ని, మార్కస్‌ని అడుగుతారు. వారు జీపులో ఇతర వాహనాల వెనకే బయలుదేరుతారు. “శవాలను పూడ్చిపెట్టిన చోటు తెలిసిపోతే ఎలా?” అంటాడు వాన్. ఇంత పెద్ద అడవిలో ఎలా తెలుస్తుంది అంటాడు మార్కస్. జీపు చేతికొచ్చిందని అప్పటికప్పుడు ఊరు విడిచి వెళ్ళిపోతే ఊరివాళ్ళకి అనుమానం వస్తుంది కాబట్టి ఏమీ తెలియనట్టు వారి వెనకే వెళ్ళటం మంచిదంటాడు. ఒకవేళ ఆ చోటు తెలిసిపోతే అప్పుడు పారిపోదామంటాడు.

అడవిలో ఆగిన తర్వాత “మీరు నిన్న రాత్రి ఏం చేశారు?” అని అడుగుతాడు లోగన్. తమను చూసిన పిల్లవాడు వారికి చెప్పేశాడని అర్థమై “వేటకు వెళ్ళాం. రాత్రి పూట వేట చట్టరీత్యా నేరమని తెలుసు. కానీ నేను వెళదామంటే వాన్ వచ్చాడు” అంటాడు మార్కస్. “రాత్రి వేటకు వెళ్ళారని పోలీసులకి చెబుతాం” అంటాడు లోగన్. ఊరివాళ్ళతో చాటుగా “వీళ్ళిద్దరి మీద ఓ కన్నేసి ఉంచండి” అంటాడు. వాసన పసిగట్టే కుక్కల సాయంతో కాసేపటికి శవాలు పూడ్చిపెట్టిన చోటుని కనుగొంటారు ఊరివారు. దాంతో అక్కడి నుంచి పారిపోతారు వాన్, మార్కస్. జీపులో వెళుతుంటే ఊరివారు వెంబడించి తుపాకీలతో కాలుస్తారు. పెట్రోల్ ట్యాంక్‌కి తగిలి పెట్రోలంతా కారిపోతుంది. దాంతో జీపు దిగి పరుగెడతారు. వాన్ దొరికిపోతాడు. అతణ్ని కట్టేసి నిజం చెప్పమని అడుగుతారు ఊరివారు. జరిగింది జరిగినట్టు చెప్పేస్తాడు.

మొదట లోగన్ మేనల్లుడు క్యాంపింగ్‌కి వెళ్ళి తప్పిపోయాడని మాత్రమే అంటారు ఊరివారు. మార్కస్ ఆ మాట విని “వాళ్ళెప్పుడు తిరిగి వస్తామని చెప్పారు?” అంటాడు. ఒకతను ‘వాళ్ళు’ అని ఎందుకంటున్నావు, నేను చెప్పింది మేనల్లుడి గురించి మాత్రమే కదా అంటాడు. ఒకామె “పదకొండేళ్ళ వాడు ఒక్కడే అడవిలోకి వెళతాడా?” అంటుంది. “అతను పదకొండేళ్ళవాడని ఇతనికి తెలియదు కదా” అంటాడతను. లోగన్ అంతకు ముందే వాళ్ళ బావ, మేనల్లుడు అడవిలోకి క్యాంపింగ్ వెళ్ళారని చెప్పాడంటాడు మార్కస్. మనం దాచాలనుకున్న విషయం మన భాషలో ఒక్కోసారి బయటపడిపోతుంది. ఇది మనందరికీ బాగా అనుభవమే. అలాగే మార్కస్ అనుకోకుండానే నోరు జారతాడు. ఊరివారికి అనుమానం వస్తుంది. అందుకే నిజం ఎప్పటికైనా బయటపడుతుంది అంటారు మన పెద్దవాళ్ళు. కాబట్టి దాపరికం వ్యక్తిగత విషయాలలోనే ఉండాలి తప్ప అన్ని విషయాలలో దాపరికం వల్ల లాభం ఉండదు.

చనిపోయినవారు పర్యాటకులు కాదు, ఊరివారే అని తెలిసినపుడు నిజం చెప్పేసి ఉంటే కథ వేరేలా ఉండేదేమో! అంత పెద్ద అడవిలో వెంటనే ఏమీ దొరకదులే అనే అతివిశ్వాసంతో మార్కస్ బయటపడడు. నేరం ముందే ఒప్పుకుంటే ఆ నేరం ఎలా జరిగిందో వివరించే అవకాశం ఉంటుంది. అవతలి వారు అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఊరివారంటే భయముంటే పోలీసులకి చెప్పి ఉండవచ్చు. వారు చట్టపరంగా తీసుకునే చర్యలు తీసుకుంటారు. కానీ మనుషులు చాలావరకు ఎలాగైనా బయటపడవచ్చేమో అనే ఆలోచిస్తారు. పేపర్లలో వచ్చే నేరాల వార్తల్లో మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. చివరికి దొరికిపోవటమో, ఆత్మహత్య చేసుకోవటమో జరుగుతుంది. నేను, నా వాళ్ళు అనుకుంటూ తప్పించుకుంటే ఇలాగే ఉంటుంది. అందరూ నాలాంటి వారే, నాకే ఇలా జరిగితే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ధర్మం అర్థమౌతుంది. వాన్ “నా బిడ్డనే ఎవరైనా చంపేస్తే నాకెలా ఉంటుంది” అని ఆలోచిస్తే పరిణామాలు వేరుగా ఉండేవి.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుసుకోవద్దు అనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు.

నిజం తెలిసిన లోగన్ వాన్‌ని చంపేద్దామంటాడు. అతని మిత్రుడు అది సరికాదంటాడు. వాన్‌ని చంపేస్తే అతని కాబోయే భార్య వెతుక్కుంటూ వస్తుంది. స్థానిక పోలీసులే కాక జాతీయ పోలీసులు కూడా వస్తారు. లోగన్‌కి శిక్ష పడుతుంది. ఊరి ప్రతిష్ఠ మంటగలుస్తుంది. అరకొర పర్యాటకులు కూడా రారు. మిత్రుడు ఇలా అన్నా లోగన్ పట్టు పడతాడు. ప్రతీకారం చేయవలసిందే అంటాడు. ఇంతలో మార్కస్ కూడా దొరుకుతాడు. చివరికి ఊరివారందరూ ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వస్తారు. మార్కస్‌ని కట్టేసి వాన్ చేతికి తుపాకీ ఇచ్చి అతన్ని చంపమంటారు. “వద్దు. ఇది అమానుషం” అంటాడు వాన్. “ఆ గీత ఎప్పుడో దాటేశారు మీరు” అంటాడు లోగన్. మార్కస్‌ని చంపకపోతే ఇద్దరినీ మేమే చంపేస్తాం అంటాడు. “నీ కాబోయే భార్య, పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచించు” అంటాడు వాన్‌తో. వాన్ ధర్మసంకటంలో చిక్కుకుంటాడు. మార్కస్ వంక చూస్తాడు. అతని నోరు కట్టేసి ఉంటుంది. కళ్ళతోనే “నన్ను చంపెయ్” అని సైగ చేస్తాడు. మార్కస్‌ని చంపేస్తాడు వాన్. లోగన్ వాన్ ముఖం మీద ఉమ్మేస్తాడు.

విషయం బయటపడకుండా ఊరివారు ఒక పథకం వేస్తారు. మార్కస్ ఒక్కడే ఉత్తరం దిక్కుగా జీపులో వెళ్ళాడని చెప్పి వాన్ తిరిగి వెళ్ళిపోతాడు. ఎవరికీ అనుమానం రాదు. మార్కస్ ఏ జంతువుకో చిక్కి చనిపోయాడని బయటివారు అనుకుంటారు. కొన్నాళ్ళకి వాన్‌కి కొడుకు పుడతాడు. వాన్ ముభావంగా ఉంటూ ఉంటాడు. అతని భార్యకి అతని ప్రవర్తన అర్థం కాదు. వాన్‌కి జీవితం దుర్భరంగా ఉందనే సూచనతో చిత్రం ముగుస్తుంది.

ఊరివారు కూడా తక్కువవారు కాదు. పోలీసులకి అప్పగించకుండా తామే శిక్ష విధించాలని నిర్ణయిస్తారు. లోగన్ ప్రతీకార కాంక్ష అంత బలంగా ఉంటుంది. ఊరివారు అతని ప్రభావంలో పడిపోతారు. భయంకరమైన వ్యూహం వేస్తారు. వాన్ చేత మార్కస్‌ని చంపిస్తే తమ చేతికి మట్టి అంటదనే ఆలోచన వారిది. వాన్ నిరాకరిస్తే నిజంగానే వారిద్దరినీ చంపేవారా? లోగన్ పగతో రగిలిపోతున్నాడు కాబట్టి చంపేవారేమో! మార్కస్ చావుకి సిద్ధపడటంతో వాన్ అతన్ని చంపేస్తాడు. మిత్రుడిని చంపిన వాన్ ముఖం మీద ఉమ్మేస్తాడు, ‘నీ స్వార్థం కోసం మిత్రుడిని చంపిన నువ్వూ ఒక మనిషివేనా?’ అన్నట్టు. పుట్టబోయే తన బిడ్డ మీద మమకారంతో వాన్ ఆ పని చేశాడు. మమకారం ఉన్నంత వరకు మనిషి ధర్మాన్ని పక్కన పెట్టేస్తాడు. ప్రాణం పోయినా సరే, మమకారాన్ని జయిస్తేనే మనిషి ఉన్నతుడౌతాడు.

వాన్ జీవితాంతం క్షోభ పడవలసిందే. ఎవరికీ చెప్పుకోలేడు. మొదట్లో పోలీసుల దగ్గరకి వెళితే తనకు, మార్కస్‌కు మాత్రమే శిక్ష పడేది. ఇప్పుడు వెళితే లోగన్‌కి, మిగతా ఊరివారికి శిక్షలు పడవచ్చు. అందుకని మౌనంగా ఉండిపోతాడు. చట్టాలను అతిక్రమించకుండా ఉంటే జీవితాలు బావుంటాయి. తప్పు చేస్తే శిక్ష అనుభవించే నిబ్బరం ఉండాలి. తప్పు మీద తప్పు చేస్తూ పోతే జీవితం నరకమౌతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here