మరుగునపడ్డ మాణిక్యాలు – 27: మ్యారేజ్ స్టోరీ

0
7

[dropcap]ఆ[/dropcap]మె ఎవరేం చెప్పినా శ్రద్ధగా ఉంటుంది. అవతలి వారు ఇబ్బంది పడుతుంటే సర్దిచెబుతుంది. బాధ్యతగా ఉంటుంది. ఇంట్లో అందరికీ జుట్టు తానే కత్తిరిస్తుంది. అదేమిటో తెలియదు కానీ ఎప్పుడూ టీ బ్యాగ్ వేసుకుని కప్పు పెట్టుకుంటుంది కానీ తాగదు. ఎక్కడి వస్తువు అక్కడ పెట్టటం చేతకాదు కానీ పాపం ప్రయత్నిస్తుంది. పుట్టినరోజులకి, పెళ్ళిరోజులకి మంచి బహుమతులు ఇస్తుంది. కొడుకుతో ఆటలాడి మురిపిస్తుంది. అలిసిపోయినా సరే. పోటీ తత్వం ఎక్కువ. ఇంటిలో తిండికి లోటు లేకుండా చూస్తుంది. బాగా డ్యాన్సు చేస్తుంది. లాస్ ఏంజెలెస్‌లో పుట్టి పెరిగింది. హాలీవుడ్‌లో సినిమా తార అయే అవకాశం ఉన్నా వదులుకుంది. భర్త దర్శకత్వంలో న్యూయార్క్‌లో నాటకాలు వేస్తూ ఉంటుంది.

అతను దేనికీ బెదరడు. తినేటపుడు ఆబగా తింటాడు. కానీ శుభ్రత ఎక్కువ. కరెంటు వృథా చేయడు. సినిమాలు చూసినపుడు ఏడుస్తాడు. వంట చేస్తాడు. భార్య చిరాగ్గా ఉంటే ఓపిగ్గా ఉంటాడు. మంచి బట్టలు వేసుకుంటాడు. పోటీ తత్వం ఎక్కువ. కొడుకు మారాం చేసినా, రాత్రివేళ నిద్రలేపినా విసుక్కోడు. ఒక్కోసారి పరిసరాలు మరిచిపోతాడు. సొంతంగా పైకొచ్చాడు. చిన్నతనంలో అతని కుటుంబంలో తాగుడు, గృహహింస ఉన్నా ఆ ప్రభావం లేకుండా బయటపడ్డాడు. తన నాటక కంపెనీలో అందరి క్షేమాన్ని పట్టించుకుంటాడు. అన్నీ బాగా ఆలోచించి చేస్తాడు.

పై విషయాలు ఎవరో చెప్పినవి కావు. ఆమె గురించి అతను, అతని గురించి ఆమె చెప్పినవి. ఆమె పేరు నికోల్, అతని పేరు చార్లీ. ఆహా, ఎంత గొప్ప జంట అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇద్దరూ విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. మధ్యవర్తి ఒకరు ఉంటారు. ఆ మధ్యవర్తి పని వీరిద్దరూ స్నేహపూర్వకంగా విడిపోయేలా చూడటమే. అతను ఇద్దరినీ అవతలి వారిలో ఏం నచ్చాయో రాసుకు రమ్మంటాడు. వాళ్ళు రాసుకున్నవే పై మాటలు. అయితే ఆ మాటలు చదవమన్నపుడు నికోల్ చదవనంటుంది. చార్లీ తాను రాసింది చదువుతానంటాడు. ఆమె విననంటుంది. అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోతుంది. తర్వాత కొడుకుని తీసుకుని లాస్ ఏంజెలెస్‌కి వెళ్ళిపోతుంది. ఆమె తల్లి, చెల్లి అక్కడ ఉంటారు.

ఒక విడాకుల కథని ‘మ్యారేజ్ స్టోరీ’ (2019) గా తెరకెక్కించారు నోవా బాంబాక్. నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం. మామూలుగా లవ్ స్టోరీ అనే పదబంధం వాడుకలో ఉంది. మ్యారేజ్ స్టోరీ అనటంలో ఇది విడాకుల కథ అయినా ప్రేమ ఉంది అనే అర్థం వస్తుంది. ఆ జంట విడాకులెందుకు తీసుకుందామనుకున్నారు? నికోల్ తన లాయరు నోరాకి తన కథ చెబుతుంది. ఆమె ఒక సినిమాలో నటించింది. మరో సినిమా పని కోసం న్యూయార్క్ వెళ్ళినపుడు చార్లీ కలిశాడు. అతని మేధాశక్తికి ఆమె అకర్షితురాలయింది. అక్కడే ఉండిపోయింది. అతని నాటకంలో వేషం వేసింది. మొదట ప్రేక్షకులు ఆమె కోసం నాటకం చూడటానికి వచ్చారు. తర్వాత్తర్వాత అతనికి పేరు వచ్చింది. అతని నాటకాలలో ఆమె నటించినా అతనికే  ఖ్యాతి వచ్చింది. పెళ్ళి చేసుకున్నారు. ఒక కొడుకు పుట్టాడు. ఇల్లు, ఫర్నిచర్ అంతా అతని అభిరుచికి తగ్గట్టే ఉంటుంది. ఆమె తల్లి, చెల్లికి అతనంటే ఇష్టం. ఆమెకి ఒక టీవీ సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అందులో నటించాలంటే లాస్ ఏంజెలెస్‌కి వెళ్ళాలి. హాలీవుడ్ లాస్ ఏంజెలెస్ లోనే ఉంది. అమెరికాలో న్యూయార్క్ తూర్పు తీరాన ఉంటే లాస్ ఏంజెలెస్ పడమటి తీరాన ఉంటుంది. అతను ఆమెని ప్రోత్సహించకపోగా అవహేళన చేస్తాడు. టీవీ అంటే చిన్నచూపు. అయితే ఇక్కడ సమస్య నాటకం గొప్పా టీవీ గొప్పా అని కాదు. ఆ సీరియల్ గొప్పది కాదని ఆమెకీ తెలుసు. తనకి ప్రాధాన్యం తగ్గిందని ఆమె అక్కసు. నీ కోసం నేను న్యూయార్క్‌లో ఉండిపోయాను, నాకోసం నువ్వు లాస్ ఏంజెలెస్‌కి రావచ్చు కదా అని ఆమె వాదన. ఆమెకి పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని తెలిసి అతను ఆ డబ్బుని నాటకాల కంపెనీలో పెట్టొచ్చు కదా అంటాడు. ఆమె మనసు విరిగిపోతుంది. ఇదే కాక అతనికి మరో స్త్రీతో సంబంధం ఉందని ఆమె అంటుంది. నికోల్‌గా నటించిన స్కార్లెట్ జోహాన్సెన్ ఈ సన్నివేశంలో అనేక భావాలు పలికిస్తూ తన పాత్ర పలకాల్సిన మాటలని ఒకే షాట్లో పలికిన తీరు అద్భుతం. ఓ పక్క బాధ, ఓ పక్క తనని తాను సమర్థించుకోవాలనే ప్రయత్నంలో ఉన్న ఇబ్బంది కలిపి ఆమె నటించింది.

చార్లీ కొడుకు కోసం లాస్ ఏంజెలెస్ వచ్చినపుడు నికోల్ చార్లీకి లాయరు నోటీసు ఇస్తుంది. లాయర్లతో పని లేకుండా విడాకులు తీసుకుందామనుకున్నారు కానీ నికోల్ ఇతరుల సలహా విని లాయర్ని పెట్టుకుంది. చార్లీకి కూడా లాయర్ని పెట్టుకోక తప్పని పరిస్థితి. ఇంతలో చార్లీకి కళలకు సంబంధించిన ఒక గ్రాంట్ వస్తుంది. ఇంకా చేతికి రాలేదు కానీ పెద్ద మొత్తం. చార్లీ జే అనే ఒక లాయర్ని సంప్రదిస్తాడు. చార్లీకి తన సొంత కుటుంబంతో సత్సంబంధాలు లేకపోవటంతో లాస్ ఏంజెలెస్‌లో నికోల్ కుటుంబం సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. వారి కొడుకు హెన్రీ కూడా అక్కడే పుట్టాడు. నికోల్ లాయర్ నోటీసు కూడా అక్కడే ఇచ్చింది. ఇదంతా ఒక వ్యూహమని జే చార్లీతో అంటాడు. జాగ్రత్తగా ఉండకపోతే హెన్రీని మళ్ళీ న్యూయార్క్‌కి తీసుకువెళ్ళే అవకాశం లేకుండా పోతుందంటాడు. వెంటనే హెన్రీని తీసుకుని న్యూయార్క్ వెళ్ళి అక్కడ కోర్టుని ఆశ్రయించమంటాడు. అయితే జే ఫీజు చాలా ఎక్కువ. చార్లీ నికోల్ తన కొడుకుని తనకి దూరం చేయదనే నమ్మకంతో ఒక్కడే న్యూయార్క్‌కి వెళతాడు. పైగా జే అడిగే ఫీజు కట్టడానికి చేతిలో డబ్బు లేదు.

నికోల్‌కి చార్లీ డబ్బు మీద ఆశ లేదు. ఆమెకి కావలసింది హెన్రీ. చార్లీకి కూడా హెన్రీ కావాలి. అతని కోసమైనా ఇద్దర్లో ఎవరో ఒకరు పంతం వీడవచ్చు కదా? నేనే ఎందుకు వీడాలి అని ఇద్దరి పట్టుదల. తల్లికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి నికోల్‌కి మరీ పంతం. పోనీ చార్లీయే లాస్ ఏంజెలెస్‌లో ఉండవచ్చు కదా అంటే అతనికి సినిమాల్లో, టీవీల్లో పని చేయటం ఇష్టం లేదు. నాటకాలే సరైన కళారూపాలని అతని అభిప్రాయం. పైగా అతనికి న్యూయార్క్ లోని ప్రతిష్ఠాత్మకమైన బ్రాడ్ వే లో నాటకం వేసే అవకాశం వస్తుంది. లాస్ ఏంజెలెస్‌లో నాటకాలకు పెద్దగా ఆదరణ లేదు. నికోల్ కొన్నాళ్ళ తర్వాత న్యూయార్క్ రావాలని అతని పంతం. నికోల్ ఒప్పుకోదు. ఎక్కడో ఒక చోట రాజీ పడాలి. చార్లీ ప్రయత్నిస్తే తనికిష్టమైన రీతిలో టీవీలోనే పని చేసుకోవచ్చు. కానీ అతనిది ఆభిజాత్యం. ఆపై పురుషాహంకారం. లాయర్లు ఇంకా ఎగదోస్తారు. నికోల్ లాయరు నోరా అయితే “You did your time in New York. He can do some time in LA” అంటుంది. ఆ మాటకి “నువ్వు న్యూయార్క్‌లో కొంత కాలం ఉన్నావు. అతను లాస్ ఏంజెలెస్‌లో కొంత కాలం ఉండొచ్చు కదా” అనే అర్థం పైకి కనిపించే అర్థం. ‘Do time’ అనే పదబంధానికి ‘శిక్ష అనుభవించటం’ అనే అర్థం కూడా ఉంది. నోరా అన్న మాటకి “నువ్వు న్యూయార్క్‌లో శిక్ష అనుభవించావు. అతను లాస్ ఏంజెలెస్‌లో శిక్ష అనుభవించాలి” అనే అర్థం కూడా వస్తుంది. నికోల్‌కి ఈ శ్లేష అర్థం కాకపోయినా నోరా ఎలాంటి లాయరో మనకి అర్థమవుతుంది. జే సహాయకుడు “క్రిమినల్ లాయర్లు చెడ్డవాళ్ళలోని మంచిని చూపిస్తారు. విడాకుల లాయర్లు మంచివాళ్ళలోని చెడ్డని చూపిస్తారు” అంటాడు. అంటే విడాకుల లాయర్లు అవతలి వారి తప్పులు వెతికి వాటిని భూతద్దంలో చూపిస్తారు. ఎవరు తక్కువ చెడ్డగా కనిపిస్తే వారికి అనుకూలంగా తీర్పు వస్తుంది. హిందీలో వచ్చిన ‘థప్పడ్’ సినిమాలో కూడా విడాకులు కోరిన ఇల్లాలికి మన:స్థితి బాగాలేదని భర్త తరఫు లాయర్లు వాదించటానికి ప్రయత్నిస్తారు. భార్య దక్కకపోతే బిడ్డనయినా దక్కించుకోవాలనే భర్త ఆశకి ఆజ్యం పోసినట్టవుతుంది.

నికోల్ అసంతృప్తిగా ఉండటంతో చార్లీని దూరం పెట్టింది. వారిద్దరూ వేరు వేరుగా పడుకునేవారు. ఆ సమయంలో అతను వేరే స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు. ఇదే విషయాన్ని ఆమె అడిగితే నువ్వు నన్ను దూరం పెట్టావు కదా అంటాడు. అతను చేసినది తప్పు. స్వీయ నియంత్రణ లేక చేశాడు. ఆమెకి ఎలా తెలిసింది? అతని మీద అనుమానంతో అతని ఈమెయిల్ అకౌంట్‌ని హ్యాక్ చేయించింది. అతని ఈమెయిల్స్ ద్వారా తెలిసింది. అయితే హ్యాకింగ్ చట్టరీత్యా అది నేరం. కానీ అతనిది తప్పు కాకుండా పోదుగా? అయితే అతని తరఫు లాయర్లు ఆమె హ్యాకింగ్ చేయటం తప్పని వాదించే అవకాశం ఇచ్చినట్టయింది. ఇలా కొన్ని సాంకేతిక విషయాల వల్ల వాళ్ళ వాదనికి బలం చేకూరుతుంది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే పోయేదానికి లాయర్ల దాకా వెళ్ళి మనశ్శాంతి పోగొట్టుకుంటారు. అందుకే లాయర్ల దగ్గరకి వెళ్ళటం కన్నా మధ్యవర్తిత్వం చేయించుకోవటం ఉత్తమం.

మరి పసివాడైన హెన్రీ సంగతి ఏమిటి? అతనికి లాస్ ఏంజెలెస్ నచ్చుతుంది. న్యూయార్క్‌లో స్థలం తక్కువ, జనం ఎక్కువ. లాస్ ఏంజెలెస్‌లో స్థలం ఎక్కువ, జనం తక్కువ. అయినా హెన్రీకి నచ్చినది అతని కొత్త స్నేహితులు. పిల్లలు రకరకాలుగా ఉంటారు. “డాడీకి ఇష్టమైతే మనమందరం ఇక్కడే ఉండవచ్చు అని అమ్మ చెప్పింది” అంటాడు హెన్రీ తండ్రితో. అది నిజమే అయినా డాడీకి ఇష్టం లేదు అనే అర్థం కూడా వస్తుంది. మరి హెన్రీకి తండ్రి దోషిగా కనపడడా? అందుకే చార్లీ ఒక సందర్భంలో “హెన్రీకి నేను వాడి కోసం పోరాడానని తెలియాలి” అని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. అతనొక లాయర్ని పెట్టుకుంటాడు. ఆ లాయరు “వయసు పెరిగే కొద్దీ హెన్రీకి సొంత అభిప్రాయాలు ఏర్పడతాయి. అప్పుడు నిన్ను అర్థం చేసుకుంటాడు” అంటాడు. “ఆమెని న్యూయార్క్ నుంచి వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది” అంటాడు చార్లీ. “న్యూయార్కా, లాస్ ఏంజెలెసా అని కాకపోతే ఇంకో విషయం గురించి కొట్టుకునేవారు. ఈ వ్యాజ్యాలు ఇలాగే ఉంటాయి. ఇంకా లాగితే ఆమె లాయరు నీకొచ్చిన గ్రాంట్‌లో సగం ఆమెకి చెందాలి అనవచ్చు. కాబట్టి ఆమె లాస్ ఏంజెలెస్‌లో ఉండటానికి ఒప్పుకో” అంటాడు లాయరు. చార్లీ ఒప్పుకోడు. గ్రాంట్ డబ్బు కొంత చేతికి రాగానే ఆ లాయర్ని తీసేసి జే ని లాయరుగా పెట్టుకుంటాడు. దాంతో పరిస్థితులు ఇంకా అధ్వాన్నమవుతాయి.

చార్లీకి, నికోల్ కి ఒకరంటే ఒకరికి ప్రేమ లేదా అంటే ఉంది. ఒకసారి లాయర్లతో ఇద్దరూ మీటింగులో ఉండగా తినటానికి ఏమైనా ఆర్డర్ చేద్దామని అందరూ ఒక రెస్టారెంట్ డెలివరీ మెనూ చూసి ఆర్డర్లు ఇస్తారు. చార్లీ ఏం ఆర్డర్ చేయాలో తెలియక సతమతమవుతుంటే నికోల్ అతని కోసం ఆర్డర్ చేస్తుంది. అతను తన నాటకం గురించి వేసే చిన్న చిన్న చలోక్తులకి చిరునవ్వు నవ్వుతుంది. ఆమె ఇంటికి ఉన్న ఎలెక్ట్రిక్ గేట్ పని చేయకపోతే అతను వెళ్ళి సహాయం చేస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. అయినా ఎవరి పంతం వారిది. మొదట్లో వారు ఒకరి గురించి ఒకరు చెప్పిన విషయాలు చూస్తే ఇద్దరికీ ఉన్న పోలిక వారి పోటీ తత్వం. ఛాందసవాదులైతే నికోల్ యే రాజీపడాలి అంటారేమో. కాలం మారింది. ఎవరి ఆకాంక్షలు వారికున్నాయి. హెన్రీ కోసం చార్లీ లాస్ ఏంజెలెస్ వెళ్ళటమే ఉత్తమం. పైగా అతను తప్పు కూడా చేశాడు. అయితే నికోల్ నటించిన టీవీ సీరియల్ ప్రజాదరణ పొందకపోతే పరిస్థితి ఏమిటి? అప్పుడు ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకోవచ్చు. ‘నేను ముందే చెప్పాను కదా’ అని ఆరోపణలు చేసుకోవటం వ్యర్థం. భార్య కానీ, భర్త కానీ మరీ చెడ్డవారైతే తప్ప విడాకులు తీసుకోవాలని అనుకునేవారంతా రాజీ కోసం ప్రయత్నించాలి. లేకపోతే పిల్లలు అనవసరంగా నలిగిపోతారు. పిల్లలను కాపాడుకున్నా పిల్లలను ప్రేమించే పెద్దవాళ్ళు నలిగిపోతారు. అదే ఈ చిత్రం సందేశం. కోర్టుకి వెళితే బురద జల్లుకోవటమే మిగులుతుంది. ఈ చిత్రంలో చివరికి జరిగే పరిణామాలు నిట్టూర్పు తెప్పిస్తాయి.

చార్లీ, నికోల్ కలిసి నటించిన ఒక సన్నివేశంలో భావోద్వేగాలు తారస్థాయికి చేరుకుంటాయి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా కొన్ని విషయాలను పట్టుకుని భార్యాభర్తలు ఎలా పోట్లాడుకుంటారో సహజంగా చూపించారు ఈ సన్నివేశంలో. ఎవరూ పరిపూర్ణమైన మనుషులు ఉండరు. అందరిలో లోపాలు ఉంటాయి. ‘నా లోపాలు నాకు ఉన్నట్టే వారి లోపాలు వారికుంటాయి. నా లోపాలని భరించాలని కోరుకున్నట్టే వారి లోపాలు నేను భరించాలి’ అనుకోగలిగితే చాలా సమస్యలు పరిష్కారమౌతాయి. ఈ సన్నివేశంలో ఇద్దరి నటన అద్భుతం. అయితే చార్లీగా నటించిన ఆడమ్ డ్రైవర్ కి ఈ ఒక్క సన్నివేశంలోనే తన ప్రతిభ ఎంత విస్తృతమైనదో చూపించే అవకాశం వచ్చింది. అతని నటన చూసి తీరాల్సిందే. నికోల్ లాయర్ నోరా ఒక సందర్భంలో పితృస్వామ్య వ్యవస్థలో అందరూ స్త్రీలు పరిపూర్ణమైన మాతృస్వరూపులుగా ఉండాలని ఆశించటం గురించి మాట్లాడుతుంది. తల్లిగా ఏ లోపమున్నా సమాజం హర్షించదు. తండ్రిలో లోపాలుంటే చూసీ చూడనట్టు వదిలేస్తుంది. ఈ సన్నివేశం రచయిత ప్రతిభకి, నోరాగా నటించిన లారా డెర్న్ నటనకి షోకేస్ లా ఉంటుంది.

ఈ చిత్రానికి ఉత్తమ చిత్రం విభాగంలో ఆస్కార్ నామినేషన్ వచ్చింది. స్కార్లెట్ జోహాన్సెన్ కి ఉత్తమ నటిగా, ఆడమ్ డ్రైవర్ కి ఉత్తమ నటుడిగా నామినేషన్లు వచ్చాయి. లారా డెర్న్ కి ఉత్తమ సహాయనటిగా ఆస్కార్ అవార్డు దక్కింది. జే గా నటించిన రే లియోటా లాయర్లు ఎంత కటువుగా ఉంటారో చూపిస్తాడు. రచయిత, దర్శకుడు నోవా బాంబాక్ తన భార్య అయిన నటి జెనిఫర్ జేసన్ లీ నుంచి విడాకులు తీసుకున్నాడు. అయినా ఈ కథ తమ కథ కాదని అతను అంటాడు. సాధారణంగా విడాకుల కేసులు ఎలా ఉంటాయో చూపించటానికి ఈ చిత్రం తీశానని అంటాడు. ఆయన రాసిన స్క్రీన్ ప్లే కి ఆస్కార్ నామినేషన్ వచ్చింది. సంగీతం అందించిన ర్యాండీ న్యూమన్ కి కూడా అస్కార్ నామినేషన్ వచ్చింది.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయవచ్చు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

చార్లీ జే ని లాయరుగా పెట్టుకోవటంతో నోరాకి చార్లీ ఉద్దేశం అర్థమౌతుంది. అతను పోరాటానికే సిద్ధపడ్డాడు. నోరాకి జే గురించి తెలుసు. కాబట్టి ఆమె కూడా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది. నికోల్‌కి నాటకాల వల్లే పేరొచ్చిందని, అందుకే ఆమెకి టీవీ సీరియల్లో అవకాశం వచ్చిందని జే వాదిస్తాడు. కాబట్టి నికోల్‌కి వచ్చే ఆదాయంలో చార్లీకి వాటా రావాలని అంటాడు. నికోల్ నాటకాలలో పని చేసి, తర్వాత తల్లిగా హెన్రీకి చూసుకోవటం వల్ల ఆమె సహకారంతో చార్లీ పని చేశాడు కాబట్టి అతనికి వచ్చిన గ్రాంట్లో నికోల్‌కి భాగముంటుందని నోరా వాదిస్తుంది. ఈ రెండు వాదనలు చార్లీకి, నికోల్‌కి ఇష్టం లేదని మనకి స్పష్టమౌతూనే ఉంటుంది. అయినా మౌనం వహిస్తారు. ‘వారు దాడి చేసే ముందు మనమే దాడి చేయాలి’ అనేదే లాయర్ల నినాదం! జడ్జి లాయర్ల వాదనలు విని తలిదండ్రులుగా వారిద్దరూ ఎలా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారో తెలుసుకోవటానికి ఒక ఉద్యోగినిని నియమిస్తాడు.

ఈ గొడవంతా ఎందుకని చార్లీ, నికోల్ రాజీ కోసం ప్రయత్నిస్తారు. చార్లీ లాస్ ఏంజెలెస్‌లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా కలుసుకుంటారు. కానీ ఎవరి అసంతృప్తులు వారివి. గొడవపడతారు. చార్లీ అయితే చివరికి “నువ్వు చచ్చిపోవాలని కోరుకుంటున్నాను” అంటాడు. తర్వాత ఆ మాటన్నందుకు సిగ్గుపడి ఏడుస్తూ క్షమాపణ చెబుతాడు. ఆమె ఓదారుస్తుంది కానీ ఇంత జరిగాక ఇక చేసేదేమీ ఉండదు. కోర్టు ఉద్యోగిని వారిద్దరినీ కలుసుకుని వారు హెన్రీని ఎలా చూసుకుంటున్నారో గమనిస్తుంది. ఇదంతా పెద్ద తలనొప్పని గుర్తించి వారు తమ డిమాండ్లని తగ్గించుకుంటారు. నికోల్ లాస్ ఏంజెలెస్‌లో ఉండేలాగ ఒప్పందం కుదురుతుంది. చార్లీ న్యూయార్క్ లో ఉంటాడు. ఎవరూ ఎవరికీ తమ ఆదాయంలో భాగం ఇవ్వక్కర్లేదు. చార్లీ అప్పుడప్పుడూ వచ్చి హెన్రీని చూస్తాడు.

ఒక సంవత్సరం తర్వాత ఇద్దరూ మంచి పేరు సంపాదిస్తారు. చార్లీ హెన్రీని చూడటానికి వస్తాడు. హెన్రీ కొంచెం దూరం దూరంగా ఉంటాడు. నికోల్‌కి ఒక ప్రియుడు ఉంటాడు. హెన్రీ అతనికి దగ్గరవుతాడు. చార్లీ నికోల్‌కి ఒక సంగతి చెబుతాడు. లాస్ ఏంజెలెస్‌లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో అతను అధ్యాపకుడిగా చేరబోతున్నాడు. ఆ మాట విని నికోల్ కాసేపు అవాక్కయి ఉండిపోతుంది. తర్వాత తేరుకుని అతన్ని అభినందిస్తుంది.

చార్లీ చివరికి లాస్ ఏంజెలెస్ రాక తప్పలేదు. కొడుకు దూరమౌతున్నాడని తెలిసి అతను అక్కడికి రావాలనే నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతనికి బ్ర్రాడ్ వే లో మంచి పేరు రావటం వలనే యూనివర్సిటీలో ఉద్యోగం వచ్చి ఉండవచ్చు. ఉద్యోగం లేకపోతే వచ్చేవాడా? నికోల్‌కి మంచి పేరు వచ్చింది. కానీ హెన్రీ ఎదిగాక ఆమె తన ఆశల కోసం తండ్రిని దూరం చేసిందని తెలిస్తే ఎలా ప్రతిస్పందిస్తాడు? వారి వారి ఆశల కారణంగా వారి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది. ఇది హెన్రీకి ఎలాంటి సందేశం ఇస్తుంది? ‘నీ ఆశలే నీకు ముఖ్యం. మిగతాదంతా తర్వాతే’ అనే సందేశం ఇవ్వదా? ఎప్పుడూ మన గురించే ఆలోచిస్తే అవతలివారు విసిగిపోతారు. ఆ పరిస్థితి తెచ్చుకోకపోవటమే మంచిది. ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా రాజీ కుదుర్చుకోవాలి కానీ మొండిగా ఉంటే భావితరాలు కూడా అలాగే తయారవుతాయి. తర్వాత వారిని చూసి మనమే బాధపడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here