మరుగునపడ్డ మాణిక్యాలు – 106: కోడక్రోమ్

0
11

[సంచిక పాఠకుల కోసం ‘కోడక్రోమ్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]

[dropcap]కు[/dropcap]టుంబానికి అన్యాయం చేసే తండ్రులు తరచు తారసపడుతుంటారు. అవసానదశలో వారు కుటుంబాన్ని వెతుక్కుంటూ వస్తారు. ఇలాంటి కథ తెలుగులో ‘గోరింటాకు’లో చూశాం. అయితే అందులో పశ్చాత్తాపం ఉండదు, స్వార్థం తప్ప. అందరూ ఇలాగే ఉంటారా? ఒక్కొక్కరిదీ ఒక్కో కథ. అయితే బిడ్డల కోపం మాత్రం ఏ కథలో అయినా ఒకేలా ఉంటుంది. అలాంటి తండ్రీకొడుకుల కథ ‘కోడక్రోమ్’ (2017). ‘కోడక్రోమ్’ అనేది ఒకప్పుడు కోడాక్ కంపెనీ వారు కెమెరాల్లో వాడేందుకు ఉత్పత్తి చేసిన ఫిల్మ్. డిజిటల్ కెమెరాలు రావటంతో కొన్నేళ్ళ క్రితం ఆ ఫిల్మ్ ఉత్పాదన ఆపేశారు. ఈ చిత్రంలో తండ్రి పాత్ర బెన్ ఒక ప్రపంచప్రఖ్యాత ఫొటోగ్రాఫర్. రాజకీయాలు, యుద్ధాలలో కీలక ఘట్టాలను ఫొటోలు తీసి పేరు గడించాడు. డిజిటల్ కెమెరాలు వచ్చినా అతను పాత కెమెరాలే వాడతాడు. అతనికి కుటుంబం కన్నా తన కళే ముఖ్యం. అతని కొడుకు మ్యాట్. ఇద్దరూ ఏళ్ళ తరబడి మాట్లాడుకోలేదు. అయినా ఇద్దరూ కలిసి బెన్ ఫొటోలు తీసిన పాత కోడక్రోమ్ ఫిల్మ్ డెవలప్ చేయించటానికి మైళ్ళ దూరం ప్రయాణించి వెళతారు. అప్పడు ఏం జరిగిందనేది కథ. ఈ చిత్రానికి ట్యాగ్‌లైన్ ‘Over time, everything develops’. అంటే కాలం అన్నిటినీ మారుస్తుంది అని. డెవలప్ అనే పదాన్ని ఫిల్మ్‌కి కూడా అన్వయించుకోవచ్చు. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

మ్యాట్ న్యూయార్క్ ఒక రికార్డుల కంపెనీలో పనిచేస్తుంటాడు. సంగీతకళాకారులతో ఒప్పందం చేసుకుని వారి పాటలు రికార్డు చేసి అమ్మటం ఆ కంపెనీ పని. మ్యాట్ బాధ్యత తీసుకున్న ఒక గాయకుడు ఆ కంపెనీతో తెగతెంపులు చేసుకుంటాడు. దాంతో మ్యాట్ ఉద్యోగం ప్రమాదంలో పడుతుంది. కొత్తగా వచ్చిన మరో బ్యాండ్ (సంగీతకారుల బృందం)తో ఒప్పందం చేసుకుంటానని మాట ఇచ్చి మ్యాట్ తన ఉద్యోగం కాపాడుకుంటాడు. అయితే ఆ బ్యాండ్‌కి అప్పటికే మరో కంపెనీతో ఒప్పందం ఉంది. వారిని ఎలా ఒప్పించాలో తెలియక మ్యాట్ అయోమయంలో ఉంటాడు. ఒప్పించాలంటే ముందు వారు మ్యాట్‌ని కలవటానికి ఒప్పుకోవాలి. అదే గగనంగా ఉంది.

ఇదిలా ఉండగా మ్యాట్ తండ్రి బెన్ తన అసిస్టెంట్ జోయిని మ్యాట్ దగ్గరకి పంపిస్తాడు. బెన్‌కి క్యాన్సర్. ఎంతో కాలం బతకడు. కోడక్రోమ్ ఫిల్మ్ డెవలప్ చేసే చివరి షాపు కాన్సస్ రాష్ట్రంలో ఉంది. త్వరలో మూసేయబోతున్నారు. బెన్ తన దగ్గరున్న పాత ఫిల్మ్ డెవలప్ చేయించాలని కాన్సస్ వెళ్ళాలనుకుంటాడు. ఆ ఫొటోలతో ఒక ప్రదర్శన పెట్టాలని అతని కోరిక. న్యూయార్క్ నుంచి కాన్సస్ రెండు వేల మైళ్ళ దూరం. విమానంలో ప్రయాణం చేయనంటాడు. కారులో వెళతానంటాడు కానీ మ్యాట్ తోడు రావాలంటాడు. మ్యాట్ ససేమిరా రానంటాడు. బెన్ వ్యవహారాలు చూసే ల్యారీ మ్యాట్‌తో “నువ్వొప్పుకుంటే నువ్వు కలవాలనుకుంటున్న బ్యాండ్‌తో మీటింగ్ నేను ఏర్పాటు చేస్తాను” అంటాడు. తన ఉద్యోగం కాపాడుకోవటానికి మ్యాట్ ఒప్పుకుంటాడు.

ఇంతకీ బెన్‌కీ, మ్యాట్‌కీ గొడవ ఏమిటి? బెన్ తన వృత్తి కోసం ప్రపంచం తిరిగేవాడు. ఎన్నో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. బెన్ భార్య అతన్ని క్షమించింది. కానీ చివరికి అతను దగ్గర లేకుండానే మరణించింది (ఆ సమయంలో తాను ఆఫ్రికాలో ఉన్నానని, అక్కడ అంతర్యుద్ధం వల్ల రాలేకపోయానని బెన్ తర్వాత అంటాడు). మ్యాట్‌కి అప్పుడు పదమూడేళ్ళు. బాబాయి దగ్గర పెరిగాడు. చిన్నప్పుడు డ్రమ్స్ వాయించేవాడు. అది కూడా వదిలేశాడు. తండ్రిని క్షమించలేదు. అంత కోపం ఉంటే అసలు వెళ్ళకుండా ఉండొచ్చు కదా? తన ఉద్యోగం కాపాడుకోవటానికి వెళతాడు. అమెరికా లాంటి దేశాల్లో పట్టుదలలు కూడా షరతులతో ఉంటాయి. ‘నాకు లాభం ఉంటే పట్టు సడలిస్తాను’ అనే సంస్కృతి. అందరూ అలా ఉండరు కానీ చాలామంది అంతే. ఇప్పుడు ఇదే సంస్కృతి మన దేశంలోనూ వ్యాపిస్తోంది. మ్యాట్‌కి ఇంతకుముందే విడాకులైపోయాయి. అతని విడాకుల గురించి బెన్ వేళాకోళం చేస్తాడు. “నువ్వు ఏ పిట్టతోనైనా కక్కుర్తిపడ్డావా లేక మీ ఆవిడ కక్కుర్తిపడిందా?” అంటాడు. నోటికెంత మాటొస్తే అంత మాట అంటాడు. కళాకారులు ఎలా ఉన్నా వారి కళని గౌరవించాలని మొండిగా ఉంటాడు. ఇది తరతరాలుగా జరుగుతున్న చర్చ. కళాకారులు మంచి సృజన చేయటం ముఖ్యమా? మంచివారుగా ఉండటం ముఖ్యమా? బయటివారైతే కళాకారులు ఎలాంటివారినా వారిని కళని దృష్టిలో పెట్టుకుని వారిని గౌరవిస్తారు. కానీ ఇంట్లోవాళ్ళు వారి వ్యసనాలని భరించలేరు కదా?

జోయి బెన్‌కి అసిస్టెంటే కాక నర్సు కూడా. బెన్‌కి రోజూ ఇంజెక్షన్లు ఇవ్వాలి కాబట్టి ఆమె కూడా వారిద్దరితో బయల్దేరుతుంది. మొత్తం ఏడు రోజుల ప్రయాణం. రాత్రిపూట హోటళ్ళలో ఆగుతారు. మొదటి నుంచే బెన్, మ్యాట్ కీచులాడుకుంటూ ఉంటారు. బెన్ “నా నీడలో ఉండిపోవటం వల్ల నీకు ఈర్ష్యగా ఉంది. నేను పోయినా నా కళ బతికి ఉంటుంది. నువ్వేం సాధించావు?” అంటాడు. జోయిని కూడా కించపరుస్తాడు. బిల్ క్లింటన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైట్ హౌస్‌లో ఫోటోలు తీయటానికి వెళ్ళానని చెబుతూ “అప్పుడే ఆ అభిశంసన పెంటంతా ముగిసింది” అంటాడు. జోయి “పెంట అనకండి. ఆయన అక్రమసంబంధం పెట్టుకుని పైకి మాత్రం పవిత్రుడిలా నటించాడు” అంటుంది. “ఎవరూ పవిత్రులు కారు. అందరూ గ్రంథసాంగులే. నీకు తెలీదా? నీకు విడాకులెందుకయ్యాయి?” అంటాడు బెన్. జోయికి కూడా విడాకులయిపోయాయన్నమాట. ఆ మాటతో ఆమె వెనక్కి తగ్గుతుంది. బెన్ ఇంకా ఏదో అనబోతుంటే మ్యాట్ “ఆమెని వదిలెయ్. నీ సొల్లు కథలేవో చెప్పుకో” అంటాడు. తర్వాత జోయి మ్యాట్‌తో “ఆయన మీద అలా మండిపడకండి” అంటుంది. ఆమె ఇంకా బెన్‌ని వెనకేసుకురావటం మ్యాట్‌కి ఆశ్చర్యంగా ఉంటుంది. “చచ్చిపోతున్నాడు కదాని నోరుపారేసుకునే హక్కు ఆయనకి లేదు” అంటాడు.

ఇంతకీ మ్యాట్‌కి విడాకులెందుకయ్యాయి? జోయితో మాట్లాడుతూ అతను “నా భార్య నేను ఎప్పుడూ గతం గురించే ఆలోచిస్తానని, వర్తమానాన్ని అస్వాదించనని అనేది. అదొక్కటే కాదులే, ఇంకా ఏవో కారణాలున్నాయి” అంటాడు. గతంలో ఏదైనా గట్టి ఎదురుదెబ్బ తగిలినా, చిన్నప్పుడే విషాదాలు ఎదురైనా మరచిపోవటం కష్టం. చిన్నప్పటి చేదు అనుభవాలయితే మనిషి స్వభావాన్నే మార్చేస్తాయి. మనుషుల మీద నమ్మకం పోయేలా చేస్తాయి. లేక తన మీద తనకే నమ్మకం లేకుండా చేస్తాయి. బంధాలు కాపాడుకోవటం కష్టమైపోతుంది. పిల్లల కోసం పెద్దలు కలిసి ఉండకపోతే జరిగే విపరిణామాలివి. బెన్ తన వృత్తిలో పడి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. వృత్తి ముఖ్యమే, కానీ అందులో మునిగిపోకూడదు. కొందరికి ధనకాంక్ష అయితే కొందరిది కీర్తికాంక్ష. బెన్ తన కీర్తికాంక్ష వదులుకుని నెలలో కొన్ని రోజులు కుటుంబం దగ్గర ఉంటే అతని దాంపత్య జీవితమూ బావుండేది, కొడుకు ప్రేమా దక్కేది. ఇప్పుడు ఒంటరిగా మిగిలాడు. క్యాన్సర్ బారినపడ్డాడు. దైవం ఇచ్చే తీర్పులో తేడా ఉండదు.

బెన్ తమ్ముడు డీన్ (మ్యాట్‌ని పెంచిన బాబాయి) తను పుట్టి పెరిగిన ఊరిలోనే ఉంటున్నాడు. ఆ ఊరు దారిలోనే ఉందని అందరూ అక్కడికి వెళతారు. తమ్ముడిని ఆఖరిసారి చూస్తానని బెన్ అంటాడు. అయితే డీన్‌కి కూడా అన్నగారి మీద కోపమే. కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడని. అయినా అన్నగారిని ఇంట్లోకి ఆహ్వానిస్తాడు. ఆ దంపతులకి మ్యాట్ అంటే ఎంతో ప్రేమ. మ్యాట్ గది అలానే ఉంచారు. ఆ గదిలో బోలెడు క్యాసెట్లు, రికార్డులు ఉంటాయి. మ్యాట్‌కి చిన్నప్పటి నుంచి సంగీతం మీద మక్కువ. అందుకే అతను రికార్డుల కంపెనీలో చేరాడు. అసలు డ్రమ్మర్ కావాలనుకున్నాడు కానీ తల్లి చనిపోవటం, తండ్రి దూరమవటంతో ఆ కల కలగానే మిగిలిపోయింది. ఇక్కడో చిన్న ఉపకథ వస్తుంది. డీన్ భార్య యుక్తవయసులో డీన్‌తో డేటింగ్ చేయటానికి ముందు ఒకసారి బెన్ ఆమె సమ్మతితో ఆమెతో శృంగారానికి ప్రయత్నించాడు. అయితే అతను తాగి ఉండటం వల్ల శారీరక సంబంధం ఏర్పడలేదు. ఈ విషయాన్ని ఆమె రహస్యంగా ఉంచింది. అది కాస్తా ఇప్పుడు బెన్ అందరి ముందూ బయటపెట్టేస్తాడు. ‘నేను చనిపోతున్నాను కాబట్టి మీరందరూ సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు’ అన్నట్టు ఉంటుంది అతని ప్రవర్తన. ఇలాంటి వారు కూడా ఉంటారా అనిపిస్తుంది. కొడుకుని పట్టించుకోనివాడు ఇలాగే ఉంటాడు అని కూడా అనిపిస్తుంది. ‘న బ్రూయాత్ సత్యమప్రియమ్’ (అప్రియమైన సత్యాన్ని చెప్పవద్దు) అనేది పాటించకపోతే అనర్థాలు జరుగుతాయి. కానీ బెన్ లాంటి వాళ్ళకి చుట్టూ అనర్థాలు జరగుతుంటే అదో తుత్తి! యుద్ధరంగాల్లో, రాజకీయాల్లో అవే కదా ఎక్కువ జరిగేది.

మ్యాట్ తక్కువ వాడేమీ కాదు. జోయితో శృంగారానికి ప్రయత్నిస్తాడు. విజయాల మత్తులో విశృంఖలంగా ఉండేది కొందరు, వైఫల్యాలు చిత్తు చేస్తే క్షణికసుఖాలలో ఆనందం వెతుక్కునే వారు కొందరు. జోయి అతన్ని వారిస్తుంది. వారిద్దరూ ఒకే గదిలో ఉండటం బెన్ చూస్తాడు. కసి ఒక పక్క. అయినా వారిద్దరి మధ్యా ఏమీ జరగలేదని తెలిసి కొడుకుని వేళాకోళం చేస్తాడు. కారులో, జోయి అక్కడ ఉండగానే. అతని పద్ధతి చూసి “నువ్వెప్పుడైనా సంతోషంగా ఉన్నావా?” అని మ్యాట్ అడుగుతాడు. “పికాసో, హెమింగ్‌వే లాంటి వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఏ గొప్ప కళాకృతీ సంతోషంగా ఉన్న కళాకారులు సృష్టించినది కాదు. మితిమీరిన ఆకాంక్షలు, మితిమీరిన స్వీయప్రేమ, మితిమీరిన శృంగారం, మితిమీరిన కోపం – ఇవే గొప్ప కళాకారులని, గొప్ప మనుషుల్ని నడిపే ఇంజన్లు. అందుకే మేమందరం నికృష్టులం” అంటాడు బెన్. “నువ్వు నికృష్టుడివని నీకు తెలుసన్నమాట” అంటాడు మ్యాట్. “నేనేం మూర్ఖుడిని కాదు. నాకు తెలుసు” అంటాడు బెన్. కళాకారులు కళాసృజన చేస్తారు కాబట్టి వారి ప్రవర్తన ఎలా ఉన్నా భరించాల్సిందే అన్నట్టు మాట్లాడతాడు. తర్వాత మ్యాట్‌తో ఒంటరిగా ఉన్నప్పుడు “నేను మంచి భర్తని, తండ్రిని కాదని నాకు తెలుసు” అంటాడు. “అది పక్కన పెట్టు. నువ్వు నా మీద ఎప్పుడూ దృష్టి సారించలేదు” అంటాడు మ్యాట్. “నా దృష్టే నా జీవనాధారం” అంటాడు బెన్. అంటే మంచి ఫొటోకి కావలసిన విషయం లేకపోతే దాని మీద దృష్టి పెట్టడన్నమాట. ఇలా మాట్లాడేవాడు మ్యాట్‌ని తోడు రమ్మని ఎందుకడిగాడు? అదే మిగతా కథ.

ఈ చిత్రానికి జొనాథన్ ట్రాపర్ స్క్రీన్‌ప్లే రాయగా మార్క్ రాసో దర్శకత్వం వహించాడు. బెన్‌గా ఎడ్ హ్యారిస్, మ్యాట్‌గా జేసన్ సుడేకిస్, జోయిగా ఎలిబబెత్ ఓల్సన్ నటించారు. ఎడ్ హ్యారిస్ ఎంతో పరిణతి గల నటుడు. నెగటివ్ ఛాయలున్న పాత్రని అద్భుతంగా పోషించాడు. చిత్రం మొదటి భాగం కంటే రెండో భాగమే ప్రభావవంతంగా ఉంటుంది. మొదట్లో బోరు కొట్టినా ఓపిగ్గా చూస్తే మంచి చిత్రం చూసిన తృప్తి కలుగుతుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

మ్యాట్ కలవాలనుకుంటున్న బ్యాండ్ షికాగోలో ప్రదర్శన ఇవ్వబోతోంది. షికాగో వీరు వెళ్ళే దారిలో ఉంది. అక్కడ బెన్ మ్యానేజరు ఆ బ్యాండ్‌కి, మ్యాట్‌కి సమావేశం ఏర్పాటు చేస్తాడు. సమావేశానికి ముందు ప్రదర్శన చూడటానికి ముగ్గురికీ టికెట్లు కూడా ఏర్పాటు చేస్తాడు. వెళ్ళే ముందు బెన్ మ్యాట్‌ని “ఆ బ్యాండ్‌ని మీ కంపెనీతో ఒప్పందం చేసుకోవటానికి ఎలా ఒప్పించబోతున్నావో చెప్పు” అంటాడు. “’మాది లాభాల కోసం చూసే కార్పొరేట్ సంస్థ కాదు. కళాకారుడంటే అమ్మకానికి ఒక ఉత్పత్తి కాదు, కళాకారుడంటే ఒక ద్రష్ట’ అని చెబుతాను” అంటాడు మ్యాట్. “అదేం వద్దు. వాళ్ళని పొగిడేవారు చాలామంది ఉంటారు. వాళ్ళ సంగీతంలో నీకేం నచ్చలేదో చెప్పు. ఆ లోపాన్ని నువ్వు సవరించగలనని చెప్పు” అంటాడు బెన్. మ్యాట్ కొట్టిపారేస్తాడు.

తర్వాత ఆ బ్యాండ్‌ని కలిసినపుడు మ్యాట్ వారితో మాట్లాడుతుంటే బెన్, జోయి కాస్త దూరంలో కూర్చుని ఉంటారు. బ్యాండ్‌లో డ్రమ్మర్, గిటారిస్ట్, బేసిస్ట్, గాయకుడు ఉంటారు. గాయకుడు జాస్పర్ మ్యాట్‌తో “మేం ప్రస్తుతం వరుస విజయాలతో ఉన్నాం. ఇప్పుడున్న కంపెనీని వదిలి మీ కంపెనీకి ఎందుకు రావాలి?” అంటాడు. బెన్ మాటలు గుర్తొచ్చి మ్యాట్ “మీ మొదటి ఆల్బమ్ గొప్పది. కానీ రెండో ఆల్బమ్ ఏం బాలేదు. అందులో డ్యాన్స్ పాట ఒకటి పెట్టారు. ఎవరి కోసం? పిల్లకాయల కోసం. అది మీకు కూడా నచ్చలేదని నాకు తెలుసు. మా కంపెనీకి వస్తే మీ ప్రత్యేకత నిలబెట్టుకునేలా సహాయం చేస్తాం. లేకపోతే మీరు ప్రవాహంలో కొట్టుకుపోతారు” అంటాడు. జాస్పర్ ఆలోచనలో పడతాడు. చివరికి సరే అంటాడు. ఇంతలో కాస్త దూరంలో కూర్చుని వీరి మాటలు వింటున్న బెన్ అప్రయత్నంగా బట్టల్లోనే మూత్రవిసర్జన చేస్తాడు. అది చూసి బ్యాండ్ సభ్యులందరూ నవ్వుతారు. ఎగతాళి చేస్తారు. జోయి బెన్‌ని తీసుకుని బాత్రూమ్‌కి వెళుతుంది. మ్యాట్ జాస్పర్‌తో “మీరు కొత్తవాళ్ళు కాబట్టి పొగరుగా ఉన్నారు. ఇంకా ఏ మూలో మీతో ఒప్పందం చేసుకోవాలని ఉంది. కానీ మీ మీద నాకు గౌరవం పోయింది” అని వచ్చేస్తాడు. ఇది జోయి వింటుంది. కాసేపటికి విషయం మ్యాట్ కంపెనీ యజమానికి తెలిసిపోతుంది. మ్యాట్ ఉద్యోగం ఊడిపోతుంది.

హోటల్‌కి తిరిగి వచ్చాక మ్యాట్ బార్‌కి వెళతాడు. బెన్ జోయితో “మ్యాట్ పిచ్చి పని చేశాడు. ఒప్పందం చేసుకోవాల్సింది” అంటాడు. జోయి “మీ అవమానాన్ని సహించలేకపోయాడు. అతనికి థ్యాంక్స్ చెప్పండి” అంటుంది. బెన్ పట్టించుకోడు. జోయి “మీరు ఈ కాస్త దయ కూడా అతని మీద చూపించకపోతే నేను మీకు సాయం చేయను. మీ నర్సుగా ఉండను” అంటుంది. బెన్ అసహనంతో “నేనే నిన్ను తీసేస్తున్నాను” అంటాడు. అతను ఇలా చాలాసార్లు అన్నాడు. కానీ ఈసారి ఆమెకి తిరిగి వెళ్ళే ఉద్దేశం లేదు. ఆమె బార్‌కి వెళ్ళి మ్యాట్‌ని కలుసుకుంటుంది. తర్వాత ఇద్దరూ శారీరకంగా ఒకటవుతారు.

మ్యాట్‌కి మంచి సలహా ఇచ్చింది బెన్. ఆ సలహా పాటించబట్టి మ్యాట్‌కి తన ఉద్యోగం కాపాడుకునే అవకాశం వచ్చింది. కానీ బెన్ గౌరవానికి భంగం కలగటంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడు. అలా వదులుకోవటం బెన్‌కి నచ్చలేదు! చూశారా? మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో? ఒక వృధ్ధుడు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంటే పరిహాసం చేసే మనుషులకు మానవత్వం ఉన్నట్టేనా? మానవత్వం లేనివారి కళలో మానవత్వం ఎలా ఉంటుంది? అంటే కళ ప్రపంచానికి చూపించే మెరుగు మాత్రమే, మనసు మాత్రం సంకుచితం. బెన్ లాంటి వాళ్ళు ప్రపంచానికి నీతులు చెప్పరు. వారు మంచి మనుషులు కాకపోవచ్చు కానీ మంచి కళాకారులు. కొందరు కళాకారులు పైకి నీతులు చెబుతూ లోపల మాత్రం చౌకబారుగా ఉంటారు. అలాంటివారికి పతనం తప్పదు. అలాంటివారిని ప్రోత్సహించేవారు కూడా వారితో పాటు జారిపోకతప్పదు. మ్యాట్ చేసింది ఉన్నతమైన పని. అందుకే జోయి అతనికి దగ్గరయింది. మానవత్వం లేకపోవటం తప్పు కాదని బెన్ నమ్మకం. కానీ మ్యాట్ మానవత్వం చూసి అతనికి ఆశ్చర్యం కలిగింది. పైకి మాత్రం దాన్ని అసమర్థత అని కొట్టిపారేశాడు. నాలుకతో ఏమైనా అనవచ్చు, అంతరాత్మ మాట ఎలా విస్మరించగలం?

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

మర్నాడు జోయి హడావిడిగా బయల్దేరుతుంది. మ్యాట్ ఆపటానికి ప్రయత్నిస్తాడు. ఆమె “పొరపాటు చేశాను. నేను ఈ బంధానికి సిద్ధంగా లేను” అంటుంది. “నేను నీ మనసుని గాయపరచను. నీ మాజీ భర్తలా కాదు” అంటాడతను. “అతను తప్పు చేయలేదు. నేనే ఇంకొకరితో కలిసి తప్పు చేశాను. కారణం లేకుండానే!” అంటుందామె. స్క్రీన్‌ప్లే పకడ్బందీగా రాసుకోవటం వలన ఇది అనూహ్యంగా అనిపిస్తుంది. జోయి ఎంతో సౌమ్యంగా, సహనంగా ఉంటుంది. కానీ ఆమెలో కూడా లోపాలున్నాయి. వెనక్కి వెళ్ళి ఈ వ్యాసం చదివితే క్లింటన్ ప్రసక్తి వచ్చినపుడు బెన్ ‘క్లింటన్‌ని తప్పుబట్టటానికి నీకేం అధికారం ఉంది?’ అని ఆమెతో అనబోయాడు. కానీ మ్యాట్ అడ్డుపడటంతో ఆ మాట అనలేదు. తర్వాత బెన్ మోటుగా వారిద్దరినీ వేళాకోళం చేసినపుడు జోయి మౌనంగా ఉండటం విచిత్రంగా ఉంటుంది, కానీ దానికి కారణం ఇదీ. అసలు జోయి తన వ్యక్తిగత విషయాలు బెన్‌కి చెప్పిందంటే ఆమెకి అతని మీద ఎంత ఆప్యాయత ఉందో తెలుస్తుంది. తనలో ఉన్న లోపం తెలుసు కాబట్టే ఆమె బెన్ లోపాలని అర్థం చేసుకోగలిగింది. మ్యాట్ తన లోపాలకి తండ్రి కారణమని అనుకున్నాడు. మనుషుల అనుబంధాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఒక దశ వచ్చాక మనుషులని క్షమించేయాలి. లేకపోతే మనకే నష్టం.

మ్యాట్ ఎంత చెప్పినా జోయి వినకుండా వెళ్ళిపోతుంది. తర్వాత మ్యాట్ బెన్ గదికి వెళితే అతను అపస్మారక స్థితిలో ఉంటాడు. మ్యాట్ అతన్ని హాస్పిటల్లో చేర్పిస్తాడు. డాక్టరు అతను ఇంక ఎంతో కాలం బతకడని, అతన్ని హాస్పిటల్లోనే ఉంచడం మంచిదని అంటుంది. ఆ రాత్రి బెన్ మ్యాట్‌తో మాట్లాడతాడు. “నువ్వు నెలల బిడ్డగా ఉన్నప్పుడు నేను రాత్రివేళల్లో నీకు పాలు పట్టేవాడిని. నిన్ను గుండెలకి హత్తుకుంటే నీ ఊపిరి తెలుస్తూ ఉండేది. నీకు ఎన్నో బాసలు చేశాను. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తానని, రక్షిస్తానని. నా గుండెలో అంతులేని ప్రేమ ఉప్పొంగేది. తర్వాత నాకు ఏమైందో, ఏ దయ్యం పట్టిందో, నా స్వభావమే అంతేమో.. కానీ అవకాశం వస్తే గతంలోకి వెళ్ళి ఆ క్షణాల్లో ఎప్పటికీ జీవించాలని అనుకుంటూ ఉంటాను. నన్ను క్షమించమని అడగను. నీ మీద ప్రేమ మాత్రం ఉంది” అంటాడు. మ్యాట్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఎట్టకేలకు తండ్రిని క్షమిస్తాడు.

తర్వాత మ్యాట్ హాస్పిటల్ వాళ్ళకి తెలియకుండా బెన్‌ని కాన్సస్ తీసుకువెళతాడు. అక్కడ బెన్ షాపులో తన దగ్గరున్న ఫిల్మ్ డెవలప్ చేయటానికి ఇస్తాడు. అక్కడ చాలామంది ఫోటోగ్రాఫర్లు ఉంటారు. బెన్ అభిమానులు చాలామంది ఉంటారు. బెన్‌తో మాట్లాడి తమ అభిమానం వ్యక్తం చేస్తారు. అయితే డెవలప్ చేసిన ఫొటోల్లో ఏముందో చూసుకోకుండానే బెన్ మరణిస్తాడు. కానీ తాను తీసిన ప్రతి ఫొటో తనకి గుర్తుందని అంతకు ముందు అన్నాడు. చనిపోయే ముందు మంచం మీద కూర్చుని కెమెరా చూసుకుంటున్న బెన్ “ఆ శబ్దం విన్నావా?” అంటాడు. మ్యాట్ అప్పుడు బాత్రూమ్‌లో ఉంటాడు. చనిపోయే ముందు అనుభవం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. మరణంలో అందరూ ఒంటరివారే. బెన్ చివరి ఫొటో ప్రదర్శన ఇవ్వాలనుకోవటం అబద్ధం. అతను డెవలప్ చేయించిన ఫొటోలు మ్యాట్ చిన్నప్పటివి. ఆ ఫొటోల్లో బెన్, అతని భార్య, మ్యాట్ ఉంటారు. కొడుకు కోసం ఆ ఫొటోలు డెవలప్ చేయించాడు. ఉన్నోళ్ళకి పోయినోళ్ళు మిగిల్చిన తీపి గుర్తులవి. చివరికి మ్యాట్ జోయికి ఫోన్ చేస్తాడు. “నేను సంగీతం వదులుకున్నాను. నా భార్యని పోగొట్టుకున్నాను. తండ్రిని పట్టించుకోలేదు. ఇప్పుడు సంగీతసాధన మళ్ళీ మొదలుపెడుతున్నాను. నిన్ను వదులుకోవటం ఇష్టం లేదు” అని వాయిస్ మెసేజ్ పెడతాడు. ఆమె అతని దగ్గరకి రావటంతో చిత్రం ముగుస్తుంది.

జీవితం బావుండాలంటే గతాన్ని గతంలోనే వదిలెయ్యాలి. అవతలి వారు సుముఖంగా ఉంటే బంధాలు మళ్ళీ కలుపుకోవచ్చు. లేకపోతే క్షమించి సాగిపోవటమే మంచిది. ఒకవేళ మనమే తప్పు చేస్తే? క్షమాపణ అనగానే వేరొకరిని క్షమించటం అనే అనుకుంటాం. మనల్ని మనం కూడా క్షమించుకోవలసిన సందర్భాలు దాదాపు అందరి జీవితాలలోనూ ఉంటాయి. అది ఎంతో ముఖ్యం. అయితే మళ్ళీ ఆ తప్పు చేయననే సంకల్పం ఉండాలి. తప్పులు చేస్తూ పోయి బెన్ క్షమాపణా అడగలేదు, తనను తానూ క్షమించుకోలేదు. ‘నేనింతే’ అనుకున్నాడు. మ్యాట్ తండ్రిని క్షమించి కొత్త జీవితం ప్రారంభించాడు. జోయి తనని తాను క్షమించుకుని మ్యాట్‌కి తోడుగా నిలిచింది. డీన్ భార్య లాగ ఆమె నిజాన్ని దాచలేదు. కాబట్టి ఆమె భయపడాల్సిన పని కూడా లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here