మరుగునపడ్డ మాణిక్యాలు – 37: జ్యేష్ఠపుత్ర

2
9

[dropcap]ఒ[/dropcap]కే తలిదండ్రుల పిల్లల్లో అందరూ ఒకేలా ఉండరు. వారి జీవితాలు వేరువేరుగా ఉంటాయి. అయితే జీవితాంతం ఆ బంధాలు ఉంటాయి. మన దేశంలో పెద్దకొడుక్కి ప్రాధాన్యం ఉంటుంది. ఒకప్పుడు కొడుకులందరూ కలిసి ఉండేవారు. తలిదండ్రుల దగ్గర ఉండేవారు. పెద్దకొడుకు ఇంటి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకునేవాడు. కానీ పెద్దకొడుకు దూరంగా ఉండి చిన్నకొడుకు తలిదండ్రుల దగ్గర ఉంటే ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి? పెద్దకొడుకు కుటుంబాన్ని పట్టించుకోకుండా డబ్బులు మాత్రం పంపిస్తూ ఉంటాడనుకుందాం. అది సరిపోతుందా? ఆస్తుల సంగతి ఏమిటి? ఎవరికి ఎక్కువ హక్కు ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలతో ఆలోచింపజేసే చిత్రం ‘జ్యేష్ఠపుత్ర’ (2019). బెంగాలీ భాషలో ‘జ్యేష్ఠొపుత్రొ’ అని పలుకుతారు. ఈ చిత్రం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

ఇంద్రజిత్ బెంగాల్లో ఒక సూపర్ స్టార్. 45 ఏళ్ళు ఉంటాయి. అతనికి ఒక చెల్లెలు, ఒక తమ్ముడు. చెల్లెలు ఈలా, తమ్ముడు పార్థ. వారు పూర్వీకుల గ్రామంలో వారి తండ్రితో ఉంటారు. అకస్మాత్తుగా తండ్రి మరణిస్తాడు. ఇంద్రజిత్ బయల్దేరి వెళతాడు. అతనితో అతని సహాయకులు వెళతారు. అతనికి భార్యాబిడ్డలు లేరు. అతనికి విడాకులైపోయాయని మనకి తర్వాత తెలుస్తుంది. ఈలాకు మతిస్థిమితం లేదు. పార్థ అందరి కంటే చిన్నవాడు. అయినా అన్న కంటే వయసులో పెద్దవాడిలా కనిపిస్తాడు. అతని భార్య గర్భవతి. తాతలనాటి ఇంట్లో ఉంటారు. మకాయ్ అని ఒక సేవకుడు ఉంటాడు. ఈలా ఒక్కోసారి ఉన్మాదంతో ప్రవర్తిస్తుంది. అందుకని ఆమె గదికి బయట గొళ్ళెం పెడుతూ ఉంటారు.

ఇంద్రజిత్ రాగానే తండ్రికి అంత్యక్రియలు చేయటానికి బయలుదేరుతారు. ఈలాకు తెలిస్తే ఆమె ఎలా ప్రతిస్పందిస్తుందో తెలియక పార్థ ఆమెకి తండ్రి మరణం గురించి చెప్పడు. ఇంద్రజిత్ “తండ్రిని కడసారి చూసుకునే అవకాశం కూతురికి ఇవ్వాలి” అని ఆమెని గదిలో నుంచి బయటకు తీసుకువస్తాడు. తండ్రి శవాన్ని చూసి ఈలా బెదురుగా గదిలోకి వెళ్ళిపోతుంది. అది తండ్రి మరణాన్ని తట్టుకోలేక వచ్చిన బెదురు. గదిలోనే శోకిస్తుంది. అంత్యక్రియలు పూర్తవుతాయి. వారి తండ్రి కమ్యూనిస్టు. ఆయన అంత్యక్రియల్లో ఆయన అనుచరులు విప్లవగీతాలు పాడతారు. అంత్యక్రియలు జరుగుతుండగా సుధేష్ణ వస్తుంది. ఆమె ఒకప్పుడు ఇంద్రజిత్‌ని పెళ్ళి చేసుకోవాల్సిన అమ్మాయి. ప్రస్తుతం స్కూల్ ప్రిన్సిపాల్‌గా పని చేస్తోంది.

ఇంద్రజిత్‌కి సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది. అతను ఇంట్లో ఉండకుండా ఒక గెస్ట్ హౌస్‌లో ఉంటాడు. “నాతో పాటు చాలా మంది వచ్చారు కాబట్టి గెస్ట్ హౌసే సౌకర్యంగా ఉంటుంది” అంటాడు. ఈలాని గదిలో నిర్బంధించవద్దంటాడు ఇంద్రజిత్. సుధేష్ణని ఇంటి దగ్గర దిగబెడతానంటాడు కానీ ఆమె వద్దంటుంది. ఇంద్రజిత్ వెళ్ళాక పార్థ భార్య అంతకు ముందు ఈలా తన గది దగ్గరకి వచ్చిందని చెబుతుంది. భార్య గర్భవతి కావటంతో పార్థ ఏం జరుగుతుందో అని భయపడతాడు. ఈలా వల్ల ఆమెకేమన్నా అయితే ఎలా అంటాడు. “హుకుం జారీ చేసి గెస్ట్ హౌస్‌కి పారిపోవటం తేలికే” అంటాడు. ఈలాని గదిలో నిర్బంధిస్తాడు. ఆమె వద్దంటున్నా వినడు. ఆమె సేవకుడు మకాయ్‌ని తలుపు తీయమని బతిమాలుతుంది. అతను ఏమీ చేయలేని అశక్తుడు.

ఇంద్రజిత్ గెస్ట్ హౌస్ చేరుకున్నాక మద్యం తాగుతూ ఉంటాడు. ఎవరెవరో ఫోన్ చేసి సంతాపం చెబుతూ ఉంటారు. పెద్ద వయసు కదా అంటాడు. నిజానికి అతని తండ్రి మెట్లపై నుంచి పడి చనిపోయాడు. ఇంద్రజిత్‌కి ఇదంతా తప్పనిసరి తంతు లాగే ఉంటుంది. ప్రమాదవశాత్తూ జరిగిన మరణం కాబట్టి ప్రేతకార్యాలు నాలుగు రోజులే ఉంటాయని పెద్దలు అంటారు. ఇది బెంగాల్లో ఆచారమేమో. ఇంకో ఆచారం కొడుకులు పంచె, ఉత్తరీయం వేసుకోవాలని. అయితే ఇంద్రజిత్ చేయడు. పార్థ చేస్తాడు. కమ్యూనిస్ట్ సిధ్ధాంతాలు నమ్మిన వ్యక్తి మరణిస్తే ఈ ఆచారాలు పాటించాలా అంటాడు ఇంద్రజిత్. “నేను అమ్మ పద్ధతులు పాటిస్తాను” అంటాడు పార్థ. పార్థ ఇల్లు అమ్మేయాలని అనుకుంటూ ఉంటాడు. అతను ఉద్యోగం చేసుకుంటూ, నాటకాలు ప్రదర్శిస్తూ ఉంటాడు. రచయిత కూడా. బెంగాల్లో నాటకాలు చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఇల్లు చాలా పెద్దది కావటంతో చాలా మటుకు ఖాళీగానే ఉంటుంది. తన వ్యాపకాలు తాను చూసుకుంటూ అంత పెద్ద ఇంటిని చూసుకోవటం తన వల్ల కాదని భార్యతో అంటాడు. అమ్మేసి డబ్బు పంచుకుంటే సరిపోతుంది అంటాడు. అతని భార్య “మరి ఈలా సంగతేమిటి?” అంటుంది. పార్థ ఆలోచనలో పడతాడు. ఇలా ఎవరి స్వార్థచింతనలో వారుంటే ఒక్క మకాయ్ మాత్రం దీపం వెలిగించి పెద్దాయనని తలుచుకుంటూ ఉంటాడు. సేవకులకి ఉండే విశ్వాసం ఒక్కోసారి కొడుకులకి ఉండదు.

పారుల్ అనే ఆమె ఆ నాలుగు రోజులూ ఇంటి పనులలో సహాయం చేస్తూ ఉంటుంది. ఆమె ఆ ఇంటివారికి బాగా సన్నిహితురాలు. ఆమెకి పెళ్ళయి ఒక కొడుకు ఉంటాడు. అయినా ఇంద్రజిత్‌తో సరసాలాడుతూ ఉంటుంది. సుధేష్ణ మరునాడు వస్తుంది. పారుల్ సుధేష్ణతో “ఇంద్రజిత్‌ని చూసి నీ మనసు లయ తప్పుతోందా” అంటుంది. సుధేష్ణ ఆమెని నోరు మూసుకోమంటుంది. పారుల్ లాంటి స్త్రీలు కూడా ఉంటారు. ఆమెకి ఇంద్రజిత్ మీద ఇష్టముందని తెలుస్తూనే ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆ ఇష్టం తగ్గలేదు. సుధేష్ణని ఇంద్రజిత్ పెళ్ళి చేసుకోవాలనుకున్నాడని కూడా తెలుసు. సుధేష్ణని ఆటపట్టిస్తూ ఉంటుంది. ఇదో వింత ప్రవృత్తి. ఆమె మాటలు విని ఇంద్రజిత్ సుధేష్ణతో “ఆమె సంగతి తెలుసు కదా. ఆమె మీద కోప్పడకు” అంటాడు. “నా కోపం ఆమె మీద కాదు” అంటుందామె. “నా మీదా?” అంటాడతను. “నువ్వే ఆలోచించుకో” అంటుందామె. అతను ఆమె మనసు గాయపరిచాడని మనకు అర్థమౌతుంది. అయినా పెద్దాయన ఆమెకి గురువు కావటంతో ఆమె ఆ ఇంటికి వస్తుంది.

ఓ పక్క జనాలు ఇంద్రజిత్‌ని చూడటానికి ఎగబడుతూ ఉంటారు. గెస్ట్ హౌస్‌లో ఇంద్రజిత్, పార్థ కలిసి ఉండగా ఒక సహాయకుడు వచ్చి ఇంద్రజిత్‌తో బయట జనాలు గుమిగూడారని, ఒకసారి వచ్చి వారికి అభివాదం చేస్తే వెళ్ళిపోతారని అంటాడు. “నేను షూటింగ్‌కి రాలేదు. వాళ్ళని వెళ్ళమని చెప్పు” అంటాడతను. అలా వెళ్ళరంటే “పోలీసుల్ని చూసుకోమని చెప్పు” అంటాడు. అదీ కుదరదంటే బాల్కనీలోని వెళ్ళి జనానికి అభివాదం చేస్తాడు. తమ్ముడు ఉన్నాడు కాబట్టి మర్యాద కోసం వద్దన్నాడే కానీ అతనికి ఇదంతా ఇష్టమని తెలుస్తూనే ఉంటుంది. తమ్ముడు వచ్చేసరికి కాస్త పెరిగిన గడ్డానికి రంగు వేసుకుంటూ ఉంటాడు. త్వరలో షూటింగ్ చేయవలసిన పాట వింటూ ఉంటాడు. పార్థ అన్నగారికి ఉన్న ప్రజాదరణ చూసి అసూయ పడతాడు.

గతంలో ఏం జరిగిందో చిత్రంలో చూపించకపోయినా మనం ఊహించవచ్చు. తండ్రి ప్రభావంతో అన్నదమ్ములిద్దరూ నాటక ప్రదర్శనలు ఇచ్చేవారు. ఇంద్రజిత్‌కి సుధేష్ణతో పెళ్ళి చేయాలని అనుకున్నారు. అయితే అతనికి సినిమాల్లో అవకాశం వచ్చింది. వేరే అమ్మాయితో ప్రేమలో పడి ఆమెని పెళ్ళి చేసుకున్నాడు. తర్వాత విడాకులు అయిపోయాయి. సొంత ఊరికి రావటం అరుదు. ఈలా జీవితంలో ఏం జరిగిందనేది పార్థ మాటల్లో తెలుస్తుంది. ఆమెకి పెళ్ళి అయింది. అయితే భర్త రైల్వే క్రాసింగ్ దగ్గర యాక్సిడెంట్లో మరణించాడు. దాంతో ఆమె మతిస్థిమితం కోల్పోయింది. ఇంటిని, తండ్రిని, అక్కని చూసుకుంటూ పార్థ సొంత ఊళ్ళోనే ఉండిపోయాడు.

పార్థ ఇల్లు అమ్మేస్తానంటే ఇంద్రజిత్ ఈలా సంగతి ఏమిటని అంటాడు. “నువ్వు ఏ బాధ్యతలూ పట్టించుకోకుండా ఇప్పుడు అక్క సంగతి అడగటం ఏం బాలేదు. ఇన్నాళ్ళూ నేనే ఆమెని చూసుకున్నాను. నాన్న పట్టించుకోలేదు. ఆమె నర్సింగ్ హోమ్‌లో ఉంటే తప్పేమిటి? నాకు మాత్రం ఇల్లు అమ్మటానికి నీకు అభ్యంతరం లేదని ఎన్ఓసీ కావాలి” అంటాడు పార్థ. ఇంద్రజిత్ అతను అన్నది సబబే అని గ్రహించి సరే అంటాడు. ఇంకా ఏమైనా అవసరాలు ఉన్నాయా అని అడుగుతాడు. పార్థ కాస్త వెటకారంగా “నాక్కూడా సినిమాల్లో అవకాశం కావాలి. నువ్వు తలచుకుంటే వచ్చేది. నేను నీకంటే మంచి నటుణ్ణి. నువ్వు నన్ను పట్టించుకోలేదు” అంటాడు. ఇంద్రజిత్ “నువ్వు నాకంటే మంచి నటుడివి అనే దాంట్లో సందేహమే లేదు. అయితే సినిమా ప్రపంచంలో రకరకాల మనుషులుంటారు. అక్కడ అన్ని మాటలు విని తట్టుకోవాలి. ఇప్పుడు నువ్వన్న మాటలు నేను తట్టుకున్నాను. ఈ లక్షణం ఉండాలి. లేకపోతే తొక్కేస్తారు. సినిమా వాళందరూ నన్ను గౌరవిస్తారు. కానీ ఎవరూ నావాళ్ళు కాదు” అంటాడు. పార్థకి దుఃఖం వస్తుంది. “నేను ఎప్పుడో నిన్ను అడుగుదామనుకున్నాను. నాన్న అడగొద్దని ఒట్టు వేయించుకున్నారు. ఇప్పుడు నాన్న లేరుగా. అందుకే చెప్పాను. ఏమీ అనుకోకు” అంటాడు.

అతని తండ్రి ఎందుకు ఒట్టు వేయించుకున్నాడు? సినిమాలంటే చులకన భావమా? లేక చిన్నకొడుకు కూడా వెళ్ళిపోతే కష్టమనా? రెండూ అయి ఉండవచ్చు. పెద్దకొడుకు మీద ఆయనకు కోపముందనేది కాదనలేని నిజం. సమాజం కోసం నాటకాలు వేయకుండా అతను సినిమాల్లో చేరిపోయాడు. సుధేష్ణ మనసు విరిచేశాడు. ఇంద్రజిత్ సొంత ఊరికి ఎక్కువగా రాకపోవటానికి తండ్రి కోపం ఒక కారణం. అయితే అతని స్వార్థం అతను చూసుకున్నాడనేది కూడా నిజమే. తండ్రి కోపాన్ని ఒక సాకుగా చూపించి తన దారి తాను చూసుకున్నాడు. తండ్రిని పట్టించుకోని కొడుక్కి హక్కులు ఉంటాయా? పిత్రార్జితమైన ఆస్తి మీద ఉంటాయి. మరి నైతికంగా? పార్థ సినిమాల్లో అవకాశం ఇప్పించలేదని అడిగినందుకు సిగ్గుపడ్డాడు. మరి కుటుంబాన్ని పట్టించుకోనందుకు ఇంద్రజిత్ సిగ్గుపడాలి కదా? అతనిలో ఆ ఆలోచన లేనే లేదు. “వెళ్ళిపొమ్మంటే వెళ్ళిపోతాను” అని కూడా అంటాడు. తాను తప్పులు చేశానని తెలుసు. అయినా పద్ధతి ప్రకారం పెద్దకొడుకు ఉండాలి కాబట్టి వచ్చాడు. ఎవరికీ క్షమాపణ చెప్పడు. మిగిలినవారు సంస్కారవంతులు. తమ భావాలను తమలోనే దాచుకుంటారు. ఈలాని ఇంద్రజిత్ తనతో తీసుకువెళ్ళవచ్చు. కానీ అతనికి తన హోదా ముఖ్యం. ఆమెని ఇంట్లో ఉంచుకుంటే ఆ హోదాకి భంగం కలుగవచ్చు. అందుకని ఆమెని పార్థయే చూసుకోవాలని అతని అభిప్రాయం. ఆమె గురించి ఆలోచిస్తున్నట్టు పైకి కనిపించినా అందులో అతని స్వార్థం ఉంది. సుధేష్ణ పెళ్ళి చేసుకోలేదు. అతను ఆమెని పెళ్ళి చేసుకోమని అడగవచ్చు. కానీ అహంకారం. లేదా ఆమె కాదంటుందని భయం. ఒక సందర్భంలో ఇంద్రజిత్ ని దిష్టిబొమ్మతో పోలుస్తాడు దర్శకుడు. అతను ఉన్నది పేరుకి మాత్రమే.

బెంగాల్లో రితుపర్ణ ఘోష్ పేరుమోసిన దర్శకుడు. ఎన్నో జాతీయ అవార్డులు అందుకున్నాడు. అయితే చిన్నవయసులోనే మరణించాడు. అతను తయారు చేసిన మూలకథ ఆధారంగా కౌశిక్ గంగూలి తెరకెక్కించిన చిత్రమిది. అతనే స్క్రీన్ ప్లే అందించాడు. జాతీయ అవార్డులలో ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నాడు. మనుషుల మనస్తత్వాలు ఆవిష్కరించటంలో స్క్రీన్ ప్లే ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుందో కొన్ని సన్నివేశాలలో తెలుస్తుంది. మొదట్లో ఇంద్రజిత్‌కి అతని సహాయకుడు మద్యం అందిస్తూ ఉంటాడు. “ఇంకా స్ట్రాంగ్‌గా కలుపు” అంటాడు ఇంద్రజిత్. అతని మనసు కరడుకట్టిందని చెప్పటం. తర్వాత ఇంద్రజిత్, పార్థ కలిసి మద్యం తాగుతూ ఉంటారు. ఇంద్రజిత్ సహాయకుడు అందిస్తూ ఉంటాడు. “మరీ స్ట్రాంగ్‌గా ఉంది. లైట్‌గా ఇవ్వు” అంటాడు పార్థ. ఇల్లు అమ్మకం ప్రస్తావన వచ్చినపుడు ఈలా సంగతి ఏమిటని ఇంద్రజిత్ అడుగుతాడు. అప్పుడు పార్థ సహాయకుడితో “ఈసారి స్ట్రాంగ్‌గా కలుపు” అంటాడు. అతని మనఃస్థితిని అలా ఆవిష్కరించాడు రచయిత. మరో సన్నివేశంలో సుధేష్ణ తన తలలో ఉన్న గుల్మొహర్ పువ్వుని తీసి ఇంద్రజిత్ ఎదురుగా పడేసి వెళ్ళిపోతుంది. అందులో ఆరాధన, తృణీకారం కలిసి కనపడతాయి. ఇంద్రజిత్ ఆ పువ్వు వంక చూస్తూ ఉండిపోతాడు. చిత్రంలోని నేపథ్య సంగీతానికి ప్రబుద్ధ బెనర్జీకి ఉత్తమ సంగీతం అవార్డు వచ్చింది. పాటలేమీ లేకపోయినా చిత్రకథని బాగా ఆకళింపు చేసుకుని అందించిన సంగీతమది. అందరి హృదయాలూ మౌనంగా చేసే ఘోష సంగీతంలో వినిపిస్తుంది. చిత్రం చూసినపుడు సంగీతం మీద ప్రత్యేక దృష్టి పెడితే అది ద్యోతకమౌతుంది.

ఇంద్రజిత్‌గా ప్రసేన్ జిత్ చటర్జీ, పార్థగా ఋత్విక్ చక్రబర్తి, సుధేష్ణగా గార్గి రాయ్ చౌధురి నటించారు. ప్రసేన్ జిత్ నిజజీవితంలో కూడా ఒక సూపర్ స్టార్. నెగటివ్‌గా ఉన్న ఈ పాత్రలో నటించటం సాహసమే. అతన్ని అభినందించాలి. ఋత్విక్ పార్థ మనసులోని సంఘర్షణని, అసూయని చక్కగా అభినయించాడు. గార్గి చివర్లో ఒక సన్నివేశంలో కనబర్చిన నటన అద్భుతం. ఆత్మాభిమానం ఉన్న స్త్రీ ఇలాగే ఉంటుంది కదా అనిపిస్తుంది. పారుల్‌గా నటించిన దామినీ బసు హాస్యపాత్రలా అనిపిస్తుంది కానీ ఆమె కథలో కూడా విషాదం ఉంటుంది. ప్రేమించినవాడిని మరచిపోలేని స్త్రీలు అందరూ సుధేష్ణలా గంభీరంగా ఉండరు అని చూపిస్తుంది. మగవాడి సరదాకి ఆడది ఎలా బలైపోతుందో చూసి మనసు బరువెక్కుతుంది. ముల్లు అరిటాకు సామెత గుర్తొస్తుంది. అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఆడది కాస్త కట్టుబాటులో ఉండటం తప్పదు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు.

పారుల్ ఒకరోజు ఇంద్రజిత్‌కి ఇష్టమైన వంటకం చేసి గెస్ట్ హౌస్‌కి తీసుకువెళుతుంది. అతన్ని ఆకట్టుకోవటానికి ప్రయత్నిస్తుంది. అతను ఆమెని హద్దుల్లో ఉండమంటాడు. “ఒకప్పుడు నచ్చిన నేను ఇప్పుడు నచ్చట్లేదా?” అంటుందామె. “అప్పుడు నువ్వే నా మీద పడ్డావు” అంటాడతను. “తర్వాత జరిగినదాని సంగతేమిటి? నేను గతాన్ని తవ్వటానికి రాలేదు. నన్ను పరాయిదానిలా చూస్తే ఒకప్పుడు జరిగినదంతా మాసిపోదు కదా” అంటుంది. వారిద్దరి మధ్య లైంగిక సంబంధం ఉండేది. అతనికది కేవలం సెక్స్. ఆమెకి అది తొలిప్రేమ. మరచిపోలేకపోతోంది. అతను “ఇప్పుడేం కావాలి?” అంటాడు. “నన్నొకసారి కౌగిలించుకో” అంటుంది. అతన్ను కౌగిలించుకుంటాడు. ఆమె అతని కౌగిలింతలో సాంత్వన పొందుతుంది. స్త్రీ మనసులో ఎన్ని అగాధాలో! ఆమె అతని మీద ముద్దులు కురిపిస్తుంది. అతను ఆమెని తోసేస్తాడు. ఆమె “చూడు. నా భర్త నన్ను సరిగా చూసుకోడని అనుకోకు. అతను బెస్ట్” అని వెళ్ళిపోతుంది. ఇది ఆమె ఆత్మవంచన. అతను సుధేష్ణని పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిసే ఆమె అతని వెంటపడిందని అనుకోవాలి. లేకపోతే ఆమె సుధేష్ణతో అంత చనువుగా మాట్లాడదు. ఇదంతా ఆమె స్వయంకృతం.

పార్థ ఇంటికి మూడోరోజు చుట్టాలు వస్తారు. మావయ్య కిటికీలో నుంచి తనని జూలో జంతువుని చూసినట్టు చూశాడని ఈలా పార్థతో అంటుంది. తలుపులు, కిటికీలు మూసి ఉంచమని పార్థ ఈలాకి, తన భార్యకి చెబుతాడు. ఇంతలో ఇంద్రజిత్ గెస్ట్ హౌస్ నుంచి వస్తాడు. అభిమానులు, చుట్టాలు అతన్ని చుట్టుముడతారు. అభిమానులు ఇంటి లోగిలిలోకి వచ్చేస్తారు. ఇంద్రజిత్ వారికి సెల్ఫీలు ఇస్తూ ఉంటాడు. ఇది చూసి పార్థ విసుక్కుంటాడు. అభిమానుల్ని బయటకి పొమ్మంటాడు. ఇంద్రజిత్ నొచ్చుకుంటాడు. పార్థ భార్య క్షమించమంటుంది. పార్థ కోపంగా బయటకి వెళ్ళిపోతాడు. ఆరోజు రాత్రి ఇంద్రజిత్ గెస్ట్ హౌస్‌లో ఉండగా పార్థ వస్తాడు. తాగి ఉంటాడు. క్షమించమంటాడు. ఇంద్రజిత్ ముభావంగా ఉంటాడు. తాగిన మత్తులో పార్థ “నాకేమన్నా సినిమాలో అవకాశం ఇస్తావా?” అంటాడు. అతనికి అన్నగారి వైభవం కావాలి. ఇంద్రజిత్ “ఆ ప్రపంచం పద్ధతులు నీకు సరిపడవు. నువ్వు నాటకాలు వేసుకోవటమే మంచిది” అంటాడు. పార్థకి కోపం వస్తుంది. “దొంగలు దొరలుగా చెలామణి అవుతారు. చౌకబారు నటులు సూపర్ స్టార్లు అవుతారు. దేవుడు చేసే అన్యాయాల్లో ఇదొకటి” అంటాడు. ఇంద్రజిత్ “నువ్వు నన్ను అవమానించావు. అయినా నీతో మర్యాదగా మాట్లాడుతున్నాను. నువ్విక ఇంటికి వెళ్ళు. రేపు పెద్దకర్మకి నేను వస్తాను” అంటాడు. పార్థ “నువ్వు రావద్దు. నాన్నను చూసుకున్నది నేను. ఆయన ఆశయాలకి అనుగుణంగా నడుచుకున్నది నేను. నువ్వు పేరుకే జ్యేష్ఠపుత్రుడివి. నేనే అసలు పెద్దవాడిని. నువ్వు రావద్దు” అని వెళ్ళిపోతాడు.

ఇంద్రజిత్ నిర్ఘాంతపోతాడు. ఆలోచనలో పడతాడు. ఎన్ఓసీ తయారు చేస్తాడు. తెల్లవారుఝామున సుధేష్ణ ఇంటికి వెళ్ళి “నేను వెళ్ళిపోతున్నాను. ఎవరో ఒకరికి చెప్పి వెళ్ళాలి. నువ్వే గుర్తొచ్చావు. పార్థకి ఈ ఎన్ఓసీ ఇచ్చెయ్” అంటాడు. ఆమె అతనికి సర్దిచెప్పబోతుంది. “జరిగిన అవమానం చాలు. నేనిక ఈ ఊరికి రాను. నువ్వెప్పుడన్నా కోల్‌కతా వస్తే నాకు ఫోన్ చెయ్యి. నువ్వు చెయ్యవు. నాకు తెలుసు. అయితే ఇదే మన ఆఖరి కలయిక” అని రెండు చేతులూ జోడిస్తాడు. అది క్షమాపణలా అనిపిస్తుంది. ఆమె మౌనంగా కన్నీరు కారుస్తుంది. అతను ఆ ఊరు విడిచి వెళ్ళిపోతాడు.

ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి. పెద్దకొడుక్కి బాధ్యతలూ ఉండేవి, హక్కులూ ఉండేవి. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఆచారాల్ని సరిగా అర్థం చేసుకోవాలి. ఇష్టులైన వాళ్ళే శ్రాధ్ధకర్మలు చేయాలని శాస్త్రం చెబుతోంది. అప్పట్లో పెద్దకొడుకు మీద తండ్రికి మమకారం ఎక్కువ ఉండేది. కాబట్టి అతను కర్మకాండ చేసేవాడు. అంతే కానీ పెద్దకొడుకే చేయాలి అనే నిబంధన లేదు. పెద్దాయనకి ఇంద్రజిత్ మీద ఇష్టం లేదు. పైగా కోపముంది. పార్థ ఆయనకి తగిన కొడుకు అనిపించుకున్నాడు. కాబట్టి అతనే కర్మకాండ చేయాలి. కొడుకులెవరూ ఇష్టులు కాకపోతే కూతురు చేయవచ్చు. ఇదే శాస్త్రంలో ఉంది. మనవాళ్ళు వక్రభాష్యాలు చెబుతారు. పార్థ చేసినది తప్పు కాదు. అయితే పార్థ కూడా సినిమా నటుడై ఉంటే అతను తండ్రికి ఇష్టుడై ఉండేవాడా? తండ్రి కోరిక మీద అతను సినిమాల్లోకి వెళ్ళకుండా ఉన్నాడు. తన ఇష్టాన్ని చంపుకున్నాడు. అతనికి తండ్రి మీద కోపం ఉందేమో. అయినా స్వార్థం చూసుకున్న ఇంద్రజిత్ కంటే అతనే నయం. అయితే పార్థకి అసూయ లేకపోలేదు. మనుషులెవరూ పరిపూర్ణులుగా ఉండరు. కానీ బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించినవారు మనస్సాక్షికి సమాధానం చెప్పుకోగలుగుతారు. లేకపోతే ఇంద్రజిత్ లాగ అశాంతే మిగులుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here