మరుగునపడ్డ మాణిక్యాలు – 16: సౌండ్ ఆఫ్ మెటల్

0
13

[dropcap]అ[/dropcap]నుకోనిదేదైనా జరిగితే ‘నాకే ఎందుకు ఇలా జరిగింది’ అని చాలామంది అనుకుంటారు. ‘సరే జరిగింది. ఇప్పుడేం చెయ్యాలి’ అని ఆలోచించేవాళ్ళు కొందరు ఉంటారు. ‘నేను అనుకున్నట్టే ఈ సమస్య పరిష్కారమవ్వాలి’ అని అనుకునేవాళ్ళు కొందరుంటారు. ఎవరు చెప్పినా వినరు. మనలాగే సమస్యలు ఎదుర్కొన్నవాళ్ళ మాటలు విని, వారి అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ఇలాంటి కథతో వచ్చిన చిత్రం ‘సౌండ్ ఆఫ్ మెటల్’ (2020). ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం. పెద్దలకు మాత్రమే.

రూబెన్ డ్రమ్స్ వాయించే కళాకారుడు. అతని ప్రియురాలు లూ పాటలు పాడుతుంది, గిటార్ వాయిస్తుంది. వారి సంగీతం హెవీ మెటల్ అనే కోవకి చెందినది. ఈ కోవ సంగీతంలో శబ్దం ఎక్కువ స్థాయిలో ఉంటుంది. వారిద్దరూ ఒక రిక్రియేషనల్ వెహికిల్ (ఇంటిలో ఉండాల్సిన కనీస సౌకర్యాలు ఉండే వాహనం. దీన్ని సంక్షిప్తంగా ఆర్వీ అంటారు) లో నివాసముంటూ, ప్రయాణిస్తూ చిన్న చిన్న సంగీత ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు. ఆ వాహనంలోనే సంగీతం రికార్డు చేయటానికి కావల్సిన పరికరాలు ఉంటాయి. అతని ఛాతీ మీద ‘ప్లీజ్ కిల్ మీ’ (నన్ను చంపేయండి) అనే పచ్చబొట్టు ఉంటుంది. ఆమె చేతి మీద గోళ్ళతో లోతుగా గీసుకున్న మచ్చలు ఉంటాయి. అవి వారిద్దరూ గతంలో అనుభవించిన వేదనకు గుర్తులు.

ఒకరోజు అకస్మాత్తుగా రూబెన్‌కి వినికిడి శక్తి తగ్గిపోతుంది. డాక్టర్ దగ్గరకి వెళితే అతనికి 70 శాతం వినికిడి శక్తి పోయిందని, ఇంకా తగ్గిపోతుందని చెబుతాడు. పెద్ద శబ్దాల వల్ల ఇలా జరిగిందో లేక వేరే కారణాల వల్ల జరిగిందో తెలియదని, అతన్ని పెద్ద శబ్దాలకు దూరంగా ఉండమని చెబుతాడు. ఆపరేషన్ చేసి కృత్రిమ పరికరాలు అమర్చవచ్చని, అయితే దానికి నలభై వేల డాలర్ల పైనే ఖర్చవుతుందని అంటాడు. రూబెన్ సంగీత ప్రదర్శనలు మానుకోవటం ఇష్టం లేక ప్రదర్శన ఇస్తాడు. అయితే ప్రదర్శనలో అతనికి సరిగా వినపడక అతని డ్రమ్స్‌కి, లూ పాటకి పొంతన కుదరదు. అతను ఆమెకి అసలు విషయం చెబుతాడు. రూబెన్ గతంలో డ్రగ్స్‌కి బానిస. అతనికి లూ పరిచయమయ్యాక అతను డ్రగ్స్ మానేశాడు. అతనికి చెముడు రావటానికి అతని ప్రదర్శనల్లోని పెద్ద శబ్దాలే కారణమని అనుకోవచ్చు. అలాంటపుడు ఆ సంగీతాన్ని వదిలేయాలి కదా! అయినా అతడు వదలడు. దీనికి కారణం అతనికి లూ మీద ఉన్న మమకారం. ఆమె గాయని, అతను ఆమెకి వాద్యసహకారం అందిస్తాడు. అతను సరిగా డ్రమ్స్ వాయించకపోతే ఆమె అతన్ని వదిలి వెళ్ళిపోతుందని అతని భయం. నెమ్మదిగా అతని వినికిడి శక్తి బాగా తగ్గిపోతుంది. తెలిసిన వారి ద్వారా ఒక బధిరుల కేంద్రం గురించి తెలుస్తుంది. ఇద్దరూ అక్కడికి వెళతారు.

బధిరుల కేంద్రాన్ని నడిపే జో రూబెన్‌ని ఆ కేంద్రంలో కొన్నాళ్ళు ఉండమంటాడు. రూబెన్ మాట్లాడటానికి సంకోచిస్తుంటే తన గురించి చెబుతాడు. అతనికి పెదవుల కదలికల బట్టి అవతలి వారు ఏం మాట్లాడుతున్నారో అర్థమౌతుంది. రూబెన్‌కి మాట నుంచి వ్రాత పుట్టించే సాఫ్ట్‌వేర్ ద్వారా అతను మాట్లాడేది కంప్యూటర్ తెర మీద కనపడుతుంది. జో వియత్నాం యుద్ధంలో బాంబు పేలుడుతో బధిరుడయ్యాడు. ఆ తర్వాత తాగుడుకి బానిస అయ్యాడు. అతని భార్య కొడుకుని తీసుకుని అతన్ని వదిలి వెళ్ళిపోయింది. “నా చెవిటితనం వల్ల ఆమె నన్ను వదలలేదు. నా తాగుడు భరించలేక వెళ్ళిపోయింది” అంటాడు. “ఈ కేంద్రంలో మేం వినికిడి మీద దృష్టి పెట్టము, ఆలోచనల మీద దృష్టి పెడతాము” అంటాడు. అంటే చెవిటితనం ఉన్నా మనోధైర్యంతో ఎలా జీవించాలో నేర్పిస్తారు. జో ఇష్టం కొద్దీ యుద్ధంలో పాల్గొన్నాడా అంటే అయి ఉండకపోవచ్చు. అయినా అతను చెవిటివాడయ్యాడు. విధి ఒక్కోసారి అలాగే ఉంటుంది. కుమిలిపోతూ కూర్చుంటే జీవితం పాడవుతుంది. జో తన జీవితాన్ని చక్కదిద్దుకున్నాడు. ఇతరులకి సహాయం చేస్తున్నాడు.

రూబెన్ ఆపరేషన్ చేయించుకుంటానంటాడు. అది ఖర్చుతో కూడుకున్నది కదా అంటాడు జో. ఆ కేంద్రంలో ఉండటానికి కూడా రూబెన్ దగ్గర డబ్బు లేదు. చర్చ్ వాళ్ళు సాయం చేస్తారంటాడు జో. “నాకు దేవుడి మీద నమ్మకం లేదు” అంటాడు రూబెన్. “చర్చ్ వాళ్ళు అవసరం అయినవాళ్ళకు సాయం చేస్తారు, కేవలం దేవుణ్ణి నమ్మేవారికి మాత్రమే కాదు” అంటాడు జో. అయితే రూబెన్ ఒక్కడే కేంద్రంలో ఉండాలని చెబుతాడు. అక్కడ ఉండేవారు ఒకరికొకరు తోడుగా ఉంటారు గానీ బయటవారు తోడుగా ఉండరు. బయటవారు ఉంటే వారి మీద ఆధారపడతారు. మరి స్వావలంబన ఎలా నేర్చుకుంటారు? బయటవారిని చూసి తమకి చెముడు లేకుంటే బావుండేదనే భావన కూడా వస్తుంది. రూబెన్‌కి లూని వదలటానికి మనసు ఒప్పుకోదు. అసహనం కలుగుతుంది. అక్కడి నుంచి విసవిసా వచ్చేస్తాడు.

లూ అతని గురించి ఆందోళనగా ఉంటుంది. అసహనం పెరిగితే అతను మళ్ళీ డ్రగ్స్ తీసుకోవటం మొదలుపెట్టవచ్చు. జో కూడా “వినికిడి పోయాక డ్రగ్స్ తీసుకోవాలని అనిపించిందా” అని అడుగుతాడు. ఇలాంటి వారిని చాలా మందికి చూసి ఉన్నాడు అతను. వేదన మర్చిపోవటానికి డ్రగ్స్ మీద ఆధారపడతారు. రూబెన్ లూ తో “మనిద్దరి మధ్య సమన్వయం ఉంటే ప్రదర్శనలు ఇవ్వవచ్చు” అంటాడు. పాత జీవితాన్ని తిరిగి పొందితే చాలు అని అతని ఆలోచన. లూ అతన్ని బధిరుల కేంద్రంలో చేరమని, అతనికి ఇప్పుడు ఆ కేంద్రం అవసరం చాలా ఉందని, తాను ప్యారిస్‌లో ఉన్న తన తండ్రి దగ్గరకి వెళతానని అంటుంది. “నా కోసం వేచి ఉండు” అంటాడు రూబెన్. ఆమెని సరేనని వెళ్ళిపోతుంది.

రూబెన్ కేంద్రంలో చేరతాడు. అతని వాహనం తాళాలు, అతని సెల్ ఫోన్ జో తీసేసుకుంటాడు. రూబెన్ మొదట్లో అక్కడ ఇమడలేక ఇబ్బంది పడతాడు. జో అతన్ని చిన్నపిల్లలతో పాటు కలిసి సౌంజ్ఞల భాష నేర్చుకునేలా ఏర్పాటు చేస్తాడు. వినికిడి లేకపోవటంతో అంతా చూపు మీద ఆధారపడి ఉంటుంది. తరగతి గది లోకి జో వెళ్ళినపుడు టీచర్‌ని పిలవటానికి తలుపు పక్కనే ఉన్న లైటు స్విచ్‌ని మూడుసార్లు వేసి ఆర్పుతాడు. లైటు అలా గబగబా వెలిగి ఆరిపోవటంతో టీచర్‌కి ఎవరో వచ్చారని అర్థమౌతుంది. ఇలా చిన్న చిన్న మార్పులతో జీవితం మామూలుగా గడపటానికి వారందరూ అలవాటు పడతారు. ఎవరినైనా అభినందించాలంటే చప్పట్లకు బదులు రెండు చేతులూ కొంచెం పైకి పెట్టి మృదంగం వాయిస్తున్నట్టు ఊపుతారు.

రూబెన్ దొంగచాటుగా ఆఫీసు గదిలో ఉన్న కంప్యూటర్ నుంచి ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాడు. లూ క్షేమంగా ప్యారిస్ చేరుకుందని తెలుస్తుంది. ఆమె అతని కోసం తపిస్తోందని తెలిసి అతను సాంత్వన పొందుతాడు. కాలక్షేపం కోసం అతను ఒకరోజు పైకప్పు బాగుచేస్తూ ఉంటాడు. జో అతన్ని పిలిచి అలాంటి పనులు చేయవద్దని చెబుతాడు. రోజూ పొద్దున్నే లేచి కాఫీ తాగాక ఒక గదిలో కూర్చుని తన ఆలోచనలు ఒక పుస్తకంలో వ్రాయమంటాడు. బధిరత్వానికి అలవాటు పడటానికి ఈ ప్రక్రియ. చుట్టూ ఉన్న నిశ్శబ్దాన్ని తట్టుకోలేక ఏదో ఒక పని చేస్తే నిశ్శబ్దాన్ని భరించటం అలవాటు కాదు. మనసులోని అలజడి తగ్గాక పనులు చేసుకోవచ్చు. అది చాలా ముఖ్యం. రూబెన్ మొదట నిస్పృహకి గురైనా నెమ్మదిగా ఈ ప్రక్రియకి అలవాటు పడతాడు. పిల్లలతో కలిసి ఆటలాడతాడు, వారికి డబ్బాల సాయంతో డ్రమ్స్ ఎలా వాయించాలో నేర్పిస్తాడు, సౌంజ్ఞల భాష నేర్చుకుంటాడు. కొన్ని నెలలు గడిచిపోతాయి. అతనిలోని మార్పుని చూసి జో అతన్ని అక్కడ టీచర్‌లా చేరమంటాడు. కానీ రూబెన్ మనసంతా లూ మీద ఉంది. లూ తన పక్కన ఉండాలి. తాను బధిరుల కేంద్రంలో పని చేస్తూ ఉంటే ఆమె అతనికి తోడుగా ఉంటుందా? ఇలా మథనపడుతూ ఉండగా కంప్యూటర్లో ఒక మ్యూజిక్ గ్రూపులో సందేశాలు చూస్తుంటే లూ ప్యారిస్‌లో ప్రదర్శనలిస్తోందని తెలుస్తుంది. ఒక ప్రదర్శన వీడియో చూస్తాడు. పాట వినపడదు కానీ హెవీ మెటల్ సంగీతానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. రూబెన్‌కి తనకి ద్రోహం జరిగినట్టు అనిపిస్తుంది. పట్టుదల పెరుగుతుంది. తన వాహనాన్ని, అందులో పరికరాల్ని అమ్మేసి ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలా చేస్తే తాను లూ తో గడిపిన పాత జీవితాన్ని మళ్ళీ పొందొచ్చని అతని భావన.

మొదట్లో డాక్టరుని ఆపరేషన్ చేయించుకుంటే బాగా వినపడుతుందా అని అడిగితే సరిగా జవాబు చెప్పడు. ఇన్సూరెన్స్ పరిధిలోకి రాదని మాత్రం చెబుతాడు. వినికిడి ఒక్కసారిగా పోతే ఎవరికైనా ఇబ్బందే. కానీ పరిస్థితులు కూడా ఆలోచించుకోవాలి కదా? లూ ఆనందంగా ఉంది కదా, ఆమె మానాన ఆమెని వదిలేద్దాం అని రూబెన్ అనుకుని ఉంటే సరిపోయేది. అతనికి బధిరుల కేంద్రంలో పని కూడా దొరకుతోంది. కానీ ఆమెని తిరిగి రప్పించాలని అతను పంతంగా ఉంటాడు. ఆమెని పొందాలంటే తాను కూడా ఆమెకి సరితూగాలని అనుకుంటాడు. అతని నిర్ణయాలు, వాటి పర్యవసానాలు మిగతా కథ. రూబెన్‌గా రిజ్ అహ్మద్ నటించాడు. ఈ పాత్ర కోసం డ్రమ్స్ వాయించటం నేర్చుకున్నాడు, బధిరులతో గడిపాడు. ఆ నిబద్ధత అద్భుతమైన ఫలితాలనిచ్చింది. అతని నటన అమోఘం. అయోమయం, అసహనం, నిరాశ, అంతర్మథనం కలిసిన పాత్ర ఇది. ఈ పాత్రకి అతనికి ఆస్కార్ నామినేషన్ వచ్చింది.

డారియస్ మార్డర్, డెరెక్ సియన్ ఫ్రాన్స్ కథ తయారు చేయగా డారియస్ తన సోదరుడు అబ్రహం మార్డర్‌తో కలిసి స్క్రీన్ ప్లే వ్రాశాడు. డారియస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ధ్వనిని వినిపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రూబెన్‌కి శబ్దాలు ఎలా వినపడతాయో అలాగే ప్రేక్షకులకి వినపడేలా చాలా సన్నివేశాలు ఉంటాయి. కాస్త ఇబ్బందిగా ఉంటుంది కానీ అదే దర్శకుడి ఉద్దేశం. వినికిడి శక్తి తగ్గిపోతే ఎంత నిస్పృహగా ఉంటుందో మనకి అనుభవంలోకి వస్తుంది. ఈ చిత్రం ఇంట్లో చూసేటపుడు అంతరాయాలేం లేకుండా హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే ఆ అనుభవం పూర్తిగా అనుభూతిలోకి వస్తుంది. 2020 లోనే ‘ద ఫాదర్’ అనే చిత్రం వచ్చింది. అది ఆల్జీమర్స్ బారిన ఒక వృద్ధుడి కథ. అతను మనుషుల్ని గుర్తుపట్టలేక తికమక పడుతూ ఉంటాడు. అతని తికమకని ప్రేక్షకులకి అనుభూతి చెందించటమే ఆ చిత్రం ఉద్దేశం. అందుకని ఒకే పాత్రకి అనేక నటులు ఉంటారు. తెలిసిన వారిని గుర్తుపట్టలేకపోవటం ఎలా ఉంటుందో ఈ రకంగా చూపించారు. ఇలా ప్రేక్షకుల్ని కథలో ఒక పాత్రలా అనుభూతి చెందించే రెండు చిత్రాలు ఒకే సంవత్సరంలో రావటం విశేషం.

‘సౌండ్ ఆఫ్ మెటల్’ చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సౌండ్, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో కూడా నామినేషన్లు వచ్చాయి. చివరి రెండు అవార్డులు దక్కాయి. జో గా నటించిన పాల్ ర్యాసికి ఉత్తమ సహాయనటుడి నామినేషన్ వచ్చింది. కఠినంగా ఉండకపోతే తన కేంద్రం నడవదని తెలిసిన వ్యక్తి పాత్రలో కాఠిన్యంతో పాటు సహృదయం కూడా చూపించాడు. అతని కాఠిన్యం అవతలివారి మంచి కోసమే అని అర్థమైనపుడు మనసు ఆర్ద్రమౌతుంది.

తర్వాతి కొంత కథ ఈ క్రింద ప్రస్తావించబడింది. సినిమా చూడాలనుకునే వారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు. సినిమా చూశాక క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింది భాగంలో చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

కేంద్రంలో పనిచేసే ఒకామె సాయంతో రూబెన్ తన వాహనం లోని సంగీత సామగ్రి అమ్మేస్తాడు. తర్వాత వాహనం కూడా అమ్మేస్తాడు. అమ్మేటపుడు ఒక ఒప్పందం చేసుకుంటాడు. ఎనిమిది వారాల్లో తిరిగి వచ్చి పది శాతం ఎక్కువ డబ్బిచ్చి వాహనం తిరిగి కొంటానని ఒప్పందం చేసుకుంటాడు. ఎనిమిది వారాలు దాటితే ఆ ఒప్పందం రద్దయినట్టే. వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయించుకుంటాడు. అతని తలకి ఇరువైపులా పరికరాలు అమరుస్తారు. అయితే ఆ పరికరాలను క్రియాశీలం (యాక్టివేట్) చేయాలంటే నాలుగు వారాలు ఆగాలి. ఆ తర్వాతే అవి పనిచేస్తాయి. ఆపరేషన్ తర్వాత రూబెన్ బధిరుల కేంద్రానికి తిరిగి వస్తాడు. జో తో “నా జీవితాన్ని నేనే బాగు చేసుకోవాలి. ఎవరూ నా కోసం రారు. అందుకే ఆపరేషన్ చేయించుకున్నాను” అంటాడు. జో “ప్రపంచం క్రూరంగా కనిపిస్తుంది. కానీ మనసులోని అలజడి తగ్గితే కలిగే ప్రశాంతతే దేవుని సామ్రాజ్యం. అక్కడ నీకెప్పుడూ చోటు ఉంటుంది. నువ్వు నీ దారి ఎంచుకున్నావు. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటాడు. ఆ మాటతో రూబెన్ మనసు ఉద్విగ్నమవుతుంది. “నాకు కొంత డబ్బు కావాలి. నా వాహనం తిరిగి కొనుక్కోవాలి. అదే మా ఇల్లు. లూ తో నేనక్కడే ఉండాలి. నాకు డబ్బు ఇవ్వగలరా?” అని అడుగుతాడు. “నీ మాటలు వింటుంటే డ్రగ్స్‌కి అలవాటు పడిన మనిషి మాటల్లా ఉన్నాయి” అంటాడు జో. రూబెన్ సిగ్గుతో కుంచించుకుపోతాడు. “లూ తండ్రి ధనవంతుడు. ఆయన డబ్బు ఇస్తాడు. మిమ్మల్ని అడిగినందుకు క్షమించండి” అంటాడు. “కొన్నాళ్ళు ఇక్కడ ఉండవచ్చా?” అని అడుగుతాడు. “ఇక్కడి వాళ్ళు చెవిటితనం ఒక లోపం కాదని నమ్ముతారు. అయితే ఆ విషయం ఎప్పటికప్పుడు గుర్తుచేసుకుంటూ ఉండాలి. ఆ నమ్మకం మీదే ఈ కేంద్రం ఆధారపడి ఉంది. ఆ నమ్మకం చెదిరిపోతే అనుకోని పరిణామాలు జరుగుతాయి. అలా జరగకుండే చూసే బాధ్యత నాది. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో” అంటాడు జో. రూబెన్ వేరే దారి లేక అక్కడి నుంచి వచ్చేస్తాడు.

పాత జీవితమే కావాలని రూబెన్ కోరుకోవటం అతని మనసులోని అలజడికి కారణం. ప్రశాంతత లేకుండా పోయింది. ఎవరి మీదో నా ఆనందం ఆధారపడి ఉందని అనుకుంటే ఆత్మవిశ్వాసం లేనట్టే. అందుకే జో దేవుణ్ణి నమ్ముకోమని చెబుతాడు. విధిలిఖితాన్ని ఆమోదించటమే మనశ్శాంతికి మూలం. బంధాలు తెగిపోతాయి అని భయపడకూడదు. మనం బంధాలు తెంచుకోనక్కరలేదు. కానీ తెగిపోతే బాధపడకూడదు. కానీ రూబెన్‌కి ఇది అర్థం కాదు. అతనికి తన పాత జీవితపు ఆలోచనలే డ్రగ్స్ లాగా మారిపోయాయి. పాత జీవితం కోసం ఏమైనా చేస్తాననే స్థాయికి చేరుకున్నాడు. సిగ్గువిడిచి డబ్బు అడిగాడు. జో కాదంటే లూ తండ్రిని కూడా అడగాలని అనుకున్నాడు. ‘నేను తనకు కావాలంటే లూ తనే వస్తుంది’ అని ఆలోచించలేదు. ఆమె దూరమైపోతుందని భయం. కేంద్రంలో ఉంటానంటే జో నిరాకరిచటం అతనికి కష్టం కలిగిస్తుంది. కానీ జో తన ధర్మాన్ని పాటించాడు. అందరికీ ఆపరేషన్ చేయించుకునే స్తోమత ఉండదు. అలాంటివారి మధ్యలో రూబెన్ ఉంటే వారిలో అలజడి రేగుతుంది. అందుకే జో ఒప్పుకోలేదు. కానీ రూబెన్ పరిస్థితి చూసి ఉద్వేగానికి లోనౌతాడు. అతని మీద జాలి ఉంటుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సన్నివేశంలో రిజ్, పాల్ నటన ఎంతో హృద్యంగా ఉంటుంది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. ముగింపు తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

రూబెన్ ఒక మోటెల్లో (రహదారి పక్కన చవక హోటల్) గది తీసుకుని ఉంటాడు. తన వినికిడి పరికరాల్ని క్రియాశీలం చేయించుకుంటాడు. అయితే అవి అతను అనుకున్నట్టు పనిచేయవు. మాటలు అస్పష్టంగా వినపడతాయి. డాక్టర్ కొన్నాళ్ళు అలవాటు పడాలి అంటుంది. సరే అని రూబెన్ ప్యారిస్ కి చేరుకుంటాడు. లూ తండ్రి రిచర్డ్ ఇంటికి వెళతాడు. లూ బయటికి వెళ్ళిందని తెలుస్తుంది. ఆరోజు రిచర్డ్ పుట్టినరోజు పార్టీకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. రిచర్డ్ స్వయంగా వంట చేస్తూ ఉంటాడు. రూబెన్ తో శాంతంగా మాట్లాడతాడు. అతని మాటల్లో లూ గతం మనకు తెలుస్తుంది.

లూ చిన్నతనంలో ఆమె తల్లి రిచర్డ్‌తో తెగతెంపులు చేసుకుని లూని తీసుకుని ఫ్రాన్స్ నుంచి అమెరికాకు వెళ్ళిపోయింది. లూని తండ్రికి దూరంగా ఉంచింది. లూకి చిన్నప్పటి నుంచి పాడటమంటే ఇష్టం. పెద్దయ్యాక రూబెన్ పరిచయమయ్యాడు. కొంతకాలానికి తల్లి ఆత్మహత్య చేసుకుంది. దానితో లూ మానసిక వేదనకి గురైంది. ఎప్పుడైనా ఒత్తిడికి లోనైతే అప్రయత్నంగా చేతి మీద గోళ్ళతో గీసుకోవటం అలవాటయింది. రూబెన్ సాంగత్యంలో తేరుకుంది. అతని సహాయంతో ప్రదర్శనలు ఇచ్చింది. తల్లి చనిపోయిన తర్వాత లూ తన దగ్గరికి రాకపోయే సరికి రిచర్డ్‌కి రూబెన్ మీద కోపం ఉండేది. రూబెన్ బధిరుల కేంద్రంలో ఉండక తప్పని పరిస్థితి రావటంతో వేరే దారిలేక లూ తండ్రి దగ్గరకి చేరుకుంది. ఆమె చెప్పగా రూబెన్ ఆమెకి ఎంత ఆసరాగా నిలిచాడో రిచర్డ్‌కి అర్థమై అతని మీద కోపం పోయింది.

లూ రూబెన్‌ని చూసి సంతోషిస్తుంది. కానీ ఆమెలో ఏదో సంకోచం కనిపిస్తుంది. పార్టీలో తండ్రితో కలిసి శ్రావ్యమైన ఫ్రెంచ్ పాట పాడుతుంది. పాడేటప్పుడు కూడా ఆమెలో సంకోచం కనిపిస్తుంది. రూబెన్ ఆమెని గమనిస్తూ ఉంటాడు. పాట స్పష్టంగా వినిపించపోయినా ఆమె నెమ్మదిగా పాటలో లీనమైపోవటం గమనిస్తాడు. పార్టీ అయిన తర్వాత ఆమెతో మాట్లాడతాడు. ఆమె తండ్రి దగ్గరకి వచ్చాక తన చిన్ననాటి జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొచ్చాయని అంటుంది. అతను “మనం తిరిగి అమెరికా వెళదాం. ప్రదర్శనలు ఇద్దాం” అంటాడు. ఆమె తనకి తెలియకుండానే గోళ్ళతో చేతి మీద గీసుకుంటూ ఉంటుంది. రూబెన్‌కి విషయం అర్థమవుతుంది. “ఏం పర్వాలేదు” అంటాడు. ఆమె అయోమయంగా చూస్తుంది. “నువ్వు నా జీవితాన్ని కాపాడావు. మళ్ళీ ఆశలు చిగురింపజేశావు. అది చాలు” అంటాడు. ఆమె కన్నీళ్లు పెట్టుకుని “నా జీవితాన్ని నువ్వు కాపాడావు” అంటుంది. మర్నాడు రూబెన్ లూ పడుకుని వుండగానే అక్కడి నుంచి వచ్చేస్తాడు. ఒక చోట చర్చ్ గంట మోగుతుంటే వింటాడు. ఆ శబ్దం అస్పష్టంగా వినపిస్తుంది. తన వినికిడి పరికరాల్ని తీసేసి నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తాడు.

లూ కి మధురమైన సంగీతం పాడటంలోనే ఆనందం ఉంది. పైగా ఫ్రెంచ్ ఆమె మాతృభాష. అందుకే ఆమెకి హెవీ మెటల్‌పై ఆసక్తి పోయింది. రూబెన్‌కి ఆ విషయం అర్థమైంది. అతను ఆమెని నిందించలేదు. ఆమె మథనపడుతోందని తెలిసి అతను ఆమెకి అడ్డుకాకూడదని తప్పుకున్నాడు. లూ లేనిదే తన జీవితం లేదు అనుకున్నవాడు ఆమె ఆనందం కోసం ఆమె జీవితం నుంచి నిష్క్రమించాడు. ఈ పరిణతి ఎక్కడి నుంచి వచ్చింది? నిజమైన ప్రేమ త్యాగానికి వెనుకాడదు. ఆమె ప్రేమలో అతను డ్రగ్స్ మానేయగలిగాడు. అతని ప్రేమలో ఆమె నిరాశ నుంచి బయటపడింది. కానీ వారి దారులు వేరయ్యాయి. ఆమె తనతో ఉండటం ముఖ్యం కాదని, ఆమె ఎక్కడున్నా ఆనందంగా ఉండటం ముఖ్యమని అతను భావించాడు. “Don’t be sad that it is over; be glad that it happened”. ఒక బంధం తెగిపోయిందని బాధ పడొద్దు; ఆ బంధం అందించిన సంతోషాన్ని పదిలపరుచుకో.

అస్పష్టంగా శబ్దాలు వినటం కన్నా నిశ్శబ్దమే మేలు అనే భావన రూబెన్‌లో కలుగుతుంది. తన పాత జీవితం కోసం పరుగులెత్తాడు. కానీ పాత జీవితం తిరిగిరాదని అర్థమయింది. అయితే అతనిలో ఇప్పుడు అలజడి లేదు. విధిని నియంత్రించటం అన్ని వేళలా సాధ్యం కాదు. కొన్నిసార్లు మన దృక్పథం మార్చుకుని సాగిపోవటమే ఉత్తమం. మనుషుల దృక్పథాలు మార్చటంలో జో లాంటి వాళ్ళ కృషి అమోఘమనే చెప్పాలి. అతని ప్రమేయం లేకపోతే రూబెన్ మళ్ళీ దారి తప్పేవాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here