మరుగునపడ్డ మాణిక్యాలు – 33: ధోబీ ఘాట్

0
6

[dropcap]ముం[/dropcap]బయి నగరంలో కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. డబ్బావాలాల గురించి చాలా మందికి తెలుసు. ఇంటిలో భోజనం తయారు చేసి డబ్బావాలాలకిస్తే వారు తీసుకువెళ్ళి ఆఫీసుల్లో పనిచేసే కుటుంబసభ్యులకి ఇస్తారు. ఇందులో పొరపాట్లు చాలా తక్కువ. ఇదేం గొప్ప విషయమా అనిపించవచ్చు. అంత పెద్ద నగరంలో వేల మందికి అలా అందించటం గొప్పే. ఇందులో జరిగే పొరపాటు ఆధారంగా ‘ద లంచ్ బాక్స్’ అనే సినిమా వచ్చింది. అలాగే ధోబీ ఘాట్. బట్టలు ఉతికే చోటు. చాకిరేవు అన్నమాట. ఇల్లు మారినా చాకలివాడు మారడు. అందరి బట్టలూ ఒకే చోట ఉతుకుతారు. ఈ అంశాన్ని కథలో ఇమిడ్చి తీసిన చిత్రం ‘ధోబీ ఘాట్’ (2011). ఇంకా ముంబయికే పరిమితమైన కొన్ని విషయాలు ఇందులో ఉంటాయి. అలాగని ఇది ఆ నగరానికే పరిమితమైన కథ కాదు. అనుకోకుండా ఒకరికొకరు పరిచయమైన నలుగురు వ్యక్తుల కథ. ఒకరి జీవితం జరిగే విషయాలు మరొకరికి ఆశ్చర్యం కలిగిస్తాయి. జీవితమంటే అవగాహన కలిగిస్తాయి. ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో లభ్యం.

మున్నా ఒక మురికివాడలో ఉండే యువకుడు. చిన్నప్పుడే బీహార్ నుంచి చిన్నాన్న దగ్గరకి వచ్చేశాడు. చిన్నాన్న ఇప్పుడు లేడు. మున్నా తలిదండ్రులని మర్చిపోయాడు. వారు కూడా అతన్ని మర్చిపోయారేమో. బట్టలు ఉతుకుతాడు. రాత్రి పూట వేరే పని చేస్తాడు. అతని స్నేహితుడు సలీం. డ్రగ్స్ అమ్ముతూ ఉంటాడు. మున్నాకి సినిమాల్లో వేషాలు వేయాలని కోరిక. కండల వీరుడు సల్మాన్ ఖాన్ వేసుకునే ముంజేతి గొలుసు లాంటిది తానూ వేసుకుంటాడు. సలీం తనకి ఓ నిర్మాత తెలుసని అంటాడు. మున్నా అతన్ని పరిచయం చేయమని అడుగుతూ ఉంటాడు కానీ సలీమే అప్పుడప్పుడూ మున్నా దగ్గర డబ్బు తీసుకుంటూ ఉంటాడు.

షాయ్ ఒక పెద్ద బిల్డర్ కూతురు. న్యూయార్క్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఉద్యోగం నుంచి విరామం (sabbatical) తీసుకుని ముంబయి వస్తుంది. అక్కడ చిన్న చిన్న పనులు చేసేవారిని గురించి పరిశోధన చేస్తుంటుంది. ఆమె బట్టలు ఉతికే మున్నాతో పరిచయం పెంచుకుంటుంది. అతని సాయంతో తన పరిశోధన చేస్తుంది. ధోబీలు, చెవుల్లో గులిమి తీసేవారు (ఔను, ఈ పని చేసే వాళ్ళు కూడా ఉంటారు), బళ్ళ మీద వ్యాపారం చేసేవారు, రాత్రివేళ పందికొక్కులని చంపేవాళ్ళు – ఇలా అందరినీ కలిసి మాట్లాడాలని అనుకుంటుంది. కలిసినవాళ్ళ ఫోటోలు తీస్తుంది. ఆమెకి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. మున్నా ఆమె ప్రేమలో పడ్డాడని సలీం ఆటపట్టిస్తూ ఉంటాడు. మున్నా కాదంటాడు కానీ అతని మనసు కలలు కంటూ ఉంటుంది.

అరుణ్ ఒక చిత్రకారుడు. తన పని తాను చేసుకుపోయే రకం. ఎవరితో పెద్దగా కలవడు. అతని కొత్త చిత్రాలలోని అంశం ‘భవనం’. భవనాలు నిర్మించే కార్మికుల అంతరంగాన్ని తన చిత్రాలలో చూపిస్తాడు. ఆ ప్రదర్శనలో షాయ్ అతన్ని కలుస్తుంది. ఇద్దరూ వైన్ తాగుతూ మాటల్లో పడతారు. ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. ఒకరి పట్ల ఒకరు ఆకర్షితులవుతారు. కలిసి పడుకుంటారు. మర్నాడు అతను ముభావంగా ఉంటాడు. ఆమె గమనించి అడిగితే “నేను అనుబంధాలు పెట్టుకునే మనిషిని కాదు. తాగిన మైకంలో తప్పు చేశాను. క్షమించు” అంటాడు. ఆమె కోపంగా వెళ్ళిపోతుంది.

అరుణ్ ఇల్లు మారతాడు. పాత ముంబయిలో ఇల్లు తీసుకుంటాడు. తన చిత్రాలకు పాత ముంబయి ప్రేరణ అవుతుందని అతని ఆశ. అతనికి కొత్త ఇంట్లో కొన్ని వీడియో టేపులు దొరుకుతాయి. ఇంతకు ముందు ఆ ఇంట్లో ఉన్నవారి టేపులవి. తిరిగి ఇచ్చేద్దామని బ్రోకరుని అడుగుతాడు కానీ అతను పారేయమంటాడు. అరుణ్ ఆ టేపులు చూడటం మొదలుపెడతాడు. పెళ్ళి చేసుకుని యూపీ నుంచి ముంబయి వచ్చిన ఒక యువతి తన తమ్ముడి కోసం రికార్డు చేసిన టేపులవి. ఆ టేపుల ద్వారా అతనికి ముంబయి చూపించాలని ఆమె ప్రయత్నం. కెమెరా కొనమంటే వీడియో కెమెరా కొంటాడు ఆమె భర్త. ఇంటిలో ఉన్నపుడు, బయట షికారు చేస్తున్నపుడు రికార్డు చేస్తుంది ఆమె. టేపుల మీద యాస్మిన్ నూర్ అని ఆమె పేరు ఉంటుంది. ఆమె అమాయకత్వం అరుణ్‌కి నచ్చుతుంది. అదే అతని కొత్త చిత్రానికి ప్రేరణ అవుతుంది.

షాయ్‌కి అరుణ్ మీద కోపమున్నా అతన్ని మర్చిపోలేకపోతుంది. అరుణ్ ధోబీ (చాకలి) మున్నా. అతని ద్వారా షాయ్‌కి  అరుణ్ అడ్రసు తెలుస్తుంది. అరుణ్ ఇంటి దగ్గర కట్టే బిల్డింగ్‌కి షాయ్ వాళ్ళ నాన్న బిల్డర్. ఆ బిల్డింగ్ నుంచి షాయ్ అరుణ్‌ని చూస్తూ ఉంటుంది. ఓ పక్క మున్నా తన ఫొటోలు తీయమని షాయ్‌ని అడుగుతాడు. ఆ ఫోటోలు నిర్మాతలకి ఇచ్చి సినిమాల్లో అవకాశాలు సంపాదించవచ్చునని అతని ఆశ. ఆమె అతని ఫోటోలు తీస్తుంది. అతన్ని నెమ్మదిగా అరుణ్ గురించి అడుగుతుంది. అరుణ్‌కి భార్య, కొడుకు ఉన్నారని, విడాకులు అయిపోయాయని అంటాడు. భార్య కొడుకుని తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయిందని చెబుతాడు. ఇంతలో అరుణ్‌కి అతని ఏజెంట్ వత్సల ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం వచ్చేలా చేస్తుంది. అతనికి కొడుకుని కలుసుకోవాలని కోరిక ఉందని ఆమెకి తెలుసు. అతను ఆస్ట్రేలియా వెళ్ళే లోగా షాయ్ అతన్ని కలుస్తుందా? మున్నా తన ప్రేమని బయటపెడతాడా? అరుణ్ తన కొత్త చిత్రం పూర్తి చేస్తాడా? యాస్మిన్ ఎక్కడికి వెళ్ళింది?

చిత్రంలో చిన్న చిన్న ఉపకథలు ఆసక్తికరంగా ఉంటాయి. అరుణ్ పక్క ఫ్లాట్లో ఒంటరిగా ఒక ముసలావిడ ఉంటుంది. ఆమె ఏం మాట్లాడదు. ముఖంలో భావాలేమీ ఉండవు. తర్వాత ఆమే యాస్మిన్ టేపుల్లో కూడా కనిపిస్తుంది. ఆమె గురించి యాస్మిన్ “పక్కింటి ఆంటీ అసలేమీ మాట్లాడదు. పాపం, ఏదో భయంకరమైన సంఘటనే జరిగి ఉంటుంది” అంటుంది. ఆమెకి ఎవరైనా అన్యాయం చేశారా? లేక ఆమె ఎవరికైనా అన్యాయం చేసి బాధపడుతోందా? ఎవరికి తెలుసు? అరుణ్‌కి తన ఏజెంట్ వత్సలతో సంబంధం ఉందని కూడా మనకి తెలుస్తుంది. విడాకులతో అతని మనసు విరిగిపోయింది. కానీ శరీరానికి వాంఛలు ఉంటాయి కదా. అందుకని ఆమెతో సంబంధం పెట్టుకున్నాడు. అతని భార్య ఎందుకు విడిపోయింది? ఆ విషయం సినిమాలో ప్రస్తావించలేదు. కానీ అతని ప్రవర్తనని బట్టి అతని భార్య అతనికి అన్యాయం చేసిందని అనిపిస్తుంది. అతను వేరొకరిని నమ్మే స్థితిలో లేడు. షాయ్‌తో గడిపిన మర్నాడు అతను “నేనిలాంటి పనులు చేసేవాడిని కాదు” అంటాడు. అతనికి ఆమె నిజంగానే నచ్చింది. కానీ ఓ పక్క భయం. ఇదే విషాదం. మనుషుల మీద నమ్మకం పోతే మంచివారిని కూడా నమ్మలేని పరిస్థితి వస్తుంది. ముసలావిడని చూసి ఆమెకి అన్యాయం జరిగిందని, అరుణ్ స్వభావం చూసి అతను భార్యకు అన్యాయం చేశాడని అభిప్రాయానికి రావటం మామూలుగా జరిగేదే. కానీ అలా కాక వేరుగా జరిగి ఉండొచ్చుగా!

మున్నా బట్టలుతికి తిరిగి ఇచ్చేదాకా ఏమేమి చేస్తాడో షాయ్ ఫొటోలు తీస్తుంది. ఆ క్రమంలో ఒక ఇంటికి ఇద్దరూ వెళతారు. అక్కడ ఒక పనిమనిషి ఉంటుంది. యజమానురాలు షాయ్‌ని చూసి విసుక్కుంటుంది. పనిమనిషిని బట్టలు తీసుకోమని లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత తెలిసేదేమింటంటే ఆమె మున్నాని తన వలలో వేసుకుంది. ఇలాంటి సంబంధాలు కూడా ఉంటాయి. మున్నా చిన్నపిల్లవాడేమీ కాదు. వయసు ప్రభావం. సినిమాలలో నటించాలని అనుకునేవాడికి ఇలాంటివి తప్పని తెలియదా? దాని దారి దానిదే, దీని దారి దీనిదే అన్నట్టు ఉంటాడు.

షాయ్ దొంగచాటుగా అరుణ్‌ని చూడటం తప్పు కాదా? అతనికి తాను నిజంగానే నచ్చానని ఆమె నమ్మకం. అతని గురించి తెలుసుకోవాలని ఆమె ప్రయత్నం. ఇదే పరిస్థితి ఒక అబ్బాయికి వస్తే? అబ్బాయిలు ఎక్కువగా అహంకారంతో అమ్మాయిల వెంటపడతారు. “నన్ను కాదంటుందా!” అనే అహం ఎక్కువ ఉంటుంది. అమ్మాయిలు సాధారణంగా అలా ఉండరు. పైగా పూర్తిగా ఇష్టం లేకపోతే అమ్మాయిలు హద్దులు దాటరు. ఒక్కపూటలో ఇష్టం పుడుతుందా? ఇది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న. షాయ్ మున్నాతో ఎందుకు స్నేహంగా ఉంటుంది? అతను కింది తరగతికి చెందినవాడు. మొదటిసారి కలిసినపుడు అతను తన కుర్తీ సరిగా ఉతకలేదని ఆమె కోప్పడుతుంది. అతను సరిగా ఉతికి తెస్తానని అంటాడు. ఆమె తన ప్రవర్తనకి సిగ్గుపడుతుంది. అపరాధభావంతో అతనితో స్నేహం చేస్తుంది. తన పనికి అతను ఉపయోగపడతాడని ఆమె స్వార్థం. ‘నేను స్నేహం చేయటమే అతనికి గొప్ప’ అనే దర్పం. ఇదో భేషజం. ఎవరూ పరిపూర్ణులు కాదు. యాస్మిన్ మాత్రం మచ్చలేని మనిషిగా కనపడుతుంది. దానికి కారణం ఆమెని టేపుల్లోనే మనం చూస్తాం. వీడియోల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ మనం చూసేది మనుషుల ఒక కోణం మాత్రమే. అది కృత్రిమం కూడా కావచ్చు. వారి అసలు స్వభావాలు వారి దగ్గరి వారికి మాత్రమే తెలుస్తాయి.

కిరణ్ రావు రచన, దర్శకత్వం చేసిన చిత్రమిది. మొదటిసారి దర్శకత్వం ఇంత నేర్పుగా చేయటం ఆశ్చర్యం కలిగిస్తుంది. అప్పటి ఆమె భర్త ఆమిర్ ఖాన్ చిత్రాన్ని నిర్మించి అరుణ్ పాత్ర పోషించాడు. అతని వయసు పెద్దదని చూపించటానికి అతని జుట్టుకి కాస్త తెల్లరంగు కూడా వేశారు. ఆరితేరిన నటుడు కావటం వలన అతను ఈ పాత్రలో చక్కగా నటించాడు. ప్రతీక్ (స్మితా పాటిల్ కుమారుడు) మున్నా పాత్రలో కాస్త ఎబ్బెట్టుగా ఉంటాడు. వంశానుగతంగా ప్రతిభ ఎవరికీ రాదు. షాయ్ పాత్రలో మోనికా డోగ్రా, యాస్మిన్ పాత్రలో కృతి మల్హోత్రా ఒదిగిపోయారు. వారు తర్వాత ఎక్కువగా నటించకపోవటం విచారకరం. ఆస్కార్ గ్రహీత గుస్తావో సాంతవొలాయ్యా సంగీతం గుండెల్ని మీటుతుంది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించేముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఒకరోజు అరుణ్ ఇంటి దగ్గర అతనికి షాయ్ కనిపిస్తుంది. ఇంటికి పిలుస్తాడు. ఏమీ తెలియనట్లు ఆమె వెళుతుంది. అతను మళ్ళీ క్షమాపణ చెబుతాడు. ఆమె తేలిగ్గా తీసిపారేస్తుంది. అప్పుడే అరుణ్‌కి బట్టలివ్వటానికి మున్నా వస్తాడు. ఆమెని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు. ఆమె అతణ్ణి చూసినా పలకరించదు. అతను వెళ్ళిపోతాడు. ఆమె కూడా వెంటనే బయల్దేరి అతన్ని కలుసుకుంటుంది. అతను ముభావంగా ఉంటే అతన్ని సముదాయిస్తుంది. అతను ప్రశ్నలు వేయకుండా ఆమెతో వెళతాడు. అరుణ్ ఇంట్లో ఉండగా మున్నాని పలకరిస్తే మున్నా తనకు అరుణ్ అడ్రస్ ఇచ్చిన సంగతి బయటపడుతుందని ఆమె భయం.

యాస్మిన్ వీడియోలు చూస్తున్న అరుణ్‌కి ఆమె భర్తకి వేరే స్త్రీతో సంబంధం ఉందని తెలుస్తుంది. ఆమె నిరాశగా ఉంటుంది. పెళ్ళెందుకు చేసుకున్నానా అనుకుంటుంది. అరుణ్‌కి ఆమె ప్రపంచం బావుందని అంతవరకు అనిపించింది. ఆమె జీవితం ఇలా మలుపు తిరగటం అతనికి అసహనాన్ని కలిగిస్తుంది. మనలో చాలామందికి అవతలి వారి జీవితమే అందమైనది అనిపిస్తుంది. ఎవరి బాధలు వారికుంటాయి.

షాయ్ స్నేహితులతో కలిసి కారులో వెళుతుంటే ఆమె స్నేహితుడు ఒక చోట ఆగి సలీం దగ్గర డ్రగ్స్ కొంటాడు. మున్నా కాస్త దూరంగా ఉంటాడు. అతన్ని షాయ్ చూస్తుంది కానీ ముఖం చాటేస్తుంది. తన స్నేహితులు డ్రగ్స్ కొంటారంటే ఆమెకి చిన్నతనం. తర్వాత షాయ్ రాత్రివేళ పందికొక్కుల్ని చంపేవాళ్ళ ఫోటోలు తీయటానికి వెళుతుంది. అక్కడ పందికొక్కుల్ని కర్రతో కొట్టి చంపుతున్నవాడు మున్నా! ఆమెని చూసి పారిపోతాడు. అతను రాత్రివేళ చేసే పని అదే. అయితే చెప్పుకోవటానికి సిగ్గు. అందుకే అతను తన ప్రేమ విషయం కూడా ఆమెకు చెప్పడు. ఆమె అతనికి తన స్నేహితులు డ్రగ్స్ కొంటారని తెలియకూడదనుకుంది. అతను తాను చేసే పని ఆమెకి తెలియకూడదనుకున్నాడు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోవద్దనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అరుణ్ యాస్మిన్ ప్రేరణగా చిత్రం వేస్తూ ఉంటాడు. మిగిలిన టేపు చూస్తూ. అందులో ఆమె “ఇదే నా ఆఖరి మాట. నేను చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కావట్లేదు. నా మీద కోప్పడకు. అమ్మా, నాన్నకి చెప్పు” అంటుంది. ఆమె ఆత్మహత్య చేసుకుందని అతనికి అర్థమవుతుంది. అతని గుండె బద్దలవుతుంది. ఆమె చిన్న ఊరి నుంచి ముంబయి వచ్చింది. భర్తకి అక్రమసంబంధం ఉంది. అతనితో ఉండలేదు. తలిదండ్రుల దగ్గరకి వెళ్ళలేదు. ఏం చేస్తుంది? ఆ పరిస్థితుల్లో వేరే ఆడది అయితే సర్దుకుపోయేదేమో. ఆమె సర్దుకుపోలేకపోయింది. అరుణ్‌కి ఆమె ఆ ఇంటిలోనే చనిపోయిందని అర్థమై అక్కడ ఉండలేక గబాగబా బయటకు వస్తాడు. పక్కింటి ముసలావిడ అతని వంక చూస్తూ ఉంటుంది. ఏ భావమూ లేకుండా. తన పక్కింటిలో అమ్మాయి చనిపోయినా ఆమెలో ఏ కదలికా లేదు. ఆమె మనసులో ఎన్ని సుడిగుండాలున్నాయో! ఆమె నిర్లిప్తత చూసి అరుణ్‌కి దుఃఖం వస్తుంది. యాస్మిన్ చనిపోయిందని బాధా లేక ముసలామెని చూసి ప్రపంచం మీద విరక్తా?

తర్వాత అరుణ్ ఇల్లు మారిపోతాడు. తాను వేసే చిత్రం పూర్తి చేస్తాడు. అందులో యాస్మిన్ ముఖం కూడా ఉంటుంది. ఆ చిత్రాన్ని అరుణ్ తన దగ్గరే ఉంచుకుంటాడు. షాయ్‌ని రెండోసారి కలిసినపుడు ఆమె అతన్ని ఏం చేస్తున్నావని అడుగుతుంది. అతను యాస్మిన్ గురించి చెప్పడు కానీ తానొక చిత్రం వేస్తున్నానని, ఉత్తేజంగా పనిచేస్తున్నానని అంటాడు. చివరికి యాస్మిన్ కథ దుఃఖాంతమవుతుందని అతనికి అప్పుడు తెలియదు. జీవితం ఇలాగే ఉంటుంది. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది.

షాయ్ అరుణ్‌ని మళ్ళీ కలవాలనుకుంటుంది కానీ అతను ఇల్లు మారటంతో వీలు పడదు. సలీం రెండు ముఠాల మధ్య గొడవల్లో చనిపోతాడు. దాంతో మున్నా కుంగిపోతాడు. షాయ్ ఫోన్ చేసినా మున్నా స్పందించడు. చివరికి ఒకరోజు ధోబీ ఘాట్ దగ్గర షాయ్‌కి మున్నా కనిపిస్తాడు. సలీం సంగతి చెబుతాడు. ఆమె సానుభూతి చూపిస్తుంది. అరుణ్ ఎక్కడికో వెళ్ళిపోయాడని అంటుంది. ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడేమో అంటాడు మున్నా. షాయ్ అతనికి వీడ్కోలు చెప్పి కారులో బయలుదేరుతుంది. మున్నా పరుగుపరుగన ఆమె కారు వెనక వచ్చి ఆమెకి తన అడ్రెస్ బుక్ నుంచి ఒక కాయితం చింపి ఇస్తాడు. అది అరుణ్ కొత్త అడ్రసు. అక్కడితో చిత్రం ముగుస్తుంది.

తనకు దక్కని ఆనందం వేరొకరికి ఎందుకు దక్కాలని మున్నా మొదట అనుకున్నాడు. అందుకే అరుణ్ ఆస్ట్రేలియా వెళ్ళి ఉంటాడని అబద్ధం చెప్పాడు. ఇంతలోనే అతని మనసు మారింది. ఆమెకి అరుణ్ అడ్రస్ ఇచ్చాడు. ఆమెకి అతను తనని ప్రేమిస్తున్నాడని అర్థమయింది. కానీ తన సంతోషం కోరుకుంటున్నాడు. ఆమెకి కన్నీరు ఉబికివస్తుంది. మనిషికి మనసే ఆభరణం. మనసు మంచిదైతే అదే స్వర్గమౌతుంది. బయట నరకం లాంటి పరిస్థితులున్నా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here