మరుగునపడ్డ మాణిక్యాలు – 2: ఔట్ ఆఫ్ మై లీగ్

0
10

[dropcap]దా[/dropcap]దాపు అన్ని సినిమాలలో హీరో హీరోయిన్లు అందమైనవాళ్ళే ఉంటారు. అందంగా లేనివారి జీవితం ఎలా ఉంటుంది అనే కథాంశంతో సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. తెలుగులో ‘నాదీ ఆడజన్మే’, ‘ఊర్వశి’, ‘సైజ్ జీరో’ లాంటి చిత్రాలలో అందంగా లేని హీరోయిన్లని చూపించారు. హిందీలో మూడేళ్ళ క్రితం ‘బాలా’ సినిమాలో బట్టతల హీరో, నల్లగా ఉన్న హీరోయిన్ కథ చూపించారు. నలుపొక్కటే అందానికి లోపమా అనే సందేహం వస్తుంది. అందంగా ఉన్నవారికి మర్యాద కొంచెం ఎక్కువ లభిస్తుందనేది కాదనలేం. అయితే అందంగా ఉన్నవారందరూ ఆనందంగా ఉంటారా? అందంగా లేని వారు “నా మనసు చూడరా” అని ప్రశ్నించినట్టు, అందంగా ఉన్నవారు “నా అందం మాత్రమే చూస్తారా” అని ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? అదే ‘ఔట్ ఆఫ్ మై లీగ్’ (2020) కథ. నెట్ ఫ్లిక్స్ లో లభ్యం. ఇదో ఇటాలియన్ సినిమా. ‘ఔట్ ఆఫ్ మై లీగ్’ అనేది ఈ సినిమాకి పెట్టిన ఆంగ్ల నామం. ఇటాలియన్ పేరు వేరే ఉంది. ‘ఔట్ ఆఫ్ మై లీగ్’ అంటే ‘నా స్థాయికి పైన’ అనే అర్థం చెప్పుకోవచ్చు. ఒక అమ్మాయి తనకంటే అందమైన (తన స్థాయికి పైన ఉన్న) అబ్బాయి వెంటపడే కథ. అయితే ఓ హెచ్చరిక – ఈ చిత్రం పెద్దలకు మాత్రమే.

మార్తా అనే 19 ఏళ్ళ అమ్మాయికి ప్ర్రాణాంతకమైన ఊపిరితిత్తుల వ్యాధి ఉంటుంది. రోజూ నెబ్యులైజర్ (ఆక్సిజెన్ మాస్క్ లాంటి పరికరం) తో మందు తీసుకుంటుంది. తలిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. కొంత ఆస్తి ఉంటుంది. మేజర్ కావటంతో సొంత ఇంటిలోకి తన ఇద్దరు ప్రాణస్నేహితుల (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి)తో కలిసి మారుతుంది. తాను అందగత్తెని కాదని ఆమెకి తెలుసు. బతికున్న కొన్నాళ్ళు సరదాగా గడపాలని అనుకుంటుంది. తాను అనుకున్నదే చేస్తుంటుంది. సైకాలజీ అభ్యసిస్తూనే ఒక సూపర్ మార్కెట్‌లో అనౌన్సర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్నేహితులు ఆమెతో సరదాగా మసలుతుంటారు.

ఒకరోజు డాక్టర్ ఆమెని ఏదో ఒక లక్ష్యం పెట్టుకుంటే ధ్యాస దానిపై ఉండి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతాడు. ఆమెకి ఆర్తురో అనే అబ్బాయి తారసపడతాడు. ఆరడుగుల అందగాడు. అతన్ని చూడగానే ఆమె అతనే నా లక్ష్యం అంటుంది. అతని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ చూసి అతని ఎక్కడెక్కడికి వెళతాడో తెలుసుకుంటుంది. అతన్ని చాటుమాటుగా వెంబడిస్తుంది. అయితే అతను తనలా సరదా మనిషి కాదని తెలుస్తుంది. ఒకరోజు తన స్నేహితులతో అతనెంత నిస్సారమైన జీవితం గడుపుతున్నాడో చెబుతుండగా అతను వింటాడు. నా జీవితం అంత నిస్సారమైతే నన్నెందుకు వెంబడిస్తున్నావు అంటాడు. అతను తనని గమనించాడని తెలిసి ఆమె పట్టలేని సంతోషంతో “నాతో ఒక డిన్నర్ చెయ్యి. నేను నచ్చకపోతే ఇక నీ వెంటపడను” అంటుంది. అతను సరే అంటాడు.

మార్తా అర్తురో ఇంటికి వెళుతుంది, డిన్నర్‌కి బైటికి వెళతామనే ఉద్దేశంతో. అయితే అతను ఇంట్లోనే డిన్నర్ చేయమంటాడు. అతనిది సంపన్నకుటుంబం. డిన్నర్‌లో అతని తలిదండ్రులు, వేరొక కుటుంబం కూడా ఉంటారు. మామూలుగా అమ్మాయి డిన్నర్ అంటే ఏకాంతంలో డేట్ అని అర్థం. అతను కావాలనే “నువ్వు డేట్ అనలేదుగా. ఇదే డిన్నర్” అంటాడు. డిన్నర్ చేస్తుండగా తలిదండ్రులతో “ఈమె నెలరోజుల క్రింద పరిచయమైంది. నా మనసు దోచుకుంది” అని అబద్ధం చెబుతాడు. మార్తాకి ఒళ్ళు మండి “అది అబద్ధం. అతను నచ్చి అతన్ని వెంబడించాను. నన్ను వదిలించుకోవటానికి డిన్నర్‌కి ఒప్పుకున్నాడు” అని చెప్పి లేచి బయల్దేరుతుంది. ఆర్తురో ఆమెని ఆపబోతే “నీకు నచ్చకపోతే వద్దు అని చెప్పటం నేర్చుకో” అని వెళ్ళిపోతుంది.

ఆర్తురో ఆమెని క్షమించమని డేట్‌కి రమ్మంటాడు. మొదట బెట్టు చేసినా ఒప్పుకుంటుంది. ఒక విలాసవంతమైన రెస్టారెంట్‌కి వెళ్ళినా ఆమెకి నచ్చక వేరే చోటికి వెళతారు. ఆమె తెలివైన ప్రశ్నలతో అతన్ని ఆకట్టుకుంటుంది. అతను చక్కని జవాబులతో తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తాడు. డేట్ అయ్యాక “నేను నువ్వు డేట్ చేసిన అమ్మాయిలలో అందరి కంటే అనాకారినా?” అని అడుగుతుంది. కాదంటాడతను. అతను “ఈ డేట్ నువ్వు ఆశించినట్టు ఉందా?” అని అడుగుతాడు. ఆమె “ఆశించినదాని కంటే ఎక్కువే” అంటుంది. ఇద్దరూ తరచు కలుసుకోవటం మొదలుపెడతారు. తన జబ్బు గురించి ఆమె అతనికి చెప్పదు. తర్వాత ఏమౌతుందన్నది మిగతా కథ.

ఇద్దరూ డేట్ కి వెళ్ళిన సన్నివేశం నేను చూసిన మరపురాని సన్నివేశాలలో ఒకటి. విలాసవంతమైన రెస్టారెంట్‌లో ముళ్ళ మీద కూర్చున్నట్టుంటుంది మార్తాకి. గట్టిగా మాట్లాడితేనే తప్పు అన్నట్టు ఉంటారు అక్కడ అందరూ. ఆర్డర్ ఇచ్చాక సరదాగా ఒక ఆట ఆడదామంటుంది మార్తా. ఆట ఏమిటంటే ఇద్దరూ ఐదు వ్యక్తిగత విషయాలు అడగవచ్చు. నిజమే చెప్పాలి అని ఆట నియమం. ఒకసారి మాత్రం అబద్ధం చెప్పవచ్చు. మార్తా ఆట మొదలుపెడుతుంది.

మార్తా: నీ గుణాలు మూడు చెప్పు. అన్నీ మంచి గుణాలు కాకూడదు.

అర్తురో: నాది ఉదార స్వభావం. నాకు అసహనం ఉంది. నేను ఎవరినీ తొందరగా నమ్మను. ఇప్పుడు నా ప్రశ్న. నేనెందుకు నచ్చాను?

మార్తా: నువ్వు అందగాడివి కాబట్టి.

ఇక్కడ ఆర్తురో ముఖంలో నిరుత్సాహం కనిపిస్తుంది. “నువ్వేదో వేరుగా ఉంటావని అనుకుంటే నువ్వూ నా అందాన్ని మాత్రమే చూశావా?” అన్న భావం పలుకుతుంది. అతను కేవలం అందగాడే కాదని, అతని భావాలు లోతైనవని మనకు అర్థమౌతుంది.

మార్తా: నీకు ఇతరులలో నచ్చని గుణమేమిటి?

ఆర్తురో: పైపై మెరుగులకి ప్రాధాన్యం ఇవ్వటం.

మార్తా ముఖం మాడిపోతుంది. తానే తెలివైనదాన్నని అనుకున్న ఆమె తాను అతని అందాన్ని మాత్రమే చూసి మోజు పడటం అతనికి నచ్చలేదని తెలిసి తన మీద తనకే కోపం వస్తుంది. ఇప్పటి దాకా మార్తాది author-backed role (రచయిత పక్షపాతం చూపించే పాత్ర) అనుకున్న మన అభిప్రాయం ఒక్కసారిగా తలికిందులైపోతుంది.

ఆర్తురో: నీ కోరికల్లో ఒకటి చెప్పు.

మార్తా: నా తలిదండ్రులు బతికి ఉంటే బావుండును.

మార్తాకి వెంటనే తాను అతని సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నానని అర్థమౌతుంది. అలా చేయటం తప్పని గ్రహించి…

మార్తా: ఇది మరీ గంభీరమైన కోరిక. ఇంకో కోరిక చెబుతాను. నాకు శాండ్ విచ్ తినాలని ఉంది.

ఆ రెస్టారెంట్ లో శాండ్ విచ్ లాంటి ‘చిల్లర’ పదార్థాలు దొరకవు. మార్తా అతన్ని తను పనిచేసే సూపర్ మార్కెట్‌కి తీసుకువెళుతుంది. అప్పటికే మూసేసినా తెరిపిస్తుంది. ఆమె అనౌన్సర్ కాబట్టి మైకులో తినడానికి ఏం కావాలో అనౌన్స్ చేస్తుంటే ఆర్తురో అన్నీ తీసుకుంటాడు. ఇక్కడ అనౌన్స్‌మెంట్ గది గురించి చెప్పుకోవాలి. మైకు ఆన్ చేయటానికి ఒక మీట నొక్కాలి. మీట నొక్కితే గదిలో ఒక ఎరుపు రంగు లైటు వెలిగి గది అంతా ఎర్రగా కనబడుతుంది. అంటే మైకు ఆన్ లో ఉందని, జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. అంతకు ముందు మార్తా మైకు ఆన్ చేసి చిలిపి అనౌన్స్‌మెంట్‌లు చేస్తూ ఉండేది. మైకు ఆఫ్ చేయగానే ఆమె చిలిపితనం ముగిసినట్టుండేది. ఇప్పుడు మైకులో ఆర్తురోకి ఏం కావాలో చెప్పాక మైక్ ఆఫ్ చేయగానే ఎర్ర లైటు ఆరిపోతుంది. ఆమె ముఖంలో తొలిసారిగా లైటు ఆపాక సంతోషం కనిపిస్తుంది. డిన్నర్ మళ్ళీ మొదలౌతుందనేది పైకి కనిపించే భావం. ఇంతవరకు ఊహాలోకాల్లో విహరించిన ఆమె జీవితం మారుతోందనేది సూచన. ఎరుపు రంగు ఊహాలోకానికి ప్రతీక. ఈ షాట్ నాకు చాలా నచ్చింది.

సూపర్ మార్కెట్‌లో డిన్నర్ మళ్ళీ మొదలౌతుంది. ఆట కూడా మళ్ళీ మొదలౌతుంది.

మార్తా: నువ్వు ఇంతవరకు ఎన్నిసార్లు ఐ లవ్యూచెప్పావు?

ఆర్తురో: అసలింతవరకూ చెప్పలేదు. ఇప్పుడు నా ప్రశ్న. అరవై ఏళ్ళ వయసులో నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు?

మార్తా ముఖంలో విషాదం ఛాయలు కనపడతాయి. తాను అరవై ఏళ్ళు బతకనని తెలుసు. అయినా…

మార్తా: నేనో రచయితని పెళ్ళి చేసుకుని లండన్ లో ఉంటాను. అరవై ఏళ్ళకి పిల్లలు పెరిగిపోతారు కాబట్టి నేనూ, మా ఆయనా సరదాగా కాలం గడుపుతూ ఉంటాము.

ఆర్తురో: చాలా స్పష్టమైన ప్రణాళికలా ఉందే.

మార్తా: ఇప్పుడు నా ప్రశ్న. నువ్వు ప్రణాళికలు వేసుకుంటావా?

ఆర్తురో: నేనింతవరకు నా తలిదండ్రులు, నా స్నేహితులు నా నుంచి ఏం ఆశిస్తున్నారో అదే చేశాను. ఇతరులు నేను ఎలా ఉండాలనుకుంటున్నారో అలాగే ఉండటానికి ప్రయత్నించాను.

అతని గొంతులో నిరాశ ధ్వనిస్తుంది.

ఆర్తురో: ఇప్పుడు నా ప్రశ్న. నువ్వు కన్యవేనా?

మార్తా: నా రాశి కన్యరాశి కాదు.

ఆర్తురో: నేనడిగింది అది కాదు.

మార్తా: నాకర్థమైంది అంతే.

డిన్నర్ ముగిశాక ఆర్తురో కారులో మార్తాని ఆమె ఇంటికి తీసుకువెళతాడు.

మార్తా: ఇంకో ప్రశ్న మిగిలి ఉంది. నేను నువ్వు డేట్ చేసిన అమ్మాయిలలో అందరి కంటే అనాకారినా?

ఆర్తురో: కాదు.

మార్తా: ఒక ప్రశ్నకు మాత్రం అబద్ధం చెప్పవచ్చు అనే నియమం ఉంది కదా. కాబట్టి ఇది అబద్ధమే అని నేను నిర్ణయించుకున్నాను.

ఇద్దరూ నవ్వుతారు. ఇద్దరి మంచితనం అర్థమై మన మనసు ఆర్ద్రమౌతుంది. కానీ అతను నిజమే చెప్పాడని నా అభిప్రాయం. అతనికి ఆమె అంతఃసౌందర్యం కనపడింది.

ఆర్తురో: ఇప్పుడు నా చివరి ప్రశ్న. ఈ డేట్ నువ్వు ఆశించినట్టు ఉందా?

అందరికీ అందంగా కనిపించేవాళ్ళలో కూడా అభద్రతాభావం ఉంటుంది. తన అందం చూసి వచ్చింది కాబట్టి తనలో అందం తప్ప ఏమీ లేదని తెలిస్తే ఆమె నిరాశ పడుతుందని అతని భయం.

మార్తా: ఆశించినదాని కన్నా ఎక్కువే.

ఈ సన్నివేశాన్ని రచయిత, దర్శకుడు, ఛాయాగ్రాహకుడు నడిపించిన తీరు అద్భుతం! ఛాయాగ్రాహకుడు అని ఎందుకంటున్నానంటే అనౌన్స్‌మెంట్ గదిలో రంగులు మారే సన్నివేశం చెప్పకనే అనేక విషయాలు చెబుతుంది. ఆ రంగుల్ని కెమెరాలో బంధించటంలో ఛాయాగ్రాహుకుడి ప్రతిభ ప్రస్ఫుటం.

ఆర్తురో తన తలిదండ్రులు తన జీవితాన్ని శాసిస్తున్నారని నిరుత్సాహంగా ఉంటాడు. అందుకే మార్తాని ఇంటికి డిన్నర్‌కి రమ్మని, ఆమెని ప్రేమిస్తున్నానని చెప్పి తలిదండ్రులకి షాక్ ఇస్తాడు. ఇదో రకం తిరుగుబాటు. అందుకు ఆమెని వాడుకుంటాడు. అయినా ఆమె నిజం చెప్పి తన నిజాయితీని నిరూపించుకుంటుంది. అమ్మాయిలు తాము ఒక అబ్బాయి వెంటపడ్డామని అతని తలితండ్రులకి చెప్పుకోరు. అహం అడ్డు వస్తుంది. ఆమె అందుకు విరుద్ధం. అది అతనికి నచ్చింది. రెండోసారి కలిసినపుడు అతని నిజస్వభావం అమెకి తెలుస్తుంది. ఇద్దరూ ప్రేమలో పడతారు. ఆమె కాస్త స్వార్థంతో తన జబ్బు విషయం దాస్తుంది. “నాకు ఆనందంగా ఉండే హక్కు లేదా?” అని ఆమె వాదన. ఆమె స్నేహితులు కూడా ఆమె చేసినది తప్పు అంటారు. మంచి స్నేహితులు నిజమే మాట్లాడతారు.

కథ వింటుంటే ‘గీతాంజలి’ సినిమా గుర్తుకొచ్చింది కదూ! అందులో జబ్బు పడ్డ హీరో తన జబ్బు విషయం హీరోయిన్‌కి చెప్పడు. అయితే హీరోయిన్ కూడా జబ్బు మనిషే. ఇద్దరూ జబ్బు మనుషులే అయినా జబ్బు లక్షణాలేమీ లేకుండా హాయిగా తిరుగుతుంటారు. అది వేరే విషయం. సినిమా కాబట్టి ఎంత వద్దన్నా కొంత అసహజత్వం ఉంటుంది. ‘గీతాంజలి’లో హీరోయిన్‌కి విషయం తెలిశాక “నువ్వు చచ్చిపోతుంటే నేను చూడలేను” అని విడిపోతుంది. ఆమె కూడా జబ్బు మనిషే కాబట్టి ప్రేక్షకులు ఆమోదించారు. ‘ప్రేమాభిషేకం’లో జబ్బుపడ్డ హీరో కావాలనే హీరోయిన్‌కి ద్వేషం కలిగేలా ప్రవర్తిస్తాడు, ఆమె వేరొకరిని స్వీకరించాలని. ‘ఔట్ ఆఫ్ మై లీగ్’లో చివరికి ఏం జరుగుతుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. కానీ కథనం చాలా బావుంది. జబ్బు ముదిరినపుడు మార్తా ఊపిరి గొట్టం పెట్టుకోవటం సహజత్వానికి దగ్గరగా ఉంటుంది. ‘ద బకెట్ లిస్ట్’ సినిమాలో క్యాన్సర్ పేషంట్‌లు ప్రపంచాన్ని చుట్టివద్దామని బయలుదేరుతారు. అలాంటి నేల విడిచి సాము చేసే పనులేమీ ఉండవు ఈ సినిమాలో.

మార్తా ప్రాణస్నేహితుల్లో అమ్మాయి పేరు ఫెదెరికా, అబ్బాయి పేరు జకోపో. ఇద్దరూ స్వలింగప్రియులే. అంటే ఫెదెరికాకి అమ్మాయిలే నచ్చుతారు. జకోపోకి అబ్బాయిలే నచ్చుతారు. ఇలాంటి పాత్రలు ఈ మధ్య పాశ్చాత్య సినిమాలలో తరచు కనిపిస్తున్నాయి. చాలా దేశాలలో అమ్మాయిలను అమ్మాయిలు, అబ్బాయిలని అబ్బాయిలు పెళ్ళి చేసుకోవటం అనుమతిస్తూ చట్టాలు వచ్చాయి. మనం అలాంటి వారిని చూసి ఏవగించుకోకుండా ఉంటే చాలు. ఈ సినిమాలోని ఉపకథలో ఫెదెరికా, జకోపో కలిసి ఒక బిడ్డని కందామనుకుంటారు. స్వలింగ వివాహల్లో పిల్లలు కలిగే అవకాశం లేదు కదా. మార్తా ఆర్తురో ఇంటికి డిన్నర్‌కి వెళ్ళినపుడు మాటల్లో వారి విషయమంతా చెబుతుంది. చట్టాలు ఎలా ఉన్నా సమాజం వెంటనే ఆమోదించదు కదా. ఆర్తురో తలిదండ్రులు షాక్ అవుతారు. హాస్యం కోసం చేసిన ప్రయత్నమిది. పెద్దల చిత్రమే కాబట్టి పర్వాలేదు. జీవితమంటేనే ఎన్నో ఒడిదుడుకులు. ఇక స్వలింగప్రియుల జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో అనిపిస్తుంది.

ఈ చిత్రానికి ఆలిస్ ఫిలిపి దర్శకత్వం వహించింది. దర్శకత్వంలో ఎంతో పరిణతి కనిపిస్తుంది. రోబర్తో ప్రోయియా, మిఖేలా స్త్రానీరో స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే నే హైలైట్ అని చెప్పాలి. మార్తా గా లుదొవికా ఫ్రాంచెస్కోని, ఆర్తురో గా జిసెపీ మాజియో నటించారు. లుదోవికా అద్భుతంగా నటించింది. ఎప్పుడూ ఆనందంగా, చిలిపిగా ఉండే పాత్ర మార్తా. ఆర్తురో తనతో సన్నిహితంగా ఉండటం మొదలుపెట్టాక ఒకసారి జకోపో, ఫెదెరికాలతో “మీరు గానీ నా ఆనందం కోసం ఆర్తురోని బతిమాలి నాతో సన్నిహితంగా ఉండమని చెప్పారా?” అని అంతలోనే “అలా చేసి ఉంటే చాలా మంచి పని చేశారు” అంటుంది ఆనందంగా.

ఇది ఇటాలియన్ సినిమా కాబట్టి పనిచేసిన వాళ్ళు చాలామంది ఇటాలియన్లే. వారి పేర్లు గమనిస్తే చాలా మటుకు అచ్చులతోనే ముగుస్తాయి. జాన్, జార్జ్ లాంటి పేర్లు హల్లుతో ముగిస్తే రోబర్తో, జిసెపీ లాంటి పేర్లలో చివర హల్లుతో అచ్చు కలిసి ఉంటుంది. మన తెలుగువారి పేర్లు ఇప్పుడైతే మారిపోయాయి గానీ ఇంతకు ముందు అచ్చులతోనే ముగిసేవి… నారాయణ, కృష్ణ, రామారావు, వీరానాయుడు ఇలా. రెండు భాషల్లోనూ అధిక శాతం పదాలు అచ్చులతోనే ముగుస్తాయి. వీటినే అజంత భాషలంటారు. హిందీ, తమిళం లాంటి భారతీయ భాషలు హలంత భాషలు. ఆంగ్లం, ఫ్రెంచ్ కూడా హలంత భాషలే. అందుకే తెలుగు పై మక్కువ పెంచుకున్న బ్రిటిష్ వారు తెలుగుని ‘ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్’ (ప్రాచ్యపు ఇటాలియన్) అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here