మరుగునపడ్డ మాణిక్యాలు – 12: కోర్ట్

0
5

[dropcap]మ[/dropcap]న సినిమాల్లో కోర్టు సన్నివేశాలు ఎంతో నాటకీయంగా ఉంటాయి. అనర్గళమైన ప్రసంగాలు, ముద్దాయిలను, సాక్షులను ఊపిరి సలుపుకోనీయకుండా న్యాయవాదులు వేసే ప్రశ్నలు చూసి చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. కానీ నిజంగా కోర్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయో మనలో చాలామందికి తెలియదు. రచయిత, దర్శకుడు చైతన్య తమ్హాణేకి ఇదే ఆలోచన వచ్చింది. టీవీలో ఒక సీరియల్లో కోర్టు సన్నివేశాలు చూసి నిజమైన కోర్టులో ఏం జరుగుతుందో చూపించాలని అనుకున్నాడు. అదే ‘కోర్ట్’ (2014) అనే మరాఠీ చిత్రం. పేరుకి మరాఠీ చిత్రమే కానీ హిందీ, ఆంగ్లం, గుజరాతీ భాషలు కూడా ప్రధానంగా వినపడతాయి. చైతన్యకి ఇదే తొలి పూర్తి నిడివి చిత్రం. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. ఈ చిత్రం తర్వాత వచ్చిన ‘పింక్’ (2016), ‘ముల్క్’ (2018) అనే హిందీ చిత్రాల్లో కోర్టు వాతావరణాన్ని సహజంగా చూపించినా న్యాయవాదుల్ని మాత్రం నాటకీయంగానే చూపించారు. న్యాయవాదుల్ని సహజంగా చూపించిన చిత్రం ‘కోర్ట్’. మామూలుగా లాయర్లు గొప్ప వక్తలు కాదని, ముఖ్యమైన పత్రాలను పోగొట్టుకుంటూ ఉంటారని, వారి వాదనలు సాంకేతికంగా, భావోద్వేగరహితంగా ఉంటాయని చైతన్య గమనించాడు. అదే సినిమాలో చూపించాడు. ఇందులో నుంచే హాస్యం పుడుతుంది.

చైతన్య 23 ఏళ్ళ వయసులోనే ‘సిక్స్ స్ట్రాండ్స్’ అనే ఒక పొట్టి చిత్రం (షార్ట్ ఫిల్మ్) తీశాడు. ఇంకో చిత్రం తీయటానికి డబ్బు లేదు. అతని స్నేహితుడు వివేక్ గోంబర్ అనే నటుడు అతని ఆలోచన విని నెలకి పదిహేను వేలు ఇస్తానని, స్క్రీన్ ప్లే వ్రాయమని చెప్పాడు. దరిమిలా వివేక్ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర కూడా పోషించాడు. కోర్టు కార్యకలాపాల మీద పరిశోధన చేసి స్క్రీన్ ప్లే వ్రాయటానికి చైతన్యకి ఒక సంవత్సరం పట్టింది. పరిశోధనలో భాగంగా లాయర్లతో, విద్యావేత్తలతో, సంఘసేవకులతో మాట్లాడాడు. పుస్తకాలు, పత్రికల్లోని వార్తలు చదివాడు. 2007లో ఝార్ఖండ్ లోని చిల్కారీలో జరిగిన హత్యాకాండ అతన్ని ఆకర్షించింది. ఆ హత్యాకాండలో నక్సలైట్లు 20 మందిని చంపేశారు. పోలీసులు నక్సలైట్లతో పాటు జితేన్ మరాండీ అనే సాంస్కృతిక కార్యకర్తని అరెస్టు చేశారు. అతని ‘నేరం’ ఏమిటంటే అతని పేరు, ఒక నక్సలైటు పేరు ఒకటే కావటం. 2016 వరకు అతను జైల్లోనే మగ్గిపోయాడు. ఈ ఉదంతమే కాకుండా కబీర్ కళా మంచ్ అనే సంస్థలోని ప్రజాగాయకుల మీద కేసులు పెట్టిన ఉదంతం కూడా చైతన్య పరిశోధనలో బయటపడింది. అంతా బావుంది కానీ చిత్రంలో కోర్టుకొచ్చే వ్యాజ్యం ఏమిటి అని ఆలోచిస్తున్న తరుణంలో పారిశుధ్య కార్మికుల దుర్భర పరిస్థితుల గురించి చదివాడు చైతన్య. వీటన్నిటినీ క్రోడీకరించి స్క్రీన్ ప్లే తయారు చేశాడు. కోర్టు వెలుపల న్యాయవాదుల జీవితాలు ఎలా ఉంటాయనే విషయం కూడా జోడించటంతో స్క్రీన్ ప్లే కొత్త ఊపిరి పోసుకుంది. కొసమెరుపుగా జడ్జి వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుందో కూడా చూపించారు.

సినిమా మొదట్లో ఒక వయసు మళ్ళిన వ్యక్తి ముంబైలో ఒక ఇంట్లో పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. అతని పేరు నారాయణ్ కాంబ్లే (వీరా సతిదార్). పాఠాలు పూర్తవగానే బస్సు ఎక్కి ఒక మురికివాడకి వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన ఒక సాంస్కృతిక కార్యక్రమంలో విప్లవగీతాలు పాడతాడు. ఇంతలో పోలీసులు వచ్చి అతన్ని అరెస్టు చేస్తారు. అతని లాయరు వినయ్ వోరా (వివేక్ గోంబర్). 35 ఏళ్ళుంటాయి. పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి విచారణ చేస్తున్న పోలీసు అధికారిని విషయమేంటని అడుగుతాడు. గత వారం ఒక మురికివాడలో నారాయణ్ పాట పాడుతూ పారిశుధ్య కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలని పాడాడని, ఆ పాట విని వాసుదేవ్ అనే మ్యాన్‌హోల్ కార్మికుడు మ్యాన్‌హోల్ లోనే ఆత్మహత్య చేసుకున్నాడని, నారాయణ్ మీద ఆత్మహత్య ప్రేరేపణ కేసు పెట్టామని చెబుతాడు. వినయ్ తో వచ్చిన నారాయణ్ శిష్యుడు “అది ప్రమాదం కూడా అయి ఉండవచ్చు కదా?” అని వాదించటం మొదలు పెడతాడు. వినయ్ అతన్ని ఆపి “ఇక్కడ వాదించి లాభం లేదు” అంటాడు. లాయరు కాబట్టి వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అతనికి తెలుసు. మనలాంటి వాళ్ళు పోలీసులతో వాదనకి దిగి లేనిపోని సమస్యలు తెచ్చుకుంటారు. వాదనలన్నీ జడ్జి దగ్గరే వినిపించాలి.

నారాయణ్ గతంలో ఒక మిల్లులో పనిచేసేవాడు. మిల్లు మూతపడింది. పెన్షన్ రాదు. ఏడు సంవత్సరాల క్రితం వరకు ఏదో ఒక పార్టీలో ఉండేవాడు. వాటి మీద కూడా నమ్మకం పోయి ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నాడు. అరెస్టయిన తర్వాత మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి అతనికి నిర్బంధం విధిస్తాడు. కేసు సెషన్స్ కోర్టుకి బదిలీ అవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఒక లాయరు కునుకు తీస్తూ ఉంటుంది. కొందరికి జీవిత సమస్య, కొందరికి జీవిక సమస్య. యాంత్రికంగా పనులు చేసుకుంటూపోతారు. మెజిస్ట్రేట్ కోర్టులో వాచీ దొంగతనం కేసు ఒకటి విచారణకి వస్తుంది. అమెరికా నుంచి వచ్చిన స్నేహితుడు ఇచ్చిన వాచీ తన పేటలో ఉండే ఒకతను దొంగతనం చేశాడని ఫిర్యాదుదారుడు అంటాడు. నిందితుడి తరఫు లాయరు తన క్లయింటుకి కూడా ఎవరో అమెరికా నుంచి వాచీ తెచ్చి ఇచ్చి ఉండవచ్చు కదా అంటాడు. నిందితుడి వాచీ మీద సీరియల్ నంబరు, ఫిర్యాదుదారుడి వాచీ సీరియల్ నంబరు ఒకటే అని ఇతని లాయరు అంటాడు. ఆ సంఖ్య ఆ మోడల్‌కి సంబంధించినదని, ఒకే సంఖ్య ఉండొచ్చని నిందితుడి లాయరు అంటాడు. జడ్జి విస్తుపోతాడు. ఒకే సీరియల్ నంబరు ఎలా ఉంటుందని అంటాడు. తన సహాయకురాలి వైపు చూసి “ఒకే నంబరు ఉండదు కదా” అంటాడు. ఆమె ఏమంటుంది? “ఉండదుగా” అన్నట్టు తల పంకిస్తుంది. “విచారణ చెయ్యండి” అని జడ్జి కేసు వాయిదా వేస్తాడు. చిన్న దొంగతనం కేసే ఇలా ఉంటే ఇక పెద్ద కేసులు ఏళ్ళ తరబడి నడుస్తూ ఉండటంలో ఆశ్చర్యం ఏమిటి? తన పరిశోధనలో ఎన్నో కేసులు చూసిన చైతన్య కోర్టుల పనితీరుని చూపించటానికి ఈ కేసుని చిత్రంలో పెట్టాడు.

నారాయణ్ కేసులో ప్రభుత్వ లాయరు నూతన్ (గీతాంజలి కులకర్ణి) అనే మహిళా లాయరు. 40 ఏళ్ళుంటాయి. నారాయణ్ పాటలో పారిశుధ్య కార్మికులు ఆత్మగౌరవం కోసం ఆత్మహత్య చేసుకోవాలని ఉందని, అది విని వాసుదేవ్ ఎలాంటి రక్షణ లేకుండా మ్యాన్‌హోల్ లోకి దిగి అక్కడున్న విషవాయువులు పీల్చి ప్రాణం తీసుకున్నాడని అంటుంది. డ్రమాటిక్ పెర్ఫార్మెన్సెస్ యాక్ట్ (నాటకీయ ప్రదర్శనల చట్టం) ప్రకారం రాజద్రోహం, సమాజహాని కలిగించే ప్రదర్శనలు ఇవ్వకూడదని కూడా అంటుంది. వినయ్.. వాసుదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడనటానికి ఎలాంటి ఆధారాలు లేవని అంటాడు. చట్టం ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించాలంటే ఆ ఉద్దేశం ఉండాలని, వాసుదేవ్ ఆత్మహత్య చేసుకునేలా చేయాలనే ఉద్దేశం నారాయణ్‌కు లేదని అంటాడు. ఇక నాటకీయ ప్రదర్శనల చట్టం ఆంగ్లేయుల కాలం నాటిదని, దాని పునస్సమీక్షించాలని అంటాడు. నూతన్ “ఈ వాదన చెల్లదు. ఆ చట్టం ఉంది కాబట్టి అమలు చేయాల్సిందే” అంటుంది. ఆమె మాట తీరు, చేతి సంజ్ఞలు చూస్తే తన ఇంట్లో వాళ్ళతో ఎలా వాదిస్తుందో అలాగే ఉంటుంది. జడ్జి చెప్పినదానికి తల పంకించి ఆమోదం, అంగీకారం తెలుపుతుంది. నాటకీయమైన లాయరు పాత్రలు చూసిన మనకు ఆమెని చూసి నవ్వు వస్తుంది. కోర్టుకి వెళ్ళి చూస్తే ఇలాంటి లాయర్లే ఉంటారు కదా అని ఒక పక్కన అనిపిస్తుంది. అభియోగాలు, చట్టాలు అంగ్లంలో రాసుకుని చదువుతుంది. కేవలం అప్పజెప్పినట్టు ఉంటుంది. ఏ భావోద్వేగాలు ఉండవు. మధ్యమధ్యలో జడ్జితో మరాఠీలో మాట్లాడుతుంది. వినయ్ గుజరాతీ వాడు. ఆంగ్లం, హిందీ కూడా మాట్లాడగలడు. మరాఠీ రాదు. ఒకసారి అతను “హిందీలో గానీ, ఆంగ్లంలో గానీ మాట్లాడమని ఆవిడకి చెప్పండి” అని జడ్జిని కోరతాడు, తన క్లయింటు మరాఠీ వాడని మరచిపోయి. నారాయణ్ “నాకు మరాఠీలో మాట్లాడటమే సౌకర్యం” అంటాడు. జడ్జి వినయ్‌తో “మీకేమైనా అర్థం కాకపోతే నన్నడగండి” అంటాడు. వాళ్ళ మాతృభాషాభిమానం అలాంటిది.

కేసు వివరాలు చదివి నారాయణ్ మీద సానుభూతి కలిగింది కదా? అయితే నారాయణ్ మొండివాడు. గతంలో అరెస్టయ్యాడు. విప్లవగీతాలు ప్రదర్శించే ముందు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని కోర్టు చెప్పినా వినడు. ఈ కేసు విచారణలో “ఆత్మహత్య అంశంగా ఎప్పుడైనా పాటలు వ్రాశారా?” అని నూతన్ అడిగితే వ్రాశానంటాడు. “పారిశుధ్య కార్మికులు ఆత్మహత్య చేసుకోవాలని పాటలు వ్రాశారా?” అంటే “ఇంతవరకూ రాయలేదు” అంటాడు! “ఇకపై వ్రాసే అవకాశం ఉందా?” అంటే “ఉంది” అంటాడు. జడ్జి విస్తుపోతాడు. వినయ్‌తో “మీకర్థమయింది కదా? ఇది క్లిష్టంగా మారిపోతోంది” అంటాడు నవ్వుతూ. నారాయణ్ లాంటి వాళ్ళు న్యాయం కోసం పోరాడి విసిగిపోయారు. ప్రజల్లో చైతన్యం కలిగించాలని వారి ఉద్దేశం. అందుకని రక్తం మరిగించే సాహిత్యం వ్రాస్తారు. వారికి ప్రాణాల మీద తీపి లేదు. శ్రమ దోపిడీ తగ్గాలనే వారి తపన. కానీ వారి గొంతు కింది స్థాయిలోనే తొక్కి వేస్తున్నారు.

చిత్రంలో మధ్యమధ్యలో వినయ్, నూతన్ వ్యక్తిగత జీవితాలు చూపిస్తారు. వినయ్ అవివాహితుడు. తలిదండ్రుల నుంచి వేరుగా ఉంటాడు. కార్లో ప్రయాణిస్తాడు. సాయంత్రం వేళల్లో మద్యం తాగుతాడు. వీలైనపుడు స్నేహితులతో బార్లకు వెళతాడు. ఇవి ఖరీదైన బార్లు. అక్కడ గాయనీగాయకులు పాటలు పాడతారు. వినయ్‌ది ఖరీదైన జీవనశైలి. అయితే మనవహక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటాడు. నూతన్‌కి భర్త, ఇద్దరు పిల్లలు. మధ్య తరగతి కుటుంబం. ఆమె లోకల్ రైళ్ళలో ప్రయాణిస్తుంది. కోర్టులో పని అయ్యాక పిల్లవాడిని పిల్లల సంరక్షణ కేంద్రం నుంచి ఇంటికి తీసుకువెళుతుంది. వంటసామగ్రి కొంటుంది. వంట చేస్తుంది. రాత్రివేళ తన కేసుని అధ్యయనం చేస్తుంది. అయితే ఆమె మనసు మొద్దుబారిపోయిందని అనిపిస్తుంది. లాయరు ఉద్యోగం ఆమెకి ఒక ఉద్యోగం మాత్రమే. తోటి లాయర్లతో “నారాయణ్ లాంటివాళ్ళకి 20 ఏళ్ళ శిక్ష వేయాలి, మళ్ళీ మళ్ళీ కోర్టుకి రాకుండా. అవే మొహాలు చూసి చూసి విసుగొచ్చింది” అంటుంది. పెళ్ళయ్యి పిల్లలు పుడితే వినయ్ కూడా అలాగే మారిపోతాడేమో! వారి జీవనశైలులు వేరు. వినయ్ సరదాగా ఉంటాడు. నూతన్ గృహిణి బాధ్యతలతో తలమునకలై ఉంటుంది. అయితే వారి ఆదర్శాలు వారి జీవనశైలికి భిన్నంగా ఉంటాయి. వినయ్ ‘నినాద్’ అనే మానవహక్కుల సంస్థలో పని చేస్తుంటాడు. నూతన్ కేసులు త్వరత్వరగా తనకు అనుకూలంగా పరిష్కారమైతే చాలు అనుకుంటుంది. నిజానిజాలు ఆమెకి అనవసరం. పోలీసులు ఏమి చెబితే అదే ఆమెకి నిజం. ఈ వైవిధ్యం చూపించి చైతన్య ఆలోచింపజేశాడు. జీవనశైలిని బట్టి ఎవరినీ అంచనా వేయకూడదని చెప్పకనే చెబుతాడు. చివరికి జడ్జి జీవనశైలిని కూడా చూపిస్తాడు. అది చూసి గుండె లోతుల్లో నుంచి ఒక నిట్టూర్పు వస్తుంది.

కేసు ఏమైందనే దానికన్నా కోర్టు కార్యకలాపాలు ఎలా ఉంటాయనేది చూపించటమే చైతన్య ముఖ్య ఉద్దేశం. ఏళ్ళ తరబడి కేసులు నడుస్తూ ఉంటాయి. వినయ్ ఒక సభలో ప్రసంగించటానికి వెళతాడు. (అతన్ని ఆహ్వానించే సంచాలకురాలు అతను ‘నిదాన్’ అనే సంస్థ నుంచి వచ్చాడంటుంది. అతను ‘నినాద్’ అని సరిచేస్తాడు.) తన క్లయింటు ఒకరు ఐదేళ్ళ పాటు కేసు ఎదుర్కొన్నాడని, చివరికి అతన్ని విడిపించి కోర్టు బయటకు వస్తుంటే అతన్ని తప్పుడు కేసు మీద మళ్ళీ అరెస్టు చేశారని అంటాడు. ప్రశ్నించేవారి గొంతు నొక్కటమే పనిగా కొందరు పోలీసులు పనిచేస్తుంటారు. వారి వెనక రాజకీయ శక్తులు ఉంటాయనేది కాదనలేని నిజం. పోలీసులు వారెంటు లేకుండా సోదాలు చేస్తారు. ఒకే సాక్షి చేత వేరు వేరు కేసుల్లో దొంగ సాక్ష్యం ఇప్పిస్తారు. నూతన్ లాంటి లాయర్లు ఇదేమిటని ప్రశ్నించరు. జడ్జీలు చూసీ చూడనట్టు వదిలేస్తారు.

చిత్రంలో నారాయణ్, వినయ్, నూతన్‌ల వ్యక్తిగత కార్యకలాపాలు చూపించినపుడు సాధారణ పౌరుల జీవితాలు చూసినట్టే ఉంటుంది. సీన్లు సావకాశంగా సాగుతాయి. కెమెరా ఎక్కువగా కదలదు. నిజజీవితం ఎలా తీరికగా కదులుతుందో అలాగే సన్నివేశాలు ఉంటాయి. నేపథ్యసంగీతం అసలు ఉండదు. నారాయణ్ పాటలు పాడినపుడు మాత్రమే సంగీతం ఉంటుంది. కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు నారాయణ్‌ని నూతన్ ప్రశ్నిస్తుంది. కానీ నిబంధనల ప్రకారం ప్రభుత్వ లాయరు నిందితుణ్ని ప్రశ్నించటం నిషిద్ధం. చైతన్య కథనం సాఫీగా సాగటానికి కొంత స్వతంత్రం తీసుకున్నాడు. కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో అనే ఉత్కంఠ మాత్రం ఉంటుంది. వాసుదేవ్ భార్య సాక్ష్యం చెప్పే దృశ్యం చిత్రానికే తలమానికం. ఆమె మారుమూల గ్రామం నుంచి ముంబైకి వలస వచ్చిన స్త్రీ. ఆమె ఎంతో మామూలుగా చెప్పే మాటలు మనల్ని విస్తుపోయేలా చేస్తాయి. ఉదాహరణకి “మీ వయసెంత?” అని అడిగితే “తెలియదు” అంటుంది. మారుమూల ప్ర్రాంతాల్లో గత శతాబ్దం చివరి దాకా జననమరణాల నమోదు సరిగా జరిగేది కాదనే వాస్తవం కళ్ళ ముందుకొస్తుంది. అభివృద్ధి జరుగుతోంది కానీ పేదరికం కూడా పెరుగుతోంది. అందరికీ అభివృద్ధి ఫలాలు ఎప్పటికి అందుతాయో?

ఈ చిత్రాన్ని 2014లో వెనిస్ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. ఇంకా అనేక చిత్రోత్సవాలలో ప్రదర్శించారు. 2015 లో భారత ప్రభుత్వం జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు వచ్చింది. భారత్ తరఫున ఆస్కార్ అవార్డు పరిశీలనకు పంపించింది. అయితే నామినేషన్ రాలేదు. నూతన్‌గా గీతాంజలి కులకర్ణి నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒక ప్రభుత్వ లాయరు ఆంగికాన్ని, చేతి సంజ్ఞలను, మాటతీరుని గమనించి అనుకరించింది. మొదట్లో అభియోగం అంతా తన దగ్గర ఉన్న కాగితం చూసి ఆంగ్లంలో చదివి, అయిపోయిన తర్వాత జడ్జితో “అయిపోయింది” అని మారాఠీలో అంటుంది. “థ్యాంక్యూ యువరానర్” అనో “దట్సాల్ యువరానర్” అనో ముగించటం మనం చూశాం. “అయిపోయింది” అంటే కిసుక్కున నవ్వొస్తుంది. “ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు” అని అనవచ్చు. ఒక సందర్భంలో వినయ్‌ని ఉద్దేశించి జడ్జితో మరాఠీలో “ఆయన అభిప్రాయం చాలా అభ్యంతరకరంగా ఉంది” అంటుంది. “ఆంగ్లంలో చెప్పండి” అని వినయ్ అంటే అతని వైపు తిరిగి “ఇట్స్ వెరీ అఫెన్సివ్” అని ‘అర్థమయిందా?’ అన్నట్టు అరచేయి చూపిస్తుంది. వాళ్ళిద్దరూ ఇలా వాదించుకున్నా అందులో కూడా భావోద్వేగాలు ఉండవు. నూతన్ తన మాట తాను చెప్పేసి వెంటనే తన కాగితాల మీదకి చూపు మరల్చుకుంటుంది. జడ్జి మందలిస్తే ‘మీరెలా అంటే అలా’ అన్నట్టు తల పంకించి కాగితాల వైపు చూస్తుంది. గీతాంజలి దరిమిలా సోనీ లివ్‌లో వచ్చే ‘గుల్లక్’ వెబ్ సెరీస్ లో నటించి మంచి పేరు సంపాదించుకుంది. జడ్జిగా నటించిన ప్రదీప్ జోషీ, వాసుదేవ్ భార్యగా నటించిన ఉషా బానే కొత్తనటులైనా చక్కగా నటించారు.

కోర్టులు ఎలా ఉంటాయో తెలుసుకోవాలనుకునేవారు ఈ సినిమా చూస్తే అవగాహన వస్తుంది. కోర్టుల్లో సంస్కరణలు రావాలని న్యాయమూర్తులు ఎందుకంటారో అర్థమౌతుంది. కోర్టుకి వెళ్ళటం కంటే మధ్యవర్తిత్వం మేలని కొందరు న్యాయమూర్తులు ఎందుకు అంటారో తెలుస్తుంది. నేరం చేస్తే తప్పదనుకోండి.. సివిల్ తగాదాలు మధ్యవర్తుల సహాయంతో పరిష్కరించుకోవటం మంచిది.

ఈ చిత్రంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారో ఈ క్రింద ప్రస్తావిస్తాను. సినిమా చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. సినిమా చూసిన తర్వాత చదవవచ్చు.

వారెంటు లేకుండా నారాయణ్ ఇంట్లో లేనపుడు అతని ఇంటిని పోలీసులు సోదా చేశారని కోర్టులో తెలుస్తుంది. ఇన్‌స్పెక్టర్‌ని జడ్జి మందలిస్తాడు. “పోలీసు విధుల నియమావళి చదవలేదా? అతను ఇంట్లో లేనపుడు సోదా చేశారంటే అతను సహకరించడని తప్పుడు ఊహతో వెళ్ళినట్టే కదా?” అంటే ఇన్‌స్పెక్టర్ “చిత్తం” అంటాడు. నియమాలు ఉల్లంఘించటం, జడ్జితో చీవాట్లు తినటం, మళ్ళీ నియమాలు ఉల్లంఘించటం – ఇదే వరస. వంద తప్పులు చేస్తే శిశుపాలుడికి శిక్ష పడ్డట్టు పోలీసులకి కూడా శిక్షలు పడాలి.

జైల్లో ఉన్న ఒక నక్సలైటు నుంచి నారాయణ్‌కి వచ్చిన ఉత్తరం ప్రస్తావన వస్తుంది. ఇది సోదాలో దొరికిన ఉత్తరం అని స్పష్టంగా చెప్పకపోయినా అంతకన్నా వేరే విధంగా ఆ ఉత్తరం బయటికి రాదు కదా! వారెంటు లేని సోదాలో దొరికినవి కోర్టులో సాక్ష్యాలుగా వాడకూడదని కొన్ని దేశాల్లో నిబంధనలు ఉన్నాయి. మన దేశం ఆ నిబంధన లేదేమో మరి. ఉన్నా జడ్జిలు పాటించరేమో! ఆ ఉత్తరంలో జైలు అధికారుల్ని ఆ నక్సలైటు దూషించాడని ఇన్‌స్పెక్టర్ అంటాడు. “దూషించాడా లేక వారి మీద ఫిర్యాదు చేశాడా” అని వినయ్ అడిగితే “రెండూ ఒకటే కదా” అంటాడు ఇన్‌స్పెక్టర్. ప్రశ్నిస్తే దూషించినట్టే! విధ్వంసానికి ఏదో పథకం రచిస్తున్నారని అంటాడు ఇన్‌స్పెక్టర్. వినయ్ “ఆ ఉత్తరంలో తన తల్లి బాగోగులు చూసుకోమని ఆ నక్సలైటు కోరాడు. అందులో విధ్వంసం ఏముంది?” అంటాడు. “వాళ్ళు సంకేత భాషలో మాట్లాడుకుంటారు. అందులో ఏదో రహస్య సమాచారం ఉంది” అంటాడు ఇన్‌స్పెక్టర్. “ఏమిటా రహస్యం?” అని అడుగుతాడు వినయ్. “ఉత్తరం ఇంటెలిజెన్స్ విభాగానికి పంపించాము. వాళ్ళు రహస్యం బయటికి లాగుతారు” అంటాడు ఇన్‌స్పెక్టర్. “సరే. వాళ్ళు రహస్యం కనిపెట్టాకే చూద్దాం” అంటాడు జడ్జి. ఇదంతా ఒక ప్రహసనంలా ఉంటుంది. మొత్తానికి కోర్టులో జరిగే వ్యవహారాలు డాక్యుమెంటరీలా కాకుండా ఆసక్తికరంగా మలచాడు చైతన్య. చిత్రం విడుదలయ్యేటప్పటికి అతని వయసు 29 మాత్రమే అంటే నమ్మబుద్ధి కాదు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here