మరుగునపడ్డ మాణిక్యాలు – 26: గుడ్ విల్ హంటింగ్

3
7

[dropcap]కొం[/dropcap]తమంది సహజమైన మేధావులుంటారు. సాధారణ జనులకు అర్థం కాని విషయాలు వారికి ఇట్టే అర్థమౌతాయి. కానీ ఆ వారి జీవితం వడ్డించిన విస్తరి కాకపోతే వారి విలువ వారికే తెలియదు. వారి విలువ మేధావులుగా చెలామణి అయేవారికే తెలుస్తుంది. ‘స్వాతికిరణం’లో ఓ పేరు పొందిన సంగీత విద్వాంసుడు ఒక బాలుడికి సంగీతంలో తనకన్నా ఎక్కువ ప్రతిభ ఉందని తెలిసి అసూయ పడతాడు. నానా మాటలూ అంటాడు. తాను దైవంగా భావించే ఆయన అలా ప్రవర్తించేసరికి ఆ బాలుడు ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ కథని తిరగేస్తే? ఆ బాలమేధావి తన ప్రతిభని లోకానికి తెలియకుండా దాచితే? ఆ ప్రతిభని గుర్తించిన పెద్దాయన అతన్ని లోకానికి పరిచయం చేయాలని ప్రయత్నిస్తే? అదే ‘గుడ్ విల్ హంటింగ్’ (1997) కథ. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

విల్ హంటింగ్ 20 ఏళ్ళ అనాథ కుర్రాడు. బాస్టన్ లోని ప్రఖ్యాత ఎంఐటీ విశ్వవిద్యాలయంలో గదులు, కారిడార్లు తుడిచే పని చేస్తుంటాడు. అల్పాదాయ వర్గం ఉండే ప్రాంతంలో నివసిస్తూ ఉంటాడు. తన స్నేహితులతో అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటాడు. అయితే అతనొక మేధావి. క్లిష్టమైన గణితశాస్త్ర విషయాలు అతనికి కొట్టిన పిండి. ఏకసంథాగ్రాహి. ఎన్నో పుస్తకాలు చదివేశాడు. చరిత్ర, న్యాయశాస్త్రం, రసాయన శాస్త్రం… ఇలా ఎన్నో విషయాలు తెలుసు. ఎంఐటీలో గణితశాస్త్ర ప్రొఫెసర్ అయిన జెరాల్డ్ తన విద్యార్థులకు ఒక సమస్య ఇస్తాడు. తరగతి గది బయట గోడ మీద ఆ సమస్య వ్రాస్తాడు. అది ఎవరూ పరిష్కరించలేకపోతారు. దాన్ని విల్ పరిష్కరించి సమాధానం వ్రాస్తాడు. జెరాల్డ్ అతన్ని చూడటంతో అతను అక్కడి నుంచి వడివడిగా వెళ్ళిపోతాడు. ఆ సమాధానం చూసి అబ్బురపడిన జెరాల్డ్ అతనెవరో తెలుసుకుంటాడు. విల్ ఒక పోలీసాఫీసరు మీద దాడి చేయటంతో అరెస్టవుతాడు. జెరాల్డ్ జడ్జి దగ్గరకు వెళ్ళి విల్‌కి కౌన్సెలింగ్ ఇప్పిస్తానని హామీ ఇచ్చి అతన్ని విడిపిస్తాడు. జైలుకి వెళ్ళటం తప్పుతుందని విల్ ఒప్పుకుంటాడు. జెరాల్డ్ ఇచ్చిన క్లిష్టమైన గణితశాస్త్ర సమస్యలను పరిష్కరిస్తాడు. అతను తన కన్నా గొప్ప మేధావి అని జెరాల్డ్‌కి అర్థమౌతుంది. అయితే విల్ కౌన్సెలింగ్ ఇవ్వటానికి వచ్చిన మనోవైజ్ఞానికుల్ని అవమానిస్తుంటాడు. వాళ్ళు అతనితో వేగలేక ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు. తనకి కౌన్సెలింగ్ అవసరం లేదని విల్ అభిప్రాయం.

ఒక శాస్త్రంలో ప్రావీణ్యం ఉంటే దాని ఆధారంగా డబ్బు, కీర్తి సంపాదించటం మనం చూస్తూ ఉంటాం. మరి విల్ ఎందుకు ఆ పని చేయడు? అతని జీవితంలో చిన్నప్పుడే ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. అతనికి ఇప్పుడు ఉన్నది అతని స్నేహితులు మాత్రమే. వారితో కలిసి ఉండటమే అతనికి ఇష్టం. ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చే స్నేహమది. విల్‌కి ఆ స్నేహం వదులుకోవటం ఇష్టం లేదు. డబ్బు సంపాదించి కూడా స్నేహం కాపాడుకోవచ్చుగా అంటారా? అతనికి డబ్బు మీద వ్యామోహం లేదు. డబ్బు ఇచ్చేది ఆర్థిక భద్రత. మానసిక భద్రత కాదు. విల్ బాల్యమంతా మానసిక భద్రత లేకుండా గడిపాడు. ఇప్పుడు అతనికి తన చిన్ని ప్రపంచమే చాలు. అది దూరమైపోతే మళ్ళీ అలాంటి మానసిక భద్రత దొరకదేమోనని అతని భయం. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కని తన స్నేహితుల కుటుంబాలతో కలిసి జీవించటమే అతనికి కావాలి. బాల్యంలో కష్టాలు లేని వారికి ఇది అర్థం కాకపోవచ్చు. జెరాల్డ్ ఎన్నో బహుమతులు పొందిన ప్రొఫెసర్. అయితే అతను తన జీవితమంతా తన ఉద్యోగం కోసమే వెచ్చిస్తాడు. అందరూ అలా ఉంటారని కాదు కానీ విల్‌కి అలాంటి ఉద్యోగాలు ఇష్టం లేదు. ఇంకో విషయమేమిటంటే అతనికి గణితం చాలా సులువైన విషయం. అది చేస్తుంటే అతనికి పని చేసినట్టుండదు. అందుకే అతను వేరే పని చేసుకోవాలనుకుంటున్నాడేమో!

విల్‌కి స్కైలర్ అనే అమ్మాయి పరిచయమవుతుంది. ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిని. ఒక బార్లో విల్ స్నేహితుడైన చక్‌ని ఒకతను అవమానిస్తుంటే విల్ అడ్డు వెళ్ళి తన వాగ్ధాటితో అతన్ని నోరు మూసుకునేలా చేస్తాడు. స్కైలర్ అది చూసి విల్‌కి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరూ డేట్‌కి వెళతారు. ఆమెకి అతను నచ్చినా అతను ఆమెతో సాన్నిహిత్యం పెంచుకోడు. విల్ కౌన్సెలింగ్ తీసుకోకపోవటంతో జెరాల్డ్ తనతో పాటు చదువుకున్న షాన్‌ని సంప్రదిస్తాడు. షాన్ ఒక చిన్న కాలేజీలో మనస్తత్వశాస్త్రంలో లెక్చరర్. అతని భార్య మరణించింది. విల్ పెరిగిన ప్రాంతంలోనే పెరిగాడు. భార్య మరణించిన తర్వాత అతను విరక్తితో ఉన్నాడని జెరాల్డ్‌కి తెలుసు. విల్ పెరిగిన చోటే అతను పెరిగాడు కాబట్టి విల్ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటాడని విల్‌కి కౌన్సెలింగ్ ఇవ్వమని జెరాల్డ్ అడుగుతాడు. విల్ రామానుజన్ లాంటి మేధావి అని అంటాడు. “నువ్వు వ్రాసిన పుస్తకం కూడా చదివే ఉంటాడు” అంటాడు. మొదటిసారి కలిసినపుడు విల్ షాన్ వేసిన ‘తుఫానులో పడవ’ పెయింటింగుని చూసి దాన్ని విశ్లేషిస్తూ “నువ్వు నీకు తగని స్త్రీని పెళ్ళి చేసుకున్నట్టున్నావు” అంటాడు. షాన్‌కి విపరీతమైన కోపం వస్తుంది. తీవ్రంగా హెచ్చరిస్తాడు. తర్వాత తెలిసేదేమిటంటే షాన్ భార్య క్యాన్సర్‌తో మరణించింది. అతను ఆమెని అమితంగా ప్రేమించాడు. షాన్ కౌన్సెలింగ్ ఇవ్వనని అంటాడని జెరాల్డ్ అనుకుంటాడు కానీ షాన్ ఒప్పుకుంటాడు.

మళ్ళీ కలిసినపుడు విల్‌తో షాన్ “నేను వేసిన ఒక్క పెయింటింగ్ చూసి నా జీవితమంతా తెలిసిపోయిందని అనుకున్నావు కదా? నీకు జీవితం గురించి తెలిసింది తక్కువ. మనసుని సంతోషంతో నింపే ప్రేమ అనుభవించావా? చరిత్ర తెలుసనుకుంటున్నావు. యుద్ధంలో నీ ఒళ్ళో నీ స్నేహితుడు ప్ర్రాణం వదిలితే ఎలా ఉంటుందో తెలుసా? నీ సహచరి మృత్యువుతో పోరాడుతుంటే పక్కనే నిస్సహాయంగా ఉండి చూడటం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు అనాథవి కదా? ‘ఆలివర్ ట్విస్ట్’ నవల (ఒక అనాథ కథ) చదివితే నీ జీవితం నాకు తెలిసిపోతుందా? నీ జీవితం నీదే. నీ అంతరాంతరాలలో నువ్వు ఎన్నో భయాలు పెట్టుకున్నావు. పైకి మాత్రం ఎవర్నీ లెక్క చేయనట్టు ఉంటావు. అది నీ రక్షణ వ్యూహం. నిన్ను తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉంది. నీకు ఇష్టమైతే వినటానికి నేను సిద్ధం” అంటాడు. విల్ నిశ్చేష్టుడై ఉండిపోతాడు. అయినా వయసు పొగరు వల్ల తర్వాతి కౌన్సెలింగ్ సెషన్లో ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. షాన్ కూడా మొండివాడే. తానూ మౌనంగా ఉండిపోతాడు. ఒకరోజు సెషన్లో విల్ తానే మాట్లాడతాడు. “నేనో అమ్మాయితో డేట్‌కి వెళ్ళాను. తెలివైన అమ్మాయి” అంటాడు, తనకు కూడా ఓ అమ్మాయి పడింది అని గొప్ప చెప్పుకోవటం కోసం. “మళ్ళీ ఆ అమ్మాయితో డేట్‌కి వెళతావా?” అని అడుగుతాడు షాన్. “చూద్దాం. ఇంకా పరిచయం పెంచుకుంటే ఆమె నాకు నచ్చకపోవచ్చు” అంటాడు విల్. “నువ్వు ఆమెకి నచ్చకపోవచ్చని నీ అసలు భావనేమో. అయినా నీ సిద్ధాంతం గొప్పగా ఉంది. అది ఆచరిస్తే ఎవరితోనూ పరిచయం లేకుండా జీవితమంతా గడిపేయవచ్చు” అంటాడు షాన్ వ్యంగ్యంగా. విల్ ఖంగుతిని ఉండిపోతాడు. షాన్ తన భార్య గురించి చిన్న చిన్న విషయాలు చెబుతాడు. “ఆమెకి కూడా నా లోపాలు తెలుసు. ఇవే మనకి మన ప్రత్యేకమైన ఉనికిని ఇస్తాయి. నీ లోపాలు నీకుంటాయి. అలాగే ఆ అమ్మాయిలో కూడా లోపాలుంటాయి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారా లేదా అనేదే ముఖ్యం” అంటాడు. విల్‌కి ఒక జీవితసత్యం తెలుస్తుంది. అయినా గంభీరంగా ఉండిపోతాడు. “మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఎప్పుడైనా అనుకున్నారా?” అని షాన్‌ని అడుగుతాడు. “నా భార్య చనిపోయింది” అంటాడు షాన్. రెట్టించినా అదే సమాధానం ఇస్తాడు. “ఇది బావుంది. ఇలాగే ఉంటే ఇంకెవరితోనూ పరిచయం లేకుండా జీవితం గడిపేయవచ్చు” అంటాడు విల్. షాన్ ఆలోచనలో పడతాడు.

విల్ తన పెయింటింగ్ చూసి తన జీవితం గురించి మాట్లాడినపుడు షాన్‌కి అందులో కొంచెం నిజం గోచరించింది. తన భార్య లేకపోవటం చేతనే అతను తుఫానులో చిక్కుకున్న పడవలా ఉండిపోయాడు. ఎలా తీరం చేరాలో తెలియని ప్రయాణమది. విల్‌తో మాట్లాడితే తన గురించి తనకు కొంచెం అవగాహన కలుగుతుందని ఏ మూలో అనిపించింది. అందుకే అతను తన జీవితంలోని విషయాలు విల్‌తో పంచుకున్నాడు. సాధారణంగా మనోవైజ్ఞానికులు తమ విషయాలు పేషంట్లకు చెప్పరు. షాన్ చెప్పాడంటే విల్ మాటల్లో తనకు కూడా ఒక దారి దొరుకుతుందని ఆశ. విల్ ‘భార్య చనిపోయినంత మాత్రాన జీవితం ఆగిపోతుందా’ అనే అర్థం వచ్చేటట్టు మాట్లాడేసరికి షాన్ ఆలోచనలో పడ్డాడు. పైకి షాన్ విల్‌కి సహాయం చేస్తున్నట్టు అనిపించినా వారిద్దరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. జెరాల్డ్ ఈ విషయం తెలిసే షాన్‌ని, విల్‌ని కలిపాడా? అదీ సంభవమే. విల్‌కి మనస్తత్వ శాస్త్రం కూడా తెలుసనేది నిజమే. అయితే అది పుస్తక జ్ఞానం మాత్రమే. తన జీవితంలో నిజమైన ప్రేమ పొందాలంటే తన మనసులోకి తొంగి చూసే అవకాశం ఎవరో ఒకరికి ఇవ్వాలని షాన్ చెబితేనే విల్‌కి తెలిసింది. అతనికి ఎవరో ఒక అమ్మాయి దొరక్కపోదు. అయితే అతన్ని అర్థం చేసుకోగలిగిన అమ్మాయి దొరకటం కష్టమే. స్కైలర్ లాంటి తెలివైన అమ్మాయే అతనికి సరిజోడీ.

షాన్ మాటల ప్రభావంతో విల్ స్కైలర్‌తో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అయితే తన ఇంటికి ఆమెని తీసుకువెళ్ళడు. ఆమె ఉండే హాస్టల్లోనే వారు రాత్రులు గడుపుతుంటారు. తాను అనాథనని చెప్పడు. పైగా తనకి పదకొండు మంది అన్నదమ్ములు ఉన్నట్టు చెబుతాడు. ఆమె అడగ్గా అడగ్గా తన స్నేహితులని పరిచయం చేస్తాడు. ఆమె భేషజాలు లేకుండా వారితో కలిసిపోతుంది. అతని ప్రతిభ చూసి అబ్బురపడుతుంది. అతను ఆమెకి రసాయనశాస్త్రంలో విషయాలు చెబుతాడు. “నీకివన్నీ ఎలా తెలుసు? ఇంత సులభంగా ఎలా చెప్పగలుగుతున్నావు?” అంటుంది. “బీతోవెన్, మోజార్ట్ లకు పియానో వాయించటం ఎవరూ నేర్పలేదు. వారికి వచ్చేసిందంతే. నాకు పియానో వాయించటం తెలియదు” అంటాడతను. “అయినా ఆర్గానిక్ కెమిస్ట్రీ మాత్రం సులువుగా చేయగలవు” అంటుందామె. “అది నాకు వచ్చేసిందంతే” అంటాడతను. పియానో వాయించటం రాదని చెప్పే నిరహంకారమైన అతని స్వభావానికి ఆమె మరింత లోతుగా అతని ప్రేమలో పడుతుంది. స్కైలర్, షాన్, జెరాల్డే కాక విల్ స్నేహితుడు చక్ కూడా అతని మంచి కోసం తపించేవాడే. “నువ్వింత తెలివైనవాడివి. ఇలా నీ జీవితం వ్యర్థం చేసుకోకు. ఈ జీవితం నుంచి బయటపడి నువ్వెంతో సాధించగలవు. రోజూ నీ ఇంటికి వస్తాను కదా. రోజూ నువ్వు ఇంటిలో లేకుండా ఉంటే బావుండునని కోరుకుంటూ వస్తాను” అంటాడు ఒక సందర్భంలో. అంటే విల్ ఎక్కడికైనా వెళ్ళి మంచి జీవితం ప్ర్రారంభించాలని అతని కోరిక. ఇందరు మంచి మనుషులు విల్ కోసం తపిస్తుంటే కథలో చివరికి ఏం జరుగుతుందో ఊహించటం కష్టం కాదు. కానీ కథనం ఆకట్టుకుంటుంది. పిల్లలకు అందమైన బాల్యం అందించటం ఎంత ముఖ్యమో ఈ కథ చెబుతుంది.

విల్ పెద్ద ఉద్యోగం చేయనని, చిన్న చిన్న పనులు చేసుకుంటానని అంటే షాన్ “ఎంతో మంది తమ బిడ్డలకు మంచి అవకాశాలు రావాలని కూలి పనులు చేసుకున్నారు. నీకు అవకాశం వచ్చింది” అంటాడు. “నేను కోరుకోలేదు. చిన్న పనుల్లో కూడా గౌరవముంది” అంటాడు విల్. “నువ్వు గదులు తుడిచే పని ఎక్కడైనా చేయవచ్చు. ఎంఐటీ లోనే ఎందుకు ఆ పని చేస్తున్నావు? గణితం సమస్యలు ఎందుకు గుట్టుగా పరష్కరిస్తున్నావు?” అని అడుగుతాడు షాన్. విల్ సమాధానం చెప్పలేకపోతాడు. తనకేం కావాలో తనకే తెలియదని విల్‌కి అర్థమౌతుంది. ఇదే మంచి మనోవైజ్ఞానికులు చేసే పని. మనిషి తనను తాను అర్థం చేసుకోవటానికి సహాయం చేస్తారు.

విల్‌గా మ్యాట్ డేమన్, షాన్‌గా రాబిన్ విలియమ్స్, స్కైలర్‌గా మినీ డ్రైవర్ నటించారు. అందరికీ ఆస్కార్ నామినేషన్లు వచ్చాయి. రాబిన్ విలియమ్స్‌కి ఉత్తమ సహాయనటుడిగా ఆస్కార్ అవార్డు వచ్చింది. అంతకు ముందు ‘డెడ్ పోయెట్స్ సొసైటీ’ చిత్రంలో కూడా మంచి పాత్ర పోషించాడతను. జెరాల్డ్ గా స్టెలన్ స్కార్స్గార్డ్, చక్‌గా బెన్ యాఫ్లెక్ నటించారు. మ్యాట్ డేమన్, బెన్ యాఫ్లెక్ నిజ జీవితంలో కూడా స్నేహితులు. ఇద్దరూ కలిసి స్క్రీన్ ప్లే వ్రాశారు. స్క్రీన్ ప్లే కి ఆస్కార్ అవార్డ్ వచ్చింది. అప్పటికి వారి వయసు వరుసగా 27, 25 సంవత్సరాలు. ఈ చిత్రానికి గస్ వ్యాన్ శాంట్ దర్శకత్వం వహించాడు. చివరికి ఏం జరుగుతుందనే దాని కన్నా ఈ పాత్రలు ఒకరికి ఒకరు సాయపడటం, దాని కోసం వాళ్ళలో వాళ్ళే గొడవపడటం లాంటివి చూస్తే మనసు ఆర్ద్రతతో నిండిపోతుంది. ‘గుడ్ విల్ హంటింగ్’ అనే పేరుకి రెండు అర్థాలు చెప్పుకోవచ్చు. విల్ హంటింగ్ మంచి కుర్రాడు… కాస్త చేయూత కావాలి అని ఒక అర్థం. హంటింగ్ అంటే వేట, అన్వేషణ అనే అర్థాలున్నాయి కాబట్టి విల్ మంచి మార్గం కోసం అన్వేషిస్తున్నాడు అని ఒక అర్థం.

ఈ క్రింద చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలు, ముగింపు ప్రస్తావించబడ్డాయి. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

తన డిగ్రీ చదువు ముగుస్తుండటంతో స్కైలర్ వైద్యశాస్త్రం చదవాలని వేరే ఊరికి ప్రయాణమౌతుంది. విల్‌ని తనతో రమ్మంటుంది. “అక్కడకు వచ్చిన తర్వాత నా లోపాలేవో తెలిసి నువ్వు నన్ను వదిలేస్తే ఎలా? అయినా నాకిక్కడ ఉద్యోగం ఉంది. ఇది నా ఊరు” అంటాడు విల్. “నేను నిన్ను ప్రేమించటం మానేస్తానని నీ భయం. నీలాగే నాకూ కొన్ని భయాలున్నాయి. కానీ భయపడుతూ కూర్చుంటే జీవించలేం. నువ్వేదో దాస్తున్నావు” అంటుంది. “నేనేం దాచలేదు” అంటాడతను. “నీకు అన్నదమ్ములున్నారన్నావు. అది నిజమా?” అంటుందామె. అతనికి తన అబద్ధం బయటపడిందని అక్కసు పుడుతుంది. “కాదు. నేను అనాథనే. నా ఒంటి మీద ఉన్న గాయం ఆపరేషన్ గుర్తు కాదు, కత్తిపోటు. వాడు నన్ను పొడిచాడు. సిగరెట్ వాతలు పెట్టాడు” అంటాడు. “ఇవన్నీ నాకు తెలియవు కదా. నేను నీకు తోడుగా ఉంటాను” అంటుందామె. “నన్ను కాపాడు అని నేనేమన్నా అడిగానా?” అంటాడతను. “నన్ను ప్రేమించలేదని ఒక్కమాట అను. నేను నీ జీవితం నుంచి వెళ్ళిపోతాను” అంటుందామె. “నేను నిన్ను ప్రేమించలేదు” అని అతను అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆమె కన్నీళ్లతో మిగిలిపోతుంది.

అమెరికాలో అనాథల దత్తత జరిగేవరకు వేరే వారి సంరక్షణలో ఉంచే పద్ధతి కూడా ఉంది. ఇష్టమైన వాళ్ళు నమోదు చేసుకుంటే సంరక్షకులుగా ఉండవచ్చు. వారికి ప్రభుత్వం కొంత డబ్బు కూడా ఇస్తుంది. విల్ అలా ఒక ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ ఇంటి యజమాని విల్‌ని కొట్టేవాడు. రక్షించాల్సిన వారే ఇలా చేసేసరికి అతని మనసు విరిగిపోయింది. అతని మనస్తత్వాన్ని విశ్లేషిస్తూ తర్వాత షాన్ “అతను ఎవర్నీ నమ్మడు. ఎవరైనా తనకి దగ్గర కావాలని ప్రయత్నిస్తే వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. వాళ్ళు తనని ఎలాగూ వదిలేస్తారనే భావంతో ముందే అతను దూరంగా వెళ్ళిపోతాడు” అంటాడు. చిన్ననాటి అనుభవాలు మనిషి మీద చెరగని ముద్ర వేస్తాయి. చెడు అనుభవాలు ఎదురైన పిల్లలు ఎలా మారతారో చెప్పలేం. విల్ అదృష్టం బావుండి అతనికి మంచి మనుషుల సహాయం లభించింది. కానీ అతను ఎవర్నీ నమ్మలేదు. షాన్ దగ్గరకి వెళ్ళటం మానేస్తాడు.

జెరాల్డ్ షాన్ దగ్గరకు వెళ్ళి విల్‌కి కౌన్సెలింగ్ ఆగిపోతే అతను జైలుకి వెళ్ళాల్సి వస్తుందని అంటాడు. అతని కౌన్సెలింగ్ పూర్తి చేసి, అతన్ని ఉద్యోగం చేసేలా ఒప్పించమంటాడు. షాన్ “విల్‌ని ఒత్తిడి చేస్తే అతను పారిపోయే అవకాశముంది” అంటాడు. “అందుకని అతణ్ణి ‘నీ ఇష్టం వచ్చినట్టు ఉండు’ అని చెప్పవద్దు. నువ్వు ఏమీ సాధించలేకపోయావు కాబట్టి అతణ్ణీ అలాగే తయారు చేయవద్దు” అంటాడు జెరాల్డ్. జెరాల్డ్ కి షాన్ మీద ఎలాంటి అభిప్రాయముందో మనకి అర్థమవుతుంది. షాన్‌కి కోపం వస్తుంది. “నేను సంతృప్తిగానే ఉన్నాను. నువ్వే నన్ను పరాజితుడిగా చూస్తావు. విల్‌ని కూడా అలాగే తక్కువ చేసి చూస్తున్నావు. అతని గురించి అందరికీ తెలియకపోతే అతని బతుకు వ్యర్థం అని నీ భావన” అంటాడు. “నేను కష్టపడి పైకొచ్చాను కాబట్టే ఈ స్థాయిలో ఉన్నాను” అంటాడు జెరాల్డ్. “నీకూ, విల్‌కి తేడా ఉంది. అర్థం చేసుకో” అంటాడు షాన్. చాలామంది జెరాల్డ్ లాగే ఆలోచిస్తారు. ‘నీ తోటి వాళ్ళందరూ బాగా సంపాదిస్తున్నారు. నీకేమైంది?’ అంటారు చాలామంది తలిదండ్రులు. ఆ తలిదండ్రులు పిల్లలకు ఎంత భద్రత కల్పిస్తున్నారో ఆలోచించుకోవాలి. వాళ్ళలో వాళ్ళు పోట్లాడుకోవటం, పిల్లల్ని కొట్టటం లాంటివి చేసే తలిదండ్రులు పిల్లలకి మానసిక గాయాలు చేస్తారు. పైగా పిల్లల అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. అందర్నీ ఒకే గాటన కట్టకూడదు. మంచి వాతావరణంలో పెరిగిన పిల్లలు మంచి బంధాలను పెంచుకుంటారు. మానసిక హింసకి, ఎమోషనల్ బ్లాక్‌మెయిల్‌కి గురి అయిన పిల్లలు పగిలిన అద్దంగా ఉండిపోతారు. జెరాల్డ్ పేరు సంపాదించాడు కానీ అతనికి అతని పని తప్ప వేరే ప్రపంచం తెలియదు. గొప్ప స్థాయి అంటే ఇదేనా? షాన్ తన భార్యని అమితంగా ప్రేమించాడు. ఆమెతో మధురమైన సమయాన్ని గడిపాడు. ఏమిచ్చినా ఆ బంధాన్ని మాత్రం వదులుకునేవాడిని కాదు అని అంటాడు. డబ్బు, కీర్తి మాత్రమే జీవితం అని షాన్ అనుకోలేదు.

మరో విషయం ఏమిటంటే పిల్లలు తమ మీద జరిగే హింసకు తామే కారణమనుకుంటారు. తలిదండ్రులు విడిపోతే కొందరు పిల్లలు తమ తప్పు కూడా ఉందేమోనని క్షోభపడతారు. విల్ కూడా తన మీద జరిగిన హింసకు తన తప్పు ఉందనే భావనలో ఉంటాడు. షాన్‌కి అది అర్థమౌతుంది. చక్‌తో మాట్లాడిన తర్వాత విల్ షాన్ దగ్గరకి వస్తాడు. షాన్ విల్ మీద జరిగిన హింసని ప్రస్తావించి “నీ తప్పు లేదు” అంటాడు. విల్ పైకి “నాకు తెలుసు” అంటాడు కానీ షాన్ అతని మనసులో విషయం నాటుకునే దాకా “నీ తప్పు లేదు” అని మళ్ళీ మళ్ళీ అంటాడు. విల్ చివరికి షాన్‌ని వాటేసుకుని విలపిస్తాడు. తనలో ఏదో పెద్ద లోపం ఉందని అనుకోవటం వలన అతను తనకు పైస్థాయికి చేరే అర్హత లేదని, ప్రేమని పొందే అర్హత లేదని అనుకున్నాడు. ఇప్పుడు అతను తానూ అందరిలాంటి వాడినేనని తెలుసుకున్నాడు. తన మీద జరిగిన హింసకి తాను కారణం ఏమాత్రం కాదని తెలుసుకున్నాడు.

అప్పటికే స్కైలర్ వెళ్ళిపోతుంది. వెళ్ళేముందు విల్ ఆమెకి ఫోన్ చేస్తాడు. శుభాకాంక్షలు చెబుతాడు. ఆమె ‘ఐ లవ్యూ’ అంటుంది కానీ విల్ కేవలం ‘గుడ్ బై’ అంటాడు. స్కైలర్ విమానాశ్రయంలో కూడా అతని కోసం చూస్తుంది. అతను రాడు. షాన్ అతనికి ఆత్మవిశ్వాసం కలిగించాక అతను జెరాల్డ్ చూపించిన ఒక ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళతాడు. జెరాల్డ్ షాన్ దగ్గరకి వచ్చి అతన్ని కించపరిచినందుకు క్షమాపణ చెబుతాడు. షాన్ కూడా క్షమాపణ చెబుతాడు. షాన్ కొన్నాళ్ళు ప్రపంచపర్యటన చేసి వస్తానని అంటాడు. భార్య పోయిన తర్వాత తాను కూడా జీవించటం మానేశానని అతనికి అర్థమయింది. బతికి ఉండటం వేరు, జీవించటం వేరు. జీవించటమంటే గతంలో ఆగిపోకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా సాగిపోవటం.

విల్‌కి అతని స్నేహితులు ఒక కారు బహుమతిగా ఇస్తారు. కొత్త కారు కాదు, కారు భాగాలను కొని వాటిని జోడించి తయారు చేసిన కారు. విల్ ఉద్యోగం చేసుకుంటాడని అందరూ అనుకుంటారు. అయితే విల్ స్కైలర్‌ని కలుసుకోవటానికి బయలుదేరుతాడు. జీవితంలో ఉద్యోగాలు ఎన్నైనా దొరకుతాయి. కానీ మనల్ని అర్థం చేసుకునే తోడు దొరకటం కష్టం. అందుకే అతను అహంకారాన్ని పక్కనపెట్టి స్కైలర్ దగ్గరకి బయలుదేరతాడు. ఇక్కడ చిత్రం ముగుస్తుంది. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క కథ. వారి జీవితాలలో ఏ గాయాలున్నాయో మనకి తెలియదు. అందుకే ఎవరితోనైనా సాధ్యమైనంత సౌజన్యంతో మెలగాలి. అవతలివారు కటువుగా ఉంటే వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. వారి మనసులో ఎన్ని పగుళ్ళు ఉన్నాయో మనకి తెలియదు కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here